13, మార్చి 2026, శుక్రవారం

జీవితానికి కూడా అవకాశం ఇద్దాం..




 జీవితానికి కూడా అవకాశం ఇద్దాం కృతజ్ఞతలు తెలియజేయడానికి. 🙏. 

మనిషి పుట్టిన దగ్గర నుంచి ఏమి నేర్చుకుంటాడు!? పుట్టగానే ఆకలి స్వచ్చత అమాయకత్వం.. కనుల భాష కూడా తెలియకపోవడం .. తల్లి స్పర్శ తప్ప ఏమీ తెలియనితనం నుండి ఇతరులను గుర్తించడం.. వినికిడి శక్తి వల్ల చూడటం వల్ల చుట్టూ వున్న పరిసరాలను మనుషులను గుర్తించడం.. పరిచయం పెంచుకోవడం. క్రమంగా మనుషులు వారి మాటలు చర్యలు అన్నీ గ్రహించి తను కూడా ఆ బాటలో నడవటం మొదలుపెట్టడం. మనిషి ఎదుగుదల లో కుటుంబం నేర్పిన సంస్కారం తో పాటు గా పరిసరాల ప్రభావం సమాజ ప్రభావం ఎంతగానో వుంటుంది. 


నేను కూడా ఉన్నత మధ్యతరగతి కుటుంబం లో పుట్టాను పెరిగాను. పరిస్థితులు వల్ల ఓ రెండేళ్లు పేదరికం అనుభవించాను. తర్వాత 17 ఏళ్ళ వయసు లో మరో మంచి కుటుంబం లోకి వెళ్ళాను. ఆ వయసులో వుండే ఆశలు ఆకాంక్షలు కలలు ఎన్నో! కొన్ని నెరవేరితే కొన్ని అదఃపాతాళానికి తొక్కేసాయి. పొరబాట్లు తెలియక చేసిన తప్పులు అన్నీ వున్నాయి అవగాహన లేక అమాయకం వల్ల. ఇంకా పట్టుదల, మొండితనం, ఆత్మాభిమానం ఆత్మవిశ్వాసం అన్నీ వెరసి జీవితాన్ని ముప్పై సంవత్సరాల వయసులో సవాల్ చేస్తూ నిలబెట్టాయి. అన్నీ అధిగమించాను.  ఎవరి ఆర్థిక సాయం కోరలేదు. ఆఖరికి పుట్టింటి నుండి ఒక బియ్యం గింజ కూడా! మానసికంగా అండగా కుటుంబం వుంది. నా అత్తమామలు అండగా నిలిచారు.  అప్పటి నుండి ఈ 58 ఏళ్ళ జీవితం వరకూ నేను  ఎంతో నేర్చుకున్నాను. ఒకరిచ్చే సాయాన్నో ఉదారత నో ఇంకా దేన్నో  దేన్నో నేను స్వీకరించలేదు. నిర్విద్దంగా తోసి పారేశాను. ఏది చేసినా నా కోసం నేను చేసుకున్నాను. నా బిడ్డ కోసం చేసుకున్నాను. ఎవరు ఎన్ని అన్నా అపవాదుల బాణాలు వేసినా ఈర్ష్య ద్వేషాలు వొలకబోసినా విషం విరజిమ్మిన నిబ్బరంగా తట్టుకున్నాను. అనారోగ్యంతో వున్నప్పుడు కూడా నా బిడ్డ ను ఊతగా చేసుకుని నిలబడ్డాను. ప్రతికూలతలు తట్టుకున్నాను. గృహ హింస మానసిక హింస వరకట్న హింస నాకు తెలియనివి కావు. నా జీవితంలో నాకు ఎదురైన ప్రతి అనుభవం ఒక గొప్ప పాఠం. ఎవరి దగ్గర ప్రత్యేకించి పాఠాలు నేర్చుకోలేదు. కానీ ఎంతో నేర్చుకున్నాను. 


నేను సాధించినది ఏమిటంటే.. అది గర్వంగా చెప్పుకుంటాను. ఇతరులు నన్ను చూసి నేర్చుకున్నారు. చాలామంది అమ్మాయిలకు నేను రోల్ మోడల్. అమ్మా అనే పిల్లలు ఆంటీ అనే పిల్లలు, అక్కా అని ఆత్మీయంగా పిలిచే చెల్లెళ్ళు మేడమ్ అని గౌరవంగా విలిచేవారు.. వారి జీవితాల్లో నాకు ఒక ప్రత్యేక స్థానం ఇచ్చారు. వనజ గారితో మాట్లాడితే దైర్యం వస్తుంది. సమస్య ల్లో నుండి బయటపడే దారి తప్పకుండా దొరుకుతుంది అని అంటారు. ఇప్పుడు వనజ గారి కథలు చదవండి అని ఇతరులకు చెబుతారు. నా చుట్టూ ఈ సోషల్ మీడియా కి తెలియని ఒక సమూహం ఉంటుంది. ఆ సమూహం ఎల్లప్పుడూ నాతో టచ్ లో వుంటుంది. ఇక్కడ ఉన్న స్నేహితుల్లో కూడా మెసెంజర్ లో నాతో ఎన్నో విషయాలు పంచుకుంటారు. వారి ప్రైవసీ ని నేను సదా కాపాడతాను. వారు రాయమని అడిగితే తప్ప ఆ విషయాలు కథల్లో నేను రాయను. వారి వ్యక్తిగత విషయాలు ఇతరులకు చెప్పి వారి గౌరవానికి భంగం కలిగించను. అది నా నిబద్ధత. 


నా జీవితం కొత్త పుంతలు త్రొక్కాక పరిణామక్రమంలో నేను చాలా యెదిగాను. వికాసం వైపు ఎదిగాను. ఈర్ష్య ద్వేషాలు నాకు ఎప్పుడూ ఉండవు. లేశ మాత్రం వున్నా వాటిని జయించాను. ప్రేమగా ఇచ్చినా ఉదారంగా ఇచ్చినా సాయం గా ఇచ్చినా నేను ఏదీ స్వీకరించను. నా దగ్గర వున్నది ఇవ్వగల్గినది అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఒకోసారి ఇవ్వలేను. ఒకరిపై ఆధారపడను. ముక్కు సూటిగా వుంటాను. కొంచెం కఠినంగా ఉంటాను. నేను సేప్ గా వుండటానికి కంఫర్ట్ గా వుండటానికి అది అవసరం. ద్రోహం చేసిన వారిని కూడా క్షమిస్తాను కానీ పనిగట్టుకొని విషం చిమ్మేవారిని క్షమించను. ఇద్దరు వ్యక్తులను  క్షమించాల్సిన బాకీ వుంది. బహుశా జీవితం లో క్షమించలేను వారిని. 

ఎవరైనా ఇది చదివి మెచ్చుకున్నా మెచ్చుకున్నట్టు మెచ్చుకుని నొసలు పైకి లేపి ఎగతాళిగా నవ్వుకున్నా.. నేను పట్టించుకోను. సత్యం వైపు ధర్మం వైపు.. వికాసం వైపు.. దయ కరుణతో ప్రేమతో నా పరిధిని బట్టి నేను ముందుకు వేస్తున్న అడుగులు ఇవి. ఎవరిపై ఆరోపణలు లేవు. ప్రశాంతంగా చదువుకోవాలి రాసుకోవాలి అనే కోరిక తప్ప. 


నా ఈ ప్రయాణం లో.. సాహిత్యం సంగీతం ప్రకృతి స్నేహితులు నాకు బాసటగా నిలిచారు. 

నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్పుకోవాల్సి వస్తే.. ముందుగా వాటికే చెప్పాలి. నిస్వార్థంగా నా స్నేహితులు నా వైపు వున్నారు. నా చెలిమి కలిమి బలిమి కన్నా ఈ లోకంలో మరేది లేదు లోకాన మేలిమి గా. 


నేను ఏదీ అతిశయంగా రాయడం లేదు. జీవితాన్ని జీవితానుభవాన్ని తేటతెల్లం చేస్తున్నాను. కాలక్షేపం కోసం రాసుకునే రాతల్లో కూడా చిన్న సందేశం స్ఫూర్తి వుంటాయి. నా రాతలో అవి దొరికితే అదే మహాభాగ్యం నాకు. 


ఈ ఉదయం నుండి నా పుట్టినరోజు సందర్భంగా మీరందరూ.. మనస్ఫూర్తిగా  ఇచ్చిన ప్రేమ, శుభాకాంక్షలు నాకు ఎంతో సంతోషాన్ని కలిగించాయి. అందరికీ వారు అందించిన శుభాకాంక్షలు క్రింద ధన్యవాదాలు తెలిపాను. ఎవరికైనా ధన్యవాదాలు తెలియజేయకపోతే మన్నించండి. మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు. 

నమస్కారాలు 🙏






కామెంట్‌లు లేవు: