సాహిత్యం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
సాహిత్యం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

21, ఏప్రిల్ 2020, మంగళవారం

జంధ్యాల పాపయ్యశాస్త్రి .. పద్యాలు

అంజలి
పుట్టబోయెడి బుల్లి బుజ్జాయి కోసమై
పొదుగు గిన్నెకు పాలు పోసి పో్సి -
పుట్టబోయెడి బుల్లి బుజ్జాయి కోసమై
పొదుగు గిన్నెకు పాలు పోసి పో్సి -
కలికి వెన్నెలలూరు చలువ దోసిళ్ళతో
లతలకు మారాకులతికి అతికి -
పూల కంచాలలో రోలంబములకు
రేపటి భోజనము సిద్ధపరచి, పరచి -
తెలవారకుండ మొగ్గలలో జొరబడి
వింతవింతల రంగు వేసి వేసి -
తీరికే లేని విశ్వసంసారమందు
అలసిపోయితివేమొ దేవాధిదేవా!
దేవాధిదేవా!
ఒక్క నిమేషమ్ము
కన్నుమూయుదువు గాని రమ్ము, రమ్ము
తెరచితి నా కుటీరమ్ము తలుపు

హృదయ పూజ
కూర్చుండ మాయింట కురిచీలు లేవు,
నా ప్రణయాంకమే సిద్ధపరచనుంటి;
పాద్యమ్ములిడ మాకు పన్నీరు లేదు,
నా కన్నీళ్ళతో కాళ్ళు కడుగనుంటి.
పూజకై మా వీట పుష్పాలు లేవు,
నా ప్రేమాంజలులె సమర్పించనుంటి;
నైవేద్యమిడ మాకు నారికేళము లేదు,
హృదయమే చేతికందీయనుంటి!
లోటు రానీయనున్నంతలోన నీకు,
రమ్ము! దయచేయుమాత్మ పీఠమ్ము పైకి,
అమృత ఝరి చిందు నీ పదాంకములయందు
కోటి స్వర్గాలు మొలిపించుకొనుచు తండ్రీ!



25, మార్చి 2020, బుధవారం

నా బ్లాగ్ మరియు కథలపై పత్ర సమర్పణ



కొద్దిగా ఆలస్యంగా పంచుకుంటున్న విశేషం. 
47 రోజులకు ... నా గోడపైకి మళ్ళీ తిరిగి వచ్చాను. .నా రాకకు కారణం ... కొంచెం సంతోషంగా అనిపించడమే ...
నా చుట్టూ వున్న స్త్రీల జీవితాలని, వారిపై వున్న అణచివేతని చూస్తూ వున్నప్పుడు అందులో నన్ను నేను చూసుకుంటాను. అప్పుడు నేనూ తోటి స్త్రీల పక్షాన నిలిచి కవిత్వపు జెండానవ్వాలనిపిస్తుంది. నేను విన్నవి, కన్నవి యిన్ని బాహ్య ప్రపంచపు బాధలు నాకు నిద్ర లేకుండా చేసి కలవరపెడతాయి ... అపుడవి కథలుగా రూపం సంతరించుకుంటాయి. వాటిని నా చుట్టూ ఉన్న ప్రపంచం గుర్తించి స్పందన తెలిపినప్పుడు ... నాతో పాటు మరికొందరు సమస్యలను బాధలను గుర్తిస్తున్నారని తెలిసి కొంత తెరిపినపడతాను.
ఇంతకీ విషయం యేమిటంటే ...నా ఫోన్ నెంబర్ కోసం google search చేస్తున్నట్లు నేను గమనించాను. వివరాలు చూద్దామని వెళితే ... ఇటీవలే ప్రచురితమైన ఒక సమీక్ష చదివి ... సంభ్రమాశ్చర్యాలకు లోనై ... వివరంగా చదువుకుంటూ వెళ్ళాను. నేను pen down చేసినప్పుడల్లా ... నన్ను మళ్ళీ నిలబెట్టేవి .ఇలాంటి ఉత్తేజాలే !
Pratyusha Velaga... deportment of English Sri Padmavati Viswavidyalayam ... నేను వ్రాసిన కథలపై సమీక్ష చేయడం (థియరి లో పేపర్ సమర్పించడం )..ఆనందం కల్గించింది ... Thank you so Much ప్రత్యూష .. http://www.jctjournal.com/gallery/107-feb2020.pdf
jctjournal.com gallery లో నేను కనుగొన్న ... ఈ వ్యాసాన్ని మీరు కూడా ఇక్కడ చూడవచ్చు . ప్రత్యూష కి ధన్యవాదాలు.

 వీలు చూసుకుని తనతో ఒకసారి మాట్లాడాలి . నా బ్లాగ్ ని కథలను ఆ అమ్మాయి క్షుణంగా చదివింది . రెండు రోజులు తర్వాత తెలిసింది ..తను పద్మావతి వడ్లమూడి గారి అమ్మాయని. మరింత సంతోషంగా ఫీల్ అయ్యాను.  పద్మ గారు కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నానని చెప్పారు. 

https://drive.google.com/…/191TgMwpNAvjdOHEhBAwTX4B6w…/view… లింక్ ఇక్కడ ప్రక్కనే తెరవవచ్చు  > నా బ్లాగ్ మరియు కథలపై ఆంగ్లంలో పత్ర సమర్పణ

25, సెప్టెంబర్ 2019, బుధవారం

కలువపూల చెంత చేరి



కలువపూల చెంత చేరి కై మోడ్పు చేతును
నా కలికి మిన్న కన్నులలో  కళ కళ విరియాలని

మబ్బులతో వొక్కమారు  మనవి సేతుకొందును
నా అంగన పాలాంగనమున ముంగురులై కదలాలని

చుక్కలతో వొక్కసారి చూసింతును
నా ప్రేయసి నల్లని వాల్జడ సందుల మల్లియలై  మొలవాలని

పూర్ణ సుధాకర బింబంబునకు వినతి చేతును
నా పొలతికి ముఖబింబమై కళలు దిద్దుకోవాలని

ప్రకృతి ముందు చేతులెత్తి ప్రార్దింతును కడసారిగా
నా రమణికీ బదులుగా ఆకారం ధరియించాలని

**********************

ఏ పారిజాతమ్ము లియ్యగలనో సఖీ
గిరి మల్లికలు తప్ప గరికపూలు తప్ప
ఏ కానుకలను అందించగలనో చెలి
గుండె లోతుల దాచుకున్న వలపులు  తప్ప
జగతిపై నడయాడు చంచలా వల్లికా
తరుణి ఆకృతి దాల్చు శరదిందుచంద్రికా
శరదిందు చంద్రికా..  నీవు లేని తొలిరాతిరి
నిట్టూర్పుల పెను చీకటి

నీవు లేని విరిపానుపు  నిప్పులు చెరిగే కుంపటి
విరులెందుకు సిరులెందుకు  మనసులేక మరులెందుకు
తలపెందుకు తనువెందుకు  నీవు లేక నేనెందుకు
నీవు లేక నేనెందుకు

ఈ రెండు ఖండికలు   జ్ఞాన పీఠ ఆవార్డ్ గ్రహీత డా. సింగిరెడ్డి  నారాయణ రెడ్డి గారు వ్రాసినవి ..  మొదటిది "చూపులతో వొక్కసారి చూసింతును" అనే కావ్యంలో నుండియు రెండవది "ప్రకృతిలో ప్రణయిని " లో నుండియు తీసుకుని యీ చిత్రంలో పొందుపరిచారు.
 పూర్వ జ్ఞానపీఠ అవార్డ్ గ్రహీత  విశ్వనాథ సత్యనారాయణ రచించిన నవల "ఏకవీర" ను  1969 సంవత్సరంలో నిర్మించిన "ఏకవీర " చిత్రంలో  ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం ఆలపించారు. సంగీతం కె వి మహదేవన్.






ఈ వీడియో .. పూర్తి గేయం లేదు. పూర్తిగా వినాలనుకుంటే Mp3 లో వినగలమని గమనించగలరు.
ఈ రెండు గేయాల సాహిత్యాన్ని చదువరులకు పరిచయం చేయడం మరియు టెక్స్ట్ లో లభించేవిధంగానూ ఉండుటకు చిరు ప్రయత్నం చేయడమైనది. తప్పులు ఉన్నట్లయితే మన్నించగలరు. వింటూ వ్రాయడం జరిగింది.  

24, జూన్ 2019, సోమవారం

వర్ష ఆహ్వానం

చినుకు కోసం ఎదురుచూపులు .. దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి సాహిత్యం సాల్లూరి రాజేశ్వరరావు గారి సంగీతంలో రూప కల్పన చేయబడిన పాటను ఇష్టంగా చిత్రాలను కూర్చి ఒక వీడియో చేసాను. చూస్తారు కదూ.. 

 
పాట సాహిత్యం



28, జనవరి 2019, సోమవారం

విశ్వ కథా వీధి కథలు

వాడ్రేవు చిన వీరభద్రుడు గారు పరిచయం చేసిన విశ్వకథా వీధి ఐదో సంపుటిలోనూ ఆరుకథల్నీ ఆవురావురావురుమంటూ చదివాను. వాటి గురించి నా స్పందన.
“గుల్లీ” చదివాను. ప్రమాణం యెంత గొప్పది. ఎంత గొప్ప మనసు. విలువలు పాటించడంలో వున్నతి ధనిక పేదలో లేదు. అలాగే గుల్లీలో భూతదయ, దాదూ పై అల్లుకున్న ప్రేమ గొప్పగా వున్నాయి. ఛగన్ లాంటి గుంటనక్క ఉంటారని చెప్పిన కథ యిది.
"కసి" కథలో గఫార్ కసి సంస్కారవంతమైనది. అతనికి నా సెల్యూట్. వడ్డించిన భార్య చేతులను తన చేతులలోకి తీసుకుని కృతజ్ఞత తెలియజేసాడు. ఆ భావన యెంత సంతోషం కల్గిస్తుందో అనుభవిస్తే కాని తెలియదు. ఒక చేయి విరిగినా రెండో చేత్తో యువకుడిని కాపాడిన తక్షణ సంస్కారం మెచ్చుకోతగినది.విప్లవాలు ఎందుకు వస్తాయో ప్రజలెందుకు ఉద్యమిస్తారో అరటిపండు వొలిచి తినిపించినట్టు పరిచయం చేసేకథ యిది.
"డేగ" కథ మర్చిపోలేని కథ. తీవ్రవాదులను, క్రీడాకారులను ఇలాగే తయారు చేస్తారేమో ఇంకా చెప్పాలంటే ఇప్పటి మన ప్రభుత్వాలు సంక్షేమ పధకాలు ద్వారా ప్రజలకు కష్టపడకుండా సోమరులను చేసి ముప్పు తెచ్చుకోబెట్టారని నాకనిపించింది. పాపం రహీమ్ అనిపించలేదు. అతనికి అది సంతోషమే కల్గించినందుకేమో.
"దొంగ" కథ ...ఒక సామెతను గుర్తు చేసింది. కథలో యజమాని సేవకురాలు కాబట్టి ఆ సామెత పొసగక పోయినా సమంజసం కాకపోయినా " మొగుడ్ని కొట్టి మొగసాలకు ఎక్కడం లాంటిది"
"పిల్లలు -ముసిలివాళ్ళు" కథ చదివి విచలితమైపోయాను .యుద్ధం ఎందుకు చేసుకుంటారు రాజుగారి కోసం. యుద్ధంలో ఎంత బాగా చంపగలితే అంత గొప్ప. శత్రువు దగ్గర హృదయం ఉండదు శత్రువు దగ్గర హృదయం ఉండదు అంతే. కథ ముగింపు వాక్యాలు దుఃఖభరితంగా ఉంటాయి. వాక్యం ఎంత శక్తివంతంగా వ్రాయవచ్చో తెలిపే కథ యిది.
"ఆఖరి ఉత్తరం" ఆలోచింపజేసే కథ. బాగుంది. ప్రేమ కథలెప్పుడూ బాగుంటాయి. వృద్ధాప్యపు జ్ఞాపకాలలో స్థిరంగా ఉండేది యవ్వనమే. ఆ వృద్ధుడు తన ప్రేయసికి ఒక లేఖ వ్రాస్తాడు. స్వార్ధంలేని ప్రేమఒక్క భగవంతుడికే సాధ్యమవును అని చెపుతూ నా జీవితంలో సుఖ దుఃఖాలు రెండూ నీతోనే వచ్చాయి. ఆ రెండింటి కోసమూ నీ ముందు కృతజ్ఞుడిని నేను అంటాడు. కానీ అతను వ్రాసిన ఆఖరి ఉత్తరాన్నిప్రియురాలికి పోస్ట్ చేయకముందే అతను చనిపోతాడు. ఆ వృద్ధుని కొడుకు ఆ ఉత్తరాన్ని చూసి నాన్న రహస్యాలు మనకి తెలియడానికి వీల్లేదంటూ ఆ ఉత్తరాన్ని కాల్చేస్తాడు. కానీ తండ్రి మనసును తెలుసుకోలేకపోయానని దుఃఖిస్తాడు. మనో వైజ్ఞానిక కథ.
ఈ కథల్లో పరిచయమైన చాలా పదాలకు అర్ధం తెలుసుకోవాల్సి వుంది. పురిపండా గారి అనువాద రచనలు చదివి ఉండటం వల్ల అనువాద కథలే అనిపించలేదు.ఈ కథలను మళ్ళీ మళ్ళీ చదువుకోవాలి. కాలక్షేపపు కథలు కావివి. మంచి కథలను పరిచయం చేసిన వాడ్రేవు చిన వీర భద్రుడి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
విశ్వ కథా వీధి ఆరు భాగాలు కలిపి కథా సంకలనం గా పునర్ముద్రణ కాబోతుంది. కథాప్రపంచం వారు ప్రచురిస్తున్నారు. త్వరలో విడుదల కాబోతుంది. తప్పకుండా కొని చదువుకోవాల్సిన కథలివి.


23, ఏప్రిల్ 2015, గురువారం

కథా ఉత్సవం

   సాహితీ మిత్రులకి, బ్లాగ్ మిత్రులందరికీ , కథని  ప్రేమించే అందరికి ..హృదయపూర్వక ఆహ్వానం .

"ప్రాతినిధ్య " ముచ్చటగా మూడో సంవత్సరంలోకి అడుగు పెట్టింది . 24 కథలతో మన ముందుకు రాబోతుంది . ఆ కథా ఉత్సవాన్ని మిత్రులందరితో కలసి జరుపుకోవాలనుకుంటుంది. మీరందరూ కూడా .. ఈ ఉత్సవానికి హాజరవుతారని  మనసారా కాంక్షిస్తూ ...  వివరాలు ఇదిగోండి ... ఆ వేదికపై  తప్పకుండా కలుసుకుందాం . కథ ని పరిపుష్టం చేద్దాం .





31, మే 2013, శుక్రవారం

"కాలాతీత వ్యక్తులు" లో " ఇందిర"

కాలాతీత వ్యక్తులు  సమీక్ష




ఆకాశవాణి విజయవాడ కేంద్రం శతవసంత  సాహితీ మంజీరాలు కార్యక్రమం లో " కాలాతీత వ్యక్తులు " నవల ని ప్రసారం చేసినప్పుడు "ఇందిర" గురించి విన్నాను.  చాలా ఆసక్తిగా అనిపించింది.  

చాలా కాలం తర్వాత    మళ్ళీ కొన్ని నెలల క్రితం "కాలాతీత వ్యక్తులు " లో  కథా నాయిక ఎవరు అన్న సాహితీ వ్యాసం  (ఆంధ్రజ్యోతి - వివిధ - శ్రీ వల్లీ రాధిక ) చదివాను.

ఇటీవల  "కాలాతీతవ్యక్తులు" నవలని కొని చదవడం మొదలెట్టాను ఏకబిగిన చదివింప జేసిన ఈ నవల లోని పాత్ర లన్నింటి లోకి నన్నుఆకర్షించిన  పాత్ర "ఇందిర "

ఇందిర గురించి ఈ పరిచయం..

స్వాతంత్ర్యానంతరం వచ్చిన నవల లన్నింటిలోనూ కొన్ని నవలలను పంచకావ్యాల వంటివని సాహితీ కారులు పేర్కొన్నారు అందులో "కాలాతీత వ్యక్తులు " నవల ఒకటి .
ఈ నవలా రచయిత్రి డా ॥ పి.శ్రీదేవి.
మనకి స్వాతంత్ర్యం వచ్చిన పదేళ్ళకి వ్రాయబడిన సీరియల్ ఇది "తెలుగు స్వతంత్ర" లో 21 వారాల పాటు దారావాహికంగా వచ్చిన నవల ఇది. అప్పుడు గోరా శాస్త్రి గారు ఆ పత్రికకి సంపాదకులుగా ఉన్నారు
.
దేశ స్వాతంత్ర్యానంతరం పాశ్యాత్య నాగరికత ప్రభావంతో స్త్రీలలో వచ్చిన మార్పులకి, వారి ఆలోచన విధానంకి మధ్య తరగతి మనుషుల మనస్తత్వానికి ఈ నవల అద్దం పట్టింది
విశేషం ఏమిటంటే ఇప్పటి కాలానికి కూడా ఇందిర పాత్ర లాంటి స్త్రీలని మనం వ్యతిరేకిస్తూనే ఉండటం.

ఏబది అయిదు సంవత్సరాల క్రితం డా ॥ పి శ్రీదేవి గారు వ్రాసిన ఈ నవలలోని "ఇందిర" పాత్ర ఇప్పటి కాలంలోని చాలా మంది స్త్రీ పాత్రలకీ దర్పణం. స్త్రీ స్వతంత్రంగా ఆలోచించడం,సమాజం ఏమి అనుకున్నా పట్టించుకోకుండా తను బ్రతకాలి అనుకున్నట్లు బ్రతికీ తీరడం, తనదైన వ్యక్తిత్వం కల్గి ఉండటం, దానికి కాపాడుకోవాలని ప్రయత్నించడం ఇవన్నీ ఆ నవలలో గోచరిస్తాయి.

అసలు కాలాతీత వ్యక్తులు నవలలో ప్రధాన పాత్రధారిణి అనే విషయం పై కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

"కల్యాణి" పాత్ర ఆ నవలలో మరొక ముఖ్య పాత్ర.

ఈ నవలలోని పాత్ర లన్నింటి కంటే ఇందిర పాత్ర పాఠకులని ఆకర్షిస్తుంది నవలలోని మిగతా పాత్రలన్నీ కూడా ఆమె చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. అసలు ఈ పాత్ర లేకుంటే ఈ నవల ఇంత ప్రసిద్ది చెంది ఉండేది కాదు .

చాలా మంది కాలానికి అనుగుణంగా కాలగమనంలో ఒదిగిపోయి కాల ప్రవాహంలో కలసి పొతారు. కానీ ఇందిర అలాంటి వ్యక్తి కాదు. చిన్నతనంలోనే తల్లి మరణించినా తండ్రి దురలవాట్లు, భాద్యతా రాహిత్యం మధ్య స్వశక్తితో చదువుకుని ఉద్యోగం సంపాదించుకుంటుంది. చాలీ చాలని జీతం మధ్య అన్ని అవసరాలు తీరక పోవడం, తండ్రిని కూడా తానే పోషించాల్సి రావడం వల్ల కొన్ని సాంఘిక కట్టుబాట్లుని, లోక మర్యాదలని ఎదిరించింది. తనకి నచ్చిన రీతిలో హాయిగా జీవించడం నేర్చుకుంది. ఒక విధంగా కాలానికి లొంగకుండా తనకి ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా చలించకుండా మనిషి కృంగకుండా వాటిని ఎదిరించి అవసరం అయితే ఇతరులని మోసం చేయడం, వారిని నిర్దాక్షిణ్యంగా ప్రక్కకి నెట్టించి పరిస్థితులని తనకి అనుకూలంగా మార్చుకుంటుంది.

అందుకే ఇందిర పాత్ర చాలా మందికి నచ్చకపోవచ్చు కానీ ఈ నవలలో ప్రధాన పాత్ర ఇందిర. కాలాతీత వ్యక్తిగా కూడా ఆమెనే పేర్కొనవచ్చు. ప్రకాశంతో స్నేహం చేస్తుంది, షికారుగా అతనితో బీచ్ కి వెళుతుంది. ప్రకాశం స్నేహితుడు కృష్ణమూర్తి తో సెకండ్ షో సినిమాకి వెళుతుంది. తన సరదాలు,అవసరాలు తీర్చుకోవడం కోసం వారితో చనువుగాను మెలుగుతుంది. పక్షి లా ఎగిరి పోయే స్వేచ్చ కావాలని తనకి ఆ స్వేచ్చ ఉనప్పటికి తన రెక్కలు పేదరికం అనే తడితో బరువెక్కి ఎగరలేకపోతున్నానని చెప్పుకుంటుంది.

తాను ఉంటున్న ఇంటి పై భాగంలో అద్దెకి ఉంటున్న ప్రకాశం తనతో పాటు తన గదిలో పేయింగ్ గెస్ట్ గా ఉంటూ కాలేజ్ లో ఆన్సర్ చదువుకుంటున్న కల్యాణిల మధ్య చనువు పెరగడాన్ని గమనించిన ఇందిర ఈర్ష్య పడుతుంది. మగవారి దగ్గర కష్టాలు అన్నీ ఏకరువు పెట్టి సానుభూతి సంపాదించుకోవడం చేస్తుంది కల్యాణి అనుకుంటుంది.

ఇందిర పాత్ర ముక్కు సూటి దనం ఇలా ఉంటుంది.

"ఏమిటి ఆలోచిస్తున్నావ్" ప్రకాశం అని అడుగుతుంది ఇందిర
కల్యాణి గురించి అంటాడతను.

"అస్తమాను కల్యాణి కల్యాణి అంటావ్? నా గురించి ఆలోచించు, నేను అంత కన్నా ఎక్కువ బరువు ఈడ్చుకోస్తున్నాను, నా చదువుని మధ్యలో వదిలేసి ఉద్యోగం వెతుక్కోవలసి వస్తుంది. నాన్న సంగతి నీకు తెలుసు, అయినా గడియ గడియకు కాళ్ళు జాపి కూర్చుని ఏడవడం నాకు చేత కాదు, విశాలమైన కళ్ళు తిప్పి వల వలా ఏడ్చే స్తే నీ లాంటి జాలి గుండె కల మగ వాళ్ళు ఆదుకుంటారు. వాళ్లతో నేను కాలక్షేపం చేయలేను ఆమెలా జాలిగా కళ్ళు తిప్పడం నాకు చేత గాదు అంత నంగ నాచి తనం నాకు లేదు. నా బరువుతో ఇంకొకరి పై ఒదిగిపోయి కాలక్షేపం చేద్దామన్న దురాశ నాకు లేదు నేను బలపడి ఇంకొకరికి బలమివ్వాలనే తత్త్వం నాది " అంటుంది.

ఇందిర గురించి చదువుతున్నప్పుడు ఆ పాత్రపై అయిష్టం కల్గుతూ ఉంటుంది ఆమెలో ఈర్ష్య ని గమనిస్తాం ప్రకాశం కల్యాణి కి ఆకర్షితుదవుతున్నాడని తెలుసుకుని అతనిని తనవైపు మళ్ళించు కుంటుంది. పైగా కల్యాణి పై దుష్ప్రచారం చేసి ఆమె తన దారికి అడ్డురాకుండా చేసుకుంటుంది. అలాగే వసుంధర కృష్ణ మూర్తి పై ఇష్టాన్ని పెంచుకుంటుందని గమనించి అతనిని తెలివిగా తను దక్కించుకుంటుంది.

తనకి కావాల్సినదానిని బలవంతంగా అయినా దక్కించుకునే మనస్తత్వం ఆమెది.

ప్రపంచంలో ఒకరి కోసం ఒకరు ఏదీ చేయరు ఎవరి కోసం వాళ్ళే చేసుకుంటారు .. అది నాకు చేతనవును అనుకునే వ్యక్తి ఇందిర.

ప్రకాశం మేనమామ కుదిర్చిన పెళ్లి సంబంధాన్ని వదులుకుని ఆమె కోసం వచ్చినప్పుడు అతనిని తిరస్కరిస్తూ ఇలా అంటుంది.

"సాధారణంగా పిల్లలకి తల్లి దండ్రులు గార్డియన్ లాగా ఉంటారు నా దగ్గరకి వచ్చేసరికి తల్లక్రిండులై నేనే నాన్నకి గార్డియన్ కావాల్సి వచ్చింది ఆడదాని మనసు నీకు తెలియదు ప్రకాశం ! నేను నీకు ఉన్నాను ..నీ సమస్యలు,నీ బరువులు అన్నీ నా మీద వేయి అనగల్గే మగవాడు అవసరమైతే నా కోసం అన్నీ వదిలేసే మొగవాడు కావాలి, ప్రేమ కోరిన త్యాగం చేయలేనివాడు ప్రేమకి అనర్హులు. నీ మీద నేను చాలా మమకారం పెంచుకున్నాను నువ్వొక వెన్నుముక లేని మనిషివని నాకు తెలుసు. తోమగా తోమగా కొంత గట్టిపడతావు అనుకున్నాను. కొన్ని అనుభవాల తర్వాత అయినా ఒక మనిషిలా ప్రవర్తిస్తావనుకున్నాను. పుట్టుక నుండే నువ్వో సగం మనిషివి బీటలు వారిన వ్యక్తిత్వం. బాగు చేయాలని ప్రయత్నించాను కానీ అది నావల్ల కాదు.నీకు నాకు కుదరదు " అని నిర్మొహమాటంగా చెపుతుంది.

ఇదంతా చదువుతున్న పాఠకుడికి ఆమె పాత్ర పట్ల సరి అయిన అభిప్రాయమే కలుగదు. ఇందిర కొలీగ్ వైదేహి అన్నదమ్ములు ఆమెకి ఇష్టం లేని వాడిని చేసుకోమని బలవంతం చేస్తుంటే ఇల్లు విడిచి వచ్చేసి ఇందిర ఇంట్లో ఉంటుంది .. ఆమె ఇందిరతో ఇలా అంటుంది అమ్మాయిలు యాబై సార్లు సంతలో పశువుల బేరంలా నన్ను కూర్చోబెట్టి మాట్లాడటం నాకు ఇష్టం లేదు అంటే ఇందిర ఇలా అంటుంది . పశువు కాకపొతే మరో నందికేశుడు, జీవితమే పశువుల సంతలా అయినప్పుడు అమాయకంగా సుమతీ శతకంలో నీతులన్నీ వల్లే వేస్తే మనలని వెనక్కి నెట్టడం ఖాయం ఎలాగోలా తీర్ధంలో జనాన్ని మోచేతులతో నెట్టుకుని ముందుకు వెళ్ళడమే అంటుంది.

కావాలని కృష్ణ మూర్తికి దగ్గరవుతుంది తన జీవితం సుఖంగా సాగి పోవాలి అంటే కృష్ణ మూర్తి లాంటి వాడే తగిన వ్యక్తి అనుకుంటుంది అతనికి తగిన చదువు సంధ్యలు లేకపోయినా వెనుక ఉన్న ఆస్తిపాస్తులు ఉండటమే కాదు ఆ అస్తిపాస్తులే అతనిని నాశనం చేసాయి అనుకుంటుంది మనిషిలోని మంచి తనాన్ని గుర్తించి అతనితో జీవితాన్ని పంచుకోవడానికి ఒప్పుకుంటుంది.

ఇందిర ఏ పని అయినా మంచి అయినా చెడు అయినా తెలిసే చేస్తుంది మొహమాట పడటం అనేది అసలు ఉండనే ఉండదు. తన బ్రతుకు తను బ్రతకాలి అనుకున్నపుడు ఇతరులకి ఇబ్బంది కల్గించినా పట్టించుకోకుండా బ్రతకడం నేర్చుకుంటుంది. ఆమె అతిని ఎప్పుడూ ఇష్టపడదు, అతి ప్రేమ చూపించినా,అతిగా గౌరవించినా ఆమెకి ఇష్టం ఉండదు ఆమె ప్రవర్తన తెలిసి కూడా ఆమెని పెళ్లి చేసుకుంటానికి ముందుకు వచ్చిన కృష్ణ మూర్తి కూడా ఆ విషయాన్నే చెపుతుంది తానూ అతనికి లొంగి ఉండలేనని, తన వ్యక్తిత్వాన్ని చంపుకుని ఉండలేనని బ్రతుకంతా నిర్భయంగా బ్రతుకుతానని అంటుంది.

పురుషాధిక్య సమాజంలో మధ్య తరగతి కుటుంబం లో డుర్వ్యసనాల తండ్రికి కూతురిగా ఉండి సమాజ పోకడల్ని బాగా అర్ధం చేసుకుని తనని తానూ నిర్మించుకుంటూ, అవసరం అయితే తనని తానూ తగ్గించుకుంటూ, కొందరి బలహీనతలని తనకి అనుకూలంగా మలుచుకుంటూ నచ్చినట్లు ఉండగల్గే ఇందిర ఎక్కడా కూడా తొట్రుబాటు లేకుండా ఎలాంటి ముసుగు వేసుకోకుండా నిర్భయంగా, స్వేచ్చా ప్రవృత్తి తో కనిపిస్తుంది జీవిస్తుంది.

ఇందిర లాంటి స్త్రీని సమాజం హర్షించక పోవచ్చు సమాజంలో కల్యాణి లు లాంటి వారితో పాటు కానీ ఇందిరలు కూడా ఉంటారని చెప్పడమే కావచ్చు స్త్రీల ఆలోచనా విధానం మారుతుందని చెప్పడం కూడా ఈ రచనలో గోచరిస్తుంది.

మనుషులు ఏ లోపాలు లేకుండా ఉండరు. మనుషులు మనుషుల్లాగానే ఉండాలి తమలో ఉన్న లోపాలని సవరించుకుంటూ చైతన్యంగా ఆలోచించుకుంటూ ముందుకు సాగిపోవడమే మంచిదని "కాలాతీత వ్యక్తులు" నవల చెపుతుంది.


పాశ్చత్య నాగరికత ప్రభావంతో చదువులభ్యసించి ఉద్యోగాలు చేస్తున్న స్త్రీలలో ఆలోచనా పరిణితి పెరిగి వారి వారి అభిరుచిల మేరకు, ఆశలకు, ఆశయాలకు అనుగుణంగా జీవించాలనుకోవడం తప్పు కాదు జీవితాన్ని జీవించడం కోసమే అనుకుంటూ ముందుకు సాగే వ్యక్తి ఇందిర పాత్ర. కాలగమనంలో అందరూ మరుగున పడిపోతారు కాలానికి విభిన్నంగా నడుచుకుని తనదైన వ్యక్తిత్వంతో తన చుట్టూ ఉన్న వారి జీవితాలనీ కూడా ప్రభావితం చేస్తూ సాగగల్గితే వారు మరి కొంత కాలం గుర్తుండిపోతారు అది నవలలో పాత్రలు కావచ్చు నిజ జీవితంలో మనుషులు కావచ్చు.

ఈ నవలలోని ఇందిర పాత్రని నేడు అధిక సంఖ్యలో మన సమాజంలో నిత్యం చూస్తుంటేనే ఉంటాము . కానీ ఇప్పటికి కూడా "ఇందిర " ని హర్షించలేక పోతున్నాం. ఇంకా నవలలో మిగిలిన పాత్రలు కల్యాణి,వసుంధర, వైదేహి లాంటి స్త్రీల మధ్య "ఇందిర " కాలాతీత వ్యక్తి తానూ చీకటిలో ఉండాల్సి వచ్చినా వెరువని ధీర, చీకటిని చీల్చుకుంటూ వెలుగుతూ వచ్చిన ఇందిర.

(ఈ నవల దారావాహికంగా సాగి పూర్తి అయిన వెంటనే 8-2-1958 లో సి . సరళా దేవి ఒక సమీక్ష, 2000 సంవత్సరంలో డా॥వి చంద్రశేఖర రావు గారు సమీక్షించారు.

ఇందిర గురించి మనం చదవాలంటే ఇప్పుడు లభ్యమవుతున్న ఈ నవల లో జతపరిచిన రెండు సమీక్షల జోలికి పోకుండా ఆ నవల ని చదివితే బాగుంటుంది అన్నది నా అభిప్రాయం )

ఈ నవల విశాలాంద్ర ప్రచురణ

* ఈ వ్యాసం "సారంగ " వెబ్ పత్రికలో (ప్రధమ సంచిక ) తర్వాత మార్చి నెల "భూమిక " లోను ప్రచురితమైనది.


16, ఏప్రిల్ 2013, మంగళవారం

స్త్రీల కవిత్వం లో ఏం ఉంటుంది?




 "స్త్రీలకి  ఏమి తెలియదు వాళ్ళేమి వ్రాస్తారు పురుష ద్వేషం ప్రకటించడం తప్ప" అనుకుంటారు

నేను చెపుతున్నాను స్త్రీలకి అన్ని తెలుసు .ప్రపంచ పటంలో మనం ఎక్కడ ఉన్నాం? మన  చుట్టూ ప్రపంచం  ఎలా  ఉందో !?  అన్నది కూడా  బాగా తెలుసు.

ముఖ్యంగా స్త్రీలు వ్రాసే కవిత్వం గమనిస్తే అర్ధం చేసుకోవాల్సింది చాలా ఉంది.  వారు వారి కవిత్వంలో దార్శనికతని ప్రతిబింబిస్తున్నారు వంటిల్లు గోడలు దాటి అతరిక్షంలోను ప్రయాణించి ఈ రెండింటి మధ్య స్త్రీలు అన్న కారణంగా చూపబడుతున్న వివక్షని, చిన్న చూపుని గమనిస్తున్నారు, గర్హిస్తున్నారు

పురుషులతో  పోలిస్తే ఎంతోకొంత కాదు బాగానే సగభాగం ప్రగతిలో వారి ప్రమేయం ఉంది కానీ పురుషులు కి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు స్త్రీలకి ఉన్నాయి అవి కాకుండా స్త్రీలకి ప్రత్యేక  సమస్యలు  ఉన్నాయి అందుకనే స్త్రీల కవిత్వంలో ప్రత్యేకంగా వారి సమస్యలని చెప్పాలనే ప్రయత్నం జరుగుతుంటుంది

ఆ సమస్యలు కేవలం స్త్రీల సమస్యలే కాదు ప్రతి ఒక్కరి సమస్య ప్రతి కుటుంబంలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్య

స్త్రీలు వ్రాసే కవిత్వంలో సున్నితత్వమే కాదు తెంపరితనం ఉంది అక్కసు ఉంది సమస్య వ్యక్తీకరించే దశలో ఆవేదన ఉంది,ఆక్రోశం ఉంది. వారి కవిత్వంలో ద్వేషం ఉంది.ఎందుకంటే  వారు ఎదుర్కుంటున్న సమస్యలు అనేకం.  లింగ వివక్ష, .కుటుంబ  హింస,లైంగిక వేదింపులు,ఇంటా-బయటా చాకిరి, ఆధునికత పేరిట గాడి తప్పి చేజేతులా సమస్యలు కొని తెచ్చుకోవడం లాంటివి చాలా ఉన్నాయి   వాటిని గుర్తించ గల్గిన అర్ధం చేసుకోగలిన పురుష సహకారం ఉంది. అయినప్ప టికీ స్త్రీలు వ్రాసిన కవిత్వాన్ని ఎగతాళి చేస్తున్న కొంత మందిని చూస్తున్నాం అతర్జాలంలో చాలా చోట్ల  గమనించాను కూడా.

స్త్రీల పట్ల సమదృష్టి రావాలి  సమైక్య భావన రావాలి. స్త్రీలు  గమనిస్తున్నారు   వాళ్ళని ప్రత్యేకంగా విడకొట్టి వారి వ్రాసే కవిత్వాన్ని కించపరచడం చేస్తున్నారు. పెద్దలు,మిత్రులు స్త్రీల కవిత్వంలో ఉండే చిన్న చిన్న లోపాలని మీ మీ సలహాలతో సరిదిద్దండి.  మీరు వ్రాస్తున్నది అసలు కవిత్వమే కాదు అన్నట్టు చూడకండి  గొంగళి పురుగు సీతాకోక చిలుకగా మారే దశలోనే  స్త్రీల కవిత్వం ఉందనుకుంటే   ఆ అభిప్రాయం బలంగా ఉంటె స్త్రీలకి తెలుసుకునే అవకాశం కల్పించండి వ్యాసం అయినా కవిత్వం గా మారడానికి కవిసంగమం లో చోటు ఉంది కదా! ఒకప్పుడు పత్రికలలో ప్రచురింప బడ్డ  కవిత్వంలో అవసరమైనంత సవరణలు జరిగి ఉండేవేమో !   బహుశా అందులో లోపాలు కనిపించేవి కావు కానీ అతర్జాలంలో  కవిత్వం ని ఎవరికీ వారు ప్రచురించుకోవడం అనే సౌలభ్యం వల్ల అందులో కొన్ని చిన్న చిన్న లోపాలు ఉంటున్నాయి కూడా .

ఇంకొక విషయం ఏమిటంటే సద్విమర్శ ని స్వీకరించాలి  కావాలని చేసే విమర్శలని వదిలేసేయాలి. అత్యుత్సాహంతో ప్రతి అనుభవాన్ని కవిత్వీకరించే కంటే  గాడానుభూతితో,హృదయ స్పందనతో కవిత్వరీకిస్తే ఆ కవిత్వం కి జీవం వస్తుంది ఎన్ని కవితలు వ్రాసాము అనేది లెక్క కాదు కవిత్వం ఆలోచనల్లో ఎంత నానితే అంత క్లుప్తంగా ఉంటుంది అంత లోతుగా ఉంటుంది

ప్రాస కోసం ప్రాకులాడకుండా హృదయం తో స్పందిన్చినప్పుడే కవిత్వం రావాలి ఆ కవిత్వమే దీటుగా నిలుస్తుంది, గీటు  రాయిగా మారుతుంది అని తెలుసు కుందాం

 "కవిసంగమం"  ఈ లింక్

కవిత్వం చదవాలి ,వ్రాయాలి అన్న ఉత్సాహం ఉన్నవారు Facebook  గ్రూఫ్ లలో కవిసంగమం  అనే గ్రూపు లో జాయిన్ అయి కవిత్వం ని ఆస్వాదించవచ్చు

 వ్యాస కర్త : తాతినేని వనజ

( విజయవాడ ఎక్స్ రే  వారి  "నెల నెలా వెన్నెల"  వేదికని ఏడు సంవత్సరాలపాటు  నిర్వహించిన అనుభవంతో వ్రాసిన వ్యాసం )

8, మార్చి 2013, శుక్రవారం

" సారంగ " పాఠక "చేరి" లో నా వ్యాసం





"కాలాతీత వ్యక్తులు"   లో  " ఇందిర"

ఆకాశవాణి విజయ వాడ కేంద్రం శతవసంత  సాహితీ మంజీరాలు కార్యక్రమం లో "
కాలాతీత వ్యక్తులు " నవల ని ప్రసారం చేసినప్పుడు "ఇందిర" గురించి
విన్నాను.  చాలా ఆసక్తిగా అనిపించింది  చాలా కాలం తర్వాత    మళ్ళీ కొన్ని
నెలల క్రితం "కాలాతీత వ్యక్తులు " లో  కథా నాయిక ఎవరు అన్న సాహితీ వ్యాసం
 (ఆంధ్రజ్యోతి - వివిధ - శ్రీ వల్లీ రాధిక ) చదివాను.

ఇటీవల నేను "కాలాతీతవ్యక్తులు" నవలని కొని చదవడం మొదలెట్టాను ఏకబిగిన
చదివింప జేసిన ఈ నవల లోని పాత్ర లన్నింటి లోకి నన్ను ఆకర్షించిన  పాత్ర
"ఇందిర "

ఇందిర గురించి ఈ పరిచయం ఈ క్రింది  లింక్ లో...

 ఇందిర " కాలాతీత వ్యక్తే "   " సారంగ "  పాఠక "చేరి"  లో  నా స్పందన

2, అక్టోబర్ 2012, మంగళవారం

"ఠాకూర్ కా కువా"

సాహిత్యాన్ని  చదవడం వల్ల  ఆ సాహిత్యం వచ్చిన కాలంలో ఆనాటి సామాజిక పరిస్తితులకి అద్దం పట్టే ఎన్నో విషయాలని మనం తెలుసుకుంటూ ఉంటాం. అలాంటి కథే ఈ రోజు నేను  తెలుగు అనువాదంలో  చదవడం  జరిగింది.

నిమ్న జాతి కులస్తులపై అగ్రవర్ణాల ఆధిపత్యం ఇంకా కొనసాగుతుందనే విమర్శలో నిజం ఉందో ..లేదో తెలియదు కానీ .. .

సుమారు వంద సంవత్సరాల క్రితమే ఇందుకు సంబంధించిన చైతన్యాన్ని  జనులలో కల్పించడం కోసం ఉపన్యాస్ సామ్రాట్ గా (ఉపన్యాస్ అంటే నవల అని అర్ధం) పేర్కొనే" ప్రేమ చంద్"   కలం అందించిన 
ఈ కథ లో భారతీయ జాతి వ్యవస్థని పట్టి ఇస్తుంది. 

ప్రాణులన్నిటికినీ  సమముగా చెందవలసిన గాలి,నీరు కేవలం జాతి విశేషత వల్ల కొందరికే పరిమితం కావడం అన్నదానిని జీర్ణించుకోలేక   వ్యతిరేకించ వలసిన విషయాన్ని  ప్రేమ చంద్ ఆలోచనలను మధించి  వచ్చిన రచన.. "ఠాకూర్ కా కువా"




ఆ కథ ఇలా క్లుప్తంగా.. 

జోఖూ నిమ్న జాతి కులానికి చెందిన వ్యక్తి. అతడు మంచి నీళ్ళు త్రాగడం కోసం కుండలో ఉంచిన నీరుని ఒక పాత్రతో తీసుకుని త్రాగబోతుండగా ఆ త్రాగే నీరు దుర్వాసన వస్తుంది భర్త అలాంటి నీరు త్రాగడానికి ఇబ్బంది  పడటం చూసిన   భార్య గంగి కడవతో నీరు తీసుకురావడానికి వెళుతుంది. 

ఆ గ్రామంలో రెండే రేడు బావులు ఉంటాయి. ఒకటి ఠాకూర్ ది ,మరొకటి సాహు ఆనే మరో కుల పెద్దది. 
వీరు అగ్ర కులాలకు చెందినవారు అవడం వల్ల నిమ్న జాతి వారిని నీళ్ళు తీసుకువెళ్ళడానికి ఒప్పుకునేవారు కాదు. అయితే జోఖు భార్య అయినటువంటి గంగి ఆ దుర్వాసన వచ్చే నీరు భర్త తాగకుండా చేయాలని ..
ఎలాగైనా సరే  అయినా సరే బావి నుంచి ఒక కడవ నీరు తీసుకు రావాలని నిర్ణయించుకుని.. బావి వద్దకు వెళుతుంది .

అప్పుడు సమయం రాత్రి తొమ్మిది గంటలు అవుతుంది. గ్రామంలో జనులందరూ  శారీరక శ్రమతో అలసి పోయి  నిద్ర పోతుంటారు.  గంగి ఠాకూర్   ఇంటి సమీపం కి చేరుకునే సరికి ఇంకా  ఆ ఇంటి నుండి వెలుగు కనబడుతూ.. మేల్కునే ఉన్నారని గ్రహించి..  ప్రక్కనే ఉన్న చెట్లు వెనుక నీడలో వేచి ఉంటుంది. అప్పుడు ఓ..ఇద్దరు స్త్రీలు వచ్చి నీరుని తోడ్కొని వెళతారు.  వారు అగ్ర కులానికి చెందినవారు. నిమ్న జాతికి చెందిన వారు  ఆ బావి వైపు తొంగి చూసే సాహసం కూడా చేయరు.  

ఆమె మనసులో ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. ఠాకూర్ చాలా స్వార్ధ పరుడు. తన ఇంటి పై భాగమును ప్రభుత్వ కార్యాలయానికి కిరాయికి ఇచ్చి.. అవకాశాను సారం లంచాలు తీసుకుని పనులు చేయిస్తూ ఉంటాడు. అగ్ర కులాలు వారు దొంగ తనాలు చేస్తారు.కుతంత్రాలు చేస్తారు. అబద్దాలు ఆడతారు. పండితుడి ఇంట్లో పన్నెండు నెలలు జూద క్రీడ జరుగుతూనే ఉంటుంది. సాహు అయితే నెయ్యిలో నూనె కలిపి అమ్ముతాడు. వీళ్ళు పనులు చేయించుకుంటారు. దానికి తగ్గ ప్రతిఫలం ఇవ్వడానికి మొండి చేయి చూపెట్టి పనులు చేయించుకోవడం వల్ల హక్కుగా భావిస్తారు. 

ఎప్పుడైనా.. గంగి గ్రామంలో ప్రవేశించినప్పుడు వారు కోరిక నిండిన కళ్ళతో చూస్తూ ఉంటారు. వాళ్ళ చూపులు శర్రేరం పై పాము పాకినట్లు జలదరింపజేస్తుంటాయి అని గుర్తు చేసుకుంది.  కొంచెం సేపటికి ఠాకూర్ ఇంటి తలుపులు మూసుకుంటాయి.  ఆ అవకాశం దొరకడం కోసమే చూస్తున్న ఆమె  వెంటనే మంచి నీటి బావి వద్దకు వెళుతుంది. 

జాగ్రత్తగా తను తీసుకు వచ్చిన తాడుని కడవకి బిగించి అమృతాన్ని దొంగిలించే దొంగలా మెల్లగా కదులుతూ.. మనసులో అనేక దేవుళ్ళని తలచుకుని..కడవని బావిలోకి దింపుతుంది. శబ్దం కాకుండా.. నీరు నింపి నాలుగు చేదలు లాగేసరికి కడవ కళ్ళకి కనబడింది. వంగి  కడవని అందుకునే లోపే భళ్లుమనే శబ్దంతో..ఠాకూర్ ఇంటి తలుపులు తెరుచుకుంటాయి. గంగి భయంతో చేతిలో ఉన్న తాడు వదిలివేసింది. నీటితో నిండి ఉన్న ఆకడవ ధడేలు మన్న శభ్డంతో బావిలో పడిపోయింది. ఆ శబ్దానికి ఎవరు? ఎవరక్కడ !? అంటూ ఠాకూర్ బావి వైపు వచ్చాడు. 

గంగి భయంతో.. పరుగు తీసింది. ఇల్లు చేరుకునే సరికి భర్త జోఖూ.. దుర్వాసన వచ్చే అదే నీటిని త్రాగుతూ కనబడతాడు.  మారాలని కోరుకున్నా మారని వారి జీవితాలని ప్రతి బింబిస్తూ ఈ కథ ఉంటుంది. 

 స్థూలంగా ఇది కథ. ఇలాటి  విషయాలు ఉన్న కథలు మనకి తెలుసు.. 

అయితే.. కథలోని  వర్ణన చాలా బాగుంటుంది. నిమ్న జాతి జనులు పడే కడగండ్లు కళ్ళకు కట్టినట్లు పాఠకుడిని కట్టి పడేస్తాయి. ప్రేమ చంద్ శైలి అటువంటిది.. వారి రచనలలో సమాజంలో పేరుకుని ఉన్న కుసంప్రదాయాలు, అసమానతలు, కార్మిక కర్షక దయనీయ స్థితులు తో పాటు సమాజంలో సామాజిక కట్టుబాట్ల బంధనాలలో బలి అవుతున్న స్త్రీ అంతర్మధనాన్ని సూక్ష్మాతి సూక్ష్మం గా చెప్పడం జరిగింది.

ఈ కథ చదువు తున్నంత సేపు మహీధర రామమోహనరావు గారి "కొల్లాయి గడితేనేమి" మదిలో మెదిలింది. 

మంచి పుస్తకాలు చదవడం వల్ల..మన ఆలోచనలు కూడా పరిణితి చెందుతాయి అనిపించింది. 

4, ఆగస్టు 2012, శనివారం

ఒక కథ గురించి... నా స్పందన




ఈ మధ్య ఆదివారం ఆంద్ర జ్యోతి ఆదివారం సంచికలో "కలాపి" కథ చదివాను. (జూలై 29)

అంతకు ముందు సంచికలో మన బ్లాగర్ (నీలాంబరి) శారద గారు వ్రాసిన "అందవిహీన "కథ ఒక ఉన్నత వ్యక్తిత్వాన్ని చాటితే..ఈ కథ స్త్రీ లో ఉన్న చపలత్వం ని చూపింది.

ఆ కథలో "కలాపి " ఆనే స్త్రీ గురించి చెప్పడమే ఈ కథ.

ఆ స్త్రీ అందమైనది. ఆ అందం వల్ల ఆకర్షితులైన ఎంతొ మందిలో కేవలం ఎనిమిది పురుషులు ఆమెని వివాహమాడారు. చిత్రంగా.. ఆమె భర్తలగా ఉన్న అందరు ఆమె కోరగానే విడాకులు ఇచ్చేసారు. ఎక్కడా ఎలాటి అభ్యంతరాలు లేకుండా ఆమె ఎనిమిదిమందిని వివాహమాడారు. డబ్బుతో లభించిన సర్వ సుఖాలని అనుభవించిన తర్వాత కూడా ఆమెకి తగిన సంతృప్తి , శాంతి లభించలేదని చెబుతుంది ఎప్పుడూ అన్వేషణ. ఏ మగవాడి దగ్గర తనకి కావలసినది ఏది దొరకలేదు అని చెపుతుంది. రోగ గ్రస్తమైన శరీరంతో.. మరణం కోసం ఎదురుచూస్తూ.. ఉంటుంది.

మనకి మనమే శాశ్వతం, ఐ యాం వాట్ ఐ యాం అంకుంటూ..తనకంటూ మిగిలింది అనుభవాలు మాత్రమే అని చెపుతుంది.

తనకి అనేక వివాహాలు ద్వారా లభించిన నగలు,కానుకలు ని సొమ్ముగా మార్చి శ్రీలంక దేశంలో యుద్దగాయాలతో బాధ పడుతున్న,లైంగిక హింసకి గురి అయిన వాళ్ళు,అనాధ శిశువులకి పునరావాసం కోసం ఖర్చు చేస్తున్నాని చెపుతుంది.

తనకన్నా పది పన్నెండు ఏళ్ల చిన్నదైన "లడ్డు" ఆనే స్నేహితురాలికి తన విషయాలన్నిటిని చెపుతూ.. తన మరణం తర్వాత ఆమెని ఆ బాధ్యతలు చూసుకొమ్మని చెపుతుంది.

అంతే కాకుండా.. జీవన ప్రయాణం లో జరిగిన వివాహాలతో సంబంధం లేకుండా తనకి స్నేహితుడిగా నిలిచిన ఓ..వ్యక్తిని పరిచయం చేస్తుంది. అతను ఆమె స్నేహితురాలు "లడ్డు" కి అన్నయ్య.

ఆఖరికి "లడ్డు" మెడపై "కలాపి" పుట్టుమచ్చ లాగా మిగిలిపోతుంది.

అందమైన స్త్రీ తన అందం తో..పురుషులని ఆకర్షించి ఎనిమిది మందిని వివాహమాడటం.. స్త్రీలలో మితిమీరిన స్వేచ్చకి అద్దం పడుతుందా? అలా అతి స్వేచ్చగా ఉండటాన్ని  ఈ కథ సమర్ధించి నట్లు అయిందా?

చలం రాజేశ్వరిని సృష్టిస్తే ..ఇప్పటికి సంప్రదాయవాదులు గగ్గోలు పెడుతున్నారు.

ఆఖరికి ఈ కథలో కలాపి..తన సంపదనంతా.. యుద్దగాయాలతో బాధపడేవారికి, లైంగిక హింసకి గురి అయిన వాళ్లకి చెందేటట్లు చేయడం చిత్రంగా లేదూ!

కథ అయినా సరే ..కలాపి లోని అతి స్వేచ్చ..ఇంకా చెప్పాలంటే విశృంఖలత్వం (లస్ట్) నాకు నచ్చలేదు. ఆఖరికి ఈ కథలో సందేశం యేమిటో కూడా నాకు అర్ధం అయి కానట్టు ఉంది.

"తన్హాయి" ని విపరీతంగా ద్వేషించిన వాళ్లకి ఈ కథ చదివితే ఏమనిపిస్తుందో!

ఈ కథలో  రచయిత్రి శైలి మాత్రం నాకు బాగా నచ్చింది. కలాపి వర్ణన అద్భుతంగా ఉంది.

బహుశా ..ఈ కథని ఆ శైలి మాత్రమే చదివించింది. వివాహంలో యేమి లేదు అని తెలుసుకోవడానికి  ఒక్క వివాహం చాలు, ఎనిమిది వివాహాలు అవసరం లేదు కదా .. అనిపిస్తుంది (అనిపించింది కూడా )

మీరు చదవండి..! ఏమనిపిస్తుందో ..మీరు చెప్పండి.

కలాపి కథ.. ఈ లింక్లో చదవండి.

10, జులై 2012, మంగళవారం

బుక్ పాయింట్ - శ్రీ రమణ

మొన్న ఆదివారం..టీవి 9 చానల్ లో బుక్ పాయింట్ ..కార్యక్రమం లో ..

ప్రముఖ రచయిత,కాలమిస్ట్, అసిస్టెంట్ డైరక్టర్.. శ్రీ రమణ గారు మరియు..
ప్రముఖ కవి,కథారచయిత అఫ్సర్ గారితో.. ఒక పరిచయ కార్యక్రమం ని ప్రసారం చేసారు.

శ్రీ రమణ
గారి "మిధునం" కధ తో.. తనికెళ్ళ గారి దృశ్య రూపం(సినిమా) గా గాన గంధర్వుడే కాదు , నటనా చాతుర్యం కల మన బాలసుబ్రమణ్యం, శ్రీమతి లక్ష్మి ముఖ్య పాత్రధారులు
నటించిన కొన్ని సన్నివేశాలను కూడా ఈ కార్యక్రమంలో చూపించారు.

అఫ్సర్ గారు శ్రీ రమణ గారి రచనలని విశ్లేషించారు. మారుతున్న జీవన విధానాన్ని" మిధునం " కథలలో ప్రతిబింబిస్తూ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్చిన్నం అయిన తీరుని శ్రీ రమణ గారి కథలలో మనం చూడవచ్చని చెపుతూ సంప్రదాయం ని వ్యతిరేకిస్తూ.. వ్రాసిన సంభాషణ లని వివరిస్తూ.. ఇంకా ఆ కథలని చదివి ఆ శైలిని అర్ధం చేసుకోవాల్సిన అవసరం గురించి చెప్పారు. మాట్లాడిన అతి తకువ సమయంలో అఫ్సర్ గారు చక్కగా శ్రీ రమణ గారి రచనలని విశ్లేషించే ప్రయత్నం చేసారు కూడా. (అతిదులని పిలిచి వారిని మాట్లాడనీయ కుండా అనుసంధానకర్త పదే పదే అడ్డుకుంటూ మాట్లాడటం మనవాళ్ళకి అలవాటే కదా!)

ఈ పరిచయ కార్య క్రమం అందరు చూడలేక పోవచ్చును. అదే సమయంలో .. ఈ టీవి చానల్ లో "సత్యమేవజయతే" ప్రసారం అవుతుంది. బాతాఖాని-లక్ష్మిఫణి - కబుర్లు శ్రీ రమణ లింక్స్ కూడా ఇచ్చారు. ఆ లింక్ లలో మళ్ళీ ఇక్కడ చూడవచ్చును.

ఆ కార్యక్రమం ని కొందరు చూసి కూడా ఉంటారు. మళ్ళీ ఆ కార్యక్రమం పై నేను చెప్పేది ఏమి లేదు. నాకు అంత అనుభవం-అర్హత లేదు కూడా.

కానీ.. నేను చెప్పే విషయం ఏమిటంటే.. ఆ కార్యక్రమంలో శ్రీ రమణ గారి ని పరిచయకర్త ఒక ప్రశ్న వేసారు.

మీకు రావాల్సినంత పేరు ప్రఖ్యాతులు రాలేదంటారు!. దానికి మీరేమంటారు? అని ప్రశ్నించారు.
అందుకు శ్రీ రమణ గారి సమాధానం నాకు చాలా బాగా నచ్చింది.

"నాకు రావలసిన దానికన్నా ఎక్కువ కీర్తి, పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. నాకు లభించిన ప్రోత్సాహం కూడా చాలా ఎక్కువ. పురాణపండ,నండూరి లాంటి ప్రముఖుల ప్రోత్శాహం లేకుండా నేను ఇంత ఎదగలేను"కూడా అని కూడా చెప్పారు.

అలాగే బాపు-రమణ గారి వద్ద వారికి ఉన్న సాన్నిహిత్యం గురించి గుర్తుచేసుకున్నారు.

నేను ఇది ఎందుకు చెప్పదలచాను అంటే..

ఈ మధ్య ఒక పత్రికలో ఒక సినీ గేయ రచయిత ఇలా అన్నారు. "నా పాట జనం లోకి వెళ్లి నంతగా నేను జనం కి తెలియదు " అని. ఆ గీత రచయిత ప్రత్యక్షంగా జనానికి  కనబడాలని జనం తనని గుర్తించాలని, గుర్తింపు రావాలని కోరుకుంటున్నాడు . అలా కోరుకోవడం తప్పు కూడా కాదు.

ఒక రచయిత బాహ్యంగా కనబడుతూ జనం దృష్టిలోకి వెళ్లక పోయినా పర్లేదు. అతని రచనలు పాఠకుల్ని  ప్రభావితం చేయగల్గితే చాలు కదా అనిపించక మానదు. ఒక నాలుగైదేళ్ళగా చానల్స్ లో కూడా రచయితల పరిచయాలు,విశ్లేషణా కార్యక్రమాలు ద్వారా సాహిత్య పరిచయం వీక్షకులకి చేరువవుతుంది.

ఇక కొన్ని విషయాలు చూస్తే ..

ఒక కథా సంకలనం వెలువడగానే.. అనేక ప్రాంతాలలో పరిచయసభలు నిర్వహిస్తూ.. ప్రచారం చేసుకోవడం,సమీక్షలు విరివిగా రావడం చూస్తున్నాం. తగిన గుర్తింపు రాలేదని బాధపడిన వాళ్ళని చూస్తున్నాం. ప్రత్యక్ష ప్రసారాలలో పరిచయ కార్యక్రమాలు విరివిగా రావడం చూస్తున్నాం. (అలా కూడా పబ్లిసిటీ పెరుగుతుంది కదా!)

విజయవాడలో కూడా స్వయంగా ముద్రింపజేసుకున్న కథా సంకలనాలకి,కవిత్వ సంకలనాలకి,నవల లకి ఇలాటి ప్రచారపు హోరుని నేను గమనిస్తాను.

పుస్తక పఠనం బాగా తగ్గిపోయిన ఈ రోజులలో మంచి సాహిత్యానికి  పరిచయం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడినందుకు విచారించాలో,లేదా.. వారి వారి రచనలు అంత గొప్ప స్థాయిలో లేకున్నాపదే పదే సమీక్షలు,పరిచయ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటూ కీర్తి ప్రతిష్టల కోసం ఎగబడటం చూస్తే.. హాస్యాస్పదంగాను ఉంటుంది.

ఇలాటి ఎగబ్రాకుడు తనాలు, దిగజారుడు చేష్టలు చాలా చూసినప్పుడు.. నాకిలా అనిపించింది. .

శ్రీరమణ గారి లాటి ప్రముఖ రచయిత తనకి తగినంత రాని పేరు ప్రఖ్యాతుల పట్ల అలా గొప్పగా వారి స్పందనని తెలుపడం నాకు బాగా నచ్చింది.

కళలకి, కళాకారులకి, సాహితీవేత్తలకి కూడా ప్రచారం అవసరమైన కాలం ఇది.ఏం చేద్దాం చెప్పండి. ?

(ఈ పోస్ట్ నేను ఎవరిని నొప్పించడానికి వ్రాసిన పోస్ట్ కాదు. వాస్తవాన్ని  వివరించే ప్రయత్నం చేసాను)