అందరూ వున్నా ఏకాకి జీవితం కొందరిది.
అందరికీ కుటుంబం ఉండదు.ఇప్పటి కాలంలో అమ్మ నాన్నలే వుంటారు. ఒకోసారి అమ్మ నాన్న లేని అనాధలు వుంటారు. అందరూ వున్నప్పటికి కూడా నా అని చెప్పుకునేవారు వుండరు వొకొకరికి.
తమను వున్నది వున్నట్లుగా అంగీకరించి, గౌరవించి, ప్రేమించి, ఆదరించే కుటుంబం అందరికీ వుండదు. తమకు అత్యంత ఆప్తుల అవసరం వున్న సమయంలోనే చాలామంది ఒంటరిగా మిగిలిపోతుంటారు; ఇది కూడా వారి జీవితంలో ఒక పరీక్షే.
ప్రతి కుటుంబం మనసుకి ఓదార్పుని, ప్రశాంతతని యిచ్చే సురక్షితమైన స్థలం కాకపోవచ్చు. కుటుంబంలోని ప్రతి సభ్యుడూ మన జీవితానికి మద్దతునిస్తారని, శ్రద్ధ ప్రేమతో మనను ముందుకు నడుపుతారని చెప్పలేం. తోబుట్టువులు జోక్యం వల్ల చాలా మంది భార్యాభర్తలు విడిపోయిన సందర్భాలు వుంటాయి. తల్లి తండ్రులు బిడ్డల మధ్య అడ్డుగోడలు మొలుస్తాయి.
ప్రతి వొక్కరికీ ఇది నా నిజమైన 'ఇల్లు' అని చెప్పుకోగలిగే నివాసం వుండదు. బాధలో వున్నప్పుడు కన్నీళ్లు పెట్టుకోవడానికి లేదా తమ మాటలు శ్రద్ధగా వినేందుకు యెవరైనా కావాల్సి వచ్చినప్పుడు, ప్రతి వొక్కరూ తమ రక్తసంబంధీకుల వైపు మొగ్గు చూపలేకపోవచ్చు. రక్తసంబంధీకుల సూటీపోటీ మాటలు అనడం ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకుని ఆధిపత్యం చెలాయిస్తూ తీర్పులు ఇవ్వడం చేస్తుంటారు. ఒకోసారి తెగేదాకా లాగుతారు. ఒకోసారి మన అభీష్టానికి వ్యతిరేకంగా హుకుం జారీచేస్తారు.
చాలామంది జీవితాల్లో యీ వాస్తవం కనిపిస్తుంది. అందుకే మనం ఇతరుల పట్ల దయతో, సానుభూతితో వ్యవహరించడానికి వారికి అండగా నిలవాలని గట్టిగా అనుకోవాలి. ఇతరుల వొంటరితనం యొక్క లోతును మనం పూర్తిగా అర్థం చేసుకోలేకపోయినా ఇరుగు పొరుగు వారిగా స్నేహితులుగా మన మద్దతు, ప్రేమ,సానుభూతి, చిన్నపాటి దయతో వారి జీవితాల్లో వెలుగులు నింపేలా వ్యవహరించడాన్ని మాత్రం మనం మర్చిపోకూడదు. డబ్బులు ఇవ్వడం వస్తువులు ఇవ్వడం ష్యూరిటీలకు సంతకాలు పెట్టడం మాత్రమే సహాయం చేయడం కాదు. మన దగ్గరకి నమ్మకంగా వచ్చి స్వవిషయాలు కాసిని చెప్పుకుందామని వచ్చిన వారికి కాస్త సమయం ఇవ్వండి. ఒక ఆత్మీయమైన పలకరింపు కప్ కాఫీ కాస్త సానుభూతి ఒక మంచి సూచన లేదా చిన్నపాటి మందలింపు యివ్వడానికి తయారుగా వుండండి. మనుషులతో మాట్లాడే తీరికే వినే తీరిక లేకుండా పోతే మనం కూడా బందీగా వున్నట్టే! మాటే మంత్రం.
సమాజం నోట్లో మనం వున్నాం. మన నోట్లో సమాజం వుంది.
(మాతృభాష దినోత్సవం సందర్భంగా అంతా తెలుగులో రాయాలని అనుకున్నాను. ష్యూరిటీ, కప్ కాఫీ తప్పలేదు. కూపా అంటే యెవరికి అర్థం కాదేమోనని)

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి