11, ఆగస్టు 2021, బుధవారం

మరణించే ప్రేమ వొద్దంటాను

 

మరణించే ప్రేమ యెంత గొప్పదైనా వొద్దంటాను. 

అసలు ప్రేమంటేనే వెయ్యిదిగుళ్ళు. 

వద్దని యెంత మొత్తుకున్నా అణాకాణీ చేయని తలపుల కొలువులు

ద్వారబందాలే లేని నాలుగు గదులలో స్వేచ్ఛగా తిరిగేసిన రోజులు

ధ్వని వినిపించని వలపు మంత్రాలు  అస్త్రాలు శస్త్రాలు చేయని గాయాలు తీపి కోతలు

ప్రేమంటే తనను తాను గాయపరచుకుని ఇంకొకరి ప్రేమను మలాముగా పూసుకోవడం

ఇన్ని దాటాక... 

ఎవరి మానాన వారిని వుండనీయదు పోనీ కలిసి బ్రతికినపుడు పాతబడకుండాను వుండిపోదు

ఇరువురి మధ్య క్రమక్రమంగా మరణించే ప్రేమ 

వెగటు కొట్టే ప్రేమ మనిషి కన్నా ముందే చచ్చిపోయే ప్రేమ వొద్దంటాను

రహస్యతంత్రులను మీటే ఆ మనో మార్దవం.. నందివర్దనమంత  చల్లనిది కానట్లైతే.. 

ప్రేమ యెంత గొప్పదైనా వొద్దంటాను.

మరణించే ప్రేమ యెంత గొప్పదైనా వొద్దంటాను.

ఓ దేశదిమ్మరి ప్రేమ  సంచారి ప్రేమ యెంత గొప్పదైనా వొద్దంటాను.

రెక్కలూడిన సీతాకోకచిలుకకు పూలరెక్కలు అతకవంటాను.



కామెంట్‌లు లేవు: