10, డిసెంబర్ 2010, శుక్రవారం

రాత్రి..ఓ అంతరంగ రహస్యం



   రాత్రి.. ఓ అంతరంగ రహస్యం


 ఏ పర్వత సానువులుపై కురిసిన
చినుకు చినుకు
ఝరీ..ప్రవాహమై సాగినట్లు

ఏ..హిమవత్పర్వతముల నుండో
కరగిన మంచు
 జీవనదిగా ప్రవహించినట్లు

ఏ తెల్లని మబ్బులో
గుంపులు గుంపులుగా కొండాకోనలపై
హంసలవలెనడయాడినట్లు

ఏ మింటిని  వదిలిన
శరంలా భ్రమరం
    పువ్వుని ముద్ధాడినట్లు

  ఆ నీలాల నింగి
జలతారు పరదాతో
 తనని తాను అలంకరిందుకున్నట్లు

ఏ కోనేటి కలువనోచూసేందుకు
తొంగి చూసిన చంద్రుడికి నీటి తళతళలో
 తన రూపు చూసి తానే మురిసినట్లు

 వికసిత పరిమళాలను తనలోఇముడ్చుకుని
 పిల్ల తెమ్మెర లోకాన గర్వంగా ఊరేగినట్లు

 ఏ గిరిశిఖరాన్నోతాకి ఇనబింబిం ఎర్రబడినట్లు

రాత్రి తన కన్నులకు కాటుకని
 గాడంగా అద్దుకున్నట్లు
 
తన నుండి ఉద్భవించిన
 రేరాజుని  అందుకోవాలని
 కడలి కెరటాలతో ప్రయత్నం చేస్తున్నట్లు

  ఒక సౌందర్య దేవతని చూసిన
 నక్షత్రం జారి ముక్కుకి నత్తు అయినట్లు

 శిశిరకాంత నగ్నంగా
తనని తాను అలంకరించుకుని
 సిగ్గుతో మోముని వాల్చినట్లు

ప్రకృతి ప్రకృతిలో లీనమైనవేళ
 నీ గురించిన తలపులతో
 నీ ఊసుల దుప్పటి కప్పుకుని
లోకం అంతా నిదురించిన వేళలో 
నన్నునీలో దర్శించుకుంటున్నా

మనసు మనసుతో మాట్లాడేది
రాత్రి సమయంలోనే కదా

  రాత్రి ఓ అంతరంగ రహస్యం.
 ఆ రహస్యాన్నిచేధించే విలుకాడా
కనుమూతపడక ముందే రా
రాత్రిని కరగనీయగా రంగుల కలలా   

రాత్రి ఓ అంతరంగ రహస్యం




1 కామెంట్‌:

జ్యోతిర్మయి చెప్పారు...

మీరు కవితలు వ్రాస్తారని తెలియదు. వర్ణన చాలా బావుంది వనజగారూ..