చూడు, నీ కోసం ఏమి తెచ్చానో..
మనసంత స్వచ్చమైన సుకుమారమైన పువ్వులని
గిలిగింతలు పెట్టే సంభాషణా చాతుర్యాన్ని
గండు కోయిల రాగాలని అడవిపూల సుగంధాన్ని
వేయి వేణువుల నాట్యాన్ని
గతజన్మలోని జ్ఞాపకాలనీ
చిన్నపిల్లలా మారాం చేస్తున్నావ్ అనుకున్నానిన్నాళ్ళు కానీ
హటం వేసుకుని రాతి గోడల మధ్య కూర్చున్నావని.
రేయంతా జాగారమే...
మూసుకున్న రెక్కల వెనుక ఈ రెప్పల వెనుక
రేపటి మన కలల వస్త్రాన్ని నేస్తూ...
ప్రొద్దున్నే లేచి ఈ భిక్షువుని తిరస్కారంగా చూస్తూ
చేయి విసురుతావని తెలుసు
కోపంగా రాల్చిన పుప్పొడి మాటలనేరుకుంటూ
నవ్వుకుంటాను. మరింత వోపికనివ్వమని వేడుకుంటాను.
ఏమడిగాను నిన్ను?
హృదయంలో కాస్తంత జాగా నే కదా !
నాలుగునాళ్ళు నీతో కలిసి చేసే
ప్రయాణం కోసమే కదా ఈ అర్దింపు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి