4, మే 2013, శనివారం

తాయిలం


                      పిల్లలిద్దరిని  కాలేజ్ బస్ ఆగే  చోటుకి  తీసుకుని వెళ్ళి  వాళ్ళని దించేసి  వచ్చి  తన మోటార్ బైక్ ని వరండాలో పెట్టి తను ఆఫీసుకి వెళ్ళడానికి  హడావిడిగా తయారయ్యి బయటకి వచ్చాడు నారాయణ .

ఏమోయ్ ! నేను బయలుదేరుతున్నాను ఆఫీస్ కి వెళ్లి వస్తాను  అని చెపుతూ  ఇల్లంతా వెతికాడు భార్య లక్ష్మి కోసం. 
రైలు పెట్టె లలా వున్న నాలుగు గదులలోను ఆమె జాడ కనబడలేదు. ఎక్కడో పనిలో వుండి  వుంటుంది తనేకేమో ఆఫీస్ కి టైం అయిపోతుంది అనుకుని భార్య కోసం  వెదుక్కోకుండా చెప్పులు తొడుక్కుని గేటు వైపు అడుగులు వేసాడో లేదో వెనుక నుండి భార్య పిలుపులు వినవస్తున్నాయి

ఆమె యెక్కడ వుందా అని తలెత్తి చూస్తే డాబాపై బట్టలు ఆరవేయడం ఆపి  పిట్ట గోడ వైపు కి ముందుకు నడచి వస్తూ

"ఏమిటండి ..?  లంచ్ బాక్స్ తీసుకోకుండానే వెళ్ళిపోతున్నారు" అని అడిగింది

అప్పుడు చేతి వైపు చూసుకుని "అవును కదా మర్చిపోయానోయ్ . గుర్తు చేసి మంచి పని చేసావు  అంటూ వెనుదిరిగి లోపలకి వెళ్ళాడు . లక్ష్మి కూడా గబా గబా మేడపై నుండి దిగి వచ్చి లంచ్ బాక్స్ సర్ది వుంచిన  సంచీ చేతికందించి.. "దీనిని తీసుకోవడం మర్చిపోలేదు కదా" అంది నారాయణ చేతిలో ఉన్న నవల ని చూపి.

బదులుగా చిన్న చిరునవ్వు నవ్వి వెళ్లొస్తాను  అని చెప్పి  వడి వడిగా  నడిచాడు . ఏమిటో ఈయన చాదస్తం. యిరవై నిమిషాలలో  బైక్ పై ఆఫీస్ కి వెళ్ళే ప్రయాణాన్ని గంట సేపు ట్రాఫిక్ లో పడి  యిరికిరికి వున్న  బస్ లు ఎక్కి వెళ్ళాలని అనుకుంటారు. పైకి  మాత్రం .. వాహనాల ప్రమాదాలు యెక్కువగా వున్నాయి హాయిగా బస్ లో కూర్చుని ప్రయాణం చేసి వెళ్లి రాక ,  యె౦దుకు వచ్చిన యిబ్బంది  అని యితరులకు చెపుతుంటారు కాని అసలు కారణం బస్ లో కూర్చుని ప్రయాణం చేస్తూ హాయిగా పుస్తకాలు చదువుకోవచ్చని  నారాయణ ఆశ అని .. లక్ష్మి కి తెలుసు

నారాయణకి  చదవడం అనే అలవాటు ఎక్కువ.  ఎప్పుడు యేదో వొకటి చదువుతూనే ఉంటాడు. తినడం పడుకోవడం లాంటి పనులన్నీ యధాలాపంగా చేస్తూ ఉంటాడు.  ఏం అడిగినా యధాలాపంగా సమాధానం చెపుతుంటాడు పప్పులో వుప్పు ఎక్కువైనా, వంకాయ కూర కరుణ యెక్కి చేదుగా వున్నా పట్టించుకోకుండా తినేయడం చూసి హమ్మయ్య!  ఈయనతో వంటతో వచ్చిన యిబ్బందులు పెద్దగా వుండవు అని మురిసి ముక్కలైపోయింది  కాని  ముద్దుగా యేనాడైనా వొక సినిమాకి షికారుకి కూడా తీసుకువెళ్ళని భర్తని చూసి విరక్తి పెంచుకుంది.  ఒకోసారి తిక్క పుట్టి అతని చేతిలోని నవలని  బలవంతంగా లాక్కుని దూరంగా విసిరి పడేసి " ఏమండీ .. ఆ పుస్తకాలనే  కట్టుకోకపోయారా ? నన్నెందుకు కట్టుకున్నట్లో అని అంటే .. "పుస్తకం హస్త భూషణం " అన్నారు కాని..  భార్య భూషణం అని అనలేరు కదోయ్! నువ్వు నా అర్ధ భాగానివి, ఆఫ్ట్రాల్ హస్తంలో ఉండే ఆ పుస్తకం పై నీకు  కినుక యెందుకంటూ  దగ్గరకి తీసుకునే వాడు. ఏమైనా కబుర్లు చెప్పండి అంటే నువ్వు చెపుతూ వుంటే  నేను వినడం బాగుంటుంది అనేవాడు. కాసేపు యిరుగు  ముచ్చట, పొరుగు ముచ్చట చెపుతుంటే రాని  నవ్వుని పెదాలపైకి  బలవంతంగా తెచ్చుకుని నవ్వుతూ వింటూ ఉండేవాడు. ఎప్పుడు వదిలేస్తుందా అప్పుడే వెళ్ళిపోయి  యే నవలో, పత్రికో చదవడానికి బాకీ వున్నట్లు గా . 

 అది గమనించిన  లక్ష్మి  తను మాట మార్చేసి  ఆడవారికి  కబుర్లు యేముంటాయి ? మగవారికంటే చాలా విషయాలు తెలుస్తాయి  ప్రపంచ జ్ఞానం  కూడా యేక్కువే ! మీరే వింతలు విశేషాలు చెప్పండి ప్లీజ్  ప్లీజ్ అని బతిమాలించుకుని ... అప్పుడు ఒక చిన్న నవ్వు విసిరేసి    అందుకే పుస్తకాలు,  పత్రికలూ చదవమని చెప్పేది . అంటూ  .ఓ పత్రిక ని చేతిలో పెట్టి చదివించే వాడు .. అలాంటి భర్త తో  ఓ ఇరవై యేళ్ళు గడచిపోయాయి లక్ష్మి కి.      

ఆ రోజు  నారాయణ యింటికి వచ్చేసరికి యేడు గంటలు అవుతుంది. నారాయణ ని చూస్తూనే...  " అయిదు గంటలకి ఆఫీస్ అయిపోతే రెండు  గంటలు పట్టింది యింటికి రావడానికి. మధ్యలో యే పుస్తకాల పురుగుతోనో మాటల్లో పడి  వుంటారు, నేను నిన్న చెప్పాను  కదండీ  రేపు మా తమ్ముడు వాళ్ళింటికి వెళదామని "  అని విసుక్కుంది లక్ష్మి

 నారాయణ యేమి మాట్లాడకుండా చేతిలోని కూరలు,పండ్లు వుంచిన సంచీని భార్య చేతికి అందించాడు.  స్నానానికి వెళ్ళబోతూ "నాకు కాఫీ  కలుపుతావేమో, తాగాలని పించడం లేదు వద్దు" అని చెప్పాడు.

స్నానం చేసి వచ్చి హాల్లో కూర్చుని రేపటి నుండి పేపర్ కూడా మానేద్దాం. మనం తప్ప పిల్లలిద్దరూ పేపర్ ముట్టుకున్న పాపాన పోలేదు మనకి పేపర్ చదవడం అవసరం అంటావా ? .అన్నాడు

కూరలు తీసి ప్రిజ్ద్ లో సర్దుకుంటున్న లక్ష్మి ప్రశ్నార్ధకంగా చూసింది.  " ఖర్చులు పెరిగిపోతున్నాయి పిల్లలకి కావాల్సినవన్నీ  కొని యివ్వాలంటే మనం చాలా వాటిని త్యాగం చేయాలి తప్పదు"  అన్నాడు

"అవునండీ! నేను కూడా పని అమ్మాయిని, బట్టలుతికే  అమ్మాయిని మానిపించి మంచి పనే చేసాను నెలకి వెయ్యి రూపాయలు  వరకూ ఆదా అవుతున్నాయి"  అని చెప్పింది

"వీళ్ళేరి ? " పిల్లలని వుద్దేశ్యించి అడుగుతూ వారి గదిలోకి చూసాడు

పిల్లలు యిద్దరూ చాలా బిజీగా కనిపించారు పెద్దవాడు ఫోన్లో మాట్లాడుతూ చిన్నవాడు కంప్యూటర్లో వీడియో గేమ్స్ ఆడుతూ  కనిపించారు.   "వారికి నువ్వన్నా చెప్ప కూడదు కాసేపు  అయినా చదువుకోమని "అని అన్నాడు.

"వాళ్ళూ  పొద్దస్తమాను  చదువుల్లో పడి  కొట్టుకుంటారు కాసేపు ఆట విడుపు వుండాలండి" అంది

 పిల్లలు యిద్దరినీ పిలిచి ప్రక్కన కూర్చోపెట్టుకున్నాడు వాళ్ళ చదువుల గురించి  పరీక్షల గురించి మాట్లాడుతూ టి వి చూస్తూ ఒక గంట సమయం గడిపేశారు. అందరూ కలసి  భోజనం చేసేటప్పుడు  "డాడీ ! నా పెవరేట్ యాక్టర్ నటించిన సినిమా  రేపు రిలీజ్ కాబోతుంది  నా ఫ్రెండ్స్ తో కలిసి సినిమాకి వెళ్ళాలి 300 ఇవ్వండి ".. అంటూ  చిన్న వాడి డిమాండ్. ఇక పెద్దవాడు వాసు తన చిట్టా విప్పాడు  " నాన్నా..  నాకు ఈ ఫోన్ నచ్చడం లేదు ఫ్రెండ్స్ అందరూ  నా మొబైల్ పీస్ చూసి డబ్బా  ఫోన్  అని వెక్కిరిస్తున్నారు .సోనీ ఎక్స్పీరియా   చాలా బావుందట." అని మనసులో కోరికని చెప్పేసాడు .

ఆ మాటలు విన్న లక్ష్మి పిల్లలిద్దరిని గట్టిగా కోప్పడింది.  "చిన్నా.. అంత వేలంవెర్రిగా మూడువందలు  పోసి సినిమా మొదటి రోజే మొదటి ఆట చూడాలని యేమైనా ఉందా! అంత త్రోక్కిసలాటలో సినిమా చూడకపోతే యేమి పర్వాలేదు మన యింటి ప్రక్క వున్న ధియోటర్ లో మరో నాలుగు రోజుల తర్వాత చూడవచ్చులే! " అని చెప్పింది

ఇక పెద్దవాడివైపు తిరిగి .. "వాసు నువ్వు పెద్దవాడివి అవుతున్నావ్, యింటి విషయాలు నీకు తెలియాలి చదువుల్లో నీ ప్రతిభని బట్టి  మెడిసన్ లో  మంచి కాలేజ్ లో సీట్ వచ్చింది అయినప్పటికి దాదాపు నీకు సంవత్సరానికి రెండు లక్షలు ఖర్చు అవుతుంది. పెద్ద కాలేజీల్లో చదువుతున్నావు కదా అని ధనవంతుల  పిల్లలతో నిన్ను పోల్చుకుంటున్నావు, మన ఆర్ధిక పరిస్థితులకి అంత ఖరీదైన పోన్ కొని యివ్వడం సాధ్యమా చెప్పు? " అంటూ లాలనగా అడిగింది

పిల్లలిద్దరూ మౌనంగా వింటూ ఉన్నారు

 "వాసు.. నీకొక విషయం గుర్తుందా!?   నువ్వు మూడవ తరగతి చదువుతున్నప్పుడు జరిగిన సంగతి  గుర్తు చేస్తాను విను. నీ కొక తాయిలం యిస్తాను .. ఈ చందమామ పత్రికని చదివి అందులో ఒక కథ మళ్ళీ తిరిగి చెప్పమని నిన్ను అడిగే వాడిని .. ఆ తాయిలం యేమిటో అన్న ఉత్సాహం తో .. నువ్వు చందమామ పత్రికని చదివి అందులో నీకు నచ్చిన కథని నాకు చెప్పే వాడివి ..    ఆ వయసులో చదివిన కథని అర్ధం చేసుకుని తిరిగి     నీ మాటల్లో ఆ కథని  పేర్చుకుని  నాకు  చెప్పేటప్పుడు నేను ఎంత సంతోషించేవాడినో !  అప్పుడు నీకు తాయిలంగా  నీ నుదుటున  ఒక చిన్న ముద్దు ఇచ్చేవాడిని  ఇదేనా ..తాయిలం  అంటే ? అని నీ మోహంలో అసంతృప్తి . అప్పుడు మళ్ళీ నీకొక క్రొత్త చందమామని అసలైన తాయిలం గా యిచ్చేవాడిని. చిన్నప్పుడు నుండి అలా చదివే  అలవాటు వుండబట్టే కదా నీకు వ్యాస రచనల పోటీల్లోనూ యెన్నో  బహుమతులు వచ్చేవి.  అలాగే పరీక్షలలోను అందరికన్నా యెక్కువ మార్కులు వచ్చేవి. అలాంటిది నువ్వు యిప్పుడు క్లాస్ పుస్తకాలు  తప్ప యేవి ముట్టడం  లేదు. అప్పుడప్పుడూ కొన్ని పుస్తకాలు యెంపిక చేసుకుని చదవాలి. అప్పుడే ప్రపంచ జ్ఞానం పెరుగుతుంది.  ఎప్పుడూ స్నేహితులు, సరదాలు,ముచ్చట్లు .. లేదా ఇంటర్నెట్ యివే లోకం అయిపోయాయి " అని మందలిస్తూ యింకా చెప్పసాగాడు నారాయణ

"జీవితం అన్నింటికీ భాగం ఉండాలి  ఇంటర్నెట్, సినిమాలు,స్నేహితులు ,బంధువులు ,అమ్మ-నాన్న , పుస్తకాలు అన్నింటిని గుప్పిట బంధించుకోవాలి అప్పుడే జీవిస్తున్న జీవితానికి అందం అర్ధం రెండు ఏర్పడతాయి"  అని.

"చెప్పడం అయిందా మీ  సోది ".. అన్నట్లున్న   పిల్లల  ముఖాల్లో  ఫీలింగ్  చూసి యిక చెప్పడం ఆపేసాడు భోజనం బల్ల దగ్గర నుండి లేచి చేయి కడుక్కుని గదిలోకి నడిచాడు నారాయణ  .

అలవాటు ప్రకారం అలమారాలో వున్న ఒక నవలని అందుకున్నాడు. ఎక్కువ కాంతినిచ్చే లైటుని వేయబోయి కరంట్ బిల్ యిచ్చే షాక్ ని గుర్తు తెచ్చుకుని ఆగిపోయాడు.  తీసిన నవలని మళ్ళీ అక్కడే పెట్టి  మంచం పై పడుకున్నాడు. ఒకవేళ నవలపై ఉన్న ప్రీతి తో చదువుతున్నా కూడా  లక్ష్మి వచ్చి యింకా పుస్తకాలు చదువుతూ కూర్చుంటారా? మీరు అలా లైటు వేసుకుని కూర్చుంటే నాకు నిద్ర పట్టక చస్తాను. అంటూ  రోజు దెబ్బలాడుతూ వుంటుంది.  ఒక బెడ్ లాంప్ కొనుక్కోవాలనుకుని బజారంతా తిరిగాడు ఓ మాదిరి లైట్  కూడా  రెండు వేల నుండి రెండున్నర వేలవరకూ  వుండటం చూసి  కొనే వుద్దేశ్యం మానుకుని వెనుతిరిగి  వచ్చేసాడు.  ఓ  రెండేళ్లుగా క్రొత్తగా పుస్తకాలు  యేవీ కొనుక్కున్న దాఖలానూ   లేదు.  ఈ మధ్య వొక స్త్రీ ఆత్మకథ నవలా రూపంలో వచ్చింది ఆ నవల ని కొనాలని,  చదవాలని మనసులో ఉన్నా కూడా వాయిదా వేసుకోవాల్సి వస్తుంది  పోనీ ఆన్ లైన్ లో చదువుకుందాం అనుకున్నా పిల్లలు తనకి ఆ అవకాశమే యివ్వరు . అయినా  ఆన్ లైన్  లో చదవడం కూడా విసుగే .  వరండాలో హాయిగా  పడక కుర్చీలో పడుకుని చిరుచెమట మధ్య అనేకానేక భావాల పలకరింతలతో తడిసి ముద్దయిపోతూ పుస్తకం చదివితే వచ్చే ఆనందం యింకెందులోనూ రాదు.  వీలయితే చదువుతున్న అక్షరాలన్నింటిని  లేదా నచ్చిన వాక్యాలని సృశిస్తూ చదవడంలో యెంత ఆనందం.  ప్చ్.. ఇక యే మాత్రం నాకత్యంత  యిష్టమైన వ్యాపకం కొనసాగేలా లేదు.  ఈ మహానగరంలో సంసారం యీదడం అంటే సముద్రం యీదడం అన్నమాటే. రేపటి నుండి అసలు వుద్యోగం అయ్యాక మళ్ళీ పార్ట్ టైం వుద్యోగానికి వెళ్ళ బోతున్నాను    అనుకుంటూ  నిట్టూర్చాడు.

 అస్థిమితంగా కదులుతూ చిరాకు తెచ్చుకున్నాడు. మంచం పై నుండి లేచి వెళ్లి మళ్ళీ పుస్తకాల అలమర దగ్గర నిలబడ్డాడు. మూడు అరలలో నిండి వున్న పుస్తకాలన్నింటిని  ఆప్యాయంగా తడిమి చూసుకున్నాడు. పుస్తకాలని తడుముతుంటే తల్లినే చూసిన ఆనందం. తెరచి ఉన్న పుస్తకం గాలికి రెప రెపలాడుతుంటే తల్లి గర్భంలో ఉన్న శిశువు కూడా యిలాగే కదులుతుందేమో అన్న ఆలోచన వస్తూ ఉంటుంది. తన ఆలోచనలు చిత్రంగా ఉన్నట్లు అనిపించి తనలో తనే నవ్వుకుంటాడు కూడా. ఒక పుస్తకాన్ని తెరచి అక్షరాల వైపు చూసాడు ఈ అక్షరాలతో యెన్నాళ్ళ సావాసం ? దాదాపు నలబై యేళ్ళు అవుతుంది. ఆక్షరమే  తన  వూపిరి అయినట్లు జీవించాడు. సంసార భారంతో  క్రమ క్రమంగా యీ పుస్తకాలు తనకి దూరం అవుతున్నట్లు అనిపిస్తున్నాయి.  మిగిలిన యీ కాసిని పుస్తకాలు కూడా చదివే ఆసక్తి ఉన్నవారికి యిచ్చేస్తాను  పిల్లలు చూస్తే వొక్కరు కూడా పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకున్న దాఖలా వుండదు. ఇంకెందు యివి అనుకుంటూ   ఒక కధకుడు అన్నట్టు " ఈ జ్ఞాన సముద్రాన్ని  యే సముద్రంలో  పారబోయను " అని తను కూడా అనుకోకుండా వుండాలి అనుకున్నాడు

మీరు వదిలేసినా నేను వీళ్ళకి  క్లాస్స్ తీసుకోవడం ఆపుతానా అన్నట్టు .. ప్రక్క గదిలో  పిల్లలతో లక్ష్మి మాట్లాడుతున్న మాటలు వినబడుతున్నాయి

మీ నాన్న గారికి వున్న యేకైక వ్యసనం పుస్తకాలు చదవడం. ఆయనకి  చిన్న అక్షరాలూ కనబడక చదువుకోవడానికి చాలా యిబ్బంది పడుతున్నారు  కంటి హాస్పిటల్ కి వెళ్ళి  పరీక్ష చేయించుకుని   కళ్ళ జోడు వేయించుకోవడానికి  పదిహేను వందల రూపాయలు ఖర్చు అవుతుందని కళ్ళ జోడు వేయించుకోవడాన్ని  సంవత్సరం నుండి వాయిదా వేస్తున్నారు. ఇవాళ సాయంత్రం కాఫీ వద్దన్నారు, రేపు వుదయం పేపర్  వేయవద్దని చెప్పబోతున్నారు. రేపటి నుండి పార్ట్ టైం జాబ్ కి వెళ్ళ బోతున్నారు. మీ కోర్కెలు చూస్తే అంతే లేకుండా పోతుంది. ఒక్కడు సంపాదిస్తుంటే ముగ్గురం తిని కూర్చుంటున్నాము.  మీ నాయనమ్మకి మన అందరిని చూడాలని కోరిక. అక్కడి నుండి ఆమె ఒక్కటే ప్రయాణం చేసి రాలేక  మనమందరం  కల్సి వూరు వెళ్ళాలని వున్నాకూడా ప్రయాణం ఖర్చులు అన్నీ లేక్కవేసుకుని వెళ్ళనూలేక మీ నాన్న యె౦త అవస్థ పడుతున్నారో! నాయనమ్మకి డబ్బులు మాత్రమే  పంపించి వూరుకుంటున్నారు "  అంటూ మనసులో బాధనంతటిని  మాటల్లో చూపింది. .

   కాసేపటి తర్వాత  గదిలోకి వచ్చిన భార్యతో  లక్ష్మీ !  మన ఇబ్బందులు మనం పడుతున్నాం  కదా ! ఎందుకవన్నీ  మళ్ళీ  పిల్లలకి చెప్పడం అంటూ మందలించబోయాడు 

లేదండీ, పిల్లలకి యివన్నీ తెలియాలి. మన ఆర్దిక పరిస్థితులని దాచి వారికి కావాల్సినవన్నీ అమర్చడం మంచిది కాదు అని గట్టిగా చెప్పింది.  అదీ నిజమే కదా అనుకున్నాడు.

  " ఏమండీ ! మీకిష్టమైన నవల యేమిటో చెప్పండి నేను చదివి వినిపిస్తాను "అంది .. "నువ్వా..  చదివి వినిపించడమా? " అని ఆశ్చర్యంగా అడిగాడు నారాయణ 

" అవునండీ ! నేను చదవగలను .ఇదిగో..  మీరెప్పుడు పట్టుకుని వూరేగే  యీ"కొ కు చదువు" చదివి వినిపించనా"  అని అడిగింది . "వద్దులే ! అలా అయితే నాకు చదివినట్లు వుండదు " అని నిజాన్ని చెప్పేసి నాలిక కరుచుకుని  అంతలోనే సర్దుకుని ఆమె వుత్సాహాన్ని యె౦దుకు అడ్డుపడాలి అనుకుని .. చదువు లక్ష్మీ ! నువ్వు చదువుతూ వుంటే వినడం   బావుంటుంది అంటూ ఆమె ప్రక్కగా వచ్చి కూర్చుని ఆమె భుజంపై తలవాల్చి వింటూ వుండిపోయాడు. అలాగే నిద్రపోయాడు కూడా! 

నిద్రపోయిన అతనిని మంచంపై పడుకోబెట్టి " పిచ్చి మారాజు" పుస్తకం తప్ప మరో ప్రపంచమే తెలియదు నేను కాబట్టి ఈయనతో సర్దుకుపోయాను.ఇంకొకరు యెవరైనా అయి వుంటే వొక నగా,నట్రా,సరదానా, షికారా.. అంటూ రోజు విరుచుకుపడేవారు. ఈయన పుస్తకాల పిచ్చి తో జీతంలో  సగభాగం పైగా ధారపోసిన రోజులు ఉన్నాయి. పోనీ కొనుక్కున్న పుస్తకాలన్నింటిని భద్రంగా దాచుకున్నది లేదు. ఏమాత్రం పరిచయం  వున్న మనిషయినా   యింటికి వస్తే  చాలు  వాళ్ళతో పుస్తకాల గురించి మాట్లాడి .. ఇదిగో యీ పుస్తకం చదవండీ ..చాలా బావుంటుంది అని వాళ్ళు వద్దు వద్దు అంటున్నావినకుండా బలవంతంగా వారికి యిచ్చి పంపడం.    

ఎందుకండీ ! యింట్లో   నన్ను  యిబ్బంది పెడుతున్నది చాలదూ !? వాళ్ళు వద్దంటున్నా వినకుండా వాళ్ళ ప్రాణం తీస్తారు అని తను విసుక్కోవడం పరిపాటిగా ఉండేది 

అందుకు  సమాధానంగా  'అక్షరం పరబ్రహ్మ స్వరూపం"  అలాంటి అక్షరాలతో ప్రాణం పోసుకున్న పుస్తకాలని చదవాలి అర్ధం చేసుకోవాలి.  ఆ అర్ధంతో జీవిత పరమార్ధం తెలుసుకోవాలి అని చెప్పేవాడు. నారాయణ మాటలు వినగా వినగా లక్ష్మి కి కూడా పుస్తకాలు చదవడంలో తీపి తెలిసింది. పుస్తకం పై ప్రేమ కల్గింది. అంతకన్నా   యెక్కువ ప్రేమ భర్త పైనా పెరిగింది.   ఇద్దరూ కలసి బిడ్డలకి పుస్తకంపై  స్నేహం పెంచాలని చూసారు కాని చిన్నప్పుడు పుస్తకాలు చదవడం పై  వున్న శ్రద్ద  పెరిగి పెద్దవడంలో తరిగిపోయింది.  అవన్నీ తలచుకుంటూ .. వాళ్లకి మాత్రం ఖాళీ యెక్కడ ఉంటుందిలే ! వాళ్ళ సిలబస్, ప్రేవేట్ క్లాసులు వీటికే టైం సరిపోవడం లేదు అని  అనుకుని కళ్ళు మూసుకుంది లక్ష్మి 

తెల్లవారింది రాత్రి జరిగిందంతా అంతా మర్చిపోయారు. ఎవరి హడావుడి వారిది. నారాయణ రెండు వుద్యోగాలతో అలసి సొలసి  పదకొండు గంటలకి  యింటికి వచ్చేవాడు.  ఈ మాత్రం కష్ట పడకపోతే పిల్లల చదువులు గట్టేక్కవు అని నిర్ణయానికి వచ్చేసాడు కాబట్టి అందుకు తగిన శ్రమకి అలవాటు పడటం నేర్చుకున్నాడు. లక్ష్మి భర్త కోసం పడిగాపులు కాస్తూ  అతని సమయాలకి అలవాటు పడింది.

ఆదివారం వచ్చింది  ప్రొద్దునే నారాయణ పిల్లలిద్దరిని పిలిచి సినిమాకి వెళతారా? అని అడిగాడు . లేదు నాన్నా, కొన్ని బుక్స్ కొనుక్కోవాలి బుక్స్ షాప్ కి తీసుకు వెళ్ళవా  అని అడిగాడు వాసు 

చిన్నా అయితే సినిమాకే వెళతానని అన్నాడు. అప్పుడు వాసు చిన్నాతో ముందు మనిద్దరం నాన్నతో కలసి బుక్స్ షాప్ కి వెళదాము తర్వాత  నువ్వు కావాలనుకుంటే అప్పుడు సినిమాకి వెళదాం సరేనా అన్నాడు.  అన్న మాటలకి అలాగే అంటూ తల వూపాడు చిన్న.  . 

టిఫిన్ చేసి బుక్స్ షాప్ల వైపు ముగ్గురు కలసి మోటార్ బైక్ పై వెళ్ళారు. మీరు యిక్కడే వు౦డండి నాన్నా.. అంటూ పార్కింగ్  ప్లేస్ లోనే తండ్రిని తమ్ముడిని వుంచి    రెండు మూడు షాప్ లకి తిరిగినా కూడా వాసుకి కావలిసిన బుక్ దొరకలేదు. నీకు కావాల్సిన బుక్ అదేనా!? సరిగ్గా విన్నావా..  లేదా ? అని అడిగాడు నారాయణ. సరిగానే తెలుసు నాన్నాకానీ నాకు కావాల్సిన పుస్తకం దొరకడం లేదు  అన్నాడు . 

నేను వస్తున్నాను వుండు..  వేరొక షాప్ లో దొరుకుతుందేమో .. అంటూ నారాయణ,చిన్నకూడా వాసుతో పాటు వేరే షాప్ లోకి వెళ్ళారు. అక్కడ వాసు అడుగుతున్న పుస్తకం పేరు చూసి నారాయణ ఆశ్చర్యపోయాడు ఆ పుస్తకం పేరు  మాక్సిం గోర్కీ "అమ్మ"  తెలుగు అనువాదం కావాలని అడిగాడు . దొరకడం కష్టం కావాలంటే ఇంగ్లీష్ ప్రింట్ వుంది అది తీసుకోమని చెప్పాడు షాపతను 

నాకు వద్దు తెలుగు అనువాదమే కావాలని అడిగాడు.వాసు  నీకు కావాల్సిన నవల యెక్కడ దొరుకుతుందో నేను తీసుకు వెళతాను .. రా. అంటూ  నారాయణ తెలుగు పుస్తకాలు అమ్మే చోటుకి తీసుకు వెళ్ళాడు 

ఏమిటి నారాయణ గారు అసలు కనబడటం లేదు అంటూ ఆ షాప్ యజమానితో పాటు గుమాస్తాలు కూడా    పలకరించారు.  నారాయణ  చిన్నగా నవ్వి .. మా వాడికి  "అమ్మ " కావాలంట . దొరుకుతుందంటారా ? అడిగాడు  ఒక్క పది నిమిషాలు పాటు  కూర్చోండి తెపించి యిస్తాను అని షాప్ లో మనిషిని వేరొక చోటుకి పంపించాడు.ఈ లోపు వాసు చిన్నాని  తీసుకుని  వెళ్లి రాక్స్ లో వున్న  బుక్స్ అన్నింటిని  చూపించసాగాడు. నువ్వు చిన్న చిన్న కవితలు వ్రాస్తూ ఉంటావు కదా ! అదిగో ఈ కవిత్వం బుక్ చూడు, చాలా బాగుంటుంది  . ఈ రచయిత్రి వ్రాసిన "స్ట్రీట్ చిల్డ్రన్ " కవిత మీకు పాఠంగా కూడా  వుంది అంటూ  ఒక పుస్తకాన్ని  చూపించాడు.  . 

అవునా అన్నయ్యా..  .. ఆ కవిత యె౦త బాగుంటుందో ! నాకు చాలా యిష్టం ఆమె వ్రాసిన ఈ కవిత్వం పుస్తకం కూడా నాక్కావాలి . నాన్నతో చెప్పి నేను కొనిపించుకుంటాను అని ఆ పుస్తకం తీసుకుని తండ్రి వైపు వెళ్ళసాగాడు .  వాసు కూడా తమ్ముడితో కలసి నడుస్తూ "ఈ రోజంతా ఈ పుస్తకంలో కవిత్వమే చదవాలి.  సినిమాకి వెళతానని అనకూడదు . ప్రామిస్ ! " అంటూ తమ్ముడి వైపు చేయి చాచాడు వాసు. "ప్రామిస్ అన్నయ్య ..యిక నేను సినిమా సంగతే అడగను సరేనా " అంటూ    నారాయణ దగ్గరికి వచ్చి "నాన్నా నాకొక తాయిలం కావాలి  కాదనకుండా ఇస్తావా ?"  ఆశగా అడిగాడు. 

తాయిలం అనేటప్పటికి నారాయణకి వాసు  చిన్నప్పటి సంగతి జ్ఞాపకం వచ్చింది . చిన్నా వైపు చూస్తూ "చెప్పు నాన్నా ! నీకు యే౦ తాయిలం  కావాలి " అని అడిగాడు ప్రేమగా .. 

"మరి మరి .. ఈ పుస్తకం కావాలి నాన్నా" అంటూ వెనుక దాచుకున్న   "ఆకురాలు కాలం " కవితా సంపుటి ని  ముందుకు పెట్టి చూపించాడు . నారాయణ కళ్ళల్లో సంతోషం పొంగుకు  వచ్చింది పెదవులపై నవ్వు తన్నుకుంటూ వచ్చింది 

అలాగే  అంటూ చిన్నాని దగ్గరికి తీసుకున్నాడు. మరొక చేత్తో వాసు భుజం పై చేయి వేసి తట్టాడు.  

బావుందండి నారాయణ గారు .  మీ పిల్లలకి కావాల్సిన తాయిలాలు తప్పకుండా యివ్వవలసినవే ! ఒకరికి "అమ్మ" మరొకరికి " ఆకురాలు కాలం" .  మీ హాబీని  కొనసాగిస్తూ  మీ పిల్లలు  తెలుగు బాష లోని మొదటి రెండక్షరాలతో పుస్తకాలని యెన్నుకున్నారు మరి.  చాలా  సంతోషకరమైన విషయం అంటూ బిల్ రాస్తూ మీకు  20% డిస్కౌంట్ యిస్తున్నాము. మీలా అందరూ పిల్లలకి యిలాంటి తాయిలాలని యిస్తూనే  వుండాలి. మేము ప్రచురిస్తూనూ వుండాలి అన్నాడు షాపు యజమాని. 

మాలాగా  చదువుతూనూ వుండాలి  అన్నారు వాసు,చిన్న చేతి బొటను వేలిని పైకి లేపి వూపి చూపుతూ.  .     


17 కామెంట్‌లు:

Sudha Rani Pantula చెప్పారు...

వనజగారు, కథ బావుందండీ. మూడొంతులు నిజం, ఒకవంతు కల్పనా. కల్పన నిజం అయ్యే కాలం వస్తుందా అన్న ఆశ. కథ అంటేనే కల్పన కదా అంటారేమో. వృత్తికీ, సంపాదనకీ,, చిన్నచిన్న సరదాలకి, తక్కువ ఖర్చుతోనే మనసుని నింపగల హాబీలను నిలుపుకోవడానికి ఏమాత్రమూ అవకాశాలు లేని మామూలు మనుషుల జీవన శైలిని చూపించే ఆ మూడొంతుల కథ చాలా బావుంది. నిజంగా పిల్లల తరం ఎప్పటికైనా తల్లిదండ్రుల మనసుని అర్థం చేసుకొని అంత సరళంగా తరాల అంతరాలను మాపేయగలగడం మాత్రం ఊహాజనితమైన కల్పన కాకుండా వాస్తవానికి వస్తే ఎంత అదృష్టమో.

రమాసుందరి చెప్పారు...

పుస్తక పఠనం ప్రాముఖ్యత చాలా బాగా చెప్పారు.

కాయల నాగేంద్ర చెప్పారు...

పిల్లలలో మార్పు, పుస్తక పఠనం ప్రాముఖ్యతగురించి చక్కాగా వివరించారు. కాని,నేటి పిల్లలు ఇంత త్వరగా మారతారా?

ranivani చెప్పారు...

వనజ గారూ ! చాలా చాలా . బాగా .రాశారు . నారాయణ పాత్రలో .మీలాంటి పుస్తక .పిరయు లందరూ కనిపించారు .కాని .ఈతరం పిల్లలు .తెలుగు .పుస్తకాలు .చదవాలని .అనుకోవడం .మన అతాయశ .అవుతుందేమో .?

Sharma చెప్పారు...మనం ఎంచుకున్న మంచి మార్గాన్ని , మన వారసులు కొనసాగిస్తుంటే అది కూడా మనముండగానే . ( కొంత ఆలస్యం జరిగినా ) చాలా ఆనందంకరంగా ఉంటుంది . ఈ తరం యువతకి ఈ కథ స్ఫూర్తిదాయకం.

జలతారు వెన్నెల చెప్పారు...

కథ బాగుంది వనజ గారు.

హితైషి చెప్పారు...

మధ్యతరగతి మందహాసాన్ని,పుస్త పఠనమ్ యొక్క విలువని చాలా సున్నితంగా చెప్పారు
నిజంగా ఈ కథ "తాయిలం"

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

సుధ గారు మీ స్పందన అమూల్యం నిజంగానే కథ ముగింపు నిజం కావాలని నేను కోరుకుంటున్నాను. పుషక పఠనం తగ్గిఫపోతూఉంది. మధ్యతరగతి జీవితాలలొ నెటి తరానికి నాటి తరానికి చాలా మార్పులు వచ్చాయి. ఆ మార్పులో కూదా చదివే సౌలభ్యం ఉండి కూడా ఏ మాత్రం ఆసక్థి చూపని వారిని చూసి ఈ కథ పుట్టంది. మనసారా ధన్యవాదములు

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

హానీ గారు కథ నచ్చినందుకు ధన్యవాదములు.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

కాయల నాగేంద్ర గారు ఆశావాదం తొనే ఉందాలండీ. అందుకె ముగింపు అలా ఇచ్చాను.

మీ స్పందనకి ధన్యవాదములు

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

ఎర్రా నాగరాణి గారు మీ స్పందనకి చాలా సంతోషం. పిల్లలకి ఆసక్థి కల్గినంచడం అనేది మనం చేయాల్సిన పని. ఒకరకంగా మనమే కదందడీ వారికి ఆంగ్ల బాష పరిచయం చెసింది చిన్నప్పటి నుండి ఒక హాబీ ని డెవలప్ చెస్తే తప్పకుండా వారు చదువుతారని అనిపిస్తూ ఉంటుంది. థాంక్యూ సో మచ్

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

జలతారు వెన్నెల గారు మీ స్పందన కి సంతోషం మీ అనుభవాలు ఆలొచనలతో వ్యాఖ్య ఉంటుందని ఆశించాను. అయినప్పటికి మీ స్పందన అమూల్యం. ధన్యవాదములు

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

హితైషి మీ స్పందనకి ధన్యవాదములు మధ్యతరగతి మందహాసం అటూ చాలా బాగా చెప్పారు. ఈ ఒక్క ముక్కలోనే పుస్తక ప్రియుల అభిలషణీయం తెలుస్తుంది
మీరన్నట్టు సీరియస్ విషయాన్ని సున్నితంగానే వ్రాసానేమో! ఒక పత్రికకి పంపితే తిరిగి వచ్చింది ఇలాన్టి కథలు ఎవరు చదువుతారండీ అంటూ.
నచ్చినందుకు ధన్యవాదములు

మాలా కుమార్ చెప్పారు...

మా పిల్లలూ చదువుతారు కాని ఇంగ్లిష్ బుక్స్ చదువుతారు . తెలుగు చదవటం వాళ్ళకు కష్టం గా వుంటుంది . ఏదో వకటి పుస్తకాలు చదవటం అలవాటవుతుంది అని మా అమ్మాయి వూరుకుంటుంది . నేనూ అంత బలవంత పెట్టను .
కథ బాగుందండి .

సి.ఉమాదేవి చెప్పారు...

పుస్తకపఠనం మరచిపోతున్న నేటి బాల్యానికి మీ
అక్షరపాఠం కథ రూపంలో చక్కటి తాయిలాన్ని అందించింది. కథాభినందనలు వనజవనమాలిగారు.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

మాలా గారు మీ స్పందనకి ధన్యవాదములు

నిజంగానే చదవడం అనేది ఓ మంచి అలవాటు . ఏదో ఒక బాష లో చదువుతూనే ఉంటె చాలు . ఆసక్తి కల్గి ఉండటం ముఖ్యం . తీపి తెలుగు రుచి చూసేదాకా కష్టం తరువాత ఆపతరం కాదు కదా !

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

ఉమాదేవి గారు మీ అభినందనలకి మనఃపూర్వక ధన్యవాదములు