26, నవంబర్ 2024, మంగళవారం

గుంటూరు చిన్నోడా

తొలిసారి జానపద గీతం రాసాను.. ఎవరైనా బాణీ కడితే అది కూడా. ❤️😊

అతడు:

గుంటూరు చిన్నోడా గుబురు మీసాలోడా

గుబుర మీసాలపై నిమ్మపండు నిలిపేటోడా గుంటూరు చిన్నోడా గుబురు మీసాలోడా

గుబుర మీసాలపై నిమ్మపండు నిలిపేటోడా

చిన్నదాని మనసునెత్తగలవా

ఈ చిన్నదాని మనసునెత్తగలవా? 

అతను:

ఏటవతల చిన్నదాన ఏటి నడకలు దానా

ఏటి నడకలపై ఎన్నెలు చిందేదానా

 నిన్నైతే చిటికెలో యెత్తగలనే 

లోతైన నీ మనసు నెట్టా పట్టుకుందు నే 

పట్టుకుని నేనెట్టా నిలుపుకుందునే

పట్టుకుని నేనెట్టా నిలుపుకుందునే


ఆమె:

గుంటూరు చిన్నోడా బండల్ని పిండి పిండి  చేసేటోడా బండ లాంటి మనసు నీది రా

మనిషివైతే ఎదిగినావు  కానీ 

మనిషివైతే ఎదిగినావు  కానీ 

చీమ మెదడంత తెలివి లేనోడా 

నీతో జతకట్టలేను జీవితమూ ఈదలేను

నువ్వొద్దు పోరా నువ్వొద్దు పోరా


అతను: 

ఎంత మాటంటివే పిల్లా నీవు

నీ వదరుబోతు తనం నా కాడ కాదే

పోట్లగిత్త లెన్నింటినో లొంగదీసి నోడిని

పోట్లగిత్త లెన్నింటినో లొంగదీసి నోడిని

నీకు ముకుతాడు నేను వేయలేనా

నీకు ముకుతాడు నేను వేయలేనా

ఆ మూడు ముళ్ళు నే వేయలేనా

నూరేళ్ళు నీ వొడి లోన నే నిండిపోనా


ఆమె:

నీ బడాయి మాటలు జబ్బల గొప్పలు చెప్పింది చాల్లే బండోడా సూక్ష్మం చెబుతాను వినుకో.. 

చిన్నదాన్ని మనసు శివధనుస్సు లాంటిది

ధనుస్సునెత్తే ముందు ధరణి పుత్రిక ను చూసినాడు రాముడు

 ఆ చూపుతోనే మనసు చిక్కబట్టినాడు

చక్కనమ్మ చిక్కినాక ధనుస్సు ఇరగ్గొటినాడు

చక్కనమ్మ చిక్కినాక ధనుస్సు ఇరగ్గొటినాడు

ఆ సులువు కనిపెట్టలేవా 

ఆ..  సులువు నువ్వు కనిపెట్టలేవా… 

ఇంత మంద మెదడు వున్న మొనగాడా 

మగువ మనసు తెలుసుకోరా బండోడా


అతను:

కనిపెట్టినానే పిల్లా నేను

కనిపెట్టినానే పిల్లా నేనూ.. 

నీ కళ్ళలోకి నేను కళ్ళు పెట్టి చూసా

గుండె లోకి తిన్నగా దారేసినాను

మనసుతో  మనసుకి పీట ముడి పెట్టేసినాను

లగ్గం చేసుకోను ఎత్తుకొని పోతాను నిన్ను 

ఎత్తుకొని పోతాను నేనూ.. 

మీసాలపై మనసునేంటి పిల్లా 

మొత్తంగా నిన్నే  నెత్తిన పెట్టుకొంటా.. 

మొత్తంగా నిన్నే  నెత్తిన పెట్టుకొంటా.. 

కామెంట్‌లు లేవు: