3, నవంబర్ 2024, ఆదివారం

ధాత్రి మాత

  పిచ్చి తల్లి 


అమ్మా ఆకలి అని పిలుపు వినిపిస్తే .. సమాధిలో నుండైనా లేచి పరుగెత్తి రావాలి. 

అంత ప్రేమ వుండాలి తల్లికి. 


అమ్మలను అమ్మ అమ్మలను అసహ్య భాషలో తిడుతుంటే 

చనుబాలు తాగుతూ రక్తం కారేటట్లు కొరికినా ఓర్చుకున్నట్టు చిన్న బిడ్డడు లే అని సర్దుకు పోవాలి. 


ఆలి వచ్చినాక పళ్ళెంలో ఇంత ముద్ద వేయకపోయినా.. పాపం ..నా బిడ్డ తప్పేం లేదు. పరాయి బిడ్డ పన్నాగం అనుకోవాలి గుడ్డి ప్రేమతో... 


ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకుని కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తూ వుంటారు

భ్రమతలు వొదలరు సత్యం జీర్ణించుకోలేరు

పసివాళ్ళు!  వాళ్ళకేం తెలుసు సంసారం ఈదడం సాగరం ఈదటమేనని 

అంటూ .. మనసు గంప కింద గుట్టుగా దాపెడతారు. 


పిచ్చి సన్నాసులు

ఏదో చికాకులో నోరు జారతారు చెయ్యి ఇసురుతారు కానీ..

మళ్ళీ అవసరం వచ్చినా ఆపదొచ్చినా.. 

అమ్మా! కాసిని దుడ్లు ఇయ్యవే

కయ్యో ఇల్లో రాసియవ్వే.. అని కాళ్ళా వేళ్ళా పడతారు. బిడ్డలు మననిగాక ఎవర్నడుగుతారులే అని జాలిపడతారు.


కరిగి నీరై వేలిముద్రో సంతకమో చేజారారో.. 

దేవతలా దేవుడిలా చూసుకుంటానన్న వాగ్దానం.. హుష్ .. కాకి ఎత్తుకుపోయిందని.. 

రిజిష్టరు ఆఫీసు కాడే వొదిలిపెట్టి  దొడ్డి దారిన జారుకుంటారు. 


నిజం నిప్పై , నొప్పి నిజమై,  చేసిన తప్పై  రుణమై శాపమై పాపమై.. 

గొంతెత్తి ఏడ్చే శక్తి లేక నీరు నిండిన కళ్ళతో 

అయోమయం గా చూస్తుంటారు. నిశ్శబ్దంగా 

కాటికి సర్దుకుంటారు.



భూమి మీద పుట్టిన మానవ సంతతికి 

*ధాత్రి మాత ప్రసవ వేదన చిత్రాన్ని చూపండి 

అమ్మల్లారా అయ్యల్లారా..! 

అంతకు మించి… 

ఆ ప్రసవపు నొప్పి భరించిన తల్లులు పడే 

ఈ భరించలేని బాధలెన్నెంటినో తూకం వేయకండి. సారూప్యత వెతకకండి.


లైవ్ టెలీకాస్ట్ ల్లోనూ..  పెట్టుడు పోగ్రామ్ ల్లోనూ తల్లులను చూపిస్తూ ఆ బాధలను యెగతాళి చేయకండి.. తల్లుల్లారా తండ్రుల్లారా.. 🥲🥲


మీ అమ్మ ఏనాడో మీ నాయన దాష్టీకానికి చచ్చి చచ్చి మీ కోసమే బతికిన వెర్రి తల్లి .. వెర్రి ప్రేమ గల పిచ్చి తల్లి. ఆమె చావును ఆమె చావనియ్యండి.


*(ధాత్రి మాత - నేపాల్  / ప్రసవ వేదన పడే తల్లి రూపాన్ని భక్తితో పూజిస్తారు)




కామెంట్‌లు లేవు: