కవి పరిచయం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
కవి పరిచయం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

4, జులై 2026, శనివారం

The Flower




“The Mother” Korean web series లో ఆఖరి భాగంలో వినిపించిన కవిత పరిచయం ఇది. 


“మనం రాసిన అక్షరాలు ఎవరికో ఎప్పుడో ఎందుకో తారసపడతాయి. ఎక్కడో ఒక చోట తిరిగి మొలకెత్తుతాయి.” ఇది సత్యం.

“గాయపడ్డాకే జీవితం జీవించడం కోసం మొలకెత్తుతాం. కోల్పోయాకే తెలుస్తుంది, మనలో ఏం బతికుందో!” ఇది నిజం.


'The Mother' సిరీస్ చివరి ఎపిసోడ్ 16 లో అమ్మమ్మ యంగ్-సిన్ చనిపోయాక, హే-నా (యూన్ బుక్) ఒంటరిగా ఆ పెరటి తోటలో నిలబడుతుంది. ఆ తోటని, ఎండిపోయిన పూలని, ఖాళీ కుర్చీని చూపిస్తూ బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక కవిత వినిపిస్తుంది.


అది కిమ్ కి-టాక్ (Kim Ki-taek) కొరియన్ కవి రాసిన కవిత.  


పేరు: పువ్వు / The Flower


ఆ సీన్‌లో ఒక నెరేటర్ గొంతుతో ఈ కవిత వినిపిస్తుంది. 'అమ్మ వెళ్ళిపోయింది, కానీ ఆమె నాటిన పువ్వు ఇంకా ఇక్కడే ఉంది' అనే అర్థంతో.


---


కవిత: పువ్వు / The Flower by Kim Ki-taek


English Translation


You planted a flower before you left.

You said, Water it every day, 

And it will not forget me. 


So I watered it every day. 

On rainy days, on snowy days,  

On days when I was too sad to get out of bed.

I crawled to the garden and watered it.  


But the flower withered.

Its petals fell one by one,  

Like the days falling off a calendar after you left. 


I was angry at the flower.

You promised you would not forget her.

Why did you die?  


Today, I went to the garden to pull out the dead stem. 

And I saw it. 

A tiny green shoot,  

Pushing up from the earth beside the old root. 


The flower did not die. 

It only returned to the earth,

To become a seed again. 

To be born again next spring. 


You did not leave me.

You only hid in the earth,

Waiting for the right season to return to me.

I will wait. I will water the earth.  

I will not forget you. 


---


తెలుగు అనువాదం: 'పువ్వు'


వెళ్ళిపోయే ముందు నువ్వు ఒక పువ్వు మొక్క నాటావు

ప్రతిరోజూ నీళ్లు పోయ్యి  అన్నావు,  

అది నన్ను మర్చిపోదు.  


అందుకే నేను ప్రతిరోజూ నీళ్లు పోశాను. 

వాన రోజుల్లో, మంచు రోజుల్లో,

దుఃఖంతో మంచం దిగలేని రోజుల్లో కూడా 

పాక్కుంటూ తోటలోకి వెళ్లి నీళ్లు పోశాను.  


కానీ ఆ పువ్వు వాడిపోయింది. 

దాని రేకులు ఒక్కొక్కటిగా రాలిపోయాయి,

నువ్వు వెళ్ళిపోయాక క్యాలెండర్‌లో రోజులు రాలినట్టు.


ఆ పువ్వు మీద నాకు కోపం వచ్చింది  

నువ్వు ఆమెను మర్చిపోనని మాట ఇచ్చావు. 

మరి ఎందుకు చనిపోయావు? 


ఈరోజు, ఎండిపోయిన ఆ కాడను పీకేద్దామని తోటలోకి వెళ్ళాను.

అప్పుడు చూశాను. 

ఒక చిన్న ఆకుపచ్చని మొలక, 

పాత వేరు పక్కనే, మట్టిని చీల్చుకుని పైకి వస్తోంది.


పువ్వు చనిపోలేదు.

అది కేవలం మట్టిలోకి తిరిగి వెళ్ళింది,  

మళ్ళీ విత్తనంగా మారడానికి. 

వచ్చే వసంతంలో మళ్ళీ పుట్టడానికి. 


నువ్వు నన్ను వదిలి వెళ్ళలేదు. 

నువ్వు కేవలం మట్టిలో దాక్కున్నావు,  

నా దగ్గరికి తిరిగి రావడానికి సరైన కాలం కోసం ఎదురుచూస్తూ. 

నేను వేచి ఉంటాను. నేను మట్టికి నీళ్లు పోస్తాను.  

నేను నిన్ను మర్చిపోను.  


---


యంగ్-సిన్ చనిపోయింది.హే-నా (యూన్ బుక్) . ఆ తోట, ఆ ఖాళీ ఇల్లు - అన్నింటిని చూస్తుంటే  అమ్మమ్మను  గుర్తుచేస్తాయి.  


కానీ ఈ కవిత చెప్పేది ఏంటంటే… 'చావు అనేది ముగింపు కాదు'  అమ్మమ్మ నాటిన ప్రేమ, ఆమ్మమ్మ నేర్పిన ధైర్యం - అవి 'విత్తనం' లాగా హే-నా గుండెలో ఉన్నాయి.  


ఒకరోజు ఆ విత్తనం మళ్ళీ మొలకెత్తుతుంది. అమ్మమ్మ మళ్ళీ బతుకుతుంది - హే-నా రూపంలో.


ఎండిన కాడ పక్కన మొలిచే చిన్న మొలక - అదే హే-నా.  

అమ్మమ్మ పోయినా, ఆమె పెంచిన మనవరాలు ఇంకా బతికే ఉంది. ఆమెలో అమ్మమ్మ పోలికలు, అమ్మమ్మ ప్రేమ బతికే ఉన్నాయి.


కవి కిమ్ కి-టాక్ “పువ్వు” కవిత కూడా చనిపోలేదు, విత్తనమై మట్టిలో దాక్కుంది' .  

'వచ్చే వసంతం కోసం వేచి ఉంటాను' అన్నాడు.  అలాగే ఈ తెలుగు నేలలో వికసించాడు కవి. 


“మనం రాసిన అక్షరాలు ఎవరికో ఎప్పుడో ఎక్కడో ఒక చోట తిరిగి మొలకెత్తుతాయి.”ఇది సత్యం. 

“గాయపడ్డాకే జీవితం జీవించడం కోసం మొలకెత్తుతాం. కోల్పోయాకే తెలుస్తుంది, మనలో ఏం బతికుందో” ఇది నిజం. 


కవి కవిత ఇచ్చి వెళ్ళాడు.

యంగ్-సిన్ హే-నాకు ఒక తోట ఇచ్చి వెళ్ళింది. 


రెండూ వారసత్వాలే! రెండూ ప్రేమ చిహ్నాలే!


చదివినందుకు ధన్యవాదాలు 🙏


నేనింతే! 😊విపరీతంగా నచ్చితే వాటిని ఒదలను. లోతులకు వెళ్ళి మరీ చూస్తాను. ఈ కవిత అలాగే పరిచయం అయ్యింది. మీకు పరిచయం చేసాను. ఈ సిరీస్ లో మరో రెండు కవితలు వుంటాయి. వీలు వెంటబడి పరిచయం చేస్తాను.



28, మే 2026, గురువారం

జీవనానంద దాస్

 


నా చదువరి మనసుకు ఎప్పుడు ఏది చదవాలి అనిపిస్తే అందులోకి గెంతుతుంటాను. రవీంద్రనాథ్ ఠాగూర్ ని చదువుతూ జీవనానంద దాస్ కి గెంతాను. మన తెలుగు వారికి స్వల్పంగా పరిచయం వున్న ప్రముఖు బెంగాలీ కవి గురించి పరిచయం చేస్తే బాగుంటుంది అనిపించింది. అందుకే నేను చదివిన దానిలో కొంత భాగాన్ని.. ఇలా.. 

జీవనానంద దాస్ గురించి చిరు పరిచయం.


జీవనానంద దాస్ (జీబనానంద దాస్) 1899లో, బంగ్లాదేశ్ దక్షిణ భాగంలో ఉన్న బారిసాల్ అనే చిన్న జిల్లా పట్టణంలో, ఒక వైద్య-బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆయన పూర్వీకులు ఢాకా జిల్లాలోని విక్రంపూర్ ప్రాంతం నుండి వచ్చారు; పద్మా నది తీరంలో ఉన్న 'గౌపారా' అనే గ్రామం నుండి వారు వలస వచ్చారు, ఆ గ్రామం ఇప్పుడు కనుమరుగైపోయింది. బారిసాల్‌లో శాశ్వతంగా స్థిరపడిన మొదటి వ్యక్తి జీవానంద తాతగారైన సర్వానంద దాస్‌గుప్తా. ఆయన బారిసాల్‌లో సంస్కరణవాద 'బ్రహ్మ సమాజ్' ఉద్యమానికి ఆద్యులలో ఒకరుగా నిలిచారు, అలాగే తన పరోపకార గుణం కారణంగా ఆ పట్టణంలో ఎంతో గౌరవాన్ని పొందారు. వేద బ్రాహ్మణ ఆధిపత్యానికి చిహ్నంగా భావిస్తూ, ఆయన తన ఇంటిపేరు నుండి '-గుప్తా' అనే ప్రత్యయాన్ని తొలగించారు; తద్వారా వారి ఇంటిపేరు కేవలం 'దాస్'గా మారింది. జీవానంద తండ్రి సత్యానంద దాస్ (1863–1942) ఒక పాఠశాల ఉపాధ్యాయుడు, వ్యాసకర్త, పత్రికా ప్రచురణకర్త మరియు 'బ్రహ్మబాది' అనే పత్రికకు వ్యవస్థాపక సంపాదకుడు. బ్రహ్మ సమాజ్‌కు చెందిన ఈ పత్రిక సామాజిక సమస్యల విశ్లేషణకు అంకితమై ఉండేది.

జీవానానంద తల్లి కుసుమకుమారి దాస్ ఒక కవయిత్రి. ఆమె 'ఆదర్శో ఛెలే' ("ఆదర్శ బాలుడు") అనే ప్రసిద్ధ కవితను రచించారు; ఆ కవితలోని పల్లవి నేటికీ బెంగాలీలకు సుపరిచితమే: "అమాదేర్ దేశే హోబే షేయ్ ఛెలే కోబే / కోథాయ్ న బరో హోయే కాజే బరో హోబే" (మాటల్లో గొప్పతనం చూపకుండా, చేతల్లో గొప్పతనం సాధించే ఆ బాలుడు—ఈ గడ్డపై ఎప్పుడు జన్మిస్తాడు?).

జీవానంద తన తల్లిదండ్రులకు పెద్ద కుమారుడు; ఆయనను ముద్దుగా 'మిలు' అని పిలిచేవారు. 1908లో అశోకానంద దాస్ అనే తమ్ముడు, 1915లో సుచరిత అనే సోదరి జన్మించారు. జీవానంద తన బాల్యంలో తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యారు, దాంతో ఆయన ప్రాణాల గురించి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందారు. తన కుమారుడి ఆరోగ్యం తిరిగి బాగుపడాలని తీవ్రంగా ఆకాంక్షిస్తూ, కుసుమకుమారి అనారోగ్యంతో ఉన్న ఆ బిడ్డను వెంటబెట్టుకుని లక్నో, ఆగ్రా మరియు గిరిడిహ్ వంటి పుణ్యక్షేత్రాలకు తీసుకెళ్లారు. ఈ యాత్రలలో వారికి వారి మామయ్య చంద్రనాథ్ తోడుగా ఉన్నారు.

1908 జనవరిలో, అప్పటికి ఎనిమిదేళ్ల వయసున్న మిలును 'బ్రజమోహన్ పాఠశాల'లో ఐదవ తరగతిలో చేర్పించారు. పిల్లలను చాలా చిన్న వయసులోనే పాఠశాలలో చేర్పించడాన్ని అతని తండ్రి వ్యతిరేకించడమే ఈ ఆలస్యానికి కారణం. అందువల్ల మిలు బాల్య విద్య అతని తల్లి పర్యవేక్షణకే పరిమితమైంది.


అతని పాఠశాల జీవితం పెద్దగా విశేషాలు లేకుండా గడిచిపోయింది. 1915లో అతను బ్రజమోహన్ కళాశాల నుండి మెట్రిక్యులేషన్ పరీక్షను విజయవంతంగా పూర్తి చేసి, ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. రెండు సంవత్సరాల తరువాత బ్రజమోహన్ కళాశాల నుండి ఇంటర్మీడియట్ పరీక్షలలో ఉత్తీర్ణుడై అదే ఘనతను పునరావృతం చేశాడు. ప్రతిభావంతుడైన విద్యార్థిగా, అతను కలకత్తా విశ్వవిద్యాలయంలో చేరడానికి తన గ్రామీణ బరిసాల్‌ను విడిచిపెట్టాడు.


యువ జీబనానంద, పక్కింట్లో నివసించే తన మామ అతుల్‌చంద్ర దాస్ కుమార్తె అయిన శోభనతో ప్రేమలో పడ్డాడు. (Shovona, daughter of his uncle Atulchandra Das)అతను తన మొదటి కవితా సంకలనాన్ని ఆమె పేరును స్పష్టంగా ప్రస్తావించకుండా శోభనకు అంకితం చేశాడు. కజిన్‌ల మధ్య వివాహం సమాజంలో ఆమోదయోగ్యం కానందున అతను శోభనను వివాహం చేసుకోవడానికి ప్రయత్నించలేదు. కానీ 'బేబీ' అనే ముద్దుపేరుతో పిలవబడే శోభనను అతను ఎన్నడూ మరచిపోలేదు. అతని సాహిత్య గమనికలలో ఆమెను 'వై' అని పేర్కొన్నారు. 1930లో లబన్యప్రభ దాస్ (పూర్వపు పేరు గుప్తా)(Labanyaprabha Das ( Gupta) తో వివాహం జరిగిన కొద్దికాలానికే, వ్యక్తిత్వ వైరుధ్యాలు తలెత్తాయి మరియు జీబనానంద దాస్ సంతోషకరమైన వైవాహిక జీవితంపై ఆశ వదులుకున్నారు. అతనికి భార్యతో ఉన్న దూరం ఎన్నడూ తగ్గలేదు. 1954 అక్టోబర్ 14న జరిగిన ట్రామ్ ప్రమాదం తర్వాత జీవనానంద మృత్యువుతో పోరాడుతున్నప్పుడు, లబన్యప్రభ తన భర్తను మరణశయ్యపై చూడటానికి ఒక్కసారి కంటే ఎక్కువసార్లు సమయం కేటాయించలేకపోయింది. ఆ సమయంలో ఆమె టాలీగంజ్‌లో సినిమా నిర్మాణంలో నిమగ్నమై ఉంది.


జీబనానంద దాస్ తన 20 ఏళ్ల తొలినాళ్లలో రాయడం, ప్రచురించడం ప్రారంభించారు. తన జీవితకాలంలో ఆయన వివిధ జర్నల్స్, మ్యాగజైన్‌లలో కేవలం 269 కవితలను మాత్రమే ప్రచురించారు. వాటిలో 162 కవితలు 'ఝరా పాలక్' నుండి 'బేలా ఒబేలా కల్బేలా' వరకు ఏడు సంకలనాలలో సేకరించబడ్డాయి. ఆయన సోదరుడు అశోకానంద దాస్, సోదరి సుచరిత దాస్, మేనల్లుడు అమితానంద దాస్‌ల చొరవతో, మరియు దశాబ్దాలుగా చెల్లాచెదురుగా ఉన్న రాతప్రతుల నుండి వాటిని కాపీ చేసిన డాక్టర్ భూమేంద్ర గుహా కృషితో, ఆయన కవితలలో చాలా వరకు మరణానంతరం ప్రచురించబడ్డాయి. 2008 నాటికి, జీబనానందకు తెలిసిన కవితల మొత్తం సంఖ్య దాదాపు 800కి చేరింది. దీనికి అదనంగా, దాదాపు అదే సమయంలో అనేక నవలలు, చిన్న కథలు కనుగొనబడి ప్రచురించబడ్డాయి.


జీబనానంద పండితుడు క్లింటన్ బి. సీలీ, జీబనానంద దాస్‌ను "రవీంద్రనాథ్ టాగోర్ తర్వాత బెంగాల్ యొక్క అత్యంత ఆదరణ పొందిన కవి"గా అభివర్ణించారు. మరోవైపు, చాలామందికి, జీబనానంద దాస్ కవిత్వాన్ని చదవడం అనేది, కామూ వర్ణించిన 'అసంబద్ధ' వ్యక్తి పడే తపనను తలచుకునే మానసిక స్థితి లాంటిది. నిజానికి, జీబనానంద దాస్ కవిత్వం కొన్నిసార్లు అంత సులభంగా అర్థం కాని రీతిలో చిత్రించబడిన గాఢమైన భావనల ఫలితం. కొన్నిసార్లు వరుస పంక్తుల మధ్య సంబంధం స్పష్టంగా ఉండదు. వాస్తవానికి, జీబనానంద దాస్ కవిత్వంలోని సాంప్రదాయక వలయాకార నిర్మాణాన్ని (పరిచయం-మధ్యభాగం-ముగింపు) మరియు పదాలు, పంక్తులు, చరణాల తార్కిక క్రమ పద్ధతిని విచ్ఛిన్నం చేశారు. తత్ఫలితంగా, అంతరార్థాన్ని జాగ్రత్తగా చదివి అర్థం చేసుకోవాల్సిన ఒక లయబద్ధమైన కథనం కింద భావార్థక అంతరార్థం తరచుగా దాగి ఉంటుంది. కింది ఉదాహరణ ఈ విషయాన్ని రుజువు చేస్తుంది:


జీవనానందదాస్ కవిత్వాన్ని చిదానందదాస్ గుప్తా ఆంగ్లంలో అనువదించగా.. ఆ ఆంగ్ల కవిత్వాన్ని  తెలుగులో అనువదించిన కుందుర్తి కూడా ఫై విధంగానే వ్యాఖ్యానించారు. జీవనానంద దాస్ కవిత్వం “రూపసి బెంగాల్” అనే కవితా సంపుటిలో 43 కవితలు వున్నాయి. ఇది ఆంగ్లంలో లభ్యం అవుతుంది. అందులో జీవనానంద దాస్ గురించి ఇంకా ఎక్కువ చదవవచ్చు. మరికొన్ని విషయాలు .. ఇంకొక భాగంలో.. 


ఇప్పుడు జీవనానంద కవిత ఒకటి కుందుర్తి ఆంజనేయులు అనువాదం లో.. 


మూలం: సాహిత్య అకాడమీ 1979 లో ప్రచురించిన Jibananda Das - English monograph by Chidananda Das Gupta.


మిణుగురుల్లా ఎగిరే యుగాలు 


అనంత కాలపు చీకటి గర్భంలో 

ఆడుతుంటాయి యుగాలు, బ్రహ్మ కల్పాలు 

మిలమిల మెరిసే మిణుగురుల్లా.. 


సముద్రపు ఇసుక తిన్నెల మీద 

వెన్నెల పరుచుకుంటుంది. 

ఎత్తైన దేవదారు వృక్షాలు 

నిటారుగా నిలిచి చూస్తుంటాయి 

నిశ్శబ్దంలోకి

పోయిన రాజ్యాలలో

కూలిపోయిన జయస్తంభాలులా

మృతి చెంది ఘనీభవించిన 

నీరవ నిశ్శబ్దం లోకి


జగతిలో జీవ శబ్దాలు 

పలుచబడి మౌనం వహించాయి. 

మృత్యు నిద్ర వంటి కోరా గుడ్డలతో

మనదేహాలు కప్పేశారు.

గాలిలో శవాల కంపు కదిలాడుతున్నట్లుంది

అంతలో ఎండుటాకులు గలగలలాడిన శబ్దం.. 


“గుర్తించారా నన్ను?” 

“వనలతా సేను వా ?” అన్నాను నేను.


( Pic Courtesy : Pinterest )





15, ఏప్రిల్ 2026, బుధవారం

ప్రాపంచిక దృక్పథం మెరాజ్ ఫాతిమా కవిత్వం.

 



ప్రాపంచిక దృక్పథం “మెరాజ్ ఫాతిమా” కవిత్వం - వనజ తాతినేని. 


కవి చెప్పేది నీకు పూర్తి అనుభవం లో ఉంటే ఆ కవిత్వం నీకు అనవసరం. 

కవిత్వం చదివిన తర్వాత కూడా నీ అనుభవానికి విషయం ఏ మాత్రం అందకపోతే ఆ కవిత్వం నీకు వృధా! నీకు తోచనిది కనబడనిదీ కవి చెప్పిన తర్వాత నీ అనుభవంలోకి ఎంతోకొంత వచ్చేది అదీ నీకు సరిపడే కవిత్వం అన్నారు చలం. 


మనకు ఎంతో కొంత అనుభవం లోకి వచ్చే కవిత్వం గురించి..ఇక్కడ పరిచయం చేసుకుందాం. 


**************

అరే, ఇక్కడో పారిజాతం ఉండాలి 

రాలిన పూలను ఏరిన ఆ చిట్టి చేతులేవి 

గొప్ప తోడుని అడిగిన ఆ మొక్కులేవి? 


గుడ్డ బొమ్మలకు పెళ్ళిళ్ళు చేసిన 

చిన్నారి ముత్తయిదువ ఆ చిన్నమ్మ ఏదీ? 

ఆమె నడిచిన చిట్టి పాదముద్రలేవీ? 

అని అడుగుతున్న ఈ స్త్రీ సౌకుమార్య భావనలు ఎక్కడివి!? 


కాలమంతా రంగుల రాట్నమై 

గిర గిరా తిరిగే చలన చక్రమై స్ఖలన దుఃఖమై యుగాల నాటి ప్రశ్నా పత్రమై.. 

బాల్యాన్ని పాతి పెట్టిన శిథిల సౌధమై..


అంటూ..  పసి తనపు తలపుని గుర్తు చేసుకుంటూన్న  ఈ అక్షర విన్యాసం ఎవరిదీ!? 


“మెరాజ్ ఫాతిమా” అనే కవి కవిత్వం ఇది.


మూడు దశాబ్దాలుగా కవిత్వం ఆమెకు సహచరిగా వుంది. తన ముందు తరం వెనుక తరం మధ్య వారధిగా నిలబడి శతాబ్దాల మూగ వేదన ను కవన రూపం లో విప్పి చూపించారు. మొదట ఆమె “కవితా సుమహారం” అనే బ్లాగ్ ద్వారా పరిచయం.అక్కడ ఆమె కవిత్వం పరివ్యాప్తం అయ్యాయి. తర్వాత రెండు మూడేళ్ళకు ఫేస్ బుక్ లో మంచి కవిత్వం వ్రాసే వారిలో ఒకరిగా గుర్తింపు పొందారు. వివాహానికి పూర్వం ఆమె కడప ఆకాశవాణి యువవాణి కార్యక్రమం ద్వారా  వాసంతి గా పరిచయం. సాహితీ ప్రపంచం ఆమెకు కొత్తేమి కాదు. వస్తువు ఏదైనా ఆమె హృదయంలో లలితమై చలనమై ఆలోచనలో జ్వలనమై జాగృతమై ఆమెకంటూ ఒక ప్రత్యేక  ముద్రగా అలరిస్తుంది. 


మగవాళ్ళ అమానుష కృత్యాల వల్ల స్త్రీల జీవితాలు అంధకారంలో మునిగి పోయినప్పుడు వారికి కాస్త వెంటిలేటర్ అవసరం అని తన కవిత్వం లో పదే పదే చాటి చెబుతారు. స్త్రీలకు  కాస్త చదివిడి జ్ఞానం వుండటం మూలంగా వారికి తమ జీవితం మీద శరీరం మీద అధికారం కావాలనే ఆలోచన ఆకాంక్ష కల్గడం మొదలవుతుందని తద్వారా  స్త్రీ  బలపడటానికి  కూడా పుస్తకాలే దారి చూపుతాయని ఆమె  అంటారు.  


పురుషులకు ప్రేమ ఆట వస్తువేమో కానీ స్త్రీకి ప్రేమే జీవితం. ప్రేమించిన పాపానికి.. మనస్పూర్తిగా నమ్మి అతని చేయి పట్టుకుని ముందుకు నడిచిన పాపానికి.. ఎన్నో కష్టాలను అనుభవించి అధిగమించి.. తమ జీవిత లక్ష్యం చేరుకోగల్గిన స్త్రీలను ఆమె తన కవిత్వంలో చూపించారు. పురుషుల్లో చదువుతోపాటు సంస్కారం ఏ మాత్రం పెరగలేదనే చురకలు అంటిస్తారు. 


పురుషుడికి సహచరి అంటే ఏమిటి అన్నదానికి ఈ  కవయిత్రి చెప్పిన ఈ భావం చూడండి.. ఎంత హిమోన్నత శిఖరమో! 


‘’నీకు తెలుసా! స్పృహనై  స్పూర్తినై  స్పర్దనై స్పర్శనై సాహసినై 

సహవాసినై  సంతసం తో సదా నీకై  అద్దరిన వేచి ఉండే హిమాని నేను 

జీవితానికీ  జీవించటానికీ భాష్యం చెప్పే నీ సహచరినే నేను”


మెరాజ్ కవిత్వంలో ఏముంది? నిత్యం ప్రవహిస్తున్న లావా లాంటి కవిత్వం వుంది.. 

కవితా నిర్మాణం శైలి విభిన్నంగా వుంటుంది అని పూర్వ కవులు వ్యాఖ్యానించారు.  


మాతృత్వం  స్త్రీకి ప్రపంచమైంది. కుటుంబం కూడా చారిత్రాత్మక అవసరం చేసింది. ఆమెను నాలుగు గోడలకు పరిమితం చేసింది. సామాజిక జీవితాన్ని దూరం చేసింది. ఉత్పత్తిలో భాగం కాకుండా చేసింది.అందువల్లనే స్త్రీ భర్తపై ఆధారపడాల్సి వచ్చింది. పెదవి విప్పితే పాశవిక హింసను చవిచూసింది. కన్న బిడ్డైనా సరే.. స్త్రీ ని నిర్ధాక్షిణ్యంగా అణచివేస్తాడు. ఆ విషయాన్నే వేదనతో  కవిత్వీకరించారు.


“తల్లులు విశ్రమించ కూడదు,

లోకం నుండి నిష్క్రమించనూ కూడదు,


అలా ఒళ్ళు మరిసి

ఉండకూడదు,

చురుగ్గా ,చాలాగ్గా ఉండాలి

పరాగ్గా ఉండకూడదు,


తన కాండక్ట్ సరిఫికెట్ నిరూపణ కై

మొగుడి ముందే కాదు ప్రతి మొగోడి ముందూ పరోక్షంగా మోకరిల్లాలి,


కన్న పేగైనా సరే

ఉన్నపళంగా వదిలేస్తే

కిక్కురు మనకుండా

త్యాగానికి తల ఇవ్వాలి.


అవును....

అమ్మంటే త్యాగానికి

బలవ్వాలి.”


******

మెరాజ్ కవిత్వంలో  సామాజిక స్పృహ మెండుగా వుంది. ఆమె నిత్యం ఫేస్ బుక్ లో పంచుకునే కవితల్లో మనుషులు మనిషి తనాన్ని కోల్పోవడం పట్ల వేదన వుంది. పరిసరాలు పరిశుభ్రంగా పచ్చగా వుండాలన్న ఆకాంక్ష వుంది. 


స్త్రీ పురుష భేదం లేకుండా మనుషులందరూ అనుభవిస్తున్న వివక్షలు గురించి వుంటుంది. 

అన్నింటికీ మించి కుటుంబ వ్యవస్థ మోపుతున్న భారం పట్ల ఆక్రోశం వ్యక్తం అవుతుంది. మెరాజ్ కవిత్వం జీవితాలను చిత్రించింది. స్త్రీ మనస్సు ను ప్రతిబింబించే కవిత్వం చాలానే రాసారు. స్త్రీ వాదం స్పష్టంగా కనిపిస్తుంది. స్త్రీలు పురుషునిలో దేహగతమైన సాన్నిహిత్యం కన్నా కూడ మానసికమైన తోడు వుండాలని బలంగా కోరుకుంటారు. మర్రిచెట్టు నీడలో ఎదగని మొక్కలా వ్యక్తిత్వాలు కుంచించుకుపోయి బతకడం అంటే రోసి పోయిన  స్త్రీ ల వేదనలు ఆవేదనలు కొత్తవేం కావు. కానీ నాగరిక సమాజంలో కొత్త పుంతలు తొక్కుతున్న నేరాల నేపథ్యంలో స్త్రీల పై జరిగే హింస కూడా కొత్తగా ఉంటుంది. దాన్ని కూడా కవిత్వీకరణ చేయడం తప్పనిసరి అంటారు. 


స్త్రీలు బాలికలు పై జురుగుతున్న లైగింక వేధింపులు అత్యాచారాలు పట్ల ఆగ్రహం వుంది. మదాంధుల  దాడిలో  మరణించిన కన్నెపిల్లల  కలల కాగితాలపై అంతులేని  విశ్వాసముతో  స్వజాతిగా సమిష్టి సంతకాలు పెడదాం, పరువు కోసం ప్రాకులాట  మానేద్దాం తిరుగుబాటు   చేద్దాం అని నినదించారు క్రింది కవితలో..


“ఆడవాళ్ళూ! మీకు జోహార్లు”


చాలు  చాలిక 

ఒకరినొకరు  నిందించుకొనే   ఆత్మ  ద్రోహాల

మహత్తర  నాటకాల మహోన్నత  సంభాషణలూ  


ఆత్మ స్తుతితో  అందలమెక్కిన  

అప్రకటితపు  అనూహ్య   వైనాలం  


శిరస్సులపై  పరువుల  బరువును

అనామకులమై   మోస్తున్న 

నిజాలం,


జన్మనిచ్చిన  సంతతికి  మాతృస్వామ్య  

హక్కుదారీ సంతకానికి  నోచుకోని నిశానులం,


ఉరి తాటికి వేలాడే మెడలేని పడతులం

ఉచ్చ గుడ్డలుతికే   ఉత్తమ  ఇల్లాళ్ళం 

గోనె  సంచుల్లో కుక్కబడ్ద  అనాథ  శవాలం


ముక్కలైన   మూగ  శకలాలం

ముప్పెనకు  గురైన  నత్తగుల్లలం


పెదవులపై   ఫెమినిజాన్ని   కాదు 

చెదలు  పట్టిన  చరిత్రని   తిరగతోడుదాం

విచ్చుకత్తులు గుచ్చుకున్న  గొంతులో నిత్య శబ్దమై   పల్లవిద్దాం


తగలబడుతున్న  పూలవనాలపై 

కఫన్  కప్పిన  మన కలలపై  నివురు  కప్పిన 

తప్పుడు  సాక్ష్యాలను   తగలబెడదాం.


అని.


గొప్ప కవిత్వం ప్రధాన లక్షణం ఏమిటంటే .. చదివిన వారికి ఎవరి తాహతుని బట్టి వారికి ఎంతోకొంత అనుభూతిని అందించగల్గడం. ఆ లక్షణం మెరాజ్ ఫాతిమా కవిత్వానికి పూర్తిగా వుంది. ఆమె కవిత్వం అర్థం కాకపోవడం అంటూ ఏమీ వుండదు. తేటతెల్లంగా వుంటుంది. చదివిన వారి గుండెల్లోకి దూసుకుపోతుంది. ఆలోచనలను కుట్టి కుదుపుతుంది. ఇది కదా సత్యం, ఇది కదా నా అనుభవం కూడా! అని పాఠకుడు అంగీకరిస్తాడు . తను రాయలేని తన వైయక్తిక అనుభవాన్ని ఆ కవితలో దర్శిస్తాడు. కవిత్వంలో సెల్ఫ్ ఐడెంటిటీ వెతుక్కుంటారు.


భర్త మాత్రమే కాదు కుటుంబంలోని ఇతర స్త్రీలు కూడా స్త్రీకి శత్రువులే అని సవివరంగా చూపిస్తారు. 

ఇటీవలే రాసిన ఈ కవిత్వం చూడండి. మనిషికి కరుణ రసం ఎంత అవసరమో  తెలియజేసిన కవిత ఇది. మనిషి దుఃఖ సముద్రాన్ని లోలోపల దాచుకున్నాడు. అది కరిగి కన్నీరై ప్రవహించి కలంలో సిరా గా మారితే నైనా ఎన్నాళ్లుగానో రాయాలనుకున్నవి రాయగలను. గడ్డకట్టుకు పోయిన హృదయాన్ని కరిగించేది కూడా దుఃఖమే!   రాతలో తనను తాను బహిర్గతం చేసుకోవాలనుకున్నా కావల్సినది కూడా దుఃఖమే. కానీ ఆ దుఃఖం రాక లోపలే పేరుకుపోయి వణికిస్తుంది అంటారు. 


" ఒలకని సిరా "


ఎప్పుడో రాయాలి అనుకున్నదీ...

ఇప్పటికీ రాయలేకపోతున్నదీ...,


అదే...


గొంతులోంచి  బైటకి రానిదీ,

కళ్ళలోనుంచి కలంలోకి ఇంకనిదీ ...


ఇంకేదీ కాదది

ఇప్పటికీ కంటినుండి తొణకనీదీ 

ఒంటరిని చేసి ఒణికించెదీ 

దుమ్ములా కమ్ముకున్న

దుఃఖమది. 

కడ వరకూ అలలా ఎగిసిపడే 

కడలంత  కష్టమది.


ఒలకని సిరా.. అంటే ఎప్పటి నుండో రాయాలనుకుని రాయలేనిది.

పోనీ అది గొంతులో నుండి వస్తుందా అదీ రాదు. కళ్ళల్లోంచి దుఃఖం సిరా అయి కలంలో ఇంకనూ లేదు. దుఃఖం మనిషిని  దమ్ములా కమ్ముకుని  ఇతరుల్లో కలవనీయకుండా ఒంటరిని చేసి  వణికిస్తుంది. లోలోపల అలల్లా ఎగసి పడుతుంది తప్ప బయటకి రాని దుఃఖం కడలి అంత కష్టమైంది అంటారు.   


మెరాజ్ ఫాతిమా “అంతర్వేదన”  అనే కవితా సంపుటి వెలువరించారు. అందులో 65 కవితలు ఉన్నాయి. కవిసంగమం వేదిక గా వర్థమాన కవి గా సిరీస్ -4 లో పరిచయం చేయబడ్డారు. పత్రికల్లో అచ్చు అయినవి రాశిలో తక్కువైనా వాసి కల్గినవి. 


మెరాజ్ కవిత్వంలో భావనమయ ప్రపంచం కన్నా మనుషుల ఇరుకు మనస్తత్వాన్ని వాచ్యంగా బట్టబయలు చేస్తారు.అదీ బాగున్నట్టే వుంటుంది. కవిత్వం అంటే ఇదీ, అది కాదు కవిత్వం అనుకోవడానికి వీల్లేని సోషల్ మీడియా కాలంలో  కవిత్వం కోసం కవిత్వాన్ని నిదానంగా వెతుక్కోవాలి ఓపికగా వెతుక్కోవాలి. . 


మెరాజ్ ది   ప్రాపంచిక దృక్పథం.  ఒక్కోసారి క్లుప్తంగా రెండు స్టాంజా ల్లో చెప్ప వలసిన భావాన్ని అనంతమైన అర్థాన్ని అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టు చదువరుల మెదడుకి హృదయానికి చేరేలా నేర్పుగా రాయగల్గిన ప్రతిభ ఆమె సొత్తు. ఆమె అభిలషణీయం ఏమిటో చూద్దామా.. ఈ చిన్న కవితలో..


ప్రకృతి ధర్మం అనే కవిత తో .. ఇలా అంటారు. 

నేలనుతాకక ముందే వేలసార్లు అనుకుంటా

ఇంకొన్ని క్షణాలుంటే ఇంకొందరికి నీడనిద్దామని,

భూమిని చేరాకా కూడా అనుకొంటా 

కొన్ని నగ్న పాదాలకు రక్షణనిద్దామని,

ప్రకృతి ధర్మాన్ని కాదనలేం,

గాలి పొమ్మంటుంటే ధూళి రమ్మంటుంటే

ఏ దరికో  ఏ దిశ కో పయనించాలి, 

పరుగులాపి శాశ్వతంగా శయనించాలి.

కవి హృదయం కూడా.. జీవించినంత వరకూ తనలో స్పందించే గుణం మిగిలి వుండాలని.. కవిత్వం రాస్తూనే వుండాలని కోరుకుంటారు. 

“నూరు పువ్వులు వికసించనీ వేయి ఆలోచనలు సంఘర్షించనీ” మావో నినాదం.. 

ఒక్క కవిత ఉద్భవించనీ.. వేయి హృదయాలకు ఉత్తేజం నింపగా  .. అని నేటి కవుల కవితా సేద్యం. పుట్లు పుట్లుగా కవిత్వం పండుతుంది. అవి చచ్చువో పుచ్చువో మేలిమి గలవో అని కనిపెట్టి దగ్గరకు తీసుకోగల్గేది.. పాఠకులే! 


మెరాజ్ ఫాతిమా బ్లాగ్ ని ఈ లింక్ ద్వారా… కవితా సుమహారం చూడవచ్చు.


******************End******************