రానిక చెలీ.. నీ కోసం
చెరువుగట్టు గంగానమ్మ గుడి
సంచారం లేని ప్రదేశం.
ఆలస్యంగా ఉదయపు నడకకు వెళ్ళాను.
జిలుగు వెలుగుల చీర కట్టుకుని వున్న పల్లెటూరి స్త్రీ ఫోన్ లో గట్టిగా మాట్లాడుతుంది.
వినాలని లేకపోయినా చెవులకు రబ్బర్ హారన్ లా తాకుతున్నాయి.
ఎవరినో నోరు పట్టని అశ్లీల భాష లో కత్తితో మాంసం కండలను నరికినట్టు నరుకుతూ దుమ్మెత్తి పోస్తూ…కాని బంధం ఆచూకీని పట్టి ఇచ్చింది.
ఆవేశాన్ని దాచుకుని కన్నీళ్ళతో ఇంకెవరికో ఫోన్ చేసింది.
“బయటకు వస్తావా అని అడిగాడు. చీకటితో వచ్చాను. ఎనిమిదిన్నర అవుతుంది ఇంకా రాలేదు. పిల్లలు నిద్రలేచి ఆకలికి అమ్మను వెతుక్కుంటూ వుంటారు. వాళ్ళకి ఓ ఇరవైరూపాయలకు ఇడ్లీ తెచ్చి ఇస్తావా? నేను వచ్చేస్తున్నాలే” అంటుంది పిచ్చి తల్లి.
జాలిగా ఆమె వైపు చూసాను. “గుండెను బతికించే పిడికెడంత ప్రేమ మరుగు ప్రదేశాల్లో
ఉండదమ్మా, బహిరంగంగా వెతుక్కో! లోకానికి ఝడిసి ప్రమాదం అంచుల్లోకి వెళ్ళకు.
ఈ చెరువులో చచ్చిన చేపల్లా పైకి తేలతావ్. జాగ్రత్త!!” అని చెప్పాలనుకుని ఆగిపోయాను.
నా ఏడుపు గొట్టు పాటల టేస్ట్.. పొదికలో.. నుండి..
రానిక చెలీ నీ కోసం, రాదిక వసంత మాసం.. అని పాడటం మొదలు పెట్టింది.
నేను పాట ఆపదల్చుకోలేదు. కొబ్బరి చెట్లు నీడన వేసి వున్న సిమెంటు బెంచీ పై కూర్చున్నాను. ఆమె కూడా బెంచీకి ఆ చివర కూర్చుని.. పాట శ్రద్ధగా విని కళ్ళు తుడుచుకుంటూ ఊర్లోకి దారి తీసింది.
నేను ఆలోచిస్తూ కూర్చుని వుండిపోయాను. రోజంతా గడుస్తున్నా ఆమెను మనసులో నుండి తీసేయలేకపోతున్నాను.
హ్మ్..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి