నా ప్రేయసి చచ్చిపోయింది - వనజ తాతినేని
నా ప్రేయసి చచ్చిపోయింది.
యవ్వనకాలంలో నాకెన్నో రంగుల కలలను పరిచయం చేసిన నా ప్రేయసి చచ్చిపోయింది.
మూడు రాత్రుల ముచ్చట తో ఆమె నాకంత అద్భుతంగా అనిపించడం మానేసింది.
మురిపించే మాటల స్థానంలో బరువులను నాపై వేయడం అత్యంత బాధాకరం అయిపోయింది.
తిన్నావా, ఇంకా పడుకోలేదా, ఆరోగ్యం పాడై పోదు అంటూ అత్యంత శ్రద్ధ చూపించే తను పస్తులుంటే మంచిదేలే..నిద్రపోతే అంతస్తు ఎలా పెరుగుతుంది అని తరమడం మొదలెట్టింది.
ఒక్క రుతువు మాత్రమే వికసించి గుబాళించి అలరించిన ప్రేమ ఎండిపోయిన ముళ్ళ పొదలా మనసును గుచ్చుతుంది.
****
నా ప్రేయసి చచ్చిపోయింది.
ఆ స్థానంలో సతత హరితం లాంటి నెచ్చెలి నా జీవితంలోకి ప్రవేశించింది.
నాకు జీవితాన్ని ఎలా చూడాలో మడతలు విప్పి తిప్పి తిప్పి చూపించింది.
నిత్య అవసరాలు కూడా భావోద్వేగాలతో ముడిపడి ఉంటాయని పాఠం చెప్పింది.
కష్ట సుఖాల సంగీతాన్ని ఆస్వాదించాలని ఎప్పుడూ బతుకు పూల నావలా సాగదని
ఆరోహణ అవరోహణ క్రమాన్ని విశదపరిచింది.
కొత్త పదవులు వస్తాయని వాటిని జాగ్రత్తగా నిలబెట్టుకోవాలని భవిష్యత్తు దర్శనం చేయించింది.
నా నెచ్చెలి నిత్యం పచ్చగా పక్కనే వుంటానని జీవిత క్యాలెండర్ చివరి పేజీలో కూడా పండ్లభారంతో ఆహ్లాదంగా అలరిస్తానని వాగ్ధానం చేసింది.
నా ప్రేయసి చచ్చిపోయింది. నాలుగోనాటి రాత్రి ఆమెలో నా హోళీ చెట్టు పరకాయ ప్రవేశం చేసింది.
ప్రేమ స్థానంలో స్నేహం వేళ్ళూనుకుంది.
05 April 2026. 10:15 am

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి