29, జనవరి 2026, గురువారం

నువ్వు వస్తావని




 నువ్వు వస్తావని.. -వనజ తాతినేని 

#sketch

నువ్వు వచ్చే ముందే సూచనలిస్తావ్ 

పోలీస్ వేస్ వచ్చే ముందు అలర్ట్ హారన్ వినిపించినట్లు. 

వందకుపైగా నారింజ వయెలెట్ కలనేత రంగుల పరాదాల మధ్య నుండి పైపైకి తేలుతూ వస్తుంటావ్ కదా! అసలు మానవులకు రంగులను కలలను పరిచయం చేసింది నువ్వే కదూ! నువ్వంటే నాకు చాలా ఇష్టం. రోజూ వచ్చే వాడే కదా! ఏం ప్రత్యేకత ఉంటుంది నీ చాదస్తం కాకపోతే అనే వెక్కిరింపుల మధ్య నిన్ను కన్నార్పకుండా అబ్బురంగా చూస్తూ ఉంటాను. నువ్వో చైతన్యం. మహోజ్వలంగా వెలుగుతూ ప్రాణులకు శక్తిని ప్రసాదించే విశ్వ మిత్రుడివి. నిను ఆరాధించని వారెవరని!?


అందుకే.. నీ ప్రతి రాకను నేనొక ఉత్సవం చేయాలని కాచుకొని కూర్చుంటాను. ఇనుడా! 

నువ్వు దట్టమైన అరణ్యాల దారుల నుండి సంగీత కచేరీల మధ్య అడవి పువ్వులు వికసించినట్టు వస్తావా లేక జనారణ్యంలో శబ్ద కాలుష్యం మధ్య మసకల ముసుగు వేసుకుని వస్తావో 

లేక పచ్చని పంట చేల మీదుగా బంగారురంగు కాంతిని వెదజల్లుతూ వస్తావో..

ఎడారి ఇసుక తిన్నెలపై ఎర్రగా పెళ పెళ లాడుతూ వస్తావో.. 

లేక బూడిద రంగు నల్లరంగు మబ్బుల మధ్య దోబూచులాడుతూ వస్తావో నాకెలా తెలుస్తుంది 

నిన్ను వర్ణించడానికి కాగితం కలం పట్టుకుని తయారుగా వుంటాను. 

కాలుగాలిన పిల్లి లా ఇంట్లోకి బయటకి తిరుగుతూ వుంటాను. మిష్టర్ సూర్యా! 

ఇంకా రావేమిటి? ఉష కౌగిలి నుండి బయటపడి త్వరగా రావయ్యా!

ఇక్కడ  మంచుతెరల మధ్య చల్లగాలిలో  వణికిపోతున్నాయి ప్రాణులు అని పదేపదే విసుక్కుంటాను. 

నా పిచ్చి కానీ నేనెంత మొత్తుకున్నా నువ్వు రావాలనుకున్న  సమయానికే వస్తావ్

 పసుపు పచ్చని చట్రంలో నారింజ రంగుబంతిలా ముద్దొచ్చే నిన్ను నిలువు గా తీయాలా అడ్డంగా  బంధించాలా.. 

సినిమాటిక్ లో తీస్తే బాగుంటావా.. 

పానో మోడ్ లో బాగుంటావా

ఎక్స్ పోజర్ తగ్గించాలా పెంచాలా 

మాములు వీడియో చాలా? స్టాండర్డ్ చిత్రం సరిపోతుందా? 

ఏమిటో, గజిబిజి ఆలోచనలు. నేను ఇలా తికమకపడుతుంటే నువ్వు గుంభనంగా నవ్వుకుంటూ.. పైకి పైకి పోతూ వుంటావు. 

సరే.. ఇవాళంటే తప్పించుకున్నావ్ రవీ!  రేపు ఎక్కడికి పోతావ్ నాకు చిక్కకపోతావా? అయినా ప్రయత్నిస్తే..

సాయంత్రం చెరువులో నారింజ ఎరుపు కలగలిసిన వర్ణంలో చిక్కుతావ్ లే ఆర్కుడా! 

నీలాకాశంలో నుండి మా ఊరి పసుపుతోటల మధ్య నెమ్మదిగా కుంగుతూ రంగులన్నీ మూటలు గట్టుకుని దొంగిలించుకుని పోయి ఛాయ కు ఇస్తావ్..లే! నాకు తెలుసులే! పో.. నువ్వు లేకపోతే నాకేం బెంగ లేదు. 

నేను చీకటితో  కూడా సావాసం చేస్తుంటాను. ఆ విషయమేమిటో నీకు చెప్పాలా!? 

చెప్పను పో!  చీకటితోనే చెబుతా!

నీ పగటి కథలన్నింటినీ  రాత్రి పొతికలో దాచి పెట్టి వుంచుతాను. 

ఎప్పుడో నా మూడ్ బావున్నప్పుడు వినిపిస్తాను సరేనా! కొందరికి వీడ్కోలు చెప్పలేం, నీక్కూడా! 

మళ్ళీ రేపొక కొత్త కథ సిద్ధం చేసి వుంచుతాను.. వినడానికి తయారుగా వుండు. లవ్ యూ మిత్రమా! 🌅🎈🙏

కామెంట్‌లు లేవు: