4, ఫిబ్రవరి 2018, ఆదివారం

చిగురించిన శిశిరం





కుముద చాలా విసుగ్గా చెప్పింది "ఊహలలో ఉన్నవన్నీ చేయాలనుకుంటే ఏ మనిషికి సాధ్యం కాదు ఊహించుకుంటే ఆనందం కల్గుతుందేమో కానీ దాన్ని అనుభవంలోకి తీసుకురావాలనుకుంటేనే కష్టంగా ఉంటుంది. అసలిలాంటి టాపిక్  మళ్ళీ రావడమే నాకు ఎలర్జీ గా ఉంది. ఫోన్ పెట్టేయండి"
మనసున్న మనిషితో మాట్లాడుకుంటే వొత్తిడి చికాకులు తగ్గుతాయని కాల్ చేస్తున్నానుపదిసార్లు చేసినా నువ్వు లిఫ్ట్ చేయడంలేదు. సాటి మనిషికి ఇవ్వాల్సిన గౌరవం కూడా ఇవ్వడం లేదు.”
సారీ! నాకసలు తీరిక లేదు, నాకున్న బాధ్యతలు అటువంటివినిజం మాట్లాడటం నా అలవాటు గనుక మీతో మాట్లాడి నన్ను నేను డిస్ట్రబ్ చేసుకోలేను.
ఇంతగా ప్రేమించే నన్ను నమ్మడం లేదు, నేనేమి  ద్రోహం చేయనుహృదయం అందంగా ఉన్నవారి సాంగత్యం శాంతినిస్తుంది.సౌఖ్యాన్నిస్తుంది అందుకే ఎన్నేళ్ళైనా నిన్ను వొదులుకోవాలని పించడం లేదు. పైగా నీకున్న భాద్యతలన్నీ తీరిపోయాయి. నీ జీవితానికో మంచి దారి ఏర్పరచుకుంటే తప్పేంటి, ఎవరైనా హర్షించదగిందే కదా !
"స్నేహంలో స్నేహమే ఉండాలి  కొండకచో ప్రేమ కూడా కలిసి ఉండవచ్చు కానీ ఆ ప్రేమని శారీరక  సంబంధాల మధ్య ముగించడమే మంచిది కాదని నేనూ చెబుతున్నాను,అర్ధం చేసుకోలేకపోవడానికి మీదేం మట్టిబుర్ర కాదుగా "  ,
"అన్ని కావ్యాలు చదువుతావ్, వాసన లేకుండా పువ్వు ఉండనట్లు కామం కల్గించని ప్రేమ కూడా ఉండదు
పూవుకు  వాసన యెటువంటిదో ప్రేమకు కామమటువంటిది "
"ఎంతో అందంగా కనబడే గోగు పువ్వుకి వాసన ఉండదు, అలాగే నేను కూడా ! “
"పదేళ్లుగా నన్ను నీ వైపుకి  లాక్కునే ఆకర్షణ అయితే ఉంది కదా ! అందుకే అడుగుతున్నాననుకో
‘ఇక ఆపండి. ఎవరైనా వింటే, ఏదో నాటకానికి మనిద్దరం కలిసి రిహార్సల్స్‌ చేస్తున్నాం అనుకుంటారు ... అంత నాటకీయంగా ఉంది మనిద్దరి మధ్య నడుస్తున్న ఈ సంభాషణ. అసలిలాంటి సహజీవనం లాంటి  బంధాలు ఎప్పుడూ ఆకర్షణీయంగా ఉండాలి. ఆకర్షణీయంగా మార్చుకోవాలి కూడా.నీతో కలిసి జీవించాలనే సృహ నాకు లేదుకాబట్టి వాటి గురించి మాట్లాడం వేస్ట్కోపంగా ఫోన్ కట్ చేసింది.
    మెసేజ్ లో మళ్ళీ ప్రత్యక్షం. "పాతికేళ్ళ ఒంటరితనంలో మనసుకి జఢత్వం వచ్చేసింది. దాన్ని కరిగించి జీవితం పట్ల ఆసక్తిని, అనురక్తిని కల్గించే అవకాశమివ్వు. ఒకసారి రుచి చూస్తే  దాన్ని ఎప్పటికీ వదలలేవని నేను నమ్మకంగా చెప్పగలను. పైగా మన అభిరుచులు ఆలోచనలు మనసులు  కలిసాయి కాబట్టే ఇదంతా చెపుతున్నాను.అర్ధం చేసుకో ప్లీజ్ !"
 కోపం  ముంచుకొచ్చింది టక టక టైప్ చేసేసింది
"నేను స్నేహంగా ఉండాలనుకుంటాను. మీరేమో మీ  చేతులమధ్య బందీని చేయాలని అనుకుంటారు. అవతలి వ్యక్తి మనసులో ఏముందో తెలిసాక ఆ స్నేహానికి గుడ్ బై చెపుతాను. ఏవేవో ఆశించి రావడంమీకు అందలేదని నాపై  ఏవేవో ముద్రలేసి తప్పుకుంటే దానికి నేనేమీ చేయలేనుఅయినా ఈ వయసులో  వొంపులు అన్నీ కలిసిపోయాక  సొంపులన్నీ మాయమాయ్యాక పై పై మెరుగులపై మోజు అంత మంచిది కాదు. ఆనక నిరాశ పరిచానని తిట్టుకుంటావేమో కూడా ! ."
"ఈ అనుమానంతో దూరంగా పెడుతున్నావా ? పిచ్చి బంగారం.. అసలు రొమాన్స్ అంటే ఏమిటో తెలియదు నీకు. శరీరాలు కలిస్తేనే రొమాన్స్ కాదు. వేవ్ లెంగ్త్ కలవాలి. కలిసాయని నేను గుర్తించాను కాబట్టే ఈ ప్రాకులాట. అయినా  శారీరక సంబంధాలు తప్పు మానసిక బంధాలు పవిత్రం అన్న ఆలోచనలతో మోసం చేసుకోవడం నీకలవాటైపోయిందిలే ! ".
చివుక్కుమంది ఆమె మనసు. “మన వేవ్ లెంగ్త్ కలిసాయి  కాబట్టే నేనంటే ఉన్న మోజు తొందరగా తగ్గిపోతుంది అని చెపుతున్నా ! బయలాజికల్ నీడ్ అవసరాన్ని దాచేసి   యవ్వనకాలాన్నంతటినీ విజయవంతంగా దాటేసినదాన్ని. ఇప్పుడు కృష్ణా రామా అనుకుంటూ దాటేయలేనా! అనవసరంగా  ఆడవాళ్ళని ట్రాప్ లోకి లాగే ఆలోచన, జీవితాంతం తోడుండే  భార్యకి ద్రోహం చేసే ఆలోచన మానుకోండి సురేష్ “ అంతటితో  సంభాషణని క్లోజ్ చేసి అతని నెంబర్ ని బ్లాక్ లిస్ట్ లో చేర్చింది.
 మరో ఆర్నెల్లు గడిచిపోయాయి. అప్పుడప్పుడూ ఆమెకి  సురేష్ గుర్తుకొస్తూనే ఉన్నాడు.అలా అని ఆమెప్పుడూ అతనికి కాల్ కూడా చేయదు. తమంత ఎదిగిన పిల్లలకి ఈ వయస్సు  మళ్ళిన స్నేహాలని  స్వచ్చంగా భావించే వాతావరణమయితే  అటు కానీ ఇటు కానీ లేదు. తనకెంతో ఇష్టమైన మళయాళ చిత్రం  "ప్రణయం" జయప్రద కేరెక్టర్  గురించి చెపితే  కూతురు తనవైపు చూసిన చూపుని మర్చిపోలేదు కుముద.  ఇప్పుడితనిని ఫ్రెండ్ గా పరిచయం చేయడమా ! నెవ్వర్ అనుకుంది.
ఒకరోజు రాత్రి వేరొక నెంబర్ నుండి తన ఫోన్ కి ఒక మెసేజ్ .
"నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు, ఏం ఆలోచించావ్", అది సురేష్ నుండే నని అర్ధమైంది.
   “ఓ ఇల్లాలికి సొంతంగా ఉండాల్సిన  మనిషి   ఉనికిని నా  మనసు పైన, శరీరం పైన, ఆలోచనల పైన ఏదైనా కూడా నేను అంగీకరించను.. సారీ ! " అని బదులు పంపింది.
"నా భార్యని వొప్పించి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అలా అయితే ఓకే నా ?"
వివేకం కోల్పోయి వెంటనే  అతనికి కాల్ చేసింది.
ఏమనుకుంటున్నావ్ నన్నసలు ? ఒక ఆడదాన్ని వశ పరచుకోవడానికి  ఇంత బలవంతం చెయ్యాలా ? కట్టుకున్న భార్యకి ద్రోహం చెయ్యాలా ? నీకు కావాల్సింది ఈ శరీరమే కదా ! ఓకేనీతో గడిపితే పవిత్రత యేదో పోతుందన్నపాపపుణ్యాల భయం నాకేమీ లేదు. పది రోజులు ఖచ్చితంగా పది రోజులు నీతో గడపడానికి ఒప్పుకుంటున్నాను. కానీ పది రోజుల తర్వాత మరెప్పుడూ నన్ను కలవడం కానీ,ఫోన్ చేయడం కానీ జరగకూడదు. అపరిచితుల్లా మిగిలిపోవాలిమీరే  ప్లాన్ చేయండి. ఇంట్లో చెప్పి వస్తారో చెప్పకుండా వస్తారో అది మీ  ఇష్టంఅంది కుముద కసిగా.
"కోపంలో చెప్పినా మంచి విషయమే చెప్పావ్నాతో  కలిసి గడపడం కాదు జీవించడం అనాలి, జీవితకాలం జీవించడం అనాలి. నా ఈ మాటే బాండ్ , థాంక్ యూ సో మచ్ బంగారం" చిన్నగా ముద్దు పెట్టుకున్న  చప్పుడు. ఉల్కి పడింది ఆమె. ఏమిటి ఇలా నోరు జారింది. తన మనసులో కూడా అలాంటి కోరికో మోహమో దాగి ఉందా ఏమిటీ అని ఆలోచించింది కుముద. అయినా ఎవరిని ఎలా కట్టడి చేయాలో తనకి  ఆ మాత్రం తెలియదా ? ఇల్లలకగానే పండగ అయిపోదు. తానేమీ ఇతని  మాయమాటలకి వెన్నపూసలా ఏమీ కరిగిపోదు.
 పది రోజుల తర్వాత రాత్రి పదకొండు గంటల సమయం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. ఇద్దరూ కలిసి కన్యాకుమారికి ప్రయాణం ముప్పై మూడు గంటల ప్రయాణం. ఎన్నో ముచ్చట్లు, అంత్యాక్షరితో పాడుకున్న పాటలు, చెప్పుకున్న కథలు ఒక స్త్రీ పురుషుడు మాట్లాడుకుంటున్నట్లు కాకుండా ఓ భార్య భర్త కలిసి ప్రయాణం చేస్తున్నట్లూ కాకుండా ఇద్దరు మనుషులు కలిసి చేస్తున్న ప్రయాణంలా ఉంది.
