11, సెప్టెంబర్ 2026, శుక్రవారం

వర్షం కురుస్తూనే వుంది


 వర్షం కురుస్తూనే వుంది     -వనజ తాతినేని 


సూచనలు ఏవీ లేకుండా వర్షం కురుస్తుంది.

ఎందుకో .. నా గుండెల్లో చాలా చాలా  నొప్పిగా వుంది.


కలలో నుండి మేల్కొన్నాను. 

ఆ కలలో నువ్వు ఎంతగానో ప్రేమించిన భార్య చచ్చిపోయింది అంట. 

కొన్ని నెలలు అయిందంట. నువ్వు ఏడుస్తున్నావంట.


మీ అమ్మ నీకు మరలా పెళ్ళి చేసింది అంట. 

అయ్యో! ఇదంతా నాకెందుకు తెలియలేదు;

నేను విపరీతంగా ఏడుస్తున్నాను. 

నేనెందుకు గుర్తుకు రాలేదసలు?


అవసరాల దృష్ట్యా  పెళ్ళి చేసుకున్నా ఆమెను నువ్వు 

ప్రేమిస్తునే వుంటావని నాకనిపించింది.నిజమే కదా! 

ప్రేమ ఇంత యాంత్రికంగా ఎప్పుడు మారిందో!


కలలో విషయానికి కూడా నేనెందుకిలా కలవరపడుతున్నాను 

ఇంతగా దుఃఖిస్తున్నాను. 

బయట వర్షం కురుస్తూనే వుంది. 

గుండెల్లో చెప్పలేని నొప్పిగా వుంది. 


శుభోదయఫు పలకరింపు వంకతోనైనా

అలసి నిద్రపోతున్న  నిన్ను తట్టి లేపలేను. 

నొప్పి కలిగించే విషయాలకు దూరాలు భౌతికంగానే. 

బయట వర్షం కురుస్తూనే వుంది. 

గుండెల్లో చెప్పలేని నొప్పిగా వుంది. 


కామెంట్‌లు లేవు: