15, ఏప్రిల్ 2026, బుధవారం

ప్రాపంచిక దృక్పథం మెరాజ్ ఫాతిమా కవిత్వం.

 



ప్రాపంచిక దృక్పథం “మెరాజ్ ఫాతిమా” కవిత్వం - వనజ తాతినేని. 


కవి చెప్పేది నీకు పూర్తి అనుభవం లో ఉంటే ఆ కవిత్వం నీకు అనవసరం. 

కవిత్వం చదివిన తర్వాత కూడా నీ అనుభవానికి విషయం ఏ మాత్రం అందకపోతే ఆ కవిత్వం నీకు వృధా! నీకు తోచనిది కనబడనిదీ కవి చెప్పిన తర్వాత నీ అనుభవంలోకి ఎంతోకొంత వచ్చేది అదీ నీకు సరిపడే కవిత్వం అన్నారు చలం. 


మనకు ఎంతో కొంత అనుభవం లోకి వచ్చే కవిత్వం గురించి..ఇక్కడ పరిచయం చేసుకుందాం. 


**************

అరే, ఇక్కడో పారిజాతం ఉండాలి 

రాలిన పూలను ఏరిన ఆ చిట్టి చేతులేవి 

గొప్ప తోడుని అడిగిన ఆ మొక్కులేవి? 


గుడ్డ బొమ్మలకు పెళ్ళిళ్ళు చేసిన 

చిన్నారి ముత్తయిదువ ఆ చిన్నమ్మ ఏదీ? 

ఆమె నడిచిన చిట్టి పాదముద్రలేవీ? 

అని అడుగుతున్న ఈ స్త్రీ సౌకుమార్య భావనలు ఎక్కడివి!? 


కాలమంతా రంగుల రాట్నమై 

గిర గిరా తిరిగే చలన చక్రమై స్ఖలన దుఃఖమై యుగాల నాటి ప్రశ్నా పత్రమై.. 

బాల్యాన్ని పాతి పెట్టిన శిథిల సౌధమై..


అంటూ..  పసి తనపు తలపుని గుర్తు చేసుకుంటూన్న  ఈ అక్షర విన్యాసం ఎవరిదీ!? 


“మెరాజ్ ఫాతిమా” అనే కవి కవిత్వం ఇది.


మూడు దశాబ్దాలుగా కవిత్వం ఆమెకు సహచరిగా వుంది. తన ముందు తరం వెనుక తరం మధ్య వారధిగా నిలబడి శతాబ్దాల మూగ వేదన ను కవన రూపం లో విప్పి చూపించారు. మొదట ఆమె “కవితా సమాహారం” అనే బ్లాగ్ ద్వారా పరిచయం.అక్కడ ఆమె కవిత్వం పరివ్యాప్తం అయ్యాయి. తర్వాత రెండు మూడేళ్ళకు ఫేస్ బుక్ లో మంచి కవిత్వం వ్రాసే వారిలో ఒకరిగా గుర్తింపు పొందారు. వివాహానికి పూర్వం ఆమె కడప ఆకాశవాణి యువవాణి కార్యక్రమం ద్వారా  వాసంతి గా పరిచయం. సాహితీ ప్రపంచం ఆమెకు కొత్తేమి కాదు. వస్తువు ఏదైనా ఆమె హృదయంలో లలితమై చలనమై ఆలోచనలో జ్వలనమై జాగృతమై ఆమెకంటూ ఒక ప్రత్యేక  ముద్రగా అలరిస్తుంది. 


మగవాళ్ళ అమానుష కృత్యాల వల్ల స్త్రీల జీవితాలు అంధకారంలో మునిగి పోయినప్పుడు వారికి కాస్త వెంటిలేటర్ అవసరం అని తన కవిత్వం లో పదే పదే చాటి చెబుతారు. స్త్రీలకు  కాస్త చదివిడి జ్ఞానం వుండటం మూలంగా వారికి తమ జీవితం మీద శరీరం మీద అధికారం కావాలనే ఆలోచన ఆకాంక్ష కల్గడం మొదలవుతుందని తద్వారా  స్త్రీ  బలపడటానికి  కూడా పుస్తకాలే దారి చూపుతాయని ఆమె  అంటారు.  


పురుషులకు ప్రేమ ఆట వస్తువేమో కానీ స్త్రీకి ప్రేమే జీవితం. ప్రేమించిన పాపానికి.. మనస్పూర్తిగా నమ్మి అతని చేయి పట్టుకుని ముందుకు నడిచిన పాపానికి.. ఎన్నో కష్టాలను అనుభవించి అధిగమించి.. తమ జీవిత లక్ష్యం చేరుకోగల్గిన స్త్రీలను ఆమె తన కవిత్వంలో చూపించారు. పురుషుల్లో చదువుతోపాటు సంస్కారం ఏ మాత్రం పెరగలేదనే చురకలు అంటిస్తారు. 


పురుషుడికి సహచరి అంటే ఏమిటి అన్నదానికి ఈ  కవయిత్రి చెప్పిన ఈ భావం చూడండి.. ఎంత హిమోన్నత శిఖరమో! 


‘’నీకు తెలుసా! స్పృహనై  స్పూర్తినై  స్పర్దనై స్పర్శనై సాహసినై 

సహవాసినై  సంతసం తో సదా నీకై  అద్దరిన వేచి ఉండే హిమాని నేను 

జీవితానికీ  జీవించటానికీ భాష్యం చెప్పే నీ సహచరినే నేను”


మెరాజ్ కవిత్వంలో ఏముంది? నిత్యం ప్రవహిస్తున్న లావా లాంటి కవిత్వం వుంది.. 

కవితా నిర్మాణం శైలి విభిన్నంగా వుంటుంది అని పూర్వ కవులు వ్యాఖ్యానించారు.  


మాతృత్వం  స్త్రీకి ప్రపంచమైంది. కుటుంబం కూడా చారిత్రాత్మక అవసరం చేసింది. ఆమెను నాలుగు గోడలకు పరిమితం చేసింది. సామాజిక జీవితాన్ని దూరం చేసింది. ఉత్పత్తిలో భాగం కాకుండా చేసింది.అందువల్లనే స్త్రీ భర్తపై ఆధారపడాల్సి వచ్చింది. పెదవి విప్పితే పాశవిక హింసను చవిచూసింది. కన్న బిడ్డైనా సరే.. స్త్రీ ని నిర్ధాక్షిణ్యంగా అణచివేస్తాడు. ఆ విషయాన్నే వేదనతో  కవిత్వీకరించారు.


“తల్లులు విశ్రమించ కూడదు,

లోకం నుండి నిష్క్రమించనూ కూడదు,


అలా ఒళ్ళు మరిసి

ఉండకూడదు,

చురుగ్గా ,చాలాగ్గా ఉండాలి

పరాగ్గా ఉండకూడదు,


తన కాండక్ట్ సరిఫికెట్ నిరూపణ కై

మొగుడి ముందే కాదు ప్రతి మొగోడి ముందూ పరోక్షంగా మోకరిల్లాలి,


కన్న పేగైనా సరే

ఉన్నపళంగా వదిలేస్తే

కిక్కురు మనకుండా

త్యాగానికి తల ఇవ్వాలి.


అవును....

అమ్మంటే త్యాగానికి

బలవ్వాలి.”


******

మెరాజ్ కవిత్వంలో  సామాజిక స్పృహ మెండుగా వుంది. ఆమె నిత్యం ఫేస్ బుక్ లో పంచుకునే కవితల్లో మనుషులు మనిషి తనాన్ని కోల్పోవడం పట్ల వేదన వుంది. పరిసరాలు పరిశుభ్రంగా పచ్చగా వుండాలన్న ఆకాంక్ష వుంది. 


స్త్రీ పురుష భేదం లేకుండా మనుషులందరూ అనుభవిస్తున్న వివక్షలు గురించి వుంటుంది. 

అన్నింటికీ మించి కుటుంబ వ్యవస్థ మోపుతున్న భారం పట్ల ఆక్రోశం వ్యక్తం అవుతుంది. మెరాజ్ కవిత్వం జీవితాలను చిత్రించింది. స్త్రీ మనస్సు ను ప్రతిబింబించే కవిత్వం చాలానే రాసారు. స్త్రీ వాదం స్పష్టంగా కనిపిస్తుంది. స్త్రీలు పురుషునిలో దేహగతమైన సాన్నిహిత్యం కన్నా కూడ మానసికమైన తోడు వుండాలని బలంగా కోరుకుంటారు. మర్రిచెట్టు నీడలో ఎదగని మొక్కలా వ్యక్తిత్వాలు కుంచించుకుపోయి బతకడం అంటే రోసి పోయిన  స్త్రీ ల వేదనలు ఆవేదనలు కొత్తవేం కావు. కానీ నాగరిక సమాజంలో కొత్త పుంతలు తొక్కుతున్న నేరాల నేపథ్యంలో స్త్రీల పై జరిగే హింస కూడా కొత్తగా ఉంటుంది. దాన్ని కూడా కవిత్వీకరణ చేయడం తప్పనిసరి అంటారు. 


స్త్రీలు బాలికలు పై జురుగుతున్న లైగింక వేధింపులు అత్యాచారాలు పట్ల ఆగ్రహం వుంది. మదాంధుల  దాడిలో  మరణించిన కన్నెపిల్లల  కలల కాగితాలపై అంతులేని  విశ్వాసముతో  స్వజాతిగా సమిష్టి సంతకాలు పెడదాం, పరువు కోసం ప్రాకులాట  మానేద్దాం తిరుగుబాటు   చేద్దాం అని నినదించారు క్రింది కవితలో..


“ఆడవాళ్ళూ! మీకు జోహార్లు”


చాలు  చాలిక 

ఒకరినొకరు  నిందించుకొనే   ఆత్మ  ద్రోహాల

మహత్తర  నాటకాల మహోన్నత  సంభాషణలూ  


ఆత్మ స్తుతితో  అందలమెక్కిన  

అప్రకటితపు  అనూహ్య   వైనాలం  


శిరస్సులపై  పరువుల  బరువును

అనామకులమై   మోస్తున్న 

నిజాలం,


జన్మనిచ్చిన  సంతతికి  మాతృస్వామ్య  

హక్కుదారీ సంతకానికి  నోచుకోని నిశానులం,


ఉరి తాటికి వేలాడే మెడలేని పడతులం

ఉచ్చ గుడ్డలుతికే   ఉత్తమ  ఇల్లాళ్ళం 

గోనె  సంచుల్లో కుక్కబడ్ద  అనాథ  శవాలం


ముక్కలైన   మూగ  శకలాలం

ముప్పెనకు  గురైన  నత్తగుల్లలం


పెదవులపై   ఫెమినిజాన్ని   కాదు 

చెదలు  పట్టిన  చరిత్రని   తిరగతోడుదాం

విచ్చుకత్తులు గుచ్చుకున్న  గొంతులో నిత్య శబ్దమై   పల్లవిద్దాం


తగలబడుతున్న  పూలవనాలపై 

కఫన్  కప్పిన  మన కలలపై  నివురు  కప్పిన 

తప్పుడు  సాక్ష్యాలను   తగలబెడదాం.


అని.


గొప్ప కవిత్వం ప్రధాన లక్షణం ఏమిటంటే .. చదివిన వారికి ఎవరి తాహతుని బట్టి వారికి ఎంతోకొంత అనుభూతిని అందించగల్గడం. ఆ లక్షణం మెరాజ్ ఫాతిమా కవిత్వానికి పూర్తిగా వుంది. ఆమె కవిత్వం అర్థం కాకపోవడం అంటూ ఏమీ వుండదు. తేటతెల్లంగా వుంటుంది. చదివిన వారి గుండెల్లోకి దూసుకుపోతుంది. ఆలోచనలను కుట్టి కుదుపుతుంది. ఇది కదా సత్యం, ఇది కదా నా అనుభవం కూడా! అని పాఠకుడు అంగీకరిస్తాడు . తను రాయలేని తన వైయక్తిక అనుభవాన్ని ఆ కవితలో దర్శిస్తాడు. కవిత్వంలో సెల్ఫ్ ఐడెంటిటీ వెతుక్కుంటారు.


భర్త మాత్రమే కాదు కుటుంబంలోని ఇతర స్త్రీలు కూడా స్త్రీకి శత్రువులే అని సవివరంగా చూపిస్తారు. 

ఇటీవలే రాసిన ఈ కవిత్వం చూడండి. మనిషికి కరుణ రసం ఎంత అవసరమో  తెలియజేసిన కవిత ఇది. మనిషి దుఃఖ సముద్రాన్ని లోలోపల దాచుకున్నాడు. అది కరిగి కన్నీరై ప్రవహించి కలంలో సిరా గా మారితే నైనా ఎన్నాళ్లుగానో రాయాలనుకున్నవి రాయగలను. గడ్డకట్టుకు పోయిన హృదయాన్ని కరిగించేది కూడా దుఃఖమే!   రాతలో తనను తాను బహిర్గతం చేసుకోవాలనుకున్నా కావల్సినది కూడా దుఃఖమే. కానీ ఆ దుఃఖం రాక లోపలే పేరుకుపోయి వణికిస్తుంది అంటారు. 


" ఒలకని సిరా "


ఎప్పుడో రాయాలి అనుకున్నదీ...

ఇప్పటికీ రాయలేకపోతున్నదీ...,


అదే...


గొంతులోంచి  బైటకి రానిదీ,

కళ్ళలోనుంచి కలంలోకి ఇంకనిదీ ...


ఇంకేదీ కాదది

ఇప్పటికీ కంటినుండి తొణకనీదీ 

ఒంటరిని చేసి ఒణికించెదీ 

దుమ్ములా కమ్ముకున్న

దుఃఖమది. 

కడ వరకూ అలలా ఎగిసిపడే 

కడలంత  కష్టమది.


ఒలకని సిరా.. అంటే ఎప్పటి నుండో రాయాలనుకుని రాయలేనిది.

పోనీ అది గొంతులో నుండి వస్తుందా అదీ రాదు. కళ్ళల్లోంచి దుఃఖం సిరా అయి కలంలో ఇంకనూ లేదు. దుఃఖం మనిషిని  దమ్ములా కమ్ముకుని  ఇతరుల్లో కలవనీయకుండా ఒంటరిని చేసి  వణికిస్తుంది. లోలోపల అలల్లా ఎగసి పడుతుంది తప్ప బయటకి రాని దుఃఖం కడలి అంత కష్టమైంది అంటారు.   


మెరాజ్ ఫాతిమా “అంతర్వేదన”  అనే కవితా సంపుటి వెలువరించారు. అందులో 65 కవితలు ఉన్నాయి. కవిసంగమం వేదిక గా వర్థమాన కవి గా సిరీస్ -4 లో పరిచయం చేయబడ్డారు. పత్రికల్లో అచ్చు అయినవి రాశిలో తక్కువైనా వాసి కల్గినవి. 


మెరాజ్ కవిత్వంలో భావనమయ ప్రపంచం కన్నా మనుషుల ఇరుకు మనస్తత్వాన్ని వాచ్యంగా బట్టబయలు చేస్తారు.అదీ బాగున్నట్టే వుంటుంది. కవిత్వం అంటే ఇదీ, అది కాదు కవిత్వం అనుకోవడానికి వీల్లేని సోషల్ మీడియా కాలంలో  కవిత్వం కోసం కవిత్వాన్ని నిదానంగా వెతుక్కోవాలి ఓపికగా వెతుక్కోవాలి. . 


మెరాజ్ ది   ప్రాపంచిక దృక్పథం.  ఒక్కోసారి క్లుప్తంగా రెండు స్టాంజా ల్లో చెప్ప వలసిన భావాన్ని అనంతమైన అర్థాన్ని అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టు చదువరుల మెదడుకి హృదయానికి చేరేలా నేర్పుగా రాయగల్గిన ప్రతిభ ఆమె సొత్తు. ఆమె అభిలషణీయం ఏమిటో చూద్దామా.. ఈ చిన్న కవితలో..


ప్రకృతి ధర్మం అనే కవిత తో .. ఇలా అంటారు. 

నేలనుతాకక ముందే వేలసార్లు అనుకుంటా

ఇంకొన్ని క్షణాలుంటే ఇంకొందరికి నీడనిద్దామని,

భూమిని చేరాకా కూడా అనుకొంటా 

కొన్ని నగ్న పాదాలకు రక్షణనిద్దామని,

ప్రకృతి ధర్మాన్ని కాదనలేం,

గాలి పొమ్మంటుంటే ధూళి రమ్మంటుంటే

ఏ దరికో  ఏ దిశ కో పయనించాలి, 

పరుగులాపి శాశ్వతంగా శయనించాలి.

కవి హృదయం కూడా.. జీవించినంత వరకూ తనలో స్పందించే గుణం మిగిలి వుండాలని.. కవిత్వం రాస్తూనే వుండాలని కోరుకుంటారు. 

“నూరు పువ్వులు వికసించనీ వేయి ఆలోచనలు సంఘర్షించనీ” మావో నినాదం.. 

ఒక్క కవిత ఉద్భవించనీ.. వేయి హృదయాలకు ఉత్తేజం నింపగా  .. అని నేటి కవుల కవితా సేద్యం. పుట్లు పుట్లుగా కవిత్వం పండుతుంది. అవి చచ్చువో పుచ్చువో మేలిమి గలవో అని కనిపెట్టి దగ్గరకు తీసుకోగల్గేది.. పాఠకులే! 


******************End******************


కామెంట్‌లు లేవు: