11, డిసెంబర్ 2018, మంగళవారం

గడ్డిపూవు జ్ఞానం

సెల్ఫ్ ప్రమోషన్ కోసం పొగిడించుకోడం సర్వసాధారణమైన రోజులలో... విని చూసి వెగటుపుట్టినప్పడు పుట్టిన కథ. ఈ..చిన్న కథ.

అనగనగనగా.. ఒక కదంబమాల... అంట. అందులో పద్దెనిమిది పూలంట. ఒకో పువ్వు గురించి మిగతా పదిహేడు పూలు .. గోడెక్కి దారిన పోతున్న అందరికి వినబడేటట్టు అబ్బ.. యేమి రంగు యేమి పరిమళం యెంత సొగసు అని నోరార పొగుడుకుంటూ వున్నాయంట. దారినపోతున్న దానయ్య .. సుందరమైన సుకుమారమైన అద్బుతమైన పూవుల్లారా..మీలో వొకరినొకరు పొగుడుకునే సంబడమాపేసి దండగా మారిన మీరు దండగవకుండా దేవి పూజకు వెళ్ళండి ఆలస్యమవకుండా.. అని చెప్పి వెళ్ళిపోయాడంట.

అసుర సంధ్య వేళ దేవి మెడలో అలంకారంగా మారాలనుకుని గుడికి వెళ్ళింది అంట కదంబమాల. పూజారి దేవి మెడలో కదంబమాల వేశాక ఈ సారి ఒకొరినొకరు పొగడుకోకుండా యెవరిని వారు పొగుడుకుంటూ.. అందుకే నేనంటేనే దేవికి యెక్కువ యిష్టం అని.. చెప్పుకుంటున్న రొద విని .. దేవి కి విసుగొచ్చి ... ఇక ఆపండి మీ స్వీయస్తోత్రం. మీ అందరిని సృష్టించిన నాకు తెలియదా మీ గురించి. మీతో పాటు నేను సృజించిన ఆ గడ్డి పూవును చూడండి .. యెంత వినయంగా నా పాదాల దగ్గర వొదిగి వుందో .. అని అందట.

దేవి : జ్ఞానదేవత

పంకం లేనిదే పద్మం పుట్టదు, కానీ పంకం వాసన పద్మానికి అంటదు. జ్ఞానవంతుడికి ప్రచారం అవసరంలేదని నా భావన. 



కామెంట్‌లు లేవు: