గెలుపు తలుపు మూయక ముందే - రేణుక అయోల గారి కథ పై నా స్పందన.. అభిప్రాయం ఏంటంటే..
ప్రతి మనిషికి కొన్ని ఇష్టాలు ఉంటాయి. ఆ విషయాల్లో తనకు పూర్తి స్వేచ్ఛ కావాలని కోరుకుంటారు.
అవి ..
దైవారాధనకు సంబంధించినవి
ఆహారానికి సంబంధించినవి కొన్ని.
వస్త్రధారణ కు అలంకరణకు సంబంధించినవి.
వీటి విషయంలో ఎవరి ప్రమేయాన్ని వారు భరించలేరు. నేను కూడా అంతే! నాకెవరైనా ఇలా వుండు అలా వుండు ఇది తిను అది తిను.. ఆ గుడికి వెళ్ళు.. ఆ దైవాన్ని నమ్ముకో అని చెపితే వారి వైపు నిరసనగా చూస్తాను. కోపం వస్తుంది కానీ సున్నితంగా బలవంతం చేయవద్దు అని చెప్తాను. బాగా దగ్గర వారైతే రెండు మూడు సార్లు చెబుతారు. తర్వాత మౌనం వహిస్తారు.
అలాగే ఎవరి విషయంలో కూడా నేనూ జోక్యం చేసుకోను.
వ్యక్తి స్వేచ్ఛ ను ప్రాథమిక హక్కులను ఎవరైనా గౌరవించాలి. తమ ఇష్టా ఇష్టాలను ఇతరుల కోసం త్యాగం చేయడంలో స్త్రీలు ముందుంటారు. ఈ కథలో అనిత తన ఇష్టాన్ని తాను కోల్పోలేదు. భర్త కోసం త్యాగం చేయలేదు. తనపై తాను గెలుపు సాధించింది. భర్త తన గెలుపు తలుపు మూయక ముందే మేల్కొంది. కథ ఈ కోణంలో నాకు నచ్చింది. రేణుక గారూ.. మీకు అభినందనలు. సెన్సిటివ్ కోణంలో మీరు కథ బాగ రాసారు. భార్య తమ ఆకాంక్షలకు అనుగుణంగా లేనప్పుడు.. భర్త మరొక స్త్రీ లో వెతుక్కోవడం అనేది లోకంలో సాధారణమైన విషయం. భార్య తనకున్న స్వేచ్ఛను కోల్పోకుండా తనదైన వ్యక్తిత్వం తో మనగల్గేటప్పుడు..
భర్త ఊహల్లో ఆలోచల్లో తన ఊహసుందరి నయనతార బతికేవుంటుంది.
**********
ప్రతి మనిషికి బాల్యం నుండి ఏదో ఒక ఫాంటసీ వుంటుంది. పెరిగి పెద్దయ్యాక వివాహమయ్యాక కూడా తమ జీవిత భాగస్వామి పట్ల కూడా అనేక ఫాంటసీలు వుంటాయి. వారి ఆశలకు ఆకాంక్షలకు అనుగుణంగా జీవితాన్ని కొనసాగించడానికి అనేక ఆటంకాలు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా భార్య/భర్త పట్ల అనేక ఊహలు ఉంటాయి. కానీ విరుద్ధంగా వారి భాగస్వామి కనబడితే వారికి లోలోపల దాగిన ఫాంటసీల గురించే ఆలోచిస్తారు. అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉంటారు.
అందులో పితృస్వామ్య భావజాలం ఉన్న పురుషులు తన భార్య తనకు అనుకూలంగా ఉండాలని తన అభిరుచుల మేరకు అలంకరించుకోవాలని తనకు ఇష్టమైనవి వండి వడ్డించాలని కోరుకుంటాడు.
ఈ కథలో భర్త మరీ అంత మూర్ఖత్వం కలిగి ఉండడు. నిజానికి వారిద్దరి జీవితం మేడ్ ఫర్ ఈచ్ అదర్. అతను కూడా సంస్కారవంతుడు. భార్య స్వేచ్ఛ ను గౌరవిస్తాడు. తనకు నచ్చిన విధంగా అలంకరించుకోమని అడగటానికి మొహమాట పడతాడు. అతని ఊహలకు తగినవిధంగా వున్న వొక స్త్రీ ని చూసి ఆకర్షణలో పడతాడు కానీ సభ్యతను మర్చిపోడు. పరిచయాన్ని పెంచుకోవడం కూడా వుండదు. అతని పర్సనల్ డైరీ లో రోజుకొక పేజీ కేటాయించి ఆమె గురించి రాసుకుంటాడు. అది భార్య అనిత చూస్తుంది. .. తర్వాత ఏమైందో కథ విని తెలుసుకోండి.
ఈ కథ “కొత్త చూపు” జ్వలిత సంపాదకత్వంలో వచ్చిన కథా సంకలనం లో కథ. వీలైతే చదవండి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి