4, జనవరి 2026, ఆదివారం

పంట విరామం /Crop Holiday


ఈ రోజు ప్రజాశక్తి స్నేహ లో…





పంట విరామం / Crop Holiday

  •             -వనజ తాతినేని 


హాలికుడు అతను. క్షామం ఎదురైంది. 

అర్ధాంగి అలసి వీడ్కోలు తీసుకుంది.

అతనికి మతిస్థిమితం తప్పింది 

కాళ్ళు తీసుకుని పోయిన తావుల్లో తిరుగుతున్నాడు. 

పవిత్ర గంగ లో, సాగర సంగమం లో, 

త్రివేణి సంగమం లో, కుంభమేళాలో,  

అనేక పుష్కరాల సమయంలో  పుణ్య స్నానం చేసాడు. 


కానీ..  అతని తపన తీరలేదు. మనసుకు శాంతి లేదు. 

నిప్పుని ఒడిని కట్టుకున్నట్లు తిరుగుతున్నాడు. 

నది జాలిపడి అతని చెవిలో ఒక రహస్యం చెప్పింది. 


నువ్వు  నాగలితో భూమిని  దున్నిన పాపం  వదిలిపోలేదు. 

పచ్చి బాలింతరాలు అని కూడా చూడకుండా మళ్ళీ మళ్ళీ దున్నావు, 

విత్తులు చల్లావు  అని.


అతనికి ఆ సమయంలో భార్య గుర్తొచ్చింది.  

రాత్రులు ఆమె నుంచి వచ్చిన మూలుగు జ్ఞాపకం వచ్చింది. 

ఎడసాల నుండి వినవచ్చిన ప్రసవ వేదనలు గుర్తొచ్చాయి. 


ముక్తాయింపు గా అంది నది. 

పంట పండాలంటే  రైతు కృషి ఒక్కటే చాలదు. 

చచ్చు పుచ్చు పండకుండా ధరణి కీ విశ్రాంతి ఇవ్వాలి కదా! 


©️Vanaja Tatineni 



 


కామెంట్‌లు లేవు: