31, మే 2013, శుక్రవారం

"కాలాతీత వ్యక్తులు" లో " ఇందిర"

కాలాతీత వ్యక్తులు  సమీక్ష

ఆకాశవాణి విజయవాడ కేంద్రం శతవసంత  సాహితీ మంజీరాలు కార్యక్రమం లో " కాలాతీత వ్యక్తులు " నవల ని ప్రసారం చేసినప్పుడు "ఇందిర" గురించి విన్నాను.  చాలా ఆసక్తిగా అనిపించింది  చాలా కాలం తర్వాత    మళ్ళీ కొన్ని నెలల క్రితం "కాలాతీత వ్యక్తులు " లో  కథా నాయిక ఎవరు అన్న సాహితీ వ్యాసం  (ఆంధ్రజ్యోతి - వివిధ - శ్రీ వల్లీ రాధిక ) చదివాను.

ఇటీవల  "కాలాతీతవ్యక్తులు" నవలని కొని చదవడం మొదలెట్టాను ఏకబిగిన చదివింప జేసిన ఈ నవల లోని పాత్ర లన్నింటి లోకి నన్నుఆకర్షించిన  పాత్ర "ఇందిర "

ఇందిర గురించి ఈ పరిచయం..
స్వాతంత్ర్యానంతరం వచ్చిన నవల లన్నింటిలోనూ కొన్ని నవలలను పంచకావ్యాల వంటివని సాహితీ కారులు పేర్కొన్నారు అందులో "కాలాతీత వ్యక్తులు " నవల ఒకటి .
ఈ నవలా రచయిత్రి డా ॥ పి.శ్రీదేవి.
మనకి స్వాతంత్ర్యం వచ్చిన పదేళ్ళకి వ్రాయబడిన సీరియల్ ఇది "తెలుగు స్వతంత్ర" లో 21 వారాల పాటు దారావాహికంగా వచ్చిన నవల ఇది. అప్పుడు గోరా శాస్త్రి గారు ఆ పత్రికకి సంపాదకులుగా ఉన్నారు
దేశ స్వాతంత్ర్యానంతరం పాశ్యాత్య నాగరికత ప్రభావంతో స్త్రీలలో వచ్చిన మార్పులకి, వారి ఆలోచన విధానంకి మధ్య తరగతి మనుషుల మనస్తత్వానికి ఈ నవల అద్దం పట్టింది
విశేషం ఏమిటంటే ఇప్పటి కాలానికి కూడా ఇందిర పాత్ర లాంటి స్త్రీలని మనం వ్యతిరేకిస్తూనే ఉండటం.
ఏబది అయిదు సంవత్సరాల క్రితం డా ॥ పి శ్రీదేవి గారు వ్రాసిన ఈ నవలలోని "ఇందిర" పాత్ర ఇప్పటి కాలంలోని చాలా మంది స్త్రీ పాత్రలకీ దర్పణం. స్త్రీ స్వతంత్రంగా ఆలోచించడం,సమాజం ఏమి అనుకున్నా పట్టించుకోకుండా తను బ్రతకాలి అనుకున్నట్లు బ్రతికీ తీరడం, తనదైన వ్యక్తిత్వం కల్గి ఉండటం, దానికి కాపాడుకోవాలని ప్రయత్నించడం ఇవన్నీ ఆ నవలలో గోచరిస్తాయి
అసలు కాలాతీత వ్యక్తులు నవలలో ప్రధాన పాత్రధారిణి అనే విషయం పై కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.
"కల్యాణి" పాత్ర ఆ నవలలో మరొక ముఖ్య పాత్ర.
ఈ నవలలోని పాత్ర లన్నింటి కంటే ఇందిర పాత్ర పాఠకులని ఆకర్షిస్తుంది నవలలోని మిగతా పాత్రలన్నీ కూడా ఆమె చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. అసలు ఈ పాత్ర లేకుంటే ఈ నవల ఇంత ప్రసిద్ది చెంది ఉండేది కాదు .
చాలా మంది కాలానికి అనుగుణంగా కాలగమనంలో ఒదిగిపోయి కాల ప్రవాహంలో కలసి పొతారు. కానీ ఇందిర అలాంటి వ్యక్తి కాదు. చిన్నతనంలోనే తల్లి మరణించినా తండ్రి దురలవాట్లు, భాద్యతా రాహిత్యం మధ్య స్వశక్తితో చదువుకుని ఉద్యోగం సంపాదించుకుంటుంది. చాలీ చాలని జీతం మధ్య అన్ని అవసరాలు తీరక పోవడం, తండ్రిని కూడా తానే పోషించాల్సి రావడం వల్ల కొన్ని సాంఘిక కట్టుబాట్లుని, లోక మర్యాదలని ఎదిరించింది. తనకి నచ్చిన రీతిలో హాయిగా జీవించడం నేర్చుకుంది. ఒక విధంగా కాలానికి లొంగకుండా తనకి ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా చలించకుండా మనిషి కృంగకుండా వాటిని ఎదిరించి అవసరం అయితే ఇతరులని మోసం చేయడం, వారిని నిర్దాక్షిణ్యంగా ప్రక్కకి నెట్టించి పరిస్థితులని తనకి అనుకూలంగా మార్చుకుంటుంది.
అందుకే ఇందిర పాత్ర చాలా మందికి నచ్చకపోవచ్చు కానీ ఈ నవలలో ప్రధాన పాత్ర ఇందిర. కాలాతీత వ్యక్తిగా కూడా ఆమెనే పేర్కొనవచ్చు. ప్రకాశంతో స్నేహం చేస్తుంది, షికారుగా అతనితో బీచ్ కి వెళుతుంది. ప్రకాశం స్నేహితుడు కృష్ణమూర్తి తో సెకండ్ షో సినిమాకి వెళుతుంది. తన సరదాలు,అవసరాలు తీర్చుకోవడం కోసం వారితో చనువుగాను మెలుగుతుంది. పక్షి లా ఎగిరి పోయే స్వేచ్చ కావాలని తనకి ఆ స్వేచ్చ ఉనప్పటికి తన రెక్కలు పేదరికం అనే తడితో బరువెక్కి ఎగరలేకపోతున్నానని చెప్పుకుంటుంది
తాను ఉంటున్న ఇంటి పై భాగంలో అద్దెకి ఉంటున్న ప్రకాశం తనతో పాటు తన గదిలో పేయింగ్ గెస్ట్ గా ఉంటూ కాలేజ్ లో ఆన్సర్ చదువుకుంటున్న కల్యాణిల మధ్య చనువు పెరగడాన్ని గమనించిన ఇందిర ఈర్ష్య పడుతుంది. మగవారి దగ్గర కష్టాలు అన్నీ ఏకరువు పెట్టి సానుభూతి సంపాదించుకోవడం చేస్తుంది కల్యాణి అనుకుంటుంది.
ఇందిర పాత్ర ముక్కు సూటి దనం ఇలా ఉంటుంది
"ఏమిటి ఆలోచిస్తున్నావ్" ప్రకాశం అని అడుగుతుంది ఇందిర
కల్యాణి గురించి అంటాడతను
"అస్తమాను కల్యాణి కల్యాణి అంటావ్? నా గురించి ఆలోచించు, నేను అంత కన్నా ఎక్కువ బరువు ఈడ్చుకోస్తున్నాను, నా చదువుని మధ్యలో వదిలేసి ఉద్యోగం వెతుక్కోవలసి వస్తుంది. నాన్న సంగతి నీకు తెలుసు, అయినా గడియ గడియకు కాళ్ళు జాపి కూర్చుని ఏడవడం నాకు చేత కాదు, విశాలమైన కళ్ళు తిప్పి వల వలా ఏడ్చే స్తే నీ లాంటి జాలి గుండె కల మగ వాళ్ళు ఆదుకుంటారు. వాళ్లతో నేను కాలక్షేపం చేయలేను ఆమెలా జాలిగా కళ్ళు తిప్పడం నాకు చేత గాదు అంత నంగ నాచి తనం నాకు లేదు. నా బరువుతో ఇంకొకరి పై ఒదిగిపోయి కాలక్షేపం చేద్దామన్న దురాశ నాకు లేదు నేను బలపడి ఇంకొకరికి బలమివ్వాలనే తత్త్వం నాది " అంటుంది.
ఇందిర గురించి చదువుతున్నప్పుడు ఆ పాత్రపై అయిష్టం కల్గుతూ ఉంటుంది ఆమెలో ఈర్ష్య ని గమనిస్తాం ప్రకాశం కల్యాణి కి ఆకర్షితుదవుతున్నాడని తెలుసుకుని అతనిని తనవైపు మళ్ళించు కుంటుంది. పైగా కల్యాణి పై దుష్ప్రచారం చేసి ఆమె తన దారికి అడ్డురాకుండా చేసుకుంటుంది. అలాగే వసుంధర కృష్ణ మూర్తి పై ఇష్టాన్ని పెంచుకుంటుందని గమనించి అతనిని తెలివిగా తను దక్కించుకుంటుంది.
తనకి కావాల్సినదానిని బలవంతంగా అయినా దక్కించుకునే మనస్తత్వం ఆమెది.
ప్రపంచంలో ఒకరి కోసం ఒకరు ఏదీ చేయరు ఎవరి కోసం వాళ్ళే చేసుకుంటారు .. అది నాకు చేతనవును అనుకునే వ్యక్తి ఇందిర.
ప్రకాశం మేనమామ కుదిర్చిన పెళ్లి సంబంధాన్ని వదులుకుని ఆమె కోసం వచ్చినప్పుడు అతనిని తిరస్కరిస్తూ ఇలా అంటుంది
"సాధారణంగా పిల్లలకి తల్లి దండ్రులు గార్డియన్ లాగా ఉంటారు నా దగ్గరకి వచ్చేసరికి తల్లక్రిండులై నేనే నాన్నకి గార్డియన్ కావాల్సి వచ్చింది ఆడదాని మనసు నీకు తెలియదు ప్రకాశం ! నేను నీకు ఉన్నాను ..నీ సమస్యలు,నీ బరువులు అన్నీ నా మీద వేయి అనగల్గే మగవాడు అవసరమైతే నా కోసం అన్నీ వదిలేసే మొగవాడు కావాలి, ప్రేమ కోరిన త్యాగం చేయలేనివాడు ప్రేమకి అనర్హులు. నీ మీద నేను చాలా మమకారం పెంచుకున్నాను నువ్వొక వెన్నుముక లేని మనిషివని నాకు తెలుసు. తోమగా తోమగా కొంత గట్టిపడతావు అనుకున్నాను. కొన్ని అనుభవాల తర్వాత అయినా ఒక మనిషిలా ప్రవర్తిస్తావనుకున్నాను. పుట్టుక నుండే నువ్వో సగం మనిషివి బీటలు వారిన వ్యక్తిత్వం. బాగు చేయాలని ప్రయత్నించాను కానీ అది నావల్ల కాదు.నీకు నాకు కుదరదు " అని నిర్మొహమాటంగా చెపుతుంది
ఇదంతా చదువుతున్న పాఠకుడికి ఆమె పాత్ర పట్ల సరి అయిన అభిప్రాయమే కలుగదు. ఇందిర కొలీగ్ వైదేహి అన్నదమ్ములు ఆమెకి ఇష్టం లేని వాడిని చేసుకోమని బలవంతం చేస్తుంటే ఇల్లు విడిచి వచ్చేసి ఇందిర ఇంట్లో ఉంటుంది .. ఆమె ఇందిరతో ఇలా అంటుంది అమ్మాయిలు యాబై సార్లు సంతలో పశువుల బేరంలా నన్ను కూర్చోబెట్టి మాట్లాడటం నాకు ఇష్టం లేదు అంటే ఇందిర ఇలా అంటుంది . పశువు కాకపొతే మరో నందికేశుడు, జీవితమే పశువుల సంతలా అయినప్పుడు అమాయకంగా సుమతీ శతకంలో నీతులన్నీ వల్లే వేస్తే మనలని వెనక్కి నెట్టడం ఖాయం ఎలాగోలా తీర్ధంలో జనాన్ని మోచేతులతో నెట్టుకుని ముందుకు వెళ్ళడమే అంటుంది.
కావాలని కృష్ణ మూర్తికి దగ్గరవుతుంది తన జీవితం సుఖంగా సాగి పోవాలి అంటే కృష్ణ మూర్తి లాంటి వాడే తగిన వ్యక్తి అనుకుంటుంది అతనికి తగిన చదువు సంధ్యలు లేకపోయినా వెనుక ఉన్న ఆస్తిపాస్తులు ఉండటమే కాదు ఆ అస్తిపాస్తులే అతనిని నాశనం చేసాయి అనుకుంటుంది మనిషిలోని మంచి తనాన్ని గుర్తించి అతనితో జీవితాన్ని పంచుకోవడానికి ఒప్పుకుంటుంది
ఇందిర ఏ పని అయినా మంచి అయినా చెడు అయినా తెలిసే చేస్తుంది మొహమాట పడటం అనేది అసలు ఉండనే ఉండదు. తన బ్రతుకు తను బ్రతకాలి అనుకున్నపుడు ఇతరులకి ఇబ్బంది కల్గించినా పట్టించుకోకుండా బ్రతకడం నేర్చుకుంటుంది. ఆమె అతిని ఎప్పుడూ ఇష్టపడదు, అతి ప్రేమ చూపించినా,అతిగా గౌరవించినా ఆమెకి ఇష్టం ఉండదు ఆమె ప్రవర్తన తెలిసి కూడా ఆమెని పెళ్లి చేసుకుంటానికి ముందుకు వచ్చిన కృష్ణ మూర్తి కూడా ఆ విషయాన్నే చెపుతుంది తానూ అతనికి లొంగి ఉండలేనని, తన వ్యక్తిత్వాన్ని చంపుకుని ఉండలేనని బ్రతుకంతా నిర్భయంగా బ్రతుకుతానని అంటుంది.
పురుషాధిక్య సమాజంలో మధ్య తరగతి కుటుంబం లో డుర్వ్యసనాల తండ్రికి కూతురిగా ఉండి సమాజ పోకడల్ని బాగా అర్ధం చేసుకుని తనని తానూ నిర్మించుకుంటూ, అవసరం అయితే తనని తానూ తగ్గించుకుంటూ, కొందరి బలహీనతలని తనకి అనుకూలంగా మలుచుకుంటూ నచ్చినట్లు ఉండగల్గే ఇందిర ఎక్కడా కూడా తొట్రుబాటు లేకుండా ఎలాంటి ముసుగు వేసుకోకుండా నిర్భయంగా, స్వేచ్చా ప్రవృత్తి తో కనిపిస్తుంది జీవిస్తుంది
ఇందిర లాంటి స్త్రీని సమాజం హర్షించక పోవచ్చు సమాజంలో కల్యాణి లు లాంటి వారితో పాటు కానీ ఇందిరలు కూడా ఉంటారని చెప్పడమే కావచ్చు స్త్రీల ఆలోచనా విధానం మారుతుందని చెప్పడం కూడా ఈ రచనలో గోచరిస్తుంది
మనుషులు ఏ లోపాలు లేకుండా ఉండరు. మనుషులు మనుషుల్లాగానే ఉండాలి తమలో ఉన్న లోపాలని సవరించుకుంటూ చైతన్యంగా ఆలోచించుకుంటూ ముందుకు సాగిపోవడమే మంచిదని "కాలాతీత వ్యక్తులు" నవల చెపుతుంది
పాశ్చత్య నాగరికత ప్రభావంతో చదువులభ్యసించి ఉద్యోగాలు చేస్తున్న స్త్రీలలో ఆలోచనా పరిణితి పెరిగి వారి వారి అభిరుచిల మేరకు, ఆశలకు, ఆశయాలకు అనుగుణంగా జీవించాలనుకోవడం తప్పు కాదు జీవితాన్ని జీవించడం కోసమే అనుకుంటూ ముందుకు సాగే వ్యక్తి ఇందిర పాత్ర. కాలగమనంలో అందరూ మరుగున పడిపోతారు కాలానికి విభిన్నంగా నడుచుకుని తనదైన వ్యక్తిత్వంతో తన చుట్టూ ఉన్న వారి జీవితాలనీ కూడా ప్రభావితం చేస్తూ సాగగల్గితే వారు మరి కొంత కాలం గుర్తుండిపోతారు అది నవలలో పాత్రలు కావచ్చు నిజ జీవితంలో మనుషులు కావచ్చు.
ఈ నవలలోని ఇందిర పాత్రని నేడు అధిక సంఖ్యలో మన సమాజంలో నిత్యం చూస్తుంటేనే ఉంటాము . కానీ ఇప్పటికి కూడా "ఇందిర " ని హర్షించలేక పోతున్నాం. ఇంకా నవలలో మిగిలిన పాత్రలు కల్యాణి,వసుంధర, వైదేహి లాంటి స్త్రీల మధ్య "ఇందిర " కాలాతీత వ్యక్తి తానూ చీకటిలో ఉండాల్సి వచ్చినా వెరువని ధీర, చీకటిని చీల్చుకుంటూ వెలుగుతూ వచ్చిన ఇందిర
(ఈ నవల దారావాహికంగా సాగి పూర్తి అయిన వెంటనే 8-2-1958 లో సి . సరళా దేవి ఒక సమీక్ష, 2000 సంవత్సరంలో డా॥వి చంద్రశేఖర రావు గారు సమీక్షించారు
ఇందిర గురించి మనం చదవాలంటే ఇప్పుడు లభ్యమవుతున్న ఈ నవల లో జతపరిచిన రెండు సమీక్షల జోలికి పోకుండా ఆ నవల ని చదివితే బాగుంటుంది అన్నది నా అభిప్రాయం )
ఈ నవల విశాలాంద్ర ప్రచురణ
* ఈ వ్యాసం "సారంగ " వెబ్ పత్రికలో (ప్రధమ సంచిక ) తర్వాత మార్చి నెల "భూమిక " లోను ప్రచురితమైనది.

4 వ్యాఖ్యలు:

సి.ఉమాదేవి చెప్పారు...

విభిన్నకోణాలలో చర్చించదగిన నవల కాలాతీత వ్యక్తులు.చక్కగా వివరించారు.నేను 2010లో సుజాతగారి విశ్లేషణకు స్పందిస్తూ రాసిన సమీక్ష మళ్లీ పోస్ట్ చేసాను.వీలైతే ఓమారు చూడండి.

Meraj Fathima చెప్పారు...

ఈ నవల గూర్చి విన్నాను రెడియో లో ధారావాహికం వచేది అప్పట్లో సరైన అవగాహన లేదు.

హితైషి చెప్పారు...

Nice..anDee.. chakkagaa vishlEshinchaaru.

అజ్ఞాత చెప్పారు...

ఎంత బాగా విశ్లేషించారు.