21, ఏప్రిల్ 2026, మంగళవారం

పరులెరగని పుష్ప వాటిక

 


పరులెరుగని పుష్ప వాటిక  - వనజ తాతినేని

మనుషులు ఎవ్వరూ చూడని పూల తోటను పెంచాను నేను. 

ఆ తోట మీకెవ్వరికి తెలియని నా ప్రత్యేక అభిరుచిని ప్రతిబింబిచేది.

వనంలో పూసే ప్రతి పువ్వు నా కన్నీటిని మింగి వికసించిందే

ప్రతి పువ్వు పేరు చెప్పలేని భావోద్వేగాల వర్ణాలతో శోభిల్లుతుండేది.

ఆ వనదేవత అనుక్షణం  ఏ రాగమో తెలియని పాట పాడుతుండేది

కోయిలలు  కూడా  ఎవరికీ వినిపించని స్తోత్రగీతాలు పాడుతుండేవి


బుతువులతో పని లేని తోటకి నిత్యం వసంతోత్సవమే

రాలని పూల చుట్టూ  ఝమ్మంటూ తిరిగే తుమ్మెదలు

విరి తేనెతో విందులు చేసుకుంటూ సుస్వరాలు విసిరే పికిలి పిట్టలు

రేయింబవళ్లు సీతాకోకచిలుకల సంచారంలో  నా శాంతి క్రాంతి 

కలగలసి ఏళ్ళ తరబడి ఎవరికీ వినబడని ఆత్మ గీతం పాడుకునేవి


ఎందుకు ఒనగూడని  ఎవరికి కనువిందు చేయని 

నేను పెంచి పోషించిన తోట ఎవరికీ పరిచయం కాకుండానే 

రంగులన్నీ వెలిసిపోయి దిగులుతో దేహ త్యాగం చేసింది.

మరణ సృహ లేకుండానే నిశ్శబ్దంగా నా నుండి కనుమరుగైంది. 

తుదకు నా లోనే నా పూల తోట హవిస్సులా దహింపబడింది.

అప్పటిదాకా నెయ్యంతో  నన్ను అలరించిన నందనవనాన్ని

కృతజ్ఞతతో ప్రేమ పల్లకీలో కూర్చుండబెట్టి  ఊరేగించాను

మౌనగీతంతో నివాళులు అర్పించాను.


20 April 2026.10:30pm.




కామెంట్‌లు లేవు: