అమ్మ కాఫీ కప్
అమ్మా! ఎక్కడ వున్నావే!
ఈ ఖాళీ కప్పు లో కాఫీ లేక పోవచ్చు .
నువ్వు ఈ కప్ తో కాఫీ తాగకుండా పోయి
ఇరువది ఎనిమిదో సంవత్సరం కావచ్చు.
నీ జ్ఞాపకాలు నా గుండెల్లో నక్షత్రాల్లా ప్రకాశిస్తూ వుంటాయి.
ఎన్నో కాఫీ లు రుచి చూస్తూ వుంటాను కదా!.
కానీ నీ చేతి కాఫీ రుచి ఎక్కడ సేవించగలను
నెస్ కెఫె డబ్బా పై వున్న పక్షుల బొమ్మల్లాగానే
నువ్వు కూడా స్మృతిలో మిగిలిపోయావు.
నేను లేకపోయాక నా బిడ్డల నోటి వెంట
అమ్మా! అనే పిలుపుకి తాళం పడుతుంది అన్న
నీ మాటతో మహా కవయిత్రిగా కనబడ్డావు.
నువ్వు వెళ్ళి పోయాక నా మాటకు
బోలెడంత మృదుత్వం నింపుకుని వీలైనంత
ఎక్కువమందిని చిన్నా పెద్దా ఆడమగ అందర్ని
అమ్మా అంటాను ప్రేమ పొంగినప్పుడు.
కానీ వారంతా.. మా అమ్మ ఎందుకవుతారు అనుకుంటా!
నీ లోటు ఎవరు పూడ్చగలరు అమ్మా!
అమ్మంటే ఇలాగే వుండాలని..
నువ్వు నాకు గీతాచార్యుడిలా బోధించలేదు.
చూపించావ్.. చూపించావ్.
నేనెప్పుడూ అలాగే వున్నాను.
అమ్మ మనసులో మాట నువ్వు చదవలేదు కదూ!
చదివి గుండె తడిచేసుకున్న అందరిలో నువ్వున్నావు.
అమ్మా!
నా హృదయంలో నుండి కొల్లగొట్టలేని మహా సంపద నువ్వు.
నువ్వు వాడిన వస్తువుల్లో మాత్రమే కాదు.
నా చేతితో నా మెదడుతో నా హృదయంతో చేసే
ప్రతి పనిలో సజీవంగా వుంటావు.
ఈ కాఫీ కప్ ను కాఫీ తో నింపలేను, కాళీ చేసిన కాలాన్ని నింపలేను.
కానీ..నేను వున్నంతవరకు నువ్వు వుంటావు.
నాతోడబుట్టిన వాళ్ళు వున్నంతవరకూ..
నువ్వు వుంటావు. ❤️😢🙏
11/01/2026 06:00 am.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి