#వనజతాతినేని #వనజవనమాలికథలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
#వనజతాతినేని #వనజవనమాలికథలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

16, ఫిబ్రవరి 2025, ఆదివారం

ఇంతింతై



ఇంతింతై - వనజ తాతినేని 


కుండీలో ఏపుగా కొమ్మా రెమ్మలతో పచ్చగా నవనవలాడుతూ వున్న చంద్రకాంత మొక్కను చూస్తూ వుంది మైధిలి. ఇది ఇప్పటికైనా పూలు పూస్తే బాగుండును. ములుకులు లాంటి మాటల బారి నుండి తప్పించుకోవచ్చు.


 అత్తగారు నిర్మల మాటలు  చెవిలో గింగిరాలు కొడుతూ వుంటాయిలా. “అమ్మాయ్! ఇంకా ఎందుకా మొక్కకు పోషణ చేస్తావ్!  బడితలా పెరిగింది కానీ.. ఓ మొగ్గ వేసి పువ్వు పూసింది లేదు. పీకి పారేసి ఏ శంఖం పూల గింజలో వేయకూడదు పూజకు పనికి వస్తాయి. హెర్బల్ టీ కూడా చేసుకోవచ్చు.”


సృష్టిలో ఉన్న ప్రతి వస్తువు సొంతానికి వాడుకునేందుకు అనువుగా ఉండాలి లేకపోతే అది దానంతటదే మాయం అయిపోవాలి.లేకపోతే నాశనం చేసేయాలి మరొకటితో  నింపేయాలి. ఇదే మానవుడి లక్షణం అన్నట్లు వుంటున్న ఆమెను చూస్తే మైథిలి కి ఆశ్చర్యం కలుగుతుంది. చంద్రకాంత మొక్క స్థానంలో తనని ఊహించుకుంటుంది. 


పెళ్ళై నాలుగేళ్ళు అయింది. ఇంకా పిల్లలు పుట్టలేదేంటి అని ఆశ్చర్యపోవడం దాటి ఎగతాళిగా చూడటం మొదలు పెట్టారు. ఎవరూ నోటితో పల్లెత్తు మాట అనరు. కానీ వారి చూపుల్లో పెదాల మీద నవ్వుల్లో కనుబొమ్మల విరుపుల్లో కదలికల్లో స్పష్టంగా కనిపిస్తాయి. 


ఇంట్లో నలుగురు పిల్లలు వున్నారు. వారందరిని నెలల వయస్సున్నప్పటి నుండి  అపురూపంగా మోసి వారికి కావలసినవి కొనిపెట్టి సినిమాలకు షికార్లుకి తిప్పే బాబాయ్ .. శ్రీరామ్ అంటే మహా ఇష్టం. శ్రీరామ్ కూడా మైథిలి నెల తప్పకపోవడాన్ని పెద్దగా పట్టించుకున్నదీ లేదు.ఐవిఎఫ్ సెంటర్ కు వెళ్దాం అని అడిగింది. తొందరేం వుంది చూద్దాం అని దాటేయడం. 


నిట్టూరుస్తూ.. చంద్రకాంత మొక్క చివుళ్ళను సృశిస్తూ..దాన్ని బతిమిలాడింది. 

“బుజ్జి తల్లీ! త్వరగా పూలు పుయ్యవే! లేకపోతే నేను లేనప్పుడు ఎవరో వొకరు లేదా తుంటి ఎముక విరిగి వీల్ చైర్ లో తిరుగుతున్న అత్తగారికి పూర్తిగా నయమైన తర్వాతో వచ్చి నిర్దాక్షిణ్యంగా పీకి పడేస్తారు. ఎంత ఇష్టంగా తెచ్చుకున్నాను నిన్నూ! బంధువుల ఇంటి ముందర విరబూసి పరిమళాలు వెదజల్లుతూ గాఢ ఆకర్షణ లో పడేసావు నువ్వు. 


పసుపు పచ్చని రంగుపై ఎర్రని చుక్కలతో మనోహరంగా మెరిసిపోతూ. అనుమతి తీసుకోకుండానే  విత్తనాలు సేకరించాను.  మట్టి తో సహా పింగాణీ కుండీ కొని తెచ్చి ఈ నాల్గవ అంతస్తు బాల్కనీ లో పెట్టి అపురూపంగా పెంచాను.సాయంవేళ నిండుగా నువ్వు పూలు పూసి పరిమళాలు వెదజల్లుతూ వుండే దృశ్యాలను ఎన్నిమార్లు కలగన్నానో తెలుసా! ఇప్పటికైనా పూలు పూయవే తల్లీ! మా బంగారు వి కదూ!” బతిమిలాడింది. 


“పిన్నీ!”అంటూ వచ్చింది ఏడేళ్ళ పాప! 


“రిషితా ! వచ్చేసావా!“ దగ్గరికి తీసుకోబోతూ  ఆగిపోయింది. 


పాప ముఖం లో భయం ఆందోళన. కన్నీటి చారికలు. ఏదో కీడు శంకించింది. 


“ఎందుకమ్మా అలా వున్నావు? ఏం జరిగింది చెప్పు? “


“పిన్నీ! మామయ్య మామయ్య నన్ను “ వెక్కుతూ ఆగిపోయింది. 


గుండె గుబేల్మంది మైథిలికి. 


గబగబా వెళ్ళి రూమ్ తలుపులు మూసి వెక్కుతున్న పాపను వొడిలోకి తీసుకుని కన్నీళ్ళు తుడిచి వెన్నునిమురుతూ లాలనగా అడిగింది. 


“స్కూల్ బస్ దిగి లోపలికి వస్తున్నాను. లిఫ్ట్ దగ్గర మామయ్య ఉన్నాడు. మీరందరూ షాపింగ్ కి వెళ్లారు అని చెప్పాడు. వాళ్ళింటికి రమ్మన్నాడు. మామయ్యతో వెళ్ళాను. చాక్లెట్లు ఇచ్చి బెడ్ రూమ్ లోకి తీసుకెళ్ళాడు. ఏమేమో చేసాడు పిన్నీ! నేను గట్టిగా ఏడ్చాను. చూడు బ్లడ్ వస్తుంది “ గాటు పడ్డ పెదవిని చూపించింది.ఈసారి  భయంతో తాను వణికిపోయింది మైథిలి. 


దైర్యం కూడదీసుకుంటూ అడిగింది “ఇంకెక్కడైనా నొప్పి గా వుందా తల్లీ!”

“ ఊహూ, ఇంకెక్కడా నొప్పి లేదు. నేను కూడా మామయ్య చేతిని గట్టిగా కొరికాను.కేకలు పెడుతూ తలుపు తెరుచుని వచ్చేసాను”  


“సరే, ఈ విషయం గురించి నువ్వు ఎవరికీ చెప్పకూడదు. అత్త కు చెప్పి మామయ్య కు గట్టిగా పనిష్మెంట్ ఇప్పిద్దాం. సరేనా!”


“సరే పిన్ని” రిషిత ముఖం లో చిన్న నవ్వు. 


రిషిత కు స్నానం చేయించి స్నాక్స్ పెట్టి పాలు తాగిస్తూ తన దగ్గర కూర్చోబెట్టుకుని ఆలోచిస్తూ ఉంది. అంతలో ఆడపడుచు ఇంట్లో పనిమనిషి రిషిత పుస్తకాల బ్యాగ్ షూస్ తీసుకొచ్చి ఇచ్చింది. అత్తగారికి కాఫీ ఇస్తుంటే.. లావణ్య షాపింగ్ కి వెళ్ళిందిగా.. అల్లుడి ని కూడా కాఫీ కి పిలువ్ అమ్మాయ్! అంటూ ఆజ్ఞాపించింది. అత్తగారికి  కూతురు కళ్లెదురుగానే వుండాలి. అల్లుడికి నిత్యం కొత్త అల్లుడికి జరిగినట్లు రాచ మర్యాదలు జరగాలి. ఆ మాత్రం కాఫీ కలుపుకుని తాగలేడా వెధవ! అని తిట్టుకుంటూ అత్తగారి మాట పెడచెవిని పెట్టి శ్రీరామ్ కి కాల్ చేసి రిషిత కి ఏం జరిగిందో చెప్పింది. లాయర్ గా పనిచేస్తున్న అతనే ఆ సంగతి చూసుకుంటాడని. 


మరో గంటకల్లా.. కారకుడైన వ్యక్తి మినహా అందరూ హాల్లో కూర్చుని ఉన్నారు. 


నిర్మల చాలా అసహనంగా వుంది. లావణ్య అవమాన భారంతో తలదించుకుంది. పాపం!

అంతకన్నా ఏం చేయగలదు? 


 క్రమశిక్షణ లోపించి చదువుసంధ్యలు అబ్బక పోయినా సినిమా హీరోలాగా వున్నాడని అతన్నే కావాలని కోరుకుంది. పెళ్ళై పుష్కరం గడిచినా పైసా సంపాదించడు సరికదా పట్టె మంచం పైకే అన్నీ రావాలి.ఇన్నేళ్ళగా లావణ్య చిన్నచితకా ఉద్యోగం చేస్తూ తల్లి ఆర్థికస్థోమతను అండజేసుకుని   వ్యసనపరుడై బలాదూర్ గా తిరుగుతూండే భర్తను కాచుకుంటూ వస్తుంది. అప్పుడప్పుడు తాను మందలిస్తున్నదని తనపై కంటు తల్లికి కూతురి కి.


“గోటితో పోయే దానికి గొడ్డలి పోటు దాకా ఎందుకు?ఏదో ముద్దు చేసి వుంటాడు.రిషిత ఏదో ఊహించుకుని భయపడి వుంటుంది. ఇక ఈ విషయం మర్చిపోండి” అంది నిర్మల కఠినంగా. 


“మర్చిపోవడం ఏమిటి అత్తయ్యా! మీరు తప్పు ను ఖండించలేదు అంటే సమర్థిస్తున్నారా?”


“నోర్మూయ్! నీకు లావణ్య అంటే ఇష్టం వుండదు. ఎప్పుడూ ఏదోకటి అంటూనే వుంటావు. ఇది నీ పన్నాగమే!”

.

“లావణ్య తో నాకు చిన్న చిన్న విభేదాలు వున్న మాట నిజమే అయినప్పటికీ  వాటిని ఇలా రిషిత విషయంలో జరిగిన తప్పు కు ముడిపెట్టడం బాగోలేదు అత్తయ్యా! పవన్ అలా చేయడం నిజం. కూతురిపై వున్న ప్రేమతో అల్లుడి నిర్వాకాన్ని తప్పు అనకుండా మీ కళ్ళు మూసుకుపోయాయి.” 

గట్టిగా మాట్లాడింది మైథిలి. 


ఆ మాటకు  నిర్మల ఆవేశంతో ఊగిపోతూ.. 

“శ్రీరామ్ ! నీ పెళ్ళాం నన్ను అంతమాట అంటుందా? ఈ ఇంట్లో నేనైనా వుండాలి అదైనా వుండాలి. గొడ్డుమోతు దానికి పిల్లలపై ప్రేమ ఎలా వుంటుందో తెలిస్తే కదా! ఎవరు వొప్పుకున్నా వొప్పుకోకపోయినా నా కూతురు ఇక్కడే ఉంటుంది“ తీర్మానం చేసింది.


“తల్లి లేని పిల్లవాడు అని పవన్ ని పెంచి పెద్ద చేసి కొడుకులతో సమానంగా ఆస్తులు పంచి ఇచ్చారు. కూతుర్ని ఇచ్చి పెళ్ళి చేసి ఇంట్లో నే పెట్టుకున్నారు.అతను పామై కాటేస్తుంటే గుడ్డిగా వెనకేసుకు వస్తున్నారు. నిజాలను నమ్మక పోవడం మీ ఖర్మ” అని అంటూ 

మైథిలి విసురుగా తన గదిలోకి వెళ్ళింది. 


నిర్మల ఆ తర్వాత కూడా  ఏడుపు అక్కసు నోటి తుత్తర కలగలిపి మైథిలి ని పావుగంటసేపు తిట్టిపోసింది. విసుగు విరామం లేకుండా ఎఫ్ ఎమ్ ఆర్ జె రొదలా వినిపిస్తూనే వున్న ఆ మాటలను అపార్ట్మెంట్ అంతా శ్రద్ధగా వింది. భయపడి జాగ్రత్తలోకి మేల్కొంది. పసిపాపల చుట్టూ రక్షణ కవచాలను కట్టుదిట్టం చేసుకునే ప్రయత్నం చేసింది. 


జరిగిన విషయానికి బాధతోనూ అవమానం తోనూ శ్రీరామ్ తల పట్టుకుని కూర్చున్నాడు. అతనిలో అనేక ఆలోచనలు. ఇక్కడ మైథిలి చెప్పినదాన్ని నమ్మడం నమ్మకపోవటం కాదు సమస్య. అచ్చం సోషల్ మీడియాలో లాగానే.. జరిగిన తప్పు కళ్లెదురుగా కనబడుతున్నా ప్రశ్నించలేని స్వార్థంలో మనిషి కూరుకుపోతున్నందుకు బాధగా వుంది. ఏ విషయానికైనా అవును అనే వాళ్ళు కొంతమంది, కాదు అనే వాళ్ళు ఇంకొంతమంది. ఇక్కడ కుటుంబం సమాజమే కాదు మనిషి మనిషీ..  ఆఖరికి మనిషి- మనస్సు కూడా విభేదించే స్థాయికి చేరుకున్నారు. కళ్ళు మెదడు తెరిచి సత్యాన్ని చూడటం ఎలా!?


ఎయిర్ బేగ్ లో  బట్టలు సర్దుకుని వెళుతున్నానని శ్రీరామ్ కి   “రిషిత పాప జాగ్రత్త అక్కా” అని ఏమీ మాట్లాడకుండా అయోమయంలో వున్న తోడికోడలుకి హెచ్చరిక చేసి  ఆటో ఎక్కింది మైథిలి. 


ఆ రాత్రి  అందరూ భోజనాల బల్ల ముందు కూర్చుని అన్యమనస్కంగా పళ్ళెంలో వేళ్ళు పెట్టి కెలుకుతూ వున్నప్పుడు రిషిత మరో బాంబు పేల్చింది. 


“బాబాయి నీకో సంగతి చెప్పనా! అప్పుడెప్పుడో నాన్నమ్మ కి కాలికి ఆపరేషన్ జరిగినప్పుడు మీరు హాస్పిటల్ లో వున్నప్పుడు మామయ్య మీ రూమ్ లోకి వెళ్ళి  పిన్నిని కూడా వెనకనుంచి హగ్ చేసుకున్నాడు. పిన్ని మామయ్య ను తోసేసి చెంప మీద గట్టిగా కొట్టింది కూడా!” 


షాకింగ్ గా చూసారు అందరూ. 


“నిజమా పాపా!” అడిగాడు రిషిత తండ్రి. 


“అబద్ధం ఎందుకు చెబుతాను నాన్నా! నేను అక్కడే ఆడుకుంటున్నాను. నన్ను చూసి మామయ్య బయటకు వెళ్ళిపోయాడు. 


“ఆ తర్వాత ఏం జరిగింది?”. 


“పిన్ని  ఈ సంగతి ఎవరికీ చెప్పొద్దు తల్లీ గొడవలవుతాయి అని ప్రామిస్ తీసుకుంది”. 


శ్రీరామ్ లేచి చెయ్యి కడిగేసుకుని రూమ్ లోకి వెళ్ళిపోయాడు.


మిగిలిన కోడళ్ళు ఇద్దరూ చూసారా అన్నట్టు అత్త వైపు అసహనంగా చూసారు. 


“పిల్ల ముండ ఏదో అలా  చెబుతుంది.అల్లుడు ఎందుకలా చేస్తాడు? ఈ మాటలన్నీ లావణ్య వింటే బాధ పడుతుంది.” శుభ్రంగా తిని ప్లేట్ లో చేయి కడిగి పళ్ళెం కింద పెట్టి చక్రాల కుర్చీ నడుపుకుంటూ గదిలోకి వెళ్ళిపోయింది నిర్మల. 


శ్రీరామ్ భార్య కి ఫోన్ చేసాడు. పొడి పొడి సంభాషణ తప్ప రహస్యం బయట పడనేలేదు. ఇతనూ తెలిసిందని చెప్పనూలేదు. 


ఇరవై రోజులు గడిచాయి. లావణ్య తల్లితో మొబైల్ సంభాషణ తప్ప ఇంట్లోకి అడుగు పెట్టలేదు. రిషిత తల్లి స్కూల్ బస్ ఎక్కించడం దింపుకుని ఇంటికి తీసుకురావడంలో శ్రద్ధ తీసుకుంటుంది. లావణ్య కొడుకు అనిరుద్ధ్ తో కూడా రిషిత ఆడకుండా వేయి కళ్ళతో కావలి కాస్తుంది. 


మైథిలి శ్రీరామ్ కి మెసేజ్ చేసింది. “వేరేచోట ప్లాట్ అద్దెకు తీసుకోండి. నేను అక్కడికే వస్తాను. మా పుట్టింట్లో జరిగిన విషయాలేవి తెలియదు మీరూ చెప్పొద్దు “ అని. 


రెండు సార్లు అత్తింటికి వెళ్లి భార్యను చూసి వచ్చేశాడు శ్రీరామ్. రిషిత చెప్పిన విషయం గురించి ప్రస్తావనకు తేలేదు కూడా! “ఇంటికి రా మైథిలి. అమ్మ అప్పుడేదో కోపంలో నోరు జారింది లే!” అన్నాడు. 


తల అడ్డంగా ఊపింది. 


ఎందుకో నీరసంగా మగతగా  వుంటుంది అమ్మాయికి. హాస్పిటల్ లో చూపించి ఒక నెల తర్వాత పంపుతాం బాబూ”  అంది మైథిలి తల్లి. 


నెల రోజుల తర్వాత డబుల్ బెడ్రూమ్  ప్లాట్ అద్దెకు తీసుకొని  మైథిలి ని ఆ ఇంటికి తీసుకుని వెళ్ళాడు శ్రీరామ్. మైథిలి ఆ ఇల్లును చూసి  ముచ్చట పడింది. తన పుట్టింటి వారు ఇచ్చిన పర్నిచర్ మొత్తం ఆ ఇంట్లో కి మార్చి నీట్ గా సర్ది పెట్టి వుంది. ముఖ్యంగా బాల్కనీలో తను పెంచుకున్న చంద్రకాంత మొక్క వున్న కుండీని చూసి ఆనందపడింది. భర్తకు థాంక్స్ చెప్పింది. 


పరీక్ష గా చూడు.. ఇంకా సంతోషిస్తావ్ అన్నాడు. 


దగ్గరకు వెళ్ళి చూస్తే.. చిగురు చిగురులోనూ.. పొటమరిస్తున్న పసి మొగ్గలు. తన పొట్ట పై చేయి వేసుకుంది. బుజ్జి తల్లీ! నువ్వు అమ్మ వి అవుతున్నావ్ నేను అమ్మను అవుతున్నాను. మొక్కను ముద్దు పెట్టుకుంది. 


“మైథిలి నీతో ఒక మాట చెప్పాలి” ఆగాడు సంశయం గా శ్రీరామ్. 


ఏమిటి అన్నట్లు చూసింది. 


“రిషిత ని మనం పెంచుకుందాం. అక్కడ కన్నా ఇక్కడ సేఫ్ గా వుంటుంది అని.” . 


“బావగారూ అక్కా ఒప్పుకోవద్దు. వాళ్ళు ఒప్పుకుంటే అలాగే మనం తెచ్చేసుకుందాం.”


“వదిన సరే నంది. అన్నయ్య అమ్మను అడిగి చెబుతాను అన్నాడు.” 


మైథిలి మనసులో అనుకుంది. నామ మాత్రం సంపాదన. తల్లికి ఎదురుతిరిగి బతకడం సాధ్యపడదు. ఆ ఇంట్లో నుండి పొమ్మంటే అద్దె కట్టుకుని పిల్లలకు ఫీజులు కట్టుకుని సంసారం ఈదడం అంటే మాటలు కాదు కదా!” అని.


సాయంత్రం పిన్నీ అంటూ  స్కూలు బ్యాగు బట్టల బ్యాగుతో ప్రత్యక్షమైంది రిషిత..


ఆ మర్నాడు ఆదివారం కావడంతో రిషితను  తీసుకుని స్కూటీ పై  కూరగాయల మార్కెట్ కి వెళ్ళింది. 


ఫస్ట్ ప్లోర్ లో వుంటున్న సరిత  టీచర్ కనబడింది. ఉమ్మడి కుటుంబం లో వుండటం ఇష్టంలేక నా కోడలు ఈ అపవాదును వేసి పోయింది. మా అల్లుడు బంగారం లాంటి వాడు. అని చెబుతుంది మీ అత్తగారు అని  సరిత టీచర్ చెబుతుంటే అసహ్యం వేసింది మైథిలికి. అత్తగారికి హృదయం మెదడు రెండూ లేవు అనుకుంది విరక్తిగా. 


కంచే చేను ని మేస్తుంటే ఎవరు కాపలా కాయగలరు? 

పసిపాపలను కుటుంబ సభ్యుల నుండే కాపాడుకోవాల్సి రావడం ఎంత సిగ్గు చేటు. 

పైగా అంత వయస్సు వచ్చిన అత్తగారు కూడా నిసిగ్గుగా అతను చేసిన పనిని ఖండించకుండా బయటకు పొక్కకుండా వుంచాలని చూడటం.ఆ రోజు  అంతకుమించి రిషిత కి  ఇంకేదైనా జరిగివుంటే.. అలాగే ఆనాడు తన పైన బలాత్కారం జరిగి వుంటే!? తనకు తోడు రిషిత వుండబట్టి మౌనంగా వెనక్కి తిరిగాడు కానీ. 

 

పీడకులు బాధితులు ఒకే కప్పు కింద వుండాల్సిరావడం ఎవరైనా ఎందుకు వొప్పుకుంటారు? అందుకే రిషిత ని తమ ఇంట్లో వుండటానికి తల్లిదండ్రులు వొప్పుకున్నారు పంపించారు అని అత్తగారు అర్థం చేసుకోదేం!? 


ఆలోచిస్తూనే వంట చేసింది. ముగ్గురూ తిని టివి చూస్తూ వుండగా శ్రీరామ్ కి అన్నయ్య నుండి ఫోన్. 


కంగారు గా లేచి బట్టలు మార్చుకుంటూ చెప్పాడు.”లావణ్య ఆత్మహత్యా ప్రయత్నం చేసిందట. హాస్పిటల్ కి తీసుకు వెళుతున్నాం రమ్మని.” అని. 

 

మైథిలి రిషిత ని  తీసుకుని నేను కూడా వస్తాను అంది. 


 “వద్దు.. అక్కడ మా అమ్మ చేసే న్యూసెన్స్ మాములుగా ఉండదు. ఏం జరుగుతుందో ఏమో! పవన్ వాచ్మెన్ కూతురు పట్ల  మిస్ బిహేవ్ చేసాడంట. వాళ్ళు పట్టుకుని బాది పడేసి కంప్లైంట్ ఇచ్చారంట. విచారించడానికి పోలీసులు వచ్చేసరికి అది భరించలేక లావణ్య ఆత్మహత్యా ప్రయత్నం చేసిందట. బ్రతకడం కష్టం అంటున్నారు “ అని దిగులుగా చెప్పి గబగబా వెళ్ళిపోయాడు. 


మైగాడ్! అసలు  ఏం జరుగుతుంది? పవన్ మిస్ బిహేవియర్ గురించి అశ్లీలపు వాగుడు గురించి లావణ్యతో  చెప్పి వుండాల్సిందేమో! తాను కూడా రహస్యంగా వుంచి తప్పు చేసింది.బంధుత్వాలు బలహీన పడతాయనో పరువు పోతుందనో గోప్యంగా ఉంచడం వల్లనే ఆ కామాంధుడికి  మరింత బలం చేకూరింది.. 


పెంచిన ప్రేమో లేదా పేరెంట్స్ కి వుండే  గుడ్డి ప్రేమల వల్లనో  పిల్లలు  ఎన్ని తప్పులు చేసినా ఎన్ని నేరాలు చేసినా పెద్దలు సమర్థిస్తూనే వుంటారు. మొదటిసారి తప్పు చేసినప్పుడే ఖండించి వుంటే ఎలా వుండేదో!. ఇంతై ఇతింతై వటుడింతై అన్నట్లుగా పవన్ అరాచకాలు మితిమీరి పోయాయి. తన పర అన్న విచక్షణ కూడా లేనివాడుగా  కీచకుడిగా మారిపోయాడు. అతను తప్పకుండా శిక్షింపబడాలి. లావణ్య మాత్రం బ్రతకాలి! బ్రతకాలి!!


ఒక్క క్షణం ఆగి మళ్ళీ ప్రశ్నించుకుంది మైథిలి.

 

అవును, లావణ్య బ్రతికి మాత్రం ఏం చేయాలి? ఎల్లకాలం ఇలాంటి అవమానాలు భరిస్తూనే వుండాలా? కొడుకు భవిష్యత్తు తీర్చిదిద్దుకుంటూ వొంటరిగా  తన జీవితం తాను బతుకుతాను అంటే సమాజం సెహబాష్ అంటుందేమో కానీ లావణ్య తల్లి నిర్మల ఊరుకుంటుందా? ఊరుకుంటుందా అని!? ఇంట గెలిచి రచ్చ గెలవాలనేది ఇందుకేనన్న మాట. అవసరమైతే తనూ రిషిత కూడా సాక్ష్యం ఇవ్వాలని పవన్ శిక్షింపబడాలని దృఢంగా అనుకుంది.

 

అలా చేస్తే  పరువు మర్యాదలు పోతున్నాయని గుట్టు రట్టు అవుతుందనే అత్త అహంకారం ధన మదం ఊరుకుంటుందా? ఇవ్వన్నీ పోతే .. పోతే ఎలా!? అని అసహనం ప్రదర్శించదూ!!  

గంటన్నర తర్వాత శ్రీరామ్ నుంచి ఫోన్. లావణ్య అవుటాఫ్ డేంజర్ అని ట్రీట్మెంట్ ఇస్తున్నారు అని. 


అత్తగారి మూర్ఖత్వం తో అహంకారంతో  యుద్ధం చేయడానికి మైథిలి సమాయత్తం అయింది. 


వికసిత దరహాసంతో  చంద్రకాంతలు ఆల్ ది బెస్ట్ చెప్పాయి. 

 

********************************

(16/02/2025 ప్రజాశక్తి స్నేహ సంచికలో ప్రచురితం)











 

20, డిసెంబర్ 2024, శుక్రవారం

పాదముద్రలు

 పాద ముద్రలు   -వనజ తాతినేని


బ్రహ్మీ ముహూర్తంలో అతని అడుగులు గాలిలో పరుగులు పెడుతున్నట్టు వుంటాయి. 

ముఖాన్ని చూస్తే.. తాను నిర్వర్తించబోయే విధి పట్ల ఒకింత ఉద్వేగం ఆరాటం తో పాటు మహా ఇష్టం వ్యక్తమవుతూ వుంటాయి. అతని పేరు మహదేవ్. 


వంద అడుగుల దూరం లో అతన్ని అనుసరిస్తూ వుంటుంది వహీదా. ఏళ్ళ తరబడి క్షుణ్ణంగా అతన్ని చూసి చూసి  ప్రతి కదలికను వర్ణించి చెప్పగలదు. 


చేతుల మధ్య హృదయానికి దగ్గరగా వున్న తెల్లని గుడ్డ కాస్త బూడిద రంగులోకి మారి కనబడుతుంటూంది లోపల వున్న వస్తువు ఆచూకీ తెలుపుతూ. 

చూపు స్థిరంగా వుంటుంది.మనసులో ధ్యానం చేస్తూన్నట్టూ నో, పెదాలు కదిలి కదలకుండా ఏ పంచాక్షరీ నో జపిస్తూ .. దేవాలయ ప్రాంగణం వైపు సాగుతూ వుంటాడు. గాలి గోపురం వీథిలో పువ్వులమ్మే మనిషి ముందు ఆగుతాడు. అతనిచ్చిన డబ్బును అదృష్టంగా అందుకుని తత్తరపాటుతో మేలిమిరకంగా అల్లిన దండను ఏరి అతని చేతిలో వుంచుతారు. తాము అల్లిన మాల అతని చేతి ద్వారా తప్పకుండా మహాదేవుడి ని అలంకరిస్తుంది అని. అతని ప్రశాంతవదనంలో చిన్న చిరునవ్వు తొంగిచూస్తుంది.


ఎందుకంత కంగారూ.. పూదండ మాత్రమే ఏమి?  తుదకు మనమందరం ఆయన సన్నిధి చేరేవాళ్ళమే కదా అన్నట్టు. మరొక దుకాణం ముందు ఆగి నిత్యం లాగే కస్తూరి ని తీసుకుంటాడు. ఇక ఆలస్యమేమి లేకుండా.. ప్రత్యేక మార్గం ద్వారా దేవాలయ ప్రాంగణంలోకి ప్రవేశిస్తాడు. ధ్వజస్తంభం  వద్ద నిలబడి ఆకాశం వైపు చూసి నమస్కరించి నలువైపులా చూస్తూ మంత్రోచ్చరణ చేస్తూ ఒక ప్రదక్షిణ చేస్తాడు.మరో ప్రదక్షిణ చేసుకుని దక్షిణా ముఖంగా వున్న సింహద్వారం నుండి ఆలయంలోకి ప్రవేశిస్తాడు. అప్పటికి ఆమె ఆగిపోతుంది. 


హ్యాండ్ బ్యాగ్ లో ఉన్న మొబైల్ ఫోన్ తీసుకుని లైవ్ కార్యక్రమం చూస్తుంది.అతను లోపలికి ప్రవేశించేటప్పటికే.. రుత్విక్కులు అలంకారాలు ఏ మాత్రం ఇష్టపడని మహాదేవునికి ప్రీతిగా శ్రద్ధగా  తమ తండ్రిగానో బిడ్డగానో గావించి అలంకారం చేసుకుంటూ సరిజేసూకుంటూ.. “ఈ వేళ ఎంత బాగా కుదిరింది స్వామికి అలంకారం” అని మురిసిపోతూ వుంటూండటం చూసి దరహాసం వొలికిస్తాడు. అతని దరహాసం మహాకాలుని దరహాసంలా వుందే అనుకుంటాడు ఒక కుర్ర పండిత్ జీ. అతని మీసాలు తాను ఇప్పుడే స్వామికి తీర్చిదిద్దిన  మీసాల్లా వున్నాయా లేక తానే చిన్నతనం నుండి అతని మీసాల అందాన్ని చూసి చూసి ఇంకించుకుని అలా అలంకారం చేసానా అనుకుని తికమకపడతాడు. 


అంతలో అతను పడమటి వైపు నిలబడి తూర్పు వైపు తిరిగి స్వామికి భక్తిగా వినయంగా నమస్కరించుకుని పానపట్టంపై భస్మం మూటని వుంచుతాడు.చేతిలో పూ మాలను స్వామి శిరస్సున అందంగా అలంకరిస్తాడు. రొంటిన దోపుకున్న సుగంధ ద్రవ్యాన్ని తీసి పూలదండల క్రింద అమర్చి… పక్కనున్నతని చేతిలో నుండి వింజామరను అందుకుని సున్నితంగా విసురుతూ వుంటాడు. తన  భస్మ సేవకు అనుజ్ఞ  లభంచేవరకూ ఆ సేవ  కొనసాగిస్తాడు. అప్పటి వరకూ హడావిడి చేసిన అందరూ  వెనక్కి జరిగి అతని సేవకు దారి ఇస్తారు . అతను భస్మం మూటను  అందుకుని భక్తిగా నమస్కరించుకుని భస్మం తో మహాదేవుని అలంకరిస్తాడో హారతి నిస్తాడో అతనికే తెలియదు. పేరు ఏదైతేనేం… ఆ సేవలో తాను అంకితుడవుతాడు. నిత్యం పునరంకితుడవుతాడు. అతను చేస్తున్న ఆ పని  పూర్తయ్యేటప్పటికి గర్భగుడి అంతా దూసరవర్ణ మేఘం ఆవరించినట్లు వుంటుంది. స్వామికి ఎదురుగా మోకరిల్లి కైమోడ్పులర్పించి ఖాళీ మూటతో నిండిన హృదయంతో వెలుపలికి నడుస్తాడు.  


వహీదా తాను చూస్తున్న  యూ ట్యూబ్ ని క్లోజ్ చేస్తుంది.  అతని వైపు దృష్టి సారిస్తుంది. 


క్యూ లైన్ ల్లో నిలబడి భగవంతుని దర్శనం కోసం ఎదురుచూస్తూన్న రోజువారీ భక్తులు. భస్మ హారతిని  ఎదురుగా కనబడే డిస్ ప్లే లోనూ  స్వయంగానూ చూసిన భక్తులు వెళుతున్న అతన్ని గుర్తించి అబ్బురంగానూ ఈర్ష్యతోనూ చూస్తూ వుంటారు..  


అదిగో వెళ్తున్న అతనే, మహాకాలుడికి భస్మ హారతి ఇచ్చేది.ఎంత అదృష్టవంతుడో!..ఎన్ని జన్మల్లో పుణ్యం చేసుకునో పుట్టి వుంటాడు. అతను కాటికాపరుల కుటుంబంలో పుట్టిన వాడట. ఆ సేవ చేయడం వంశపారంపర్యంగా వస్తుందంట అంటారు తెలిసినవారు . ఆ మాటలు విన్న కొత్తవారు ఆసక్తిగా అతన్ని నఖశిఖపర్యంతం చూస్తారు. జుట్టునంతా ఊర్ధ్వం గా లేపి నడినెత్తికి  చేర్చి వేసిన ముడి (ఊర్ధ శిఖ ముడి)  మోకాలు దిగేవరకూ ముదురు నారింజ  రంగు పంచ మాత్రమే ధరించి కండువాను దట్టీగా బిగించి కట్టి వుంటాడు. పైనంతా జంధ్యం లేని అనచ్ఛాదిత దేహం.

ఫాలభాగాన విభూతి ఒడలంతా గంధపు త్రిపుండాలు. మెడలో రుద్రాక్ష మాల.తులసి పూసల మాల, కుడి చేతికి నారింజ రంగు దారం. 


తిరిగి వెళ్ళేటప్పుడు అతని నడక వేగం కొంత నెమ్మదిస్తుంది. అతని కళ్ళు ఎవరినో చూడాలని ఆశ పడతాయి. రావిచెట్టు చప్టా మీద కూర్చుని వున్న ఆమెని కళ్ళ నిండా చూసి

చిన్న దరహాసంతో ముందుకు సాగుతాడు. ఆమేమో తన దుకాణం వైపు మళ్ళుతుంది. ఇలా పదేళ్ళుగా సాగుతూనే వుంది మార్పు లేకుండా. 


**********

ఒక నెల రోజులుగా ఆమె అతన్ని అనుసరించడం లేదు.. ఎదురుపడుతుంది. 


అతను మందిర ప్రాంగణంలో నుండి రుద్రసాగర్ వైపుకి నడిచి కుడి వైపుకు తిరుగుతాడు.హరసిధ్ది మార్గ్ లో సర్కిల్ దాటి క్షిప్రానది పై వున్న వంతెన దాటేలోపు నడక మధ్యలో  వహీదా ఎదురవుతుంది ప్రతిరోజూ . 


ఆమె తండ్రిది దేవాలయ ప్రాంగణ సమీపంలో పూజాద్రవ్యాలు అమ్మే షాపు.ఇటీవల అన్య మతస్తులు దేవాలయ ప్రాంగణంలో షాపులు నిర్వహించకూడదు అని కమిటీ నిర్ధారించాక  షాపు ఖాళీ అయింది. ఆమె కనిపించడమూ మానేసింది. ఈరోజు కూడా ఆమె కనబడదేమో అనుకుంటూ ఆలోచిస్తూ క్షిప్రా నది వొడ్డుకు చేరుకున్నాడు. దూరంగా మెట్ల మీద కూర్చుని కనిపించింది ఆమె. నాలుగడుగుల దూరంలో ఆగాడు. అతని కళ్ళలో ఏదో చెప్పాలనే తపన.. చెప్పలేని సందిగ్ధత. ఆమె చొరవజేసింది.


“రోజూ కనబడటం లేదని వెదుకుతున్నావా”


అతను ఆ ప్రశ్న ను పట్టించుకోనట్లు నటించి “ఇప్పుడెలా మరి” ప్రశ్నించాడు.


 “అదే ఆలోచిస్తున్నాను” తలమీద చున్నీని సరిచేసుకుంది. 


“అలవాటైన పని అలవాటైన దారి మారితే కష్టంగా వుంటుంది కదూ”  ఆమెకు ఇందాకటి ప్రశ్నకు సమాధానం కూడా దొరికింది ఆ మాటల్లో.


“దుకాణం అయితే వీల్లేదు అన్నారు కానీ పూలు అమ్మడం వద్దనలేరు కదా, రోజూ పూలు, బిల్వ పత్రాలు అమ్ముతాను “అంది పట్టుదలగా. 


“వహీదా! ఎందుకీ  కష్టమూ పట్టుదల నీకు?! హాయిగా పెండ్లి చేసుకోకూడదూ! పిల్లాపాపలతో వర్దిల్లాలి నువ్వు” 


“నువ్వు మాత్రం వర్ధిల్లకూడదా ఏం!? మహదేవ్”


“చూడు, నా వయస్సు ఇంకో రెండేళ్లకు నలబైకి చేరుకుంటుంది,  ఇదిగో చూడు సగానికి పైగా గడ్డం కూడా నెరిసిపోయింది,మహాకాలుడి సేవలో మునిగిపోయి అర్ద విరాగి గా మారిన నన్ను ఏ స్త్రీ వివాహమాడుతుంది చెప్పు?  పైగా శ్రవణ కుమారుడిలా తల్లిదండ్రుల సేవలో మునిగిన వాడిని”


“నేను మాత్రం యవ్వనవతి నా!? ఫ్రౌఢ లోకి మళ్ళిపోయాను. నాకు మాత్రం ఇలాగే గడిచిపోనీయరాదా!?” అంది మొండిగా.


“అప్పుడలా జరిగి వుండాల్సింది కాదు నీకు” బాధగా అన్నాడు. 


ఆ మాటలు ఇష్టం లేని వహీదా లేచి “నా దేవుడి దర్శన భాగ్యం అయింది, ఇక నీ దేవుడి దర్శనం చేసుకుని వస్తాను” అని మెట్లపై నుంచి లేచి పూల బుట్టను అందుకుంది.  


మెట్లు ఎక్కుతున్న ఆమెను వెనుక నుండి చూస్తూ అనుకున్నాడు  నుదుట కుంకుమ పాపిట సింధూరం ధరించని దేవతలా వుంది అని. నడుస్తూ ఆలోచిస్తూన్నాడు. తమ  మనసులు ఎందుకో ఏమో తెలియకుండానే  ముడులు వేసుకున్నాయి కానీ కలిసి నడిచే దారి వేసుకోలేదు. వేరొకరు నడిచే దారిలో నడవటానికి తమకు సంకోచం. తాము వేసుకున్న ముడులు చిక్కుముడులు కాకూడదు అని ఆలోచిస్తూనే ఏళ్ళు గడుస్తున్నాయి. గడిచిపోతాయి అంతే! 

 

దుకాణం విషయం మినహా ఇవాళ జరిగిన సంభాషణ గత పదేళ్ళుగా వారి మధ్య నెలకొకసారి అయినా జరుగుతున్నదే!   మహదేవ్ దళితుడు. పైగా తరతరాలనుండి కాటికాపరి వృత్తిగా గల కుటుంబంలో  మొదటి పురుష సంతానం. ఆ కుటుంబంలో వారినే భస్మ సేవకు నియమింపబడటం తరతరాలుగా ఆచారంగా వుంది . అనాదిగా దేవాలయం ఆ సేవకు వారిని సమ్మతిస్తుంది.తండ్రి అనారోగ్యం వల్ల మహదేవ్ ఆ సేవకు యవ్వనకాలంలోనే నియమితుడయ్యాడు. డిగ్రీ వరకూ చదువుకున్నాడు.వృత్తిని దైవంగానూ భావించేవాడు. పండిత బ్రహ్మణులతో సరిసమానంగా అంతకన్నా ఎక్కువగానే అర్చన వేదం తదితర విషయాల్లో సాధికారత సాధించాడు. అయినా వినయం గా మౌనంగా వుంటూ తన సేవ తాను చేసుకుంటూ వుంటాడు.సంస్కృతంలో ఎమ్ ఏ  చదువుకుంటూ వేదాలను అధ్యయనం చేస్తుంటాడు. క్షిప్రా నది వొడ్డున తన ఇంటిలో కూర్చుని గొంతెత్తి శ్రావ్యంగా మహాకాలుడిని కీర్తిస్తాడు. గోవులను మేపుతూ గోమయం సేకరించి పిడకలను చేసుకుని మండించి బూడిదను సిద్దపరుచుకుంటాడు. 


అప్పుడప్పుడు..  తమ్ముడు  తెచ్చి ఇచ్చిన శవ  భస్మాన్ని భస్మ హారతికి తీసుకువెళతాడు. మన ఆచారం తప్పకూడదు రా అయ్యా! అని తండ్రి చెపుతుంటాడని. మహదేవ్ ఆలోచిస్తూ వుంటాడు. శవ భస్మం అనగానే మనిషి భీతిల్లినట్టు తనకు దూరం దూరంగా జరుగుతుంటారు మనుషులు. కానీ, మనిషిలో ఉన్న రాగం ద్వేషం కోపం అసూయ ఈర్ష్య ద్వేషం కుళ్ళు కుశ్చితం పాపం నీతిబాహ్యం లాంటి పేరుకున్న మలినాలెన్నో  ఆఖరికి అగ్నికీలల్లో దహింపబడి బూడిద గా మిగిలిపోతుంది. బూడిద స్వచ్చత గంగాజలం లాంటిది. నారికేళ ఫలం లోని నీరు లాంటిది కదా! అని యోచన చేస్తాడు.  రోజూ ప్రదోషసమయంలో ఢమరుకాన్ని మోగిస్తూనో .లేదా శంఖధ్వని చేస్తూ స్వామి సేవలో తదాత్మ్యం చెందుతాడు. శాంతంగా నిదురిస్తాడు. 



ఇక వహీదా మస్తాన్ వలీ కూతురు. దశాబ్దాలుగా దేవాలయ ప్రాంగణంలో దుకాణం. తండ్రికి నాలుగో కూతురు. కొడుకులా చేదోడు వాదోడు. పన్నెండేళ్ళ క్రితం స్పురద్రూపి మహదేవ్ ని చూసి ప్రేమలో పడిపోయింది. ఆకాశం భూమి కలవవు అని తెలిసినా  అమె పిచ్చి మనసు ఊరుకోలేదు. ఆమె చొరవ కి మహదేవ్ గాంభీర్యం చెదిరిపోయింది కానీ సాధ్యాసాధ్యాలను అతను మర్చిపోలేదు. 


అతనికి రెండే వ్యాపకాలు. ఒకటి మహాకాలుడి సేవ రెండవది  తల్లిదండ్రుల సేవ. ముచ్చటగా మూడవది.. వెల్లడించవలసి వస్తే వహీదా పై వున్న ప్రేమ. “!ప్రేమించడం తెలిసిన వారు నిన్ను ప్రేమించకుండా ఎలా వుంటారు వహీదా!” అనుకుంటాడు. రోజుకొకసారైనా ఆమెకు అలాగ జరిగి వుండాల్సింది కాదు అనుకుంటాడు. ఆమెకు అలా జరిగి వుండకుండా వుండి వుంటే తానూ వేరెవరినో వివాహమాడి  సంసార బంధంలో తలమునకలుగా మునిగి పోయి వుండేవాడేమో అని అనుకుంటాడు. తల్లిదండ్రులు తమ్ముళ్ళు చెల్లెళ్ళూ వివాహం చేసుకోమని చెప్పి చెప్పి అలసిపోయారు. తండ్రి దిగులు పడ్డాడు.. బూది సేవకు వారసుడు కావద్దా అని. తమ్ముడి కొడుకు వున్నాడు కదా అంటాడు మహదేవ్. తండ్రి ముఖంలో కొండంత అసంతృప్తి. 


“నీ కొడుకు ఆ ముస్లిమ్ పిల్లపై మనసు పడ్డాడు. ఆ పిల్ల కు కాబోయే వాడు బారాత్ లో గుర్రం అదుపుతప్పి అతన్ని తొక్కి చంపేయకుండా వుండి వుంటే ఆ పిల్ల నిఖా సవ్యంగా జరిగి పోయివుండేది. ఆ పిల్లేమో నిఖా కాకుండానే విధవరాలు అయినట్లు మనసు బిగదీసుకుని వొంటరిగా మిగిలిపోయింది. ఆమె పెళ్ళి చేసుకోలేదని వీడూ చేసుకోడు. ఒక ఏడా రెండేళ్ళా!? పదేళ్లు పైగా గడచిపోతూనే వుంది”. అని గొణుక్కుంది తల్లి అహల్య.


అయినా చొరవజేసి ఆ పిల్లను తీసుకొచ్చుకుని పెండ్లి చేసుకుంటే మహాకాల్ సేవకు మందిర్ కమిటీ వాళ్ళు వొప్పుకుంటారో లేదో! అని సందేహపడుతుంది. కొడుకు దగ్గర ఆ మాటే చెబుతూ వుంటే విని ఊరుకుంటాడు తప్ప ఏమీ మాట్లాడడు. ఆమె విసుక్కుంటూ “ మీ ఇద్దరూ సద్దు చేయకుండా బండల క్రింద బావురు కప్పల్లా పడివుండారు.  మీ ఇద్దరి జీవితాల్లో కళ్యాణ ఘట్టం రాసి వుందో లేదో ఆ దేవుడికే తెలియాలి.”  అని రొట్టెలు వొత్తుకోవడంలో మునిగిపోయేది.. 


*********

వహీదా రావిచెట్టు అరుగు మీద కూర్చొని ప్రధాన పండిత్ శివనాధ్ స్వామి కోసం ఎదురు చూస్తుంది. మహదేవ్ పై ఆయనకు కొండంత  పితృ ప్రేమ. మహాకాలుడికి ఏక హారతి పంచ హారతి నక్షత్ర హారతి కర్పూర హారతి జరుగుతూ వుంటే వీక్షిస్తూ కూర్చుంది. వసీదా మనసు అల్లా కు  ఈశ్వరుడికి తేడా లేదు. క్రియలు వేరు వేరు. భావన వొక్కటే! మందిరంలోకి ప్రవేశం లేదన్నమాటే కానీ తన దుకాణం నుండి భక్తుడి ద్వారా వెళ్లే ప్రతి వస్తువు పైనా తన భక్తి అలుముకుని లేదూ. ధూళిలా భగవంతుడి కరుణ తనను చుట్టి వుండలేదూ! అనుకుంటుంది. పైగా మహదేవ్ మనసులో తానూ తన మనసులో మహదేవ్ వున్నప్పుడు మహాకాలుడ్ని తాను అన్యదేవత అని తాను ఎలా భావిస్తుంది?.  తన మనసులో వున్న మాటలే పండిత్ జీ కి  ఎలా చెప్పాలి? తీరా చెప్పాక ఆయన ఏమంటారో!? సంకోచంగా వుంది. పండిత్ జీ  బయటకు వచ్చారు. ఆయనకు ఎదురుగా వెళ్ళి నమస్కారం చేసింది. ఆయన హృదయానికి కుడి అరచేతిని ఆనించి శివార్పణమస్తు అన్నారు. తికమక పడింది. “చెప్పమ్మా వహీదా!అందరూ కుశలమేనా? దుకాణానికి జాగా కుదిరిందా!? 

“లేదన్నట్లు తలఊపింది “ ఏదో విషయమై వచ్చి ఆయన చుట్టూ ఉన్న వారిని చూసి ఆగిపోయిందని అర్థం చేసుకుని.. ఇప్పుడు  వేరే పనిలో వున్నానమ్మా. 11 గంటలకు ఇంటికి రామ్మా! అక్కడ మాట్లాడతాను అన్నారు. తల వూపి ఇంటికి వచ్చేసింది. 


తల్లికి వంట పనిలో సాయం చేస్తూ ఉండగా.. పినతల్లి వచ్చింది. తల్లి ఇచ్చిన ఛాయ్ తాగుతూ కోడలిని తిట్టడం మొదలుపెట్టింది. “ఆ చినాల్ రండ్ పిల్లలిద్దరికీ పేర్లు మార్పించి హిందువుల పేర్లు పెట్టించింది అంట. నా కొడుకు సంపాదించిన సొమ్మును పందిలా తింటూన్నప్పుడు  నా కొడుకు వారసులుగా కదా ఆ బిడ్డలు పెరగాల్సింది. వాడు మళ్లీ కోర్టు లో కేసు వేశాడంట భరణం ఇవ్వను అని”  అంటూ చెప్పుకొచ్చింది. 


“అన్న ఆ పిల్లలను తన పిల్లలగానే పెరగాలనుకుంటే వదినకు తలాక్ ఎందుకు చెప్పాలి. అంతా బాగున్నప్పుడు ఆమె మాత్రం  మీ పేర్లు పెట్టొద్దు అని అభ్యంతరం చెప్పిందా ఏమిటి”  అంది? గట్టిగానే. తల్లి చూపులతో వారిస్తున్నా వినలేదు వహీదా. 


నీ ప్రశ్నలకు జవాబు ఎందుకివ్వాలన్న అహంకారంతోనూ సమాధానం తోచకనూ అక్కడి నుండి జారుకొంది పినతల్లి. తల్లి వహీదా ని కోప్పడింది.“ఆమెతో వాదులాట మనకెందుకు? చెవులు అప్పగించి ఊరుకుంటే సరి.” అంది. 


“వదినకు జరిగిన అన్యాయం మన కుటుంబాల్లో వారికి జరిగితే మనకెందుకు అని ఊరుకుంటారా అమ్మీ! “


జాహిదా మౌనం వహించింది. 


వహీదా.. ఆలోచన చేస్తుంది. చిన్నాయన కొడుకు వశీమ్ బాగా చదువుకున్నాడు.మంచి నౌఖరిలో కుదురుకున్నాడు. సంబంధాలు చూస్తున్నప్పుడే హిందువుల అమ్మాయిని పెళ్లి చేసుకుని తీసుకు వచ్చాడు. ఆమె పేరు అమృత. ఇదే పట్టణం. అందం ఉద్యోగంతో పాటు గట్టి ఆస్తులున్న కుటుంబంలో పెరిగిన అమ్మాయి.ఆమె తల్లిదండ్రులు వీరి వివాహాన్ని అంగీకరించలేదు. ఇద్దరూ భోపాల్ లో ఉద్యోగం చేసుకుంటూ ఐదేళ్లు కాపురం చేసి ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. వదిన పిల్లలను పెంచుకోవాలని ఉద్యోగం మానేసింది. ఆమె పుట్టింటి వైపు నుండి భారీగా ఆస్తులు వస్తాయన్న ఆశ వమ్ము అయ్యేటప్పటికి, సంపాదనలేని భార్యని చూస్తున్న కొద్దీ వశీమ్ కి భార్య నచ్చలేదు. మంచినీళ్లు తాగినంత సులభంగా మూడుసార్లు తలాక్ చెప్పేసి వేరొక స్త్రీని నిఖా చేసుకున్నాడు. బదిలీ చేయించుకుని ముంబాయికి పారిపోయాడు. అమృత వదిన కోర్టులో కేసు వేసింది. అసలు షరియత్ చట్టం ప్రకారం అమృత మతం మారి వశీమ్ ని వివాహం చేసుకోలేదు అని వశీమ్ వైపు లాయర్లు, అసలు వీరి వివాహమే చట్ట సమ్మతం కాదని కొన్ని వాదనలు. ఇలా  రెండేళ్లు కొనసాగాక… వశీమ్ అమృత లది పెళ్ళి కాదని సహజీవనం లాంటిదే  అని తీర్మానించిన కోర్టు తండ్రి ఆ పిల్లలిద్దరికీ భరణం ఇవ్వాలని తల్లి సంరక్షణలో పిల్లలు పెరగాలని తీర్పునిచ్చింది. అమృత వదిన ఆద్యంతం గాయపడిన హృదయంతోనే పోరాటం చేసింది.


కోర్టులో కేసు నడుస్తుండగా ఒకరోజు దుకాణం దగ్గరకు వచ్చింది. ఎన్నో విషయాలు చెప్పింది. 

ఒక హిందూ వనిత ముస్లిమ్ యువకుడిని ప్రేమిస్తే హిందువుగా వుండకూడదట. తప్పకుండా మతం మారిపోవల్సిందే అంట. అది ముస్లిమ్/ క్రైస్తవ/ యూదు/ జైన ఏ మతమైనా పర్వాలేదంట. కేవలమ్ హిందువుగా మాత్రమే వుండకూడదు అంట.  అలా మారకపోతే షరియత్ వప్పుకోదు అంట.  ఇదెక్కడి పితలాటకం!? 


మత మార్పిడి లేకుండా ప్రత్యేక వివాహ చట్టం 1872 ప్రకారం కూడా వివాహాన్ని చేసుకోవచ్చు అన్నారని నేను మతం మార్చుకోలేదు. మత వివాహాల్లో ఇన్ని ఇబ్బందులు ఉన్నాయని నేనస్సులు అనుకోనేలేదు. ఈ చట్టాలన్నీ  ప్రేమికుల పాలిట పాము కాట్లే! ఎన్నో పాము కాట్లు వేయించుకుంటే కానీ నిఖా ఆమోద ముద్ర పొందదా? ఆఖరికీ, తలాక్ పాము కాటు కి బలి అయిపోయాను కదా! అని ఏడ్చింది. వహీదా కి కూడా దుఃఖం వచ్చింది. ప్రేమంటే దుఃఖమా!? ఆ సమయంలో వశీమ్ కనబడితే చెంపచెళ్ళుమనిపించేది.


 ఈ మధ్య కూడా అమృత జజారులో కనబడినప్పుడు “బాగున్నావా వదినా,పిల్లలు బాగున్నారా” అని పలకరిస్తే  “ప్రేమ పెళ్ళిలో ప్రేమ రంగు వెలిసిపోతే మోసం మిగిలితే.. జీవచ్చవంలా మిగలాల్సిందే!”  అంది చిన్న నవ్వుతో..  ఆ నవ్వులో టన్నుల కొద్దీ విచారం కనిపించింది. 


ఇంత జరిగినా  ఆమె తల్లిదండ్రులు పట్టు వీడలేదు.కూతురిని ఆదరించలేదు. గాయత్రి పరివార్ ఆదుకుని ఆమెకు ఉద్యోగం, పిల్లలకు చదువులు ఏర్పాటు చేసారు.ఇప్పుడు మళ్ళీ కోర్టూ కేసు. ఆమె జీవితం అడ కత్తెరలో పోక చెక్క అయింది కదా అనుకుని బాధ పడింది.


తల్లితో బయటకు వెళ్ళొస్తాను అనే ఒకమాట చెప్పి పండిత్ శివనాధ్ స్వామి ఇంటికి చేరుకుంది. అప్పటికే ఆయన ఇంటి వరండాలోనూ తోటలోనూ చాలామంది నిరీక్షిస్తున్నారు. కొందరు చిందులు తొక్కుతుంటే కొందరు ఆందోళనగా వేచి వున్నారు. పండిత్ జీ ముందు బయటికి రాగా ఇంటిలోపలి నుండి కొందరు స్త్రీలు వధువుగా అలంకరించిన వొక యువతిని వెంటబెట్టుకుని వచ్చారు. ఆ వధువును చూడగానే ఆవేశంతో ముందుకు వచ్చి ఆమె మీద దాడికి సిద్దపడ్డారు. వారంతా తమ మతానికి చెందినవారే!  పోలీసులు వారిని నిరోధిస్తుంటే నారింజ రంగు దుస్తులు ధరించిన కొందరు ఆ వధువుకు రక్షణగా నిలబడ్డారు. 


 పండిత్ జీ అన్నారు ”మీ అమ్మాయి తప్పేం చేయలేదు. నెలన్నర క్రితం నన్ను సంప్రదించింది. ఆమె తాను ప్రేమించిన మనిషి కోసం మతం మార్చుకుంది. అతనితో కలిసి జీవించడానికి మార్గం సుగమం చేసుకుంది. శుభంగా జరిగే వివాహాన్ని వివాదస్పదం చేయవద్దు. విజయవంతం చేద్దాం. అంటూ సిద్ధం గా వుంచిన పూల దండలు మంగళసూత్రం సింధూరం గిన్నె వారి ముందుకు తెప్పించారు. 


కొందరి శాపనార్థాల మధ్య ఆ శాపనార్థాలు వినబడకుండా  మంగళ వాయిద్యాల మధ్య ఐదుగురి పండితుల వివాహ మంత్రాల మధ్య ఆ జంటకు వివాహం జరిగిపోయింది. వివాహ రిజిస్ట్రేషన్ కూడా జరిగిపోయింది.


 వరుడి వైపు పెద్దలు కొందరు చొరవ చేసి…కోపాగ్నితో ప్రజ్వలిల్లుతున్న వధువు వైపు వారి దగ్గరకు జంటను తీసుకువెళ్ళి ఆశీర్వదించమని చెప్పారు వారికి  నోరు చెయ్యి రెండూ రాలేదు కాలు కూడా కదపలేదు. పైగా మీ ఇంటి ఆడపిల్లలను మా మతంలోకి మార్పించి నిఖా చేయించండి అప్పుడు మేమూ వొప్పుకుంటాం అన్నారు. ఆ మాటతో కొందరు ఠక్కున వెనక్కి అడుగేసారు.మరికొందరు అలాక్కూడా జరుగుతున్నాయిగా, వద్దు కాదు అనే వారు మూర్ఖులు అన్నారు. 


పండిత్ జీ  మరొకసారి ముందుకు వెళ్ళారు, తన మాటను గట్టిగా వినిపించారు.

 “మతాల పేరు మీద ప్రేమికులను జంటలను విడదీయకూడదు. వీరిరువురి మనసులను కలిపి కుట్టిన ప్రేమ సూత్రం దారం ఏ మతానికి చెందింది?  వీరిరువురూ కలగలసి నడిచే మార్గానికి ముళ్ళ కంపలు వేసి  మూయగల్గింది యెవరూ? నలుగురు నడిచే నేల మీద ఇవి రాముడు పాద ముద్రలు అని  అల్లా పాద ముద్రలు అని విడదీసి చూపగలరా?  పెద్ద మనసుతో పిల్లలను ఆశీర్వదించండి” అని హితబోధ చేసారు.. 


“ఏకోహం బహుస్యం ? 

ఒకే నేను అనేక రూపాలు” అని భగవంతుడే చెప్పాడు కదా అనికూడా వివరణ చేసారు. 


పండిత్ జీ పెద్దరికాన్ని గౌరవించి పెద్దలు పిల్లలను క్షమించి.. ఆశీర్వదించారు. ఆ తర్వాత వారు వీరూ కాస్త తికమకలతో కొత్త బంధుత్వాన్ని ఆలింగనం చేసుకున్నారు. 


జరుగుతున్నదంతా శ్రద్ధగా చూసింది వహీదా. చరిత్ర చదువుకున్న ఆమెకు ఒకటే అనిపించింది. చక్రవర్తుల మందిరాలను కూల్చి మసీదులు, మసీదులు కూల్చి మందిరాలు నిర్మించడం వెనుక వుంది భగవంతుడిపై వున్న భక్తి కాదు. భగవంతుడి పేరుతో  జరిగే మత రాజకీయం. భక్తి తో ఊగిపోయే ఆవేశపరుల్ని బలి పశువుల్ని చేసి ఏమీ ఎరుగని అమాయకులను బలిచేస్తుంది. 


 కర్తవ్యం బోధపడింది.పండిత్ జీ తో మాట్లాడకుండానే వెనుదిరిగింది. ఇంకో రెండు నెలల్లో ఆయన భుజస్కంధాలపై తనొక భారం మోపనుంది. తన ప్రియ శిష్యుడిని వివాహోన్ముఖుడిని చేయాల్సిన బాధ్యత అప్పగించనుంది.తాను అపర్ణగా మారనుంది.   


***********************************0************************************