నక్షత్రాలతో మాట్లాడాలి - వనజ తాతినేని.
నక్షత్రాలతో మాట్లాడాలి.
నేను ఎంతగానో ప్రేమించిన వారు వారిలో ప్రకాశిస్తున్నారు.
వారు నాకు ఏదో సందేశం పంపుతున్నారు.
శ్రద్దగా ఆలకించాలి. దయ చేసి నన్ను ఆటంకపర్చకండి.
నన్ను వెళ్ళనివ్వండి.
ఆ నక్షత్రాల్లో ఎవరెవరు వున్నారంటే..మా అమ్మ నాయనమ్మ
అమ్మమ్మ జేజమ్మ మేనత్త మా తాత ముత్తాతలు
ఎలాగూ వుంటారు. మా కుటుంబం నిలబడటం కోసం
వీరందరూ జీవన పోరాటం చేసినవారే!
వారి అనుభవాలన్నీ కథలు కథలుగా మాకు చేరినవే!
అయినా వాటిని వింటూ నా ఒడలు పులకరించడమో
నా కనులు చెమరించడమో గగుర్పాటో
భయమో కలిగినట్లు నాకు జ్ఞాపకం లేదు.
మరి ఎవరు!? నువ్వు ప్రేమించిన వారు!!
ఇప్పటికీ ప్రేమిస్తున్న వారు అని అడిగారనుకోండి.
ఏం చెప్పగలను వారి గురించి. కన్నీటి పర్యంతం మధ్య..
బయటికి రాని దుఃఖంతో గొంతు లుంగలు చుట్టుకుపోతున్నా..
బొంగురు గొంతుతో అయినా వారి అంతులేని కథల గురించి
ఆలస్యం లేకుండా చెపుతాను.
ఆ నక్షత్రాల రూపంలో.. మినుకు మినుకు మంటూ
వెలుగుతున్న వాళ్ళు ఇన్నాళ్ళూ నా దృష్టి లోపం వల్ల
చూడలేని వాళ్ళు, పుట్టు చెవుడు వల్ల వినలేని వాళ్ళు
కొత్తగా నాలో ఏదో శక్తిని నింపి నన్ను ముందుకు తోస్తున్న వాళ్ళు
వారు ఎవరంటే…
కటిక చీకటిలో మగ్గుతూ కూడా వారి జాతి విముక్తి
కొరకు కలలు కన్నవాళ్ళు
వాళ్ళ మార్గంలో అంగుళం అంగుళాన మర మేకులు
గుచ్చుకున్నా వారి వీపులను చెర్నాకోలలు పదే పదే
ముద్దెడుతున్నా రోజుల తరబడి దాహానికి అలమటించినా ..
జీవితాంతం పదే పదే ఒకే ఒక కల గన్న వారు..
సూర్యుడిలా వెలుగు పంచాలనుకునే వారు
చంద్రుడి కాంతిలా చల్లగా మృదువుగా మారి
వారి గుండె గాయాలపై పూసే నవనీతంలా వుంటే చాలు
అనుకున్న వారు.. ఎవరంటే.. వారెవరంటే..
ఫ్రెడరిక్ డగ్లస్, లాంగ్స్టన్ హ్యూస్,
సోజర్నర్ ట్రూత్, మార్టిన్ లూథర్ కింగ్,
మాయా ఏంజలో, టోని మోరిసన్, ఓప్రా విన్ ఫ్రే ..
మొదలగు వారందరూ…
ఇంకా నా అజ్ఞానం వల్ల తెలుసుకోలేని వారందరూ…
నాతో తప్పక ముచ్చటిస్తారు. రహస్యంగా కొన్ని
బహిరంగంగా కొన్ని అంటూ ఏమీ లేకుండా
ఇప్పటికి తెరిచిన పుస్తకం లాంటి వారి జీవిత చరిత్రలను
పదే పదే చెప్పడానికి తయారుగా వుంటారు.
మర్చిపోయినవి జ్ఞాపకం చేసుకుంటూ కొన్ని..
అప్పుడు ఇతరులకు ఇబ్బంది కల్గించకుండా వుండటానికి
రాయలేక పోయినవి కొన్ని చెప్పడానికి తయారుగా వుంటారు.
నేను ఒడలంతా చెవులు చేసుకుని వెళ్లాలి.
వారు చెపుతున్నవి విని.. తిరిగి మీకు వినిపించాలని
రాయాలని వుంది. అందుకే నేను వెళ్ళాలి.
వారి గౌరవార్ధం నా గోధుమ రంగుని కప్పెట్టుకుని
వారి రంగుని పులుముకుని వెళ్ళాలి.
నేను ఇంతగా ప్రేమిస్తున్న వారికి సృష్టిలో పూసిన
ప్రతి పువ్వుని కోసి వారి పాదాల వద్ద వుంచి
కృతజ్ఞత తెలపాలి అని వుంది. పూలు కోయడంలో
మీరందరూ కూడా సాయం చేస్తారు కదూ!
నేను నక్షత్రాలతో మాట్లాడాలి.
నేను ఎంతగానో ప్రేమించిన వారు వారిలో వున్నారు.
వారు నాకు ఏదో సందేశం పంపుతున్నారు.
శ్రద్దగా ఆలకించాలి. దయ చేసి నన్ను ఆటంకపర్చకండి.
నన్ను వెళ్ళనివ్వండి. ఎడారి నిశ్శబ్ధంలోకి నన్ను వెళ్ళనివ్వండి.
ఒంటరిగా వెళ్ళవద్దు అని అడ్డుకోకండి.
మరొకరోజు మిమ్మల్ని వెంటబెట్టుకుని వెళతాను.
ఒట్టు ! నా పూర్వీకుల కన్నా మిన్నగా ప్రేమిస్తున్న
వారిపై ఒట్టు !!
06 మార్చి 2026 10::00 pm.
(పిబ్రవరి నెలంతా..కాకుండా ఈ రోజు కూడా ఆఫ్రో అమెరికన్ నల్లజాతి ప్రముఖుల సాహిత్యాన్ని తెలుగు పాఠకులకు శ్రద్దగా ఇష్టంగా పరిచయం చేసిన తెలుగు సాహిత్య ఐకానిక్ టవర్ అయిన
వాడ్రేవు చినవీరభద్రుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు)

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి