31, డిసెంబర్ 2017, ఆదివారం

ఆశలెప్పుడూ..

ఆశలెప్పుడూ లేతగా ఉండాలి.ముదిరితే పండి రాలిపోతాయి.

కాబట్టి .. చిన్న చిన్న ఆశలతో మారిన కేలండర్ లోకి మనమూ మారిపోదాం.

అందరూ కొత్త సంవత్సరపు శుభాకాంక్షలు చెప్పుకుంటుంటే ..

అప్రయత్నంగా దాశరధి గారి గేయం గుర్తుకువచ్చింది.


"అన్నార్తులు అనాధులుండని ఆ నవయుగమదెంత దూరం 

కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెపుడో

పసిపాపల నిదుర కనులలో  మురిసిన భవితవ్యం ఎంతో

గాయపడిన కవి గుండెలల  రాయబడని కావ్యాలెన్నో..."

మనచుట్టూ ఉన్న సమాజం కోసం ఇలాంటి పెద్ద కలలు కనడం అవసరం కూడా అనిపించిది.

అంతలోనే ..మనసు ఇలా వెక్కిరించింది .

ఓసి ..పిచ్చి మొహమా ! ఇప్పుడేగా ఆశలు లేతగా ఉండాలి అన్నావ్ !

కలలు కూడా రాత్రి పూటే కనాలి.

నువ్వు పగటి కలలు కంటున్నావ్  సుమా ..అని హెచ్చరించింది

 ప్చ్ ..ఆశలో ,కలలో, భ్రమలో ..

క్షణాలని సూర్య చంద్రుల సాక్షిగా ప్రసవిస్తున్న కాలమా ..


ఆగదులే ఈ అడుగు - ఎందుకనో నీ గర్భంలో దాచుకున్న చరిత్ర నడుగు ..

అని అంటూ ..  ప్రవాహంలా సాగిపోవడమే మనపని.

మిత్రులందరికీ,బంధువులందరికీ  నూతన సంవత్సర శుభాకాంక్షలు.

(ప్రత్యేకించి అందరికి చెప్పలేను కాబట్టి  ఈ పోస్ట్)


22, డిసెంబర్ 2017, శుక్రవారం

ఎలా చెపుతున్నాం !?

ఆది అనంత శబ్ద్ ఓం హై.. అని హిందూ ధర్మం చెపుతుంది అంటే నేను విన్నాను,  గుడ్డిగా నేను నమ్ముతాను , అలా అని నా విశ్వాసాన్ని ఇతరులెవరైనా అంగీకరించకపోయినా మౌనంగా ఊరుకుంటాను తప్ప వివాదానికి దిగను. 

ఎందుకంటే వేదాలు శాస్త్రాలు పురాణ ఇతిహాసాలు  అన్నీ నేను చదవలేదు వాటిని అర్ధం చేసుకోగల జ్ఞానం నా దగ్గర లేదు. ఆది అనంత శబ్దం ఓం  అని నేను అనుకోవడం పట్ల ఇతరులకి ఏమీ హాని లేదు కదా ! :) 

ప్రతి జాతికి,మతానికి. దేశానికి .ఇంకా చెప్పాలంటే ప్రతి కుటుంబానికీ తమవైన ఒక సంప్రదాయం ఉంటుంది . ఆ సంప్రదాయం ప్రకారమే నడవాలనుకుంటారు. ఏ దేశంలో ఉన్నా తమదైన సంప్రదాయాన్ని వొదులుకోవడం కష్టం .  కాలక్రమేణా అనేక  జాతులు రీతులు .సంప్రదాయాలు కలిసిపోయి కొత్త సంప్రదాయాలు ఏర్పడతాయి. మళ్ళీ అదొక సంప్రదాయంగా మారుతుంది. అనేక తరాల తర్వాత  నవ్యరీతులు తో జీవనం గడుపుతున్న వారిని ..అల్లదిగో ఆ సంస్కృతికి ఆ స్మృతికి వారసులు మీరు. మిమ్మల్ని ద్వేషించడమే మా పని. ఇంకా చెప్పాలంటే ద్వేషించడమే మా హక్కు అనే కొందరిని చూస్తూ ఉంటాం  వాళ్ళ బారిన పడకుండా మౌనంగా మన మార్గాన మనం నడుచుకుంటూ వెళ్ళడమే . ఇతరులకి హాని చేయకుండా వాళ్ళ మనసులని కష్ట పెట్టకుండా .. చదువు సంస్కారం అంటే ఏమిటో , సాంప్రదాయం అంటే  ఏమిటో తెలుసుకుని చైతన్యంగా,వివేకంగా నడవడమే ! మతం కన్నా దేశభక్తి కన్నా మానవత్వం మిన్న అని నేను ఒప్పుకుంటాను.  అలాగే పౌరులకి  దేశభక్తీ తో మెలగండి అని ఎవరూ చెప్పనవసరం లేదు. దేశ ద్రోహానికి పాల్పడకండి అని చెప్పడం సబబు. ఉత్తమ ఫలితాన్ని ఆశించాలనుకున్నప్పుడూ ఎలా చెపుతున్నాం అనేది కూడా చూసుకోవాలి అని నా అభిప్రాయం.  
చిన్నప్పుడు నుండి నేను రేడియోలో విన్న దేశభక్తి గీతం ఇదిగోండి ..మీరూ వినండి . "జయ భారతి -వందే భారతి"

19, డిసెంబర్ 2017, మంగళవారం

జపాకుసుమాల జావళి

మా వరండా తోటలో విరబూసిన .. మందారాలతో ..ఒక చిత్రాన్ని రూపొందించాను . 
చూడండి  మరి ..
ఈ చిత్రంలో వినిపించిన సంగీతం ఆకాశవాణి కడప కేంద్రం ప్రసారంచేసే "క్రాంతిరేఖలు " కార్యక్రమం సిగ్నేచర్ ట్యూన్ అని గమనించమనవి.
 ధన్యవాదములతో ..

వీడియోని చూడండి ఈ లింక్ లో .. ప్రశ్న ఒక్కటేగా !

ప్రశ్న ఒక్కటేగా !

సమాధానాలు పై వన్నీ ఎందుకయ్యాయి అని ఆశ్చర్యపోవడం

ఇదీ చిన్న విషయమేగా అని కొట్టిపారేయలేని నీ స్థితిని

మరొకమారు గుర్తుచేస్తున్నా .. మిత్రమా !

**********

ఏం చేస్తున్నావింట్లో ఒంటరిగా

కాస్తలా బయటకి రావచ్చుగా అని నీ ప్రశ్న

గోడలతో మాట్లాడుతున్నా,బయటకొచ్చి చేసేది అదేగా అంటాను

*******

నలుగురిలో కలవకుండా ఉండటానికి యేదో ఒక వొంక వెతుక్కుంటాను

వ్యక్తిత్వాన్ని చంపుకుని నటనల ముసుగేసుకుని పొగడటం

పొగిడించుకోవడం అనివార్యంగా మారకుండా..

**********

గుర్తింపు పేరు ప్రఖ్యాతులు జలతారు పరదాల్లాంటివని

చీకట్లో తప్ప తమ జిలుగులని విరజిమ్మ లేవని అనుభవమయ్యాక

ఆర్టిఫిషియల్ గా(అసహజంగా ) విచ్చుకుంటున్న మొగ్గల మధ్య

పరిమళించి నలుగురి కంటాపడనీ అడవిపూల వునికి ఎందుకని..

**************

సరిహద్దులకావల జరిగే సభల్లో సన్మానాలకై

వరుసలో వేచి ఉన్న ప్రయాణికుడి పరాభవం నాకెందుకు గానీ

పార్కులో పిల్లల మధ్య పద్యాన్ని నిలబెట్టి

సామూహిక గానంలో గొంతుకలుపుతుంటాను.

********************

కవితో కథో .. అక్షరాల సీతాకోక చిలకలై విహరించాల్సింది

పని ప్రదేశాలలోనో ,పాఠశాలల వనాల్లోనో కానీ

రాజకీయ వేదికలపై కాదనీ .

(ప్ర తె మ స లో చోటు దొరకలేదని బాధపడే వారి కోసం)


18, డిసెంబర్ 2017, సోమవారం

అడవి పూవందం

ఈ అడవి పూవందం చూడండీ ! 
అచ్చు మన గోగు పువ్వు లా గా ఉంది కానీ గోగు పువ్వు మాత్రం కాదు . బ్రెజిల్ లో  బొటానిక్ గార్డెన్లో ఉంది . అలాగే అక్కడక్కడా ఆఫ్రికా అడవుల్లో కనబడుతుందని చదివాను . గూగుల్ సెర్చింగ్ లో ఈ అందం ఆకర్షించి వివరాల కోసం ప్రయత్నిస్తే చాలా కష్టం మీద వివరాలు దొరికాయి. ఆ వివరాలు చిత్రం క్రింద పొందుపరిచాను. .. చూడండి . 


Turnera subulata Sm.
Common name
English: White buttercup
Classification
Kingdom: Plantae (2505)
  Phylum: Magnoliophyta (2404)
    Class: Magnoliopsida (2036)
      Order: Malpighiales (93)
        Family: Passifloraceae (10(family description)
          Genus: Turnera (3)
           Epithet: subulata Sm. (3)

subulata => awl-shaped
Characteristics
Climate: tropical
Habit: herb
Flower colour: yellow

Flower: Botanical Garden, Brasilia, DF, Brazil; 3/2012 © (కాపీ రైట్ ఉన్న చిత్రం ఇది ) 

Pinterest సౌజన్యంతో .. ఈ చిత్రం. 9, డిసెంబర్ 2017, శనివారం

ఏమడిగాను నిన్ను ?


చూడు, నీ కోసం ఏమి తెచ్చానో..
మనసంత స్వచ్చమైన సుకుమారమైన పువ్వులని
గిలిగింతలు పెట్టే సంభాషణా చాతుర్యాన్ని
గండు కోయిల రాగాలని అడవిపూల సుగంధాన్ని
వేయి వేణువుల నాట్యాన్ని
గతజన్మలోని జ్ఞాపకాలనీ

చిన్నపిల్లలా మారాం చేస్తున్నావ్ అనుకున్నానిన్నాళ్ళు కానీ
హటం వేసుకుని  రాతి గోడల మధ్య కూర్చున్నావని.
రేయంతా జాగారమే...
మూసుకున్న రెక్కల వెనుక ఈ రెప్పల వెనుక
రేపటి మన  కలల వస్త్రాన్ని నేస్తూ...

ప్రొద్దున్నే లేచి ఈ భిక్షువుని  తిరస్కారంగా చూస్తూ
చేయి విసురుతావని తెలుసు
కోపంగా రాల్చిన  పుప్పొడి మాటలనేరుకుంటూ
నవ్వుకుంటాను. మరింత  వోపికనివ్వమని వేడుకుంటాను. 

ఏమడిగాను నిన్ను?
హృదయంలో కాస్తంత జాగా నే కదా !
నాలుగునాళ్ళు నీతో కలిసి చేసే
ప్రయాణం కోసమే కదా ఈ అర్దింపు.
4, డిసెంబర్ 2017, సోమవారం

వాట్టే సాంగ్ ..ఈ పాట వినడమే కానీ ..ఎప్పుడూ చూడనే లేదు . చిలక జోస్యం చిత్రంలో పాట.  చంద్రమోహన్ - రాధిక లపై చిత్రీకరించిన యుగళగీతం. 
వేటూరి గారి సాహిత్యం , సంగీతం : కె వీ , మహదేవన్ 
గళం : పి.సుశీల ,ఎస్.పి.బాలసుబ్రమణ్యం గార్లు .  

ఎదలో మోహన లాహిరీ
ఎదుటే మోహన అల్లరీ
ఈ అల్లరి పల్లవిలో..మల్లెల పల్లకిలో
ఊరేగేదెప్పుడో మరి
ఎదలో మోహన లాహిరి
ఎదుటే మోహన సుందరి
ఈ అల్లరి పల్లవిగా..ఇద్దరు ఒక్కరుగా
పెనవేసుకుపోతే సరి
ఎదలో మోహన లాహిరి
ఎదుటే మోహన అల్లరి
చరణం 1:
చంద్రమోహనం ఆ వదనం
చందన కలశం ఆ నయనం
చంద్ర మోహనం ఆ వదనం
చందన కలశం ఆ నయనం
ఆ చల్లని వెచ్చనిలో.. వెచ్చని కౌగిలిలో
నే కరిగేదెప్పుడో మరీ
చుక్కల నీడల వెన్నెల వాడల
రమ్మని చూపుల రాయని జాబులు
చుక్కల నీడల వెన్నెల వాడల
రమ్మని చూపుల రాయని జాబులు
రాతిరికొస్తే సరి.. సరాసరి..
ఎదలో మోహన లాహిరి
ఎదుటే మోహన అల్లరి
ఈ అల్లరి పల్లవిగా..ఇద్దరు ఒక్కరుగా
పెనవేసుకుపోతే... సరి
చరణం 2:
నవ్య నందనం ఆ జవనం
అమృతమధురం ఆ అధరం
నవ్య నందనం ఆ జవనం
అమృతమధురం ఆ అధరం
ఆ నవ్వుల మత్తులలో.. మత్తుల మెత్తనలో
నేనొదిగే దెపూడో మరీ ..ఆ ఆ ఆ...
దిక్కుల చాటుగా దేవుని తోడుగా
మక్కువ పందిట చిక్కని సందిట
దిక్కుల చాటుగా దేవుని తోడుగా
మక్కువ పందిట చిక్కని సందిట
ఒక్కటి అయితే సరి..సరే సరి
ఎదలో మోహన లాహిరి
ఎదుటే మోహన సుందరి
ఈ అల్లరి పల్లవిగా.. ఇద్దరు ఒక్కరుగా
పెనవేసుకుపోతే సరి
ఈ పాటని ఈ లింక్ లో వినేయండి ..వావ్ అనకపోతే ..సరి ..సరే సరి