కన్యాకుమారి లో ఇందిరా పాయింట్  దగ్గర నిలబడి అందమైన సూర్యోదయం  చూస్తున్నప్పుడు సౌందర్యమంటే ఇది కదా అనిపించింది  ఆరోజంతా సముద్ర తీరాన్ని అంటిపెట్టుకుని  వివేకానంద రాక్, తరువళ్లువర్‌విగ్రహం,గాంధీజీ స్మారక మంటపం అన్నీ దర్శించి రూమ్ కి రాగానే కాళ్ళు నొప్పులు.సముద్రపు గాలి వల్ల తలనొప్పిగా కూడా ఉంది అని పడుకుంది.
మర్నాటి సూర్యోదయ వీక్షణ తర్వాత త్రివేణి సంగమం దగ్గర స్నానం తరువాత తడి బట్టలతో అతని ముందు తిరగడం ఇబ్బంది అనిపించి రెడీగా ఉన్న జర్కిన్ వేసుకుంది  ఇప్పుడెక్కడికి ప్రయాణం” ?.
నీలి కురింజి ప్లవర్స్ చూడటానికి మున్నార్ వెళదాం. పన్నెండేళ్ళ క్రితం పన్నెండేళ్ళకి ఒకసారి పూసే  ఆ పువ్వుల గురించి చెప్పావ్  గుర్తుందా ?”
అవును, మీకింకా ఆ విషయం భలే గుర్తుందే?” అని ఆశ్చర్యపోయింది.
మున్నార్ టాప్ స్టేషన్ పాయింట్  దగ్గర నిలబడి కొండలపై నాట్యం చేస్తున్నట్లుగా కదిలి కదిలి వెళ్ళే అనంత మేఘమాలికల సౌందర్యాన్ని చూస్తూ  సంతోషంతో ఊగిపోయింది. అతన్ని వెనుక నుండి హత్తుకుని తన ఆనందాన్ని ప్రకటించింది.  "మనసు దోచుకున్న ఓ యమ్మా నీ మనసు దాచుకోకు బుల్లెమ్మా" హమ్ చేస్తున్నాడతనుమట్టుపెట్టి డామ్ లో స్పీడ్ బోట్ లో విహరిస్తూ థ్రిల్లింగ్ గా ఫీల్ అయి గట్టిగా కేకలు పెట్టింది.  dolmens లోపలికి  చేయి పట్టుకుని తీసుకెళ్ళి  కూర్చోబెట్టి  మళ్ళీ  ఇలాంటి  పురా కాలంలో మానవ జీవనం ప్రారంభమైతే బావుణ్ణు అర్ధంపర్ధంలేని ఆంక్షలమధ్య బలవంతంగా బ్రతుకు ఈడ్చే రోజులు పోతాయి అంది. అట్టుకల్ వాటర్ ఫాల్స్ దగ్గర ఉరవళ్ళ పరవళ్ళతో కిందికి దుముకుతున్న  జలపాతం దగ్గర ఉత్సాహంతో తుల్లిపడుతున్న ఆమె ఒక జలపాతంలా తోచింది సురేష్ఈసారి "అడుగుల్లో సవ్వళ్ళు కావమ్మా అవి ఎడదల్లో సందళ్ళు లేవమ్మా" హమ్ చేస్తున్నాడు సురేష్.
నిశితంగా సురేష్  తనవైపే  చూస్తున్నట్టు గమనించినప్పుడల్లా  ఆ   చూపుల్లోనే యేదో నాదం ఉన్నట్టుంది ఆ చూపు సృశించగానే తనువు వాయువు పూరించిన  వేణువవుతుంది  ఆ స్పర్శ తగలగానే ఏదో జలదరింపు కల్గుతుంది అనుకుని అంతలోనే ఉల్కిపడింది. చిత్తమనే క్షేత్రంలో కామ బీజం పడకూడదు .కొంచెం దూరం పాటించాలి,స్పందనలని, కనీస అవసరాలని కూడా ప్రక్కన పెట్టేసి దృఢంగా  ఎలా ఉండగలరో నిరూపించి తీరాలి  అనుకునేది.
రాత్రి సమయాల్లో   బస చేసిన చోట కుముద  ఒకింత నిర్లక్ష్యంగా  ఉంటుంటే అతను  ఆమెని అత్యంత శ్రద్దగా చూసుకుంటున్నప్పుడు  అందులో నటనేమి లేదని  తెలుస్తూనే ఉండేదిఅసంకల్పితంగా  పర్హాన్ అక్తర్ పొయెం మర్ద్ గుర్తుకొస్తుంది. అతని కాస్తంత  సమీపానికి రాగానే  జాగ్రత్తపడుతూ మోహం చిగురు తొడిగి మొగ్గ వేసి పుష్ఫంగా వికసించాక తుమ్మెద జుర్రుకోవడం జారుకోవడంసహజం అతనలాంటి వాడేనని  ఆలోచన చేస్తూ సీరియస్ గా  ఐ పాడ్ ఓపెన్ చేసి ఏవేవో చూస్తూ, చదువుతూ గడిపేసేది.
ఆమె  పై పైకి ఎంత కాదని అన్నా తనపై  మనసున్నదని గ్రహించాడు సురేష్ఆమె  పట్ల ఆకర్షణ ఆసక్తి కల్గిన మాట నిజమే కానీ మనసులు కలిస్తేనే ఏ బంధమైనా రక్తి కడుతుంది బలవంతంగా ఏదీ   తీసుకోకూడనే ఆలోచనతో అతను
గడిచిన మూడు  రాత్రులు  అనేక అనుమానాలు సంశయాలతో ఆమె,   సంస్కారవంతమైన  ఓ గీత గీసుకున్న అతని మధ్య  దూరం  అలాగే ఉండిపోయింది . అలా మూడు రోజులపాటు గైడ్ సాయం కూడా తీసుకోకుండా అతని గోరు వెచ్చని చేతిలో చెయ్యేసి గంట గంటకి  కొంగ్రొత్త రుచుల వేడి నీటి తేనీటి సేవనం చేస్తూ   ఎక్కడబడితే అక్కడ ఆగుతూ విరిసిన పూల పొదలునీలి కురింజి పుష్ప సోయగాలు చూస్తూ ప్రకృతిలో మమేకమై కాలం గడిపేశారు.
ఇక నాలుగో రోజు పర్యటనలో జడి వానలో తడిసి ముద్దై ముత్యమల్లే మెరిసిపోతున్న  ఆమెని చూస్తూ ఉండిపోయాడు. అది గమనించిన ఆమె అతనికి తెలియకుండా  సిగ్గుపడబోయి అభాసుపాలైంది. కానీ అతన్ని కట్టడి చేసే ప్రయత్నం చేసింది.   అలా చూడకపోతే మీరూ తడవొచ్చు కదా ! మనిషిలో మాలిన్యాలన్నింటిని కడిగేసే శక్తి   వానకి  ఉంటుంది, తడవడం ఇప్పటి మీ  అవసరం కూడా ! అంది.
 ఆరోజు రాత్రి  మంచానికి చెరో ప్రక్క చెరో వైపుకి తిరిగి పడుకుని ఒకరి గురించి మరొకరు ఆలోచనలు చేసారు.
ఇద్దరమూ దాంపత్య జీవితం రుచి చూసిన వాళ్ళమే కదా! ఇద్దరికీ శరీర భాషలు తెలుసు, ఆలోచనలు తెలుసు. స్త్రీ పురుషుల మధ్య గాఢానురాగం. ప్రణయాసక్తి ఉంటే కులం మతం వర్ణం వర్గం ఆస్తులు అంతస్తులు పదవులు హోదాలు అన్నీ బేధాలు తునాతునకలయ్యేది  ఆ ఒక్కచోటేఆమె  కదలికల్లో  ఎటువంటి  ఆహ్వానం లేకుండా  చొరవ తీసుకోవడం  తగదని అతను బలవంతంగా కళ్ళు మూసుకుంటే, పది రోజులతో ముగిసిపోయే బంధం కన్నా  కనీసం పదేళ్ళయినా కొనసాగించే ఉద్దేశ్యంలో   మైండ్ గేమ్ ఆడుతున్నాడని ఆమె
 అర్ధరాత్రికల్లా   విపరీతమైన జ్వరంతో మూలుగుతున్న  ఆమెని లేపి  టాబ్లెట్ వేసి  నుదురుపై  తడి గుడ్డతో తుడుస్తూ  చేయి వేసి ఎంతోసేపు ఆత్మీయంగా నిమురుతూనే ఉన్నాడు. ఆమెకి సృహ తెలిసి కళ్ళు తెరిచేసరికి చేయి వెనక్కి తీసుకుంటుంటే ఆ చేతిని గట్టిగా పట్టుకుని ఈ మాత్రం ఆత్మీయత చాలు నాకు  అంటూ మళ్ళీ కళ్ళు మూసుకుంది. ఉదయానికి జ్వరం  కాస్త తగ్గింది.
  మున్నార్ నుండి కొడైకెనాల్ వెళ్ళే దారంతా ఎటుచూసినా పచ్చటి సముద్రమే!   ఎక్కడికక్కడ కొండ వాలు ప్రాంతం. రోడ్డుకి అటు ఇటు తేయాకు తోటలుఆ కొండల్లో  అప్పటికప్పుడే కురిసే జల్లులు కాసేపు ఎండా కాసేపు వాన. దేవుడు మళ్ళీ పుట్టే వరమిస్తే ఇదిగో ఈ మున్నార్ లోనే పుట్టాలని  కోరుకుంటాను నాకంత నచ్చింది ఈ ప్లేస్ అంది. అతను గుంభనంగా నవ్వుకున్నాడు.
ఎదురుగా వాహనం ఎదురైన్నప్పుడల్లా  ఎక్కడ డీ కొంటాయో నన్న భయంతో చట్టుక్కున్న కళ్ళు మూసుకుంటుంది కుముద. ఆమె భయానికి తగ్గట్టే ఓ చిన్న యాక్సిడెంట్. అదే పెద్ద యాక్సిడెంట్ అయితే ఒకవేళ చచ్చిపోతే ఎవరితో వెళ్ళింది, ఎందుకెళ్లిందని ఎనెన్ని ఆరాలు కూతురు తన భర్త అత్తమామల ముందు తలెత్తుకోకుండా చేసిందని, ఈ వయస్సులో సిగ్గు ఎగ్గూ లేకుండా ఎవరినో వేసుకుని తిరుగుతూ  ఎక్కడో దిక్కులేని చావు చచ్చిందని అని చీత్కారించుకునేదేమో ! ఆ ఊహే భయంకరంగా తోచి గంభీరంగా మారిపోయిందిఆమె ఆలోచనలని అర్ధం చేసుకున్నట్లు "సారీ బంగారం" అన్నాడు. ఏమీ మాట్లాడలేదు కుముద . అతను ఫీల్ అయి వెనక్కి వెళ్లిపోదాం అన్నాడు. “అక్కర్లేదు, పది రోజులు పూర్తైన తర్వాతే వెళదాం. అయినా ఓడిపోతానని భయమేస్తుందా ఏమిటీ? అని వెక్కిరించింది.
"గుర్రాన్ని నీళ్ళ దాకా తీసుకెళ్ళగలం కానీ నీళ్ళు తాగించగలమా!  చెప్పండి" అన్నాడు గంభీరంగా.
ఎన్నో సినిమా పాటల్లో చూసిన కొడైకెనాల్ లేక్ లో బోటు విహారం అనేక వాటర్ పాల్స్ . అన్ని చోట్లా  దాదాపు  ఇవే  కదా ! ఇంకేమీ చూడాలనిపించడం లేదు వెళ్లిపోదాం అంది విసుగ్గా .    కోయంబత్తూర్ వరకు టాక్సీ లో ప్రయాణిస్తున్న సమయంలో బిడియం విడిచి  అతని భుజంపై తలవాల్చి నిద్రపోతున్నప్పుడూ వెచ్చగా శరీరం మండిపోవడం గమనించి టాబ్లెట్స్ వేసి మంచినీరు తాగించాడు. అక్కడ నుండి నాన్ స్టాప్ ఫ్లైట్ ప్రయాణం.
   "కొద్ది గంటల్లో పది రోజులు పూరై పోతున్నాయి."నీ లాంటి రాతి మనిషి ని నేనెక్కడా చూడలేదు. రాతి గుడిలో దేవతలా నువ్వు   ఆరాధనీయమే కాని అనుభవంలోకి రాని దానివి" నిరాశని అణుచుకుంటూ నిష్టూరంగా అన్నాడు.
 అతని చేతిని తన చేతిలోకి తీసుకుని  " ఈ ప్రయాణం ఒక అనుభవం కాదూ! ప్రేమ మానసికం అని నేను గాఢ౦గా  నమ్ముతాను.  ఎన్నోసార్లు మానసికంగా  చచ్చిన మనిషిని నేను. భర్త నీడన లేకపోవడంవల్ల మాట్లాడిన ప్రతి మనిషితోటి అక్రమ సంబంధాన్ని అంటకట్టి తృప్తి పడిన లోకానికి నా మనఃసాక్షి ధిక్కార స్వరంతో చెప్పిన  సమాధానం ఇదిమనసు పారేసుకున్న  మనిషి, నాకెంతో ఇష్టమైన మనిషిని  యేళ్ళ తరబడి ప్రక్కన పెట్టుకుని కూడా ఉంచుకోలేని మనిషినన్న ఆత్మ తృప్తి   నాకు మిగలింది, ఇది చాలు "అంది.
"నాతో మాట్లాడేటప్పుడు మాత్రమే తెచ్చిపెట్టుకున్న జాగ్రత్తతో  తెలివిగా మాట్లాడతావు. ఈ ప్రపంచంతో సంభాషించేటప్పుడు  హృదయంతో మాట్లాడతావు. ప్రకృతిలో సంచరించేటప్పుడు పసిపిల్లవిగా మారిపోతావ్, నీలో ఇన్ని కోణాలని ఇంత దగ్గరగా చూసిన తర్వాత నాలో కలిగే శారీరక స్పందనలు మాయమైపోయాయి. నాలో ఎలాంటి మనోవికారాలు లేవునిజం చెప్పాలంటే హృదయమంతా ప్రేమ పొంగి పొర్లుతుంది
అతను చెపుతూ చెపుతూ  స్వరం జీరపోయినట్లు కొద్దిసేపు ఆగి, తర్వాత "ఆ అనుభూతిని చెప్పడానికి నా దగ్గర మాటల్లేవ్దుర్భలత్వంతో  చటుక్కున పురుషుడిపై ఆధారపడిపోయే  యె౦దఱో స్త్రీలని  చూసాను, వాళ్ళతో నేనిన్ను పోల్చలేనుస్త్రీలు నిజమైన  చైతన్యవంతులు దృడ మనస్కులు   అయితే నీలా ఉంటారు. నీ పై గౌరవం ఇంకా పెరిగిందినిన్నెప్పుడూ డిస్ట్రబ్ చేయను. " తల వొంచి గౌరవంగా ఆమెకి నమస్కరించాడు.  వెంటనే అతని చేతిని లాక్కుని  ఓ చిన్న ముద్దు ఇవాలనుకున్న కుముదకి  బ్రేక్ పడింది.

అతనక్కడ  అలా ఆగిపోయాడు. ఆమె ముందుకు ప్రవహిస్తూ ఒకసారి వెనుతిరిగి చూడాలనుకునే బలీయమైన కోర్కెని బలవంతంగా అణిచి వేసుకుంది .

కామెంట్‌లు లేవు: