తిరిగొచ్చిన కథలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
తిరిగొచ్చిన కథలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

5, అక్టోబర్ 2019, శనివారం

ఫ్లిప్ సైడ్

మళ్ళీ ఆధ్యాత్మికంలో పడినట్లున్నారు. ఏమిటీ సంగతి అని అడిగారు నా మిత్రుడు. 

రోజూ నేను పెడుతున్న వాట్సప్ స్టేటస్ లు చూస్తున్నట్లు అర్దమైంది. నాకు ప్రశాంతత అక్కడ తప్ప యింకెక్కడా దొరికేటట్లు లేదు అని రిప్లై యిచ్చాను. నేను అలా బ్రాంతి లో బ్రతుకుతున్నాననుకుని వుండవచ్చు. అదికూడా నేనే అనుకున్నానంటే అతని ఆలోచనలు నాకు తెలుసు కాబట్టి.   


అసలు మనుషుల అంతరంగంలో యేమి వుందో కనుక్కోవడం పెద్ద కష్టమేమికాదు. కానీ వారు తమ ఆలోచనలు నిజమేనని వొప్పుకోకపోవడమే కష్టం. 


నేను మాత్రం ఏం తక్కువ? చీపురు అరిగి అరిగి పోయినా కూడా.. ఆప్టరాల్ వొక చీపురు వందరూపాయలు పోసి వూరికూరికే మార్చలేక అరిగితే మాన్లే కాస్త నడుంవొంచి  ఊడ్వ వచ్చు.మంచి ఎక్సెర్ సైజ్  కూడాను అని బతకనేర్చిన తెలివితేటలు చూపిస్తాను.


నేను మహా దైర్యవంతురాలినని, కొందరు నాకు చాలా పొగరని పిసినారిని అని యేవేవో మాట్లాడుతుంటారు. ప్రతిపనికి అయినదానికి కానిదానికి పురుషుడిపై ఆధారపడే మనస్తత్వం కాదు. ఏ పనైనా స్వయంగా చేసుకోవాలనుకుంటాను తప్ప సోమరితనంగా కూడా వొకరిపై పని నెట్టేయడమన్న ఆలోచన చేయను.. నేను సంపాదించని రూపాయలను విచ్చలవిడిగా  ఖర్చు చేయడానికి నాకు అధికారం లేదు అంటాను. అయినా డబ్బులేమీ వూరికే రావడం లేదు కదా. ఆ మాత్రం ఆత్మ విశ్వాసం వున్నవాళ్ళను కృంగదీసే మాటలంటే పట్టించుకోకూడదనుకుని నాకు నచ్చిన దారిలో పోతుంటాను కానీ… కొన్ని విషయాలకు స్పందించకుండా మాత్రం వుండలేను.


గత ఆదివారం నేను ఓ పరామర్శకు.. వెళ్ళివచ్చేసరికి మా బ్లాక్ చుట్టూ కనబడిన మార్పుకు కుదేలైపోయాను.     పచ్చని చెట్లు నిలువెత్తు పెరిగి రంగురంగుల పూలతో భలే శృంగారంగా కనువిందు చేస్తూ వుండేవి. ఆ పూల పొదలచుట్లూ చెట్ల చుట్టూ తిరిగే తుమ్మెదలు సీతాకోకచిలకలు తూనీగలు హమ్మింగ్ బర్డ్స్ ఉడుతలు  యింకా పూల దొంగలకు అన్నింటికి ఆలవాలమైనట్లు వుండే అన్నిరకాల చెట్లను మొదలకంటా నరికించేసారు. బిల్డర్ నరకమని చెప్పారండి అన్నాడు వాచ్ మెన్. 


"మనుషులకు తిరిగే వాహనాలకు వేటికి అడ్డుకాదు. పైగా శ్రావణమాసం. అలా పచ్చగా వున్న పూలు పూసే మొక్కలను నరికినేయడానికి ప్రాణమెలా వొప్పింది. పూలు కొయ్యొద్దు అంటే కోయడం మానేస్తారుగా" అన్నాను. 


"దోమలు  పచ్చ పరుగులు వస్తున్నాయని నరికించేసారు" అన్నాడతను. అతను మాత్రం యేం చేస్తాడు యజమాని ఆజ్ఞ పాటించాలిగా అనుకుని పైకి వచ్చేసాను. కానీ రెండురోజులు మాములు మనిషిని కాలేకపోయాను. 


ఎంత కఠినంగా వుంటున్నారు మనుషులు.  అసలేమాత్రం జాలి కరుణ లేని రాతి హృదయాలు అయిపోతున్నాయని అనుకోవడమే కాదు మరి కొందరి దగ్గర  పదే పదే వాపోయాను.కళ్ళు మూసినా తెరిచినా రంగుల రంగుల పూల పందిళ్ళు కదలాడుతూనే వున్నాయి.అసలు మనిషి గురించి తప్ప మనుషుల గురించి ఆలోచించడం మానేసాం. నేను నా అనే చట్రంలో పడి తిరుగుతున్నాం. పాంచ భౌతాత్మికం శివం ప్రకృతియే లక్ష్మి అని తెలియదా లేక యెవరూ చెప్పలేదా? 


ఉదయాన్నే పూలు తెచ్చుకోవడానికని ప్లాట్ దగ్గరకి వెళ్లాను. అక్కడ నీలిరంగు  శంఖు పూలు దిట్టంగా పూస్తున్నాయి. పూలను కోస్తుంటే గోడపై నుండి పలకరించింది వెనుకింటి ఆమె. పెద్ద పరిచయంలేదు కానీ హాయిగా మాట్లాడబోయాను. 


"ఇవిగో యీ మొక్కలన్నీ నేనే వేయించాను అంది. “ఈ శంఖుపూల తీగ నేనే నాటానండీ అది కుండీలో పెరిగి పూలుపూసి కాయలుకాసి గింజలు రాలి మళ్ళీ మొలిచాయి” అన్నాను. ఒప్పుకుంటేనేగా సాక్ష్యానికి యింట్లో అద్దెకి వుంటున్న అమ్మాయిని తోడుతెచ్చుకుని నేనే గింజలు వేసేను అంది. 


ఇవిగోండి..కాసిని పూలు తీసుకోండి అని యివ్వబోతే యివాళ పక్కింటివాళ్ళ దొడ్లో కోసుకొచ్చాను అంది. అసలామె బాధేమిటో నాకర్ధమవక ఆలోచిస్తుంటే ఆ గోరింటాకు చెట్టు నేనే వేయించాను. ఈ మందారాలన్నీ వేయించాను. చాలా పూలు పూసేయి అందరికి పంచేదాన్ని అంది.నీక్కూడా కావాలంటే కోసుకుని వెళ్ళు అంది వుదారంగా. నా స్థలంలో  ఆవిడ వుదారత యేమిటో నాకర్ధమై చావలేదు.   ఇప్పుడు నేను  కూడా మరిన్ని  మొక్కలు నాటుతానంటే యెందుకమ్మాయ్ ఇల్లు కట్టినాక వేసుకో అని చెట్లుంటే దోమలు పురుగుపుట్రా వస్తాయి బయట కూర్చోలేము అంది. ఓహ్ ..ఇదా యీమె బాధ అనుకుని అక్కడనుండి తప్పించుకుని వచ్చేసాను. 


ఆమెకి మాకు గోడ అడ్డుంది కాబట్టి సరిపోయింది లేకపోతే మా స్థలం యింకా వుంది  అనేసేదేమో. ఇప్పటికే ముందువైపు వున్నాళ్ళు  వెనక్కి వెనక్కి జరిగి రెండొందలు గజాలు మాయం చేసేసారు. నోరున్నవాడిదే రాజ్యం అయిపోయిందని వాపోవడం తప్ప చరిత్రని తవ్వి వెనక్కి తెచ్చుకోవాలనే జ్ఞానం ఆశ రెండూ లేని నిర్లిప్తత జీవులు మా ఇంట్లో వాళ్ళు. ఏది నాది యేది మీది అన్నీ వొదిలి అందరూ వెళ్ళేది ఆ వొలుకుల్లోకే కదా వెళ్ళేదన్నవైరాగ్య జ్ఞానం వచ్చేసిన వృద్దులం అయిపోయాం. వొంట్లో జవజీవాలు సన్నగిల్లడం కాదు పోరాడే శక్తి లేదని వెనకడుగు అంతే. నాకెందుకో పులి నాలుగడుగులు వెనక్కి వేసిందంటే అన్న నానుడి గుర్తుకొస్తుంది అప్రయత్నంగా. మేమంతా మంచి పులులం అని మాకు మేమే సెహబాష్ అని వెన్ను చరుచుకుంటుంటే ఆక్రమణదారులు మా  మంచి తనాన్ని చేతకాని తనంగా భావిస్తున్నారని నా గట్టి అనుమానం.వలస వెళ్ళి స్థానికత కోల్పోయిన కుటుంబం మాది. అక్కడ వున్న వాళ్ళతో పోల్చుకుంటే మా కుటుంబం బలహీనం. బలహీనుడి మనోభావాలతో బలవంతుడు బంతాట ఆడుకుంటాడు. తప్పులేదు. Might is right అయ్యేది యెపుడని? ఏ స్వార్ధ ప్రయోజనాలకో కొంతమంది అమ్ముడవుతారు లేదా యేవేవో భేదాలు పొడసూపి నీరుకార్చేస్తారు. బలహీనుల అపజయమంతా యిలాంటి చోటనే దాగివుంటుందనేది సత్యం. కుంకుమ పూల కోసం చేసే జీవన యుద్ధం లాంటిదే నాది కూడా అనిపిస్తూ వుంది. 


ఈ రోజు పేపర్లో వార్త దిగ్భ్రాంతపరిచింది. వంద ఆవులకు పైగానే చనిపోయాయి అని. పక్కనే వున్న పల్లెటూరులో దాతల విరాళాలతో గోశాల నడుస్తుంది. ఎవరో విషప్రయోగం చేసారనే వార్త చక్కర్లుకొడుతోంది. కాదంటాడు సంబంధిత శాఖాధికారి. మంత్రి కూడా. విషం యెలాగైనా ప్రవహించవచ్చు. ఆహారం నీరు నేల మాట ఆలోచన యెక్కడినుండైనా ఆఖరికి ప్రాణాలను కాపాడే మందు కూడా   విషాన్నే వెదజల్లవచ్చు. దాని తీర్మానం దానిది.

  

దేశమంతా పూజించాలనే గోజాతి  వందల కొద్దీ  మనుషుల లెక్కన కుక్కల లెక్కన శవాలై పడి వుండటం చూసి మనసు కలత చెందింది. కారణాలేవైనా యివాళ యివి యెల్లుండి ఈద్ సందర్భంగా తెగిపడే మరిన్ని గొర్రెలు, ఆవులు. మనుషుల మూఢ విశ్వాసాలకు ఆహారప్రీతికి బలైపోయే మూగజీవాలు. ఈ బలులకు అంతే లేదు.ఆ మాట ఎవరితోనైనా అంటే మీరు నాన్ వెజ్ తినరా అని అడుగుతారు. తినేవారికి జీవ హింస తప్పు కాదు.ఏ జంతువైనా తప్పుకాదు కదా అని నా ఆలోచన కూడా! మనుషులకు తినాలనుకున్నప్పుడు తప్ప మిగతాదంతా కారుణ్యమే.  పసి పిల్లను రేప్ చేసి చంపినవాడికి పడ్డ ఉరిశిక్ష కూడా సబబు కాదు అంటారు. మనుషులందరిదీ ఒకే ఆలోచనా విధానమైతే యెట్టా, ఒకరు అవునంటే యింకొకరు కాదనాలి. కాదనడానికి కారణమేమి ఉండనవసరం లేదు. కేవలం వ్యతిరేకించాలి అనేదే ముఖ్యం తప్ప   ఫ్లిప్ సైడ్ యెంతమాత్రం  కాదు.


మా ప్రక్కన ఎకరాలకు ఎకరాలు నివాస స్థలాలుగా విడగొట్టబడుతుంటే మేము చుట్టూరా పచ్చదనాన్ని కాపాడాలని కుండీలలోనైనా మొక్కలు నాటాలని తెగ తాపత్రయపడి నర్సరీల చుట్టూ తిరుగుతున్నాం. ముద్ద మందారాలు ముద్ద గన్నేరులు పూజకు పనికి రావండి అంది వొకామె. అసలు మన ఆలోచనలు  పనులే సమాజానికి పనికిరావండీ అని అందామని  పెదాలపైకి వచ్చి వాటిని వెనక్కి కుక్కుకున్నాను. మనుషులకు అన్నింటికీ మంచి కావాలి. ఈ మంచి మంచి మంచి అన్నది వినలేక చస్తున్నా. యూట్యూబ్  లో అనేకమంది చెప్పిన విషయాలని అరగదీసుకుంటూ విని వినీ కూడా అందరూ మంచికి క్రానిక్ అయిపోతున్నారు. మరి చెడు అంటే యేమిటో ఊహకి అందనంతగా మనుషులంతా యింత మంచాళ్ళు అయిపోతే మిగతా ప్రాణులు పర్యావరణం తట్టుకునేది యెట్లబ్బా !  


కుక్కలనుకుంటా, మంచి కోడిపెట్టనొకదాన్ని లాక్కొచ్చి పూపొదల దగ్గర వదిలేసి పోయాయి. ఆ మాటే వాచ్ మెన్ తో అంటే అయ్యో, పొద్దున్న నుండి నేను ప్లాస్టిక్ నల్ల కారీబేగ్ అనుకుంటున్నానండీ, కోస్తే కిలోన్నర మాసం ఈజీగా పడేది అంటూ వొంగి దాన్ని అందుకోబోయే సమయానికి టక్కున వెనుకింటావిడ గోడమీద ప్రత్యక్షం. కుక్కలు పట్టుకొచ్చినవే అయినా మంచిదో లేదో యేవన్నా రోగాలొచ్చి చస్తే బయటపడేస్తే లాక్కొచ్చాయో అంది. 


కోడి రెక్కను అందుకోబోయిన  వాచ్ మెన్ చేయి ఎలక్ట్రిక్ షాక్ కొట్టినట్లు ఆగిపోయింది. కాసేపు ఆ మాట యీ మాట మాట్లాడినాక ఆ కోడిని తీసుకెళ్ళి డస్ట్ బిన్ లో పడేసి రావయ్యా అని వాచ్ మెన్ ని అంటే .. చెత్తబండి వాళ్ళు వస్తారు కదండీ వాళ్ళు తీసేస్తారు అన్నాడు.  


వాళ్ళు రేపటికి రాకపోతే దాన్ని తీయకపోతే ఇదంతా వాసన కదా, తీసేయకూదడా అంటే అతని నుండి సమాధానమే లేదు. ఓర్నీఇతని ఆలోచనల్లో యెంత మార్పు అనుకుని ఆశ్చర్యపోవడం నావంతు. 


పూల సంచీ పట్టుకుని బండి తీయబోయుంటే  వాచ్ మెన్ “అయితే  మీరు రోజూ యీ పూలు కోసుళుతున్నారు దేవుడికి పెడతానికా అండీ? అయితే నేను పెడతాను లోపల దేవుడి పటం వుంది. మొన్న శుక్రవారం నాడు ఆ తీగకున్న పువ్వు ఈ తీగకున్నపువ్వు తెంపుకొచ్చి పెట్టాను.  పూలరేటు బాగా యెక్కువ వుందండీ, ఇక రేపటినుండి ఈ పూలే పెడతాను” అన్నాడు. 


హతసురాలినైపోయాను. ఇక్కడ కూడా పోటీ యేనా అని. 


రోజూ  తెల్లారేటప్పటికి పూల కోసం పరుగులు పెట్టడం పెద్ద పని అయిపోయింది నాకు. ద్విచక్రవాహనం పైనే అయినా పరుగులు తీయాల్సి వస్తుంది. ఎండెక్కితే పూల కోసం ప్రాకులాట మరింత యెక్కువైపోతుంది. అని  నా కొడుకుతో చెపుతుంటే .. "నువ్వేదో అహింసామూర్తిని అనుకుంటున్నావ్ కానీ నీలోనూ అసుర గుణం వుంది. కావాలంటే గుర్తు తెచ్చుకో ..చిన్నప్పుడు నాలుగైదు సార్లు నన్ను మజ్జిగకవ్వంతోనూ నా  బెల్ట్ తోనూ నన్నేనూ  కొట్టావ్" అన్నాడు. 


"దండం దశ గుణ భవేత్ అంటారు కదా బంగారం, అలా దండించి వుండకపోతే నువ్వింత కుదురుగా పెరిగేవాడివా చెప్పు" అని గడుసుగా అంటుంటే.."నేను నాపిల్లలను అసలు కొట్టకుండా పెంచుతా చూడు"అన్నాడు.


 "మంచిది, పైగా మీకక్కడ నియంత్రణ చేసే చట్టాల చుట్టాలున్నారు కదా" అన్నాను. కాసేపు నవ్వుకున్నాక  మళ్ళీ అన్నాడు "నీలోనూ రాక్షస గుణం వుంది"అని. నేను ప్రశ్నార్ధకంగా చూస్తుంటే "అహింస ప్రధమం పుష్ఫం అని నీకు తెలియదా .. భగవంతుకి అర్పించే పూలను కూడా యే మాత్రం కనికరం లేకుండా  ప్రొద్దు ప్రొద్దున్నే విరిసీ విరియకుండానే త్రుంచి త్రుంచి ప్లాస్టిక్ సంచీలో కుక్కి కుక్కి ప్రిజ్ లో దాపెట్టి తీరికగా వీలున్నప్పుడు తీసి కర్ణ కఠోరంగా  అష్టోత్తరాలు వినిపిస్తూ దేవునికి పుష్పాభిషేకం చేయడం మాత్రం హింస కాదు" అన్నాడు.


 నాతో పాటు కరుణశ్రీ పుష్పవిలాపాన్ని బాగా విన్నవాడు. అలా ఆలోచించడంలో తప్పు లేదులే అనుకుంటూనే వెను వెంటనే నేనూ చిన్ని పువ్వా అని అందుకున్నాను. 


"భలే వుందిగా మళ్ళీ చెప్పమ్మా అన్నాడు.. 


"చిన్ని పూవే వాడెనా తన కన్నె వలపు వీడెనా తన చిన్నెలన్నియు వన్నెలన్నియు మన్నులో కోల్పోయెనా? కాంతునెరుగని కన్నె గాదా మొన్న మొన్ననే ముద్దు వల్లిని మొనలు దీరెనుగా!" 

….అని వినిపించి "పూల జన్మకు సాఫల్యం సిద్దించాలి. కేవలం వాటిని దేవుని పాదాల దగ్గరకు చేర్చే వాహకాన్ని నేను"అని  అన్నాను  నన్ను నేను సమర్ధించుకుంటూ. పూల బాసలు తెలిసిన వారికి మాటలయుద్దంలో సున్నితంగా గెలవడం బహుతేలిక కదా! మనసులో అనుకొంటిని కూడా ! 


ఫోన్ పెట్టేసాక తీరిగ్గా కాసేపు అసలు ఆనందమంటే యేమిటని ఆలోచిస్తూ కూర్చున్నా. పచ్చని కొమ్మన విలాసంగా  వూగుతున్న రాచిలక  కేరింతలను ఆహ్లాదంగా  చూస్తూ  .. 


అరె..ఆకాశంలో పాము యెగురుతుంది యేమిటబ్బా అని ఆశ్చర్యపోతూ  ఆలోచించి ఆలస్యంగా మెదడులో జ్ఞానరేఖ తళుక్కుమని  మెరిసి చిన్ని పిట్టలు గూడు కట్టుకోవడానికి కొబ్బరాకులను మోసుకెళుతున్నాయని ఆనందపడటం, రెండు పసుపు  పచ్చ సీతాకోక చిలుకలు గాలిలో వూరేగుతూనే  మూతి మూతి ఆనించుకుని వూసులాడుకోవడం, వుడుతొకటి పద్దతిగా పూలకొమ్మపై కూచుని విరిసిన పూవుని తెంపి మొదలు తిని చివరలను కిందకి వొదిలేయడం యివన్నీ చూస్తుండటం మాత్రం ఆనందం కాదూ.. ఏమిటో వెఱ్ఱి ముఖందాన్ని ఆనందాన్ని వల వేసి పట్టాలనుకోవడం మూర్ఖత్వం కాదూ! రకరకాల పూలు సేకరించి చేసే  పూజలో ఆనందం వుందా ఆరాధన వుందా అర్పణ వుందా కామితములు తప్ప. మనిషికి ఒక ఆశ తీరినాక మరొక ఆశ కాదు కాదు మూకుమ్మడి ఆశలు అవి నెరవేర్చమని ప్రార్ధనలు. నేను మానసికంగా యెదిగేదెన్నడూ? 


అన్నట్టు ఈ ఆనందాలకు తోడు మరో చిన్న ఆనందం జత చేరింది కాసేపటికి. దానికి వొక కథ వుంది. అది కూడా వినేయండి మరి.


మా పార్కింగ్ ప్లేస్ చుట్టూతా  నానా చెత్తంతా పేర్చబడివుంటుంది. అట్టపెట్టెలు పాత చెప్పులు విరిగిన కుర్చీలు పాత చీపురులు ఇంకా ఫాస్ట్ పుడ్ సెంటర్ కు సంబంధించిన సామానుతో పాత సామానుల గౌడన్ లా వుంటుంది తప్ప పార్కింగ్ ప్లేస్ లా వుండదు. ఆ సామానుల మధ్య పేరుకుపోయిన దమ్ముధూళి కారుకు కూడా చుట్టుకుని తళతళలాడే కారు అందాన్ని దెబ్బతీయడం సహించలేకపోయాను.  గత ఐదారునెలలుగా యిదే తీరు. పార్కింగ్ ప్లేస్ పార్కింగ్ ప్లేస్ లా వుండాలి.. తప్ప గౌడన్ లా కాదు. అవన్నీ తీసేయమను అని వాచ్ మెన్ కి చెప్పాను. అతను విన్నాడు వినిపించాడో లేదో తెలియదు వినిపించినా పెడచెవిని పెట్టారో తెలియదు. 


నేనలా చిరాకు పడుతూనే వున్నా,రోజులు గడుస్తూనేవున్నాయి. వర్షాలు మొదలయ్యాక ఆ సరంజామా మధ్యనుండి పాములు మండ్రగబ్బలు రావడం మొదలయ్యాక పిల్లలున్న వాళ్ళం.ఇలా వుంటే మేముండలేము అని వాచ్ మెన్ అతని భార్య పాట పాడటం మొదలెట్టి కష్టాలన్నింటినీ చరణాలుగా మార్చి పదే పదే వినిపించారు. ఫలితంగా పార్కింగ్ ప్లేస్ కొంత శుభ్రపడింది. 


విసుక్కుంటాను అపుడపుడు. అసలు వీళ్ళ తీరు యింతే! మూడొందల అరవై ఐదు రోజుల్లో సగం రోజులు నీచు కంపు ఘమ ఘమ లాడే  మసాలా కంపులతో కాలక్షేపం చేస్తారు తప్ప పార్కింగ్ ప్లేస్ శుభ్రం చేయరు. పైగా అక్కడ కట్టెల పొయ్యలు పెట్టి డేగిసాలు డేగిసాలు బిర్యాని వండుతూ వంటసాల చేస్తున్నారు. ఏమన్నా అనకముందే మా పార్కింగ్ ప్లేసే కదండీ అనడం. అక్కడంతా అరాచకం. వొకటి రెండుసార్లు గట్టిగా మాట్లాడం వల్ల వాళ్ళు నన్ను చూస్తే ముఖం గండుగా పెట్టుకుని చూడటం మాములై పోయింది.  పులి మీద పుట్రలా నా చికాకును మరింత పెంచుతూ సీజన్ అయిపోగానే డ్రింక్స్ షాపు సరంజామా అంతా తెచ్చి మళ్ళీ పార్కింగ్ ప్లేస్ లో సర్దారు. నష్టపడ్డారంట. షాపు అద్దె కట్టలేక సామాన్లన్నీ అక్కడ  సర్దిపెట్టారని వాచ్ మెన్ సమాచారం.  కొంత సామాను  మాకు కేటాయించిన స్థలంలో సర్దుకున్నా చూసి చూడనట్టు ఊరుకున్నాను. అదీ వెనుకటి కథ. 


ఇక యిప్పటి ఆనందక్షణాలు లోకి వచ్చేద్దాం.


 ఈ రోజు ఈద్. లిప్ట్ దగ్గరలో కూర్చుని మాట్లాడుకుంటున్న టోపివాలాలను చూసి ఈద్ ముబారక్ చెప్పబోయి సందేహించాను.  అంతలో పది పన్నెండేళ్ళ పిల్లవాడు రెండు చేతుల మధ్య తూకం మిషన్ పెట్టుకుని.. "కొంచెం లిప్ట్ డోర్ తీస్తారా" అని అడిగాడు. లిఫ్ట్ డోర్ లు తెరిచి అతను వెళ్ళాల్సిన అంతస్తు నెంబర్ నొక్కి లిఫ్ట్ డోర్ మూస్తూ "ఈద్ ముబారక్ భాయీ" అన్నాను. పెద్ద వాళ్ళు మాటలాపి నావైపు చూస్తుంటే పిల్లవాడు “థాంక్స్ ఆంటీ “అన్నాడు రెండుసార్లు. రెండోసారి థాంక్స్ చెప్పినప్పుడు  “ఇట్స్ ఓకే” అన్నాను. 


పండుగ అందరిది. తీసుకోవడంలోనే వుందంతా. అసురులు భూసురులు అంతా మన ఆలోచనల్లోనే వున్నారు. తగు విధంగా బయటకు వస్తూ వుంటారంతే! అని అనుకున్నాను. 


రేపు శ్రావణ మంగళవారం. గౌరీ దేవిని పూలతో బాగా అలంకరించాలనే ఆలోచన వచ్చినదే తడవుగా రేపుదయం ఊహలలో మెదిలింది.  ప్రొద్దు ప్రొద్దుటే పూల చెట్లు పొదల చుట్టూ తిరుగుతూ యెవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు పూలిమ్మని .. అని అబ్బురపడుతూ ప్రకృతిలో మమేకమైనట్టూ, పూజలు సేయ పూలు తెచ్చాను తీయరా తలుపులను రామా ..అని ఆర్తిగా పిలిచినట్టూ  పూవులేరి తేవే చెలి పోవలె కోవెలకు ..  అనుకుంటూ వుందునా, లేక నిన్ను అర్పించ హృదయపుష్పం చాలును కదా ప్రభూ/దేవీ  అంటూ ఎస్కేపిజం ప్రదర్శిస్తానో అన్నది రేపుదయానికి కానీ తేలదబ్బా. ఆలోచనల్లో మార్పు ఆచరణలోకి మారడం చాలా కష్టం. నా మటుకు నాకు నాణేనికి రెండోవైపు చూడటం సులువైన వ్యవహారమే!


25, సెప్టెంబర్ 2019, బుధవారం

నీట చిత్తరువు



“అరవై కొమ్మల వృక్షం నేలబడిందంటే తిరిగి లేవదు, ఏమిటో చెప్పాలి” అంది వాకిట్లో ముగ్గు వేస్తూన్న నారాయణమ్మ.


కాసేపు ఆలోచించి “ఏమో తెలియడం లేదు, నువ్వే చెప్పు” అన్నాను.


“పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు కదా, ఇది కూడా తెలియదు మీకు, పొద్దునే లేచి ప్రతి ఆడోళ్ళు చేసేది” అంది .


“ముగ్గేసే పని అందరూ చెయ్యలేరులే” అనంటే నవ్వింది.


నారాయణమ్మ దగ్గర మంచి సంభాషణా చాతుర్యం వుంది, నలుపు రంగులో భలే కళ గా ఉంటుంది.చీటికి మాటికీ విరిసే నవ్వు ఆమె చక్కదనాన్ని చిక్కబరుస్తుంది. బాగా ముగ్గులేయడమే కాదు ముగ్గు గురించిన సామెతలు కూడా తెలుసు ఆ మాటే అంటే..


“సామెతలు, పాటలు, ముగ్గు పిండి చేయడాలు అన్నీ వచ్చు” అంది.


“ఏంటి ముగ్గురాళ్ళు కొట్టేదానివా నువ్వు” అడిగాను ఆసక్తిగా


"ముగ్గురాళ్ళ కొట్టడం కాదు. అసలా ముగ్గు పిండి చేసే గుల్లలను సముద్రం నుండి పట్టుకొచ్చి కాల్చి ముగ్గు పిండి చేసేవాళ్ళం అంది.ముగ్గులో పసుపు కుంకుమ పెట్టి పూలు పెడుతూ ఇంకా ఏవేవో మెరుగులు దిద్దుతున్న తనని ఆపుతూ “వేసింది చాల్లే, అంట్లు తోముకుంటూ ఆ కథ చెపుతువుకాని రా” అన్నాను.అక్కడనుండి కదలకుండానే ఆ కథంతా చెప్పేయగలదని భయమేసి. అవతల ఆఫీస్ కి లేట్ అవుతుందనే భయం నాది.. నేను పాలగిన్నె పొయ్యిమీద పెట్టి నారాయణమ్మ వైపు చూసాను కథ కొనసాగింపమని.


“మా నాయనది నిజాం పట్నం. మా అన్నదమ్ములు మేనత్తలు యిప్పటికి అక్కడే వుండారు. మా నాయనే చేపలు పట్టుకుంటూ బందరు వచ్చేసి అక్కడే నిలిచి పోయాడు. ఆరుగురు అక్కచెల్లెళ్ళం ఇద్దరు అన్నదమ్ములు. మా నాయనొక్కడూ ఏట కెళ్ళి చేపలు తెస్తే మా కడుపులు నిండేది యెట్టా? మానాయన మమ్మల్ని సముద్రంలో దింపి ఏట నేర్పాడు.మా అక్కాళ్ళు నాయనతో పడవమీద ఏటకెళ్ళేవాళ్ళు. చిన్నాళ్ళం మేము ముగ్గురం కలిసి నడుముకు ఉల్లిపాయలు సంచి గోతాము సంచి కట్టుకుని తాటి చెట్టు లోతుకి వెళ్లి మగాళ్లు వేసుకునే పైపంచ ఉంటది చూడు దాన్ని నాలుగు చెరుగులని రెండు చేతులతో పట్టుకుని అలొచ్చినప్పుడల్లా దానితో పాటు ఒడ్డుకు కొట్టుకొచ్చే గవ్వలు ఆల్చిప్పలు నత్త గుల్లలు ఎంట్రకాయలని వొడుపుగా జొవురుకుని నడుముకు కట్టుకున్న సంచీలో యేసుకునేవాళ్ళం. సంచి నిండేదాకా అట్టా దేవులాడతానే వుండేవాళ్ళం. వాటిని ఇంటికి మోసుకొస్తే మా అమ్మ యేటికాటికి యేరు చేసి ఎంట్రకాయలను నత్త గుల్లలను చిన్న చేపలను వూళ్లో తిరిగి అమ్మేసుకోచ్చేది"


“నత్తలను కూడా తింటారా” అని ఆశ్చర్యంగా అడిగితే “ఆ.. ఆసంగతి మీకు తెలియదదేంటి” అని తాను ఆశ్చర్యపోయింది.


“సర్లే నత్తలు యెలా వొలుస్తారు చెప్పు మరి”


“నత్తలుడకబెట్టే సున్నపు గాబు వుండేది మాకు. దానికింద గాడిపొయ్యి. గాబులో నత్తలు నీళ్ళుపోసి పెళ పెళ లాడేమంట పెట్టి వుడకబెట్టే వాళ్ళం. నత్తలు బయటకి వచ్చేసేయి. వాటిని కూర వొండుకోవడమో డబ్బులు కావాలంటే అమ్మేయడమో చేసేది మా అమ్మ. అట్టా మిగిలిన నత్త గుల్ల పెంకులను ఆల్చిప్పలను శంకువులను అన్నింటిని పోగెట్టి బట్టీ పెట్టి కాల్చే వాళ్ళం. అన్ని చక్కగా కాలి సున్నం లాగా అయిపోయేది. కాలని వాటిని నల్ల బడిన పెంకులని యేరి పారేసి ఆ సున్నం పొడిని అమ్ముకునేవాళ్ళం. ఎట్టా ఉండేది అనుకునేవ్ ఆ పిండి, తెల్లగా ఎన్నెల పిగిలిపడతన్నట్టు ఉండేది. ఆ పిండితో ముగ్గేస్తే కర్ర ఎంత చక్కగా వస్తదో. నువ్వుగాని చూసావంటే వొదిలిపెట్టవ్ “ అంది. అంట్లు కడగడం పూర్తిచేసి తడిచేతులు పమిట చెంగుకు తుడుచుకుంటూ.


“ఇప్పుడు కూడా అలా తయారుచేసేవాళ్ళు వున్నారా అడిగాను” కాఫీ కప్పు అందిస్తూ . “


"


ఇప్పుడెవరు చేత్తారు అయన్నీ. అప్పుడు పొట్టకూటి తిప్పలవి. అప్పుడైనా ఆ ముగ్గు పిండికి డబ్బులు ఇచ్చేవ్వాళ్ళా యేమన్నానా, డబ్బు బదులు నూకలు పెట్టేవాళ్ళు, పాత బట్టలిచ్చేవాళ్ళు. అన్నం పెట్టేవాళ్ళు తీగకి కాసిన సొరకాయలిచ్చేవాళ్ళు. అదే పరమానందం మాకు. ఇప్పుడవన్నీ చేసేవాళ్ళు ఎవరుండారు? మర పడవలు వచ్చేసాయి. బోట్ లో సిలిండర్ వేసుకెళ్ళి వంటలు చేసుకుని తింటూ వారం పదిరోజులు ఏట చేసుకుని వచ్చి అమ్ముకుని కూసుని తింటున్నారు. కాకినాడ లో మా వాళ్ళందరూ ఇంట్లో కూసుని తినడమే. ఆడాళ్ళు ఒక్కరు పనికిబోరు. బట్టలుతుక్కునే మిషన్లు కూడా కొనుక్కుని సుఖంగా వుండారు. అని.. నేను పోతన్నా.. నీ దగ్గరే కూసుని కథలు చెప్పుకుంటే ఎట్టా ... అవతల నా పని మొగుడు తరుముతున్నాడు” అని కప్పు కడిగేసి పెట్టి వెళ్ళిపోయింది.


ఎనిమిది ఏళ్ళ క్రితం మా ఇంటి ముందావిడ పనెమ్మాయిని పెట్టుకుంటారా అని అడుగుతూ తన వెనుక నిలబడ్డ నారాయణమ్మని చూపిచ్చింది. విరిగిన మోచేతికి కట్టు కట్టుకుని మెడ చుట్టూ చీర చెంగు కప్పుకుని ఎంతో దిగులుగా కనబడిన ఆమెని చూసి జాలి అనిపించి సరేనన్నాను పనమ్మాయి అవసరం లేకపోయినా కూడా. అట్టా వచ్చి యేళ్ళ తరబడి కూరుకుపోయింది మా ఇంట్లో మనిషిగా. ఏ వేళప్పుడు వచ్చి తలుపు తట్టినా సంకోచం లేకుండా తలుపు తీసి నమ్మకంగా లోపలి రానీయగల్గిన మనిషి అయిపోయింది.


“కొమ్ములుంటాయి కానీ ఎద్దు కాదు,అంబారీ ఉంటుంది కానీ ఏనుగు కాదు.. ఏమిటది ?” అంది ఇల్లు తుడుస్తూ.


“తెలియదులే నువ్వే చెప్పేయ్” అన్నాను కొంచెం విసుగ్గా. నవ్వుకుంటూ పాట అందుకుంది.


“భలే పాడుతున్నావే. నిజం చెప్పు నువ్వసలు చదువుకోలేదా ?”


“ఏం చదువుకోకపోతే పాటలు పాడలేరా,వరసగా పది పాటలు పడతాను ఇనుకో” అంది నన్ను ఆట పట్టిస్తూ. నా ముఖంపై నాట్యమాడే ఆశ్చర్యాన్ని ఆటపట్టిస్తున్నట్లు చూస్తూ నవ్వుకుంటూ “శివుని శిరసు పైనె చిందు లాడెడి గంగ శ్రీ విష్ణు పాదమున వెలసిన గంగ అంటూ మొదలు పెట్టి ఆపకుండా జాము రేతిరి యేళ జడుపు గిడుపూ మాని సెట్టు పుట్టా దాటి సేనులో నేనుంటె మెల్లంగ వస్తాది నా యెంకీ సల్లంగ వస్తాది నా యెంకీ “అంటూ నాలుగు గీతాలు పాడింది.


బ్యాంకులో వేలిముద్ర వేసి అకౌంట్ ఓపెన్ చేసినప్పటి సంగతి గుర్తొచ్చి “యెట్టా గుర్తుంటాయి నీకవన్నీ” అంటే “రక్తములో వచ్చింది ఎక్కడికి పోద్ది. ఇదంతా మా అమ్మ చలవ. మా అమ్మ పరికి ముగ్గులామె. బందరులో ఆటాడుతూ పాటలు పాడుతున్న ఆమెని చూసి ప్రేమించి పెళ్లి చేసున్నాడు మానాయన. పెద్ద యుద్ధమే చేసాడంట మానాయన యింటో వాళ్ళతో. మా అమ్మని చూస్తే ఆశ్చర్యపోతావ్ మీ యిళ్ళల్లో పుట్టినావిడికి మల్లె వెలిగారం అద్దిన బంగారంలా మెరిసిపోతా వుంటది అంది. వెలిగారం అంటే యేమిటో అది అద్దిన బంగారం యెలా వుంటుందో నాకు తెలియకపోయినా వూ కొట్టి వూరుకుని “అయితే మీ అమ్మ బాగా పాటలు పాడుతుందా?”


“బాగా పాడుద్ది.పెద్ద పెద్దోళ్ళు పండక్కి, పెళ్ళిళ్ళకు ముగ్గులేయడానికి, పోలు పొసే చోట ముగ్గేయడానికి అమ్మవారి గుడిముందు ఉత్సవం ముగిశాక వేసే రతి ముగ్గు వేయడానికి వెంటబెట్టుకుని తీసుకెళ్లేవారు. అంత పేరు మా అమ్మకి” అని గర్వంగా చెప్పింది.


“నువ్విచ్చిన రేడియో ఏం చేసాననుకున్నావ్ ఆమెకే ఇచ్చి పంపిచ్చా మా అక్క కొడుక్కిచ్చి. . వొళ్ళో పెట్టుకు కూర్చుని పాటలు వింటా ఉంటది. రోజు వార్తలు వినాలి. సముద్రం ఎట్టా ఉంటాదో,తుఫాను వస్తుందేమో అని. కొడుకులు సముద్రంలోకి ఏటకెళ్లి యెప్పుడొస్తారో అని యెదురెదురు చూస్తా ఉంటది.ఒకేల తుఫాన్ వార్తలు విన్నదనుకో, చెవికి అతికిచ్చుకుని ఒకటే ఫోన్ చేస్తానే వుంటది కొడుకులు మీద అంత భ్రమత. అందరూ బాగానే వుండారు కదా నేను ఒక్కదాన్నే యిట్టా వుండా. అయినా నా గురించి ఒక్కరవ్వైనా పట్టించుకోదు. తల్లి కూడా అంత కఠినాత్మురాలు” అని కళ్ళ నీళ్లు పెట్టుకుంది.


సరదాగా మొదలైన సంభాషణ దుఖంలోకి దారితీసింది. పమిట చెంగుతో కళ్ళు అడ్డుకుంటూ చెప్పింది తీరం వెంబడి సాగుతున్నజీయితం యిట్టా నగరానికి కొట్టుకొచ్చి గిలగిల లాడతా వుంది. అందరికి నా డబ్బులైతే కావాలి నేను మాత్రం అవసరం లేదు..అనుకుంటూ మనసులో కచ్చ నంతా తుడుస్తున్న బండ్లపై చూపించింది. నేను మౌనంగా వుండిపోయాను. ఇల్లంతా తుడిసి వచ్చి కాఫీ పెట్టవా అంది.


"ఎందుకు పెట్టనూ , కోపం తగ్గిందా?"


"కోపం కాదమ్మా ! మీ అందరూ అప్పుడు ఆదుకోకపోతే ఏమైపోయేదాన్ని నేను. అసలు ఇల్లు వొదిలి ఎందుకొచ్చేసినా అని ఎవురైనా ఆలోచించారా ? బిడ్డలను వొదిలిపెట్టేసి పోయింది అంటారే కానీ ఇల్లు ఎందుకు వదిలిపెట్టానో చెపితే ఒక్కరైనా నమ్మారా? ఎప్పుడు నువ్వడగలేదు నేను చెప్పలేదు గందా.. చెపుతా వినుకో" అంటూ గోడకి వెన్ను ఆనించి స్థిమితంగా కూర్చుంది .


నాకప్పుడు పదమూడేళ్ళు. మా ముగ్గురక్కలకు పెళ్ళై పోయింది. నేను పదమూడో ఏట పెద్దమనిషి అయ్యాను.ఒంటికి వసంతం వొచ్చింది గొంతుకి పంచమం కూయడం వచ్చింది అనేది మా అమ్మ. పెద్దమనిషి అయ్యాక నెలకే మా మేనత్త పల్లిపాళెం నుండి మా ఇంటికి వచ్చింది. ఆమెకి ఒక కొడుకు వున్నాడు. అంతకు ముందే పెళ్ళైపోయింది వాడికి. ఒక కొడుకు పుట్టాక పెళ్ళాం ఆ పిల్లాడిని తీసుకుని ఎల్లిపోయిందంట. నారాయణి ని నాకొడుక్కిచ్చి చేయరా. ఎప్పుడో ఎడం అయిపోయిన వాళ్ళము ఇట్టాగన్న కలిసిపోతాం అని పీడిచ్చింది. మా నాయనకి అంత ఇష్టం లేకపోయినా మా అమ్మ వొప్పిచ్చింది. మా అత్త కొడుకుని అంతకుమునుపు చాలాసార్లు చూసినాను. అప్పుడప్పుడు మా నాయనమ్మ మమ్ములను నిజాం పట్నం తీసుకుపోయేది గందా . ఎంత చొక్కు అనుకున్నావ్ ఆడికి. ఓ ఇచ్చకాలు ఆడేవాడు పెళ్ళాంని పక్కనబెట్టుకుని కూడా. పెళ్ళాం ఎందుకు వొదిలేసి పోయిందో అందరికి తెలుసు.అసలు పని చేయడు, ఎప్పుడూ కల్లు ముంతలు ఎత్తేయడమూ, సారా తాగడం మంచానికి అడ్డంగా పడి ఉండటం. ఇంటో సరైన ఆడది ఉంటే మగాడు ఎందుకు అట్టా తయారవుతాడు. పిల్లనిచ్చావ్ అనుకో నా ఇంటికి లచ్చిందేవి వచ్చినట్టేరా అన్నయ్యా. బాగా చూసుకుంటాం వొప్పుకోవే అని బతిమలాడి మానాయనను ఒప్పించింది.


“మరి నీకిష్టం లేదని చెప్పలేదా ?”


“చెప్పే దైర్యం లేదు, వినేవాళ్ళు లేరు. నాకిష్టం లేకపోయినా మాఘమాసంలో లగ్గమైంది. అత్తారింటికి పంపిచ్చారు. ఆడితో జీయితం నరకం అనుకో. సముద్రం ఈదటం నేర్చుకున్నా కానీ ఆడితో మంచం ఈత నేర్చుకోలేకపోయా.రోజూ గోలే, ఇద్దరు బిడ్డలు పుట్టినా ఆడు రూపాయి సంపాదిచ్చడానికి యిల్లు వొదిలేవాడు కాదు. నిండు గర్భిణిగా వుండి కూడా సముద్రానికి పోయి నత్తలు ఎంట్రకాయలు ఏరుకురావాల్సి వచ్చేది. చేపలమ్ముకొచ్చి మొగుడుకి కూడా కూడు పెట్టాల్సి వచ్చేది. మా తమ్ముళ్లు పెద్దవాళ్ళై బందరు రేవులో ఏట అంత బాగోలేదని కాకినాడకు ఎల్లిపోయారు. మరపడవల్లో పనికి కుదిరిపోయారు. వాళ్లతో కూడా పనికి రమ్మన్నా పోయేవాడు కాదు. ఒకరోజు ఏం జరిగిందంటే ... అని ఆపింది. చెవి ఉగ్గ పెట్టాను ఏమి చెపుతుందా అని.


మిట్ట మధ్యాహ్నం యేటి కుక్కలు కూడా పొదల్లోకి దూరి నిద్రపోయే టైము. ఎండ కూడా యెన్నెలలాగానే వుంది.సముద్రం కూడా గంభీరంగా వుంది. రెండు చేపలైనా దొరుకుతయ్యి అని తీరానికి పోయాను. ఒక గంటసేపు ఈది కాసిని నత్తలు రెండు చేపలు చేజిక్కించుకుని ఇంటికి బయలుదేరా. మా ఆయనతో తిరిగే నలుగురు చచ్చినోళ్ళు పొదలలో దాక్కున యేటి కుక్కలు చేపల ఏటకి ఒక్కసారే చుట్టేసినట్టు నన్ను నాలుగు పక్కలనుండి చుట్టేసారు.చిల్లకోల వుంది నా చేతిలో. ఒక్కొక్కడిని పొడిచి పారేత్తున్నా.ఒకడు వెనకనుంచి వచ్చి నా చేతిలో చిల్లకోల లాక్కుని విసిరి పారేసాడు. పొదల్లోకి లాక్కుపోతన్నారు వాళ్ళు. అంతలో కట్ట మీదనుంచి డుగ్గు డుగ్గు మని బండేసుకుని వచ్చినాడు అతను గాని రాకపోతే కుక్కలు చింపేసిన ఇస్తరి అయిపోయేది నా బతుకు. అతన్ని చూసి నన్ను వొదిలేసి పారిపోయారు వాళ్ళు.


"ఎవరతను? "


ఆ ఊరి రైతు కొడుకు పెద్ద వ్యవసాయం. చదువుకున్నాడు కూడా. చిన్నప్పుడు మాతో పాటు సముద్రానికి వచ్చి ఈత నేర్చుకున్నాడు.నేనే ఈత నేర్పానప్పుడు. చిన్నప్పటి సేయితం మాది. దేవుడల్లే వచ్చాడు. బెదిరిపోయిన నన్ను బండి మీద ఎక్కించుకుని మా పాలెంకి తీసుకెళ్లాడు. మా పేటలోకి రాగానే ఇక్కడ దించేయ్ నేను నడచిపోతానులే అని దిగి నడిచి పోయాను. నా మొగుడు ఇంట్లోనే ఉండాడు చేపలెయ్యి చిల్లకోల యేది నిన్ను మోటార్ బైకు మీద దించిన ఆ నా కొడుకెక్కడ అని జుట్టు పట్టి కిందకీడ్చి పెడీ పెడీ కొట్టాడు. నేను బండి మీద వొచ్చిన సంగతి నీకెట్టా తెలుసు నువ్వే కదా ఆ నా కొడుకులను నామీదకి ఉసి గెలిపింది అని అడిగా రోషంగా . అవునే నువ్వెంత పతివోతవో తెలుసుకొనేకే అట్టా పంపిచ్చినా అన్నాడు. కడుపు రగులుకుపోయింది. మీదపడి రక్కేసా. వాడు వూరుకుంటాడా నన్ను విరగొట్టేసి పోయాడు. పిల్లలు ఏడుస్తున్నా వొదల్లేదు. మంచాన పడి మూడు రోజులు లెగలే, పిల్లలకు వొండిపెట్టడానికి మా మరుదుల ఇళ్ళకి కాకినాడకు పోయిన మా అత్తను ఫోన్ చేసి పిలిపిచ్చినాడు. మా అత్తకు ఏమి చెప్పినాడో ఏమో, నీకు సిగ్గులేదంటే మొగుడ్ని వొదిలి ఇంకొకడితో ఊరేగుతావా అని బుగ్గల పొడిచి పొడిచి తిట్టి పెట్టింది. నాలుగోనాడు సముద్రం మీదకు ఏటకు పోతన్నానని పోయాడు. కానీ ఏటకు పోలేదు ఏమిలేదు. దాపున దాపున దాక్కుని నాకు కాపలాలు కాసేవాడు. అట్టా మూడుతడవలు చేసాడు. పంచాయితీ పెట్టిద్దును. మా నాయన కొద్దిగా ఓర్చుకో నారాయణా అన్నాడు.


నా మొగుడు మహా రోత మడిసి. చేటలో తౌడుపోసి కుక్కలను ఉసిగొల్పినట్టు సేయితుల్ని నా మీదకు ఉసిగొల్పి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని తాగేవాడు. ఆ సంగతి నాకర్ధమై నా జాగ్రత్తలో నేనుండాలని ఇల్లు కదలడం మానేశా. ఆడు అనుకున్నది జరగడం లేదని నన్ను చీటిమాటికి యేదో వొంక పెట్టేసి బాదేసేవాడు. అడ్డమైన బూతులు కూసేవాడు. విన్నవాళ్ళందరూ ఆడు కూసేది నిజమే అనుకునేవాళ్ళని ఆళ్ళు నన్ను చూసే చూపులను బట్టి అర్ధమైపోతా ఉండేది. ఒకరోజు మా అత్తా మొగుడు మా ఆడబిడ్డ మొగుడికి బాగోలేదని చూసి వచ్చేదానికి కావిలికి పోయారు. ఆ రోజు తీరంకి పోయి అతని కోసం కాపు కాసాను. బండి మీద వస్తున్న అతనికి అడ్డం పడి నన్ను యేడకన్నా తీసుకుని పో అని అడిగా. ఇదిగో నువ్విప్పుడు ఆశ్చర్యపడినట్టే అతను ఆశ్చర్య పడ్డాడు. నేను తప్పు చేసినా చేయకపోయినా నీకు నాకు రంకు కట్టడం మానడంలేదు నా మొగుడు. అదేదో నిజం చేసేయ్ అన్నాను అంది. కథ మొత్తం చెప్పేసేదే. ఇంటికి బంధువులు రావడంతో కథకి కామా పెట్టేసి నారాయణమ్మ పనిలోకి నేను అతిధి మర్యాదలోకి మునిగి పోయాం.


రాత్రి పడుకున్నాక కూడా ఎన్నో ఆలోచనలు చేసాను.నారాయణమ్మ అతనితో కలిసి వచ్చేసిందా ? అతను మోజు తీరాక వదిలేసి వెళ్లిపోయాడా ? అసలేం జరిగిందో ? నిద్ర పట్టలేదు నాకు. ప్రతి మనిషి జీవితంలో ఏవో చీకటి కోణాలుంటాయి హృదయంలో ఎన్నో అగాధాలుంటాయి . అందులో యెన్నో కోర్కెలు దాగుంటాయి. అప్పుడప్పుడూ అవి కీకారణ్యంలో అర్ధరాత్రి మేల్కొన్న మృగాల్లా భీకరంగా అరుస్తుంటాయి. ముసుగు వేసుకుని పైకి నాగరికంగా వుంటారు కానీ కోర్కెల నదిని అవలీలగా దాటేసినవారు ఎందరు?






నారాయణమ్మ కూతురు పెళ్ళికని డబ్బు అప్పుతీసుకుంది. అవి ఇవ్వలేదు. చెప్పా పెట్టకుండా పని మానేసి కొన్ని ఏళ్ళు అయింది. మళ్ళీ ఈ మధ్యే వచ్చి చేరింది. ఇన్నేళ్లు ఎక్కడున్నావ్ అంటే ఎక్కడ వుంటాను కాకినాడలో వుండాను. మతిచెడి పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తుంటే మావాళ్లు తీసుకుపోయి ఇంటో పెట్టుకున్నారు అని చెప్పింది. తమ్ముడు లేనప్పుడు మరదలు పోట్లాట బెట్టుకుని ఇంట్లో నుండి వెళ్ళగొడితే రాత్రంతా రైల్వే స్టేషన్లో పడుకుని తెల్లారి బండికి వచ్చానని చెపుతుంది కానీ వివరంగా చెప్పదు. మళ్ళీ ఇంకోసారి ఆశ్రయమిచ్చి ఆదుకున్నావ్ అంటుంది. నారాయణమ్మ మిగతా కథ చెప్పే రోజు కోసం ఎదురు చూడటమే అడిగితే అసలు చెప్పదు. ఏదోలే నాకు తోచిన పిచ్చి పనులు చేశా ..అయేమన్నా ఘనకార్యాలా చెప్పుకోడానికి అని దీర్ఘం తీసి తప్పించుకుంటుంది.


మర్నాడు ఉదయాన్నే నారాయణమ్మ పనికి వచ్చింది కానీ ఎప్పటిలా హుషారుగా లేదు. ముఖం దిగులుగా వుంది. తెచ్చిపెట్టుకున్న నవ్వుతో పని చేసుకుని వెళ్ళిపోయింది. ఏం జరిగిందో, పాపం రాత్రంతా గతం గుర్తుతెచ్చుకుని బాధపడిందేమో అందుకే ముఖం అలా వుంది అనుకున్నాను. మధ్యాహ్నం వచ్చి అమ్మగారూ నాక్కూడా కాసిని బియ్యం కడిగిపెట్టు. ఇంటికెళ్లి వొండుకుతినే ఓపికలేదు అంది.


"ఏమైంది జ్వరంగాని వచ్చిందా ? టాబ్లెట్ వేసుకుంటావా?"


నేనడిగిన దానికి సమాధానం చెప్పకుండా మరేదో చెప్పుకొచ్చింది. వింటూ ఉన్నా. "ప్రతి మగోడికి ఆడదాన్ని తనే రక్షిస్తున్నాడని వొలపరం.కండకావరం ఆడు అట్టా అనుకోకపోతే బతకలేడమ్మా "అంది.


ఏదో పెద్ద విషయమే చెప్పబోతుందనిపించి చిన్నగా నవ్వి కుర్చీ లాక్కుని ఎదురుగా కూర్చున్నా.


"ఆడ మనిషి ఏరుగా వుండి బతుకుతుంటే చూడలేక ఉక్రోషం యెల్ల గక్కుతారు దొంగనాయాళ్ళు. ' ఒరేయ్ పోరా, నువ్వుగాని లేకుంటే నాకు బతకడం తెలియకుండానే మట్టి గొట్టుకు పోతానా యేంటి అని సవాల్ యిసిరి బతుకుతుండా' అని చెప్పేసి వచ్చా అంది.


వింటూనే వున్నాను."తాడి చెట్టు లోతున ఈది గవ్వ పెంకు యేరుకుని పొడి చేసి బతికినదాన్ని భూమ్మీద పనిచేసుకుని బతకలేనా యేంటీ ? "


“కష్టపడి బాగానే బతుకుతున్నావ్. సంవత్సరానికి లక్ష రూపాయలు కూడబెట్టి తమ్ముళ్ళకి ఇస్తున్నావ్ కానీ, ఎందుకీ ఘోష శోష ? పాతవన్నీ తవ్వుకుని ఏడ్చి ఏడ్చి కళ్ళుపోవడం దిగులుతో కృంగిపోవడం తప్ప. చిలకలా నవ్వుకుంటూ యెప్పటిలా హాయిగా వుండు" అన్నా.


"హాయిగానే వుండానని ఓర్వలేక కుళ్ళు పోతన్నారమ్మా. రాత్రి నా కూతురు ఫోన్ చేసి ఇంత చిన్న పిల్లగా వున్నప్పుడు వొదిలేసి పోయావ్. మా నాయనమ్మ సాకింది కాబట్టి మా అన్న నేను బతికి బట్టకట్టాము. లేకపోతే ఏమైపోదుమో. ఏ రోజన్నా రూపాయి పెట్టావా నాకు. అంతా మీ తమ్ముళ్ళకి దొబ్బబెట్టి మమ్మల్ని సంక నాకిచ్చావ్" అని తిట్టి తిట్టి పోసింది. మళ్ళీ అంతలోనే "అయినా నీ పాపిష్టి సంపాదన నాకెందుకులే. నీ పాపం కొట్టే మా అన్న అట్టా ఉరేసుకుని చచ్చిపోయాడు, తిరిగిన తిరుగుళ్ళు చాల్లే కానీ ఇంటికొస్తే మా నాన్న ఇప్పటికైనా నిన్నేలుకుంటాడు" అని చెప్పి ఫోన్ పెట్టేసింది.ఎంత మాటనేసింది అది. ఎవరో గుండెని పిడికిటి బట్టి నొక్కినట్టు విలవిలా లాడిపోయాననుకో. దానికి కట్నం యిచ్చి పెళ్లి చేసింది నేను కాదు. వస్తువులు పెట్టింది ఇంటోకి కావాల్సిన సామాను అన్నీ తీసిచ్చింది నేనుకాదూ. అన్నీ నేను సంపాయిచ్చిన డబ్బులతో ముడ్డి దగ్గర్నుండి నోటిదాకా చేయించుకుని పెళ్లికి కూడా నన్ను రావొద్దని నువ్వొస్తే లేచిపోయినదాని కూతురునని చెప్పుకుంటారని ముదురుమాటలు మాట్టాడిన అదేమీ తక్కువది కాదు. నాలుగేళ్లపాటు చెమట చిందించి సంపాదించిన సొమ్మంతా దానికే పెట్టాను. విశ్వాసం లేనిది అది. ఎంత మాటనేసింది అమ్మా". అని కళ్ళ నీళ్లు పెట్టుకుంది.


నారాయణమ్మ కష్టం చెప్పడం మొదలెట్టిందంటే సముద్రపు హోరే. ఏ అడ్డుకట్ట వేసినా ఆగదని నాకు తెలుసు కాబట్టి మాట్లాడకుండా వింటూనే వున్నాను.


"నా కొడుకు మంచాడు. నా దగ్గర పైసా డబ్బులు ఆశించకపోయినా అమ్మా అమ్మా అని చుట్టుకు తిరిగాడు. ఎంత వద్దని చెప్పినా ఇనకుండా ప్రేమించి పెళ్లి చేసుకుని పెళ్ళాంతో గొడవలు పడటమే సరిపోయే. పెళ్ళాం నీళ్ళోసుకుందని సంతోషంగా చెప్పాడు. ఇక గొడవలు పడనులేమ్మా. కోడల్ని ఇంటికి తీసుకొచ్చుకుని బాగా చూసుకుంటాను అని రాత్రి చెప్పినాడు తెల్లారేపాటికి వురికి వేలాడాడు. మా అత్తముండ మాటలే దానికి కారణం. మీ ఆవిడ పుట్టింటికిపోయి మూడు నెలలు అయితే కడుపెట్టా వచ్చిందిరా అందంట. మనసు ఇరిసేసుకుని వురి యేసుకున్నాడు. ఆ పిల్లయినా అలిగి ఇక్కడి నుండి పోయేటప్పటికే నెలసరి నిలిచిపోయిందని చెప్పొద్దా. కూతురు మాటలు కొడుకు చావు ఇన్ని తట్టుకుని మొండిగా బతకపోతే ఏమైంది.. రోడ్డు మధ్యలో నిలబడితే ఒక్క క్షణంలో చచ్చిపోయే. నా కూతురికి రెండు లచ్చలు ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చిపడతాయి" అంది వేదనగా.


చెప్పలేని జాలి ముంచుకొచ్చింది నారాయణమ్మ మీద ."అలాంటి పిచ్చి పనులు,ఆలోచనలు చేయకు. ఒక ముద్ద తిని ఇక్కడే పడుకో ..ఇవాళ ఇంటికి వెళ్లొద్దు" అన్నా.


"ఈ మాత్రం వాటికే చచ్చిపోతే ఎట్టాగమ్మా! ఎక్కడ ఓడిపోయినా జీయితం ముందు ఓడిపోకూడదమ్మా జీయితం గెలవాలి "అంది దృఢంగా అన్నం తిని కాసేపు టీవీ చూసి ఆ మాట ఈ మాట చెపుతూ కాస్త మామూలు మనిషైపోయింది. సాయంత్రమయ్యాక "పనికెళ్ళి ఇంటికిపోయి ఒంటికి కాసిని నీళ్లోసుకుని మళ్ళీ ఇక్కడికే వస్తా" అంది.


"సరే మరి, నీక్కూడా వండేస్తా ఇక్కడే తిను" అని చెప్పి నేనూ పనిమీద బయటపడ్డాను.


రాత్రి అన్నం తిన్నాక నన్ను మెచ్చుకోవడంతో మాటలు మొదలెట్టింది


చెపితేనే వింటావు. మారు ప్రశ్న కూడా వేయవు. ఏళ్ళ తరబడి చూత్తన్నా. నీ కథ ఏంటని అడిగావా ఒక్కసారైనా. ఈ మాట నేను ఎంత మందికి చెప్పి ఉంటానో. ఆమె ఎవరి గురించి పట్టించుకోదు. ఆమె వుద్యోగం ఏమిటో ఆమె ఏమిటో. అంతే తప్ప ఎవరి గురించి ఒక్క మాట మాట్టాడదు. అవసరమైతే సాయం చేసుడు తప్ప. అంది.


"చెప్పాలనుకుంటే నువ్వే చెపుతావు కదా ! ఎదుటిమనిషిని బాధ పెట్టేటట్లు కూపీలు లాగడం గూఢచారి పనిచేయడం నావల్ల కాదులే!"


ఒక కాగితం నా చేతికిచ్చి "ఈ నెంబర్ కి ఫోన్ చేసి పని చేస్తందో లేదో చూడమ్మా. వాళ్ళు ఎత్తితే ఎదో నెంబర్ తప్పు కొట్టానని చెప్పి పెట్టెయ్" అంది.


"ఎవరి నెంబరు ఇది" అనంటే "ఎవరిదో కాదులే, మా పెద్ద తమ్ముడి నెంబర్ అది" అంది. ఆ నెంబర్ కి కాల్చే స్తే రెండో రింగ్ కి లిఫ్ట్ చేసి మాట్లాడితే రాంగ్ నెంబర్ అని కట్ చేసుకుని.. "మీ తమ్ముడు మాట్లాడాడు కదా" అన్నాను.


"నా నెంబర్ రాకుండా చేసేసినాడు దొంగ నా కొడుకు. ఎన్ని డబ్బులు ఇచ్చానో. బోట్ కొనుక్కోమని. వడ్డీతో సహా ఇచ్చేస్తానని కల్లబొల్లి కబుర్లు చెప్పి ఇప్పుడు పెళ్ళాం చాటు మొగుడు అయిపోయాడు. మా నాయన చచ్చిపోయినప్పుడు దినానికి డబ్బులిచ్చాను. మా మరిది చచ్చిపోతే శవం ఎత్తేయడానికి లేకపోతే డబ్బులిచ్చాను. రేషన్ బియ్యం తప్ప ఒక్క వెచ్చాము కొనింది లేదు. ఆ అమ్మ పెట్టిన సద్దికూడు ఇంకో అమ్మ పెట్టిన కూర తిని సొమ్మంతా కూడబెట్టి ఈళ్ళకి యిచ్చాను చూడు. నన్ను చెప్పుదీసుకుని నేనే కొట్టుకోవాలి" అంది.


"ఎందుకలా ఇస్తావ్. బ్యాంకులో వేసుకుంటావ్ కదా ! అలాగే వేసుకో. ఇకమీదట యెవరిని నమ్మబాకు."


"గట్టిగా ఉండాలనుకుంటాను కానీ అయినవాళ్లు కష్టాలలో వుండారనుకుంటే కరిగిపోతాను" అంది. "పడుకోమ్మా ఇక, ఎంత చెప్పినా నా బాధ తీరేది కాదు. మళ్ళీ మీకు చెప్పి మీ మనసు బాధపెట్టడం "అంటూ ఆ రోజుకి మాటలు ముగించేసింది.


మిగతా కథ యెప్పుడు చెపుతుందా అని నేను గుంభనంగా ఎదురుచూస్తూ వున్నాను.


ఒకరోజు మ్యాట్నీ సినిమా చూసి ఇంటికి వెళ్ళకుండా నేరుగా మా ఇంటికి వచ్చేసింది. చాలా హుషారుగా చూసిన సినిమాలో పాటలు పాడుకుంటూ ఉత్సాహంగా "ఇయ్యాల అతని గురించి చెప్పేయాలి నీకు. ముందు కాసిని టీ పెట్టి ఇవ్వు "అంది.


"టీ లంచం ఇస్తేనే గాని చెప్పవా యేమిటి" అని హాస్యమాడాను.


"నేను చెప్పిన కథ యిన్నావనుకో కథ రాసేయగలవు "అంది. నేను నవ్వుకుని అల్లం దాల్చిన చెక్క యాలకులపొడి వేసి మంచి టీ చేసి యిచ్చాను. త్రాగుతూ చెప్పుకుపోతుంది.


"ఆయాల తీరాన ఎదురెదురు వెళ్ళి అతన్ని నిలబెట్టేసి అలా అడిగానా ? అతను ఆశ్చర్యంగా చూసి ఎందుకు తీసుకుపోవాలి నిన్ను" అని అడిగాడు. "నాకు చిన్నప్పుడు నుండి నువ్వంటే నాకిష్టం" అని చెప్పా. నిజంగానే నాకు చానా యిష్టం అతనంటే. నొక్కులఁ జుట్టు,గడ్డం నొక్కు నవ్వుతున్న కళ్ళతో ఇంగిలాయి ముల్లుతో గుచ్చినట్టు చూపులతో మనసుని గుచ్చి చంపుతూ భలే అందంగా వుంటాడనుకో.తర్వాత ఏమన్నాడో ఇనుకో సరే .. రాత్రికి చెపుతాలే ఏ సంగంతి. నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్పాడు.


నా ముఖంలో ఆసక్తి కనబడకుండా ఉండటానికి విశ్వ ప్రయత్నం చేస్తూ అరమారలో సామాను తీసి తుడిచే పని పెట్టుకున్నాను


"ఆ రోజు వూరికెళ్ళిన అత్తా మొగుడు రాకూడని వేయి దేవుళ్ళకి మొక్కుకున్నా. పదకొండు గంటలకి వచ్చి తలుపు తట్టాడు. పిల్లలను వొదిలేసి అతని వెంట నడిచా. పుంతలోకి నడుచుకుంటూ వెళ్లాం.ఆ రోజు పొర్ణమి. నల్లవావిలి పూత పొలపం చుట్టుకుంటునట్టే అతను నన్ను చుట్టేశాడు. ఆనాడు అతనితో వుందే నా జీయితం. వాడు తప్ప నా మనసుకి దగ్గరగా వచ్చినోడే లేడు. అట్టా అప్పుడప్పుడు కలుసుకుంటా వుండేవారిమీ. ఒకటి రెండుసార్లు మా ఊరివాళ్ల కళ్ళల్లో పడ్డాం కూడా. మొగుడితో ఇరగ గొట్టించుకోవడం సంగతి మామూలైపోయింది.


ఓసి నీ దైర్యం కూలా .. అందుకే అన్నారు కాబోలు ఇష్టపడిన మగాడి కోసం ఆడది అర్ధరాత్రి నదిని కూడా అవలీలగా దాటుతుంది అని" మనసులో అనుకున్నాను


చెప్పడం కొనసాగించింది "ఈ మొగుడు సంసారం నాకొద్దు నన్ను దూరంగా తీసుకో అని అడగడం మొదలెట్టా. అట్టాగే అన్నాడతను. ఇద్దరం వూళ్ళో కనబడకపోతే నా మీదే అనుమానం వస్తది. ముందు నువ్వు విశాఖపట్నం పో. అక్కడ స్టేషన్కి వచ్చి నా స్నేహితుడు నిన్ను తీసుకుని పోతాడు. అక్కడే ఇల్లు కూడా చూసి పెడతాడు, నేను కొన్నాలు పోయాక ఉద్యోగం కోసం పోతున్నా అని చెప్పి నీ దగ్గరికి వస్తా. బతకగల్గితే అక్కడే బతుకుదాం లేకుంటే వేరే చోటుకి పోదాం అన్నాడు. సరేనని ఇంటికి పోయి నాలుగు చీరలు సర్ది పెట్టుకున్నాను. అర్ధరాత్రి పూట మా ఊరి గుడి దగ్గరకు ఆటో వచ్చి ఆగింది. అదెక్కి కూర్చుంటే పొన్నూరు స్టేషన్ కాడ దించాడు. రైలెక్కి విశాఖపట్నంలో దిగి అతని స్నేహితుని కోసం ఎదురు చూసా. అతను నన్ను గుర్తుపట్టడం ఎట్టా అనే సంగతి మర్చిపోయా. అతనేమో వెతుక్కుని వెతుక్కుని ఇంటికి ఎల్లిపోయాడంట. అని అక్కడికి ఆపి కాసిని నీళ్ళు తాగింది.


నాకు టెన్షన్ పెరిగిపోతుంది ..కథ చెప్పడం ఆపేస్తుందేమో అని.


పమిటచెంగుతో ముఖం తుడుచుకుని మళ్ళీ చెప్పడం మొదలెట్టింది "అడ్రెస్స్ కాగితం చూపిచ్చి వాళ్ళ ఇల్లు వెతుక్కుంటా పోతన్నా. రోడ్డు దాటుతుంటే ఓ మోటార్ సైకిల్ వాడు గుద్దేసి పొతే చెయ్యి ఇరిగిపోయింది. అతని స్నేహితుడు వాళ్ళమ్మ హాస్పిటల్ కి తీసుకుపోయి కట్టుకట్టించి నెలరోజులు బాగా చూసారు. ఆఖరికి ఒక రోజు బాధపడుతూ చెప్పలేక చెప్పలేక చెప్పారు. నేను ఇల్లు విడిచిపెట్టి వొచ్చేసాక మా వాళ్ళందరూ వెళ్లి అతనింటి మీద పడ్డారంట. అతను నాకు తెలియదు అని చెప్పినా వినలేదంట. వొదిలిపెట్టలేదు అంట. చేనుకి యెల్లి చీకటి పడ్డాక ఇంటికి వొస్తుంటే మాటేసి నలుగురు ముసుగేసుకున్న మనుషులు మీదపడి కొట్టి చంపేశారంట. అట్టా నామూలంగా అతను నాశనం అయిపోయాడు. తల్చుకుంటే ఎక్కి ఎక్కి ఏడుస్తాను. నేనెందుకు అట్టా తెగబడాలి? అప్పుడే యే గన్నేరు పప్పు తింటేనో నా బాధలు ఇరగడయ్యిపోయేయిగా. ఏమి యెరగని అతన్ని నాశనం చేసేసినాను అని కుమిలి కుమిలి యేడుస్తాను. నావాళ్లు అంటూ యెవరూ లేకుండా ఐదారేళ్ళు గట్టిగానే ఉండాను. మానాయనను చూడాలనిపోయి నా ఆచూకీ చెప్పి తిప్పలు తెచ్చుకున్నా. కష్టపడి నాలుగిళ్ళల్లో పనిచేసుకుని సంపాదించుకోవడమే తప్ప ఏ మొగ పురుగుని దగ్గరికి రానీయలేదు" అంది కన్నీళ్ళు తుడుచుకుంటూ భారంగా.


"నువ్వు చెప్పిందంతా ప్రేమంటావా?" ఎంత వద్దనుకున్నా నామాటల్లో కఠినం.


"ప్రేమో కామమో ఆయన్నీనాకు తెలియదు. ప్రేమంటే ఈడుకి సంబంధం లేదు. ఈడు జారిపోయాక ఆ ప్రేమ కూడా వానకి తడిసిన ఆకు మీద మురికిలా కారిపోతుందంటే నేను వొప్పుకోను. చిన్నప్పుడు నుండి అతను నా మనసులో వుండాడు. నా మనసుదాకా వొచ్చినాడు నా వొళ్ళంతా కమ్ముకున్నఅతనొక్కడే, అదంతా కాదుకానీ బాగా అర్ధమయ్యేలాగా చెపుతా ఇనుకో, నా కాలి చిటికెనేలు గోరు నుండి నా తల్లో వెంట్రుక చివరిదాకా నిండి వున్నోడు నేను చచ్చేదాకా నాతో వుండేవాడు అతను ఒక్కడే. పెపంచమంతా వందనుకోనీ వెయ్యి రాళ్ళేయనీ.. అతనే నా దృష్టిలో మగోడు. అతనే నా మొగుడు" అంది.


నారాయణమ్మ వైపు అయోమయంగా చూసాను.ఒకచోట దొరకనిది ఇంకొకచోట దొరుకుతుందని భ్రాంతి పడటం కూడా కాదిది. కేవలం మోహపడి బిడ్డలను ఇంటిని వొదిలేసి వచ్చేసింది. తెగింపు వున్న స్త్రీ ఏదోవొకనాడు భర్త అనుమానాన్ని నిజం చేసి తీరుతుంది అన్నట్టుగా నడుచుకొంది. ఇలాంటి స్త్రీలను లోకమే కాదు నేను కూడా హర్షించలేనేమో! అయిష్టాన్నిఆమెపై ఏర్పడిన వ్యతిరేకతను ముఖంపై కనబడనీయకుండా "అతని పేరు ఏమిటి" అనడిగితే "చెప్పను" అంది. "అతనెప్పుడు నా ఎద ఊయల పై ఊగుతూనే ఉంటాడు. మనసు నెమ్మదిగా వున్నప్పుడు నీట చిత్తరువులా కనబడతానే ఉంటాడు" అంది మైమరుపుగా. ఆ క్షణంలో నారాయణమ్మ గొప్ప జ్ఞాన వంతురాలిలా మట్లాడి నన్ను అమితంగా ఆశ్చర్య పరిచింది


నీ ప్రేమ పిచ్చి పాడుగాను గొప్ప సాహసం చేసేవు అని మనసులో అనుకుని "మొత్తానికి మంచి కథ చెప్పేవ్" అన్నాను.


"జీయితంలో వున్న కథలు సినిమాల్లో కానీ కథల పుస్తకాల్లో కానీ వుంటాయేంటి? ఇక నేను ఇంటికి పోతాను. మనస్సుకి తృప్తిగా వుంది ఈ రోజు" అంటూ తేట ముఖంతో చెప్పలేని బరువునేదో నామీద వదిలేసి వెళ్ళిపోయింది. అనవసరంగా అతను అన్యాయం అయిపోయాడే అని ఉసూరుమని నిట్టూర్చాను.


కొన్నాళ్ళ తర్వాత కొలీగ్స్ తో కలిసి పోలవరం డామ్ నిర్మాణం చూడటానికి వెళ్ళాను. అక్కడ నారాయణమ్మని తీసుకొచ్చి పనికి కుదిర్చిన అప్పటి ఎదురింటి ఆమె కనబడింది.వాళ్ళు చాలా యేళ్ళ క్రితమే విజయవాడకి మారిపోయారు. కుశల ప్రశ్నలు అయ్యాక నారాయణమ్మ పని చేస్తుందా ఇంకా అని అడిగింది. మధ్య మధ్యన మానేస్తూ ఉంటుంది మళ్ళీ వస్తూ ఉంటుంది. బాగుందా అంటే బాగానే వుంది అని చెప్పవచ్చు. మొన్నే తన కథ చెప్పింది. పాపం .. అతను మీ అబ్బాయి స్నేహితుడు అంటగా అని అడిగా.


"అవునండీ. పాపం అంటున్నారు.అతను చచ్చిపోయాడని చెప్పిందా యేంటీ? అతనికి యేమీ అవలేదండీ. అతన్ని కొట్టడమైతే కొట్టారు కానీ సమయానికి ఎవరో చూసి హాస్పిటల్ కి తీసుకెళ్లి ప్రాణాలు కాపాడారు.అతనే చెప్పాడు అప్పుడలా చెప్పమని. గొప్పింటి పిల్లాడు. అందర్నీ వొదులుకుని యీమెకోసం వస్తాడా యేంటీ? తర్వాత నారాయణమ్మకి తెలిసి వుంటుంది లెండి . వాళ్ళ వాళ్ళెవరూ చెప్పకుండా వుంటారా ? "అంది.


"అతనిప్పుడెక్కడ వున్నాడు" బ్రతికే వున్నాడన్న వార్త విన్న సంతోషంలో ఆతృతగా అడిగేసాను.


"విదేశంలో వున్నాడు. చక్కని భార్య,పిల్లలిద్దరు, మంచి వుద్యోగం". నేను నిర్ఘాంతపోయాను.


తిరిగి వస్తూ దారంతా నారాయణమ్మ ఎందుకలా చెప్పిందా అని ఆలోచిస్తూనే వున్నాను. నిజంగానే అతను బ్రతికి వున్నాడని తెలియకుండా ఉండటానికి అవకాశం తక్కువ. అతనికి నారాయణమ్మ పట్ల వుంది కేవలం జాలి లేదా ప్రేమ లేకపోతే అందొచ్చిన అవకాశమా? దొంగాట ఆడాడేమో! అసలు నారాయణమ్మ ఆ ఒక్క విషయం గురించి నిజమే చెప్పిందా? అసలు నేనెందుకు యిలా ఆలోచించాలి ? నేనూ నమూనా యేనా ? తల పగిలిపోయే ప్రశ్నలు. నారాయణమ్మ ఏం చెప్పింది.అతనొక నీట చిత్తరువు అనే కదా చెప్పింది. అదే నిజం. నీళ్లు కదిలితే కరిగిపోయే చిత్రం. ఎంత బాగా చెప్పింది దొంగ మొహంది అని మురిపెంగా తిట్టుకున్నా.


ఆఖరికి ఒకటనిపించింది కొందరికి అనుభవించడం కన్నా వూహించుకోవడంలో ఎక్కువ ఆనందం అని. అనుభవంలోకి రానిదాన్ని నిర్ధాక్షిణ్యంగా చంపడానికి కూడా వెనుకాడరని. అలా అనుకున్నాక మనసుకి తృప్తి కల్గింది. రాజమండ్రిలో టీ త్రాగడానికి బస్ ఆపినప్పుడు అక్కడొక పిల్లాడు అమ్ముతున్న పుస్తకాలలో పొడుపు కథల పుస్తకం కనబడగానే వెంటనే కొనుక్కున్నాను. ఇష్టపడి కష్టం అనుకోకుండా జీవితం గెల్చిన నారాయణమ్మ ముందు ఈసారి పొడుపు కథ విప్పలేక ఓడిపోకూడదని.





15, సెప్టెంబర్ 2019, ఆదివారం

నాన్నెప్పుడొస్తాడు




రాజీవ్ ఇంకా యింటికి రాలేదు. పిల్లల్ని నిద్రపుచ్చి మళ్ళీ హాల్లోకి  వచ్చి కూర్చుంది మీనా.  నిమిషానికొకసారి యింటి  ముఖద్వారం నుండి రోడ్డు వారగా  వున్న గేటు దాకా చూపు సారిస్తూ  మధ్యమధ్యలో టీవీ చూస్తూ కూర్చుంది.

"ఎంతసేపని యెదురు చూస్తావమ్మా, భోజనం చేసి పడుకో. వాడొచ్చినప్పుడు తలుపులు నేను తీస్తానులే " అన్నాడు మాధవరావు. అయినా అక్కడినుండి కదలకుండా ఆవలిస్తూ కూర్చుంది మీనా . మాధవరావు నిట్టూరుస్తూ  మూతపడని కళ్ళతో ఆలోచిస్తూ పడుకున్నాడు.

నారు వేరవుతుంది కానీ వేరు నారవుతుందా ? తనలాగే కొడుకూ. చెప్పాలంటే తనే  నయం. ఏ దురలవాట్లు లేకుండా  భార్య మనసుని కష్టపెట్టకుండా  పూర్వీకులు యిచ్చిన ఆస్తిని నిలబెట్టుకుంటూనే వుద్యోగం చేసి ముగ్గురు బిడ్డలని చక్కగా చదివించాడు. ఆదర్శ వివాహాలు చేసాడు.

కొడుకు పెళ్ళైన కొత్తలో...  "మీ ఇద్దరూ యెవరి వుద్యోగాలలో వాళ్ళు బిజీగా వుంటే  యెలాగమ్మా ,  వాడు బాగానే సంపాదిస్తున్నాడు కదా!  నువ్వు కూడా వుద్యోగం చెయ్యాలా యింకా" అని అడిగాడు.  వెంటనే  కోడలు మీనా  వుద్యోగం మానేసింది. MBA గోల్డ్ మెడలిస్ట్. నట్టింట్లో  అలంకార ప్రాయంగా ఆమె ఫోటోకి వ్రేలాడదీసిన మెడల్  కంట్లోబడినప్పుడల్లా తాను  కథల్లో వ్రాసిన స్త్రీ పురుష సమానత్వం వెక్కిరిస్తున్నట్లు కనబడేది మాధవరావుకి.

వెంటవెంటనే ఇద్దరి బిడ్డలని కని  శ్రద్దగా పెంచుకోవడంతో పాటు  యింట్లో  యెంత మంది నౌకర్లు వున్నా  తనకి కావల్సినదల్లా  మొక్కుబడిగా కాకుండానూ యేదో సేవ చేస్తున్నాను అనుకోకుండానూ  ప్రేమగా చేసే కోడలంటే మాధవరావుకి అభిమానం. పిల్లలు హోమ్ వర్క్ చేసుకుంటుంటే చదివిన పుస్తకాల గురించి తనతో చర్చించడమో వెబ్ నుండి మంచి మంచి వ్యాసాల్ని డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసి యివ్వడమో,తాను చెపుతున్న దానిని టైపు చేసిపెట్టడమో  చేస్తుంది . రుక్మిణమ్మ బ్రతికి వుంటే ఈ కోడలిని చూసి యెంతగా మురిసిపోయేదో అనుకుంటాడు  మాధవరావు తరుచుగా .

మాధవరావు అలా  జ్ఞాపకాల జడిలో  కొట్టుకుపోతున్నాడు. పగలల్లా పత్రికాఫీస్ లో పని. సాయంకాలమైతే  మిత్రులతో సాహిత్య గోష్ఠి. ఎక్కడెక్కడ వాళ్ళందరూ వచ్చి పెళ్ళి కాని మిత్రుల గదుల్లో మీటింగ్ లు పెట్టేవాళ్ళు. వాళ్ళతో కబుర్లు కథలు కవిత్వాలు రాజకీయాలు అన్నీ కలబోసుకుంటూ రాత్రిని అరగదీసేవాడు.  మూడొంతుల  రోజులు అలాగే గడిచేవి. రాజీవ్ మీ కోసం  యెదురు చూసి చూసి నిద్రపోతున్నాడు. పెందలాడే యింటికి రాకూడదూ అనేది రుక్మిణమ్మ.  

నగరపు కొసన  చిన్న పెంకుటింట్లో  వుండేవాళ్ళు .  భార్య  పిల్లలని ప్రక్కనేసుకుని    భారత రామాయాణాలు భాగవత కథలు చెపుతూ బిక్కు బిక్కుమంటూ కాలం గడిపేది. తను యే తెల్లవారుఝామునో వచ్చి తలుపు తడితే  రుక్మిణిమ్మ కన్నా రాజీవ్  ముందు లేచొచ్చి  తలుపు తీసేవాడు. అంత మెలుకువగా వుండేవాడు. "నాన్నా యిప్పటిదాకా యింటికెందుకు రాలేదు" అని నిలేసేవాడు."ఒరేయ్ చిన్నా  డబ్బు సంపాదించడమంటే అంత తేలికైన పనేమి  కాదు, అది తెలుసుకోవాలి నువ్వు" అనేవాడు మాధవరావు

"నేను పెద్దయ్యాక బోలెడు డబ్బులు సంపాదించి మీకిస్తాను కానీ త్వరగా యింటికొచ్చీయ్ నాన్నా. అమ్మకి మాకు భయమవుతుంది" అనేసి  కాళ్ళకి వాటేసుకుని బిక్క ముఖం పెట్టి తల పైకెత్తి తన   కళ్ళలోకి చూస్తుంటే  .. మనసు చివుక్కుమనేది మాధవరావుకి.  

తనకిష్టమైన వ్యాపకంలో పడి  పసిపిల్లలని పట్టించుకోవడంలేదని సిగ్గుపడేవాడు. కొన్నాళ్ళు మిత్రులకి ముఖం తప్పించి  ఆఫీసు నుండి నేరుగా యింటికి చేరుకోవడం  కాసేపు పిల్లలతో గడిపి తర్వాత వ్రాసుకోవడం బాగానే ఉన్నట్టనిపించినా పాతవాసనలు మళ్ళీ రా రమ్మని పిలుస్తూ వుండేవి. మళ్ళీ  మనసు పీకి కొన్నాళ్ళకి మిత్రులతో కాలక్షేపాలు యధావిధిగా జరిగేవి.  అభిరుచులు కలసిన మిత్రులతో గడపడం కూడా ఒక మత్తే అని అనిపించేది. భార్య యెన్నడూ యిదేమిటని అడిగింది లేదు. పైగా నాన్నెప్పుడు వస్తాడు అనే ప్రశ్న రాజీవ్ నుండి వచ్చినప్పుడల్లా రోజూ అలా అడిగి  విసిగించకూడదు, నువ్వు పడుకుందువు  రా  అంటూ  యెత్తుకుని తీసుకెళ్ళి పడుకోబెట్టి కథలు వినిపించి మాయచేసేది  రుక్మిణమ్మ . అప్పుడప్పుడు మీ నాన్నగారు మాట్లాడుతున్నప్పుటి ఫోటో పేపర్ లో వుంది చూడు ఆయన యేమి  మాట్లాడారో క్రింద రాసారు కూడా, చదివి చెప్పు అని పేపరో పత్రికో వాడి చేతికిచ్చేది. అలా బుజ్జగించేది. నాన్న లోని మలినాలనన్నింటిని కాచి వొడపోసి స్వచ్చంగా చూపించేది తల్లి కదా  అనుకునేవాడు మాధవరావు. అలా పెరిగి పెద్దవాడయ్యాడు రాజీవ్.

ఇప్పుడు అదే మాదిరిగా “సన్నీ” పెరిగి పెద్దవాడవుతున్నాడు. కానీ ఈ మధ్య  రాజీవ్ ప్రవర్తనే ముల్లులా గుచ్చుకుంటుంది.  గుండె భారంగా వుంది.  రాత్రుళ్ళు ఆలస్యంగా వస్తున్న కొడుకుని ప్రశ్నించడమే  పనిగా బెట్టుకుని  ఆరాత్రి మేలుకుని కూర్చున్నాడు. కాలింగ్ బెల్ మ్రోగగానే  తలుపు తీసి "రాజీవ్!  రోజూ ఇంత పొద్దుపోతుంది యెందుకని? " నిలదీసాడు మాధవరావు

"డబ్బు సంపాదించడం అంత తేలికైన పని కాదని మీకూ  తెలుసు కదా నాన్నా,  అప్పటి మీలాగే నాకు యేవేవో వ్యాపకాలు" అన్నాడు నవ్వుతూ.

"సన్నీ తనేసిన చిత్రానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందని నీకు చెప్పాలని పన్నెండు అయిందాకా యెదురు చూసి చూసి పడుకున్నాడు. అమ్మా డాడీ యెప్పుడొస్తారు, తాతయ్యా నాన్నెప్పుడొస్తారు అని అడుగుతూనే వున్నాడు. బిడ్డలతో గడపలేని సమయం మీదైతే బిడ్డలని కనడమే మానేయాల్సింది,  హాయిగా బిజినెస్ చేసుకుంటూ డబ్బు సంపాదించి పార్టీలు చేసుకుంటూ బ్రతికేయాల్సింది, భార్య పిల్లలు యెందుకు నీకు?" అని గట్టిగా మందలించాడు కొడుకుని.

" కని పెట్టుకుని చూసుకోవడానికి పిల్లలకు వాళ్ళ అమ్మ వుంది. బోలెడన్ని కథలు కబుర్లు చెప్పడానికి మీరూ  కాలక్షేపానికి టీవీ ఇన్ని ఉన్నాయి. ఇంకేమి కావాలి చెప్పండి" అన్నాడు రాజీవ్ తేలికగా.
నువ్వు పసివాడి మనసు గురించి ఆలోచించడం లేదు. తనతోటి పిల్లలతో కూడా ఆడుకోవడం మానేసాడు. ఈ మధ్య చదువులో కూడా డల్ గా ఉంటున్నాడని క్లాస్ టీచర్ చెప్పింది. కొన్నాళ్ళ క్రితం  ఒక రోజు ఏం చేసాడో తెలుసా ..అని ఆగాడు మాధవరావు

ఆ విషయాన్ని వినడానికి కూడా ఆసక్తి లేనట్లు  మొబైల్ ఫోన్  చూసుకుంటూ మధ్యలో తండ్రి వైపు చూసాడు.  ఆ విషయాన్ని గుర్తుకుతెచ్చుకుంటూ విచారంగా  ముఖం పెట్టి " ఆ రోజు మన తోటలోకి వెళ్లి  తన మేథ్స్ పుస్తకాన్ని అక్కడొక చెట్టుకి బూట్ లేసుతో కట్టేసి నీకెందుకు అర్ధం కావడంలేదు. ఇంతేనా ఈ టేబుల్ వేసేది. రేపు గనుక నాకు సరిగ్గా వేసి చూపకపోతే నీకు ఇదే పనిష్మెంట్ అంటూ  చెట్టును బెత్తంతో కొడుతున్నాడు. వాడిని ఆ స్థితిలో చూసి గుండె చెదిరిపోయింది. నాకు మేథ్స్ అంటే యిష్టం లేదు తాతయ్యా. మా టీచర్ చెయ్యకపోతే పనిష్మెంట్ యిస్తుంది. డాడీతో చెప్పించుకుంటే నాకు మేథ్స్ వస్తుందేమో. డాడీ యేమో ఇంటికే రావడం లేదు" అన్నాడు నాకాళ్ళకి చుట్టుకుని. ఇంకో రోజు  అన్నం కూడా తినకుండా అలిగి తోటలో బెంచీపై కూర్చుని  రాత్రి పదకొండు గంటలు దాటినా దోమలు కుడుతున్నా లెక్కచేయకుండా డాడీ వస్తేనే యింట్లోకి వస్తా అని మంకుపట్టు పట్టుకు కూర్చున్నాడు.  వాడికి మాయమాటలు చెప్పి సమదాయించడం వాళ్ళ అమ్మ వల్ల కావడంలేదు. రేపట్నుంచైనా  పెందలాడే యింటికి రా ..రాజీవ్. ఇంట్లో ఎందరున్నా నీ లోటు తీర్చగలరా ? ఆ పసివాడిని నిరాశ పరచకు." అనునయంగా చెప్పాడు కొడుకుకి.

మర్నాడు సాయంత్రం పెందలాడే యింటికి  వచ్చాడు రాజీవ్. "నీకోసం మంచి బహుమతి తెచ్చాను చూడు" అంటూ  play store బాక్స్ ని సన్నీచేతుల్లోపెట్టాడు రాజీవ్ . సన్నీ  ఆ అట్ట పెట్టె వైపు అనాసక్తిగా చూసాడు . లేచి వెళ్లి తండ్రి కాళ్ళని చుట్టేసాడు. కొడుకుని  యెత్తుకుని భార్య వైపు చూస్తూ " మీ కళ్ళల్లో యెప్పుడూ  యేదో  కంప్లయింట్. ఇంటికొస్తే చాలు నేనేదో నేరం చేసిన  వాడిలాగా చూడటం అలవాటైపోయింది మీకు. ఇంటికి రావడమంటే చిరాకు కల్గుతుంది. నాకు మాత్రం మనసుండదా, క్వాలిటీ ఆఫ్ టైం యింట్లో గడపలేకపోవడం పట్ల నాకూ  అసంతృప్తిగానే వుంది. విషయాలు నాదాకా రాకుండా  నువ్వే పిల్లలని జాగ్రత్తగా చూసుకోవాలి కదా " అన్నాడు భార్యవైపు కోపంగా చూస్తూ .

మీనా యేమీ మాట్లాడకుండా అతని దగ్గర్నుండి సన్నీని తీసుకుని “డాడీ ప్రెష్ అయి వస్తారు.అంతలోకి మనమెళ్ళి  నువ్వేసిన  చిత్రాలు  తీసుకొద్దాం రా” అంటూ సన్నీని పిల్లల  గదిలోకి తీసుకువెళ్ళింది.  తండ్రికి తనేసిన చిత్రాలు, వచ్చిన  ప్రైజ్ చూపించి అందరూ తనని యెలా  మెచ్చుకున్నారో సంతోషంగా చెపుతుంటే రాజీవ్ ఓపిక చేసుకుని విన్నాడు. “మీరంటే సన్నీకి చాలా యిష్టం. ఎంత ఇష్టమంటే అంత వ్రాసి చూపడానికి పోల్చి చూపడానికి చేత కానంత అని చెపుతాడు” అంది మీనా నవ్వుతూ. మనసులో ఈ విషయం కూడా నేను మీకు చెప్పాల్సిరావడం దురదృష్టం అని కూడా అనుకుంది. రాజీవ్ మురిసిపోతూ ఆరేళ్ళ కొడుకుని గుండెలపై వేసుకుని కబుర్లు చెప్పాడు.

"డాడీ, మీరు రోజూ యిలాగే యింట్లో వుండొచ్చు కదా, వుండు డాడీ, ప్లీజ్ డాడీ" అని గడ్డం పుచ్చుకుని బతిమాలాడుతున్నట్టు సన్నీ ప్రేమగా అడిగేసరికి  రాజీవ్ కరిగిపోయి "అలాగే డియర్. తప్పకుండా రోజూ మీరు నిద్రపోక ముందే  యింటికి   వస్తాను" అని మాటిచ్చాడు. మిగిలిన ఆ రాత్రంతా సన్నీ తండ్రి మెడచుట్టూ చేతులేసి కావిలించుకొని పడుకునే వున్నాడు.  

ఉదయాన  టిఫిన్ చేస్తూ భార్య మీనాతో   "నాకోసం యెవరూ యెదురు చూడొద్దు. పిల్లలు, నాన్న యెవరేమడిగినా నువ్వే సమాధానం యిచ్చుకోవాలి.  ఫోన్ చేసి పిల్లలు మాట్లాడతారంట అని  పదే పదే డిస్ట్రబ్ చేయొద్దు. చూడబోతే నువ్వు మౌనంగా వుండి  వాళ్ళని నామీదకి వుసిగొల్పుతున్నట్టు వుంది. రోజూ సాయంత్రమయ్యేసరికి కారు రెడీ చేసి వుంచుతున్నాను. ఎప్పుడూ ఆ వంటింట్లోనూ పుస్తకాలలోనూ మగ్గకుండా నాన్నని పిల్లలనూ   తీసుకుని పార్క్ కి వెళ్ళరావచ్చుకదా, సరదాగా మూవీస్ కి వెళ్లొచ్చు. బయట డిన్నర్ చేసి రావచ్చు.  కావాల్సినంత డబ్బు సమకూరుస్తున్నా యెప్పుడూ యేదో పోగొట్టుకున్న యేడుపు వొకటి" అన్నాడు.

"మీరేమి చేస్తున్నారో మీకే తెలుసు. ఇంట్లో అందరిని తప్పుపట్టడం మానేయండి ప్లీజ్.. అంది మీనా. సమాధానం చెప్పకుండానే  ప్లేటులోనే చేయి కడిగేసి  విసురుగా  నడిచివెళ్లి కారెక్కి  డోర్ గట్టిగా వేసుకున్నాడు. కళ్ళల్లో ఉబికిన నీటిని దాచేసుకుని బలవంతంగా నవ్వుతూ   బై చెపుతూ  భర్తని నయమారా చూసుకుంది. మళ్ళీ వారానికో పదిరోజులకో  కంటికి కనబడేదని ఆమెకి తెలుసు కాబట్టి.

పిల్లలిద్దరూ రాత్రి  తండ్రి యిచ్చినమాట నిజమనుకుని పదిగంటలదాకా యెదురు చూసి పడుకున్నారు. నాలుగు రోజుల తర్వాత  ఇవాళ డాడీ వచ్చేదాకా  యిక్కడే కూర్చుంటాం అనేసి యెదురు చూసి చూసి   హాల్లోనే పడి నిద్ర పోయారు. మరుసటిరోజు కూడా అలాగే ఎదురుచూస్తారని "డాడీ మధ్యాహ్నం యింటికి వచ్చి మళ్ళీ  వెంటనే వెళ్లిపోయారు బిజినెస్ పనిమీద స్విజర్లాండ్ వెళ్ళారు. నాలుగైది రోజులలో వచ్చేస్తారంట. ఇవిగో మీకు బొమ్మలు, చాక్ లెట్స్ కొని తెచ్చారు చూడండి" అని  తాను కొని తెచ్చిన వాటిని చూపించి పిల్లలకి  అబద్దం చెప్పింది. "ఇలా యెన్నాళ్ళు మభ్య పెడదాం తల్లీ! నిన్ను చూస్తే దిగులేస్తుంది. నీ సంసారం యేమవుతుందోనని భయమేస్తుంది" అన్నాడు మాధవరావు.

“జరిగేదే జరగనివ్వండి మామయ్యా! ముందునుండే భయపడటం యెందుకు? "అని పని కల్పించుకుని  మారు మాటలకందకూడా దూరంగా వెళ్లిపోయింది మీనా.

ఆ రోజు ఆదివారం. రాక్ లో వున్న పుస్తకాల  వరుసలను చూస్తూ తాతయ్యా .. ఈ పుస్తకాలలో యేముంది? అని అడుగుతూనే మళ్ళీ మాధవరావు ఫోటో వున్న ఒక పుస్తకం పట్టుకుని.. "తాతయ్యా! ఈ కథలు నువ్వే వ్రాసావా?" ఆసక్తిగా అడిగాడు సన్నీ. "అవునురా మనుమడా, నేనే వ్రాసాను. నీ అంత వున్నప్పుడు నుండే  కవిత్వం వ్రాసేవాడిని తెలుసా" అన్నాడు కాస్త గర్వంగా .

"నాలాగా మీ చిన్నతనమంతా యెప్పుడూ స్కూల్, ఇల్లు యిలాగే వుండేదా, ఇంట్లో  కూర్చునే  ఇవన్నీ వ్రాసారా"  అనడిగాడు సన్నీ. గతుక్కుమన్నాడు మాధవరావు. సమాధానమేమి చెప్పాలో తెలియక మాటమార్చి "మన బుజ్జి కుక్క పిల్లకి జ్వరమొచ్చి పాలు తాగడం లేదు చూసొద్దాం పద" అంటూ తోటలోకి తీసుకెళ్లాడు మనుమడిని.

వారం రోజుల తర్వాత రాజీవ్ యింటికొచ్చిన రాత్రి పిల్లలు  మాధవరావు డైనింగ్ టేబుల్ ముందు కూర్చుని వున్నారు.   కొడుకుని చూసి కోపం అణుచుకోలేక "పదేసి  రోజులు యింటికి  రాకపోతే ప్రతిరోజూ నిద్ర లేచి  కోడలి ముఖం చూడాల్సి రావడం నాకు సిగ్గుగా ఉంటుంది. పాపం! ఆ అమ్మాయేమీ  అనదు, మనసులో బాధ బయటపెట్టదు. భర్త  యెదుగుదలకి  స్నేహాలు పార్టీలు యెంత అవసరమో అర్ధం చేసుకుంది కాబోలు. ఆ వొంకతో  నువ్వు పరాయి స్త్రీల మోహంలో పడి కొట్టుకుని పోతున్నావని తెలిసి కూడా  భరిస్తుంది   ఇంటికి యెప్పుడు వస్తున్నా అడగడం మానేసింది.పాప అంత అడగపోయినా   సన్నీ  అడగడం మానలేదు. వాడితో పాటు  ముసలి ప్రాణం నేనూ యెదురుచూస్తున్నాను. ఈ పది రోజులలో సిటీలో  కారులో వెళుతూ రెండుసార్లు కనబడ్డావు కానీ యింటికి వచ్చే తీరిక లేకపోయింది నీకు. నువ్వు ఇంటికి రానిరోజులే కాదు  వేకువఝామున  కాలింగ్ బెల్ మోగని రోజులు ఈ యింట్లో వుండాలని ఆశపడుతున్నాను'' గట్టిగా మందలించాననుకున్నాడు కొడుకుని .

"కోడలి తరపున వకాల్తా పుచ్చుకుంది చాలు, యిక ఆపండి నాన్నా. ఇంటికి రావడం ఆలస్యం హితబోధ మొదలెడతారు" విసుగ్గా అన్నాడు రాజీవ్

"రాజీవ్, నేను  చేసిన తప్పునే మళ్ళీ నువ్వు చేస్తున్నావ్, మనిషికి  బాల్యం తిరిగి రాదు.నాన్న గురమెక్కి ఊగాలి . నాన్న వేలు పట్టుకుని షికారుకి వెళ్లి రావాలి.పిల్లలు వాళ్ళ ఆటలు పాటలు చిలిపి చేష్టలు అన్నీ నాన్నతోనే అనుకుంటారు. పిల్లలకి నాన్నే అసలు హీరో.  డబ్బు అంతస్తు రెండు చేతుల్లో పెట్టి అందించగలవు గానీ మధురమైన బాల్యాన్ని అందించగలవా, సన్నీని చూడు నీమీద దిగులుతో యెంత చిక్కిపోయాడో , వాడి ఆలోచనలు చితికిపోతున్నాయి తెర పై కనిపించే జీవితాలేకాదు అసలు ప్రపంచాన్ని వాడికి చూపించాలి. అప్పుడే బాల్యం వికసిస్తుంది. ఇదంతా పదే పదే చెప్పాల్సిరావడం నాకూ ఇబ్బందిగా  వుంది" అనునయంగా చెప్పసాగారు మాధవరావు .

"అంత యిబ్బందిగా వుంటే కొన్నాళ్ళు ప్రియ వాళ్ళింటికి వెళ్లి వుండండి. అక్కడికి వెళ్లడం యిష్టం లేకపోతే యేదో ఆశ్రమానికి వెళ్ళి వుండండి. ఏర్పాట్లు చేస్తాను" అన్నాడు రాజీవ్. ఊహించని మాటలకు మాధవరావు అవాక్కయ్యాడు.

"అయ్యో! పెద్దవారిని అలాంటి మాటలని  బాధపెడతారెందుకు? మీరెప్పుడు యింటికి వచ్చినా యెవరూ అడగరులెండి.ముందు పైకి వెళ్ళండి, పిల్లలు చూస్తున్నారు. వాళ్ళ  ముందు యివన్నీ బాగోదు" అంది వాటర్ బాటిల్  అందిస్తూ.

"షిట్ ...అసలు దీనికంతటికీ కారణం నువ్వు కాదూ " అంటూ  భార్య చెంప చెళ్ళుమనిపించాడు రాజీవ్. చెంప పట్టుకుని నిలబడిపోయింది మీనా.  పిల్లలు మౌనంగా అన్నం తినేసి తమ గదిలోకి వెళ్లిపోయారు. వెళుతూ "డాడీ బ్యాడ్ తాతయ్య. నేను కటీఫ్ చెప్పేస్తున్నా" అంది తొమ్మిదేళ్ళ పాప. మాధవరావు కోడలి వైపు  చూసి  "నన్ను క్షమించమ్మా" అని తన గదిలోకి వెళ్ళిపోయాడు

కాసేపటి తర్వాత సూట్కేస్ నిండా బట్టలు సర్దుకుని నౌకరుతో మోయించి కారులో పెట్టించుకుని బయటకి వెళ్ళిపోయాడు రాజీవ్ . ఆ రాత్రి తమ ప్రక్కన పడుకుని మౌనంగా కన్నీళ్లు కారుస్తున్న తల్లిని  దిగులుగా చూస్తూనే వున్నాడు సన్నీ. తన  చిట్టి చేతులతో కన్నీరు తుడుస్తూ "అమ్మా! నువ్వేడుస్తుంటే నాకు యేడుపొస్తుంది" అన్నాడు. మీనా కొడుకుని హత్తుకుని మరింత యేడ్చింది.

తెల్లవారింది. పిల్లలు స్కూల్ కి వెళితే మాధవరావు మిత్రుడిని కలవాలని బయటకు వెళ్ళిపోయాడు. మీనా కూడా గది  వదిలి బయటకు రాలేదు. సాయంత్రం పిల్లలొచ్చిన తర్వాత కూడా ఆ యింట్లో మౌనం రాజ్యమేలింది.

ఆ రాత్రి తనప్రక్కనే నిద్రపోయిన తల్లిని చూసి అప్పటిదాకా నిద్రపోతున్నట్లు నటిస్తున్న సన్నీ పైన కప్పుకున్న కంఫర్ట్ ని తొలగించి మెల్లిగా మంచం దిగాడు. శబ్దం కాకుండా అడుగులో అడుగు వేసుకుంటూ తలుపు తీసుకుని బయటకి వచ్చాడు. హాలంతా మసక చీకటిలో నిశ్శబ్దంగా వుంది. మోయలేని బరువున్న కుర్చీని శబ్దం కాకుండా సింహద్వారం దగ్గరికి చేర్చేసరికి సన్నీకి చెమటలు పట్టేసినయి. చేత్తో  చెమట తుడుచుకుని కుర్చీ యెక్కి బోల్ట్ ని మెల్లిగా  క్రిందికి లాగి మళ్ళీ కుర్చీని యధాస్థానంలో పెట్టేసాడు. తాతయ్య చూడకుండా దాచుకున్న తాళాల గుత్తిని  జేబులో నుంచి తీసి గుర్తుపెట్టుకున్న తాళంచెవి పెట్టి రెండు సార్లు  తిప్పి మళ్ళీ వెనక్కి తిప్పి  మధ్యలోకి తెచ్చి ఆపాడు. నెమ్మెదిగా తలుపు తీసుకుని బయటకి వొచ్చి బూట్లు తొడుక్కున్నాడు. చెట్ల నీడల్లో దొంగలా నడుస్తూ గేటు వరకూ చేరుకున్నాడు. వాచ్ మెన్ కూడా చలికి మునగదీసుకుని  టోపీని ముఖం మీదకి జార్చుకుని గుర్రు పెడుతున్నాడు.  గార్డ్ షెడ్ లోపలికి  వెళ్లి  గ్లాస్ డోర్ తాళం తీసుకుని రోడ్డు మీదకి  వచ్చి స్వేఛ్చగా వూపిరి పీల్చుకుని కుడివైపుకు తిరిగి నడక మొదలెట్టాడు.

ఎదురొస్తున్న వాహనాల వేగం వెలుగు సన్నీకి భయం కల్గిస్తున్నాయి. ముఖం దించుకుని చకచకా నడుస్తున్నాడు. పెద్ద కూడలి వచ్చింది. నిన్న వుదయం అమ్మ  స్నానానికి వెళ్ళినప్పుడు మొబైల్ ఫోన్ లో గూగుల్ మ్యాప్ లో సెర్చ్ చేసి  కాగితం మీద గజిబిజిగా వ్రాసుకున్న గుర్తులని  పదే పదే గుర్తుకు తెచ్చుకున్నాడు. జాగ్రత్తగా చుట్టూ చూసుకుంటూ నడుస్తున్నాడు. అక్కడక్కడా జన సంచారం. ఎవరూ ఎవరినీ పట్టించుకోవడం లేదు. సన్నీని అసలు పట్టించుకోవడం లేదు. రెండు గంటలు పైనే నడిచాడు నడిచాడు. నడుస్తున్న కొద్దీ పట్టుదల పెరిగి మనసులో భయం పటాపంచలై పోతుంది. రావాల్సిన చోటుకి చేరుకున్నాడు. అక్కడ గేట్ మెన్ మెలుకువగానే  వుండి  అటుఇటు  తిరుగుతూ వున్నాడు. అతనికి కనబడకుండా చెట్టు మొదలునానుకుని నిలబడ్డాడు కాసేపు. రోడ్డుకావలి వైపున యెదురింటి ప్రక్కనే వున్న టీ కొట్టు దగ్గర టీ  తాగుతూన్న ఇంకొకతను ఇతన్ని చేయి వూపి పిలిచాడు. హమ్మయ్య అనుకున్న సన్నీ పిల్లిలా అక్కడికి చేరుకొని కోతిలా గేటు యెక్కి లోపలికి దూకేసాడు.

కొంచెం చిన్నగా వున్నప్పుడు  నాన్నతో కలిసి వొకసారి అక్కడికి వచ్చిన గుర్తు. దైర్యంగా నిటారుగా  ముందుకు అడుగులు వేస్తున్నాడు. సరాసరి ఇంటి గుమ్మం ముందు నిలబడి మూడుసార్లు  కాలింగ్ బెల్ మోగించాడు . ఒక స్త్రీ వచ్చి తలుపుతీసి ఆశ్చర్యంగా చూసింది. మళ్ళీ ఆపకుండా పదిసార్లు పైగా బెల్ మోగించాడు. వద్దు వద్దని వారిస్తూ చేయి పట్టుకున్న స్త్రీ చేతిని అవతలకి తోసేస్తూ మళ్ళీ బెల్ మోగిస్తూనే వున్నాడు

"కమలా, అన్నిసార్లు బెల్ మ్రోగుతుంటే చూడకుండా యేమి చేస్తున్నావ్, నిద్రంతా చెడిపోయింది" అనుకుంటూ ఆమె మెట్లు దిగివస్తుంది. ఆమె వెనుక  నైట్ డ్రెస్ లో అతను. అతన్ని చూస్తూనే   స్విచ్ బోర్డ్ వదిలేసి వచ్చి  గుమ్మం ముందు నిలబడ్డాడు సన్నీ. ఆమె సన్నీని చూసి  ఆశ్చర్యపోయి అనేక అనుమానాలతో వెనుక యింకెవరైనా వున్నారేమోనని తొంగి  చూస్తుంటే  సన్నీని చూసిన రాజీవ్ నిరుత్తురుడైపోయాడు. మెల్లిగా  తేరుకుని "సన్నీ! ఇంత అర్ధరాత్రి యిక్కడికి  యెలా వచ్చావ్ నిజం చెప్పు, నిన్నెవరు తీసుకొచ్చారిక్కడికి" అనడిగాడు

"ఎవరూ తీసుకురాలేదు డాడీ, నేనే వచ్చాను. నిజ్జంగా నేనొక్కడినే యిక్కడికి వొచ్చాను. ఇంటికి వెళదాం రా  డాడీ" అని  తండ్రి చేయి పట్టుకున్నాడు. ఆమె అతని కళ్ళల్లోకి చూసింది. "ఇప్పుడే వెళదాం, డ్రెస్ మార్చుకుని వచ్చేస్తాను" అంటూ అతను మెట్లెక్కి పై గదిలోకి వెళ్ళాడు.

"సన్నీ, ఇలా రా బాబూ" అంటూ వొంగి సన్నీని యెత్తుకోబోయింది ఆమె. ఉహూ అంటూ తల అడ్డంగా వూపుతూ  దూరంగా వెళ్లి నిలబడ్డాడు. "నా దగ్గరకి రావద్దులే, అలా సోఫాలో కూర్చో డాడీ వచ్చేస్తారు" అంది.  

"నువ్వు  బాడ్ గర్ల్ వి. నీతో మాట్లాడను"   ఒక్క మాట అనేసి యింట్లో నుండి  బయటకొచ్చి నిలబడ్డాడు. ఆమె కన్నార్పకుండా   సన్నీని చూస్తూ నిలబడిపోయింది

రాజీవ్  క్రిందికి వచ్చి "బై డాళింగ్  మళ్ళీ కలుద్దాం" అని ఆమె నడుంచుట్టూ చెయ్యేసి చెంపకి చెంప ఆనించి కళ్ళు చికిలించాడు. ఆమె  రాజీవ్ ని మృదువుగా తోసేసి ముందుగా తానే గుమ్మము వైపుకి నడిచింది

అతను గుమ్మము దాటి సన్నీని  యెత్తుకుని  "ఆంటీకి బై  చెప్పు" అంటున్నాడు. సన్నీ ఆమె కళ్ళల్లోకే చూస్తున్నాడు కానీ పెదవి విప్పలేదు, చేయి వూపనూ లేదు. ఆమె అలా  సన్నీ కళ్ళలోకి చూస్తూ రాజేష్ యేదో చెపుతున్నాకూడా  వినిపించుకోకుండా ఠక్కున తలుపులు మూసేసింది.