కవులెలా జీవించి వున్నారు - వనజ తాతినేని.
కవీ! కవి అనే గుర్తింపు పత్రం కోసం వరుసలో నిలుచున్నావా
లభించలేదని ఆరోపణలు చేస్తున్నావా!
అనేక కారణాల వల్ల మొండి చేయి చూపుతారు.
మోకాలడ్డు వేస్తారు. అందుకు భంగ పడ్డావంటే..
నీ జ్ఞాన చక్షువులు మోహాగ్నిలో దహించుకు పోయాయన్నమాటే! .
విచక్షణ మరిచావన్న మాటే, గుర్తింపుకి
షరతులు వర్తిస్తాయన్న సూక్ష్మ రహస్యం మర్చిపోయావు.
పోనీ..
లొంగి వుండేవాడికే ఎంగిలి మెతుకులైనా దక్కుతాయిలే
అనైనా ఓపిక పట్టలేకపోయావు. అసలు..
అవార్డులు, పురస్కారాలు, శాలువాలు, పుష్పగుచ్ఛాలు వీటిలో
నువ్వు జీవించి వుండలేవన్న సంగతి మర్చిపోయావు.
కాలం ఏదైనా కవి హాస్యాస్పదుడు విదూషకుడు
అవుతున్న విషయాన్ని గ్రహించావా?
లోపలి స్వరం నిన్ను హెచ్చరించడం లేదా?
నువ్వు కేవలం నీ కవితా వాక్యంలో జీవించి వుంటావన్న
పరమసత్యాన్ని మరిచిపోయావు.
శరపరంపరగా కవితల్లడమే తప్ప ఏనాడైనా సౌందర్యాధి దేవతకు
దాసోహం అయ్యావా? సృష్టిలోని శక్తులన్నింటికీ పరాధీన మయ్యావా!?
విశ్వ మేధస్సు వర్ణాల్లో నీ కుంచెను ముంచి కవిత్వాన్ని చిత్రించావా?
బడుగు జీవుల సంవేదనలను స్త్రీల నిశ్శబ్ద రోదనను పసివాడి
ఆకలి కేకలను అక్షరీకరించావా? బాధితుల బాధల పట్ల
సహానుభూతి పొందావా?
అసలు నిన్ను నీవు ఎప్పుడైనా కోల్పోయావా?
పోనీ..కరుకురాతి బండల క్రిందగా దారి చేసుకుంటూ
జర జర ప్రవహిస్తున్న సెలయేరు ని హృదయంతో విన్నావా
ఖాళీల గుండా ప్రవహించడమెలాగో అది బోధించలేదా?
మోకరిల్లడం తెలియని నీకు వినమ్రత ఎలా అంటుకుంటుంది?
ఇంద్రియ జ్ఞానంతో లోకాన్నంతటిని సృజించగల్గిన మనిషికి
మాటలకు అందని అనుభూతిని పరిచయం చేసావా?
విషయాన్ని దృశ్యంగా మలిచావా? లయాత్మకంగా
వినిపించావా, ఉద్వేగంతో చదివించావా!?
సామాన్యుడి హృదయాన్ని కట్టిపడేసే వొక్క వాక్యం
గురించైనా సాధన చేసావా? సహాయక కవుల సాయంతో
ఉనికి చాటుకునే నువ్వు నీ ఆత్మకు లేని ఔన్నత్యాన్ని కళకు అతకలేవు
దానికి ఏ మణి మాణిక్యాలు పొదగగలవు చెప్పు!?
కీర్తి కండూతి మాయాజాలంలో చిక్కుకోకు
నీ జ్ఞానం నీకు తొలిమెట్టు. ఇతరులు ఆర్జించిన
జ్ఞానాన్ని మలిమెట్లుగా చేసుకోడమే నీ విధి.
శిఖరాలను అధిరోహించాలంటే ముందు నీ కాళ్ళ క్రింద
నేల జారిపోకుండా చూసుకోవాలి.
అనుభవించే శక్తి లేనప్పుడు ఏ అనుభవం నీ దరికి
చేరదన్న చేదు నిజాన్ని జీర్ణించుకోవాలి.
ఇతరుల బాధ వేదన నీకు అనుభవమైనప్పుడే..
ఆ గాయాల నొప్పి గేయాలుగా మారతాయి.
అందుకోలేని నింగికై అర్రులు చాస్తూ ఆక్రోశించడం
జీవనఘోష అనిపించుకోదు.
మనిషి నాగరీకుడవుతున్నాడన్నది అబద్దం.
అది మృత్యువు అంత సత్యం.
ఎవరో ఎందుకు నిన్ను గుర్తించడం! నిన్ను నీవు గుర్తించుకున్నావా?
నీ భుజం నువ్వే చరుచుకున్నావా! ప్రోత్సహించే శక్తి
అందలం ఎక్కే శక్తి రెండూ నీలోనే వుంటాయని మర్చిపోకు.
నువ్వు జ్వలనం కాలేని యెడల జ్వలితం కాలేవు..
దీపం లో వున్న లోపాలన్నీ కాంతిలో కనబడినట్టు
కవిలో వున్న లోపాలన్నీ కవిత్వంలో గోచరించక మానవు
ఎడారిలో స్వేచ్ఛ ఆకుపచ్చ లోయల్లో ఏకాంత వాసం
ఊహల్లో బాగుంటాయి. కాలానికి నిలవలేని రసాత్మకం కాని
వాక్యమొకటి విసిరి పడేసి అదే కవిత్వం అనుకోకు
నీకు పొసగని సందేశాత్మక కవిత్వాన్ని కాలుష్యంలా వెదజల్లకు.
అహంకార కుబుసాన్ని విడిచిపెట్టి
పాఠాలు నేర్చుకోవడానికి పసి పిల్లల మధ్య కూర్చో.
నిన్నొక మట్టి ముద్దగా మార్చుకుని కూర్చో
వారిలో వున్న స్వచ్ఛతను దైవత్వాన్ని ఉత్సుకతను
నీకు సరికొత్తగా పరిచయం చేస్తారు
ప్రతిది రుచి చూడాలనుకునే ఆత్రుత ని నీకు బోధిస్తారు.
కవిత్వం ఒక మృదు జ్వాల. మెత్తని ముల్లు చేసే గాయం.
తగు మాత్రం మత్తునిచ్చే ఔషదం. నీకు తెలుసా!
నీ పూర్వ కవులను నవ్య భాషతో నీ కాలంలో నడిపించే
ఉపకరణమే నువ్వు. అంతకుముందు లేనిదేది కొత్తగా లేదు
సరికొత్తగా నువ్వు సృజించలేదు. ఇప్పుడున్న వేదనే
అంతకుముందూ లేకపోలేదు. రూపాంతరం చెందింది అంతే!
నీ కన్నా ముందున్న అనేకులు నీతో పాటు వున్న లక్షలాదిమంది ..
ఏమీ రాయలేదు పాడనూలేదు చిత్రించనూ లేదు బోధించనూ లేదు.
మౌనంగా దాటెల్లి పోయారు. మనం మాత్రం శాశ్వతంగా వుంటామా?
నువ్వు నీ కాలంతో బ్రతికావా, చలించావా, పోనీ కొన్నిసార్లైనా
అవమాన పడ్డావా? ఉద్రేకం చెందావా? అయితే రాయి..
నీ సంకెళ్ళు విదిలించుకుని ఆంక్షలను బద్దలు కొట్టుకుని మరీ..
కవిత్వం రాయి..అనుక్షణం ఆత్మపరీక్ష చేసుకుంటూ రాయి.
నువ్వు ఏదైతే ఆలోచిస్తావో దాని గురించే మరింత
ఆలోచించి రాయి.నువ్వు దేన్నైతే అనుభవించావో దానిని
నిజంగానే అనుభవించి రాయి. తపించి తరించి తర్కించి
పెనుగులాడి విడివడి అప్పుడే రాయి.
భోగలాలస లో పడకుండా రవ్వంత పరికింతతో నీ ఆత్మను
శోధించి సాధించి శోకించి శోషించి కరుగుతూ కరిగిస్తూ రాయి.
శిలాక్షరాలుగా నిలిచి వుండే కవిత్వం రాయి.
కవీ.. కవి అనే గుర్తింపు పత్రం కోసం కాదు.
కవితాత్మతో నువ్వు రమించడం మొదలెట్టు, రసరంజితం చేయ్ .
మరణానంతరం గుర్తింపు పత్రం అదే నిన్ను వెదుక్కుంటూ
గడప గడపను అన్వేషించి నీ చిరునామా తెలుసుకుంటుంది..
నువ్వు వదిలి వెళ్ళిన అక్షర మాలికలను మరులుగన్న
కవితా ప్రేమికులు కళ్ళకద్దుకుంటారు.
నీ కవనాన్ని వారి ప్రేమతో పునర్జీవింపజేస్తారు.
కవులు అలాగే బతికి వున్నారు మరి. నిజమైన కవులు
కాలానికి ఎదురొడ్డి అలాగే జీవించారు మరి.
•••••••••••••

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి