15, ఫిబ్రవరి 2013, శుక్రవారం

వెలుతురు బాకు
మనసు క్రోధాన రగిలినప్పుడు 
వాదాలు భేదాలు ఇజాలు
తీవ్ర రూపం దాల్చినప్పుడు వికృత స్వరూపంతో
తన ఉనికిని చాటే వినాశకం  హింస

దేశాల మద్య యుద్ధమా జీహద్ పేరిట చేసే ఉగ్రవాదమా 
జాతుల మనుగడకై  చేసే అంతర్యుద్ధమా!
కుటిల రాజకీయ తంత్రమా 
ఏదైనా హింసా.. నీ పేరు వినాశకమే

విద్వంస రచనల మధ్యనూ   భద్రత ముసుగులోనూ 
భయం గుప్పిట్లోనూ  ఏ తలుపు చాటునో నక్కి
కిటికిరెక్క మాటునో దాగి
సొంత చోటునే  పరాయిలమన్న  భావనలో నలుగుతూ 
వేదనతో  రగులుతూ గుండె లోతుల్లో మాటేసిన  దుఖం 
వరదలవుతున్నవలసలు పిట్టలా రాలిపోతున్న ప్రాణాలు
 సైనిక కవాతుల కరాళ నృత్యాలు  రాబందుల రెక్కల చప్పుళ్ళు 

కరిగి వరధవుతున్న దుఃఖపు నదుల
నీళ్ళు త్రాగి బ్రతుకున్నముష్కురుల 
కరకు రాతిగొడల్ని బిందువైనా తాకగలవా..!
ఏ తల్లి రోదనో  ఏ తండ్రి వేదనో  ఏ చంటి బిడ్డడి  దుఖమో
ప్రత్యక్ష ప్రసారాలలో చూసిన హింసాత్మక శక్తులలో  పరివర్తన కలిగేనా!
మానవత్వపు జీవ గంగ ఉద్భవించేనా!?
ఆ రణ రక్కసి దాడికి లక్షలాది 
గుండె గాయాలు రగులుతూనే ఉన్నాయి
కవిత గేయాలు ఆలపిస్తునే ఉన్నాయి
రెండు దేశాల మద్యనో రెండు ఇజాల మద్యనో
సరిహద్దుల వెంబడి మానవత్వపు నది
మెలికెలు తిరుగుతూ ప్రవహిస్తూనే ఉంది
దానిని మళ్ళించి మన హృదయసీమల్లో
శాంతిని పండించే  విత్తనాలు నాటాలి
హృదయాలని తట్టి లేపే పని మొదలెట్టాలి 
ఉగ్రవాదం ఉసురు తీసేలా తిట్టిపోయడం కాదు
ఉనికిని  మాపేందుకు ప్రతి గుండెలోతుల్లోకి    
ప్రేమ మధువులొలికించి 
అనురాగ పాశాన్ని నాటుదాం 
శాంతి చినుకులలో తడిచే  క్షణంకై 
చకోర పక్షులై   ఎదురు చూద్దాం
 మతమవసరంలేని  
మానవాలయాలని నిర్మింప జేసుకుందాం 
మనిషి మనమున మసిలే 
మానసిక చీకట్లను రూపుమాపడానికి
వెలుతురుబాకులతో దండయాత్ర  చేద్దాం. 
(2006 ముంబై ప్రేలుళ్ళ నేపధ్యంలో వ్రాసిన కవిత )