20, డిసెంబర్ 2018, గురువారం

విచ్చిన్న సంసారము

అంతః బాహ్య సున్నిత సంఘర్షణల జీవన చిత్రిక రవీంద్రనాథ్ ఠాగూర్  నవలిక "విచ్చిన్న సంసారము" 


ఏ పుస్తకాన్నైనా   చదివిన తర్వాత నా ఆలోచనలను పఠనానుభవాన్ని క్లుప్తంగానైనా వ్రాసుకోవడం నాకలవాటు. ఆ వ్రాసుకోవడమే యింకొంచెం వివరంగా చేస్తే మరీ బావుంటుందని నాకనిపించినప్పుడల్లా ఇలా వ్యాసరూపంలో నిలిచివుంటున్నాయి.  నూట పద్దెనిమిది యేళ్ళ క్రితం (1901) విశ్వకవి నష్టానిర్ (Nastanirh)  బెంగాలీ భాషలోనూ తరువాత వారే ఆంగ్లములోనూ (The broken Nest )  వ్రాసిన నవల యిది.  ప్రముఖ దర్శకుడు సత్యజిత్ రే  నిర్మించిన " చారులత (1964లో) చిత్రానికి మూల కథ యీ నవల. రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క రహస్య ప్రేమ కథ అని కూడా అని చెప్పుకున్న కబుర్లను చదివాను. అంత పెద్ద విశేషాన్ని విన్న తర్వాత మనసు ఆగుతుందా చెప్పండి?. చాలా సార్లు ఆ చిత్రాన్ని చూసాను. కొందరి పరిచయాలలో చదివాను కూడా. అయితే బెంగాలీలోనూ ఆంగ్లంలోనూ చదవడం నాకు కష్టం కాబట్టి తెలుగులో వెతుకుతూ వుండేదాన్ని. నా శ్రమ ఫలించి "విచ్చిన సంసారము" పేరిట ఈ నవలను నేను చూడటం తటస్థించింది.  1955 లో  తెలుగులో మొదటి ముద్రణ వచ్చింది.  తెలుగు అనువాదం కారుమూరి వైకుంఠ రావు.వీరు కథాగుచ్చం  అనే పేరిట ఠాగూర్ కథలను నాలుగు సంపుటాలుగా తెలుగులోకి అనువదించారు.    


    భూపతి ధనవంతుల కుటుంబంలో పుట్టాడు అతనికి పని చేయవలసిన అవసరం లేదు. ఇంగ్లీష్ విద్యకూడా అభ్యసించాడు.  చందా కట్టి అనేక పుస్తకాలను తెప్పించుకునేవాడు కానీ యేనాడైనా చదివిన పాపానబోడు.  పత్రికలకు ఇంగ్లీష్ లో ఉత్తరాలు వ్రాయడం వ్యాపకంగా పెట్టుకుంటాడు. ఒక ఇంగ్లీష్ పత్రికను కూడా స్థాపిస్తాడు .  వరుసకు బావమరిది అయ్యే ఉమాపతి  ఇతనిని బాగా ప్రోత్సహిస్తూ ఉంటాడు.ఉమాపతి గతంలో ప్లీడర్ వృత్తి చేస్తూ అందులో నెగ్గలేక భూపతి చెంత చేరి పత్రిక పనిలో పాలుపంచుకుంటాడు  


భూపతి భార్య  చారులత. ఆమెకు ఇంట్లో పని చేయవలసిన పనే లేదు. పుస్తకాలు చదవడం అనే అలవాటువల్ల ఆమెకి సులువుగా కాలక్షేపం జరిగిపోతూ ఉండేది. భార్యకు  మరింత కాలక్షేపం అవుతుందని పల్లె నుండి  ఉమాపతి భార్య మందాకిని ని పిలిపిస్తాడు. మేనత్త కొడుకు అమల్  ని  యింటికి తీసుకొచ్చి ఆశ్రయమిచ్చి చదువుకోవడానికి సహాయం చేస్తూ అతనిని చారులతకు ఇంగ్లీష్ నేర్పించమని పురమాయిస్తాడు. 


 ఒకే వయసు వారైన  చారులత కు అమల్ కి బాగా స్నేహం కుదురుతుంది. చారులత  అమల్ కు పుస్తకాలు కొనుక్కోవడానికి కాలేజీలో మధ్యాహ్నం ఫలహారం చేయడానికి డబ్బులు ఇస్తూ ఉంటుంది. చారులత  అతిశయం లేదు కానీ   అభిమానవంతురాలు. తనకి రానిదేదైననూ రాదనీ వొప్పుకోవడం ఆమెకిష్టం వుండదు. ఆఖరికి వూలుతో మేజోళ్ళు అల్లడం రాదని  చెప్పకుండా బజారులో కొనుక్కోమని చెపుతుంది కానీ కొద్దిరోజులకే మేజోళ్ళను అల్లడం నేర్చుకుని  అల్లి అమల్  కి బహుకరిస్తుంది.మెడకి  చుట్టుకునే పెద్ద పూల  రుమాలును కూడా  అల్లి అతనికి బహుకరిస్తుంది.


చారులత అమల్ కలిసి భవనం వెనుక గల స్థలమును మంచి ఉద్యానవనంగా తీర్చిదిద్దాలని కమిటీ వేసుకుంటారు.  భూపతికి తెలియకుండా రహస్యంగా ఆ  ఉద్యానవనము నిర్మించి అతనిని ఆశ్చర్య పరచాలని చారులత అభిలాష. ఆ ఉద్యానవనంలో చిన్న సరస్సు అందులో నీలివర్ణ తామర పుష్పాలను పూయించాలని హంసలు పెంచాలని ఆమె కల. ఆమె ఊహలు  అన్ని అబ్బురమైనవి.ఆలోచనలు సున్నితమైనవి. కలలను వాస్తవరూపంలో తీసుకురాగల సహకారం భర్త నుండి ఆమె ఆశించలేదు. అతనెప్పుడూ మిత్రులతో సాహిత్యచర్చలు చేస్తూ పత్రికలకు సంబంధించిన లెక్కలు చూసుకుంటూ భార్యకు కొద్దిగా నైనా  ప్రేమనివ్వాలనే ముఖ్య విషయాన్ని మర్చిపోతుంటాడు.   చారులత అమల్ ఇంటి వెనుక వున్న తోటలో తిరుగుతూ .. పుస్తకాలు చదువుతూ ఆడుతూ పాడుతూ కవిత్వాలు అల్లుకుంటూ వుంటారు. 


అమల్ కూడా చారులత లాగానే ఊహాశక్తి అధికంగా కలవాడు.  దోమ తెరలపై పెన్సిల్ తో లతలు గీసి  దానిని కుట్టుపనితో అందంగా ఉండేటట్లు చేయమని చారులతను అడగడం,  కవిత్వం వ్రాయడం అది చారులత చూసి ఆనందించి మరికొన్ని వ్రాయమని ప్రోత్సహహించడమూ అతను అనేక వ్యాసాలూ వ్రాసి పత్రికలకు పంపడమూ మంచి పేరు రావడమూ జరుగుతుంది. చారులతను కవ్వించి ఆమెలో ఉన్న సృజనాత్మక శక్తులను వెలికిదీయడంతోపాటు తనతో స్నేహానికి  , భావాలు పంచుకోవడానికి పలు విషయాలను  చర్చించడానికి తగిన వ్యక్తిగా భావిస్తాడు పైగా భూపతి చేసే సహాయమే కాకుండా   ఆమె వల్ల కూడా అధిక సహాయం పొందుతూ ఉంటాడు. కానీ ఆటకాయితనంగా చారులతను ఉడికించాలని చూస్తూ  మందాకినికి  తన రచనలు చదివి వినిపిస్తూ చారులతలో అసూయకు తెరదీస్తాడు  .


సమవయస్కుడైన అతని ఆకర్షణలో మోహంలో పడిన చారులత  అతను నామమాత్రంగా నైనా  ఇంకొక స్త్రీ కి ప్రాధాన్యం ఇవ్వడం భరించలేక  అపవాదులు వేయడానికి కూడా సిద్ధపడుతుంది.  మందాకిని  పై అక్కసుతో  ఆమెలో  వివేకం  ఆత్మహత్య చేసుకుంటుంది. అమల్ అప్పుడు గ్రహిస్తాడు. చారులతకు నచ్చనప్పుడు తానైనా అలాగే ఇంటి నుండి గెంటివేయబడటం జరుగుతుందని.కానీ మందాకినీ  భర్త ఉమాపతి భూపతిని మోసం చేస్తూ మిగుల్చుకున్న మొత్తాన్ని అక్కడినుండి దాటేయడానికే మందాకినీ వెళ్ళిపోతుందని తర్వాత అర్ధమవుతుంది.  అమల్ కి పెళ్ళిసంబంధాలు చూడమని   భర్తకి సూచిస్తుంది. చూసుంటే ..మీరు చూస్తే సరిపోతుందా నేను చూడొద్దా అని గొడవపెడుతుంది.  తీరా మంచి కుటుంబం అతనిని అల్లుడిగా చేసుకోవడానికి  అతనిని విదేశాలకు పంపడానికి  అంగీకరించే సరికి మళ్ళీ అంతలోనే తేరుకుని అతను  ఆమెకు దూరమవుతున్నట్లు గ్రహించి దుఃఖపడుతుంది. 

   

అమల్  వివాహం చేసుకుని విదేశాలకి వెళ్ళిపోయాక చారులత లోలోపల చాలా దుఃఖపడుతుంది. ఆమె దుఃఖాన్ని గుర్తించే స్థితిలో కూడా భూపతి వుండదు. బావమరిది చేసిన మోసాల వల్ల  అప్పులధికమై పత్రికను మూసివేసే పరిస్థితి వస్తుంది. అంతటి కష్టంలో ఉన్న తనకు సాంత్వన కల్గించే శక్తి భార్య దగ్గరే లభిస్తుందని తెలుసుకుని వడి వడిగా భార్య గదికి వస్తాడు వేళకాని వేళలో. అతను వచ్చేటప్పటికి ఏదో వ్రాసుకుంటున్న చారులత అప్రయత్నంగా ఆ పుస్తకాన్ని దాచేస్తుంది. నా భార్యకి  కూడా నాకు తెలియని రహస్యాలు వున్నాయా ఆమె కూడా నన్ను మోసగిస్తుందా అని తలపోస్తాడు. చారులత అమల్ గురించిన ఆలోచనలు ప్రక్కకు నెట్టి భర్త కిష్టమైన వంటలు చేస్తుంది.శ్రద్దగా అలంకరించుకుంటుంది. కానీ భార్యాభర్తలిరువురు ఎవరి ఆలోచనల్లో వారుండి స్తబ్దతను చేదించి  మనసులని కలబోసుకోలేకపోతారు.  


విదేశాలకి వెళ్లిన అమల్  తనకొక ఉత్తరమైనా వ్రాస్తాడని యెదురుచూస్తుంది. అమల్ ఏమైనా ఉత్తరం వ్రాశాడా అని పదే పదే అడుగుతూ ఉంటుంది.   అతని క్షేమ సమాచారం కొరకు ఆత్రుత పడుతుంది. అమల్ పదే పదే ఉత్తరం పంపడం కూడా ఖర్చుతో కూడిన పని కాబట్టి అంత కంగారు అవసరం లేదని భూపతి ఆ విషయాన్ని తేలికగా తీసుకోమని చెపుతుంటాడు. చారులత తన నగని రహస్యంగా అమ్మి ఆ డబ్బుతో అమల్ కి తంతి పంపుతుంది. తిరుగు తంతికి కూడా డబ్బు కట్టి పంపుతుంది. తిరిగి తంతి వచ్చే రోజుకి  భూపతిని  వూరికి వెళ్లి తన చెల్లిని చూసి రమ్మని పంపుతుంది. అయితే  ఆ తంతి నేరుగా భూపతి చేతుల్లో పడటమూ ఎక్కడో అతనిలో లీలామాత్రంగా ఉన్న అనుమానానికి తోడు రుజువు లభించడంతో భూపతి భార్యని అసహ్యించుకుంటాడు.ఆమెని శిక్షించనూలేక  క్షమించలేక మానసికంగా కృంగిపోతాడు.  దేశానికి మరో వైపునున్న బెంగళూరు నగరంలో వున్న వొక  పత్రికకు పని చేయడానికి ఒంటరిగా వెళ్లాలని నిశ్చయించుకుని చారులతకు చెప్పినప్పుడు ఆమె "మరి నేనూ" అని అడుగుతుంది.  అంతలోనే అతను భార్యపై జాలిపడి ప్రయాణానికి సిద్దమవమని అంటాడు. అతని అంతరంగం అర్ధమై ఆభిజాత్యంతో  ఆమె వద్దు అవసరం లేదు అంటుంది. ఇదీ కథ.  చారులతకు అమల్ రూపంలో  ఎదురైన ఆకర్షణ భర్త  ప్రేమరాహిత్యం, భూపతి మనః సంఘర్షణ, అమల్ కుర్రతనపు ఆలోచనలు,బ్రతకనేర్చిన తనమూ అన్నీ కళ్ళకు కట్టినట్లు ఉంటాయి. మానవుల సహజ బలహీనతలు  కలలు ప్రపంచమూ అన్నీ సహజంగా చిత్రికపట్టారు.  


ఈ నవల చదువుతున్నప్పుడూ తర్వాతా నాకు కల్గిన ఆలోచనలు 

బెంగాలీ కుటుంబాలంటేనే సంగీత సాహిత్యాలకు నెలవు.వారు మనకన్నా ఎంతోముందు ఉన్నారనేది నిజం. అందుకే ఇంత అందమైన రచన ఆలోచింపదగిన  సాంఘిక నవల అక్కడ రావడం తటస్థించింది. మనకు అలాంటి తెలుగు నవలలు యేమైనా వున్నాయా అని చదివినవాటిని గుర్తుకు తెచ్చే ప్రయత్నం చేసాను కానీ నాకు అంత స్ఫురించలేదు కూడా. ప్రస్తుత కాలానికి ముడిపెట్టి ఈ నవలను వ్యాఖ్యానించడం సబబు కాకపోయినప్పటికినీ వ్యాఖ్యానించక తప్పడం లేదు. ఎవరి అభిరుచులు ఎవరి ఆసక్తులు వారివైపోయి పాలునీళ్ళు లా కలిసిపోవాల్సిన భార్యాభర్తల బంధాలు మొక్కుబడిగా మారడం వెనుక ఇదిగో ఇలాంటి కారణాలే ఉంటున్నాయి. పర స్త్రీ పురుష ఆకర్షణలు మొదలై  సంసార విచ్చిన్నానికి దారితీస్తున్నాయి.  పూలను సృష్టించినవాడే తుమ్మెదలను సృష్టించాడు కానీ  గొడ్డలిని సృష్టించలేదు. ఆ గొడ్డలిని మనమే సృష్టించుకుంటున్నాం కదా.  సంసారం విచ్చిన్నమైనదని భూపతికి  చదివిన పాఠకులకు తోస్తుందేమో కానీ నేను బాగా గమనించిన విషయం యేమిటంటే  చారులత దృష్టిలో అమల్ తో ఆమె కట్టుకోవాలనుకున్న కలల  గూడు రూపంలోకి మారకుండానే అవిసిపోవడం విషాదం అవుతూనే సంసారమనే గూడు కూడా  విచ్చిన్నమవుతుంది. 


వంద పేజీలకు పైన వున్న యీ నవల ప్రతీకారం అనే పెద్దకథతో కలిసి మొత్తం 144 పేజీలవరకు  వరకూ ఉంది. ఈ నవల  ధనవంతులైన బెంగాలీ బాబుల భద్రలోక అంతఃపుర స్త్రీల చపల చిత్తాన్ని,ప్రేమరాహిత్యాన్ని బట్టబయలు చేసింది. సత్యజిత్ రే   సినిమాటిక్ ముగింపు స్పష్టతనివ్వదు. ఒక ఆశావాదంతో కథ ముగుస్తుంది. కానీ ఈ నవల నిరాశ మధ్య కొనసాగుతూ ఉంటుంది.  ఠాగూర్ తన నలభయ్యోయేట వ్రాసిన పుస్తకం ఆయన మరణించిన తర్వాత పద్నాలుగేండ్లకి మన తెలుగులో అనువాదం అయిన నవల.


చారులత కు స్వంత ఖర్చుల కోసం కొంత ధనము ఇవ్వడం అని ఉదహరిస్తారు ఒకచోట. రచనలలో ఠాగూర్ లో అభ్యుదయ కోణాన్ని ఇక్కడ గమనించవచ్చు. అప్పటి బెంగాలీ ధనవంతుల కుటుంబంలో అలా ఉండేదో లేక ఠాగూర్ స్త్రీకి స్వంత ఖర్చుల కోసం ధనం ఇవ్వడం అవసరమని భావించాడో కానీ.. ఆ ప్రస్తావన బాగుంటుంది. 


చారులత మానసిక కల్లోలమూ, ప్రేమైక హృదయం,వివాహిత స్త్రీగా ఆమె వివేకమూ మొత్తంగా చూస్తే  ఆమెపై పాఠకునికి కొంత జాలి మరికొంత విచారమూ కల్గుతుంది.భూపతి అలా ఉండకుండా ఉంటె బాగుండేది అనుకుంటాం తప్ప ఆ పాత్రపైన కోపమూ వుండదు. ఏ ఒక్క పాత్రపైనా విముఖత లేదా  ప్రేమ కలగని నిశ్చల హృదయంతో పుస్తకము మూసేసి నిరామయంగా ఉండిపోతాము. అనుభూతికి అందని దృశ్యాన్ని యెంత వర్ణించినప్పటికినూ అనుభవానికి రాని రుచిని ఆస్వాదించినట్లే వుంటుంది కాబట్టి యింకా యెక్కువ చెప్పకుండా ముగిస్తాను.     


పనిలేనివాడు పొట్టు తీయకుండా పల్లీలు తిన్నట్టు అసలు సిసలు రచన చదవాలంటే The Broken Nest  ఆంగ్ల నవలను చదువుకోవడమూ, అబ్బా చదివే ఓపిక యెక్కడుందిలే అనుకుంటే Charulatha  ఇంగ్లీష్ సంభాషణలతో వున్న నలుపుతెలుపుల సత్యజిత్ రే చిత్రాన్ని,   కాస్త ఆకర్షణీయంగా వుండాలనుకుంటే రంగుల చిత్రాన్ని చూడటమూ చేయవచ్చును. తెలుగులో చదవాలనుకుంటే pdf లో చదువుకోవచ్చు.     


https://www.youtube.com/watch?v=SVuZLVrPq98 చారులత ఇంగ్లీష్ సంభాషణలతో ఉన్న చిత్రం ఇక్కడ అందుబాటులో ఉంది.

The  Broken Nest అనురాగ్ బసు భార్య Tani Basu ఈ చిత్రాన్ని మరొకసారి నిర్మించారు The Epic Channel లో అందుబాటులో ఉంది 


మరొక నవలను పరిచయం చేస్తూ మరొకసారి... 


విచ్చిన్న సంసారం _ రవీంద్రనాథ్ ఠాగూర్ 

కామెంట్‌లు లేవు: