13, డిసెంబర్ 2018, గురువారం

రెక్కల గుఱ్ఱం




(ఈ చిత్రం అట్లాంటా బొటానికల్ గార్డెన్ లో తీసినది) 

చందమామ కథలో చదివా రెక్కల గుర్రాలవుంటాయని నమ్మడానికి ఎంతో బాగుంది... ఇదిగో యీ చిత్రం చూడగానే యిలాగే పాడుకున్నాను. చందమామ కథలను గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ ... ఫోటో తీసుకోవాలని ముచ్చట పడ్డాను. నా కన్నా ముందు యింకొందరు చిత్రాలు తీసుకుంటే వేచి చూస్తూ వరుసలో నిలబడ్డాను. నేను ఫోటో తీస్తుంటే మరికొందరు చిత్రంలో వాళ్ళు కనబడకుండా ఆగి మరీ వేచి చూసారు. 

నా వుత్సాహం చూసి అబ్బాయి అమ్మా ... నువ్వక్కడ నిలబడు,ఆ రెక్కల గుర్రంతో పాటు నిన్నూ ఫోటో తీస్తాను అన్నాడు. నాలుగైదు చిత్రాలు తీసుకున్నాక ముందుకు వస్తుంటే మాకెదురు వస్తున్న శ్వేతజాతీయుడు.. మీ కెమెరాలో తాజ్ మహల్  చిత్రం వుందా... నా కెమెరాలో భద్రంగా ఉంది అన్నారు. మా అబ్బాయి నవ్వుతూ లేదు అన్నాడు. ఆ శ్వేతజాతీయుడి మాటల్లో శ్లేష నాకూ అబ్బాయికి అర్ధమై మళ్ళీ నవ్వుకున్నాము. కాసేపు అతను అక్కడే ఆగి వుంటే మా అబ్బాయితో అతనికి యిలా చెప్పించేదాన్ని.  

ఆ చెప్పించే విషయాన్నే మా అబ్బాయికి చెప్పాను నేను. ఇండియా అంటే తాజ్ మహల్ మాత్రమే కాదు. తాజ్ మహల్ కట్టడం అద్భుతమైనదే కానీ అంతకన్నా అద్భుతమైనవి మా దేశంలో చాలా వున్నాయి.     దేశం కోసం ప్రాణాలర్పించిన త్యాగజీవుల కోసం వెలిగే అమరజవాన్ జ్యోతి ఇండియా గేట్,  సతీష్ ధావన్  స్పేస్ సెంటర్ (ఇస్రో) భాక్రా డామ్, అదే తాజ్ మహల్ ని నిర్మించిన షాజహాన్ చక్రవర్తి నిర్మించిన  ఎర్రకోట పై  ఎగిరే మన జాతీయపతాక రెప రెపలు ఇవే గొప్ప నాకు.

ఇంకా చెప్పాలంటే మా ప్రకాశం బేరేజ్ అమరావతి పోలవరం ప్రాజెక్ట్ గొప్ప అని కూడా చెపుతాను అంటే.. అమ్మా .. అన్నాడు ఇక ఆగమన్నట్లు.  

కామెంట్‌లు లేవు: