వెక్కిళ్లు పెడుతున్న ఊరు
- వనజ తాతినేని.
ఊరు నిన్ను కడుపులో పెట్టుకొని
చూసుకుంటుంది. అయినా
నువ్వు నీ ఎదుగుదలను కోరుకుంటూ
అప్పటిదాకా నిన్ను పెంచిన ఊరికి వీడ్కోలు చెబుతావు.
ఊరికి చుట్టం చూపుగా రావడం కూడా మరిచిపోతావ్.
ఎక్కడెక్కడో తిరుగుతావ్
జ్ఞాపకాల పొరల్లో ఊరిని దాచుకుంటావ్
తిరిగి తిరిగి తిరిగి.. అలసి ఊరిని వెదుక్కుంటూ వస్తావ్
అప్పుడు మసకబారిన ఊరు చూపు నిన్ను గుర్తు పట్టదు. పైగా..
ఎవరూ .. ఈ అపరిచితుడు అని
అనుమానంతో పట్టి పట్టి చూస్తుంది.
నాది ఈ ఊరే అని గొంతెత్తి అరిచినా..
వినిపించుకోదు ఊరు.
ఊరిలో ఎవరు నీ వారు అని ఆరాగా అడుగుతుంది.
నువ్వు తెగనమ్ముకుని వెళ్ళిన బంధాల ఆచూకీ మచ్చుకైనా కానరావు.
బడి గుడి మంచినీళ్ళ ట్యాంకు ఆసుపత్రి లేదా
నలుగురు కూర్చునే బెంచీల పైనో నీ పేరు లిఖించి వుండదు.
నీ వాళ్ళ పేరిట నువ్వు నాటిన నాలుగు మొక్కలు
వృక్షాలై కనిపించవు. నిన్ను పోల్చుకోవడానికి.
నీ బంధువుల పిల్లలో.. నీ స్నేహితుల పిల్లలో
ఎవరూ ఉండరు.ఏ పెళ్ళికో పేరంటానికో
పోనీ.. చావు పరామర్శ కో ఏనాడైనా నువ్వు వస్తేనేగా?
ఊరు నెంబర్ కూడా un known లో సేవ్ చేసుకుని వుంటావ్
చెక్ బుక్ పై సంతకం గీకేసినట్లైనా..
ఊరంతా గాలించినా నీకొక సంతకం లేదు
ఊరికి ఏం ఇచ్చావ్ అని నోరు తెరిచి అడిగితే.. తెల్లబోతావ్.
అయినా.. ఊరికి నువ్వు గుర్తు లేకపోయినా తన చూపులతో
కుశల ప్రశ్నలు వేస్తుంది. చెంబుడు మంచినీళ్లు ఇచ్చి
దాహం తీరుస్తుంది. నీ కళ్ళు చూసి ఆకలి గుర్తించి
పండో ఫలహారమో పెడుతుంది.
మౌనంగా వీడ్కోలు చెప్తుంది.
ఊరి గుండె బరువు నీకు తెలియదు.
నీకే కాదు ఊరిని వదిలి వెళ్ళిన ఎవరికీ
తెలియదు.
పెళ్ళైన ఆడపిల్ల వెనక్కి వెనక్కి తిరిగి చూస్తూ కన్నీళ్ళు పెట్టుకున్నట్లు
ఊరిని వదిలి వెళ్తున్న వారిని చూసి ఊరు వెక్కిళ్ళు పెడుతుంది.
అమావాస్య ఎరగని వెన్నెల లాంటి చల్లని అమ్మ ఊరు.
మీ పాద ముద్రలను పదిలంగా గుండెల్లో దాచుకుంటుంది.
తల్లిలా ఊరు వెక్కిళ్లు పెడుతూ ఏడుస్తుంది.
11 April 2026. 07:50pm.
#వనజతాతినేని
#vanajatatineni
#వనజవనమాలి

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి