22, ఫిబ్రవరి 2018, గురువారం

నా దారెంట

వాస్తు పిచ్చితో మూలబడ్డ ఓ ఇంటి స్థలం ప్రక్కనుండి  వేలాది మందిలా  రోజూ నేను నడుచుకుంటూనే వెళతాను. ఖచ్చితంగా స్థలం యెదురుగానూ యెడమప్రక్కనూ కలుపుతూ  బ్లైండ్ మలుపు, వేగాలని నియత్రించడానికి ఓ స్పీడ్ బ్రేకర్.  నా హడావిడి జీవితంలో ఓ రోజూ ఆ రోజు చిన్నగా అనిపించే పెద్ద విచిత్రమే సంభవించింది. రోడ్డెంట నడుస్తూనే కనుకొసలనుంచి ప్రక్కకి చూస్తున్నప్పుడూ  ఓ పసుపు పచ్చని మొక్కొకటి తనువంతా పూలతో అలంకరించుకుని కనబడింది. ఏ వాహనమూ రాకుండానే నా నడకకి సంకెళ్ళు పడ్డాయి.

"నా దారెంట నే పోతుంటే  నన్నెందుకు  ఆకర్షించాలి నువ్వు" అనుకుంటూ ముఖమంతా నవ్వు విచ్చుకుని వెలుగు కళ్ళతో ఆ మొక్క సమీపానికి వెళ్ళానా, ఎంత అందంగా వుందో ఆ పిచ్చి తల్లి. ఏవో కాయలు కూడా కాస్తున్నట్లు కనబడింది కూడా.  నెర్రెలిచ్చిన సిమెంట్ బండల మధ్య మొలకెత్తి పుష్ఫించి ఫలించిన మొక్క అది.  నయన స్పర్శతోనే ఆ జీవన సౌందర్యాన్ని పలకరించి ఆ రూపాన్ని హృదయంలో చిత్రించుకుంటూ   లోలోపల గింగిర్లు తిరుగుతున్నస్వరాలేవో పెదవి దాటి కూని రాగంగా మారి ఈ రోజు జీవించిన క్షణాల్లో ఇవి కొన్ని అనుకుంటూ  పదపద మంటూ అడుగులని తరిమే ఆలోచనల సాక్షిగా బతుకు బాటలో పరుగులు మామూలే.

ఇంకొంచెం ముందు కు వెళతానా .. దారి ప్రక్కనే ఉన్న మామిడి చెట్టు క్రింద మాసిన గుడ్డని పరిచి దానిని గాలికి ఎగిరి పోకుండా చేతి కర్రని వుంచి వచ్చే పోయే వారి వొంక ఆశగా చూస్తూ ఉంటాడు ఓ భిక్షుయసీ. భుజాన తగిలించుకున్న సంచి చిల్లర నాణేలతో బరువుగా ఉంటే కాస్త బరువు తగ్గించుకుని తృప్తి పడుతూ బరువు లేని రోజు తల అడ్డంగా ఊపుతూ నడక సాగిస్తూ ఉంటాను.

నేను నడక నుండి  మళ్ళీ రెండు చక్రాల బండి పై ప్రయాణం, తర్వాత నాలుగు చక్రాల రథం పై ప్రయాణం చేసే స్థాయికి యెదిగినప్పటికీ నిత్యం నన్ను ఆకర్షించే ఆ రెండు వస్తువులూ నాకొక ప్రకృతి పాఠాన్ని నేర్పుతూనే ఉంటాయి. ఆగి మరీ అలవాటైన నడకలోకి తొంగి చూడమంటాయి. పసుపచ్చ పూల చెట్టు  యే సంరక్షణా లేకుండా అన్ని ఋతువులలోనూ  ప్రవర్ధమానం అవుతూనే ఉంది. తాత  వొంట్లో సత్తువ తగ్గి  పీకేసే వోపిక లేక వదిలేయగా   విస్తరించిన గరిక దుబ్బుల మధ్యన  సురక్షితంగానూ   వాకిట్లో నీళ్ళు చల్లి ముగ్గు కర్ర వేసుకోవాలన్న బామ్మ ఆకాంక్షలని త్రాగి బ్రతుకుతూనూ.

మామిడి చెట్టు క్రింద భిక్షుయసి శరీరం మరీ కృశించి పోతుంది.  పాదచారుల దయతో లభించిన నాలుగు కాసులుని రోడ్డు చివర ఫలహారాల బండికి చేర్చలేక .. ఎదురుగా భవనంలో పని చేసే అడ్డ బాసర పెట్టుకున్నామెని బతిమలాడుకుంటాడు కాసిని టీ నీళ్ళు రెండు ఇడ్లీముక్కలు తెచ్చి పెట్టమ్మా అని.  నీకు నేను పని మనిషినా ..అని విసుక్కుంటూనే తెచ్చిచ్చే ఆమెలో దయా వర్షం కురుస్తూనే ఉంటుంది. అది చూస్తున్న నాలో తెలివి ఇనుమడించి రోజూ చేతి సంచీ బరువుగా ఉంటేనే ఇవ్వాలా .. నిండు కుండ అన్నంలో నాలుగు ముద్దలు పెట్టొచ్చు కదా అనుకుని ఆచరిస్తాను.

పసుపచ్చ పూల చెట్టు ఉన్న ఇంటి తలుపులు రోజుల తరబడి మూసుకున్నట్లు గమనించినప్పుడు ఓ సీసాతో నీళ్ళు తీసుకెళ్ళి మొక్కని తడుపుతుంటాను.  అదో మానసిక ఆనందం నాకు.నిజానికి ఈ రెండు పనులు నేను చేయకపోయినా అవి ఉండవచ్చు .  సమయానికి  సందర్భానికి తగినట్లు బ్రతకడం మనుగడ సాగించడం సృష్టిలో సాధారణమైన విషయం  అదీ కుహనా విలువల మధ్య బ్రతికే ఒక్క మనిషికి తప్ప.

ఉన్నట్టుండి  మా వైపు రోడ్డు విస్తరణా కార్యక్రమాలు మొదలయ్యాయి. తెల్లారేపాటికి  రహదారి ప్రక్కనే ఉన్న మామిడి చెట్టు ముక్కలు ముక్కలుగా నరకబడింది. దాని క్రింద కూర్చునే వృద్దుడికి యిప్పుడు తిండే కాదు నీడ లేకుండా పోయిందని విచార పడుతుండగా పచ్చుపచ్చ పూల మొక్క గుర్తుకొచ్చింది. అడుగుల వేగం పెంచి ముందుకొస్తే  రంగ రంగ వైభవంగా విస్తరించుతున్న పసుపచ్చ పూల మొక్క ప్రోక్లెయిన్ తవ్విపోసిన మట్టి గుట్టల మధ్య  వొదిగి పోయి దిగాలుగా పడి ఉంది.  ప్రయాసతో జారుతున్న మట్టి గుట్టలపైకెక్కి  పసుపు పచ్చ పూల మొక్కని చేతిలోకి తీసుకుంటే విరిగిన కొమ్మై నా చేతిలోకి వచ్చింది. నా మానసిక ప్రపంచం ముక్కలైనట్లైంది. దయ లేని లోకంలోకి,  ఈ వాచ్యం లోకి మళ్ళీ వచ్చిపడ్డాను.  "నా దారెంట నే పోతుంటే  నన్నెందుకు  ఆకర్షించాలి నువ్వు" అనే అభియోగాలు మోపని సాధారణ కాలంలోకి నేను మళ్ళీ వచ్చిపడ్డాను.

కొన్నాళ్ళు నా పెదవులపై యే కూనిరాగాలు కూయవు. నా కళ్ళల్లో యే వెలుగుపూలు పూయవు. మళ్ళీ యేదో ఆకర్షణ తనలోకి నన్ను లాక్కునేదాక నేను వాచ్యంలో బ్రతుకుతుంటాను జీవించడం తెలియక.


కామెంట్‌లు లేవు: