ప్రశ్న ఒక్కటేగా !
సమాధానాలు పై వన్నీ ఎందుకయ్యాయి అని ఆశ్చర్యపోవడం
ఇదీ చిన్న విషయమేగా అని కొట్టిపారేయలేని నీ స్థితిని
మరొకమారు గుర్తుచేస్తున్నా .. మిత్రమా !
**********
ఏం చేస్తున్నావింట్లో ఒంటరిగా
కాస్తలా బయటకి రావచ్చుగా అని నీ ప్రశ్న
గోడలతో మాట్లాడుతున్నా,బయటకొచ్చి చేసేది అదేగా అంటాను
*******
నలుగురిలో కలవకుండా ఉండటానికి యేదో ఒక వొంక వెతుక్కుంటాను
వ్యక్తిత్వాన్ని చంపుకుని నటనల ముసుగేసుకుని పొగడటం
పొగిడించుకోవడం అనివార్యంగా మారకుండా..
**********
గుర్తింపు పేరు ప్రఖ్యాతులు జలతారు పరదాల్లాంటివని
చీకట్లో తప్ప తమ జిలుగులని విరజిమ్మ లేవని అనుభవమయ్యాక
ఆర్టిఫిషియల్ గా(అసహజంగా ) విచ్చుకుంటున్న మొగ్గల మధ్య
పరిమళించి నలుగురి కంటాపడనీ అడవిపూల వునికి ఎందుకని..
**************
సరిహద్దులకావల జరిగే సభల్లో సన్మానాలకై
వరుసలో వేచి ఉన్న ప్రయాణికుడి పరాభవం నాకెందుకు గానీ
పార్కులో పిల్లల మధ్య పద్యాన్ని నిలబెట్టి
సామూహిక గానంలో గొంతుకలుపుతుంటాను.
********************
కవితో కథో .. అక్షరాల సీతాకోక చిలకలై విహరించాల్సింది
పని ప్రదేశాలలోనో ,పాఠశాలల వనాల్లోనో కానీ
రాజకీయ వేదికలపై కాదనీ .
(ప్ర తె మ స లో చోటు దొరకలేదని బాధపడే వారి కోసం)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి