#ఆడియోకథలు #తెలుగుకథలు #వనజతాతినేని #వనజవనమాలికథలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
#ఆడియోకథలు #తెలుగుకథలు #వనజతాతినేని #వనజవనమాలికథలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

4, ఫిబ్రవరి 2026, బుధవారం

అమ్మ - చెట్లు ప్రసాదించిన జీవితం

 చెట్లు ఉసురుపోసిన (ప్రసాదించిన)  జీవితం - పెరుమాళ్ మురుగన్ 

ఈ కథ మూలం: ప్రసిద్ధి  తమిళ రచయిత పెరుమాళ్ మురుగన్ - అమ్మ. "A life bestowed by trees"  అనే శీర్షికతో కవితా మురళీధరన్ ఇంగ్లీష్ లోకి అనువదించారు. ఇంగ్లీషు నుండి తెలుగు లో అనువదించిన వారు - సునీతా రత్నాకరం 

ఒక మంచి కథను స్పూర్తికరమైన అమ్మ ను సాహితీ మిత్రులకు పరిచయం చేయాలనే ఉద్దేశ్యంతో

ఇప్పుడు ఈ కథను చదివి వినిపిస్తున్నది… వనజ తాతినేని 


 అమ్మ - చెట్లు ఉసురుపోసిన (ప్రసాదించిన)  జీవితం - పెరుమాళ్ మురుగన్ 


అమ్మ దగ్గర ఎప్పుడూ డబ్బులుండేవి. తన అవసరాలకి ఎప్పుడూ ఎవరిమీదా ఆధారపడేది కాదు. తన ఆరోగ్యం దెబ్బ తిన్నప్పుడు కూడా ఉన్న మేకల్ని, ఆవుల్ని అమ్మేసి ఇంట్లోనే ఉండిపోయింది. నేను నా కుటుంబంతో సహా నామక్కల్ కి మారినప్పటి నుంచి పొలంలో ఉన్న నా రెండు గదుల ఇల్లు ఖాళీగానే ఉంది. అమ్మని అందులో ఉండమన్నాం, కానీ నాకు అంత పెద్ద ఇల్లు ఎందుకని దానిని అద్దెకిచ్చేసింది. ఆ ఇంటి వెనక నా పుస్తకాలు పెట్టి ఉంచిన చిన్న అర లాంటి గది ఉంది. మట్టి పెంకులతో  కప్పు వేసిన ఆ చిన్న అర చాలు అనేది. 


నేను ఎప్పుడు డబ్బులు ఇవ్వాలని చూసినా అమ్మ అనే మాట ఒకటే 'నాకేం ఖర్చులుంటాయి?' అని.  బదులుగా నా పిల్లలు ఎప్పుడు మా ఊరు వెళ్లి వస్తున్నా తానే పదో, ఇరవయ్యో వాళ్ళ చేతిలో పెట్టేది. 


ఆ ఇంటి నుంచి వంద, నూట యాభై రూపాయల అద్దె వచ్చేది. ఆవిడ ఒక్కతే ఉన్నా ఆ కాసిన్ని డబ్బులెట్ల సరిపోతాయ్? అందుకే నేను అక్కడికి వెళ్ళినప్పుడల్లా కూరగాయలు, సరుకులు తీసుకెళ్ళేవాణ్ణి. 'ఇవన్నీ నాకెందుకు? నేనేం చేసుకుంటాను? నువ్వు డబ్బులన్నీ దుబారా చేస్తావేం? నాకేమైనా అవసరం వుంటే నేనే అడుగుతాను కదా' అని నన్ను కోప్పడేది. అప్పట్నుంచీ అమ్మకేం కావాలో ముందే అడిగి తీసుకెళ్లడం అలవాటు చేసుకున్నా. అమ్మా నీ ఖర్చులన్నీ ఎట్లా గడుస్తున్నాయ్  అని నేను ఆమెనడిగితే ఇంటి బయట చుట్టూ ఉన్న చెట్లని చూపించి, 'అవి ఇస్తాయి' అని చెప్పేది. మా అమ్మకి ఆ కొన్ని చెట్ల నుంచి వచ్చే ఆదాయం సరిపోయేది. 


పెళ్ళికి ముందు మా అమ్మకి పొలం పనులు ఏమీ తెలియవు, ఒకసారి నేర్చుకున్నాక ఆమె మొక్కని పెంచడం కూడా ఒక అందంతో చేసేది. అమ్మ అంట్లు తోమే జాలారు దగ్గర్లో ఒక మిరపచెట్టుని  ఎప్పుడూ పెంచేది. ఏడాది పొడుగూతా ఆమెక్కావాల్సిన మిరపకాయలు ఆ చెట్టే ఇచ్చేది. రెండు మూడేళ్లు వుండేది. ఆకుపచ్చటి గొడుగులాగా చూడటానికి కూడా కంటికింపుగా వుండేది. కొన్ని కాయలు పచ్చిగా కోసుకునేది, కొన్నిటిని చెట్టుమీదే పండనిచ్చి ఎండబెట్టేది. పది రోజులకోసారి పొరియల్ చెయ్యడానికి ఒకట్రెండు కలేపళ్ళ మొక్కలు సరిపొయ్యేవి. అమ్మ ప్రకృతిని ఉపయోగించుకునే పద్ధతి భలే ముచ్చటగా వుండేది. 


నామక్కళ్ లో మేముండే ఇంట్లో కూడా అమ్మ చెట్లు పెంచింది. ఒక ములగ చెట్టు, ఓ కరివేపాకు చెట్టు బయటి గోడ పక్కనే వేసి, డాబా ఎక్కితే వాటిని కోసుకొనేంత పెరిగేదాకా పెంచింది. మా ఇంటిముందు నాటిన గోరింటాకు మొక్క ఇప్పుడు పెద్ద పెద్ద కొమ్మలతో గోడంతా కమ్మేసింది. వాకిలి మొత్తం నింపేసే ఆ గోరింట వాసన తగిలినప్పుడల్లా అమ్మ, అమ్మతోపాటే ఆమె ఆ చెట్లను జాగ్రత్తగా పెంచుకున్న జ్ఞాపకం నాలో నిండిపోయేది.  


అమ్మ మా ఊళ్ళో పెంచిన చెట్ల ముచ్చట ఇంకా పెద్దది. ఇంట్లో, పొలంలో ఎన్నో చెట్లు పెట్టింది. ఒక్కో కరివేపాకు చెట్టు, మునగ చెట్టు, నిమ్మచెట్టు, జామచెట్టు, ఉసిరిచెట్టు, రెండేసి మామిడి చెట్లు, కొబ్బరి చెట్లు, దానిమ్మ, చింత చెట్లుండేవి. మొత్తం పదమూడు చెట్లు - మాకంత  గుర్తు. 


మా చింత చెట్లు ఓ మాదిరివి, చింతకాయలు పండి ఎండిపొయ్యాక కూడా వాటంతట అవి రాలేవు కావు, కర్రతో కొట్టి దులుపుకోవడమే. మా అమ్మ ఆ చింత పండు ని  'నరం చింత' అనేది, నరాల్లాగా చెట్టుకి అతుక్కుని ఒక పట్టాన రాలవని. ఒక్కో ఎండిన చింతకాయని జాగ్రత్తగా  రాల్చి, గింజ తీసేసి దాచేది. తనకోసం కొంత పక్కన పెట్టుకుని మా అన్నకూ, నాకు ఏడాదికి సరిపడా చింతపండు ఇచ్చేది. చింత చెట్టు పంటని ఎప్పుడూ అమ్మింది లేదు, మిగిలిన పదకొండు చెట్ల నుంచి వచ్చిందే అమ్మ ఆదాయం. 


మా చుట్టుపక్కల పెద్దగా కరివేపాకు చెట్లు ఉండేవి కావు, నీటి ఎద్దడితో పెంచడం కష్టమని ఎవరూ వేసేవాళ్ళు కాదు. మా దగ్గర కరివేపాకు ఎంత  అబ్బురంగా ఉండేదంటే ఎవరింట్లో అన్నా ఒక్కళ్ళే బిడ్డలు వుంటే వాళ్ళని లేత కరివేపాకు మొక్కతో పోల్చేవాళ్ళు. మా అమ్మ కరివేపాకు చెట్టు మొదట్లో ఓ కుండ పెట్టేది. పంపులో నీళ్లు వచ్చినప్పుడల్లా ఆ కుండ నింపి పెట్టేది. మేము కాళ్ళు, చేతులు అక్కడే కడిగేవాళ్ళం కాబట్టి ఆ చెట్టుకి వేరే నీళ్లు పొసే పనిలేదు. కొబ్బరి చెట్ల దగ్గరా అట్లాగే రెండు కుండలు పెట్టింది. అంట్లు అక్కడ కడిగేది  మళ్ళీ నీళ్లు పోసేపని లేకుండా. జామ, ఉసిరి చెట్లు అమ్మ వుండే చిన్న గది ముందే వుండి కావలసినంత నీడ ఇచ్చేవి ఇల్లూ, వాకిలికి, వాటికి మాత్రం అప్పుడప్పుడూ కాసిన్ని నీళ్లు పోస్తే సరిపొయ్యేది. 


దానిమ్మ చెట్లు ఇంటికీ రోడ్డుకి మధ్య ఉన్న కాలిబాటలో వుండేవి. నా భార్య ఈ దానిమ్మ గింజలు మొలకెత్తించి ఒక పాలిథిన్ సంచీలో పట్టుకెళ్లి అక్కడ నాటింది. ఆ చెట్టు బాగానే ఎదిగి పూలు, పిందెలు వచ్చేవి. పిందెలు కాస్తా కనపడగానే ఎక్కడినుంచో పురుగులొచ్చి వాటిని పాడు చేసేవి. అమ్మ ఆ పిందెల మీద బూడిద చల్లి పురుగుల్ని చంపాలని చూసేది కానీ, ఆ బూడిదని  అవి మంచిగ అరాయించుకునేవి. 


ఒకసారి అమ్మ ఇంటి చుట్టుపక్కల కనపడ్డ పాలిథిన్ సంచీలు పోగు చేసి ఆ దానిమ్మ కాయల చుట్టూరా జాగ్రత్తగా చుట్టి దారంతో కట్టేసింది. పురుగులు ఈ సంచీల్ని ఏమీ చేయలేకపోయాయి, అట్లా అమ్మకి అవి క్రిమి సంహారకాలుగా ఉపయోగపడ్డాయి. అప్పట్నుంచి అమ్మ ఆ చెట్టుమీద ఒక కన్ను వేసి ఉంచేది, కాయ కనపడగానే చిటుక్కున పాలిథిన్ సంచీ కట్టేది పురుగు దాన్ని చూసేలోపు. మా దానిమ్మ చెట్టుమీద పాలిథిన్ సంచీలు పెరుగుతున్నట్లు వుండేది అదాటున చూస్తే. అప్పుడప్పుడూ జాగ్రత్తగా ఆ సంచీలు విప్పి కాసేపు కాయకు గాలి తగలనిచ్చి మళ్ళీ కట్టేసేది. ఆ కాయ పూర్తిగా పండి సుళువుగా తెంపగలిగినప్పుడే వాటిని తెంపేది చెట్టుకి దెబ్బ తగలకుండా. మా పాలు పళ్ళు మేము తిన్నాక మిగిలినవి అమ్మితే బాగానే డబ్బు వచ్చేది వాటిమీద.  


అప్పుడప్పుడూ వచ్చే వానలు గోరింటాకు చెట్టునీ, మునగ చెట్టునీ పోషించేవి. గోరింటాకుని ప్రత్యేకం కొనేవాళ్ళు ఉండరు, అందుకే వేరేవి ఏమైనా కొంటున్నప్పుడు వాళ్ళు గోరింటాకు తెంపుకోవచ్చు. మునగచెట్టు మాత్రం ఏడాది పొడుగునా ఏదోకటి ఇచ్చేది. మునగాకు ఎప్పుడూ వుండేది, కాలంలో మునక్కాయలు కాసేవి. మునగచెట్టు మహా పెళుసు, అందుకే ఆ చెట్టుని ఎవ్వరినీ పట్టుకొనిచ్చేది కాదు, అమ్మే చులాగ్గా చెట్టు కందకుండా ములక్కాయలు కోసే విద్య నేర్చుకుంది. ఎప్పుడైనా గాలి విసురుకి ఓ కొమ్మ విరిగిపోతే చెయ్యి విరిగినంత పనయ్యేది అమ్మకి. మునగచెట్టుకి పసిపిల్లలంత సుకుమారపు అవసరాలుండేవి, అమ్మ ఆ చెట్టుని అంత సుకుమారంగానే చూసుకునేది. మా మావిడిచెట్లు ఇంటి నుంచి కాస్త దూరంగా పొలంలో వుండేవి. ఆ రెండు చెట్లకి పైపుతో నీళ్లు పెట్టేది. చెట్లనుంచి వచ్చే వస్తువేదీ అమ్మ వృధా పోనిచ్చేది కాదు. అమ్మ బజారుకి ఎప్పుడూ ఉత్త చేతులతో బయలుదేరేది కాదు, రెండు మూడు కట్టల కరివేపాకు, మునగాకో, ఏ కూరగాయలో సంచీలో వేసుకునేది. దారిలో ఉన్న ఇళ్లలో వాటి అమ్మకం అయిపోయేది. చుట్టుపక్కల పిల్లలు జామకాయలు, ఉసిరికాయల కోసం వచ్చేవాళ్ళు, అవి అమ్మకి అందే ఎత్తులో వుండవు కాబట్టి ఆ పిల్లల్ని కోసుకోనిచ్చి వాళ్ళిచ్చిన డబ్బు తీసుకునేది. మామిడిపళ్ళ కాలం వస్తే  మాత్రం పొద్దంతా ఆ చెట్లకి మా అమ్మ కావిలి వుండేది. ఆ చెట్ల దరిదాపుల్లో ఒక నీడ తచ్చాడినా 'ఎవరక్కడ?' అని అరుస్తుండేది. 


మా ఇంటికెప్పుడైనా వచ్చి తిరిగి వెళ్ళేటప్పుడు ఎక్కువగా ఉన్న మునగాకో, మునక్కాయలో తప్పకుండా కోసుకుని సంచీలో వేసుకునేది, వెళుతూ వెళుతూ వాటిని అమ్మేసి సంచీ ఖాళీ చేసుకునేది, ఎక్కడా వస్తువు దుబారా కావద్దు అమ్మ లెక్కలో. 


అమ్మ కంటపడకుండా ఒక్క పసి పిందె అయినా తప్పించుకునే ప్రసక్తి లేదు. ఇంక  మామిడిపళ్ళ కాలంలో అయితే మేము ఎంత బతిమిలాడినా ఊరునుంచి కదిలేది కాదు. తప్పక రావాల్సిన పరిస్థితి వస్తే సాయంత్రంగా వచ్చి మళ్ళీ పొద్దున్నే ఇంటికి చేరేది. మేము కనుక వేసవిలో ఊరికి వెళితే వెంటనే చెట్ల దగ్గరికెళ్లి రెండు పండిన కాయలు తెంపుకొచ్చేది. ఆ పళ్ళు మా చేతికిస్తూ 'మీరొస్తున్నారని చెట్టుమీదే వుండనిచ్చా' అని చెప్పేది ఎక్కువ రోజులు ఉండనిచ్చినందుకు చెట్టు తనకేదో అనుమతి ఇవ్వాలన్నట్టు. మాకు ఎప్పుడూ బాగా మగ్గిన జామకాయలు, చక్కగా పండిన ఉసిరికాయలు దొరికేవి. అమ్మకి ఆ చెట్ల అణువణువూ తెలుసు. 


మామిడిపళ్ళ కాలంలో అమ్మ ఆదాయం బాగా వుండేది. కొబ్బరికాయలు కూడా అమ్మేది. అమ్మకి ఎంత ఆదాయం వచ్చేది ఇవన్నీ అమ్మితే? మహా అయితే కొన్ని వందలు. మూడొందల రూపాయలు మహా బాగా సరిపోతాయి అనేది, ఇంకా కొంత డబ్బు దాచేది కూడా. నా అంచనా అయితే ఇంటద్దెతో కలిపి ఒక అయిదొందలు వస్తాయి నెలకి. అందులోనే బియ్యం, ఉప్పులు, పప్పులు, కూరలు గడిపేది అమ్మ. 


నాకు మంచి జీతం వచ్చే గవర్నమెంటు ఉద్యోగమని అమ్మకి తెలుసు. అమ్మ అవసరాలు నేను చూసుకోగలననే నమ్మకం, తాను ఒప్పుకుంటే చూసుకుంటాననే  గర్వం ఉన్నాయి ఆమెకు. అప్పట్లో మా ఊళ్ళో ముసలివాళ్లైన తల్లిదండ్రుల్ని తిండికి కూడా సరిగా లేకుండా తిప్పలుపెట్టిన పిల్లల కథలేమీ తక్కువలేవు. మన దగ్గర పిల్లలు కావాలనుకునేదే ముసలితనంలో ఆసరాగా ఉంటారని. చిన్నప్పటినుంచీ 'పెద్దయ్యాక మీ అమ్మా నాన్నల్ని చూసుకోవా?' అన్న మాటల్ని నూరిపోస్తూనే వుంటారు. అయినా తల్లిదండ్రుల్ని గాలికి వదిలేసే పిల్లలు వుంటూనే  ఉన్నారు. అమ్మకీ మొదట్లో ఈ భయం వుండేది, కానీ నా చేతలతో ఆమెకి గట్టి నమ్మకం కలిగింది తనకా గతి పట్టదని. 


ఎవరైనా అమ్మని నిన్ను వాడు చూసుకుంటాడా అని అడిగితే, 'వాడెప్పుడైనా నేను అడిగింది ఇవ్వనన్నాడా? కట్టలకొద్దీ నోట్లు ఇవ్వబోతాడు, నేనే వద్దంటాను. నన్ను చూడటానికి ఎప్పుడైనా ఉత్త చేతులతో వస్తాడా? సంచీల నిండా ఏవొకటి నింపుకువస్తాడు. ఇక్కడేమైనా పిల్లలున్నారా అవి తినడానికి? అందుకే వాడిని అవేవీ తేవద్దంటాను. నా ఒక్కదానికి గడవడానికి ఈ చెట్లు చాలవా?' అంటుంది. 


అమ్మకి పార్కిన్సన్స్ జబ్బు చేశాక ఎనిమిదేళ్లు బతికింది. ఆమె ఇష్టం మీద హోమియోపతీ మందులు వాడినా, అల్లోపతీ మందు కూడా వేసుకునేది. రోజుకో మాత్ర, అది ఖరీదైనదే. ఎక్కువ ధర అని తెలిస్తే వాటిని వద్దంటుందన్న భయానికి నేను అవి చవకేనని చెప్పా. ప్రతీ నెలా మర్చిపోకుండా ఆ మాత్రలు కొనిచ్చేవాణ్ణి. ఊళ్ళో ఎవరైనా 'నువ్వు నీ కొడుకుని చదివించావ్, వాడు నిన్ను సరిగ్గా చూసుకుంటున్నాడా?'అని అడిగితే అమ్మ 'మీకు కళ్ళు కనబడట్లేదా, నెలనెలా ఎన్నెన్ని మాత్రలు తెచ్చి పోస్తున్నాడు? వాటికీ ఎంత ఖర్చవుతుందో ఎప్పుడైనా చెప్పాడా? అవి వెయ్యో రెండువేలో నీకేమైనా తెలుసా?' అని పోట్లాడేది. 


ఆ చెట్లు అమ్మకి ఆదాయం ఇవ్వడమే కాక ఇంకో పెద్ద మేలు చేసాయి. 


నేనెప్పుడూ ఊరికి వెళ్లినా అమ్మ ఏ చెట్టు కిందో కూర్చొనో, నిలబడో వుండేది. మా ఇల్లు పొలాల్లో వుండటంచేత ఒంటరిగా వుండేది. మిగిలిన ఇళ్ళు కూతవేటు దూరంలో వుండేవి కానీ, యింటి ముందు అటూ ఇటూ జనాలు తిరిగేవాళ్లు కాదు. ఎప్పుడైనా జనాలు ఇటు వచ్చినా ఒకట్రెండు మాటలంతసేపు కనపడేవాళ్లు. ఎవరి పని వాళ్ళకుండేది. అమ్మకి చెట్లతోనే సావాసం. వాటితో మాట్లాడేది. వాటితో పాటు అమ్మ ఒక చెట్టు, అట్లా కలిసిపోయేది. వాటిలో వచ్చే చిన్న మార్పైనా అమ్మ పసిగట్టేది. ఏ చెట్టు మీద ఎన్ని పిందెలున్నాయి, ఎన్ని పండ్లున్నాయి, ఎన్ని కాయలున్నాయి, అవి ఎన్నాళ్ళలో పండుతాయి, అన్నీ అమ్మకి తెలుసు. ఏ పనిలో ఉన్నా వాటివైపు ఓ చెవి వేసి వుంచేది. అమ్మకు కొన్నేళ్లు ఎక్కువ ఆయుష్షు పోసింది ఖాయంగా ఆ చెట్లే. 


రెండేళ్లపాటు వర్షాలు లేవు మా ప్రాంతంలో. బోరింగులో నీళ్లు అడుగంటిపోయాయి. ఆ చెట్లని కాపాడానికి అమ్మ ఎన్నో తిప్పలు పడ్డది. పార్కిన్సన్స్ వల్ల కాళ్లు చేతులు సరిగ్గా చాపగలిగేది కాదు, బరువులు పట్టుకునే శక్తి వుండేది కాదు. ఇంటి దగ్గర ఉన్న చెట్లకి పెద్ద బాధ లేదు కానీ మామిడి చెట్లు వడలిపోవడం మొదలైంది. వాటిని కాపాడుకోవాలని అమ్మకు ఎంత ప్రాణంగా ఉండేదంటే పిల్లలు ఆడుకునే రెండు గురుగుముంతలు కొనుక్కొచ్చింది. వాటిలో నీళ్లు నింపుకుని ఆ చెట్ల దగ్గరికి బయల్దేరేది. ఆ కాస్త దూరానికి ఒకటిరెండుసార్లు మధ్యలో ఆగి ఊపిరి పీల్చుకుంటేగానీ నడవగలిగేది కాదు. అట్లా ప్రతీరోజూ కాసిన్ని నీళ్ళని పోసి ఆ చెట్లని మళ్ళీ జీవం పుంజుకునేలా చేసింది.  


మేము అమ్మని చూసేందుకు వెళ్ళినప్పుడు ఆమె అడిగేది ఒక్కటే 'ఆ మామిడి చెట్లకి ఒక కుండెడు నీళ్లు పోసిపొమ్మని'. అమ్మ దగ్గరికి ఏదైనా కొనడానికి వచ్చినవాళ్ళనీ ఆ మాటే అడిగేది. రెండేళ్లపాటు ఆ మామిడిచెట్లు పూత పుయ్యలేదు. కానీ అమ్మ పంతంతో బతికించింది. మూడో ఏడాది కొంచెం వర్షాలు పడ్డాయి, మామిడిచెట్లు మళ్ళీ పూత పూసి కాయలు కాసాయి, అమ్మ సంబరానికి అంతులేదు. 


అమ్మ చివరి యేడాది  భారంగా గడిచింది. ఆవిడ ఆరోగ్యం బాగా దెబ్బతినడంతో మా ఇంటికి తీసుకువచ్చాం. ఊర్నుంచి అమ్మని చూడటానికి ఎవరైనా వస్తే ముందు చెట్ల గురించే వాకబు చేసేది. మేము కూడా ఊరికి వెళ్ళినప్పుడల్లా తప్పనిసరిగా నీళ్లు పోయడం అలవాటు చేసుకున్నాం. ఎప్పుడైనా అమ్మ ఆరోగ్యం కాస్త మెరుగైతే తనను బస్సు ఎక్కించేదాకా ఊరుకునేది కాదు. ఆ చెట్లకి ఆ గురిగిముంతలతో నీళ్లు పోస్తూ కనీసం వారమన్నా అక్కడ వుండేది. ఆ చెట్లని చూసుకోవడానికి ఎవరూ లేరని అమ్మ చాలా దిగులుపడేది. 


అమ్మ చివరి ఆరు నెలల్లో మా ఊరికి వెళ్లలేకపోయింది. మేము వెళ్ళినప్పుడల్లా ఆ చెట్లకి నీళ్లు పోస్తూనే ఉన్నాం. మేం చెయ్యగలిగింది అంతే. పాతిక మైళ్ళ దూరంలో ఉన్న చెట్లకి నెలకోసారికన్నా ఎక్కువ వెళ్లి నీళ్లు పొయ్యలేకపోయాం. అమ్మ కడతేరి పోయాక కొన్ని నెలలపాటు మా ఊరికి వెళ్లలేకపోయాం. అమ్మ వస్తువులు తీసుకురావడానికి నేను వెళ్ళినప్పుడు ఆ మామిడి చెట్లని ఒకసారి  చూడాలనుకున్నాను. చెప్పడానికేముంది? రెండు చెట్లూ ఎండిపోయి మొద్దుల్లా నిలబడ్డాయి. అనాధ పిల్లల్లా! 


---------------- సేకరణ*************** ఈ కథ పోస్ట్ చేయడం పై అభ్యంతరం వుంటే లేదా copy right వుంటే గనుక తెలియజేయండి. తొలగించగలను. మంచి కథను పాఠకులకు అందించడమే నా ఉద్దేశ్యం అని మనవి చేస్తూ..


ఈ కథ  చదువుతూ వుంటే.. ఆవిడ.. ఒక దృఢమైన వ్యక్తిత్వం ఉన్న అమ్మ  అనిపించింది, చాలా మంది అమ్మల్లాగే వుంది కూడా!  విజయవంతమైన  అనేదానికన్నా ఆటుపోట్లు తట్టుకునే నిబ్బరం ఉన్న ప్రతి స్త్రీ పురుషుల వెనుక గట్టిగా నిలబడ్డ అమ్మ  మాత్రం కచ్చితంగా వుంటుందని అనిపిస్తుంది.  అమ్మ కు 🙏




19, మార్చి 2025, బుధవారం

నీలవేణి

  పాత్రలను రచయితలు చిత్రీకరిస్తూ తాము గిరి గీసి వున్న చోటనే కూర్చోబెడతారు. కొన్ని పాత్రలు మొదలుపెట్టే వరకే రచయిత పని. తర్వాత ఆ పాత్రలు రచయిత మాట వినవు. నేను రాసిన కథల్లో నీలవేణి పాత్ర ను నేను ఒక ఆశయానికి తగినట్లు గా చిత్రించదలిచాను. కానీ చాలాసార్లు ఆ పాత్ర ఎదురుతిరిగింది. పాత్ర స్వభావాన్ని బట్టి నేను అనుగుణంగా రాసాను. ఎడిటర్ స్థాయి లో వున్న వారికి ఆ పాత్ర నడక నచ్చలేదు. ఎందుకంటే వారు పాత్రలకు స్వేచ్ఛను ఇవ్వరు. బెత్తంతో బెదిరిస్తూ తాము అనుకున్న పరిధి లో customize  చేసుకుని కుంచింపజేస్తారు. నేను కథ రాసే టప్పుడే ఎదురు తిరిగిన నీలవేణి తన పాత్రను ముక్కలు ముక్కలుగా నరికి రూపం మార్చేస్తే వూరుకుంటుందా!? సంపాదకులతో విభేదించాను. అందుకే ఆ పాత్ర నడకను పాత్ర కోరినట్టు నడిపించాను. 

గొప్ప వ్యక్తిత్వం కలిగిన నీలవేణి కూడా పైకి ద్వేషిస్తూనే అంతర్లీనంగా శేఖర్ రెడ్డిని ఆరాధించింది.  మనసు చంపుకోలేని బలహీనత తో   అతనికి తన జీవితం లో చోటు ఇచ్చింది. 

కథల్లో నవలల్లో పాత్రలు బలహీనంగా వుండకూడదు అంటే ఎట్లా!?  పాత్రలను customize చేసినట్లు రూపొందించాలి కదా అనే ఆలోచన మార్చుకోవాలి.  నేను రాసిన పూర్తి కథ “దీప వృక్షం “ ఈ లింక్ లో వుంది. 

“స్వయంసిద్ధ” లో వున్న కథ నేను రాసిన “దీప వృక్షం “ కథ కాదు. ఆ కథ నాకు నచ్చలేదు. ఈ కథ .. ఒరిజనల్ కథ. ఆసక్తి వుంటే వినండీ.. ఈ లింక్ లో.. 




16, మార్చి 2025, ఆదివారం

బేగంపేట ప్యాలెస్ ప్రక్కన

 చదువులు ఉద్యోగ అవకాశాలు - ఆర్థిక పరిస్థితులు వ్యత్యాసాలు ధోరణులు మనస్తత్వాలు నకిలీ గౌరవాలు అహంకారాలు గురించి లోతుగా చర్చించిన కథ. నా కథల్లో నాకు నచ్చిన కథ.... 

ఇంతకీ బేగంపేట ప్యాలెస్ ప్రక్కన ఏముందో! 

తప్పకుండా వినండీ. 



8, మార్చి 2025, శనివారం

నువ్వు నేను -కనకాంబరం

 నువ్వూ నేనూ - ఓ కనకాంబరం 


వివాహిత స్త్రీ విడాకులు కోరుకుంటే  అదీ..  ఓ బిడ్డ తల్లి  కోరుకుంటే లభించడం అంత సాధ్యమేనా!? 

ఈ కథ లో సావేరి జీవితం ఏమైంది? 

పిడికెడంత ప్రేమ కోసమో ఆకర్షణ తోనో అవసరాల దృష్ట్యానో మరొక పురుషుడికి దగ్గరై.. అతనితో జీవితం కొనసాగించడానికి నిర్ణయించుకుంటే అది సాధ్యం అవుతుందా? 

టాల్ స్టాయ్ అన్నాకెరనినా, చలం రాజేశ్వరి విశ్వనాథ రత్నావళి నామిని కొనమ్మి ఇలా సాహిత్యంలో ఎందరో స్త్రీలు ప్రేమ నాశించి భర్తను వదిలి ఇల్లు విడిచారు. అలాంటి స్త్రీలు ఏ కాలంలో నైనా తారసపడతారు. వారు చివరకు ఏమయ్యారు? 

ఈ కథ లో సావేరి జీవితం ఏమైంది?  ఆమె కు శత్రువులు ఎవరు!? ఆమెను కోరుకున్న అతని జీవితం ఏమైంది..? భర్త నుండి ఆమె విడుదలకి నోచుకుందా? విడాకులు లభించాయా? కథ పూర్తిగా వినండి. 



7, మార్చి 2025, శుక్రవారం

భారతం బొమ్మలు

 1999 అక్టోబర్ లో రెండు భాగాలుగా వార్తా పత్రిక ఆదివారం సంచిక లో ప్రచురితమైన “భారతం బొమ్మలు “ గోపిని కరుణాకర్ రచన. 


అసలు కథ చెప్పడానికి కొసరు కథ తో ప్రారంభించి అసలు కథ ఏ విధంగా ముగిసి ఉంటుందో అన్న ఆలోచన ఆసక్తి ని  పాఠకులకు కలిగించిన ఈ కథ కాలమానం.. దాదాపు వందేళ్ళ క్రితం ది అని రచయిత చెప్పినదాన్ని బట్టి తెలుస్తుంది. ఈ రచయిత  చిత్తూరు మాండలికంలో రాసిన కథలు అన్నీ గ్రామీణ నేపథ్యం లోనే ఉంటాయి. కథనం అంతా  కవితాత్మకంగానే సాగుతుంది. ముఖ్యంగా ప్రతీకాత్మకంగా వుండే వర్ణన.  కరుణాకర్ కథలు తెలుగు పాఠకులకు బాగా పరిచయం. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మేజిక్ రియలిజం లో కథలు రాయడం అంటే ఏమిటో కరుణాకర్ కథలు చదివే అర్థం చేసుకున్నాను.  వర్ధమాన రచయితలకు ఈ కథలు చదవాలి అని సూచించాను కూడా! కరుణాకర్ కథల్లో చాలా కథలు నాకిష్టమైన కథలు. అబ్బ! ఎంత బాగా రాశారు అనుకుంటాను. కథల్లో వర్ణనలని ఉపమానాలునూ నేను ఎక్కువగా ఇష్టపడతాను. ఈ కథలో ఇలాంటివి అనేకం ఉన్నాయి. ఇతివృత్తం సామాజికత  ప్రయోజనం సందేశం వీటి  సంగతి వదిలేసి ఫిక్షన్ కథలను ఫిక్షన్ కథలు గానే ఎంజాయ్ చేయాలంటే.. ఈ కథలు చదువుతూ వుంటాను. ఈ కథ గురించి నేను చెప్పడం కన్నా విని చూడండి లేదా చదవండీ.. 



5, మార్చి 2025, బుధవారం

లిహాఫ్

 లిహాఫ్ -ఇస్మత్ చుగ్తాయ్.  1941 లో రాసిన ఈ కథ అశ్లీలంగా వుందని బ్రిటీష్ ప్రభుత్వం కేసు పెట్టింది అంట. ఈ కథ ఆంగ్లంలో అనువాదం అయి ప్రచురణ లోకి వచ్చినప్పుడు అనేకులు రచయిత్రిని దుమ్మెత్తి పోశారంట. అయినా రచయిత్రి జంకలేదు. రచయిత్రి కి అపఖ్యాతి వచ్చింది. కాలక్రమేణా ఈ కథను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం జరిగింది. ఇంతకీ ఈ కథలో ఏముంది అంటే.. స్వలింగసంపర్కం గల ఇద్దరు స్త్రీల గురించిన కథ ను ఒక చిన్న పిల్ల తన దృష్టి కోణంలో  ఉత్తమ పురుష లో చెప్పిన కథ ఇది.  ఈనాటికి ఈ కథ గురించి చర్చించడానికి చాలామందికి ఇష్టం వుండదు. 

ఈ కథ ఉర్దూ ఆంగ్లంలో నూ తెలుగులోనూ వుంది. తెలుగులో పి.సత్యవతి గారూ కిరణ్మయి గారూ అనువదించారు. ఇప్పుడు ఈ కథను నేను చదివి వినిపించాను. LGBTQ రైట్స్ లీగల్ అయిన మన దేశంలో కూడా  ఈ కథలు అబద్దం కాదు..అసహ్యం కాదు. కథ ఎంత మార్మికత తో చెప్పారో రచయిత. అందుకోసమైనా చదవండి వినండీ. “The Quilt” అనే పేరుతో ఆంగ్లంలో “లిహాఫ్” పేరిట ఉర్దూ లో “పట్టుబొంత” పేరుతో తెలుగులో వుంది కథ. 

అనువాదకులకు ధన్యవాదాలు. 



2, మార్చి 2025, ఆదివారం

మాతృత్వానికి మరోముడి

 రచయిత: వి.విజయలక్ష్మి 



అసలే… మూడో ఆడపిల్ల. ఆ పిల్ల పుట్టగానే తండ్రి కి ఉద్యోగం పోయింది. తాత చనిపోయాడు. పైగా ఆ పిల్లకు ఎప్పుడూ అనారోగ్యం. పోలియో ఎటాక్. ఆ పిల్ల మూగ చెముడు కూడా! అనారోగ్యంతో అప్పుడే కాసేపు అన్నట్టు వున్న పిల్లను కాశీలో గంగ వడ్డున వదిలేసి వస్తాడు తండ్రి. ఆహారం కోసం వెదుకుతున్న గద్దకు ఈ పిల్ల కనిపించింది. ఒక కన్ను ను పొడుస్తుంది. 

ఆ తర్వాత ఏం జరిగింది!? పన్నెండేళ్ల తర్వాత ఒక స్త్రీ ఆ పిల్లను చూడటానికి వస్తుంది.. ఈ మధ్య కాలంలో ఏం జరిగిందో !? కథ వినండీ.. నిజంగానే విభిన్నమైన కథ ఇది. తప్పకుండా వినండీ . 

మాతృత్వానికి మరోముడి - వి. విజయలక్ష్మి కథ వినండీ . ఒక మంచి కథ తప్పకుండా వినండీ. 




21, ఫిబ్రవరి 2025, శుక్రవారం

గెలుపు తలుపు మూయక ముందే

గెలుపు తలుపు మూయక ముందే - రేణుక అయోల గారి కథ పై నా స్పందన.. అభిప్రాయం ఏంటంటే.. 

ప్రతి మనిషికి కొన్ని ఇష్టాలు ఉంటాయి. ఆ విషయాల్లో తనకు పూర్తి స్వేచ్ఛ కావాలని కోరుకుంటారు. 

అవి .. 

దైవారాధనకు సంబంధించినవి

ఆహారానికి సంబంధించినవి కొన్ని. 

వస్త్రధారణ కు అలంకరణకు సంబంధించినవి. 

వీటి విషయంలో ఎవరి ప్రమేయాన్ని వారు భరించలేరు. నేను కూడా అంతే! నాకెవరైనా ఇలా వుండు అలా వుండు ఇది తిను అది తిను.. ఆ గుడికి వెళ్ళు.. ఆ దైవాన్ని నమ్ముకో అని చెపితే వారి వైపు నిరసనగా చూస్తాను. కోపం వస్తుంది కానీ సున్నితంగా బలవంతం చేయవద్దు అని చెప్తాను. బాగా దగ్గర వారైతే రెండు మూడు సార్లు చెబుతారు. తర్వాత మౌనం వహిస్తారు. 

అలాగే ఎవరి విషయంలో కూడా నేనూ జోక్యం చేసుకోను. 

 వ్యక్తి స్వేచ్ఛ ను ప్రాథమిక హక్కులను ఎవరైనా గౌరవించాలి. తమ ఇష్టా ఇష్టాలను ఇతరుల కోసం త్యాగం చేయడంలో స్త్రీలు ముందుంటారు. ఈ కథలో అనిత తన ఇష్టాన్ని తాను కోల్పోలేదు. భర్త కోసం త్యాగం చేయలేదు.  తనపై తాను గెలుపు సాధించింది. భర్త తన గెలుపు తలుపు మూయక ముందే మేల్కొంది. కథ ఈ కోణంలో నాకు నచ్చింది. రేణుక గారూ.. మీకు అభినందనలు. సెన్సిటివ్ కోణంలో మీరు కథ బాగ రాసారు. భార్య తమ ఆకాంక్షలకు అనుగుణంగా లేనప్పుడు.. భర్త మరొక స్త్రీ లో వెతుక్కోవడం అనేది లోకంలో సాధారణమైన విషయం. భార్య తనకున్న స్వేచ్ఛను కోల్పోకుండా తనదైన వ్యక్తిత్వం తో  మనగల్గేటప్పుడు.. 

భర్త ఊహల్లో ఆలోచల్లో  తన ఊహసుందరి నయనతార  బతికేవుంటుంది. 

**********

ప్రతి మనిషికి  బాల్యం నుండి ఏదో ఒక ఫాంటసీ వుంటుంది. పెరిగి పెద్దయ్యాక వివాహమయ్యాక కూడా తమ జీవిత భాగస్వామి పట్ల కూడా అనేక ఫాంటసీలు వుంటాయి. వారి ఆశలకు ఆకాంక్షలకు అనుగుణంగా జీవితాన్ని కొనసాగించడానికి అనేక ఆటంకాలు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా భార్య/భర్త పట్ల అనేక ఊహలు ఉంటాయి. కానీ విరుద్ధంగా వారి భాగస్వామి కనబడితే వారికి లోలోపల దాగిన ఫాంటసీల గురించే ఆలోచిస్తారు. అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉంటారు. 

అందులో పితృస్వామ్య భావజాలం ఉన్న పురుషులు తన భార్య తనకు అనుకూలంగా ఉండాలని తన అభిరుచుల మేరకు అలంకరించుకోవాలని తనకు ఇష్టమైనవి వండి వడ్డించాలని కోరుకుంటాడు. 

ఈ కథలో భర్త మరీ అంత మూర్ఖత్వం కలిగి ఉండడు. నిజానికి వారిద్దరి జీవితం మేడ్ ఫర్ ఈచ్ అదర్. అతను కూడా సంస్కారవంతుడు. భార్య స్వేచ్ఛ ను గౌరవిస్తాడు. తనకు నచ్చిన విధంగా అలంకరించుకోమని అడగటానికి మొహమాట పడతాడు. అతని ఊహలకు తగినవిధంగా వున్న వొక స్త్రీ ని చూసి ఆకర్షణలో పడతాడు కానీ సభ్యతను మర్చిపోడు. పరిచయాన్ని పెంచుకోవడం కూడా వుండదు. అతని పర్సనల్ డైరీ లో రోజుకొక పేజీ కేటాయించి ఆమె గురించి రాసుకుంటాడు. అది భార్య అనిత చూస్తుంది. .. తర్వాత ఏమైందో కథ విని తెలుసుకోండి. 


ఈ కథ “కొత్త చూపు” జ్వలిత సంపాదకత్వంలో వచ్చిన కథా సంకలనం లో కథ. వీలైతే చదవండి.

16, ఫిబ్రవరి 2025, ఆదివారం

నువ్వూ నేనూ - ఓ ప్రేమ



 నువ్వూ నేనూ - ఓ ప్రేమ -వనజ తాతినేని 


శ్రీకాంత్.. నేనో విషాద సంగీతం


పాషాణంగా మార్చిన హృదయాన్ని కూడా బద్దలు కొట్టే ఆయుధం ప్రేమ అని నా ప్రగాఢ విశ్వాసం. ఆ కలల్లోనే జీవించాను. కల చెదిరింది కథ మారింది. 


కలే కన్నాను లే.. అని హమ్ చేసుకుంటూ బయటకొచ్చాను.అది అమ్మ నివసించే ఇల్లు. నాన్న ప్రేమగా తన ప్రియురాలికి కట్టించి ఇచ్చిన ప్రేమ మందిరం. ఇప్పుడది నా ప్రేమ మందిరం. నాన్న తన కొడుకులతో గడపడానికి భార్యతో కలిసి ఫారిన్ ట్రిప్ లో. అమ్మ పుట్టింటి బంధువుల ఇంటికి కలకత్తా నగరానికి. 


మిట్ట మధ్యాహ్నానికి కాస్త ముందు తోటంతా  వెలుగుతోంది. 

పూలన్నీ బృందగానం చేస్తున్నాయి. తుమ్మెదలు సీతాకోక చిలుకలు తికమక పడుతూ ఎంగిలి విందులో మునిగి తేలుతున్నాయి. రెండు కదంబ వృక్షాల మధ్య వేసిన సిమెంట్ బెంచీ పై కూర్చుని వుంది సావేరి. ఆమె పక్కగా పచ్చని చెట్ల నీడన పర్ణశాల లాంటి కుటీరం. లోపల కట్టిన చీర ఉయ్యాలలో పాపాయి నిద్రపోతోంది.


నల్లంచు పసుపు పచ్చని బెంగాల్ కాటన్ చీర పసుపుపచ్చ అంచు వున్న నల్ల హై నెక్ బ్లౌజ్ విరబోసిన కేశాలు  పచ్చికపై  జీరాడుతూ. అచ్చం  వనలతాసేన్ లా  వుంది. ఒడిలో పుస్తకమైతే వుంది కానీ.. చూపులు నదిలో కదులుతున్న పడవపై.


 వెనుక నుండి చప్పుడు కాకుండా వచ్చి భుజాలపై చేతులు వేసాను. ఆమె కనులు తిప్పి నన్ను 

చూసి నవ్వింది. ఆమె గడ్డం కింద చేతులుంచి పద్మం లాంటి ముఖాన్ని వెనక్కి వంచి నుదుటిపై ఓ ముద్దిచ్చాను.


“ఈ చీరలో ఎంత బాగున్నావో తెలుసా! అచ్చం బెంగాలీ వనిత లా. అమ్మ నిన్నిలా చూస్తే సంతోషిస్తుంది. ఆమె చీర ల్లో నుంచి ఈ సరికొత్త చీరను తీసి నీకు బహుమతిగా ఇమ్మని అమ్మ చెప్పిందిలే! 


“అత్తయ్య అంగీకరించారా!?” ఆత్రుతగా అడిగింది.


“ ఊ…శ్రీ ..నువ్వు పాప ని కూడా అంగీకరించాలి, తల్లి బిడ్డ లను వేరు చేయవద్దని ఆజ్ఞాపించింది కూడా!”


“ వారితో మాట్లాడతాను నేను” సంభ్రమంగా అంది.


“ ఉహూ, ఇప్పుడు కాదు, రాజమండ్రి దాకా వెళ్ళొద్దామా,రికార్డింగ్ స్టూడియో కి కావాల్సిన ఎక్విప్మెంట్ ఆర్డర్ పెట్టి ఎయిర్ నెట్ లోకి మార్పించుకుని వచ్చేద్దాం” 


“పాపాయి నిద్రపోతుంది కదా శ్రీ! నువ్వెళ్లి వచ్చేయ్! ఈ లోపు నేను వంట చేసేస్తాను” 


అంతే! నేను ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇల్లు ఖాళీ. సగంలో ఆపేసిన వంట. తీగపై ఆరేసిన బట్టలుతో సహా ఎక్కడివి అక్కడే. గేటు ముందు కారు టైర్ల గుర్తులు. 


ఏటి ఒడ్డుకు వెళ్ళి చూపులతో గాలించసాగాను.  బల్లకట్టు నరసింహ చెప్పాడు. మీ ఇల్లు వెతుక్కుంటూ రెండు కార్లలో మనుషులు వచ్చారయ్యా!. ఆమెను చిన్నబిడ్డను ఎక్కించుకుని వెళ్లిపోయారు అని. ఊహిస్తూనే వున్నాడు తను. జరిగిపోయిందలాగే! సావేరి కి కాల్ చేసాను. వాయిస్ మెయిల్ కి వెళుతుంది కాల్. 


రెండు రోజులుగా పది నిమిషాలకు ఒకసారి కాల్ చేస్తూనే వున్నాను. అందుబాటులో లేదని నెట్ వర్క్ సమాచారం. నేను ఎక్కడ వెతకాలి, వైజాగ్ లోనా హైదరాబాద్ లోనా!? 

 

“ఎక్కడున్నావు సావేరీ!  నాకు దూరంగా! నువ్వెక్కడ వున్నా, నా లోపల నువ్వు అత్యంత స్పష్టతతో ఉన్నావు”  


కంటికెదురుగా  పోర్టబుల్ రేడియో.  నెలల పర్యంతం మూగబోయిన రేడియో ని ఆత్రుతగా పెట్టి చూసాను.  ఆమె గొంతు వినిపిస్తుందేమోనని. తన పిచ్చి కానీ ఇంతలోనే అక్కడికెలా వెళ్ళగలదూ?  లేదు. కాలాన్ని వెనక్కి తిప్పి పరిచయ ప్రారంభంలో ఆగాడు.


మొదటిసారి  రేడియోలో సావేరి గొంతు విన్నప్పుడు “ఈమెలో  నిండైన ఆడతనం ధ్వనిస్తుంది” అనుకున్నాడు.  మరొకసారి “నేను దేవత ను చూడలేదు కానీ, ఆ స్వరాన్ని విన్నాను” అనుకున్నాడు.


కొన్నాళ్ళుగా వింటూనే వున్నాడు. నా అన్వేషణ పూర్తైంది. తుదకు నేను ఆగిపోవాల్సిన చోటు  లంగరు వేసుకోవాల్సిన తీరం ఆమె నని దృఢపరుచుకున్నాను. అందుకు నా దగ్గర రీజన్ వుంది.   జీవితానికి కావల్సిన వస్తువు వొక్కసారే లభిస్తుంది. అది ఏమిటన్నది మనస్సు గట్టిగా చెబుతుంది. అది మన పక్క నుంచి వెళుతున్నప్పుడు యదాలాపంగా చూసి  అది జార విడుచుకున్నామా మళ్ళీ మరొకటి అలాంటి వస్తువు దొరకనే దొరకదు అని. 


సావేరి ని   కళ్ళారా చూసిన తర్వాత మరింత విశాలం అయ్యాను. స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ ప్రాధమిక సత్యం. ఆకర్షణ ను మించి ఆమె నాకొక విభ్రాంతి.  నా జీవితంలోకి  తను యెలా చొచ్చుకుని వచ్చిందో! అదొక కలా లేక కల్పన అన్నట్టు. చీకటి గదిలోకి భళ్ళున పరుచుకున్న కాంతి లా. జీవితకాల నిరీక్షణ సాఫల్యమైనట్లు గానూ. 


ఆమె నడిచే కవిత్వంలా వుంటుంది. దీర్ఘరాత్రిలా  మందంగా కదులుతుంది. ఆ కదలిక కంటికి నిండుగా ఇంపుగా కనిపిస్తుంది. పాట సరే,  మాట మరీ వినసొంపు . అందుకే నా హృదయ ఫలకం పై ఆమె రూపాన్ని చెక్కుకున్నా” 


ఈ సంగతిని టైప్ చేసి మెసేజ్ పంపేసాను..  


ఆమె నుండి సమాధానం .. దీర్ఘంగా సాగింది.


“పూల రెక్కల పై ప్రేమ లేఖలు.. అనుభూతి వర్షంలో తడుపుతాయేమో కానీ.. 

ప్రేమ అనేది వెలిబుచ్చే భావాలలో కాదు. మన  ప్రవర్తన లో   ఎదుటివారి పట్ల మనం  తీసుకునే శ్రద్ధ లో  ప్రదర్శింపబడుతుంది” అని.

 

ఆమె చిత్తాకర్షిణి, రసాకర్షిణి, శరీరాకకర్షిణి. ఈ మూడు ఆమెలో మెండుగా వున్నాయి. ఒకదానితో మరో రెండు  పోటీ పడుతూ ఎల్లప్పుడూ దిగ్వుణీకృతమై వెలిగిపోతుంటాయి. ఆమె కళ్ళల్లో  నాపై ఇంతింత అనరాని అభిమానం కనబడుతుంది. రహస్య ప్రేమ తాలూకూ అభిమానం. దానితో పాటు కోర్కెలను దాచుకున్న దీపాల్లా వెలిగే కళ్ళు. ఆమెనలా చూస్తే నా రక్తంలో నగారాలు ప్రతిధ్వనిస్తాయి.సంకోచాలు ముడులు విప్పేసుకుంటాయి.  


ఛామాన చాయ కన్నా  కొద్దిగా పైన రంగు. విశాలమైన కళ్లు. సొట్ట బుగ్గలు.ఆర్ట్ చిత్రాల్లో నాయికలా వుండేది. ఇద్దరి ఆలోచనలూ సామీప్యం. నా స్వరమూ  ఆమె స్వరమూ కలిస్తే సంగీత రసోత్సవం.  ఇరువురి శరీరాలు కలిస్తే శృంగారోత్సవం.  ఇద్దరికీ జీవితం అంటే ఆనందంగా జీవించడం అనే రహస్యం తెలిసి వుండటం. 


 అలా ఆనందంగా వుంటే ఓర్చుకుంటుందా లోకం!? ఇన్ని కలగలసిన జంటను విడదీయడం  ఆ మాత్రం సహజం అన్నట్టు  పన్నాగాలెన్నో. ఏ ప్రేమికులను నిండు జీవితం బతకనిచ్చిందీ లోకం!? 

బలవంతాన విడదీస్తుంది. జరగబోయే నాటకాన్ని పరిహాసంగా చూస్తుంది. 


నా జీవితం పూరించాల్సిన పొడుపు కథ కాదు. అనుభూతి తో ఆనందాన్ని నింపుకోవాల్సిన పాత్ర. 

ఆమెను వెనక్కి తెచ్చుకోవాలని ఒంటరిగానే వైజాగ్ వెళ్ళాను. విఫలయత్నం చేసినా కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు. ఏవేవో కేసులు, పోలీస్ స్టేషన్ చుట్టూ ప్రదక్షిణ. వారం రోజులు రిమాండ్.  స్నేహితుల కృషితో  బెయిల్. వారి చివాట్లు. వదిలేయ్ రా! అనే హితబోధలు. హైదరాబాదు వెళ్ళిపోదాం రమ్మని బలవంతం.


అప్పుడు స్పష్టంగా చెప్పాను.


“ఎవరిలోనైనా  ఉత్తమమైనదాన్ని మనం గుర్తించినప్పుడు వారిని మనం మనసారా ప్రేమిస్తాం. వారు తిరిగి మనను ప్రేమించినా ప్రేమించకపోయినా ద్వేషించినా శత్రువుగా పరిగణించినా కూడా!   కేవలం వారి శరీరాన్ని మాత్రమే కాంక్షిస్తున్నట్లైతే అనుభవాన్ని పొందేందుకే  అనేక దారులు వెదుకుతారేమో! నేను ఆమెను మనసారా ప్రేమించాను, కామించాను, జీవించాను. కాలక్రమంలో ఇద్దరిలో వొకరికి మొహం మొత్తి లేదా  మోసం చేయాలనుకునే  ఆలోచనే లేదు. ఆమె ఏనాటికైనా తిరిగి వస్తుంది.  ఆమె కొరకు ఎల్లప్పుడూ నమ్మకంగా ఉండటమే నా ధ్యేయం” అని.


“పోయి పోయి వివాహిత స్త్రీ వలలో చిక్కుకున్నావ్! ఆమె ఇక తిరిగిరాదు రా! ఆ పిచ్చిలో నుండి బయటకు రారా శ్రీ!”


చెప్పిందే చెప్పి చెప్పి వారు అలసిపోయారు విసిగిపోయారు. వదిలేసి వెళ్లిపోయారు.


ఒంటరితనంలో ఉదాసీనత నిలువెల్లా కమ్ముకుంది. వియోగం వేదన నిండుగా కలగలిపి చుట్టేసాయి. మనసు గాలికి వూగుతున్న  పక్షి పంజరంలా వుంది.


ఏదో కొత్త నెంబరు నుండి ఫోన్. సావేరి అయివుండొచ్చు అనే నమ్మకం వమ్ముకాలేదు. వీడియో కాల్ లో వొకరినొకరు చూసుకుని పన్నీరయ్యారు, కన్నీరయ్యారు.


“శిశిర వసంతౌ పున రాయతౌ-   అన్నారు శంకరభగవత్పాదుల వారు” అది నిజం అవుతుందేమో!


తీవ్ర ఉద్వేగాన్ని అణుచుకుంటూ “పాప ను తీసుకుని వెంటనే వచ్చేయ్ సావేరి” అన్నాను.


చిన్నగా “రాలేను శ్రీ “ అంది. పైగా తనను మర్చిపొమ్మని చెప్పింది. “నీకు అతనే కావాలనుకుంటే పాప ను వదిలేసి వెళ్ళు అంటున్నారు. పాప నా ప్రాణం” అంది. 


“మరి నేనూ!? “


మౌనమే సమాధానం.


ఆమె కుటుంబ రాజకీయాలను అసహ్యంగా తిలకించాను.చొరవ చేసి సావేరి భర్త తో మాట్లాడాను. అతను నన్ను ఎన్నో విధాలుగా నిందించాడు. హద్దులు  మీరి దూషించాడు. అప్పుడు నేనూ దూషించాల్సి వచ్చింది. కంచానికి మంచానికి న్యాయం చేయలేని వెధవ ఎదుటివారి తప్పులను సులభంగా కనిపెట్టడం అనే విద్య బాగా తెలుసేమో! అని.


“సావేరికి విడాకులు ఇచ్చెయ్యి,  పాప తో సహా ఆమెను గౌరవంగా చూసుకుంటాను” అని అరిచాను.


సావేరి అక్కను కూడా కలిసాను. నిజానికన్నా అబద్దాన్ని గొప్పగా నమ్మడానికి అలవాటు పడిన మనిషి ఆమె. పేరుకే న్యాయదేవత. విడాకులు ఇచ్చాక అనే అబద్దంతో నిజంగా నన్ను నమ్మించే ప్రయత్నం చేస్తుంది ఆమె. నేను ఆశ్చర్యపోలేదు.సంప్రదాయ మూఢత్వంలో మగ్గుతున్న  వీరందరిని అధిగమించి సావేరి కి నా దగ్గరకు  వచ్చేసే ధైర్యం లేదని తెలుసుకున్నాను గనుక ఓ శుష్క మందహాసం చేసి ఆమెకు ఓ నమస్కారం పెట్టి వచ్చేస్తుండగా “ఇడియట్! పచ్చని సంసారం నాశనం చేస్తాడట” అని వినబడింది. 


“ఎంత పచ్చని సంసారమో నీ చెల్లెలు సావేరి చెప్పింది వినపడదు కదా! మీరందరూ మూగ చెవిటి మాత్రమే కాదు,హృదయం స్థానంలో బండరాయి వున్నవాళ్ళు కదా!”


అనేక ఆకాంక్షలతో జీవించాలని కలగన్న మనుషులను కేవలం రెండు దేహాలు తమ కలయిక కోసం చేసే యుద్దం లాగా నీతి బాహ్యమైనది గా చూస్తూ.. పరువు ప్రతిష్టలు పేరిట కట్టడి చేసే అజమాయిషీ, అధికార ప్రదర్శన  అంతా అబ్సర్డ్.  


సావేరి ఆ మాట వొక్కటి   అనకుండా వుంటే.. ఈ కథ మంచి ముగింపుకు అర్హమైనదిగా వుండి వుండేది.  ఆమె ది తృణీకారం కాదు నిస్సహాయత కాదు కేవలం ఉదాసీనత. ప్రపంచంలోని కోట్లమంది  స్త్రీల్లాగా ఆమె కూడా ఉదాసీనంగా బతికేయగలదు. 


మరి నేనూ!! కొరగాని ఆశ గూడు విడిచి వెళ్ళిపోయింది. అనుమానపు పొర మంచుతెర వలె జీవన ఉషస్సును అడ్డుకుంటుంది.ఇంకెలా బ్రతికేది!? 


 “సమాజం మనని వెలివేస్తే భరించలేం అనుకుంటాం కానీ ఆ సమాజాన్ని మనం వదిలేయం. ఎవరో నియంత్రించినట్లు మనను మనమే నియంత్రించుకుని ఆగిపోతాం” నువ్వు అదే చేస్తున్నావు అని సావేరి కి చెప్పాను కూడా.


 నా ప్రేమను మా కలయికల అనుభూతిని గాఢానుభవాన్ని గౌరవించలేని సావేరి  అయినవాళ్ళ శుష్క వాగ్ధానాలకు డాంబికమైన విలువలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చిందా?.  మా గాఢమైన అనుబంధాన్ని తుంచేసిన ఆ చిన్నపదం చాలదూ! “వదిలేయరాదా! ఇంతటితో” అని.


“ ఈ మాట చాలదూ!! గుండె పగలడానికి, దుఃఖ మహాసముద్రంలో మునిగిపోవడానికి.”  పది రోజులు పది యుగాల్లాగా గడుస్తున్నాయి. అనుక్షణం రంపపు కోత అనుభవిస్తున్నా.ఆనందం అనుభవించినప్పుడు దాన్ని అంటిపెట్టుకుని వుండే బాధను కూడా స్వీకరించాలి కదా! 


ప్రేమ ని పొరలు పొరలుగా వొలిచి చూసాక  భ్రమలు తొలగిపోయాక సహజత్వాన్ని సహజంగా 

స్వీకరించడమే విజ్ఞత. 


- Forgetting the Safe Zone in Unconditional Love has heartbreaking lessons.


 అయినా కల లో కూడా సావేరి స్వరం వెంటాడుతుంది. మౌనంగా వున్నప్పుడు కూడా లోన దాగిన స్వరం వినబడుతూనే వుంది. అమృతం పంచడం కూడా పాపమేనా?  ఫోన్ చేస్తే ఆన్సర్ చేయలేదు.  జవాబుగా మెసేజ్ లో కొన్ని  కన్నీటి చుక్కలు. ఆమె తుది నిర్ణయం అదేనా!? 


ఎడతెగని ఆలోచనలు. తిండి నిద్ర ధ్యాస లేని ఆలోచనలు. ఉద్యోగం వదిలేసానో పోయిందో తెలియదు. మనుషులు అసంకల్పితంగా చేసే  ప్రణయ రహస్య ప్రస్థానాల గాథ ఇలా ముగిసిపోవల్సిందేనా!? 


సావేరి నన్ను విస్మరిస్తూ తిరస్కరిస్తూ తనను తాను పోగొట్టుకుంది. అవకాశం వచ్చినప్పుడల్లా కళ్ళు తెరిచి చూడలేక. హృదయంతో పరికించి చూడటం గుర్తించడం చేతకాక.  ఇప్పుడు ఆమె లేక నన్ను నేను పోగొట్టుకున్నాను. శకలాలు శకలాలుగా మనసు ముక్కలైంది. ఈ మానసిక వైకల్యంతో బాధపడుతూ బ్రతకలేను. జీవించి వుండటానికి కూడా పెద్దగా కారణాలేవి కనబడటం లేదు. జీవన కాంక్షా పుష్పం వడలిపోయింది. 


ఏది రానీ రాకపోనీ! ఎప్పటికైనా రాక తప్పనిది మరువక వచ్చేది మరణమే గనుక దాన్నే యిష్టంగా ఆహ్వానిస్తున్నా. ఇంతకన్నా ఆమెను కదిలించేది యేముంటుంది? ఆమె ను కదిలించాల్సిన అవసరం కూడా లేదని యింకో మాట కూడా అనుకున్నాను.


ఒకరు లేకపోతే వచ్చే ఖాళీ ని వేరొకరెవరో పూరించలేరు. పూరించాలని ప్రయత్నించినా అది అతుకుల బొంతే! 


“రెండు నాల్కలు రెండు గుండెలు రెండు జీవితాలు లేవు.

వసంతంలో పుట్టి శిశిరంలో రాలిపోయేది కాదు నా ప్రేమ. నేను రాలిపోవడమే తప్ప” 


కథ ముగింపు తర్వాత కొన్ని కన్నీళ్ళు మాములే! అవి రోజులా నెలలా సంవత్సరాలా.. వారికే వదిలేద్దాం. అనుబంధాన్ని కాలంతో కొలవలేం. ఆలోచనలు ఇలా సాగుతున్నాయి. చూసే వారిక్కూడా తెలిసిపోయిందేమో! 


“అమ్మ గారూ! త్వరగా వచ్చేయండమ్మా! అబ్బాయి పరిస్థితి ఏమీ బాగాలేదు” అని పని ఆమె కామాక్షి అమ్మకు  ఫోన్ చేసి చెప్పటం విన్నాడు. 


“బంగారం లాంటి బిడ్డ. పెళ్ళై బిడ్డ వున్న తల్లిని ప్రేమించాడంట.మనక్కూడా ఎక్కడా అనుమానమే రాలేదు చూసావా?. చిలక గోరింకల్లా వుండేవారు. ఆమె తరపు వాళ్ళొచ్చి లాక్కొని పోయారు. అట్టా పోయే ఆమె ఎందుకు రావాలీ అసలు? బిడ్డ ఆమె కోసం అలమటించి పోతన్నాడు. ఏడ చూసినా ఇయ్యే కథలు” జాలి కోపం విసుగు కలగలిపి భర్త తో చెబుతుంది. “మనసు చెడితే మగాడు బతకలేడే కామాక్షి! అమ్మ గారు వచ్చేదాక కనిపెట్టుకుని వుండాలి మనం” అంటున్నాడు శివయ్య. 


నిజం చెప్పాడు శివయ్య.  తనదేమన్నా కాలక్షేపపు ప్రేమా? కల్తీ ప్రేమా!? టీనేజ్ ఆకర్షణల నుండి ఒక్క రాత్రి  కలయికతో ముగిసిపోయే ప్రేమ వరకూ అనేక రకాలు పరిచయమే! వాటికెప్పుడూ కట్టుబడని తను సావేరి ప్రేమలో మమేకమై పోయాడు. అందుకే ఈ బాధ. ”మనుషులు అర్థం చేసుకునేందుకు  ఇది మాములు ప్రేమ కాదు. అగ్ని లాగా స్వచ్ఛమైనది.” అప్రయత్నంగా గుణ ని గుర్తు చేసుకున్నాను. 


శివయ్య పక్కన నిలబడి బలవంతాన భోజనం తినిపించాడు. మీ మనసేమి బాగా లేదు నేను ఈడే పడుకుంటా అని తుండు పరుచుకుని నా గదిలో పడుకున్నాడు. అతన్నే చూస్తూ నేను. అలా రెండు రోజులు గడిచాయి.


అర్ధరాత్రి దాటింది. తీపి లేని బ్రతుకు ముగింపు దశలో తీపిలేని చల్లని ద్రవంలో విషం కలిసి మెత్తగా గొంతు దిగుతుంది. భగ్న హృదయం మండుతుంది. ఎక్కడో సావేరి మంజుల స్వరం వినబడుతుంది ఆఖరి జోల పాడుతున్నట్లు.  మరణ దేవత సమీపంగా వచ్చి  సావేరి  రూపంలో నన్ను తన ఒడిలోకి చేర్చుకుని కరుణతో మెత్తని స్పర్శతో తల నిమురుతుంది. 


ఇంకేమీ వద్దు. ఇంకేమీ వద్దు.  మూసి ఉన్న కిటికి తలుపుల మధ్య నుండి  సన్నని వెలుగు రేఖ.  గాలికి పక్కకు  వొదిగిన పరదా కదలికలు. శబ్దం ఉనికి తెలియజేస్తూ ఫ్యాన్ రెక్కలు. కళ్ళ ముందు ఏవేవో  క్రీనీడలు మరుగవుతూ. 


సావేరి పంచి ఇచ్చిన ప్రేమ నా ఆత్మానుభూతి. నా భగ్న ప్రేమ మిగిల్చింది జన్మ వైరాగ్యం. శూన్యం ఆక్రమిస్తుంది. 


  ఆ శూన్యం లో నుండి  దగ్గరవుతున్న అమ్మ  రూపం, అమ్మ స్పర్శ,  ఓ గట్టి అరుపు. అంతే!


“అమ్మా! నన్ను క్షమించు. సావేరి ని నిందించకు. నీ అంత దైర్యం ఆమెకు లేదు. 

నా ఈ ముగిసిన కథ సావేరి కి అందేట్టు చేస్తావు కదూ!” 

అమ్మ ఏడుపు అంబులెన్స్ శబ్దం కలగలిసి  విషాద సంగీతం లా  చెవుల ద్వారా మెదడు ని  గుచ్చుతుంది.  


(వేరు చేయడం ద్వారానో, విడివడ్డం ద్వారా

ప్రేమ మరణించదు.


                                            *ఓషో)





 ***************