స్కెచ్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
స్కెచ్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

29, జనవరి 2026, గురువారం

నువ్వు వస్తావని




 నువ్వు వస్తావని.. -వనజ తాతినేని 

#sketch

నువ్వు వచ్చే ముందే సూచనలిస్తావ్ 

పోలీస్ వేస్ వచ్చే ముందు అలర్ట్ హారన్ వినిపించినట్లు. 

వందకుపైగా నారింజ వయెలెట్ కలనేత రంగుల పరాదాల మధ్య నుండి పైపైకి తేలుతూ వస్తుంటావ్ కదా! అసలు మానవులకు రంగులను కలలను పరిచయం చేసింది నువ్వే కదూ! నువ్వంటే నాకు చాలా ఇష్టం. రోజూ వచ్చే వాడే కదా! ఏం ప్రత్యేకత ఉంటుంది నీ చాదస్తం కాకపోతే అనే వెక్కిరింపుల మధ్య నిన్ను కన్నార్పకుండా అబ్బురంగా చూస్తూ ఉంటాను. నువ్వో చైతన్యం. మహోజ్వలంగా వెలుగుతూ ప్రాణులకు శక్తిని ప్రసాదించే విశ్వ మిత్రుడివి. నిను ఆరాధించని వారెవరని!?


అందుకే.. నీ ప్రతి రాకను నేనొక ఉత్సవం చేయాలని కాచుకొని కూర్చుంటాను. ఇనుడా! 

నువ్వు దట్టమైన అరణ్యాల దారుల నుండి సంగీత కచేరీల మధ్య అడవి పువ్వులు వికసించినట్టు వస్తావా లేక జనారణ్యంలో శబ్ద కాలుష్యం మధ్య మసకల ముసుగు వేసుకుని వస్తావో 

లేక పచ్చని పంట చేల మీదుగా బంగారురంగు కాంతిని వెదజల్లుతూ వస్తావో..

ఎడారి ఇసుక తిన్నెలపై ఎర్రగా పెళ పెళ లాడుతూ వస్తావో.. 

లేక బూడిద రంగు నల్లరంగు మబ్బుల మధ్య దోబూచులాడుతూ వస్తావో నాకెలా తెలుస్తుంది 

నిన్ను వర్ణించడానికి కాగితం కలం పట్టుకుని తయారుగా వుంటాను. 

కాలుగాలిన పిల్లి లా ఇంట్లోకి బయటకి తిరుగుతూ వుంటాను. మిష్టర్ సూర్యా! 

ఇంకా రావేమిటి? ఉష కౌగిలి నుండి బయటపడి త్వరగా రావయ్యా!

ఇక్కడ  మంచుతెరల మధ్య చల్లగాలిలో  వణికిపోతున్నాయి ప్రాణులు అని పదేపదే విసుక్కుంటాను. 

నా పిచ్చి కానీ నేనెంత మొత్తుకున్నా నువ్వు రావాలనుకున్న  సమయానికే వస్తావ్

 పసుపు పచ్చని చట్రంలో నారింజ రంగుబంతిలా ముద్దొచ్చే నిన్ను నిలువు గా తీయాలా అడ్డంగా  బంధించాలా.. 

సినిమాటిక్ లో తీస్తే బాగుంటావా.. 

పానో మోడ్ లో బాగుంటావా

ఎక్స్ పోజర్ తగ్గించాలా పెంచాలా 

మాములు వీడియో చాలా? స్టాండర్డ్ చిత్రం సరిపోతుందా? 

ఏమిటో, గజిబిజి ఆలోచనలు. నేను ఇలా తికమకపడుతుంటే నువ్వు గుంభనంగా నవ్వుకుంటూ.. పైకి పైకి పోతూ వుంటావు. 

సరే.. ఇవాళంటే తప్పించుకున్నావ్ రవీ!  రేపు ఎక్కడికి పోతావ్ నాకు చిక్కకపోతావా? అయినా ప్రయత్నిస్తే..

సాయంత్రం చెరువులో నారింజ ఎరుపు కలగలిసిన వర్ణంలో చిక్కుతావ్ లే ఆర్కుడా! 

నీలాకాశంలో నుండి మా ఊరి పసుపుతోటల మధ్య నెమ్మదిగా కుంగుతూ రంగులన్నీ మూటలు గట్టుకుని దొంగిలించుకుని పోయి ఛాయ కు ఇస్తావ్..లే! నాకు తెలుసులే! పో.. నువ్వు లేకపోతే నాకేం బెంగ లేదు. 

నేను చీకటితో  కూడా సావాసం చేస్తుంటాను. ఆ విషయమేమిటో నీకు చెప్పాలా!? 

చెప్పను పో!  చీకటితోనే చెబుతా!

నీ పగటి కథలన్నింటినీ  రాత్రి పొతికలో దాచి పెట్టి వుంచుతాను. 

ఎప్పుడో నా మూడ్ బావున్నప్పుడు వినిపిస్తాను సరేనా! కొందరికి వీడ్కోలు చెప్పలేం, నీక్కూడా! 

మళ్ళీ రేపొక కొత్త కథ సిద్ధం చేసి వుంచుతాను.. వినడానికి తయారుగా వుండు. లవ్ యూ మిత్రమా! 🌅🎈🙏

11, జనవరి 2026, ఆదివారం

వన్య

 




వన్య   - వనజ తాతినేని #sketch


ఓయ్.. వన్య! వన్య!!  ఎక్కడ వున్నావోయ్

పలకవేల?  అసలే మా నగరం విశాలమైనదే కాకుండా రేయంబవళ్ళు రద్దీగా వుంటుంది. జాగ్రత్త!!

ఈ రణగొణ ధ్వనుల మధ్య నా పిలుపు వినబడుతుందా? 

 ఈ మౌనమేల, పోనీ కోపమా! 

అతిధి సత్కారాలు బాగా చేయలేదేమో నన్న నింద నాపై పడనీయకోయ్ 

మధువును సిద్ధపరిచాను. ఆరగించడమే ఆలస్యం కరుణించి కనబడవోయ్..


*********

ఏటి గట్టున పచార్లు చేస్తున్నావా  లేక

లంక భూముల్లో నిత్యం విరబూసే పూల తోటల్లో సంచారం చేస్తున్నావా?

నావ నెక్కి   షికారు కొడుతున్న కొత్త దంపతుల సరాగాలను చూస్తూ 

సిగ్గులొలుకుతూ అక్కడే ముడుచుకుపోయావా? 

నది మధ్య వల వేసి నింపాదిగా రేడియోలో  జనరంజని 

పాటలు వింటూన్న జాలరికి సహ శ్రోతవి అయ్యావా? కాస్త ముందుకెళ్ళి

ఇసుక తిన్నెలపై పవళించి విలాసంగా వేణువు ఊదుకుంటున్న మువ్వ గోపాలుడిని చూసి వచ్చావా?  

నది వొడ్డున బండరాయిపై కూర్చుని కూనిరాగాలు తీస్తున్న పడుచుపిల్ల గుండెగదిలో ఎవరున్నారో తొంగిచూస్తున్నావా? తీరంలోని తడి ఇసుకపై ఆమె చేస్తున్న కూచిపూడి నృత్యం వీక్షించావా?

ఆ పదాభినయనం నిను ఆకట్టుకుందా? మీ బ్యాలెట్ పోలె అంత బాగుందా? 

ఎలాగు  పుష్యంలోనే వచ్చావు గనుక నీకు నమ్మకం వున్నా లేకపోయినా కాస్త పుణ్యం మూటగట్టుకోవడానికి మా ఆంధ్ర మహా విష్ణువుని దర్శించి రాకపోయేవా? 

 మా రాయలు రచించిన ఆముక్తమాల్యద కావ్యానికి ప్రేరణ నిచ్చిన తావును చూసొచ్చావా? చూసింది చాల్లెద్దూ అనుకుంటూ..

వెనక్కి వస్తూంటే మా పచ్చని పొలాలపై వీచే మంద్రమైన గాలి నిన్ను సేదదీర్చే వుంటుందిలే! 


*****************


నగర సంచారం చేసి అలసిపోయి నది ఒడ్డుకు చేరావా మళ్ళీ?  

సరిగంగ స్నానాలు చేసి నీలాల కురుల నుండి ముత్యాలు జారుతుండగా రాయంచలా నడిచి వెళుతున్న ఆమెను చూసి విభ్రమ చెందావా? 

రివ్వున  ముందుకు పరుగులు తీసి  వెనుదిరిగి చూసావా!  

ముఖానికి  పచ్చని పచ్చి పసుపు పూసుకుని నుదుటిపై యెర్రని కుంకుమ దిద్దుకున్న నడి వయసు స్త్రీ సౌందర్యాన్ని కాంచి మూర్ఛపోయావా?  

ఆమె పెదవుల మధ్య  విరిసిన చందమామ తునక లాంటి

దరహాసాన్ని చూసాకైనా నీ సౌందర్యదాహం శాంతించిందా? 

ఆమె ముందు మోకరిల్లాలనిపించిందా లేదా? 

పోనీ…అరకన్నులతో సిరివెన్నెల కురిపిస్తూ పరామర్శించిన 

ఆయననైనా గుర్తు పట్టావా లేదా? అదిగో కనబడే ఆ కొండైనా విజయుడి విల్లంబులపొదిలో చేరిన పాశుపతాస్త్రం కథ చెప్పలేదా?  

అయ్యయ్యో! ఊపిరాడనీయకుండా ఇన్ని ప్రశ్నలు వేసి విసిగించానా? 

మన్నించు సఖీ! త్వరగా ఇంటికి వచ్చేయ్! 


*************

ఎక్కడో ఓల్గా తీరం నుండి మా కృష్ణా తీరానికి అతిధిగా విచ్చేసావు. 

మా నగరం  తన అందాలతో నీకు  కనువిందు చేసిందా? 

ఇప్పటికైనా ఒప్పుకుంటావా లేదా? 

సౌందర్యం ఏ ఒక్కరి సొంతం కాదని. 

ఏటవతలకు వెళ్ళి నీకొక కానుక తెచ్చి వుంచాను. 

అది ఏమిటా అనుకుంటున్నావా? 

అందమైన మంగళగిరి జరీ చీర పట్టుకొచ్చానోయ్,  

కట్టుకోవూ… సింగారించుకుని  నాకు చూపియ్యవూ 

మధువు విందు చాలులే, నా కెందుకీ చీరలు? అని విసుక్కుంటున్నావా? 

నా ఒళ్ళంతా రంగు రంగుల చీరలు. ఏ నేతకాడు నేయలేని అందమైన చీరలు  

నా చీరల రంగులను రేఖలను దొంగిలించడం మీ మానవులకు అలవాటు కదా!

నేను వెళ్ళొస్తా .. ఎప్పుడైనా మనసైతే మళ్ళీ వస్తా, 

నాకసలే చిత్తచాపల్యం అని నీకు తెలుసుగా! బై. 

ఇష్ట సఖి! వన్య….  వన్య ఇంకొన్నాళ్ళు వుండవూ!  ప్లీజ్!!

బతిమాలుతూ వుండగా మెలుకువ వచ్చేసింది. 😊❤️


*****************


*వన్య అంటే రష్యన్ భాష లో సీతాకోకచిలుక

*బ్యాలెట్ పోలె రష్యన్ నృత్యాలు. . 





7, జనవరి 2026, బుధవారం

సాయం సేయంగా..






సాయం సేయంగా..  - వనజ తాతినేని


వెలుగు రేకలు తో పాటు ఇంటికి వచ్చిన

భర్తని చూసి భార్య ముఖం తెరిపిన పడింది. 

ఏడికి పోయావ్ చెప్పా పెట్టకుండా..

ఆ ఏడిసేదేదో ఇద్దరం కలిసి ఏడుద్దాం గా..

పేణం యెంత తన్నుకలాడిందో..

ఎన్ని కీడు ఆలోచనలు యెత్తుకున్నాయో

కోపం ఏడుపూ కలగలిసిన గొంతు వణుకుతుంది 


********

నీకో కథ చెబుతా.. రా కూచో.. 

ఒడిని చూపి చేతులు సాచినాడతను

ఆమె పసిపిల్లలా మారింది. 

ఆమె జత్తులో వేళ్ళు కదుపుతూ.... కథలోకి దారులు వేసాడతను 


*********

ఆ.. నిర్మానుష్య రాత్రిలో 

వీధి దీపం ఖాళీ బెంచీ రెండూ

నన్ను పిలిచాయ్. . 

రా! కాసేపు వచ్చి కూర్చో! 

ఏ ఊరూ, ఇంత పొద్దు పోయిందాక

ఎందుకు తిరుగుతున్నావు అని

ప్రశ్నలు అడగనులే!

మనసున్న మనిషి వొకడు ప్రతి రోజూ

మంచినీటి సీసా రెండు బిస్కెట్ పేకెట్లు వుంచి వెళతాడు.

కాస్త పానీయం పుచ్చుకుంటావా?

పిమ్మట కొంచెం ఎంగిలి పడు. 

అలసిపోయినట్లు కనబడుతున్నావు

రవంత విశ్రమించు. 

కునుకు పడితే కలతలన్నీ మర్చిపోతావు

అని 


*********


లేచావా! బలిసిన దోమలను తరుముదామంటే

చలికి మరింత వణికి ముడుచుకు పోతావని ఆగాను. 

వెలుతురు వచ్చాక నువ్వే దారి పడతావులే!

అలిగి వచ్చిన నీకు అమ్మ నాన్న వుండే వుంటారు.

బ్రతుకు ఈడ్వలేక నైరాశ్యంలో కొట్టుమిట్టాడుతున్న నీకు

భార్యాబిడ్డలూ వుండే వుంటారు.

అమ్మా! నాన్న ఏడి? అని బిడ్డలు అడుగుతారు

ఇల్లాలు ఆందోళన చెందిన మనసుతో 

కన్నీరు ఊరే కళ్ళతో రహదారిని వెతుక్కుంటూ వుంటుంది.

ఇంటికి వెళ్ళు.. నాయనా! 

వలస బతుకులు సంచారుల బతుకులు ఇంతే!

తాత్కాలికంగా వేసుకున్న నీ గుడిసె ముందు 

రాత్రి వేసిన రంగుల ముగ్గులు నీకు స్వాగతం పలుకుతాయి

పగలంతా బతుకు యుద్దం చేసినా

రాత్రి వచ్చే రంగుల కలలకు ఈ రంగవల్లులు ఉద్దీపన.

కడుపు చూసే అమ్మ  గుండె పంచే ఆలి

దైర్యమిచ్చే నాన్న  బతుకుపై తీపి ఆశ కల్గించే బిడ్డలనూ

వదలకుబోకు నాయనా! 

ఒంటరితనం శిక్ష వేసుకోకు. 

వస్తువులు కూడా తోడు వెతుక్కుంటాయి. 

చెట్లు కూడా వేళ్ళతో ఆత్మీయంగా అల్లుకుంటాయి. 

వెళ్ళు… ఇంటికి వెళ్ళు! అని మెత్తంగా మందలించాయి. 


*********

పార్కులో మనుషులు మాయమయ్యాక..

అతనొక్కడే లోపలికి వెళ్లాడు. 

నీటి సీసా, రెండు బిస్కెట్ పాకెట్లు వున్న  సంచీని

అక్కడ తగిలించి .. బెంచీకీ వీధి దీపానికి నమస్కరించి

ఇంటి దారి పట్టాడు. 

(విదేశాల్లో నానా అవస్థలు పడుతున్న H1b యువ కుటుంబాల యాతనలకు సహానుభూతిగా 💦💦)

©️Vanaja Tatineni


 



07/01/2026 06:00 am


 



19, డిసెంబర్ 2025, శుక్రవారం

పలకరింపు

 


సంవత్సరంలో మూడొంతులు రోజులు “బ్రహ్మ ముహూర్తం” లోనే నిద్ర నుండి మేల్కొంటాను. పదిహేనేళ్ళగా ఇదే అలవాటైంది. మెలుకువ రాగానే రెండు మూడు నిమిషాలు కలలు ఏమైనా వచ్చాయా అని గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తాను. కలలు మన గడిచిన జీవితానికి గడవనున్న కాలానికి హెచ్చరికలు అని నమ్ముతాను. తర్వాత నిదానంగా ఎడమ పక్క దూరంగా వున్న మొబైల్ ని అందుకోవడానికి ఎడమ మోచేతిని తలగడపై ఆనించి సగం లేచి కుడిచేత్తో అందుకుంటూనే పవర్ బటన్ ఆన్ చేస్తాను. మొబైల్ నా కళ్ళ ఎదురుగా వచ్చేసరికి.. శ్రీగిరి దర్శనం అవుతుంది. తండ్రి మల్లన్న ధ్వజస్తంభం గోపుర కలశంపై త్రిశూలం చూస్తాను.ఎడమవైపు కాస్త వెనుకగా అమ్మ ఆలయశిఖరం పడమటి గోపురం కనబడతాయి. హృదయ నమస్కారం చేసుకుంటూ..” తండ్రీ మల్లన్నా !” అనుకుంటాను. నిద్ర లేచావా అమ్మా.. కళ్ళు తుడుచుకో అంటాడాయన. తండ్రి కదా, ప్రేమ యెక్కువ. 


తర్వాత హోమ్ బటన్ దగ్గర నుండి పైకి స్క్రోల్ చేస్తాను. నా పంచప్రాణాలు ఇద్దరిని మురిపెంగా చూసుకుంటాను. ఎక్కువ సేపు చూడను దిష్టి తగులుతుందని.మరుక్షణం మహాకాళ్ లైవ్ కి  వెళతాను. పంచామృతాలతో ఫల రసాలతో నారికేళ జలంతో పరిమళ ద్రవ్యాలతో  స్నానమాడుతున్న ఆయన తీరిక చేసుకుని నన్ను కళ్ళతో పలకరించి  వచ్చావా అమ్మా! కూర్చో అంటాడు.ఆయనకు నమస్కరించుకుని రద్దీగా వున్న స్వామి సన్నిధిలో ఓ మూలన నిలబడి  సంకల్పబలంతో ద్విజులు స్వామికి చేస్తున్న సేవలోకి నేనూ జొరబడతాను.  ఉజ్జయినికి వెళ్ళి  స్పెషల్ భస్మహారతి దర్శన టికెట్ కొనుక్కొని చూసిన వారి కన్నా యెక్కువగా భస్మహారతిని చూసుకుని రెండు మూడు క్లిక్ లో స్క్రీన్ షాట్లో తీసుకుని అందులో  సౌందర్యంగా వుండే చిత్రాన్ని క్రాప్ చేసుకుని వాట్సాప్ స్టేటస్ గా పెట్టుకుంటాను. నేను నిద్ర లేచాను. దిగ్విజయంగా మరో రోజులోకి వచ్చేసాను అనే క్షేమ సమాచారం అందుతుంది అయిన వాళ్ళకి. అదే విషయాన్ని ఫ్యామిలీ గ్రూప్ లో మహాకాళేశ్వర్ చిత్రాన్ని పంపుతూ తెలియజేస్తాను.నేనెలా వుంటానో వుండాలనుకుంటానో అలాగే వుండే ఫ్రెండ్ కి మహాకాళుడి రక్ష వుండాలని..వారికి చిత్రం పంపుతాను. అక్కడితో ఆ పంచడం ఆగిపోతుంది. తర్వాత మెసెంజర్ లో స్టేటస్ గా పెట్టుకుంటాను. 

అప్పుడుగానీ మంచం దిగను. కాలకృత్యాలు తీర్చుకుని ఓ స్ట్రాంగ్ కాఫీ కప్ తో మళ్ళీ బెడ్ మీద కూర్చునే వరకూ… మా గోడలన్నీ మొక్కలన్నీ బద్దకంతో ఇంకా ముడుచుకుని వున్న పక్షులన్నీ నమక చమకాలను భక్తిగా వింటూ వుంటాయి నేను విన్నా వినకపోయినా. 


తర్వాత  నన్ను పలకరించడానికి తొలుత  SP బాలు గారు  వాణీజయరామ్ గారు జానకి గారూ అప్పుడప్పుడూ  సుశీల గారూ ఘంటసాల గారూ వస్తుంటారు. M M కీరవాణి గారు నన్ను పలకరించకపోతే నేనస్సలు ఒప్పుకోనని ముందుగానే క్యూలో నిలబడతారు. వీరందరూ నన్ను పలకరించి పులకరింపజేసాక.. కాస్త మనుషుల అలికిడి మొదలవుతుంది. నేను తూర్పు బాల్కనీ నీ  సౌత్ బాల్కనీ కి వచ్చి అరవిరిసే పువ్వులకు శుభోదయం చెబుతాను. మొక్కలకు Thanks చెబుతాను. కాస్త మోకాళ్ళ కిందకి వొంగి ముద్దు కూడా పెడతాను. అవి సంతోషం ప్రకటిస్తాయి. బహుశా కవిత్వం కూడా చెబుతాయి. పూలన్నింటినీ రకరకాల యాంగిల్స్ లో బంధించుకుని.. మీ  పరిమళాన్ని బట్వాడా చేయలేకపోయినా మీ సౌశీల్యాన్ని ముగ్ధత్వాన్ని మీ అందాన్ని కొందరికి చూపుతాను. బాగా నచ్చితే కొంత స్వార్ధంతో నా పేరు వేసుకుని మరీ పంచుతాను అని చెపుతుంటాను. 


ఇంకా రాడేమిటబ్బా ఈయన అనుకుంటూ విసుక్కుంటూ మధ్య మధ్య ఫేస్ బుక్, వాట్సాప్ చూసుకుంటూ మిత్రులకు గుడ్ మార్నింగ్ లు  చెప్పుకుంటూ కాలుగాలిన పిల్లిలా ఇంట్లోకీ బాల్కనీల్లోకి తిరుగుతుంటాను.  Weather app ని కూడా check చేస్తాను కచ్చితమైన సమయం కోసం. నా నిరీక్షణ కి తెరదించుతూ… ఇదిగో వచ్చేసానులే.. రా! నాలుగు ఫోటోలు తీసుకో అని నులివెచ్చగా పలకరిస్తాడు ఆయన. ముఖం చాటంత చేసుకుంటాను. స్క్రీన్ పై మల్లన్న దర్శనం అయింది. లైవ్ లో మహాకాళుడి దర్శనం అయింది. నీ ప్రత్యక్ష దర్శనం కాకపోతే రోజు మొదలైనట్టే కాదు అంటాను కినుకగా. సరే తల్లీ… వెళ్ళు.. నీ ఫేస్ బుక్ పనులు చూసుకో, నా పని నేను చేసుకోవాలి అంటాడు ఆయన. 

ఎవరు పలకరించినా పలకరించకపోయినా… రోజూ నన్ను పలకరించే వారు వీరందరూ. వీరికి మనఃప్రణామములు. 🙏🙏🙏❤️


తర్వాత ఎవరెవరో పలకరిస్తారు అనుకోండి.  అపరిచితులు కూడా పలకరించడానికి ప్రయత్నిస్తారు. 😆😆వాళ్ళ తాతలు దిగొచ్చినా నేను అవకాశం ఇవ్వను.. 😂😂