2, మార్చి 2026, సోమవారం

పువ్వుల కన్నీరు

 


పువ్వుల కన్నీరు   - వనజ తాతినేని 

(Weeping Flowers)


రాలి అమ్మమ్మ ఒడిలో చేరినవి కొన్ని. 

వాటిని చూసి యేడుస్తున్న తల్లి

రాలి ఇంకా తల్లి ఒడిని వదలలేక కొన్ని..

రాలి తన ఒడిలోనే వున్న బిడ్డలను యింకా 

గట్టిగా హత్తుకుని యేడుస్తున్న తల్లి.. 

పూలకు భాష లేదని, రాదని అనను. 

రోజూ ఇదే దృశ్యాన్ని చూస్తూ మూగబోయి 

కొన్ని నిమిషాలు మౌనం వహిస్తాను 

వాటి ఆత్మ శాంతి కొరకు. 


*******

పూలేనా.. కాదు, కాదు.

మర ఫిరంగులకో  విస్ఫోటనానికో.. ప్రమాదాలకో 

ఏ కొక్కిరాయి తగలకుండానే  రాలిపోతున్న పిట్టల్లా.. 

సృష్టి లో జీవులన్నింటికన్నా తెలివైన మానవులు 

రాలిపోవడం సహజం అయిపోయింది. 

నిత్యం యివే దృశ్యాలు చూస్తూ కథనాలు వింటూ 

స్పందన లేక పాషాణం లాంటి మరో నేను.

చిన్నప్పుడు బొమ్మా బొరుసు ఆట యిష్టంగా ఆడేదాన్ని. 

ఈ ద్వంద్వ వైఖరి నాలోనే వుంటుందని 

నేనెప్పుడూ ఊహించలేదు. 

నాలాగే యెందరో అనుకుంటే కానీ 

యీ పాడు మనస్సుకి శాంతి.


02 March 2026. 06:30 am

©️Vanaja Tatineni 

కామెంట్‌లు లేవు: