చిత్రం : భక్త కన్నప్ప (1976)
సంగీతం : ఆదినారాయణరావు/సత్యం
గీతరచయిత : ఆరుద్ర
నేపధ్య గానం : రామకృష్ణ, సుశీల
పల్లవి:
ఆకాశం దించాలా.. నెలవంక తుంచాలా సిగలో ఉంచాలా... ఆ...
ఆకాశం దించాలా.. నెలవంక తుంచాలా సిగలో ఉంచాలా... ఆ...
(ఈ ఆకాశం దించడం అనేది పురుషుల ఊతపదం అనుకుంటా, పైగా నెలవంక తుంచలా సిగలో ఉంచాలా అని కూడా అడుగుతారు. అరవీర శూరులు మన చలన చిత్ర హీరోలు. వారికి తగినట్టు రాసే.. మన తెలుగు గీత రచయితలు మాత్రమే కాదండీ.. ఈ మధ్య ఆంగ్ల కవిత్వంలో చదివాను. ఆ కవి ఏమన్నాడంటే … ఆ గిరులను తరులను తవ్వి తెచ్చి నీ కొప్పు చుట్టూ ఉంచుతాను అంటాడు. ఓరి నీ… ఇనుప లవ్వు పాడుగాను అని నవ్వుకున్నాను.)
ఆమె: చెక్కిలి నువ్వు నొక్కేటప్పటి చక్కలి గింతలు సాలు
ఆకాశం నా నడుము.. నెలవంక నా నుదురు సిగలో నువ్వేరా... ఆ... ఆ…
(పాపం! కథా నాయికకు తెలుసు, అందుకే ఇలా అంటుంది. నా చెక్కిలి నువ్వు పట్టుకున్నప్పుడు కల్గిన గిలిగింత చాలు. ఆ ఆకాశం నా నడుము(ఇక్కడ దర్శకుడు బాపు గారు హీరోయిన్ నడుముని విల్లులా వంచేసాడు. నెలవంక ఏమో నా నుదురు, సిగలో రహస్యంగా తురిమింది నిన్నే కదా అంటుంది.)
చరణం 1:
పట్టుతేనె తెమ్మంటే చెట్టెక్కి తెస్తానే... తెస్తానే...
మిన్నాగు మణినైనా పుట్టలోంచి తీస్తానే... తీస్తానే…
(అంటాడు కోయ వీరుడు.. కానీ నాయిక దయ గలది గావున ఇలా అంటుంది.)
ఆ... పట్టుతేనె నీకన్నా తియ్యంగా వుంటుందా..
మిన్నాగు మణికైనా నీ ఇలువ వస్తుందా…
అని.
అ: అంతేనా అంతేనా…
(అని అంటాడు గొప్పగా తెస్తానని చెప్పినవన్నీ తేవడం తప్పిపోయినందుకు లోలోన సంతోషపడుతూ.)
అవును అంతేరా... ఆ...
ఆకాశం అంచుల్లో భూదేవి కలిసేలా కౌగిట్లో కరిగేరా... ఆ...
ఆకాశం అంచుల్లో. భూదేవి కలిసేలా కౌగిట్లో కరిగేరా... ఆ...
(అకాశం అంచుల్లో భూదేవి ఎప్పటికీ కలవదు. కలిసినట్టు కనబడతాయి. Optical illusion. అవి క్షితిజ సమాంతర రేఖలు. కానీ కవుల కల్పనలో ఆకాశాన్ని భూమిని కలిపేసి కౌగిట్లో కరిగించేసారు.)
చరణం 2:
అ: సూరీడు ఎర్రదనం సిందూరం చేస్తానే... చేస్తానే...
కరిమబ్బు నల్లదనం కాటుక దిద్దేనే... దిద్దేనే…
(నాలుగు బాణాలు వేసి ఆమెని కదలకుండా చేసాననుకుని మరీ కోతలు కోసేసాడు. సూరీడు ని నుదుట బొట్టుని చేస్తానన్నాడు. కరిమబ్బు నల్లదనం తెచ్చి కాటుకగా పెడతానన్నాడు.)
(ఆమె అంటుంది.. ఓ అబ్బాయ్, ఇదిగో నిన్నే.. అవన్నీ ఏం వద్దులే, నువ్వు సింధూరం తెద్దామని అక్కడికి ఎగిరేలోపు అది తెల్లగా విభూది అయిపోతుంది. కరిమబ్బుని బాణంతో గురి చూసి కొట్టినా నీరే కారుతుంది కానీ కాటుక రాదు. నా అలంకరణ సంగతి నే చూసుకుంటాలే కానీ)
ఆ... నీ ఒంటి వెచ్చదనం నన్నేలే సూరీడు
నీ కంటి చల్లదనం నా నీడ నా గూడూ
(నన్నేలుకునే సూరీడా! ఇలా వచ్చి నన్ను హత్తుకో నీ ఒంటి వెచ్చదనమే చాలు.నా నీడగా గూడుగా వుండే నువ్వు నెమ్మదిగా సంతోషంగా చల్లగా వుంటే చాలు. నేను చల్లగా వుంటాను అంటుంది. ఆలుమగలు ఇద్దరూ అవసరమైనప్పుడు కుంపటి పక్కన వున్నట్టు వుండాలి, చల్లని పందిరి కిందా వుండట్టు ఉండాలి. అంతే కదా.. )
అంతేనా అంతేనా…
(అంటున్నాడు అతగాడు ఏమీ ఎరగనట్టు.)
అవును అంతేరా... ఆ…
(అంటుంది ఆమె. ఓ ప్రేమికా! నీకు అన్నీ తెలిసికూడా ఆ అమాయకత్వం ప్రదర్శించడం ఏమిటి? ఆ సంగతి నీకు తెలుసునని నాకు తెలియదనుకున్నావా ఏమిటి? అనుకుంటుంది మనసులో నవ్వుకుంటూ.)
అ: మెరిసేటి చుక్కల్నీ మెడలోన చుట్టాలా
తలంబ్రాలు పొయ్యాలా...ఆ…
(మళ్ళీ పైత్యకారు మొదలెట్టాడు. మెరిసేటి చుక్కలని తెచ్చి నక్షత్ర హారం చేసి మెడకి పెట్టాలా లేక తలంబ్రాలు పొయ్యాలా.. అని అడుగుతాడు.)
ఆ: గుండెలోన గువ్వలాగ కాపురముంటే చాలు
(అవేమీ వద్దు , నీ గుండెలో గువ్వలాగా నేను కాపురం వుంటే చాలు లే అంటుంది.)
ఆకాశం అంచుల్లో భూదేవి కలిసేలా
కౌగిట్లో కరిగేరా... ఆ…
నేనైతే ఏమంటానంటే.. నువ్వు చెట్టెక్కి పడ్డావంటే.. ఏ కాలో చెయ్యో విరిగితే నేను సేవలు చేయలేను అందును. తేనె తింటే నాకు ఎలర్జీ వల్ల ముక్కు ధారాపాతం కాబట్టి అంత శ్రమ వద్దులే, మానుకో . ఇక మిన్నాగు మణి వుంటదో లేదో తెలియదు కానీ పుట్ట తొవ్వితే పాములు బయటకు వస్తాయి, నాకు పాములంటే చచ్చే భయం, వద్దులే అందును… ఇలా పాటంతటికి కామెంట్ రాయాలి. కానీ వద్దు. మరీ వాచ్యంగా వుంటుంది. హ హ హ హ 🤣🤣😇
పాట వింటూ ఎంజాయ్ చేయండి. శుభరాత్రి. 🎧🎧🎧
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి