12, జులై 2016, మంగళవారం

పూల కథమొగ్గ పగిలింది
పరిమళం ప్రవహించింది
మధుపం నాట్యమాడింది
ఇది కేవలం ఒక కథ
ఇది నిజం కాదు ..
అని మీరనుకుంటే అది మార్చవచ్చు
జీవితం మీరనుకున్నట్లు జరిగేది కాదు కానీ..
కథ కూడా మీకనుగుణంగానే
మీ నుండే జరుగుతుంది
అది తెలుసుకుంటే ....
అమాయకత్వం అనే చీకటి ఖైదులో
నిన్ను నీవు బంధించుకోవడం ఎందుకు ?
తలంపులే శాపవనంలో పూల మొక్కలు
నీవో వేరెవరివో  ..
పుప్పొడి ప్రశ్నలై  సమానాధాల ఫలదీకరణ కై
శూన్యంలో చక్కర్లు కొడుతుండేవే కథలు
ముగిసిపోయే కథలు ముగింపబడ్డ కథలు
కాలక్షేపపు జీవితాల కథలు.
అతిధులగా భువికి వచ్చిన వారి కథలు
ఈ  పూల కథలు.

పూల కథ  ఈ లింక్ లో  అచ్చులో  ...

5, జులై 2016, మంగళవారం

నెలవంక నవ్వింది

రషీద్ ... యెలా వున్నావు బేటా ! 
నువ్వెందుకో  ఫోన్ లో మాట్లాడటానికి కూడా దొరకడం లేదు. మీ అబ్బాజాన్ షెడ్ కి వెళ్ళిన తర్వాత నువ్వు ఫోన్ చేస్తావేమో నని కాయిన్ బాక్స్ దగ్గరికి వెళ్లి మీ అబ్బాజాన్ కి ఫోన్ చేస్తుంటే ఆయన విసుక్కోవడమే సరిపోయే ! వాడు ఫోన్ చేయగానే నేను పక్కింటి ఆయేషా కి ఫోన్ చేసి చెపుతానని చెప్పాను కదా, యె౦దుకు మాటి మాటికి ఫోన్ చేసి నన్ను విసుగున పెడతావ్ అని కోప్పడుతున్నాడు. తల్లి ప్రేమ ఆయనకేమి తెలుసు ? అక్కడ రోటీ, చావల్ దొరకడం లేదని చెపుతూ వుంటివి.  సరిగా భోజనం చేస్తున్నావా ?  డబ్బు యెక్కువ కూడబెట్టాలనుకుని మీ యజమానురాలు యిచ్చే నిల్వ అన్నం తిని ఆరోగ్యం పాడు చేసుకోకు. కొద్దిగా వోపిక చేసుకుని వంట చేసుకో.  నీ యజమాని  తను ఫోన్ చేయగానే మాట్లాడటానికి వీలుగా స్నానం చేసేటప్పుడు కూడా టాయ్లెట్ లోకి కూడా ఫోన్ తీసుకుని వెళ్ళాలి అని అన్నాడని చెప్పావు కదా ! మరి మీ అబ్బాజాన్ ఫోన్ చేసినా నువ్వు యె౦దుకు ఫోన్ తీయడం లేదు. నాకు భయంగా వుంది బేటా ! యెట్లా ఉన్నావ్ ?

మన చుట్టుపక్కల వాళ్ళు  గల్ఫ్ కి పోయినవాళ్ళ కష్టాలు కథలు కథలుగా చెప్పుకుంటా వుండారు . నువ్వు క్షేమంగా వుండాలని దువా చేస్తున్నా ! తమ్ముళ్ళు ,చెల్లెలు అందరూ బాగున్నారు. అందరూ రోజా పాటిస్తున్నారు.  ఇఫ్తార్‌  సమయాన అందరూ నిన్ను తలుచుకుంటూ వుండారు. నువ్వు సౌదీకి వెళ్ళాక వొక రంజాన్ అయిపొయింది వొక దీపావళి అయిపొయింది . నువ్వు వెళ్ళడం నాకు యిష్టం లేకపోయినా నువ్వు వెళ్ళావ్ . నీకు వత్తాసు మీ అబ్బాజాన్ . దేశాలు తిరగాలి . బతకడం యెట్టాగో తెలుస్తుంది అని . మీ యజమాని సహృదయుడు కాదని చెప్పావు . ఆ విషయం గురించే నా దిగులంతా . ఇంట్లో పనిచేసే వొక కేరళ ఆమె అతని అనుమతి లేకుండా భర్తతో మాట్లాడిందని యజమాని ఆమెని చేయి చేసుకున్నాడని చెప్పావ్ . పక్కింటి వాళ్ళతో మాట్లాడవద్దని యజమానురాలు ఆంక్షలు. ఇవ్వన్నీ నీ మాటల్లో విన్నప్పుడు నా దిగులు యింకా ఎక్కువయ్యేది. యజమాని అంటే పనివాళ్ళ పట్ల దయతో ,ప్రేమతో ఉండాలి . కానీ  మీ యజమానికి అవేమీ లేనట్లు ఉన్నాయి. అందుకే భయపడుతున్నాను.   

చెల్లి బాగా చదువుకుంటుంది. స్కాలర్ షిప్ కూడా అందుతుంది. ఉదయం సాయంత్రం కరాటే క్లాసులకి వెళుతుంది. మన వాళ్ళ౦దరూ తప్పు పడుతూ  వుంటే మీ అబ్బాజాన్ వాదించాడు . రోజులెట్లా వున్నాయి ఆడపిల్ల కాలు బయట పెడితే బతకనిచ్చేతట్లు లేదు. ప్రతి చోటా పోలీస్ పోయి సాయం చేయగలడా? అందుకే ఈ విద్యలు నేర్వాలి అన్నాడు.  లోకం చాలా పాడై పోతుంది బేటా ! తల్లిదండ్రులు, గురువులు, మత గ్రంధాలు అందరూ మంచే చెబుతారు. మరి చెడు యెక్కడి నుండి వస్తుందని ఆలోచించాలి. మన మధ్య సైతానులు వున్నారు. బూతు చిత్రాలు, సినిమాలు చూపించి  పిల్లలని చెడగొడుతున్నారు. మన పేదరికాన్ని ఆసరా చేసుకుని అరబ్ షేక్ లు మన ఇండియాకి వచ్చి చిన్న చిన్న పిల్లలని పెళ్లి చేసుకుని సరదా తీర్చుకుని వదిలేసి పోతుంటారు, యెన్ని వినలేదు మనము . అలాంటిది వాళ్ళ యింటి ఆడవాళ్ళపై యెవరి చూపు  పడినా  నరికి పారేస్తారు యిక్కడ.అంత క్రూరంగా వుంటారు. ఒక మతం అన్నమాటే కానీ తోటి వాళ్ళని ముఖ్యంగా మన ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళని బానిసల కన్నా హీనంగా చూస్తారని నువ్వు చెప్పాక ఎన్నో రాత్రులు నిద్ర పట్టక  అటు ఇటు పక్క మార్చుకోవడమే సరిపోయేది. నా ఆలోచనలన్నీ మీ అబ్బాజాన్ కి చెప్పేదాన్ని కాదు . ఆయన నాకన్నా దైర్యంగా వున్నప్పుడు యిలాంటి విషయాలన్నీ చెప్పి ఆయన్ని కూడా దిగులు పడేటట్టు చేయడం యె౦దుకని. 


ఏ యింటికి  ఆ యింటికే సమస్యలు వున్నట్టు యే దేశానికి ఆ దేశానికే సమస్యలు వుంటాయి.సర్వ మానవ హితమే మన మతం అని చెప్పిన వివేకానందుడు అంటే నీకెంతో యిష్టం కదా ! ఆయన స్పూర్తి నీలో నిండుకుని వుంది. అందుకే మంచి చెడుని విచక్షణ తో చూడగల్గుతున్నావని నాకర్ధమైనప్పుడు గర్వంతో పొంగిపోతాను. అంతా నా పోలికే అని మీ అబ్బాజాన్ మురుసుకుంటాడు. హిందువుల అమ్మాయిని.  మీ అబ్బాజాన్ ని  నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడే నా గురించి అన్నీ మర్చిపోయాను. అలాగే మీ అబ్బాజాన్ మూఢ విశ్వాసాలనీ యింటి గడప తొక్క కుండా వూడ్చి పారేసాడు . మన యింట్లో రెండు పండగలు.  మన చుట్టూ పక్కల వాళ్ళ హితమే మన హితం. ఎదుటి వాళ్లకి యేమి జరగాలని కోరుకుంటామో అదే మనకి దక్కుతుంది అంట. అందుకే మాకు దైర్యం . నువ్వు యెక్కడ వున్నా మంచిగానే వుంటావని. 

నీ యజమాని ఫోన్ కి ఫోన్ చేస్తున్నాం . అతను ఫోన్ కట్ చేస్తున్నాడు . నీకు వీసా యిప్పించిన హైదరాబాద్ మనిషికి ఫోన్ చేస్తే మీ అబ్బాయి ఆ యజమాని దగ్గర వీసా కాన్సిల్ చేసుకుంటున్నాడు అని చెప్పాడు . నీకు అసలే కోపం యెక్కువ. మీ యజమాని అవమానంగా మాట్లాడితే అసలు వోర్చుకోలేవు.ఏమైనా గొడవ జరిగిందా ? నీ ఫోన్ యేమైంది ? భయంగా వుంది  బేటా!   నువ్వు నీ వర్క్ వీసాని రద్దు చేసుకుని వచ్చేసేయి.. నీ దగ్గర డబ్బు యేమీ లేకుంటే  అస్సలేమీ సిగ్గు పడవద్దు . మీ అబ్బాజాన్ తో పాటు నేను టైలరింగ్ చేస్తూ  కొద్దిగా సంపాదించి చెల్లి పెళ్ళికి వుంటుందని కూడబెడుతున్నానని నీకు తెలుసు కదా  . ఆ డబ్బు పంపుతాను .  

వేరే చోట వుద్యోగం కోసం ప్రయత్నం చేయవద్దు . వెంటనే వచ్చేసేయి . మనము వుండేచోట పని లేకపోలేదుగా . పెద్దమ్మ కొడుకు షఫీ చెప్పాడు ఎయిర్ పోర్ట్ కి వెళ్లి వస్తే పదకొండు వందల రూపాయలు యిస్తున్నారు అంట. అక్కడ నీ జీతంతో పోల్చుకుంటే యిక్కడ కూడా తక్కువేమీ కాదు. ఆడుతూ పాడుతూ ఆల్టింగ్ డ్రైవర్ గా వెళ్ళినా ఆరు వందలు సంపాదించుకోవచ్చు. నువ్వు అక్కడ వుండవద్దు వచ్చేసేయి. మన పక్కింటి ఆంటీ వాళ్ళ అమ్మాయి సౌదీ నుండి వచ్చింది. నేను నీ సంగతి చెపితే యేమీ అవదు. భయపడవద్దు. వర్క్ వీసా వుంది కదా అని చెప్పింది. ఆమెకి యిచ్చే యీ వుత్తరం పంపుతున్నాను. మన వూరి టైలర్ అక్కడ వున్నాడు కదా! అతని దగ్గరికి ఈ ఉత్తరం అందుతుంది. అతను సెలవు రోజున నీ దగ్గరికి వెళతానని నాకు మాట యిచ్చాడు.ఈ ఉత్తరం అందగానే ముందు ఫోన్ చేయి . నువ్వు క్షేమమగా వుంటేనే .. యిక్కడ మా అందరికి  రమదాన్ పండుగ. ఉన్నదానిని నలుగురితో కలిసి పంచుకుని తినడమే కదా పండుగ . నువ్వు అక్కడ యెన్నో యిబ్బందులు పడి డబ్బు పంపితే మాత్రం నేను పాయసంలో జీడి పప్పులేసి అందరికి తినిపించగలనా! బతికి వుంటే  బలుసాకు తిని బ్రతకవచ్చు . ఇంటికి వచ్చేయి బేటా ! 

అమ్మ ప్రేమలో అతి ప్రేమ శంక వుంటాయట అని మీ అబ్బాజాన్ అంటున్నాడు. నాకవన్నీ తెలియదు. బిడ్డకి యేదో యిబ్బంది వుంది అని మనసు చెపుతుంది.   దోసెడు కన్నీటితో నా బాధ తరిగిపోయేది  కాదు. నిన్ను కళ్ళార చూసి గుండె నిండుగా హత్తుకుంటే తప్ప అన్ని దిగుళ్ళు,భయాలు పోవూ. త్వరగా వచ్చేయి బేటా!  అమ్మ యెదురు చూస్తుంది పండగ యింటికి నడచి వస్తుందని . 

ప్రేమతో ..అమ్మ .1, జులై 2016, శుక్రవారం

పురిటి గడ్డ

"ఇదిగో మేస్త్రీ .. బియ్యం కొలుస్తాను రా! గోతాము  సంచీ  తెచ్చుకో" అని పిలిచింది వర్ధనమ్మ.

"సంచీలు మా దగ్గర ఏడ  ఉండాయమ్మా! ఊరినుండి నేరుగా ఇక్కడికే కదా వచ్చాం " అనుకుంటూ వచ్చాడు మేస్త్రీ

 "ఏం పేరు నీది ? ఏ వూరు మీది ? ఎంతమంది వచ్చారు ?"

"నా పేరు ఆర్ముగమ్  అమ్మా ! తిరుత్తిణి దగ్గర సింధురాజపురం అమ్మా ! మొత్తం ఇరవై మందమ్మా!"

వరుస  ప్రశ్నలకి వరుస సమాధానాలు వింటూ సన్నగా నవ్వుకుంది రాధ.

డిసెంబర్  నెల మలి పక్షపు రోజులు వచ్చేసరికి  ప్రతి యేడు లాగానే  ఆ వూరికి వలస కూలీలు  చేరుకున్నారు  చెరుకు నరకడంలో బాగా ఆరి తేరినవాళ్ళు. అందరిని పరిశీలనగా చూస్తూ ఎంతమంది ఉన్నారో కళ్ళతో లెక్కేస్తుంది రాధ. మొత్తం ఇరవై మంది. అందులో పన్నెండు మంది  పైగా మగవాళ్ళు  ముగ్గురు ఇరవైయేళ్ళ లోపు మగ పిల్లలు, నలుగురు ఆడవాళ్ళు ఉన్నారు. మేస్త్రీ చెప్పిన లెక్క సరిపోయిందత్తమ్మా .

సర్లే ! మేమే సంచీ ఇస్తాం కానీ  కాస్త  ఆ బియ్యం బస్తాని కిందికి దించి గోడకి ఆనించి నిలబెట్టి బస్తా దారం విప్పు అంటూ కొట్టు గదిలోకి తీసుకెళ్ళి బియ్యంబస్తాల మేటు చూపించింది. ఏబై కేజీలున్న బియ్యం బస్తాని అతను కిందికి దించడానికి తంటాలు పడుతుండగా  ఈ  లోపు నేను శేరు  డబ్బా తీసుకుని వస్తాను అని లోపలి వెళ్ళింది. ఆమె డబ్బా తెచ్చేలోపు సర్రుమనుకుంటా ఒక్క లాగుతో దారాన్ని లాగేసి బస్తాలో ఉన్న బియ్యాన్ని చేతిలోకి తీసుకుని ముక్కు దగ్గర పెట్టుకుని వాసన చూస్తున్నాడు. కోటా బియ్యం కాదులే ! సున్నాలు వడ్లు కొని మిల్లులో పట్టించుకోచ్చిన బియ్యం. ఈ బియ్యం అయిపోయేటప్పటికి మీరు యెనిమిదెకరాల చెరుకు కొరవ పెట్టకుండా కొట్టెయ్యాలి అంటూ ఒక ఖాళీ యూరియా సంచీని  ఆర్ముగమ్ కి  ఇచ్చి ముందుగా ఒక గుప్పెడు బియ్యం తీసుకుని కళ్ళకద్దుకుని ఆ గోతాములో వేసింది. తర్వాత ఒకటి రెండు,ఆరునొక్కటి ,పన్నెండునొక్కటి, పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై అని అక్కడితో ఆపేసి అంతేగా ఇరవయ్యి మందేగా  అంది. అవునమ్మా అన్నాడు.

"వీళ్ళు  ఇళ్ళ దగ్గర రేషన్ బియ్యం తిన్నా  ఇక్కడికొచ్చి జీలుకర్ర మసూరి బియ్యం తిన్నాం అన్నట్టు మాట్లాడతారు" అంది కోడలితో

"అట్టా ఏమీ కాదులే అమ్మా ! మాకు ఉప్పుడు బియ్యం తినేది అలవాటు గందా, అందుకే వాసన చూసా" అని అన్నాడు తెలివిగా

ఆమాటతో శాంతించిన వర్ధనమ్మ  కొట్టంలో అటక మీద దబరలు, బిందెలు,కూరాకు సట్టిలు, గరిటలు అన్నీ ఉన్నాయి. ఆయన్నీ కిందకి దించండి. నేనొచ్చి ఎన్ని ఇచ్చానో లెక్కపెట్టుకుంటాను అంది.
బేటా  డబ్బులియ్యడం మర్చిపోయావమ్మా  అని అక్కడే నిలబడి గుర్తు చేసాడు ఆర్ముగం .  ఎంత?  మనిషికి ఇరవయ్యా ! చెరుకుకి ఫ్యాక్టరీ వాళ్ళు ఇచ్చే డబ్బులు నాలుగేళ్ళుగా  పెరగలేదు మీకు ఇచ్చేది మాత్రం ఏ యేటికాయేడు పెరిగిపోతుంది అనుకుంటూ నాలుగొందలు తెచ్చి ఇచ్చింది.

ప్యాక్టరీకి వెళ్ళి ఫీల్డ్ మేన్ ని పట్టుకుని  నాలుగు రోజులకి సరిపడా  కటింగ్ ఆర్డర్ కాగితాలని తీసుకుని ఇంటికొచ్చిన నాయుడు చొక్కా విప్పి గోడకున్న వంకీకి తగిలిస్తూ  నిన్న ఫీల్డ్ మెన్ చెపుతున్నాడు. ఈ యేడు టన్నుకి మూడొందలు ఇస్తే కానీ చెరుకు తోటలోకి దిగమని అన్నారంట. ఎన్ని టన్నులు నరికితే అన్ని డబ్బులు ఆళ్ళకి. వాళ్ళ పనే బాగుంది. ఎకరాలున్నాయన్నమాటేగానీ మనకి చేతికొచ్చేదాంట్లో అన్ని ఖర్చులు తీసేస్తే మనకి అయ్యే మిగుల్తున్నాయి. అంత దండుగ మారి సేద్యమయిపోయింది అని అంటూ వచ్చి  వరండాలో ఉన్న కుర్చీలో కూర్చున్నాడు

మనకి బెజవాడ పక్కన  ఉండప్పుడూ,బళ్ళారి దగ్గర ఉన్నప్పుడూ  ఇదే  దిగులు. అక్కడ అమ్ముకొచ్చి ఇక్కడ కొని  మళ్ళీ అయ్యే తిప్పలు. పిల్లి పిల్లలని  నోట బెట్టుకుని ఏడు ఇళ్ళు తిరిగినట్టు  అరవాళ్ళు పొట్ట బట్టుకుని తిరుగుతుంటే మనం పొలాలు బట్టుకుని నెత్తి నిండా  అప్పులు బెట్టుకుని ఊరూరా  తిరుగుతా ఉండాము అంది ఆయన పక్కనే ఉన్న ఇంకో కుర్చీలో కూర్చుంటూ.
"ముందు ముందు సేద్యం చేసేది మరిచిపోతే తప్ప అప్పుల బాధ తగ్గేటట్టు లేదు.  రణం బాధ రుణం బాధ ఒకటే నన్నారు పెద్దాళ్ళు.  అట్టాగే ఉంది  ఇప్పుడు మన పని" అన్నాడు నాయుడు.

కళ్ళల్లో ఏవేవో  దిగుళ్ళు కట్టుకొయ్యకి కట్టేసిన పెంకి పడ్డల్లే  తిరుగుతుండగా గడ్డం కింద చేయి పెట్టుకుని మౌనంగా కూర్చుంది వర్ధనమ్మ.

కోడలు రాధ అత్తమామలిద్దరికి కాఫీ గ్లాసులు ఇచ్చి వచ్చి వరండా అరుగు పై కూర్చుని  కొడుక్కి పాలు తాగిస్తూ ఉంది.  

ఆమ్మా! ఇందాక అవ్వ బియ్యం కొలిచేటప్పుడు ఆరునొక్కటి, పన్నెండు నొక్కటి పదహారున్నొక్కటి అంటుంది ఏమిటమ్మా. నువ్వూ, మా మిస్ అట్లా అనమని నాకు చెప్పలేదుగా అన్నాడు.  నాలుగేళ్ళ అబ్బయ్య బుర్ర నిండా ప్రశ్నలే ! రాధ ఓపిగ్గా అన్నింటికీ సమాధానాలు చెపుతుంది. వాళ్లకి మనం మాట్లాడే తెలుగు రాదనీ అట్టా  చెప్పిందిలే అవ్వ. నువ్వు పోయి హోం వర్క్ చేసుకో అబ్బయ్యా ! మా నాన్నవి కదూ అని బతిమలాడింది. తల అడ్డంగా ఊపుతూ ఊహూ ! నేను తర్వాత చేసుకుంటా. ఇప్పుడు వాళ్ళని నేను కూడా చూస్తా అన్నాడు . సరే రా పోదాం అంటూ కొడుకుని చంకన వేసుకుని కొట్టం దగ్గరికి వెళ్ళింది రాధ.

అప్పటికే కొట్టంలో ఉన్న పశువులన్నింటిని రోడ్డుకి ఆనుకుని వున్న చెట్లకి కట్టేసి కిందంతా శుభ్రం చేసి చెట్టు కింద పోసిన ఇసుక మట్టిని తెచ్చి గోతుల్లేకుండా సమానంగా చేసుకున్నారు.  ముగ్గురు మనుషులు తోటలోకి వెళ్లి టెంకాయ మట్టలు కొట్టుకొచ్చి ఒక్కో మట్టని రెండు భాగాలుగా  నరికి నాటిన  వెదురు బొంగులకి ఆకులని ముడేసి కట్టి  చుట్టూరా దడులు  కట్టేశారు. వాములో నుండి వరి గడ్డి తెచ్చి నేలంతా పరిచేసి పడుకోవడానికి వీలుగా తయారు చేసుకున్నారు.

రాధ చంకన ఉన్న అబ్బయ్య వాళ్ళు చేస్తున్న పనిని శ్రద్దగా చూస్తున్నాడు.  అమ్మా! వాళ్ళు  ఎందుకు అట్లా చేస్తున్నారు అడిగాడు ఆసక్తిగా . వాళ్ళది ఈ వూరు కాదుగా, ఇక్కడ వాళ్లకి ఇల్లు లేదు. రాత్రిపూట పడుకోవడానికి ఇల్లు తయారు చేసుకుంటున్నారు అని చెప్పింది.

వర్ధనమ్మ  అక్కడికి వచ్చి వీళ్ళు చూడు ఎంత తొందరగా అన్ని ఏర్పాటు చేసుకున్నారో . మనవాళ్ళకి అసలిట్టా చేతకానేకాదు. ఈ  అరవాళ్ళు ఉట్టి  మాయా ముండా  కొడుకులు ఎక్కడైనా చెలాయించుకుని బతికేస్తారు అంది .
మరి  నేను ట్రక్కులో పడుకుంటానంటేనే  కింద పడుకుంటే తేళ్ళు, పాములు తిరుగుతాయి వద్దు అంటుందిగా అవ్వ. వాళ్ళు కింద పడుకుంటే వాళ్ళని కుట్టవా అయ్యి అని అడిగాడు . కొడుకు చెంపకి చెంప ఆనించి ముద్దు పెట్టుకున్నట్టు  శబ్దం చేసి .. బంగారం వాళ్ళని అవి ఏమీ చేయవు . వాళ్ళ దగ్గర చెరుకు నరికే కత్తి  ఉంటుందని వాళ్ళ జోలికి వెళితే కత్తితో కొడతారని వాటికీ తెలుసు. అందుకే వాళ్ళ జోలికి అవి వెళ్ళవు అని మాయ చేసింది అంతకన్నా ఏమీ  చెప్పలేక.

అటక మీద నుండి సామాను దించి వాళ్లకి ఇచ్చినవన్నీ లెక్క పెట్టుకున్నాక కరంటు వైరు  బల్బులు ఇవ్వండమ్మా  అని అడిగారు. అవి ఇచ్చినతర్వాత కిందేసుకుని  పడుకోవడానికి పట్టాలు ఇవ్వండి అని అడిగాడు ఆర్ముగం. పట్టాల్లేవ్, గిట్టాల్లేవ్ మీరు ఇంటి దగ్గరనుండి దుప్పట్లు తెచ్చుకోకుండానే వచ్చారా అయ్యేసుకుని పడుకోండి. అదిగో అక్కడే ఉంది అంగడి . అన్నీ అక్కడే దొరుకుతాయి వెళ్లి కొనుక్కోచ్చుకోండి అడక్కముందే అవెక్కడ అడుగుతారో అన్నట్టు గబా గబా చెప్పేసి లోపలి వెళ్ళిపోయింది.

 గట్టిగా కొడితే ఇరవై రోజులకల్లా చెరుకు కొట్టడం అయిపోతుంది. పెద్ద పండక్కి ముందే వీళ్ళు వెళ్ళిపోతే బాగుండు.  అబ్బయ్య కి సెలవలు ఉన్నాయి కాబట్టి పుట్టింటికి వెళ్ళవచ్చు అని లెక్కలేసుకుంది రాధ..    
  .
 ఈసారి  బ్యాచ్ లో నిండు గర్భిణీ గా ఉన్నస్త్రీ కూడా వచ్చింది మేస్త్రీ ఆర్ముగం భార్య. పేరు అలివేలు  ఒంటి ఊపిరితో తిరుగుతూ ఉంది. చెరుకు తోటలో పనికి వెళ్ళకుండా వాళ్లకి వసతి ఇచ్చినచోటనే  ఉండి అందరికి వంట చేసి పెడుతుంది. ఎన్నో కానుపు అడిగింది వర్ధనమ్మ. కుడి చెయ్యి పైకెత్తి వ్రేళ్ళు దూరం చేసి చూపించింది.  వచ్చిన కూలీలకి  కొద్దిగా తెలుగు మాత్రమే  తెలుసు అవసరమయినప్పుడు ఆ తెలిసిన తెలుగులోనే అర్ధమయ్యేటట్లు చెప్పేవాళ్ళు . పని చేయించుకునే యజమాని  పనికి సంబంధించి ఏమైనా చెప్పబోతే మాత్రం చేతులు దూరంగా విదిల్చి అరచేతులు ఆకాశానికి చూపిస్తూ మీ మాటలు నాకు తెలియడం లేదు అంటూ తప్పించుకుంటారు కొందరు పని దొంగలు.అలాంటి మనిషేమో అనుకుంది కానీ  అలివేలు అసలు మాట్లాడటమే రాని  మనిషి  అని కాసేపటికే అర్ధమయ్యింది రాధకి.

అంతకు ముందు  నలుగురు ఆడపిల్లలు ఉన్నారని చెప్పు కొచ్చింది.  ఈ సారి అయినా మగ పిల్లవాడు పుడతాడని  గ్యారంటీ ఏమిటే ? అసలే ఓపిక తక్కువగా కనబడుతున్నావ్. ఎవరు పుట్టినా ఆఫరేషన్ చేయించుకో అని చెపితే  ఆ సంగతి నా మొగుడు చెప్పాలి అది నా ఇష్టం కాదు అంది సైగలతో.

"తినడానికి తిండి లేకపోయినా పిల్లలు మాత్రం దండిగా కావాలి వీళ్ళకి. ఆడైతే  ఏమిటి మగ అయితే ఏమిటీ ? ఇద్దరు చాలరా ఇంటికి.మంది ఎక్కువైతే మజ్జిగ పలుచన"అత్తగారి అవగాహన, ముందు చూపు ఎలాంటిదో తెలిసిన రాధ ఏమీ మాట్లాడలేదు.

వర్ధనమ్మ చెప్పుకుంటూ పోతూనే ఉంది. ముగ్గురు కొడుకులని పెట్టుకుని తలా నాలుగెకరాలయినా ఇవ్వకపోతే ఎట్టాగని ఇచ్చిందమ్మి ఇక్కడ కొన్నాం. అక్కడికి పోయి మాత్రం ఏమి సంపాదిచ్చారు. పిల్లలకి సరైన  చదువూ లేదు ఉద్యోగం లేదు. మీరు తప్ప ఇక్కడున్నాళ్ళంతా వైభోగంగా బతుకుతున్నారు అని దెప్పుతున్నారు బెజవాడ వాళ్ళు.  మీకు ఒక్కొక్కళ్ళు చాలులే. వాళ్ళని బాగా చదివిచ్చుకుంటే చాలు అంది.

 సూక్ష్మంగా  ఆమె  ఏమి చెప్పిందో అర్ధం చేసుకుంది రాధ . అయినవాళ్ళు  చూసేచిన్న చూపు, ఎగతాళి మాటలు,ధన బలం ముందు వ్యవసాయాన్ని నమ్ముకుని బక్క చిక్కి పోతున్న తమ బతుకులని తలుచుకుని  అత్త బాధ పడుతుంది అని అర్ధమై  అన్ని కాలాలు ఒకటిగా ఉండవు. మనకి మంచి కాలం ముందు ఉంది బాధపడకు అత్తమ్మా అంది.

మనసులో మాత్రం ఇంకోటి అనుకుంది. ఒకొకరికి ఒకోదానిపై ప్రీతి. అర్ముగమ్ కి మగ సంతానం కావాలని, అత్తమ్మ కేమో బంధువుల మధ్య బిడ్డలు రాయసంగా బతకాలని.

అదే రోజు సాయంత్రం రాహుకాలం లేకుండా చూసి చెరుకు తోట దగ్గర కెళ్ళి భూమికి  పసుపు కుంకుమ పెట్టి పూలు జల్లి  పూజ చేసి కొబ్బరి కాయ కొట్టి కత్తులకి హారతిచ్చి చెరుకు నరకడం మొదలుపెట్టారు.  కానుకగా పూజ  పళ్ళెంలో  నాయుడు పెట్టిన   రెండు వందలు తీసుకెళ్ళి ఊర్లోకెళ్ళి చికెన్ తెచ్చుకుని  ఆపూట విందు చేసుకున్నారు.

మరుసటి రోజు నుండి  పొద్దు పొడవక ముందే  ప్యాంటూ చొక్కా తొడుక్కుని  నోట్లో పదుంపుల్లేసుకుని అలివేణి మినహా అందరూ తోటకేళ్ళేవాళ్ళు.  పెద్దవాళ్ళు చెరుకు నరికి ఆకు చెలిగి వెనక్కి పడేస్తూ ఉంటే  చిన్న పిల్లలు ఆడవాళ్ళు ఆ చెరుకు గడలని మనిషి మోయగల్గే బరువు ఉండేటట్టు కట్టలు కట్టేవారు. ఇంటికి వచ్చేటప్పుడు చెరుకు దవ్వ మోసుకొచ్చి పశువుల ముందు వేసేవారు. అందుకు గానూ అందరికి  టీ పెట్టుకుంటే సరిపోయి నన్ని పాలు పోసేది  వర్ధనమ్మ. రాత్రిపూట ఎక్కువగానే  వండిన అన్నంలో నీళ్ళు పోసి చద్ది చేసి పెట్టేది అలివేలు.  దాంట్లోకి ఏదో ఒక పచ్చడి నూరి పెడితే తొమ్మిదింటికి మేస్త్రీ  వచ్చి సద్ది దబరని పచ్చడిని నెత్తిన పెట్టుకుని కయ్యల్లోకి మోసుకెళ్ళేవాడు.చేను చుట్టూ వేసిన కంప చెట్లు నుండి  ఎండిపోయిన చెట్ల కొమ్మలు లాగి పుల్లలు నరికి ఇవ్వడం,   మార్కెట్  కి వెళ్లి కూరగాయలు,వంటకి కావాల్సిన సామాను తెచ్చివ్వడం  మధ్యాహ్నం వంటకి సాయం చేయడం చేస్తూ ఉండేవాడు.  అందరూ మధ్యాహ్నం అన్నానికి వచ్చి ఒక గంట విశ్రాంతిగా ఉండి మళ్ళీ పరుగులు పెట్టేవారు. వాళ్ళు వచ్చేసరికి వంట ముగించి పొయ్యి మీద నీళ్ళు పెట్టి ఉంచేది అలివేలు. చీకటి పడే సమయానికల్లా ఇంటికి చేరుకొని ఒక్కొక్కరే  వేడి నీళ్ళతో స్నానం చేస్తూ రేడియోలో  తమిళ్ పాటలు పెట్టి పాటకి అనుగుణంగా గొంతు కలుపుతూనో అన్నం తినే పళ్ళేల పై దరువేస్తూనో సందడి చేసేవారు.

ఆడవాళ్ళు  పొద్దస్తమ్ ఒంగి పంజేసి నడుం పీక్కు పోతుంది, కాస్త జండూ బామ్, టైగర్ బామో ఉంటె పెట్టమ్మా అని వర్ధనమ్మ దగ్గరికి వచ్చి అడిగితే  ఇంకొకళ్ళు కాస్త  కొబ్బరి నూనె ఎయ్యమ్మా   తల మండిపోతంది అని అడిగే వాళ్ళు. వాళ్ళు అడిగింది ఇచ్చినా ఇవ్వకపోయినా అలివేలు కి మాత్రం పొద్దునపూట నాస్టా పెట్టి ఇచ్చేది. మధ్యాహ్నం పూట అన్నంలోకి మజ్జిగ పోసేది.ఎంత బలహీనంగా ఉందో  ఎట్టా ఒడ్డున పడుద్దో ఏమో అనేది.

మగవాళ్ళు  ట్రాక్టర్ కి కానీ లారీ కి కానీ లోడింగ్ చేస్తున్నప్పుడు ఆడవాళ్ళు పని లేకుండా  ఖాళీగానే ఉండేవాళ్ళు. బట్టలుతుక్కుంటూ, తలలో పేలు దువ్వి పోసుకుంటూ అప్పటికప్పుడు కోళ్ళు కొనుక్కొచ్చి వాటిని కోసి కూరవండుకుంటూ సందడిగా ఉండేవాళ్ళు. అప్పుడప్పుడూ కొందరి మధ్య తగువులు. దినంబూ ఒక లారీకి, ఒక ట్రాక్టర్ కి సరిపడినంత చెరుకు  నరికేవాళ్ళు.  

ఒకరోజు చేటలో చిర్రాకు వేసుకుని గడ్డిపోచలు ఏరేస్తూ,  ముదురు కాడలు తీసూ కుంటూ కూర్చున్నరాధ దగ్గరికొచ్చి కాస్త  ఎడంగా క్రిందే కూర్చుంది అలివేలు. ఎందుకట్టా ఎక్కడబడితే అక్కడ కూర్చుంటావు. లేచేటప్పుడు కష్టంగా ఉంటది కదా  ఆ అరుగు మెట్టుపై కూర్చో పో అంది . నీతో మాట్లాడాలని అని సైగ చేసింది. నాతోనా ? ఏమిటి చెప్పు అంది రాధ. సైగలు చేసుకుంటూ చెప్పుకొచ్చింది. ఊర్లో ఉన్న పెద్ద కూతురు వయసు కొచ్చిందంట. సాంగ్యంగా  అన్ని వేడుకలు చేయాలని బంధువులందరూ అంటున్నారంట. పప్పన్నాలు లేవు ఏమీ లేవు శుభ్రంగా స్నానం చేయించి బడికి పంపించేయమను అని సైగ చేసింది. తల అడ్డంగా ఊపి నోటి మీద చెయ్యేసుకుని అట్టా  మాట్లాడటం చేయడం తప్పు అన్నట్టు అభినయించి చూపించింది.

ఏమో ! ఎట్టాగొట్టా చేసుకోపో అని విసుక్కుని పిల్ల పెద్దయ్యాక కూడా ఇంకా పిల్లలని కంటూ కూర్చుంటావా ? ఇకపై పిల్లలు పుట్టకుండా ఆఫరేషన్ చేయించుకో అంది.

ఒక నవ్వు నవ్వేసి కేలండర్ చూపిచ్చి  పిల్ల పెద్దదైన రోజు మంచి రోజేనా కాదా చూసి చెప్పమని అడిగింది. పిల్ల పెద్దదైన రోజు కూడా మంచి చెడూ అని నిర్దారించడం ఏమిటీ ? కేలండర్ చూసి మంచిది కాదంటే మళ్ళీ అందుకూ శాంతులు పూజలు అంటూ ఇంకో వెఱ్ఱి చేష్టలు చేస్తారు అని మనసులో అనుకుని  ఈ కేలండరు మీ కేలండర్ ఒకటి కాదు మీ వూర్లో మీ  కేలండర్ లోనే చూడాలి అని చెప్పింది. ఆర్ముగమ్ కూడా ఆ మాట నిజమేనని చెప్పక మెదలకుండా ఊరుకుంది.

అలివేలుతో మాట్లాడి మాట్లాడి  పది రోజుల్లోనే రాధకి కూడా సైగలు చేసి మాట్లాడటం అలవాటై పోయి కొడుకుతో కూడా అల్లాగే మాట్టాడుతుంటే  అబ్బయ్య కూడా అలాగే సైగలు చేసి మాట్లాడే వాడు. ఆ మూగది ఇక్కడి నుండి పోయేటప్పటికి  మీకు మూగ భాష బాగానే వచ్చేటట్టు ఉంది. టీవి లో ఆదివారం వార్తలు చదివే ఉద్యోగానికి  అప్లై చేసుకోవచ్చు అని చతురాడేవాడు అబ్బయ్య వాళ్ళ నాన్న.

నిండు కుండని నడుంపై పెట్టుకుని మోస్తూ రెండో కుండని పొట్టలో మోస్తూన్నట్టు నిదానంగా నడుస్తూ  వంట చేస్తున్న చోటుకి పంపు దగ్గరికి తిరుగుతున్న అలివేలుని ఆశ్చర్యంగా చూస్తూ ఆమె  పొట్ట అలా  ఎందుకుంది అని అడిగేవాడు అబ్బయ్య . అందులో చిన్ని బాబు ఉన్నాడు. కొన్నాళ్ళు అయినాక బయటకి వస్తాడు అని చెప్పింది. నేను కూడా అట్టాగే వచ్చానా అమ్మా అన్నాడు. అవును కదా, నీకు చెల్లో  తమ్ముడో పుట్టేటప్పుడు నేను అలాగే ఉంటాను అంది. గబుక్కున అమ్మ వొళ్ళో పడుకుని చీర చెంగు లోపలికి చెయ్యి దూర్చి అమ్మ పొట్టని ప్రేమగా తడిమాడు. మురిపంగా కొడుకుని ముద్దు పెట్టుకుని చెల్లి కావాలా తమ్ముడు కావాలా అని అడిగింది రాధ . ఇద్దరూ కావాలి అన్నాడు.  పెద్దవాళ్ళు తప్ప  పిల్లలెవరూ కనబడని ఊరు చివర పొలంలో ఉన్న ఇల్లు వాళ్ళది. ఆడుకోవడానికి తన ఈడు పిల్లలు లేని అబ్బయ్య కి అది బాగా లోటుగా ఉంది అనుకుంది రాధ.

మధ్యలో అనుకోకుండా వర్షం కురిసి నాలుగు రోజులు  పని ఆగిపోయింది, బియ్యం,బేటా  ఇస్తూ ఈ వాన ఎప్పుడు ఆగి పొద్దో పని లేకుండా రోజుకి ఇరవై మందిని భరించడం కష్టం అయిపోతుంది అనుకున్నాడు నాయుడు. వాన తగ్గి బాగా ఎండా వచ్చేసరికి ప్యాక్టరీ రిపేరుకి వచ్చింది. అది బాగై నాలుగెకరాలు చెరుకు  కొట్టేసరికి  ప్యాక్టరీ నెమ్మదిగా ఆడటం వల్ల వెళ్ళిన లోడ్లు వెళ్ళినట్లే ఆగి పోయి ఉండాయని కటింగ్ ఆపారు.ఎండలు ముదరకుండానే చెరుకు నరికితే టన్నేజీ  బాగా వస్తుందని ఆశ పడితే  ప్యాక్టరీ ఇట్టా ఏడిపిస్తుంది. ఇక  చెరుకు నరకడం పడకన పడినట్టే అనుకుని

ఆర్ముగం! మళ్ళీ  కటింగ్ ఆర్డర్  ఎప్పుడు ఇస్తారో తెలియకుండా ఉంది. ఒక పదిహేను  రోజులు తర్వాత రండి. దామరమడుగు మనోహర్ నాయుడు నాయుడు పేట ప్యాక్టరీకి తోలుతున్నాడంట. బ్యాచీ కావాలని అడిగాడు.మిమ్మల్ని పంపుతానని చెప్పా,  గబాల్న అక్కడికి పోండి  లేకపోతే  ఎవరో ఒకరు పోతారు అక్కడికి అని తొందరపెట్టాడు నాయుడు.

నాయనా! ఈళ్ళని పంపించేస్తే మళ్ళీ బ్యాచీ దొరుకుద్దో లేదో,  ఈళ్ళతో వరి కోతలు కోయిస్తే సరి అన్నాడు. వరి కోత  కూలికి ఈళ్ళు పనిచేయరు. చెరుకు నరికినంత కూలి అడుగుతారు. జడ కట్టకుండా పెరిగిన చెరుకు ఎడాపెడా పడి నరకడం ఆలస్యం అవుతుందని టన్నులు ఎక్కువ రాలేదని గోల చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఉండమన్నామంటే    అడ్వాన్స్ ఇవ్వమని పీక్కూ  తింటారు. తర్వాత అయిపు లేకుండా జారుకుంటారు . అవసరమైనప్పుడు పది  రూపాయలు ఎక్కువ పడేసయినా పని చేయించుకోగలం కానీ పని లేనప్పుడు వీళ్ళని జాలిపడి కూడా భరించలేము  ఆళ్ళని పోనీయరా అన్నాడు కొడుకుతో. నాయన చెప్పిన మాట నిజమే అనుకున్నాడు చిన్న నాయుడు.

ఆ రోజే అందరూ మూటాముల్లె సర్దుకుని దామరమడుగు వెళ్ళడానికి సిద్దమై పోయారు . వెళ్ళేటప్పుడు అలివేలు రాధ దగ్గరికి వచ్చి చీరలిమ్మని అడిగింది. రెండు కాటన్ చీరలిచ్చింది.  ఇంకా ఈడీడ ఎందుకు తిరుగుతావ్ గాని ఇంటికిపో, నెలలు నిండే టప్పుడు ఇంటికాడ ఉంటే మంచిది అంది వర్ధనమ్మ.  తలూపి నవ్వుతూ  అమ్మ చంకలో ఉన్న అబ్బయ్య బుగ్గ లాగి ముద్దు పెట్టుకుంటూ వెళ్ళింది.

ఇది జరిగిన రెండో నాడు పెద్దాసుపత్రి  గేటు  పక్కన  గోడకానుకుని  ఏడుస్తూ కూర్చున్నాడు ఆర్ముగం. చేతిలో చిల్లిగవ్వ లేదు.  దగ్గరలో ఉన్న అతనికి తెలిసిన వాళ్ళ దగ్గర ఉండే అవకాశమే  లేదని అతనికి తెలుసు. చేయడానికి పనిలేక తినడానికి తిండి లేక పొట్ట చేత్తో పట్టుకుని ఊరు కాని ఊరుకి వలస వచ్చిన  వాళ్ళు అందరూ.  అంతకు ముందు చెరుకు నరికిన పనికి  వచ్చిన లెక్కంతా పోస్ట్ ఆఫీస్ కెల్లి ఎవరి  ఇళ్ళకి  వాళ్ళు మనియార్డర్ చేసుకున్నారు.ఇప్పుడు ఎవరిని అడిగినా పైసా కూడా అప్పు పుట్టదు. ఆర్ముగమ్  కి తెలిసిన మనిషి నాయుడు ఇంటికి పోవాలన్నా భార్య శవాన్ని బిడ్డని వేసుకునే వెళ్ళాలి.  ఆర్ముగం కి కన్నీళ్లు కారిపోతున్నాయి  భార్య పాత చీర చించి పుట్టిన బిడ్డని  వీపుకి కట్టుకున్నాడు. రెండు చేతులతో భార్యని ఎత్తుకుని టౌన్ బస్ ఎక్కి  కూర్చున్నాడు. డ్రైవర్ కి  విషయం తెలిసి చచ్చిపోయిన మనిషిని పెట్టుకుని బస్ ఎక్కావేమిటయ్యా ! అన్నాడు .

బాబు మీ కాళ్ళు పట్టుకుంటా. నా దగ్గర డబ్బుల్లేవ్. కొద్దిగా జాలి చూపించి  స్టేషన్ దగ్గర దించమని బతిమలాడుకున్నాడు.  సర్లే ! ఎవురన్న అడిగితే భార్యకి బాగోలేదని చెప్పు, చచ్చిపోయిందని చెప్పకు అంటూ వెనక సీట్లో కూర్చో బెట్టాడు.స్టేషన్ దగ్గరకి రాగానే బస్ ఆపి  దిగేటప్పుడు డ్రైవర్ కండక్టర్ చెరో వంద రూపాయలు అతని జేబులో పెట్టారు.

భార్య శవాన్ని రెండు చేతుల్లో మోస్తూనే రైల్వే స్టేషన్ లోకి అడుగు పెట్టాడు. వీపున ఉన్న పసి గుడ్డు ఏడుపు మొదలపెట్టాడు. చేతుల్లో ఉన్న శవాన్ని గోడ వారగా పడుకోబెట్టి టీ  అంగడి దగ్గరికి వెళ్లి పసి గుడ్డు ఏడుస్తా ఉన్నాడు . వాళ్ళమ్మకి ఆరోగ్యం బాగాలేదు. కాసిని మంచి పాలు ఇయ్యండి బాబూ అని అడిగాడు. టీ షాప్ అతను ఆర్ముగం చేతిలో పసి గుడ్డుని అనుమానంగా చూసాడు. వీడెవడో రోజుల పసి గుడ్డుని వేసుకుని తిరుగుతున్నాడు. వీడి వాలకం చూస్తుంటే వేరొకరి పిల్లాణ్ణి ఎత్తుకోచ్చినట్టు ఉంది అనుకుంటూనే పాలు కలిపి ఇచ్చి ఒక స్పూన్ కూడా ఇచ్చాడు.

ఆర్ముగం వీపున కట్టుకున్న బిడ్డని  ఒళ్ళోకి  మార్చుకుని గ్లాస్ లో ఉన్న వేడి పాలని నోటితో ఊపి ఊపి చల్లారాయి అనుకున్నాక బిడ్డనోట్లోకి  పోస్తున్నాడు.  ఆకలి  తీరిన బిడ్డ చిన్నగా నిదరపోయింది అనుకున్నాక మళ్ళీ బిడ్డని వీపున గట్టుకుని టీ  కొట్టు దగ్గరికి వచ్చి ఈ పాలు ఏదన్నా సీసాలో పోసి ఇవ్వు బాబూ అని అడిగాడు. ఒరేయ్ ఒక చిన్న సీసా చూసి శుభ్రంగా కడిగి ఇయ్యిరా. పసి బిడ్డకి పాలు పోసి ఇవ్వాలి అన్నాడు. ఒక ప్లాస్టిక్ బాటిల్ లో పాలు పోసి ఇచ్చాక ఆ సీసాని స్పూన్ ని  ప్యాంటు జేబులో పెట్టుకుని మళ్ళీ భార్య శవన్ని రెండు చేతుల్లోకి తీసుకోబోతే కాళ్ళు చేతులు బిగదీసుకుపొయి ఎంతకీ ఒంగక పోయేటప్పటికి కడుపులో నుండి ఏడుపు తన్నుకొచ్చింది అతనికి. ఏడుస్తూనే ఈసారి చేతుల్లో  అడ్డంగా  కాకుండా   భుజాన వేసుకుని ముందు నడుస్తున్న అతన్ని కొంతమంది ఆగి ఆశ్చర్యంగా చూసారు. కొంత మంది పరిశీలనగా చూసారు.

స్టేషన్ లోపలకి అడుగుపెట్టబోతున్న అతన్ని  రైల్వే పోలీస్ ఆపేసి "ఏమైంది ..ఆమెని ఎందుకు అట్టా  భుజాన మోసుకెళ తన్నావ్  అని అడిగాడు. నా భార్య సార్ ఆమెకి  ఆరోగ్యం బాగుండలేదు. మా వూరికి తీసుకెళతన్నా అన్నాడు. ఆరోగ్యం అంత బాగుండలేని మనిషిని కూర్చో పెట్టి ఏమి తీసుకెలతావ్, హాస్పిటల్ కి తీసుకుపో ముందు అన్నాడు. లేదు సామీ ..ఇంటికే తీసుకుపోవాలి అనుకుంటూ ముందు కదిలాడు. వెనక నుంచి ఆర్ముగం భుజాన వేలాడుతున్న మనిషి చూడగానే పోలీస్ కి అనుమానం  వచ్చి గబ గబా ముందుకెళ్ళి వెళ్ళనీయకుండా ఆపేసి టికెట్ తీసుకోకుండా ఎక్కడికి జొరబడతన్నావు  ఆ మనిషిని ఆ బెంచీ మీద కూర్చో బెట్టి టికెట్స్ తీసుకో.. పో అన్నాడు. "అయ్యా !నా దగ్గర టికెట్ కూడా సరిపడా  డబ్బుల్లేవ్. బతుకు తెరువుకి ఈ వూరి కొచ్చాం. దయతలిచి వదిలేస్తే ఎట్టాగొట్టా మా ఊరుకి చేరుకుంటాం, వదిలేయండి బాబూ! " అన్నాడు."అదెట్టా కుదురుద్ది టికెట్ లేకుండా మీరసలు లోపలి పోడానికే లేదు. వెళ్ళు వెళ్ళు ..బయటకి పో ముందు అంటూ తరిమేసాడు.

పుట్టింటికి వెళ్ళడానికి స్టేషన్కి వచ్చి  క్యూలో నిలబడి టికెట్ తీసుకుంటున్న రాధ చూపు ఆర్ముగమ్  మీద పడింది. టికెట్ తీసుకుని ఒకచేత్తో బేగ్ ని రెండో చేత్తో కొడుకు చేయి పట్టుకుని వెనుక నుండి  ఆర్ముగమ్  దగ్గరికి వచ్చింది. బయటకొచ్చి భార్య శవాన్ని రోడ్డు పై పడుకో బెట్టి పెద్దగా  అలివేలూ ఇప్పుడు నిన్నేమి చేయనే  అని ఏడుస్తూ మీద పడిపోయాడు.  టీ షాపతను కొట్టు వదిలేసి గబ గబా అక్కడికి వచ్చాడు. రాధ నిశ్సేస్టురాలై నిలబడి పోయింది.
ఆర్ముగమ్   అలివేలుకి  ఏమైంది ? అనడిగింది ఆందోళనగా.అతనికి తెలిసిన మనిషి ఒకరు కనబడే టప్పటికి కడుపులో నుండి దుఃఖం  తన్నుకొచ్చింది .  "ఇంకెక్కడి అలివేలమ్మా! చచ్చిపోయింది. ఇదిగో.. నేను అడిగిన మగ బిడ్డని నాకిచ్చి అది చచ్చిపోయింది " అన్నాడు అలివేలుని చూపిస్తూ.

మొన్న మా చేను కాడి నుండి  వెల్లిపోయేటప్పుడు బాగానే ఉందిగా ? నివ్వెరపోతూ  అంది

అప్పుడు బాగానే ఉందమ్మా !  నిన్న మధ్యాహ్నం మేము కటింగ్ కి పోయాక నొప్పులు వచ్చాయంట.చేను చానా దూరం. ఎవరో మహానుభావుడు ఆటో ఎక్కించుకెల్లి నెల్లూరు పెద్దాసుపత్రిలో వదిలేసి పోయాడు. నాకు తెలిసి నేను ఆడకి ఎల్లే సరికే ఆసుపత్రిలో వాళ్ళు నీ పెళ్లామేనా ఆమె. ఇదిగో ఈ  బిడ్డని కనీ చచ్చిపోయింది. ఇదిగో బిడ్డ అంటూ నా చేతుల్లో పెట్టి   మార్చురీలో ఉంచాం శవాన్నిచూసుకుందువుగాని రా అని చెప్పి దీన్ని నాకిట్టా ఇచ్చారమ్మా ! రాత్రి తెల్లార్లూ పసి బిడ్డని పెట్టుకుని అట్టాగే ఉండి తెల్లారి ఊరికి తీసుకుపోవాలని ఇట్టా.. అని చెప్పి మళ్ళీ ఏడుపు అందుకున్నాడు.

నిన్న  నేనూ హాస్పిటల్ కి వచ్చాను అలివేలు నాకప్పుడు కనబడలేదు బాధ పడుతూ  చెప్పింది.  స్టేషన్ లోపలి వెళ్ళే వాళ్ళు బయటకి వచ్చేవాళ్ళు అక్కడ కాసేపు ఆగి చూసి అయ్యో పాపం అని జాలి పడి వెళ్ళిపోతుంటే, ఇంకొందరు ఇది ఇంకో రకం ప్రయాణం అనుకుంటూ తేలికగా తీసుకుని  వారి ప్రయాణం వైపు వారు సాగిపోతున్నారు.

అలివేలూ.. పిల్లకాయలు అమ్మేది అని అడిగితే నేను ఏమి చెప్పనే ! నువ్వు రానన్నా నేనే నిన్నిక్కడికి  తీసుకొచ్చి ఈ  గతి పట్టిచ్చానే . చేతిలో చిల్లిగవ్వలేదు.అయినాళ్ళు ఎవరూ లేరు, దేవుడా! నా బిడ్డలకి ఆళ్ళ అమ్మని ఆఖరి చూపు కూడా చూసుకోకుండా చేస్తన్నావు  కదా  అని గట్టిగా ఏడ్చాడు. దిక్కుతోచని  స్థితిలో కుళ్ళి కుళ్ళి ఏడుస్తూన్న  ఆర్ముగమ్  ని చూసి కదిలిపోయింది.  మొన్నటి దాకా ఇరవై రోజులపాటు  తన కళ్ళ ముందు తిరిగిన అలివేలు. బిడ్డలు గురించి ఎన్ని కబుర్లు చెప్పిందో, ఎన్ని కలలు కందో. ఇప్పుడిలా నిర్జీవంగా నడి  రోడ్డుపై పడి ఉండటం  చూసి కన్నీరు కార్చింది రాధ. మరుక్షణం  తన పర్స్ లో ఉన్న డబులన్నీ తీసి అతనికిచ్చేసింది.

ఆ డబ్బు తీసుకుని ఆమెకి దణ్ణం పెట్టి  ఎట్టా గొట్టా  తిరపతి దాకా పొతే చాలమ్మా .అక్కడినుండి మా వూరికి ఎట్టాగైనా  వెళ్లిపోగలను.తిరపతి దాక వెళ్లేదే కష్టంగా ఉంది  తల్లీ  ! బస్ ఎక్కనీయరు,బండి ఎక్కనీయరు నేనేం చేయాలమ్మా ఇప్పుడు. కారుకి కిరాయి కట్టుకుని నేను తీసుకుపోగాలనా ? అన్నాడు. అదంతా చూస్తున్న  టాక్సీ స్టాండ్ లో  వాళ్ళు ఆటోవాళ్ళు, టీ కొట్టు అతను అందరి మనసు ద్రవించిపోయింది. వెంటనే   తమ జేబుల్లో నుండి ఎంత డబ్బు ఉంటే  అంత  తీసి  అర్ముగానికి ఇచ్చారు. అంతే కాదు  అప్పటికప్పుడు ఆరు వేల రూపాయలిచ్చి  అద్దెకి  కారుని మాట్లాడిపెట్టారు. ఆ కారు కిరాయి తను ఇస్తానని రైల్వే పోలీసు ముందుకొచ్చాడు. దేవుడు మీ అందరిలోనూ  ఉన్నాడు బాబూ!  అంటూ అందరికి దణ్ణాలు పెట్టాడు  ఆర్ముగమ్.

బతుకు తెరువు కోసం నిండు గర్భిణిగా ఉన్న భార్యని వెంట బెట్టుకోచ్చిన ఆర్ముగం  వొళ్ళో పసి గుడ్డుని  పెట్టుకుని భార్య శవాన్ని పక్కన బెట్టుకుని దుఃఖంతో వెళ్ళే దృశ్యాన్ని  కన్నీళ్ళతో చూస్తూ "ప్రతి ప్రసవం గండమని ప్రతి నిమిషం  మరణమని తెలిసి కూడా  కన్న తల్లులు మరల మరల కంటారు పిచ్చి తల్లులు"  అన్న పాటని గుర్తు చేసుకుంది.  జరుగుతున్నది చూస్తూ సగం అర్ధమయ్యి సగం అర్ధం కాకుండా బిక్క మొహం వేసుకుని చూస్తూ  అమ్మ కాళ్ళని గట్టిగా అతుక్కుపోయిన అబ్బయ్యని ఎత్తుకుని స్టేషన్ లోపలికి  వెళుతుంది  రాధ. అమ్మ మెడని గట్టిగా వాటేసుకుని  అమ్మా ! నాకు చెల్లీ తమ్ముడూ ఎవరూ వద్దు. నాకు నువ్వే కావాలి అన్నాడు.
 చేతిలో బేగ్ ని కింద పెట్టి   పచ్చి పొట్టని ఒకసారి చేత్తో తడుముకుని కొడుకుని ముద్దు పెట్టుకుంది.      

(మిసిమి మాస పత్రిక జూలై 2016 సంచికలో ప్రచురితం)