16, ఫిబ్రవరి 2013, శనివారం

కాల్లీఫ్లవర్ పచ్చడి


వంట చేయడం అంటే నాకు విసుగు. ఇంతకూ ముందు కూడా నేను ఏ వంట గురించి వ్రాసి ఉండను.ఏదో ఒక పోస్ట్ తప్ప. 
మొన్న ఈ మధ్య ..  కాలి పోర్నియా లో ఉన్న మా మరిది గారి అమ్మాయి.."భవ్య" ..చాట్ లో ఇలా అడిగింది.. ఏం చేసావు పెద్దమ్మా..అని రెండు మూడు వంటలు చెప్పాను. మరి నాకూ ..అంది. జాలి వేసింది. ఏమిటో.. ఈ విదేశాల నివాసం.ఈ పిల్లలకి ఏమి చేత కాదు. ఏమి తినలేరు అనుకున్నాను. 
మా భవ్య కి కాల్లీ ఫ్లవర్ పచ్చడి చాలా ఇష్టం. నేను అదే రోజు కాల్లీ ఫ్లవర్ పచ్చడి చేసాను. ఈ రెసిపీ చూసి భవ్య అక్కడ తయారు చేసుకుంటుందని ఓ..చిన్ని ఆశ. 












కాల్లీ ఫ్లవర్  పచ్చడి చాలా మందికి తెలిసే ఉంటుంది. కూర చేసి తినేకన్నాపచ్చి ముక్కలతో పచ్చడి చేస్తే   చాలా బాగుంటుంది

కాల్లీ ఫ్లవర్ పంట (పూల దిగుబడి ) నవంబర్ మాసం నుండి ఉంటుంది. కూరగాయల పంటలలో అన్నింటి కన్నా అత్యధిక రసాయన మందులు పిచికారీ చేసే పంట ఈ కాల్లి ఫ్లవర్. చాలా మందికి ఒక విదమైన పచ్చి వాసన రావడం వల్ల  ఈ పువ్వుల వాడటం ఇష్టం ఉండదు.  నేను అయితే.. ఈ కాల్లీ ఫ్లవర్ చూస్తేనే దూరంగా జరిగి పోతాను. కూర చేయాలంటే కూడా నాకు విముఖత ఎందుకంటే.. ఆ పూల వాసన,  (ఒక విధమైన ఏదుం వాసన) మొక్క నాటినప్పటి నుండి పంట దిగుబడి వరకు కొట్టే పురుగు మందులు,ఇంకా అందులో దాగి ఉండే పురుగులు.. అన్నీ.. అంటే అయిష్టం.


జనవరి తర్వాత అంటే పువ్వు తెల్లగా ఉండటం తగ్గిన తర్వాత ఆ పువ్వులని అసలు వాడనే  కూడదు. మంచు కురిసే సమయాల్లోనే కాల్లీ ఫ్లవర్ బాగుంటుంది ఎండలు ముదిరేటప్పటికి పురుగు ఉదృతి ఎక్కువ కూడా.. రైతు ఎలాగోలా రసాయన మందులు జల్లి పంటని మార్కెటింగ్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఇదంతా నాకు ఎలా తెలుసు అంటే.. మా పొలాల లొ పండించేవారు నేను అన్నీ స్వయంగా చూసిన దాన్ని కాబట్టి.

ఒక వేళ  కాల్లీ ప్లవర్ ని ఉపయోగించాలంటే.. పూవుని చిన్న చిన్న గుత్తులుగా విడదీసుకుని.. పురుగులు లేకుండా
చూసుకుని బాగా ఎక్కువ నీళ్ళల్లో ఉప్పువేసి ఒక గంట ఆ నీళ్ళ నే ఉండనివ్వాలి.  ఇలా చేయడం వల్ల  పువ్వుల లోపల ఉన్న పురుగులు వెలుపలకి వచ్చేస్తాయి. ఒక గంట తర్వాత మళ్ళీ రెండు మూడు సార్లు ..ఆ పువ్వుల గుత్తులని  కడిగి..ఉంచి పెట్టుకుని.. బాగా మరిగిన నీటిలో ఆ ముక్కలని వేసి వెంటనే నీరు వార్చేసుకోవాలి. అప్పుడు ఆ ముక్కలు అంత పచ్చి వాసన రావు. రసాయన అవశేషాలు మిగిలి ఉండవు కూడా. అప్పుడు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా వాడుకోవచ్చు.

కాల్లీ ఫ్లవర్ ని  ఏక రకంగా వండకుండా.. వంకాయ,లేదా చిక్కుడు కాయ లతో కలిపి వేపుడు చేయవచ్చు. లేదా టమోటా తో కలిపి కలగలుపు కూర చేయవచ్చు. కాల్లీ ఫ్లవర్ కూర ఏ విధంగా వండినా ..ఆ కూరకి అల్లం వెల్లులి మిశ్రమం వేస్తేనే తగినంత రుచి.

ఇక ఇప్పుడు పచ్చి ముక్కల కాల్లీ ఫ్లవర్  పచ్చడి సంగతి చూద్దాం.

వేడి నీటిలో వేసి వార్చి తడి ఏ మాత్రం లేకుండా   శుభ్రంగా ఆరపెట్టిన

కాల్లీ ఫ్లవర్ ముక్కలు  సుమారు కొలతలో ఒక శేరు

కారం ఒక కప్పు  75గ్రాములు.

ఉప్పు ఒకటిన్నర కప్పు (కళ్ళు ఉప్పు = క్రిస్టల్ సాల్ట్ )

నిమ్మ పులుసు ఒక కప్పు

వెల్లులి పాయలు ఒక కప్పు ని ముద్దగా చేసి కలపాలి.

వేయించిన మెంతులు పిండి చిటెకెడు

వేరుశెనగ నూనె ఒకటిన్నర కప్పు.

పసుపు కొద్దిగా

అన్నీ కలిపి ఒక రోజు తర్వాత  ఈ పచ్చడిని వాడుకోవచ్చు.  నా  వంట మీద నమ్మకం ఉంటే మీరు ప్రయత్నించండి. :)

ఈ పచ్చడి కి తాళింపు  అవసరం లేదు. ఆవకాయ పచ్చడి లాంటిది ఈ పచ్చడి కూడా. అయితే ఒక వారం కన్నా ఎక్కువ నిలువ ఉండదు. ప్రిజ్ద్ లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది.

1 కామెంట్‌:

శశి కళ చెప్పారు...

akka neellu tagilite nilava untundaa?nuvvu uppu nellalo naana veyamannaavu