18, ఫిబ్రవరి 2025, మంగళవారం

జీవితం దుఃఖ విభాజకం



 జీవితం దుఃఖ విభాజకం  -వనజ తాతినేని 


నాకో సందేహం దీర్ఘకాల సందేహం 

దుఃఖం..  

ఎందుకు ఒకోసారి జడివానలా వుంటుంది 

ఇంకోసారి మంచుతెరలా మసకగా వుంటుంది

మరొకసారి పిసినిగొట్టు వానలా చుక్కలు రాలుస్తుంది

ఎప్పుడైనా వొకోసారి లావాలా ఉబుకుతుంది

అంతలోనే ఎడారి లా బీడువారుతుంది 

 ఒకోపరి ఘనీభవిస్తూంది 


ఈ దుఃఖానికి ఎన్ని రంగులు!? 

ఎల్లప్పుడూ అమ్మ వొడిలో అంటి వుండాలనుకునే మారాం నుండి 

అద్దంలో చందమామ సొంతం కావాలనుకున్న పేచీ నుండి 

గుప్పెడు బూడిదగా మిగిలే వరకు  ఎన్ని లెక్కలు!?


దుఃఖం పురా సంస్కృతి. 

వెలుగును అంటిపెట్టుకుని  చీకటి వున్నట్లు 

జీవితాన్ని అంటి పెట్టుకుని వుండే దుఃఖం 

తపస్సు చేసుకుంటూనో ధ్యానం చేసుకుంటూనో 

రుషులు యోగులు ఈ దుఃఖాన్ని తప్పించుకునే

సులభం కనిపెట్టారందుకే! 


అయినా వొక మాట.. 


మన దుఃఖాలు దేవకి దుఃఖం కాదు

గాంధారి దుఃఖం కన్నా ద్రౌపది దుఃఖం కన్నా 

అంత పెద్దదైనదేమి కాదు. 

అలా అని పురూరవుడి విరహ దుఃఖం కాదు

యశోధర దుఃఖం కాదు.

కళింగ యుద్దం తర్వాత విలపించిన కులస్త్రీల దుఃఖం కాదు 

ప్రపంచ యుద్దాల్లో ఇంటి పురుషులందరినీ 

కోల్పోయిన తల్లుల భార్యల దుఃఖం కాదు


మనిషి లోలోపల ధ్వంసమైన దుఃఖం 

 రక్తమాంసాల స్ధానే మనిషి స్వార్ధమైన దుఃఖం

 మనిషి మృగమైన దుఃఖం 

మనిషి సమూలంగా వస్తువైన దుఃఖం 

చింతలు ఛీత్కారాలు అలవాటైన దుఃఖం. 


 నాకో సందేహం దీర్ఘకాల సందేహం 

దుఃఖం ఎందుకు ఆత్మహత్య చేసుకోదు!? 

ఒకొరి దుఃఖాన్ని మరొకరు చాపలా చుట్టుకుని 

చంకలో పెట్టుకుని వెళ్ళడం సాధ్యం కాదెందుకు!?


ఏ నదీ తీరంలోనో ఇసుక ఎడారుల మధ్యనో   

గుడారాల మధ్య బసచేసి  నక్షత్రాల కాంతిలో 

రాత్రి చెప్పే రహస్యాలను సావధానంగా విన్నప్పుడు... 

దుఃఖాన్ని జయించిన వాడెవడూ లేడు

నిజాన్ని అబద్ధం అనుకున్నప్పుడల్లా  

విషాద హృదయాన ఆనందరేఖ వలె 

భ్రాంతి కలిగిస్తుంది దుఃఖం అనే సందేశం 

అందుతుంది


మనసు దుఃఖం హృదయ దుఃఖం 

శరీర దుఃఖం కన్నా ఎడసాల దుఃఖం నొప్పి కన్నా

ఎందుకో మరణ దుఃఖం శాంతినిస్తుంది.


దుఃఖ ఉపశమనమార్గం కనిపెట్టానని సంబరపడతాను 

ఇష్టమైన కవిని వింటూన్నప్పుడో 

ఇష్టమైన కవితొకటి పెదవులు దాటి 

ఉత్సాహంగా పొంగుకుని వస్తున్నప్పుడో 

దుఃఖం తెరచాటుకు మలుగుతుంది అని


 కొంత తడవే అది.

మాటు వేసి వున్నట్లు మన మనిషే అనిపించే 

శత్రువో దాయాది వొకరో మనకు బాధ అనే 

చమురు వడ్డించి వేదన వొత్తిని అంటించి 

చిన్నగా పక్కకు తప్పుకుంటారు


లోకం బాధల విభాజ్యం.

జీవితం దుఃఖ విభాజకం

శేషం మిగులుతూనే వుంటుంది 

ఇచ్చుకున్నవాళ్ళు ఇచ్చుకున్నంత 

పుచ్చుకున్నవాళ్లు పుచ్చుకున్నంత.


*********************************



కామెంట్‌లు లేవు: