24, మే 2013, శుక్రవారం

చూపుల దొంగాట

ఏమోయ్, ప్రక్కన రమేష్ గారి అమ్మాయి పెళ్లి యీ రోజే కదా!  గుర్తుందా, లేక వంట చేసేసావా అడిగాడు సురేష్

బాగా గుర్తుంది . కానీ నాకక్కడికి వచ్చే ఆసక్తి లేదు మీరు వెళ్ళి రండి అంది  పద్మ

ప్రక్క ప్రక్కనే వుంటాం . ఇలా యేదో వొక  కుంటి సాకు చెప్పి తప్పించుకోవడం బాగోదు  త్వరగా తయారవు  యిలా వెళ్లి అలా  వచ్చేద్దాం  "

 నేను రానండి యెక్కడికి వెళ్ళినా మీతోనే రావాలి, మీకు నచ్చిన చీరే కట్టాలి, మీరు పెట్టుకోమన్న నగలే ధరించాలి మీరు యెవరితో మాట్లాడమంటే వారితో మాట్లాడాలి.ఇలా మర బొమ్మలా బ్రతకడం నా వల్ల కాదు విసుగ్గా అంది

అయితే యేమంటావ్, నీకు నచ్చినట్లు తయారై నీకు నచ్చినట్లే వెళ్ళా లంటావ్ అంతేగా ? ఒక్కసారి వెళ్లి చూస్తే నీకర్ధమవుతుంది ఆడవాళ్ళు యె౦త సౌకర్యవంతంగా  భర్త తో కలసి వెళ్ళ వచ్చో  నీకు చెప్పినా అర్ధంకాదు.

"ఆహా బాగా అర్ధం అవుతుంది, అర్ధం అయ్యే అవకాశం మీరు యిస్తే కదా,  పెళ్లై  పాతికేళ్ళు అయింది. ఏనాడన్నా బంధు మిత్రులతో,యిరుగు పొరుగుతో కలసి నన్ను వెళ్ళనిస్తే  కదా!  మీ ఆయన యెప్పుడు నీ కొంగు పట్టుకునే తిరుగుతాడు,అదంతా ప్రేమేనంటావా అని నన్ను అడిగిన వారు వున్నారు. అది మాత్రం మీరు అర్ధం చేసుకోరు మరి  అంది యెద్దేవాగా

 అంతగా  నువ్వు నొచ్చుకుంటున్నప్పుడు  నీ మాట నేనెందుకు కాదనాలి, నీదారిన నువ్వు వెళ్ళు నాదారిన నేను వెళతాను అన్నాడు సురేష్ .

"సరే! నాకు నచ్చినట్లు నేను వెళతాను వదిలేయండి మహా ప్రభూ" అంది చేతులు జోడించి.

  వెంటనే యింకో  ప్రక్కింటి వారిని పిలిచి యీ రోజు నేను మీతో కలసి పెళ్లికి వస్తాను అని చెప్పింది. వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తున్నా  పట్టించుకోకుండా  లోపలకి వచ్చి ఆలోచన చేసింది. అబ్బ, యిన్నాళ్ళకి యీ నస పెట్టె మొగుడు లేకుండా తనకిష్టమైనట్లు అలంకరించుకుని బయటకి వెళ్ళే రోజు వచ్చింది అని మురుసుకుంటూ ..
భర్తని వుద్దేశ్యించి  ఇదిగో మిమ్మల్నే,  అక్కడ అసలు నేనెవరో తెలియనట్లే వుండండి. అసలు నేనెవరో మీరెవరో అన్నట్లు వుండాలి. అలా మీరు వుండ గల్గితే చాలు. అలా కాకుండా ప్రక్కన చేరి అలా నవ్వకు, అంత గట్టిగా మాట్లాడకు యేమిటి అంత విరగబాటు లాంటి మాటలుతో నన్ను హింస పెడితే యెప్పటికి నేను మీతో కలసి బయటకే రాను " అని కచ్చితంగా చెప్పేసింది.

ఏమి నగలు వేసుకోవాలో అనుకుంటూ ఆలోచిస్తూ వుండగానే  సురేష్ తయారై వెళ్ళి పోయాడు. ఆతను అలా వెళ్ళగానే  బీరువా దగ్గరకి  నడచి ఆమెకి  యె౦తో ఇష్టమైన  తెనెరంగు అంచున్న నల్ల చీర తీసుకుంది.  ఆ చీర ముచ్చట పడి కొనుక్కుని ఆరేళ్లయినా వొకే వొకసారి  కట్టింది.  ఏ పంక్షన్ కో వెళ్ళేటప్పుడు తీసి కట్టుకోబోతే వాళ్ళు శుభ కార్యం చేసుకుంటుంటే నల్ల చీర కట్టుకుని వెళతావా?  నలుపు అశుభ సూచకమని వాళ్ళు యేమైనా అనుకుంటారు అంటూ అడ్డు పడేవాడు.  కోయంబత్తూర్ టస్సర్ చీర అది. అల్ ఓవర్ ఎంబ్రాయిడరీ తో నిండి తను కట్టుకుంటే అందరూ తలతిప్పి వొక్కసారి అయినా చూడటం ఖాయం అనుకుంటూ  యిష్టంగా చేతుల్లోకి తీసుకుంది.
అంతలో యింటి  చుట్టుప్రక్కల వారందరూ రెడీ అయి ఆమె కోసం యెదురు  చూస్తున్నారని పిలుపు వచ్చింది.

పదినిమిషాల్లో రెడీ అయి బయటకి వచ్చిన  పద్మ ని చూసిన అందరూ మెచ్చుకోలుగా చూసారు.  ఒకరిద్దరు చీర చాలా బావుందని మెచ్చుకున్నారు . ఇంకొకామె చీరతో పాటు మంగత్రై లో  కొన్న ముత్యాల సెట్ బాగా జోడి కుదిరందని మెచ్చుకుంది.

మొత్తం పది మంది రెండు కిలోమీటర్ల  దూరంలో వివాహ వేదిక చేరడానికి  ఆటో లు వద్దనుకుని బస్ యెక్కి వెళ్ళా లనుకున్నారు. అందుకు ఒక కారణం వుంది.  నిండా నగలు ధరించి ఆడవారు,  పిల్లలు చీకటిగా  నిర్మానుష్యంగా వుండే దారిలో ఆటోలు యెక్కడం కూడా ప్రమాదకరం అని తీర్మానించుకున్నారు. వాళ్ళు రోడ్డు మీదకి రాబోతుం డగానే మూడు బస్సులు వరుసగా వెళ్ళిపోయాయి.  బస్ స్టాప్ లో పావు గంట సేపు  యెదురుచూసినా  అటువైపు వచ్చే బస్ ల  జాడ లేదు. ఉక్కపోత చెమటలు దారాపాతంగా కారిపోతుండగా " ఆయనతో పాటు వెళ్లి వుంటే యివన్నీ తప్పేవి కదా " అని అనుకుని  వెంటనే లేదు లేదు యిలా కూడా చాలా బావుంది, స్వేచ్చగా వుంది అనుకుంది

 అంతలో ఒక బస్ వచ్చేసింది  బిల బిల మంటూ అందరూ యెక్కేసారు. అందరికి కలిపి వొకరు టికెట్ తీసుకోవడం మిగతా అందరూ వారికీ డబ్బు యిచ్చేయబోవడం "భలే వారే, యీ మాత్రం మనం ఒకరికొకరు ఖర్చు పెట్టకూడదా అంటూ నిష్టూరాలు అందరి ముఖాల్లో అదో రకమైన ఆత్మీయ మైన వెలుగు. మనతో పాటు మన లాంటి వారు నలుగురు అనుకునే మధ్యతరగతి మందసాలతో అందరూ సంతోషంగా వేదిక చేరుకున్నారు.
పూల బాటపై నడుస్తూ యిబ్బంది పడుతూ  " డబ్బున్న వారి ఆడంబరమేమో   కాని పువ్వులని త్రొక్కడానికి మనసెలా వొప్పుతుంది "  అని తిట్టుకుంటూ పువ్వులు లేకుండా చూసి జాగ్రత్తగా లోపలి నడిచారు.

హాల్లోకి ప్రవేశించే ద్వారం దగ్గరికి వెళ్ళ గానే యే సి గాలులు ఆహ్లాదంగా అనిపించాయి. పన్నీటి చిలకరింపులుతో  ఆహ్వానం అందుకుంటూ లోపలి నడిచారు. హాలంతా ఖాళీగా ఉంది తెల్లవారుఝామున ముహూర్తం కాబట్టి  అమ్మాయిని  అబ్బాయిని వేదిక పై  ఆసనంలో కూర్చుండ బెట్టి అక్షింతలు వేసి అశ్వీర్వదించే  కార్యక్రమం వుంది. పెళ్ళికొడుకు తరలి రావడం పానకాల కావిడితో విడిదికి వెళ్లి అతిధి సత్కారం చేయడం లాంటి కార్యక్రమాలు వున్నాయి కాబట్టి వారి కోసం యెదురుచూస్తూ వున్నారు. పెళ్లి కొడుకు యింకా రాలేదేమిటా అని  అమ్మాయి తరపు వాళ్ళు హడావిడి పడుతూ వుండటం కనిపించింది.

తెలిసిన వారు కనిపించడం వారిని పలకరిస్తూ అటు ఇటు తిరగడం, హాయిగా సంతోషంగా నవ్వుతూ తిరుగుతున్న పద్మని రెండు కళ్ళు గమనిస్తూనే వున్నాయి.

ఎంత బావుంది ఈమె! అందరికన్నా తక్కువ నగలు పెట్టుకుంది పైగా మంచి పట్టుచీర కట్టలేదు అయినా ఎంత అందంగా ఉంది అనుకుంటూ ఆమె ఎటుతిరిగితే అటే కళ్ళు వెంబడిస్తూనే వున్నాయి . ప్రక్కింటి వాళ్ళింటికి పెళ్ళికని వచ్చిన వారి దూరపు బంధువుల అమ్మాయి "ప్రియ " సందడి కోసం పద్మ గ్రూప్లో చేరింది   ప్రక్కనే వున్న పద్మతో సీక్రెట్గా  చెప్పింది ఆంటీ ! అతనెవరో చూడండి, యిందాకటి నుండి అతను మీ వంకే చూస్తున్నాడు అంది.

 నా మొహం ! నా వంక యె౦దుకు చూస్తాడు నీ వైపే అయి వుంటుంది వొకసారి గమనించుకో ! అంది

ఛీ ... అతని వయసేమిటీ నా వయసేమిటీ ? అసహ్యంగా వుంది  నలబై ప్లస్  లు నాకు వద్దు. డబ్బులు యిచ్చి చూస్తానన్నా నేను చూడనివ్వను అంది గడుసుగా.  నవ్వుకుని యె౦త ఫాస్ట్ గా వున్నారు ఆడపిల్లలు అనుకుంది.

దొంగ చాటుగా అతని వైపు చూసింది అతను  తనవైపు చూస్తున్నాడు ఆ  ఐ  స్మైలింగ్  చాలా బావుంది .వెంటనే  సభ్యత గుర్తుకు వచ్చింది  ఠక్కున తలతిప్పుకుంది,  అప్రయత్నంగా రొమాంటిక్ రాజేష్ గుర్తుకు వచ్చాడు హీరోయిన్లని బుట్టలో పడేసే అతని కనుసైగలు గుర్తుకువచ్చాయి,  వివాహితుల మధ్య కూడా యిలాంటి ఆకర్షణలు వుంటాయి కాబోలు అనుకుని తనని తానూ మందలించు కుంటూ దృష్టి మరల్చుకుంది

ఇంతలో పద్మ మొబైల్ మోగింది బేగ్ ఓపెన్ చేసి మెసేజ్ చూసి ముఖం చిట్లించుకుంది. వీరి ప్రక్క సీట్లో కూర్చున్న అతను తన ఐ ఫోన్ తీసుకుని చూసుకుంటున్నాడు.

అందరు భోజనాల హాలులోకి వెళ్ళారు. వాళ్ళ వెనకాలే అతను వెళ్ళాడు. కానీ సీట్లు ఖాళీగా దొరకక పోవడంతో నిలబడి చూస్తూ వుండిపోయాడు. అంతలో వొక పెద్దాయన వెళ్లి అతనిని పలకరించాడు.అతనికి తెలిసిన వారేమో చాలా సేపు మాట్లాడుతూనే వున్నా అతని చూపంతా పద్మ పైనే వుంది.

అతను చూడకుండా జాగ్రత్త పడుతూ అతను  తనని చూస్తున్నాడో లేదో అని గమనిస్తూనే వుంది. మొత్తానికి యీ చూపుల దొంగాట అరగంట పైగానే గడచింది  అది సరదా గాను అనిపించింది , పద్మకి గర్వంగా అనిపించింది నలబై ప్లస్  అయినా తనలో చార్మ్  తగ్గలేదు అనడానికి నిదర్శనం అతని చూపులే! అతనేమి అసహ్యంగా చూడటంలేదు అసహ్యంగా ప్రవర్తించడమూ లేదు ఆరాధనగా చూస్తున్నాడు. ఏ మనిషి అయినా అందంగానో ,ఆకర్షణీయంగానో వుండాలనుకోవడం తప్పుకాదు, చూడటం తప్పుకాదు కానీ కాస్త విచక్షణ కల్గి వుండటం మర్చిపోకూడదు అనుకుంది. 

విందు భోజనం చేసి ఆ పై ప్రూట్ సలాడ్ తిని భుక్తాయాసం వున్నా సరే ఐస్ క్రీమ్ ని యె౦దుకు వదలాలి అనుకుని అక్కడి దాకా వెళ్ళలేను కాస్త ఐస్ క్రీమ్ తెచ్చిపెట్టు .. పద్మా అన్నవొకామె  వేడుకోలుకి కరిగి ఆ స్టాల్ దగ్గరికి వెళ్ళింది. అంతలో ఆతను  అక్కడ ప్రత్యక్షం .

బాబోయ్! వీడేమిట్రా, వదిలేటట్టు లేడు. ఇంకాసేపు ఆగితే ప్రక్కనే కూర్చుని పలకరించేటట్టు వున్నాడనుకుని  గబా గబా అక్కడి నుంచి వచ్చేసి  వెళదాం పదండి అంటూ అందరికన్నా ముందుగా  దారితీసింది పద్మ. అందరూ  వేదిక యెదురుగా వున్న బస్ స్టాప్ వైపు నడిచారు .

వీరి వెనకాలే అతను వస్తున్నాడు అది గమనించిన పద్మ కొద్దిగా చీకట్లోకి జరిగింది. ఆ స్టాప్ లో వున్న  చాలా మందిలో ఆమె కనిపించే అవకాశమే  లేదు. అతను అటు ఇటు ఆశగా వెతుక్కుంటూ కార్ పార్కింగ్ వైపు చూస్తూ హడావిడిగా తిరుగుతూ కనిపించాడు.  బస్ రావడం మళ్ళీ ఆలస్యం.  కిరాయికి ఆటో మాట్లాడుకుని యెక్కబోతుండగా బస్ రానే వచ్చింది బస్. బస్ స్టాప్ కన్నా ముందుకు ఆపాడు. బస్ యెక్కడానికి పరుగు పెడుతున్న ఆమెని  అతను చూడనే చూసాడు   కారులో బస్  వెనుకనే వెంబడించాడు. పద్మ కోపంగా చూసింది వాడిని యిక యే మాత్రం క్షమించకూడదు అనుకుంది

బస్ దిగి యింటిదారి వైపు నడుస్తున్న వారి ప్రక్కనే కారు ఆపి రండి  డ్రాప్ చేస్తాను, నేను కాలనీ లోపలికే వెళుతున్నాను అన్నాడు అతను .నో థాంక్స్, నాకు కాళ్ళున్నాయి అని  వాడిగా చెప్పేసి వడి వడిగా యింట్లోకి వచ్చి పడింది. ఆమె కన్నా ముందే యింటికి వచ్చి వున్న సురేష్ అడిగాడు  "ఎలా వుంది వొంటరి ప్రయాణం" అని.

పరమచెత్తగా వుంది, యిబ్బందిగా వుంది అని చెప్పబోయి తమాయించుకుంది "చాలా బావుంది, చక్కగా ఎంజాయ్ చేసాను " అంది

"వాడెవడో నిన్ను ఆబగా చూస్తుండటాన్ని కూడా ఎంజాయ్ చేసేవా " అడిగాడు

లాగి పెట్టి వొక్కటి యివ్వాలన్నంత కోపం వచ్చింది పద్మకి . మళ్ళీ తమాయించుకుని "అవును " అనగల్గింది దైర్యంగా భర్త అనుమానపు చూపులని యెదుర్కోవడానికి సిద్దపడి మరీనూ  .

11 కామెంట్‌లు:

Niru చెప్పారు...

Em cheppalani anukunnaru? Nakemi ardam kaaledu...

అజ్ఞాత చెప్పారు...

:) మం.హా

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

కష్టేఫలే .. మాస్టారూ.. :) :)
ధన్యవాదములు.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

Niru.. :) మళ్ళీ ఒకసారి చదవండి. చాలా అర్ధమ్ అవుతుంది. మీ బిజీ షెడ్యూల్స్ మధ్య నా బ్లాగ్ ని విజిట్ చేయడం కామెంట్ ఇవ్వడమ్ ఆనందంగా ఉంది. థాంక్యూ సో మచ్.

కాయల నాగేంద్ర చెప్పారు...

కథ చెప్పిన విధానం బాగుంది. అయితే ముగింపులో కాస్త తడబడ్డారు. చివరిలో 'వడివడిగా ఇంట్లోకి వచ్చి పడింది పద్మ. ఒంటరి ప్రయాణం ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఆమెకు తెలిసోచ్చింది.' అని ముగింపు ఇస్తే బాగుండేది.

Gowri Kirubanandan చెప్పారు...

40+ తరువాత కూడా తనని ఆరాధన గా ఎవరో దారిన పోయే దానయ్య చూస్తే, దాన్ని తను ఇంకా ఆపొసిట్ సెక్స్ ను ఆకర్షించ గలుగుతున్నానని పొంగి పోవడం చాలా పేలవమైన వ్యక్తిత్వం. రూపంతో కాకుండా,ఏదైనా కళతో ఎదుటివారిని ఆకట్టుకోగలిగితే, (అది మగవాడే అవ్వాలని రూల్ ఏమీ లేదు) అది అసలు సిసలైన వ్యక్తిత్వం.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

కాయల నాగేంద్ర గారు.. కథ లొ ఆమె ఆఖరిలో మాత్రమే ఇబ్బంది పడింది. అంతవరకు బాగానే ఎంజాయ్ చేసింది.కదా!

కథలో పద్మ లాంటివారు ఉన్నారు అని చెప్పడమే నా ఉద్దేశ్యం.

మీ స్పందనకి ధన్యవాదములు

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

Gowri Kirubanandan గారు మీ స్పందన చాలా సంతోషకరం. నిజానికి పద్మ పాత్ర కూడా వాస్తవికం లోనే జీవించింది. విచక్షణ తోనే ప్రవర్తించింది.
చాలా మందికి అందంతోనే ఆకర్షించడం తెలుసు. వ్యక్తిత్వంతో ఆకర్షించే విషయంలొ వెనుకబడి ఉంటారు. ప్రమాదం రానంతవరకు ఇలాంటి ఒకరినొకరు చూసుకోవడం అనే సరదాని ఎంజాయ్ చేసే వారు లేదా ఒకదుగు ముందుకు వేసేవారు ఉంటారని చెప్పడమే నా ఉద్దేశ్యం. వాళ్ళు సాదాసీదా మనుషులు. సురేష్ లాంటి భర్తలు పద్మ లాంటి వారిని చూసాక వ్రాసిన మాములు మనుషుల కఠ (కాదేమో) ఇది.

Unknown చెప్పారు...

మీ కద నడిపిన విధానం చాల బాగుంది,

ranivani చెప్పారు...

బాగుందండీ కథ . మన ఇష్టాల్ని నెరవేర్చుకోవడంలో కొన్ని కష్టాలు కూడా ఉంటాయని బాగా చెప్పారు .

TVSRK ACHARYULU చెప్పారు...

ఇది వాస్తవికతకి ప్రతిరూపం, అసలు మనం బయటికి వెళ్ళేప్పుదు మనకట్టుబొట్టు బయట మనుషలు చూసి మెచ్చుకోవాలనే! ఇంక ఆకర్షణ అనేది అందంగా వుంటే ఎవరైనా చూస్తారు, కధలో తోటి స్నేహితులు కూడా మెచ్చుకున్నారు కదా! ఇంక ఆడ మగ మధ్య అది 40+ ఐనా వెర్రిగా చూడనంతవరకు తప్పుకాదు. ఎందుకంటే భగవంతుడు సృష్తించిన అందాన్ని ఆరాధించవచ్చు, ఆస్వాదించాలనుకొడమే తప్పు.