19, ఫిబ్రవరి 2025, బుధవారం

కాకుల లోకం

 సాహిత్యాన్ని వొకే మతానికి చెందిన వారో  వొకే కులానికి చెందినవారో  వొకే వర్గానికి చెందిన వారో గుప్పిట బిగించడం కొత్త విషయమేమి కాదు. ఇప్పుడు కొన్ని వర్గాల వారు తమ గుప్పిట బిగించి వుంచారు. వారి దృష్టిలో అది సాహిత్య సేవ. ఎవరి వర్గానికి వారికి సాహిత్య రాజకీయ ద్రోణాచార్యుడు శకుని వారికి వుండనే వున్నారు. ఇవ్వన్నీ వొక ఎత్తు అస్తిత్వ వాద సాహిత్యం తమదే పై చేయిగా వుండాలనే వాదం వుంది. గొంగళిలో తింటూ వెంట్రుకలు వస్తున్నాయి అనుకోవడం యెందుకు? మనకు గ్రూప్ లేకపోతే యెదుటివారిని  విమర్శించాలి. 


కుల సంఘాలు సాహిత్యాన్ని గుప్పిట్లో పెట్టుకున్నవి అంటున్నారు. అదే నిజమైతే 

నా కులానికి సంబంధించిన సాహిత్య సంఘాలు యే నాడు నేనొక పుస్తకాన్ని తీసుకొచ్చినప్పుడు నాకు నామ మాత్ర అండగా నిలిచిన సందర్భం లేదు. సభకు అధ్యక్షత వహించడం, అతిథులుగా వుండటం, ఆవిష్కరణ చేయడం లాంటి విషయంలో. ఇంకా చెప్పాలంటే.. ఆమె కవిత్వం రాసిందట అని ఎగతాళి చేస్తే.. నా కవిత్వం పై మాట్లాడాలని వచ్చిన పక్క జిల్లా సాహితీవేత్త అయోమయంలో పడ్డారంట. ఆ విషయం ఆ పక్క జిల్లా సాహితీవేత్త వారు చెబితేనే నాకు తెలిసింది. నా కవిత వొకటి ప్రథమ బహుమతి స్థాయిలో వుంటే వద్దు వద్దు అని వారించిన కుల కవి కథా రచయిత గురించి నేనేమి చెప్పదల్చుకోలేదు.  ఆ రచయిత యెవరో నా కులంలో వున్న కవులు రచయితలకు తేటతెల్లం. 

నాలుగు పుస్తకాలు వేసాను. నా కులం వారు ఎవరైనా ముందు మాట రాసారా? (నేను అడగలేదు కూడా)పోనీ ప్రోత్సాహానికి వొక ఆత్మీయ వాక్యం రాసారా?  రాసినవారు ఎవరైనా నాలాంటి వాళ్ళే! ఎందుకంటే నాలా వారికి కుల అభిమానం లేదు. 


కులాన్ని అడ్డుపెట్టుకుని వేదికలపై ఊరేగాలనో అవార్డులు పొందాలనో కథా సంకలనాల్లో కథలు వేయించుకోవాలనో, దగుల్బాజీ మాటలు, రాజకీయాలు సాహిత్య ప్రయోజనాలు, మా కులంలోనూ ఏ కులంలోనూ చాలామందికి లేవు. వారంతా యెవరికి యెంత భావ వ్యక్తీకరణ వుందో ఆ రీతిలో వెలిబుచ్చుతారు. నచ్చితే ప్రచురణలోకి వస్తాయి. లేకపోతే ప్రచురించుకుంటారు ఫేస్ బుక్ వాల్ పై అయినా. 


ఇక కుల సంఘాలు చేతిలో సాహిత్యం బందీ అయింది అని వాపోయేవారు వారు తాము కూడా ఏదో వొక వర్గం లో  వున్నారేమో పునఃపరిశీలించుకోవడం మంచిది. 


కొన్ని గ్రూపుల్లో అన్ని కులాలు  అన్ని మతాలు అన్ని వర్గాలు వారు వుంటారు. కొన్ని కొన్ని ప్రయోజనాలు కోసం సహకారం అందిస్తూ తీసుకుంటూ తమ గ్రూపులను చాకచక్యంగా ముందుకు నడిపిస్తున్నారు. మనకు ఇష్టమైతే ఆ గ్రూపు లో వుంటాం లేకపోతే లేదు. 


రచయితలు కవులూ వ్యాసకర్తలు విమర్శకులు.. ఇలా యెవరైనా యే ప్రక్రియలో నైనా.. రాసినవి ప్రతిదీ మాస్టర్ పీస్ అయి వుండదు అనే సృహ చదివే పాఠకులకు తెలుసు. తెలిసినా తెలియనట్లు వుండే రాసిన రచయితలకు తప్ప. వడ్డించేవాడు మన వాడైతే ఎంత చెత్తైనా పాఠకుల నెత్తిన రుద్దేయవచ్చు. 


ఇప్పటి తరం రచయితలు దైర్యంగా  తాము ఎదుర్కొన్న సమస్యలను కష్టాలను నొప్పిని బాహాటంగా రాయడం మాత్రం సత్యం. హర్షణీయం. కాదనేందుకు ఏమీ లేదు. 


అన్నట్లు..  ప్రత్యేకంగా చెప్పాల్సింది కాకపోయినా చెబుతున్నాను. 

వేణు మరీదు  రాసిన “నిర్వర్ణం” కథ నాకు నచ్చలేదు. కథకు వేసిన చిత్రం తో సహో. 

ఈ కథ నోటితో ప్రశంసించి నొసటితో వెక్కిరించినట్లు వుంది. 


నేను పైన రాసింది అంతా కూడా.. ఈ కథ చదివిన తర్వాత వచ్చిన ఆలోచన మాత్రం కాదు. కుల సంఘాల వారు తమ కులం వారిని ప్రత్యేకించి పక్కన పెట్టడం గురించి మాత్రమే రాసాను. నా నొప్పిని రాసాను. నేను ఏ సభలకు వెళ్ళకపోవడం ఏ రచయిత లను కలవకపోవడం గురించి రాసాను. గుర్తింపు ప్రయోజనాలు నాకు అవసరం లేదు. మనం మనుషులుగా వుంటే చాలు అనే భావన నాది. చదవడంలో మనుషులు అందరూ నా వాళ్ళే అనుకోవడంలో నాకెటువంటి తేడా లేదు. ఎవరికైనా  వుంటే అది వారి సమస్య. 


ఓపికగా చదివినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ పోస్ట్ పై.. మీరు ఏమి పెట్టినా లైక్ తప్ప

వాద ప్రతివాదనలకు తావు లేదు. గమనించగలరు. అనుకూలమైన వ్యాఖ్యలు చేసిన కూడా thanks కూడా వుండవు .

కామెంట్‌లు లేవు: