31, జనవరి 2026, శనివారం

నీవూ నేనూ ఊహల్లో…

 



నీవూ నేనూ ఊహల్లో..     - వనజ తాతినేని. 


నీ కథలో నువ్వు శ్రీరామ చంద్రుడివి

నా కథలో నేను జానకి ని

నా కథలో నువ్వు లేవు

నీ కథలోనూ నేను లేను

మన ఇరువురి కథలూ కలిసింది లేదు.


మనమిద్దరం ఆ ఒడ్డున ఒకరు ఈ ఒడ్డున ఒకరు కూర్చుని.. 

ఇద్దరు బాల్యస్నేహితుల్లా ఖాళీ అగ్గిపెట్టెలకు 

దారం వాహకంగా చేసుకుని సరదాగా కబుర్లు విరజిమ్ముకుంటాం.

నదిపై రహస్యంగా అనుబంధపు వంతెన నిర్మించుకుంటాం.

మనని చూసి మన పిల్లలు హాయిగా నవ్వుకుంటారు. 

వారి మానసిక కుటుంబంలో మనకి కొత్త సభ్యత్వం ఇచ్చేస్తారు. 


జీవితాన్ని మధించగా వచ్చిన హాలాహలం మింగిన వాళ్ళం 

అమృతం కోసం ఎదురు చూస్తామా? 

భూమిని గునపాలతో తవ్వి పోసినప్పుడు కనబడని

లంకె బిందెలు అంజనం వేసి చూస్తే కనబడతాయనుకుంటామా? 

చంద్రుని వెన్నెల కిరణాలు చంద్రకాంతి శిలలను కరిగిస్తాయని 

గుడ్డిగా నమ్ముతామో కానీ చాపల్యంతో రేగుపండ్ల కోసం 

వెలగా మంచి ముత్యాలు వొదులుకుంటామా? 

నిరంతరం ఇతరులను మెప్పించడానికి చేసే ప్రయత్నం లో.. 

మనకు మనంగా ఏం మిగులుతున్నామని? లెక్కలు తేలవు

తమస్సు ఉషస్సు భేదం తెలియని బధిరులం కాము

ఎందుకీ.. వృధా ప్రయాస అని కూడా అనుకోము.


మర్యాదల సరిహద్దులు దాట లేని

నేనొక మెటానోయా   (Metanoia)

నువ్వొక ఐసోలోఫిలియా(Isolophilia)

తోడు నీడ అర్థాలు మారిపోతున్న కాలం ఇది.

అయినా.. ఏదో విముఖత మరేదో కొత్త ఆశ. 

తెగనీయక, ముడి పడనీయక, కనుమరుగుగాక.


మన మధ్య 

ఆఖరి చూపు ఆఖరి మాట ప్రాప్తం వుంటాయో లేదో! 

ఏదో ఒకనాడు శక్తి ఉడిగి గుండె ఆగి  కళేబరం శిథిలమైపోతుంది.

ఎప్పుడో.. తెలిసాక ఏం చేయగలం చెప్పు? 

నాలుగునాళ్ళు కన్నీరు కార్చడం తప్ప. 


మన జీవయాత్ర ముగిసే లోగా..  

హృదయ కవాటాల్లోకి వెలుగుల్ని వెదజల్లిన మాటలు

గుండె గొంతుకను కోటి గొంతులు చేసి వినిపించిన పాటలన్నీ 

మూగబోకముందే.. ఇదే ఆఖరి లేఖ అన్నంత ఇదిగా 

 అనేక సంగతులతో నాలుగు ఉత్తరాలు  రాసుకుందాం.

రహస్యంగా రాసుకుని పోస్ట్ చేయని లేఖలు

చేరవలిసిన చోటుకు చేరకుండానే పెట్టెలోనో రహస్యపు అరల్లోనో దాగి 

అటుపిమ్మట ముక్కలై పోవడం ఏం బావుంటుంది చెప్పు? 


నేనేమో మాక్సీం గోర్కీ రాసిన ప్రణయ పత్రాలు కథలో “టెరెసా” లా కాకుండా

నువ్వేమో ఎడ్మండ్ జలో రాసిన ఆఖరి ఉత్తరం లోని “డేనియల్” లా కాకుండా

మనసంతా విప్పి ప్రేమ లేఖలు రాసుకుందాం. 

తప్పకుండా మనదాకా చేరేదాక జాగ్రత్తలు తీసుకుందాం.

ప్రతిరోజూ నాలుగు ముద్దలు రసానుభూతి అన్నాన్ని భుజిద్దాం.

బతుకు తీపి పంచుకుందాం. 


ఒక లేఖ లో …

రావోయ్, నా కనురెప్ప మాటుగా కలలో జీవించి పో అంటాన్నేను. 

నువ్వు ఇరవై ఏళ్ల కోడెకారు పిల్లాడివి అయిపోతావ్.  

నువ్వేమో, రా.. పిల్లా!  నా గుండె కింద నవ్వులు రువ్వుతూ అల్లరి చేసిపో! 

అనడంలో  నేను పదహారేళ్ళ పడుచు పిల్లని అయిపోతాను. 

.  

మరో  ప్రేమ పత్రంలో   

వానకి తడుస్తున్న పక్షి పిల్లను తల్లి రెక్కతో జవురుకుని 

డొక్కలోకి పొదువుకున్నట్టు నన్ను నీ హృదయంలోకి పొదువుకుంటావు.

నేనేమో.. నా ఒడిలో నీ తలని వుంచుకుని 

సుతి మెత్తగా మర్దన చేస్తూ జోల పాట పాడతాను.

అలా ఊహల్లో లేఖల్లో జీవిద్దాం. 

కాలానికి కాస్త కవిత్వాన్ని బహుకరించి పోదాము. 

దృశ్యం అంతా …నీవూ నేనూ ఊహల్లో..

గాలికి ఊగుతున్న  గుత్తుల గులాబీలా వుంది కదా! 

రాయడం ప్రారంభించు, ఎదురుచూపు గుమ్మానికి వ్రేలాడదీసెను.

 

***********************End***********************


పుట్ నోట్స్.. *ఐసోలోఫిలియా (Isolophilia) *మెటానోయా (Metanoia) ఎడ్మండ్ జలో (ఫ్రెంచ్ రచయిత) రాసిన “ఆఖరి ఉత్తరం” కథ. మాక్సీం గోర్కీ రాసిన “Her Lover” ప్రణయ పత్రాలు కథ.




 





కామెంట్‌లు లేవు: