కృష్ణాతీరంలో లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
కృష్ణాతీరంలో లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

11, జనవరి 2026, ఆదివారం

వన్య

 




వన్య   - వనజ తాతినేని #sketch


ఓయ్.. వన్య! వన్య!!  ఎక్కడ వున్నావోయ్

పలకవేల?  అసలే మా నగరం విశాలమైనదే కాకుండా రేయంబవళ్ళు రద్దీగా వుంటుంది. జాగ్రత్త!!

ఈ రణగొణ ధ్వనుల మధ్య నా పిలుపు వినబడుతుందా? 

 ఈ మౌనమేల, పోనీ కోపమా! 

అతిధి సత్కారాలు బాగా చేయలేదేమో నన్న నింద నాపై పడనీయకోయ్ 

మధువును సిద్ధపరిచాను. ఆరగించడమే ఆలస్యం కరుణించి కనబడవోయ్..


*********

ఏటి గట్టున పచార్లు చేస్తున్నావా  లేక

లంక భూముల్లో నిత్యం విరబూసే పూల తోటల్లో సంచారం చేస్తున్నావా?

నావ నెక్కి   షికారు కొడుతున్న కొత్త దంపతుల సరాగాలను చూస్తూ 

సిగ్గులొలుకుతూ అక్కడే ముడుచుకుపోయావా? 

నది మధ్య వల వేసి నింపాదిగా రేడియోలో  జనరంజని 

పాటలు వింటూన్న జాలరికి సహ శ్రోతవి అయ్యావా? కాస్త ముందుకెళ్ళి

ఇసుక తిన్నెలపై పవళించి విలాసంగా వేణువు ఊదుకుంటున్న మువ్వ గోపాలుడిని చూసి వచ్చావా?  

నది వొడ్డున బండరాయిపై కూర్చుని కూనిరాగాలు తీస్తున్న పడుచుపిల్ల గుండెగదిలో ఎవరున్నారో తొంగిచూస్తున్నావా? తీరంలోని తడి ఇసుకపై ఆమె చేస్తున్న కూచిపూడి నృత్యం వీక్షించావా?

ఆ పదాభినయనం నిను ఆకట్టుకుందా? మీ బ్యాలెట్ పోలె అంత బాగుందా? 

ఎలాగు  పుష్యంలోనే వచ్చావు గనుక నీకు నమ్మకం వున్నా లేకపోయినా కాస్త పుణ్యం మూటగట్టుకోవడానికి మా ఆంధ్ర మహా విష్ణువుని దర్శించి రాకపోయేవా? 

 మా రాయలు రచించిన ఆముక్తమాల్యద కావ్యానికి ప్రేరణ నిచ్చిన తావును చూసొచ్చావా? చూసింది చాల్లెద్దూ అనుకుంటూ..

వెనక్కి వస్తూంటే మా పచ్చని పొలాలపై వీచే మంద్రమైన గాలి నిన్ను సేదదీర్చే వుంటుందిలే! 


*****************


నగర సంచారం చేసి అలసిపోయి నది ఒడ్డుకు చేరావా మళ్ళీ?  

సరిగంగ స్నానాలు చేసి నీలాల కురుల నుండి ముత్యాలు జారుతుండగా రాయంచలా నడిచి వెళుతున్న ఆమెను చూసి విభ్రమ చెందావా? 

రివ్వున  ముందుకు పరుగులు తీసి  వెనుదిరిగి చూసావా!  

ముఖానికి  పచ్చని పచ్చి పసుపు పూసుకుని నుదుటిపై యెర్రని కుంకుమ దిద్దుకున్న నడి వయసు స్త్రీ సౌందర్యాన్ని కాంచి మూర్ఛపోయావా?  

ఆమె పెదవుల మధ్య  విరిసిన చందమామ తునక లాంటి

దరహాసాన్ని చూసాకైనా నీ సౌందర్యదాహం శాంతించిందా? 

ఆమె ముందు మోకరిల్లాలనిపించిందా లేదా? 

పోనీ…అరకన్నులతో సిరివెన్నెల కురిపిస్తూ పరామర్శించిన 

ఆయననైనా గుర్తు పట్టావా లేదా? అదిగో కనబడే ఆ కొండైనా విజయుడి విల్లంబులపొదిలో చేరిన పాశుపతాస్త్రం కథ చెప్పలేదా?  

అయ్యయ్యో! ఊపిరాడనీయకుండా ఇన్ని ప్రశ్నలు వేసి విసిగించానా? 

మన్నించు సఖీ! త్వరగా ఇంటికి వచ్చేయ్! 


*************

ఎక్కడో ఓల్గా తీరం నుండి మా కృష్ణా తీరానికి అతిధిగా విచ్చేసావు. 

మా నగరం  తన అందాలతో నీకు  కనువిందు చేసిందా? 

ఇప్పటికైనా ఒప్పుకుంటావా లేదా? 

సౌందర్యం ఏ ఒక్కరి సొంతం కాదని. 

ఏటవతలకు వెళ్ళి నీకొక కానుక తెచ్చి వుంచాను. 

అది ఏమిటా అనుకుంటున్నావా? 

అందమైన మంగళగిరి జరీ చీర పట్టుకొచ్చానోయ్,  

కట్టుకోవూ… సింగారించుకుని  నాకు చూపియ్యవూ 

మధువు విందు చాలులే, నా కెందుకీ చీరలు? అని విసుక్కుంటున్నావా? 

నా ఒళ్ళంతా రంగు రంగుల చీరలు. ఏ నేతకాడు నేయలేని అందమైన చీరలు  

నా చీరల రంగులను రేఖలను దొంగిలించడం మీ మానవులకు అలవాటు కదా!

నేను వెళ్ళొస్తా .. ఎప్పుడైనా మనసైతే మళ్ళీ వస్తా, 

నాకసలే చిత్తచాపల్యం అని నీకు తెలుసుగా! బై. 

ఇష్ట సఖి! వన్య….  వన్య ఇంకొన్నాళ్ళు వుండవూ!  ప్లీజ్!!

బతిమాలుతూ వుండగా మెలుకువ వచ్చేసింది. 😊❤️


*****************


*వన్య అంటే రష్యన్ భాష లో సీతాకోకచిలుక

*బ్యాలెట్ పోలె రష్యన్ నృత్యాలు. . 





9, ఆగస్టు 2021, సోమవారం

నదికి నమస్కరించని నా చేతులెందుకు!?

ఏటి గాలి యెత్తి పోస్తుంది నది పాట పాడుతుంది

కెరటాలు కనకదుర్గ పాదాల వైపు చూసి చూసి 

 మెడ నొప్పి పుట్టి పుట్టి సాగరం బాట పట్టాయి. 

నల్లని నీరు తాగిన నల్లరేగడి నేలలు సంతోషపు చిత్తడిలో

నారుకు ఆహ్వానం పలుకుతున్నాయి

జాలరులతో పాటు కొంగల బారులు 

పక్షి కన్నును  మాత్రమే చూస్తున్న అర్జునుడిలా దిగువకుపారే నీటిపై దృష్టిని పెట్టాయి. 

 ఏటా వచ్చే యాత్రికులు ప్రవాహాన్ని చూస్తూ కుశాల పడుతున్నారు. 

వారి కళ్ళలో బాల్యం మళ్ళీ చిగురిస్తుంది. 

నది వొడ్డున దిగి  కాళ్ళు కడుక్కోవాలంటే జన్మ సంస్కారమేదో మందలిస్తుంది

నిండా కల్మషం వున్న మనుషులం కదా

పునీతమైన శుభ్ర నదీ జలంలో మన కాసారాలను వదల మనసు కాదు

మల్లన్న పాదాలు కడిగిన కృష్ణమ్మ ని నెత్తిన జల్లుకుని నమస్కరించాలనిపిస్తుంది 

మూడు ఉద్దరిణెల పాదోదకాన్ని భక్తితో సేవించాలనిపిస్తుంది. 

ఎక్కడ పుట్టావు తల్లీ 

యెన్ని సంస్కృతులను విలసింప జేసావు తల్లీ.. 

తరతరాలుగా ప్రమోద ప్రమాదాల మధ్య

యెన్ని చరచరాలకు బతుకు ఊతమిచ్చావు తల్లీ.. 

నది యుగాల సంస్కృతి నాగరికమైన సద్గతి 

పిడికెడు బూడిదగా మారి ప్రవాహంలో పడి  కొట్టుకుపోవాల్సిందే 

నదికి నమస్కరించని నా చేతులెందుకు!? 🙏







27, జూన్ 2018, బుధవారం

సామాజిక ఆర్ధిక అసమానతలను ప్రశ్నించిన కులవృక్షం


సామాజిక ఆర్ధిక అసమానతలను  ప్రశ్నించిన  కులవృక్షం - అరసవిల్లి కృష్ణ గారి ప్రసంగానికి అక్షర రూపం .    తాతినేని వనజ కధకురాలిగా   సాహిత్యానికి సుపరిచిత.  చాలా కాలంగా వనజ రచనలను చదువుతున్నాను.  కొంతమేర కేవలం  సాహిత్య పరిచయం మాత్రమే కాదు. గత పదిహేనేళ్ళుగా కవిత్వపు ఉనికితో  వ్యక్తిగత పరిచయం కూడా వుంది. మనిషియొక్క స్వభావాన్ని లేదా చైతన్యశీలతను అతని వునికి నిర్ణయిస్తుంది అని మార్కిజం  చెబుతుంది . అన్నివేళల,అన్నికాలాల్లోను ,ఈ మాటలు ప్రాసంగిత ఉన్నది. తాతినేని వనజ గ్రామీణ జీవన సంబంధాలనుండి వచ్చినవారు . పుట్టుక ద్వారా  స్త్రీ  అస్తిత్వ మున్నది. సహజంగానే హృదయపు  తడి కలిగిన రచయిత్రి స్వచ్చంగా, స్వేచ్చగా తన భావాలను , అభిప్రాయాలను చెప్పగలరు.తన ఉనికి తన సాహిత్య సందర్భాన్ని నిర్ణయించింది .తను ఎలా ఉండాలో ,ఏం రాయాలో నిర్ణయించింది. తడబాటు లేని అత్యంత నికార్సయిన సాహిత్య సృజనకు  బీజాలు వేసింది . ఈ  రచయిత్రి వ్యక్తిగత పరిచయం వలన ,ఆమె రచనలకు ,ఆమె వ్యక్తిత్వానికి మధ్య తేడా ఉన్నదా !అనే  సంశయంనుండి  ఆమె కథల్లోకి దారి చేసుకోగలిగాను . మూడు ప్రధాన అంశాల  చుట్టూ ఆమె కధలు  రూపు దిద్దుకున్నా యి.   
1.స్త్రీ .
2 .ఆమె అవగాహన.
3.సామాజిక దొంతర్లు .
కధలు ఎలా రాస్త్హారు :- ఏది కధ అవుతుంది ? కథా  వస్తువులు ఎట్లా స్వీకరిస్తారు. వస్తువును శిల్ప పరంగా ఎలా చెబుతారు .వనజ రాసినవి కధ లేనా! కధా నిర్మాణ ముందా !అనే ప్రశ్నలు తలెత్తవచ్చు .కధ గురించి చర్చ చేయవచ్చు .తన స్వభావంలోనే తన మానసిక స్థితిలోనే ఆమె కధలు వున్నాయి .ఇది వనజకే పరిమితం కాదు యే స్వభావ శాలికయినా అన్వనయించుకోవచ్చు. తను చూసిన  తన అనుభవంలోకి  వచ్చిన జీవిత శకలాలను ఆమె కధలుగా మలిచారు .రచయిత్రిగా  ఆమె కోక  దృక్పథం  ఉన్నది .ఆ కోణం  నుండి ఆమె తాను రాయాలనుకున్నదేమిటో ఆమెకు స్పష్టంగా తెలుసు .ప్రధానంగా మూడు అంశాలు ఆమె కధలలో  సంగీవం చెందుతాయి .
1 .కులం-మతం -వర్ణం  
2.  కుటుంబ సంబ౦ధాలలో  స్త్రీ  పురుషులు మానసిక సంఘర్షణలు .
3.విలువల పతనం .
                             ఈ మూడు  భారతీయ సమాజ చిత్రికలో  అంతర్భాగం .ఈ మూడు అంశాలు పైనే  కుటుంబ వ్యవస్థ నిలబడి ఉన్నది .కుటుంబపు పునాది నుండి ,రాజకీయ అవగాహన నుండి ఈ కథలను విశ్లేషించాలి. ఆమె కథ నిర్మాణం, చివరిలో ప్రస్తావిస్తాను గాని , కథలలోని వస్తువు పట్ల ఆమెకు  స్పష్టత ఉన్నది . ఇంకా ముందుకు వెళ్లి చెప్పాలంటే దగ్గర తనమున్నది .విభజన కాదు గాని ఒక స్రీగా  స్త్రీల పట్ల కరుణ ఉండవచ్చు, సానుభూతి ఉండవచ్చు , ఈ దిశగా ఆమె కథలలో స్త్రీ  కేంద్రబింధువుగా ఉండవచ్చు. కాని ఆమె స్త్రీ అనే కవచం నుండి బయటపడి విశాల ప్రపంచాన్ని చూశారు. చూడటమనేది వాస్తవ దృష్టిలో చూశారు. ఆర్ధిక, సామాజిక అసమానతల సమాజంలో ,మతం ,కులం, స్త్రీలు  కుటుంబం, స్త్రీ  పురుషుల స్నేహాల మధ్య ఇంకా కొనసాగుతున్న అనుమానపు బీజాలు . సామాజిక ఆమోదం పొందని  స్త్రీ పురుషుల స్నేహాలు, కార్పోరేట్ వైద్య మోసాలు, స్త్రీల జీవన పోరాటం,  పలుచనవుతున్న కుటుంబ అనుబంధాలు, పాశ్చాత్య సంస్కృతీ గురించి చర్చకు తీసుకువచ్చారు.  మొత్తంగా  కథల సారాంశం ఇదే .
                             కులవృక్షం కథా సంపుటిలో ఇరవై నాలుగు కధలున్నాయి.  రెండు మూడు కథలు తప్ప ప్రతి కథ వైవిధ్యమైన వస్తువునే మనముందువుంచాయి.ఇవన్నీ మనమెరిగిన జీవితాలు. నిత్యమ్ తరిచి చూస్తున్న వెలుగు నీడలు. మనకు తారసపడుతున్న  మనుషులు సంఘటనలు అత్యంత సహజ మైనవి కావొచ్చు .వాటికి సృజనాత్మక రూపం ఇవ్వవచ్చా అన్పించవచ్చు ,   కథానిక ప్రక్రియలో ఇవ్వాల్సిన అవసరం  ఉన్నది. మానవ జీవిత పరిణామ క్రమంగా ఆయా రచయితలు ,తమ భావనా పటిమ నుండి ,కథను సంపన్నం చేసారు,  విస్తృతిని కల్పించారు. ఆ కోణంలో చూస్తే వనజ మంచి కథకురాలిగా నిలబడ్డారనిపిస్తుంది .
                              నేను కేవలం నాలుగైదు కథల గురించి మాత్రమే  చెప్పదలచాను.చూసీ చూడనట్లు అనే కథలో ముస్లిం మహిళల బురఖా సంప్రదాయాన్ని కథగా మలిచే ప్రయత్నం చేసారు . ముస్లిం మహిళల బురఖా ధరించావచ్చా, వారికి వారి మత  సంప్రదాయం ఇచ్చే స్వేచ్చ ఏమిటి  అనే చర్చలోకి  వెళ్ళాను. ప్రభుత్వ కార్యాలయం ,కుల మత రహితంగా ఉంచవలసిన ప్రాంతం. కానీ అక్కడేం జరుగుతుంది .ఒక మతానికి ఎక్కువ  హిందూమత ఆచార కేంద్రంగా ఆ కార్యాలయాలు  రూపు దిద్దు కుంటాయి . ప్రజా అవసరాలకు సంబందించిన కార్యాలయం లోనికి  కేవలం హిందువులు  మాత్రమే రారు .ముస్లింలు ,క్రిస్టియన్లు ఇంకా అనేక మతస్తులు కూడా వస్తారు. ఒక లౌకిక సంప్రదాయానికి భిన్నంగా హిందూ దేవుళ్ళు  పూజలందుకుంటు౦టే  ఆ బ్యాంక్ ప్రాంగణంలోకి వెళ్ళిన బురఖా వేసుకున్న ముస్లిం మహిళ మానసిక స్థితి ఏమిటి ? తల్లి అనారోగ్యం  కారణంగా తల్లి డబ్బులకు తల్లి సంతకం తను చేసి చెక్  ద్వారా డ్రా చేయాలనే ముస్లిం యువతి కథ ఇది . నైతికత  దృష్ట్యా చూస్తే తల్లి సంతకాన్ని  పోర్జరీ చేయడం తప్పు కావొచ్చు .కాని ఇది చాలా చిన్న ఘోరం. దర్జాగానే సంతకాలు పెట్టి వేలాది కోట్లను దోచుకున్న ఆర్ధిక నేరగాళ్ళ కంటే ఇదేమి పెద్ద ఘోరం కాదు  కదా !
                                      దీనికి కొనసాగింపే ఉడాన్ కథ .దీనిలో ప్రధాన వస్తువు బురఖా.  ముస్లిం స్త్రీల  సంప్రదాయం గురించి  రచయిత్రి ఏ అధికారంలో  మాట్లాడుతున్నారు  అని అనిపించవచ్చు .ఈ కథలో షబానా ,నసీమా నే  కాదు. ముస్లిం మహిళల అంతరంగ చిత్రాన్ని ఒకింత అవగాహనతోనే రాసారు వనజ. బురఖా వేసు కోవడమనేది  ఒక మత సంప్రదాయంకు గుర్తు.   ఆ సంప్రదాయాన్ని పాటించాలా వద్దా  అనేది  వారి వారి వ్యక్తిగత ఇష్టా ఇష్టాలతో  ఆధారపడి వుంటుంది .ఇక్కడ ఎవరి ఆధిపత్యం వుండకూడదు .ముస్లిం మహిళలు  అన్ని రంగాలలో  ఎదుగుతున్నారు . ఉద్యోగాలు చేస్తున్నారు.  తమ సాంప్రదాయ బంధనాలనుండి  బయటకు వస్తున్నారు .అయినా  బురఖా వుంచుకోవాలా  వద్దా  అనేది  పూర్తిగా వారి మానసిక  స్థితికి  సంబం ధించినదే,  మనిషి జీవితం  గాలిపటం  దానికి కావాల్సింది  దారం మాత్రమే . ఇక్కడ దారం అంటే స్వేచ్ఛ .
  కథల సంపుటికి  శీర్షిక కథ   కులవృక్షం . వృత్తుల నుండి  కులాల విభజన జరిగిందనే ఒక ఆలోచన ఉన్నది. ఆయా వృత్తులను బట్టి  కులాలు ఏర్పడినాయని  ఇవ్వాల్టికి  ఈ దేశంలో  కులవ్యవస్థ  బలంగా ఉండటానికి కులవృత్తులు కారణమనే భావన వున్నది. అయితే ఇటీవల కాలంలో అన్ని వృత్తులు , అన్ని కులాలు వారు చేస్తున్నారనేది కూడా వాస్తవం .మన పరిసరాలను శుబ్రఫరిచే  సఫాయి కార్మిక నేపధ్యం నుండి రాసినది .సమాజంలో  ఈ వృత్తి పోవాల్సిందే , మన గౌరవ న్యాయస్థానాలు కూడా , దీనిలో కల్పించుకున్నవే .కానీ  జీవితముంటుంది .దీనికొక వెలవుంటుంది . సఫాయి కార్మికుడు లేదా  కార్మికురాలు  ఆ వృత్తి నుండి  వైదొలగితే వారి బతుకుకు  భరోసా ఏది!  ఈ వృత్తి  వారిది మాత్రమే కాదు ,నిచ్చెన మెట్ల  వ్యవస్థ లోని  అందరూ భాగం కావాల్సిందే  అంటే సరిపోదు . సఫాయి కార్మికుల కుటుంబo  ఆర్ధిక అవసరాలు  తీరినప్పుడు మాత్రమే వారు ఈ పని నుండి  బయటకు వస్తారు .భారతీయ సమాజం  ఇంకా ప్రజాస్వామికం  చెందవలసి వున్నది .నిచ్చెన మెట్ల  కులవ్యవస్థ అంతరించాలంటే  ఈ దేశంలో  కుల నిర్మూలన జరగాలి .
ఎవరయినా ఏమి వదిలి వెళతారు ? కాసిని నవ్వునో  ,ఆ కంక్షలనో దుఃఖలనో  అవమానాలనో ,ఇంకా చెప్పాలంటే  బిడ్డల రూపంలో అహంకారపు  జాడల్ని వదిలి వెళతారు  ఇది ఏకాంత జీవితం  గడుపుతున్న సత్యవతి కథ.దుఃఖo ,కన్నీళ్ళు  మానవ ఉద్వేగాలు   ఆవిరయిపోయిన  సత్యవతి  బుజ్జోడు అనే పెంపుడు కుక్క చుట్టూ  పెనవేసుకున్న  గతం ,వర్తమాన  జీవన చిత్రణ .(రెప్పలతడి ) కుటుంబ సంబంధాలు అంటే, మొక్కలనో, కుక్కలనో  పెంచుకునో  దశకు వాటి చుట్టూ అనుబంధం ఏర్పడుతున్న  దశకు చేరుతున్న సమాజంలో  సత్యవతి కథ సమాజంలో  ఒంటరి స్త్రీల కధని ప్రతిబింబిస్తుంది.
                             కులవృక్షం ,కధా సంపుటిలో  తాతినేని వనజ స్త్రీ  ,పురుషుల  మధ్య వుండే ,శారీరక- మానసిక భావోద్వేగాలను  అవి శరీరo  చుట్టూ వుoటాయా! కేవలం మనసు చుట్టూ పరిభ్రమిస్తాయా  అనే ప్రశ్నలు వేస్కొని ,లతాంతాలు ,చిగురించిన శిశిరం  వంటి కధలకు  మానవ పరిణామ క్రమంలో ,కుటుంబవ్యవస్థ లో  స్త్రీ  పురుషులు  మద్య చిగురిస్తున్న  కొత్తతరం ప్రేమలు ,మరీ ముఖ్యoగా వివాహ వ్యవస్థలో  వస్తున్న  మార్పులు ,అవి యే దశకు  చేరుకుంటున్నాయి. పెళ్ళైన తర్వాత భాద్యతలు మోయాల్సిన వయస్సులో పిల్లలు పెద్దవాళ్ళయి  ఒక అవగాహనకు  వస్తున్నపుడు, తమ మానసిక  స్థితిలో  ప్రేమ చాటున విచ్చుకుoటున్న  కామోద్రేకాన్ని  చెప్పే ప్రయత్నo  చేసారు. ఈ కాలాన్ని జాగ్రత్తగా  గమనిస్తే  సంపద పెరిగి ,జీవితం భద్రతలోకి  ప్రవేశించాక చిగురిస్తున్న  అసహజ ప్రేమలకు ,లేదా శరీరాకర్షణ లని  కధలుగా  మలిచారు  చిగురించిన శిశిరం, ఒంటరిగా జీవిస్తున్న కుముద  కు  వచ్చిన ప్రపోజల్ ,నా భార్య అంగీకారంతో నిన్ను పెళ్ళి చేసుకుంటాను  అని  వివాహితుడు  అనడం మన కుటుంబ వ్యవస్థ డొల్ల తనాన్ని  బట్టబయలు చేస్తుంది . అయితే దీనికి భిన్నంగా ఈ కధ వుంటుంది. వివాహితుడు, ఒంటరి స్త్రీల మధ్య  శరీర కాంక్షలు  తగ్గి  మానసికంగా దగ్గరయ్యే  వాతావరణం ఏర్పడటం,శృంగార  కాoక్షల కంటే స్త్రీ –పురుషుల మధ్య మానసికంగా  భరోసా ఏర్పడటం  ఈ కథ నేపధ్యం. మోహన, కుముద  వంటి పాత్రల చిత్రణలో  వనజ తాతినేని  చాలా పరిణితి సాదించారు .
                              కేవలం  ఈ కథలు  చదవడం  ఒక అనుభవ౦. అందునుండి  స్వీకరిoచాల్సినది  ఏమయినా  వున్నదా! కథ వస్తువు దాన్ని  స్వీకరించడం  ఒక ఎత్తుయితే  కథగా మలచడం శిల్పంకు సంబంధించిన అంశం. కథలో శిల్పం లేనప్పుడు  యెన్ని  వున్నా దండగే అంటాడు కొ.కు. వనజ కథను  శిల్ప పరంగా  మలచడానికి ఇంకా కృషి చేయాల్సి వున్నది .కథ కేవలం దృశ్య రూపంగా  ఉండకూడదు .వస్తువును ఎంత బాగా చెప్పగలిగితే, అంతగా కథ ప్రాచుర్యం పొందుతుంది .అంతమాత్రమే కాదు ఒక తాజాదనాన్ని వస్తువు ఇస్తుంది. ఆ కథను చదవడం  ఆ కథల ద్వారా శిల్ప రహస్యాన్ని   గ్రహించడం ,ప్రధానంగా  పాత్రలను మలిచే  క్రమంలో  వాటిని చిత్రించే క్రమంలో ఏ పాత్రలను  రచయిత సృష్టిస్తున్నదో  ఆ పాత్రల వెనుక వున్న,దాగిన స్వభావాన్ని పట్టుకోగలిగితే  కథలు దృశ్యరూపంలో  నుండి కథా రూపంలోకి వస్తాయి. కొన్ని కథలు చదివినప్పుడు  శిల్పం  లేనట్లు అనిపించినా వస్తువు  ఆ లోటుని కనబడనీయలేదు. కులవృక్షం చదవడం ద్వారా  మంచి కథలను చదివామనే భావన  చాలా కాలం వెంటాడుతుంది .
                                                                                                                -అరసవిల్లి కృష్ణ
                                                                                                                 9247253884