19, డిసెంబర్ 2018, బుధవారం

మట్టి మనుషులు

ఈ మధ్య ఫేస్ బుక్ పై విరక్తి చెందిన నేను డార్క్ నాలెడ్జ్ ని (అవసరంలేని విషయ జ్ఞానం) వదిలించుకునే క్రమంలో మూడు నవలలు చదివాను అందులో వొకటి మట్టి మనుషులు. ఆ నవలని చదివిన తర్వాత నా స్పందన వ్రాయకుండా వుండలేకపోయాను. అలాగే పంచకుండా కూడా వుండలేక ఈ నవలా పరిచయం.
సాహిత్యం యేమి చేస్తుందంటే కుసంస్కారంతో మూసుకున్న కళ్ళను తెరిపిస్తుంటుంది. మనలో నెలకొన్న బేషజాలను రూపుమాపడానికి తోటి మనిషిని అర్ధం చేసుకోవడానికి అన్నింటికన్నా ముఖ్యంగా మన ఉరుకుల బెరుకుల ప్రయాణాన్ని ఆపి కాస్త మనలోకి మనం తొంగిచూసుకోవడానికి లోకాన్ని మరింత అర్ధం చేసుకునే ప్రయత్నంలో ఊతగానూ వుంటుంది. మనిషిని మనీషిగా మార్చకపోయినా మనిషిగా మిగిల్చే సంస్కారాన్ని నేర్పుతుంది.
నేను ఈమధ్య వ్రాసుకున్న నా ఆలోచన అదే విధమైన అర్ధం స్ఫురించేలా వొక వాక్యమూ అక్కడ నాకు కనబడటం యాదృచ్చికమే అయినా నేను కొంత వుద్వేగానికి గురైనమాట వాస్తవం. ఆ వుద్వేగమే ఆ నవలను కంప్యూటర్ తెరపై ఏకబిగిన చదివే వూపునిచ్చింది.
ఈ మట్టి మనుషులు నవల మనుషుల గురించి వ్రాసినది అయినా మనుషుల కోసమే వ్రాసినది అని ఆనంద కౌసల్యాయన పుస్తకం గురించి చెప్పిన రెండు మాటల్లో అన్నారు. కాళిందీ చరణ పాణి గ్రాహీ వ్రాసిన మొట్టమొదట రచన యిది. తెలుగులో ప్రధమ ముద్రణ మార్చి 1958 అయితే అంతకు ముందు పాతికేళ్ల ముందే యీ నవల పుట్టింది. ఈ నవల రచయిత మొట్టమొదటి రచన కూడా.
పూరీ జిల్లాలో డెలాంగా గ్రామంలో ఒక రైతు కుటుంబానికి చెందిన యిద్దరన్నదమ్ముల కథ యిది. ప్రముఖ ముద్రణా సంస్థ ఆనందలహరి గ్రంధాలలో మొట్టమొదట గ్రంధం యిది. గ్రంధం అంటున్నానని గ్రాంథికంలో ఈ నవల ఉంటుందని అనుకోవద్దు. ఒరియా తెలుగు రెండు భాషలు రెండు కన్నులుగా భావించే పురిపండా అప్పలస్వామి గారు ఒడియా నుండి తెలుగులోకి అనువదించారు. అనువాదకాలం కేవలం రెండు మాసాలు అని ముందుమాటలో చదివి ఆశ్చర్యం వేసింది. ఈ నవలా రచయిత ముఖమైనా చూడకుండా నవలను చదివి అనువాదం కోసం అనుమతి తీసుకోవడానికి వేరొక రచయిత ద్వారా కాళింది చరణ పాణిగ్రాహి తో పరిచయం పెంచుకున్నారని రచయిత చెప్పుకున్నారు. ఈ పుస్తకం వెలువడగానే దీనికి నాటక రూపమూ కావ్య రూపముగా కూడా మారిందంటే పాఠక లోకంపై సమకాలీనులైన రచయితలపై యెంతటి గాఢముద్ర వేసిందో అర్ధం చేసుకోవచ్చు.
గ్రామ జీవనంలో ఆదర్శవాదాన్ని మూలవస్తువుగా తీసుకుని యీ నవల జీవం పోసుకుంది అనేకంటే రచనాకాలం నాటి భారతీయ గ్రామ స్వభావాన్ని, ఎవరి వృత్తి వారు చేసుకుంటూ కులమత ధనిక పేదా తేడాలు లేని ఆదర్శ జీవనాన్ని గ్రామస్తుల కల్మషం లేని మనసులను భోళాతనాన్ని మనకు పరిచయం చేస్తుంది. వృత్తిరీత్యా యెవరి పనులు వాళ్ళు చేసుకుంటూనే అందరి పొయ్యిలోకి వెళ్ళే కట్టెల మోపు వోలె కలిసి ఉండేవారు. వారిలో ఒకరే భిన్నమైన వాడు. ఆ ఊరి మోతుబరి హరిమిశ్రా.
గ్రామస్తులను అర్ధం చేసుకోవాలనే మనకు కూడా గ్రామీణ నేపధ్యం వుండివుండాలి లేదా సహృదయత యెక్కువన్నా ఉండాలి. నాగరీకులకు అల్పంగా మూడాచారాలుగా అనిపించే విషయాలలో గ్రామీణులు బహు సున్నితంగా చూస్తారు లేదా బలీయమైన విశ్వాసంగానూ పరిగణిస్తారు. ఆఊరి గ్రామదేవత మంగళా అమ్మవారు. గ్రామస్తులందరికీ ఆమెను అండ దండ గా భావిస్తారు. పధానపడ గ్రామంలో శామపదాను యిల్లంటే ధర్మానికి నిలయం. ఎన్ని తరాలుగా ఆ యిల్లు కూలి పోయినా ధర్మాన్ని మాత్రం కూలిపోనివ్వని ఆ యిల్లంటే గ్రామస్తులందరికీ వల్లమాలిన అభిమానం. గ్రామమస్తుల మధ్య చిన్నచిన్న తగాదా మొదలుకుని పెద్ద పెద్ద విషయాల దాకా శామపదాను మధ్యవర్తిత్వం ఆ వూరిని నిలబెడుతూ ఉండేది.
శామపదాను ఇలా అంటూ ఉండేవాడు. ఓరే.. మనమేమో దరిద్రులం. చిన్న చిన్న దొంగలం. సొరకాయ మీద గుమ్మడికాయ మీద మనం కన్ను వేస్తాం. ఆ ప్రెసిడెంట్ జమిందారూ షావుకారూ వీళ్ళు దొంగలు కాదు దోపిడీ గాళ్ళు. పట్టపగలు దబాయించే గదమాయించే కేసులు కోర్టులూ అని బెదిరించి మనల్ని బికారులని చేస్తారు మనుషులను తినే మొసళ్ళు వీళ్ళు.. పులులను మొసళ్ళను కోర్టులు ఏమీ చేయలేవు న్యాయమేమీ చేయలేదు అని.
శామపదానుకి ఇద్దరు కొడుకులు బరజు, చకడీ. బరజు కొద్దిగా చదువుకుని వుద్యోగం చేస్తూ ఉంటాడు. చకడి ఆ మాత్రం చదువు కూడా లేకుండా జులాయిగా తిరుగుతూ కాలక్షేపం కోసం దగ్గరలోనే ఉన్న పట్టణానినికి వెళ్లి తిరిగొస్తూ ఉండేవాడు. బరజుకి తమ్ముడికి పదేళ్లు తేడా. బరజు పెళ్ళై నలుగురు పిల్లలు కల్గిన తర్వాత ఛకడికి పెళ్ళవుతుంది. చిన్న కోడలు కాస్త ఉన్నత కుటుంబం నుంచి నగ నట్రా సారె చీరలతో ఘనంగా అత్తగారింటికి రావడం వల్ల అహంభావము నోటి దురుసు యెక్కువ. అలాంటి కోడలితో మాటామంచి లేకపోతే ఇంకా అహంకారం యెక్కువగా ఉంటుందనే ఆలోచనతో శామాపధాను భార్య ఆమెపై ప్రేమ కురిపించేది. అది అలుసుగా తీసుకుని ఆమె తోటి కోడలుపై దురుసుగా వ్యవహరించేది. శామపధాను భార్య చనిపోతుంది. ఆ దిగులుతో శామపధాను కూడా దిగులుతో మంచం పడతాడు. భూమి ఉన్న రైతు వ్యవసాయం చేసుకుని జీవనం కొనసాగించాలి కానీ వుద్యోగం చేయడం మన వంశ ధర్మం కాదని బరజుకి భోదిస్తాడు శామపధాను.తండ్రి కోరికను అర్ధం చేసుకుని చేస్తున్న అమీను వుద్యోగం మానుకుని వ్యవసాయం పనులు చేసుకుంటూ ఉంటాడు బరజు. శామపధాను కూడా మరణానికి చేరువవుతూ ఉంటాడు. మీ యిద్దరన్నదమ్ములు విడిపోకూడదు. పొలం మధ్య గట్టు పడకూడదు.కొంప మధ్య గోడ లేవకూడదు. ఇది మాత్రం నువ్వు చేయాలి అని బరజు దగ్గర మాట తీసుకుంటాడు. తల్లి మాటలు విని మాకోసం యేమి దాచి పెట్టావ్ తాతా అని అడుగుతారు పిల్లలు. శామపధాను వేలెత్తి పైకి చూపిస్తూ మీ కోసం ధర్మం ధర్మం దాచిపెట్టాను అంటూ కన్ను మూస్తాడు.
హరిమిశ్రా ఆ ఊరి పంచాయితీ ప్రెసిడెంట్. ఎవరికి అప్పునిచ్చి వారికి ఉన్న చెక్కా ముక్కా మడి ని కూడా తన దాంట్లో కలిపేసుకోవాలని చూస్తూ ఉండే వ్యక్తి. శామపదాను వుండగా ఆ గ్రామంలో అతని ఆటలు సాగవు. ఇప్పుడు తండ్రి స్థానంలో తండ్రి కన్నా యెక్కువగా బరజు ఆ ఊరి వారందరికీ ప్రియపాత్రుడు అయ్యాడు. ఊరి జనంలోకన్నా ఇంట్లోనే చిచ్చులు పెట్టి అన్నదమ్మలని విడదీయాలని పన్నాగాలు పన్నుతాడు.
ఇక పెద్దదిక్కులేని యింట్లో తోడికోడళ్ళిద్దరూ తమలపాకుతో నేనొకటి అంటే తలుపు చెక్కతో నేను రెండు అంటా అనుకునే బాపతు. రోజూ ఒకరిమీద ఒకరు భర్తలకు పితూరీలు చెప్పుకునే వారు. చిన్న కోడలు.. ఆమెకు నలుగురు పిల్లలున్నారు నాకేమన్నా పిల్లా జెల్లా నేనెందుకు యెక్కువ పని జేయాలి అంటూ నిత్యం గొడవపడేది. ఆ గొడవుల మధ్యే కొన్నేళ్ళు గడిచిపోతాయి. ఛకడీ పనులు చేసేవాడు కాదు. పైగా భార్య మాటలు విని అన్నని వదినని మాటలు అంటూ వుండేవాడు. బరజు భార్యనే కోప్పడి,ఆమె వినక పోతే మౌనంగా మాటాడకుండా శిక్షించి తమ్ముడితో అతని భార్యతో గొడవలు పడకుండా సర్దుకుపోయేటట్లుగాను ఆమె వారిని ప్రేమించే రీతిలో భార్యలో మార్పు తీసుకువస్తాడు. ఉమ్మడి కుటుంబంలోనే పిల్లలకి పెళ్లిళ్లు చేసుకుంటున్నాడు. మనకి రావాల్సిన సొమ్ముకి లెక్కా పత్రం లేదు అంటూ చకడి చెవిలో పోరుతో ఉండేది అతని భార్య. తండ్రి మాటను మనసులో ఉంచుకుని అన్నదమ్ములు విడిపోకుండా వుండటానికి చాలా చేసాడు బరజు. అయిననూ ఆ అగ్గి ఆరలేదు. కోతకు వచ్చిన పంటను వండిన బెల్లాన్ని తీసుకుని బజారులో అమ్ముకుంటాడు. అయిననూ బరజు తమ్ముడిని ఏమీ అనడు.
అప్పట్లోనే వూర్లో పేదవాళ్ళపై జులుం చూపి అన్యాయంగా దండిస్తాడు హరిమిశ్రా. ఊరందరూ బరజు మాటలతో ఏకం అవుతారు. కలిసికట్టుగా అన్యాయాన్ని యెదుర్కోవాలని మాట చేసుకుంటారు. ఓటమిని సహించలేక హరిమిశ్రా మరింత కక్ష పెంచుకుంటాడు. అతని చెప్పుడు మాటలు విని వెనుకనుండి భార్య రెచ్చగొడుతూ వుండటమూ వల్ల యెట్టకేలకు మొహమాటాన్నివీడి గొంతు పెద్దది చేసి అసలు విషయాన్ని వెల్లడిస్తాడు చకడి. పిల్లల పెళ్ళికి అయిన ఖర్చు వివరాలు ఆ లెక్క చెపుతూ నాకు సగభాగాన్ని పంచి ఇవ్వమని అడుగుతాడు. బరజు యేమీ మాట్లాడకుండా సమస్తం తమ్ముడికి వొదిలేసి చిన్ని బట్టల మూటతో భార్యా పిల్లలతో కలిసి వూరు విడిచి వెళ్ళిపోతాడు. ఆ వెళ్ళే దృశ్యాన్ని రామాయణ కావ్యంలో శ్రీరామచంద్రుడు తండ్రిమాట అనుసరించి కానలకేగుతున్నప్పుడు విలపించినట్లు వూరు వూరంతా బరజును అనుసరిస్తూ అతనికి వెళ్ళవద్దని ప్రాదేయపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటారు. ఆఖరికి ఏమవుతుందో తెలుసుకోవాలనుకుంటే మట్టి మనుషులు నవల చదవాల్సిందే. ముఖ్యంగా రచనా దర్పణంలో కొండంత వాస్తవాన్ని కొంచెంగా మాత్రమే చూపగలం. ఊహలకి అందని మనిషితనం యెప్పటికప్పుడు సంస్కరింపబడుతూ వుండటం వల్ల నిజజీవితంలో దానిని చివరికంటా చూడగలం. మంచి సాహిత్యం ఆ మార్గంలో మనిషిని నడిపిస్తుంది.
పిల్లల కోసం ముందు తరాల వారు స్దిర చరాస్తులు వస్తువాహనాలు కాదు సంపాదించాల్సింది.. ధర్మం అని .. ఆ ధర్మమే మానవుని మనుగడకు సాక్షీభూతమై నిలుస్తుందని.. తమ పూర్వీకులు అదే పని చేసారని తనూ అదే పని చేసానని శామపధాను కొడుకుకి చెబుతూ .. అదే ధర్మాన్ని ఆచరింపమని కొడుకు బరజు ఛకడి లకు చెబుతాడు. నవలలోపాత్రల ద్వారా పలికించడం ఆచరింపజేయడమూ చేత ఆ రచయిత ధృక్ఫదం యేమిటన్నది సృష్టంగా తెలిసిపోతుంది. ఈ నవలలో నాకు బాగా నచ్చిన విషయం యిది.
ఇల్లు వొదిలిన కాలంలోనూ తమ్మునికి సమస్తం వొదిలేసి గమ్యం లేని ప్రయాణం చేస్తున్న ఆ రోజున కూడా పాండవులు అందరూ ఇలా అన్ని వదిలి అడవుల వెంట తిరగలేదా రామచంద్రుడు సీతతో కలిసి వనవాసం చేయలేదా.. అదీ ధర్మానికి కట్టుబడే కదా.. వారి బాటలోనే నేనూ అని అనుకుంటాడు బరజు.
పురిపండా అప్పలస్వామి గారి చక్కని బాషా సౌందర్యం ఆ అనువాదంలో నిండుకుని ఉంది. అక్కడక్కడా ఒడియా పదాలు ఉన్నప్పటికీ కింద ఫుట్ నోట్స్ ఇవ్వడం వల్ల చదవడానికి ఇబ్బంది లేకుండా హాయిగా వుంది. భారతీయ గ్రామీణ జీవనం తాలూకు ఆత్మ ఈ నవలలో ప్రతిబింబించింది. పాఠకుడు నవలాకాలంలోకి వెళ్ళి ఆ విరూపానదీ తీరంలో మంగళా అమ్మవారి సాక్షిగా ఆ పచ్చని చేలలో తిరుగుతూ కాయకష్టం చేసుకునే ఆ గ్రామీణుల అమాయకత్వంతో అమాయకంగా చైతన్యంలో చైతన్యంగా బరజు వెంట సహప్రయాణం చేస్తూ వుంటాం. ఈ నవలలో అంతగా లీనమై పోవడానికి కారణం మాత్రం నాదీ గ్రామీణ వ్యవసాయ నేపధ్యం కావడం వలెనే అనుకుంటున్నాను. ఉమ్మడి కుటుంబాలు లేకపోయినా కనీసం రక్తసంబంధీకుల మధ్యనైనా ఆత్మీయభావన నెలకొని ఉండటానికి చదివిన పాఠకుల మనసుని కాస్త తడి చేయడానికి ఈ నవలా పఠనం దోహదం చేస్తుందని నేను నమ్ముతున్నాను.
మరొక నవలా పరిచయంతో మరొకసారి. నమస్సులతో ..
  

ఇదిగో యీ  లింక్ లో యీ నవలను చదవచ్చు.  మట్టి మనుషులు -పురిపండా అప్పలస్వామి

  
   

కామెంట్‌లు లేవు: