ఏటి గాలి యెత్తి పోస్తుంది నది పాట పాడుతుంది
కెరటాలు కనకదుర్గ పాదాల వైపు చూసి చూసి
మెడ నొప్పి పుట్టి పుట్టి సాగరం బాట పట్టాయి.
నల్లని నీరు తాగిన నల్లరేగడి నేలలు సంతోషపు చిత్తడిలో
నారుకు ఆహ్వానం పలుకుతున్నాయి
జాలరులతో పాటు కొంగల బారులు
పక్షి కన్నును మాత్రమే చూస్తున్న అర్జునుడిలా దిగువకుపారే నీటిపై దృష్టిని పెట్టాయి.
ఏటా వచ్చే యాత్రికులు ప్రవాహాన్ని చూస్తూ కుశాల పడుతున్నారు.
వారి కళ్ళలో బాల్యం మళ్ళీ చిగురిస్తుంది.
నది వొడ్డున దిగి కాళ్ళు కడుక్కోవాలంటే జన్మ సంస్కారమేదో మందలిస్తుంది
నిండా కల్మషం వున్న మనుషులం కదా
పునీతమైన శుభ్ర నదీ జలంలో మన కాసారాలను వదల మనసు కాదు
మల్లన్న పాదాలు కడిగిన కృష్ణమ్మ ని నెత్తిన జల్లుకుని నమస్కరించాలనిపిస్తుంది
మూడు ఉద్దరిణెల పాదోదకాన్ని భక్తితో సేవించాలనిపిస్తుంది.
ఎక్కడ పుట్టావు తల్లీ
యెన్ని సంస్కృతులను విలసింప జేసావు తల్లీ..
తరతరాలుగా ప్రమోద ప్రమాదాల మధ్య
యెన్ని చరచరాలకు బతుకు ఊతమిచ్చావు తల్లీ..
నది యుగాల సంస్కృతి నాగరికమైన సద్గతి
పిడికెడు బూడిదగా మారి ప్రవాహంలో పడి కొట్టుకుపోవాల్సిందే
నదికి నమస్కరించని నా చేతులెందుకు!? 🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి