ఇలా నిండా పూచిన మామిడి చెట్టును చూడగానే… “మామిడికొమ్మ మళ్ళీ మళ్ళీ పూయునులే! మాటలు రాని మూగ మనసు పాడెనులే” అనే పాట అప్రయత్నంగా గుర్తుకొస్తుంది.
లోకంలో సుందరమైన విషయాలు చాలా వున్నాయి.
అందులో నిజాయితీ గా నిరాడంబరంగా పలికే మాటలు కూడా ఒకటి. ఆ మాటలు పక్షుల పాటల వలె హృదయం నుండి దుముకుతాయి. ఆ మాటల్లో అర్థం కాని క్లిష్టత గాయ పరిచే వాడితనం వుండకూడదు. మాట సొబగులు అద్దుకున్నంత మాత్రాన అందంగా వుండదు. మన పెదవుల నుండి మన భావనల నుండి వెలువడే మాట, రాసే విషయం వివేకంతో నియంత్రించబడాలి. అప్పుడే ఆ మాటలను పలికే పెదవులు, రాసే వ్రాతలు అందంగా అనిపిస్తాయి.
మాటలు వచ్చినంత మాత్రాన సరికాదు. ఆ మాటకు మృదుత్వం ముఖ్యం. మనం వేటగాళ్ళం కాదు. ఎప్పుడూ మాట అనే బాణాలతో ఇతరులను గాయపరచడానికి.
గాయబడితే మనుషులు దూరంగా జరుగుతారు. నటించడం వేరు స్వభావం వేరు. రెండింటిని ఎదుటివారు గుర్తించగలరు.
నా దృష్టిలో అందమైన పెదవులు అంటే సదా చిరునవ్వులు చిందించే లిప్ స్టిక్ వేసుకున్న పెదవులు కాదు. అందంగా వుండి ఇతరులను గాయపరిచే మాటలు మాట్లాడే పెదవులు కాదు. హృదయపూర్వకంగా మాట్లాడే మాటలు, మాటలో మృదుత్వం ధ్వనించే మాటలు, ఉచ్చరించే పెదవులు.
మాటలు రావడమే యోగ్యతా కాదు. బాగా రాయగలమని విర్రవీగడం యోగ్యతా కాదు.
ప్రకటనాశక్తి ఒక యోగం. అది అందరికీ సంప్రాప్తించదు. దానిని సరైనరీతిలో ప్రదర్శించడం మర్చిపోవద్దు.
శుభోదయం మిత్రులారా!

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి