పలాయనం - వనజ తాతినేని
ఆలోచనలు మరుగుతున్న సవ్వడి నుండి ఎప్పుడైనా పారిపోయావా
శబ్దానికి అపాద మస్తకం ప్రకంపించడం అనుభవమైందా
మేఘ గర్జనలు వినకుండా మెరుపు ముందే మాయమవ్వడం గమనించావా
మొగ్గ వికసిస్తూ భయోత్పాతంతో వణికిన విషయం గ్రహించావా
dts శబ్దాల హోరులో పడి మాట కూడా పారిపోవటం గమనించావా
లేదు కదూ! పోనీ..
నది తనలో తను నిక్షిప్తం అయింది అన్నమాటే కానీ
ప్రవాహపు సడి కనబడకుండా లోలోపల నిశ్శబ్దంగా
వడివడిగా సాగరం వైపు ప్రవహిస్తున్న విషయమైనా గుర్తించావా?
లేదా! జ్ఞాపకం చేసుకో, బాగా జ్ఞాపకం చేసుకో.. కవీ !
కర్కశంగా పీక నులుము హస్తముల నుండి
క్రౌర్యంతో నిండు గర్భిణిని మట్టగించే పాదాల నుండి
విషపుకోరలు పాలిండ్లపై దిగబడే పాశవిక చర్యల నుండి
మాటలతో గుండెల్లో పిడిబాకు దింపే నొప్పి నుండి
నరకం ఏమిటో చూపించే దుష్ట సమాగపు పీడకలల నుండి
వధ్యశిలపై బలయ్యే జలదరింపు భీతావహం నుండి
తృటిలో తప్పించుకున్న ఆమె కూడా అంతే!
ఎలాగో చచ్చి బతికిపోయింది.
మాటాడని మల్లెమొగ్గలా.. నిశ్శబ్ధమెరుగని జలపాతంలా
నీలోనే ప్రతిధ్వనిస్తూ వుంది. ఆమె ది అంటరాని ప్రేమ కదా!.
ఆ స్పర్శ కు నువ్వు భయపడి పారిపోకు.
దహించుకో.. కనీసం అక్షరాల్లో అయినా దహించుకో!
నాటకీయంగా ఎలీజీ రాసి అయినా నిన్ను నువ్వు దహించుకో
ఆ ప్రకటన తో కవి గా .. ఊరేగు. నిన్నేమనుకోరులే!
నువ్వు బహు సున్నితమైన కవి వని అశేషంగా
అవార్డులు సన్మాన సభలు నీ కోసం ఎంతగానో
ఎదురు చూస్తుంటాయి పాపం! పారిపోకు.
05/01/2026 08:00 pm
#వనజతాతినేని #vanajatatineni
#poetry #hilights #follower
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి