వెబ్ కథలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
వెబ్ కథలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

5, అక్టోబర్ 2019, శనివారం

ఫ్లిప్ సైడ్

మళ్ళీ ఆధ్యాత్మికంలో పడినట్లున్నారు. ఏమిటీ సంగతి అని అడిగారు నా మిత్రుడు. 

రోజూ నేను పెడుతున్న వాట్సప్ స్టేటస్ లు చూస్తున్నట్లు అర్దమైంది. నాకు ప్రశాంతత అక్కడ తప్ప యింకెక్కడా దొరికేటట్లు లేదు అని రిప్లై యిచ్చాను. నేను అలా బ్రాంతి లో బ్రతుకుతున్నాననుకుని వుండవచ్చు. అదికూడా నేనే అనుకున్నానంటే అతని ఆలోచనలు నాకు తెలుసు కాబట్టి.   


అసలు మనుషుల అంతరంగంలో యేమి వుందో కనుక్కోవడం పెద్ద కష్టమేమికాదు. కానీ వారు తమ ఆలోచనలు నిజమేనని వొప్పుకోకపోవడమే కష్టం. 


నేను మాత్రం ఏం తక్కువ? చీపురు అరిగి అరిగి పోయినా కూడా.. ఆప్టరాల్ వొక చీపురు వందరూపాయలు పోసి వూరికూరికే మార్చలేక అరిగితే మాన్లే కాస్త నడుంవొంచి  ఊడ్వ వచ్చు.మంచి ఎక్సెర్ సైజ్  కూడాను అని బతకనేర్చిన తెలివితేటలు చూపిస్తాను.


నేను మహా దైర్యవంతురాలినని, కొందరు నాకు చాలా పొగరని పిసినారిని అని యేవేవో మాట్లాడుతుంటారు. ప్రతిపనికి అయినదానికి కానిదానికి పురుషుడిపై ఆధారపడే మనస్తత్వం కాదు. ఏ పనైనా స్వయంగా చేసుకోవాలనుకుంటాను తప్ప సోమరితనంగా కూడా వొకరిపై పని నెట్టేయడమన్న ఆలోచన చేయను.. నేను సంపాదించని రూపాయలను విచ్చలవిడిగా  ఖర్చు చేయడానికి నాకు అధికారం లేదు అంటాను. అయినా డబ్బులేమీ వూరికే రావడం లేదు కదా. ఆ మాత్రం ఆత్మ విశ్వాసం వున్నవాళ్ళను కృంగదీసే మాటలంటే పట్టించుకోకూడదనుకుని నాకు నచ్చిన దారిలో పోతుంటాను కానీ… కొన్ని విషయాలకు స్పందించకుండా మాత్రం వుండలేను.


గత ఆదివారం నేను ఓ పరామర్శకు.. వెళ్ళివచ్చేసరికి మా బ్లాక్ చుట్టూ కనబడిన మార్పుకు కుదేలైపోయాను.     పచ్చని చెట్లు నిలువెత్తు పెరిగి రంగురంగుల పూలతో భలే శృంగారంగా కనువిందు చేస్తూ వుండేవి. ఆ పూల పొదలచుట్లూ చెట్ల చుట్టూ తిరిగే తుమ్మెదలు సీతాకోకచిలకలు తూనీగలు హమ్మింగ్ బర్డ్స్ ఉడుతలు  యింకా పూల దొంగలకు అన్నింటికి ఆలవాలమైనట్లు వుండే అన్నిరకాల చెట్లను మొదలకంటా నరికించేసారు. బిల్డర్ నరకమని చెప్పారండి అన్నాడు వాచ్ మెన్. 


"మనుషులకు తిరిగే వాహనాలకు వేటికి అడ్డుకాదు. పైగా శ్రావణమాసం. అలా పచ్చగా వున్న పూలు పూసే మొక్కలను నరికినేయడానికి ప్రాణమెలా వొప్పింది. పూలు కొయ్యొద్దు అంటే కోయడం మానేస్తారుగా" అన్నాను. 


"దోమలు  పచ్చ పరుగులు వస్తున్నాయని నరికించేసారు" అన్నాడతను. అతను మాత్రం యేం చేస్తాడు యజమాని ఆజ్ఞ పాటించాలిగా అనుకుని పైకి వచ్చేసాను. కానీ రెండురోజులు మాములు మనిషిని కాలేకపోయాను. 


ఎంత కఠినంగా వుంటున్నారు మనుషులు.  అసలేమాత్రం జాలి కరుణ లేని రాతి హృదయాలు అయిపోతున్నాయని అనుకోవడమే కాదు మరి కొందరి దగ్గర  పదే పదే వాపోయాను.కళ్ళు మూసినా తెరిచినా రంగుల రంగుల పూల పందిళ్ళు కదలాడుతూనే వున్నాయి.అసలు మనిషి గురించి తప్ప మనుషుల గురించి ఆలోచించడం మానేసాం. నేను నా అనే చట్రంలో పడి తిరుగుతున్నాం. పాంచ భౌతాత్మికం శివం ప్రకృతియే లక్ష్మి అని తెలియదా లేక యెవరూ చెప్పలేదా? 


ఉదయాన్నే పూలు తెచ్చుకోవడానికని ప్లాట్ దగ్గరకి వెళ్లాను. అక్కడ నీలిరంగు  శంఖు పూలు దిట్టంగా పూస్తున్నాయి. పూలను కోస్తుంటే గోడపై నుండి పలకరించింది వెనుకింటి ఆమె. పెద్ద పరిచయంలేదు కానీ హాయిగా మాట్లాడబోయాను. 


"ఇవిగో యీ మొక్కలన్నీ నేనే వేయించాను అంది. “ఈ శంఖుపూల తీగ నేనే నాటానండీ అది కుండీలో పెరిగి పూలుపూసి కాయలుకాసి గింజలు రాలి మళ్ళీ మొలిచాయి” అన్నాను. ఒప్పుకుంటేనేగా సాక్ష్యానికి యింట్లో అద్దెకి వుంటున్న అమ్మాయిని తోడుతెచ్చుకుని నేనే గింజలు వేసేను అంది. 


ఇవిగోండి..కాసిని పూలు తీసుకోండి అని యివ్వబోతే యివాళ పక్కింటివాళ్ళ దొడ్లో కోసుకొచ్చాను అంది. అసలామె బాధేమిటో నాకర్ధమవక ఆలోచిస్తుంటే ఆ గోరింటాకు చెట్టు నేనే వేయించాను. ఈ మందారాలన్నీ వేయించాను. చాలా పూలు పూసేయి అందరికి పంచేదాన్ని అంది.నీక్కూడా కావాలంటే కోసుకుని వెళ్ళు అంది వుదారంగా. నా స్థలంలో  ఆవిడ వుదారత యేమిటో నాకర్ధమై చావలేదు.   ఇప్పుడు నేను  కూడా మరిన్ని  మొక్కలు నాటుతానంటే యెందుకమ్మాయ్ ఇల్లు కట్టినాక వేసుకో అని చెట్లుంటే దోమలు పురుగుపుట్రా వస్తాయి బయట కూర్చోలేము అంది. ఓహ్ ..ఇదా యీమె బాధ అనుకుని అక్కడనుండి తప్పించుకుని వచ్చేసాను. 


ఆమెకి మాకు గోడ అడ్డుంది కాబట్టి సరిపోయింది లేకపోతే మా స్థలం యింకా వుంది  అనేసేదేమో. ఇప్పటికే ముందువైపు వున్నాళ్ళు  వెనక్కి వెనక్కి జరిగి రెండొందలు గజాలు మాయం చేసేసారు. నోరున్నవాడిదే రాజ్యం అయిపోయిందని వాపోవడం తప్ప చరిత్రని తవ్వి వెనక్కి తెచ్చుకోవాలనే జ్ఞానం ఆశ రెండూ లేని నిర్లిప్తత జీవులు మా ఇంట్లో వాళ్ళు. ఏది నాది యేది మీది అన్నీ వొదిలి అందరూ వెళ్ళేది ఆ వొలుకుల్లోకే కదా వెళ్ళేదన్నవైరాగ్య జ్ఞానం వచ్చేసిన వృద్దులం అయిపోయాం. వొంట్లో జవజీవాలు సన్నగిల్లడం కాదు పోరాడే శక్తి లేదని వెనకడుగు అంతే. నాకెందుకో పులి నాలుగడుగులు వెనక్కి వేసిందంటే అన్న నానుడి గుర్తుకొస్తుంది అప్రయత్నంగా. మేమంతా మంచి పులులం అని మాకు మేమే సెహబాష్ అని వెన్ను చరుచుకుంటుంటే ఆక్రమణదారులు మా  మంచి తనాన్ని చేతకాని తనంగా భావిస్తున్నారని నా గట్టి అనుమానం.వలస వెళ్ళి స్థానికత కోల్పోయిన కుటుంబం మాది. అక్కడ వున్న వాళ్ళతో పోల్చుకుంటే మా కుటుంబం బలహీనం. బలహీనుడి మనోభావాలతో బలవంతుడు బంతాట ఆడుకుంటాడు. తప్పులేదు. Might is right అయ్యేది యెపుడని? ఏ స్వార్ధ ప్రయోజనాలకో కొంతమంది అమ్ముడవుతారు లేదా యేవేవో భేదాలు పొడసూపి నీరుకార్చేస్తారు. బలహీనుల అపజయమంతా యిలాంటి చోటనే దాగివుంటుందనేది సత్యం. కుంకుమ పూల కోసం చేసే జీవన యుద్ధం లాంటిదే నాది కూడా అనిపిస్తూ వుంది. 


ఈ రోజు పేపర్లో వార్త దిగ్భ్రాంతపరిచింది. వంద ఆవులకు పైగానే చనిపోయాయి అని. పక్కనే వున్న పల్లెటూరులో దాతల విరాళాలతో గోశాల నడుస్తుంది. ఎవరో విషప్రయోగం చేసారనే వార్త చక్కర్లుకొడుతోంది. కాదంటాడు సంబంధిత శాఖాధికారి. మంత్రి కూడా. విషం యెలాగైనా ప్రవహించవచ్చు. ఆహారం నీరు నేల మాట ఆలోచన యెక్కడినుండైనా ఆఖరికి ప్రాణాలను కాపాడే మందు కూడా   విషాన్నే వెదజల్లవచ్చు. దాని తీర్మానం దానిది.

  

దేశమంతా పూజించాలనే గోజాతి  వందల కొద్దీ  మనుషుల లెక్కన కుక్కల లెక్కన శవాలై పడి వుండటం చూసి మనసు కలత చెందింది. కారణాలేవైనా యివాళ యివి యెల్లుండి ఈద్ సందర్భంగా తెగిపడే మరిన్ని గొర్రెలు, ఆవులు. మనుషుల మూఢ విశ్వాసాలకు ఆహారప్రీతికి బలైపోయే మూగజీవాలు. ఈ బలులకు అంతే లేదు.ఆ మాట ఎవరితోనైనా అంటే మీరు నాన్ వెజ్ తినరా అని అడుగుతారు. తినేవారికి జీవ హింస తప్పు కాదు.ఏ జంతువైనా తప్పుకాదు కదా అని నా ఆలోచన కూడా! మనుషులకు తినాలనుకున్నప్పుడు తప్ప మిగతాదంతా కారుణ్యమే.  పసి పిల్లను రేప్ చేసి చంపినవాడికి పడ్డ ఉరిశిక్ష కూడా సబబు కాదు అంటారు. మనుషులందరిదీ ఒకే ఆలోచనా విధానమైతే యెట్టా, ఒకరు అవునంటే యింకొకరు కాదనాలి. కాదనడానికి కారణమేమి ఉండనవసరం లేదు. కేవలం వ్యతిరేకించాలి అనేదే ముఖ్యం తప్ప   ఫ్లిప్ సైడ్ యెంతమాత్రం  కాదు.


మా ప్రక్కన ఎకరాలకు ఎకరాలు నివాస స్థలాలుగా విడగొట్టబడుతుంటే మేము చుట్టూరా పచ్చదనాన్ని కాపాడాలని కుండీలలోనైనా మొక్కలు నాటాలని తెగ తాపత్రయపడి నర్సరీల చుట్టూ తిరుగుతున్నాం. ముద్ద మందారాలు ముద్ద గన్నేరులు పూజకు పనికి రావండి అంది వొకామె. అసలు మన ఆలోచనలు  పనులే సమాజానికి పనికిరావండీ అని అందామని  పెదాలపైకి వచ్చి వాటిని వెనక్కి కుక్కుకున్నాను. మనుషులకు అన్నింటికీ మంచి కావాలి. ఈ మంచి మంచి మంచి అన్నది వినలేక చస్తున్నా. యూట్యూబ్  లో అనేకమంది చెప్పిన విషయాలని అరగదీసుకుంటూ విని వినీ కూడా అందరూ మంచికి క్రానిక్ అయిపోతున్నారు. మరి చెడు అంటే యేమిటో ఊహకి అందనంతగా మనుషులంతా యింత మంచాళ్ళు అయిపోతే మిగతా ప్రాణులు పర్యావరణం తట్టుకునేది యెట్లబ్బా !  


కుక్కలనుకుంటా, మంచి కోడిపెట్టనొకదాన్ని లాక్కొచ్చి పూపొదల దగ్గర వదిలేసి పోయాయి. ఆ మాటే వాచ్ మెన్ తో అంటే అయ్యో, పొద్దున్న నుండి నేను ప్లాస్టిక్ నల్ల కారీబేగ్ అనుకుంటున్నానండీ, కోస్తే కిలోన్నర మాసం ఈజీగా పడేది అంటూ వొంగి దాన్ని అందుకోబోయే సమయానికి టక్కున వెనుకింటావిడ గోడమీద ప్రత్యక్షం. కుక్కలు పట్టుకొచ్చినవే అయినా మంచిదో లేదో యేవన్నా రోగాలొచ్చి చస్తే బయటపడేస్తే లాక్కొచ్చాయో అంది. 


కోడి రెక్కను అందుకోబోయిన  వాచ్ మెన్ చేయి ఎలక్ట్రిక్ షాక్ కొట్టినట్లు ఆగిపోయింది. కాసేపు ఆ మాట యీ మాట మాట్లాడినాక ఆ కోడిని తీసుకెళ్ళి డస్ట్ బిన్ లో పడేసి రావయ్యా అని వాచ్ మెన్ ని అంటే .. చెత్తబండి వాళ్ళు వస్తారు కదండీ వాళ్ళు తీసేస్తారు అన్నాడు.  


వాళ్ళు రేపటికి రాకపోతే దాన్ని తీయకపోతే ఇదంతా వాసన కదా, తీసేయకూదడా అంటే అతని నుండి సమాధానమే లేదు. ఓర్నీఇతని ఆలోచనల్లో యెంత మార్పు అనుకుని ఆశ్చర్యపోవడం నావంతు. 


పూల సంచీ పట్టుకుని బండి తీయబోయుంటే  వాచ్ మెన్ “అయితే  మీరు రోజూ యీ పూలు కోసుళుతున్నారు దేవుడికి పెడతానికా అండీ? అయితే నేను పెడతాను లోపల దేవుడి పటం వుంది. మొన్న శుక్రవారం నాడు ఆ తీగకున్న పువ్వు ఈ తీగకున్నపువ్వు తెంపుకొచ్చి పెట్టాను.  పూలరేటు బాగా యెక్కువ వుందండీ, ఇక రేపటినుండి ఈ పూలే పెడతాను” అన్నాడు. 


హతసురాలినైపోయాను. ఇక్కడ కూడా పోటీ యేనా అని. 


రోజూ  తెల్లారేటప్పటికి పూల కోసం పరుగులు పెట్టడం పెద్ద పని అయిపోయింది నాకు. ద్విచక్రవాహనం పైనే అయినా పరుగులు తీయాల్సి వస్తుంది. ఎండెక్కితే పూల కోసం ప్రాకులాట మరింత యెక్కువైపోతుంది. అని  నా కొడుకుతో చెపుతుంటే .. "నువ్వేదో అహింసామూర్తిని అనుకుంటున్నావ్ కానీ నీలోనూ అసుర గుణం వుంది. కావాలంటే గుర్తు తెచ్చుకో ..చిన్నప్పుడు నాలుగైదు సార్లు నన్ను మజ్జిగకవ్వంతోనూ నా  బెల్ట్ తోనూ నన్నేనూ  కొట్టావ్" అన్నాడు. 


"దండం దశ గుణ భవేత్ అంటారు కదా బంగారం, అలా దండించి వుండకపోతే నువ్వింత కుదురుగా పెరిగేవాడివా చెప్పు" అని గడుసుగా అంటుంటే.."నేను నాపిల్లలను అసలు కొట్టకుండా పెంచుతా చూడు"అన్నాడు.


 "మంచిది, పైగా మీకక్కడ నియంత్రణ చేసే చట్టాల చుట్టాలున్నారు కదా" అన్నాను. కాసేపు నవ్వుకున్నాక  మళ్ళీ అన్నాడు "నీలోనూ రాక్షస గుణం వుంది"అని. నేను ప్రశ్నార్ధకంగా చూస్తుంటే "అహింస ప్రధమం పుష్ఫం అని నీకు తెలియదా .. భగవంతుకి అర్పించే పూలను కూడా యే మాత్రం కనికరం లేకుండా  ప్రొద్దు ప్రొద్దున్నే విరిసీ విరియకుండానే త్రుంచి త్రుంచి ప్లాస్టిక్ సంచీలో కుక్కి కుక్కి ప్రిజ్ లో దాపెట్టి తీరికగా వీలున్నప్పుడు తీసి కర్ణ కఠోరంగా  అష్టోత్తరాలు వినిపిస్తూ దేవునికి పుష్పాభిషేకం చేయడం మాత్రం హింస కాదు" అన్నాడు.


 నాతో పాటు కరుణశ్రీ పుష్పవిలాపాన్ని బాగా విన్నవాడు. అలా ఆలోచించడంలో తప్పు లేదులే అనుకుంటూనే వెను వెంటనే నేనూ చిన్ని పువ్వా అని అందుకున్నాను. 


"భలే వుందిగా మళ్ళీ చెప్పమ్మా అన్నాడు.. 


"చిన్ని పూవే వాడెనా తన కన్నె వలపు వీడెనా తన చిన్నెలన్నియు వన్నెలన్నియు మన్నులో కోల్పోయెనా? కాంతునెరుగని కన్నె గాదా మొన్న మొన్ననే ముద్దు వల్లిని మొనలు దీరెనుగా!" 

….అని వినిపించి "పూల జన్మకు సాఫల్యం సిద్దించాలి. కేవలం వాటిని దేవుని పాదాల దగ్గరకు చేర్చే వాహకాన్ని నేను"అని  అన్నాను  నన్ను నేను సమర్ధించుకుంటూ. పూల బాసలు తెలిసిన వారికి మాటలయుద్దంలో సున్నితంగా గెలవడం బహుతేలిక కదా! మనసులో అనుకొంటిని కూడా ! 


ఫోన్ పెట్టేసాక తీరిగ్గా కాసేపు అసలు ఆనందమంటే యేమిటని ఆలోచిస్తూ కూర్చున్నా. పచ్చని కొమ్మన విలాసంగా  వూగుతున్న రాచిలక  కేరింతలను ఆహ్లాదంగా  చూస్తూ  .. 


అరె..ఆకాశంలో పాము యెగురుతుంది యేమిటబ్బా అని ఆశ్చర్యపోతూ  ఆలోచించి ఆలస్యంగా మెదడులో జ్ఞానరేఖ తళుక్కుమని  మెరిసి చిన్ని పిట్టలు గూడు కట్టుకోవడానికి కొబ్బరాకులను మోసుకెళుతున్నాయని ఆనందపడటం, రెండు పసుపు  పచ్చ సీతాకోక చిలుకలు గాలిలో వూరేగుతూనే  మూతి మూతి ఆనించుకుని వూసులాడుకోవడం, వుడుతొకటి పద్దతిగా పూలకొమ్మపై కూచుని విరిసిన పూవుని తెంపి మొదలు తిని చివరలను కిందకి వొదిలేయడం యివన్నీ చూస్తుండటం మాత్రం ఆనందం కాదూ.. ఏమిటో వెఱ్ఱి ముఖందాన్ని ఆనందాన్ని వల వేసి పట్టాలనుకోవడం మూర్ఖత్వం కాదూ! రకరకాల పూలు సేకరించి చేసే  పూజలో ఆనందం వుందా ఆరాధన వుందా అర్పణ వుందా కామితములు తప్ప. మనిషికి ఒక ఆశ తీరినాక మరొక ఆశ కాదు కాదు మూకుమ్మడి ఆశలు అవి నెరవేర్చమని ప్రార్ధనలు. నేను మానసికంగా యెదిగేదెన్నడూ? 


అన్నట్టు ఈ ఆనందాలకు తోడు మరో చిన్న ఆనందం జత చేరింది కాసేపటికి. దానికి వొక కథ వుంది. అది కూడా వినేయండి మరి.


మా పార్కింగ్ ప్లేస్ చుట్టూతా  నానా చెత్తంతా పేర్చబడివుంటుంది. అట్టపెట్టెలు పాత చెప్పులు విరిగిన కుర్చీలు పాత చీపురులు ఇంకా ఫాస్ట్ పుడ్ సెంటర్ కు సంబంధించిన సామానుతో పాత సామానుల గౌడన్ లా వుంటుంది తప్ప పార్కింగ్ ప్లేస్ లా వుండదు. ఆ సామానుల మధ్య పేరుకుపోయిన దమ్ముధూళి కారుకు కూడా చుట్టుకుని తళతళలాడే కారు అందాన్ని దెబ్బతీయడం సహించలేకపోయాను.  గత ఐదారునెలలుగా యిదే తీరు. పార్కింగ్ ప్లేస్ పార్కింగ్ ప్లేస్ లా వుండాలి.. తప్ప గౌడన్ లా కాదు. అవన్నీ తీసేయమను అని వాచ్ మెన్ కి చెప్పాను. అతను విన్నాడు వినిపించాడో లేదో తెలియదు వినిపించినా పెడచెవిని పెట్టారో తెలియదు. 


నేనలా చిరాకు పడుతూనే వున్నా,రోజులు గడుస్తూనేవున్నాయి. వర్షాలు మొదలయ్యాక ఆ సరంజామా మధ్యనుండి పాములు మండ్రగబ్బలు రావడం మొదలయ్యాక పిల్లలున్న వాళ్ళం.ఇలా వుంటే మేముండలేము అని వాచ్ మెన్ అతని భార్య పాట పాడటం మొదలెట్టి కష్టాలన్నింటినీ చరణాలుగా మార్చి పదే పదే వినిపించారు. ఫలితంగా పార్కింగ్ ప్లేస్ కొంత శుభ్రపడింది. 


విసుక్కుంటాను అపుడపుడు. అసలు వీళ్ళ తీరు యింతే! మూడొందల అరవై ఐదు రోజుల్లో సగం రోజులు నీచు కంపు ఘమ ఘమ లాడే  మసాలా కంపులతో కాలక్షేపం చేస్తారు తప్ప పార్కింగ్ ప్లేస్ శుభ్రం చేయరు. పైగా అక్కడ కట్టెల పొయ్యలు పెట్టి డేగిసాలు డేగిసాలు బిర్యాని వండుతూ వంటసాల చేస్తున్నారు. ఏమన్నా అనకముందే మా పార్కింగ్ ప్లేసే కదండీ అనడం. అక్కడంతా అరాచకం. వొకటి రెండుసార్లు గట్టిగా మాట్లాడం వల్ల వాళ్ళు నన్ను చూస్తే ముఖం గండుగా పెట్టుకుని చూడటం మాములై పోయింది.  పులి మీద పుట్రలా నా చికాకును మరింత పెంచుతూ సీజన్ అయిపోగానే డ్రింక్స్ షాపు సరంజామా అంతా తెచ్చి మళ్ళీ పార్కింగ్ ప్లేస్ లో సర్దారు. నష్టపడ్డారంట. షాపు అద్దె కట్టలేక సామాన్లన్నీ అక్కడ  సర్దిపెట్టారని వాచ్ మెన్ సమాచారం.  కొంత సామాను  మాకు కేటాయించిన స్థలంలో సర్దుకున్నా చూసి చూడనట్టు ఊరుకున్నాను. అదీ వెనుకటి కథ. 


ఇక యిప్పటి ఆనందక్షణాలు లోకి వచ్చేద్దాం.


 ఈ రోజు ఈద్. లిప్ట్ దగ్గరలో కూర్చుని మాట్లాడుకుంటున్న టోపివాలాలను చూసి ఈద్ ముబారక్ చెప్పబోయి సందేహించాను.  అంతలో పది పన్నెండేళ్ళ పిల్లవాడు రెండు చేతుల మధ్య తూకం మిషన్ పెట్టుకుని.. "కొంచెం లిప్ట్ డోర్ తీస్తారా" అని అడిగాడు. లిఫ్ట్ డోర్ లు తెరిచి అతను వెళ్ళాల్సిన అంతస్తు నెంబర్ నొక్కి లిఫ్ట్ డోర్ మూస్తూ "ఈద్ ముబారక్ భాయీ" అన్నాను. పెద్ద వాళ్ళు మాటలాపి నావైపు చూస్తుంటే పిల్లవాడు “థాంక్స్ ఆంటీ “అన్నాడు రెండుసార్లు. రెండోసారి థాంక్స్ చెప్పినప్పుడు  “ఇట్స్ ఓకే” అన్నాను. 


పండుగ అందరిది. తీసుకోవడంలోనే వుందంతా. అసురులు భూసురులు అంతా మన ఆలోచనల్లోనే వున్నారు. తగు విధంగా బయటకు వస్తూ వుంటారంతే! అని అనుకున్నాను. 


రేపు శ్రావణ మంగళవారం. గౌరీ దేవిని పూలతో బాగా అలంకరించాలనే ఆలోచన వచ్చినదే తడవుగా రేపుదయం ఊహలలో మెదిలింది.  ప్రొద్దు ప్రొద్దుటే పూల చెట్లు పొదల చుట్టూ తిరుగుతూ యెవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు పూలిమ్మని .. అని అబ్బురపడుతూ ప్రకృతిలో మమేకమైనట్టూ, పూజలు సేయ పూలు తెచ్చాను తీయరా తలుపులను రామా ..అని ఆర్తిగా పిలిచినట్టూ  పూవులేరి తేవే చెలి పోవలె కోవెలకు ..  అనుకుంటూ వుందునా, లేక నిన్ను అర్పించ హృదయపుష్పం చాలును కదా ప్రభూ/దేవీ  అంటూ ఎస్కేపిజం ప్రదర్శిస్తానో అన్నది రేపుదయానికి కానీ తేలదబ్బా. ఆలోచనల్లో మార్పు ఆచరణలోకి మారడం చాలా కష్టం. నా మటుకు నాకు నాణేనికి రెండోవైపు చూడటం సులువైన వ్యవహారమే!


5, మార్చి 2016, శనివారం

పలుచన కానీయకే చెలీ

సురేష్  సెలవు రోజు ఉదయం   రెండు రకాల టిఫిన్ లని  ఆరగించి  రెండవ సారి కాఫీ  రుచిని ఆస్వాదించి కాసేపు  పేపర్ ని  మరి కాసేపు టీవి కార్యక్రమాలతో కాలక్షేపం చేస్తున్న సమయంలో కాలింగ్ బెల్ మ్రోగింది.

"ఏమండీ.. ఎవరో వచ్చినట్లు ఉన్నారు. కాస్త అటు వెళ్లి చూడరా.. అంది లక్ష్మి  .

బద్దకంగా లేచి డోర్ తీసాడు . లక్ష్మి స్నేహితురాలు వేణి  నిలబడి ఉంది.

"రండి రండి " అంటూ ఆహ్వానించాడు. "ఈమె వచ్చింది అంటే.. చాలా విషయాలే తెలుస్తాయి. కాస్త టైం పాస్ అవుతుంది కూడా అనుకున్నాడు" సురేష్.

"లక్ష్మీ ..వేణి గారు వచ్చారు." అంటూ చెప్పాడు.

"వేణీ..  నీకు ఎదురొచ్చి ఆహ్వానం పలుకలేను కాని ఇటు వంటింటి వైపు రా"అని పిలిచింది లక్ష్మి

"ఏం చేస్తున్నావు"అంటూ వచ్చింది.

ఇదిగో.. నాన్వెజ్ ఐటమ్స్  చేస్తూ.. బిజీగా ఉన్నానే! ఇవాళే కదా కాస్త రుచికరంగా మనసు పెట్టి చేసుకోగలం.  నీకప్పుడే  ఇంట్లో పని ఆంతా అయిపోయిందా ఏమిటీ? " .

"అసలు నేను పనేమీ అంటుకోలేదు. పిల్లలని తీసుకుని ఆయన వాళ్ళింటికి వెళ్ళారు. ఇక రాత్రికే రావడం,అందుకే నిన్ను చూసినట్టు ఉంటుందని  ఇటు వైపు వచ్చాను" 

"అందరూ  వెళ్ళారు కదా.. నువ్వు వెళితే బాగుండేది.. ఒక్కరోజన్నా అందరు కలసి  ఉన్న తృప్తి కలిగేది పెద్దవాళ్ళకి "

"అబ్బ..  అక్కడికి వెళ్ళాలంటేనే బోర్ లక్ష్మి.  కోడలిగా ఆ ఇంటికి వెళ్లి అక్కడ వంట ఇంట్లోకి వెళ్లి పడి పడి నానారకాలు వండి వడ్డించలేను. ఆరోగ్యం బాగోలేదని సాకు చెప్పి తప్పించుకున్నాను"

 ఇలా అంటున్నాని ఏమీ అనుకోవద్దు.. నెలకి ఒకసారి అయినా అలా అందరు కలిస్తే బాగుంటుంది కదా! పైగా ప్రతి ఆదివారం. మీ ఆయన,పిల్లలు అక్కడకి వెళితే.. వాళ్ళకి ఇష్టమైనవి చేసి పెట్టాలని మీ అత్తయ్యగారు హైరానా పడటం,పెద్దవయసులో ఆవిడని ఇబ్బంది పెట్టడం బావుండదేమో..ఒక సారి ఆలోచించు"

"మనుమడు,మనుమరాలకి  ముద్దుమురిపెంగా ఆ మాత్రం వండిపెట్టలేరా ఏమిటి? వాళ్ళ పాట్లేవో వాళ్ళే పడతారు నేనంత సున్నితంగా ఆలోచించలేను " మై లైఫ్ మై వే .. దట్సాల్ అంతే ! " తేలికగా చెప్పి సరేలే.. ఆ ముచ్చట్లు  ఎందుకు గాని..కాస్త టీ పెట్టవే.. తలనొప్పిగా ఉంది"  అంది.

"ఇదిగో..ఇప్పుడే టీ చేసి తీసుకుని వస్తాను. నువ్వు వెళ్లి ..హాల్లో..కూర్చో. సురేష్ ఉన్నారు నీకు మాటలకి మంచి కంపెనీ"అని వేణి ని అవతలకి పంపి.. చేతిలో పని ప్రక్కన పడేసి.. టీ తయారీలో చేయి పెట్టింది.

కాసేపటికి టీ కప్పులు  తీసుకుని వచ్చేటప్పటికి సురేష్,వేణి మంచి కబుర్లు లో ఉన్నారు.

ఇంతకీ.."కాలాతీత వ్యక్తులు" హీరోయిన్ ఇందిర కాదంటారా..? కల్యాణి  యే అని ఈ వ్యాస రచయిత అభిప్రాయం తో ఏకీభవిస్తున్నారా? అంటుంది వేణి.

"నేను ఏకీభవించడం కాదండీ! పాఠకులు  అందరు ఏకీభవించాలి కదా!" అంటున్నాడు సురేష్.

రాక్ లో ఉన్న బుక్స్ అన్నీ సోఫాలోకి వచ్చి చేరాయి. వీళ్ళిద్దరకి అప్పుడప్పుడు సాహిత్యం  విషయంలో  అలా చర్చలు జరుగుతూనే  ఉంటాయి.

టీ ఇచ్చేసి మళ్ళీ వంట పనిలో మునిగిపోయింది కానీ చాలా చిరాకుగా ఉంది లక్ష్మికి.

వేణి తనకి  స్నేహితురాలే!  ఒకే ఊరు. చిన్నప్పటి నుండీ స్నేహితురాలే ! కొంచెం నిర్లక్ష్యంగా, స్వార్ధంగా ఉంటుందన్న మాటే కాని స్నేహపాత్రురాలే! కాకపొతే.. మా ఇంటికి వస్తూ ఏం తెస్తావు..మీ ఇంటికి వస్తే ఏం పెడతావు అని అడిగే రకం.

పుస్తకాలు,పేపర్ లు గట్రా బాగా చదువుతుంది కాబట్టి  మగవాళ్ళు అందరితో..అన్ని విషయాలు తర్కిస్తుంది. అందంగా లేకపోయినా ఆకర్షణీయంగా అలంకరించుకుంటుంది. మగవాళ్ళు అందరూ దీపం చుట్టూ శలభంలా తిరిగినట్టు  ఆమె చుట్టూ తిరుగుతూ ఉంటారు. వేణి తో ఎక్కువసేపు మాట్లాడాలని ఆమె దృష్టిలో తామూ   పడాలనుకుని ఆసక్తి లేకపోయినా రక రకాల పత్రికలూ,నవలలు కొని అక్కడక్కడా చదివి అంతా చదివేసి జీర్ణం చేసేసుకుని ఆ రచనలని స్వీయానుభవం చేసేసుకున్నట్లు మాట్లాడే వాళ్ళు ఉంటారు.  అలాంటి  వాళ్ళతో మాట్లాడినంత సేపు మాట్లాడి తర్వాత వాళ్ళ మాటల గురించి  ఎక్కెసంగా తనతో చెపుతూ పడీ పడీ నవ్వడం తెలుసు. అదొక సరదా వేణికి . 

"ఇష్టం లేనప్పుడు మాట్లాడటం ఎందుకే ! తర్వాత తాటాకులు కట్టడం ఎందుకు ? బిజీ గా ఉన్నానని ఒక్క మాట చెప్పి కట్ చేసుకోవచ్చుగా అంటే .అందులో  ఎంత వినోదం ఉందొ నీకేం తెలుసు ? వాళ్ళు మాత్రం  ఆడవాళ్ళతో మాట్లాడాలని తాపత్రయ పడేది ఆ వినోదం కోసం కాదు"  అని నవ్వేస్తుంది. 


ఖాళీ కప్పులు తీసుకు రావాలని హాల్లోకి వెళ్ళిన లక్ష్మిని  "నా కోసం స్పెషల్ ఏమి చేస్తున్నావ్ ? పూర్ణాలు చేయి లక్ష్మి. నువ్వు చేసిన పూర్ణాలు చాలా బాగుంటాయి . వేడి వేడి పూర్ణాలకి గుంట పెట్టి నెయ్యేసుకుని తింటే ఎంత బాగుంటాయి. అంది అభినయిస్తూ . "ఇంకొసారి చేస్తానులే  శెనగపప్పు కొంచమే ఉంది ఇంట్లో"  

"నీ స్నేహితురాలు అడుగుతుందిగా . శ్రమ అనుకోకుండా చేసేసేయ్   కిరాణా షాపుకి నేనెళ్ళొస్తా! "అంటూ సురేష్ చెప్పుల్లో కాళ్ళు దూర్చాడు. 


"పూత పిండి మైదా వద్దు . బియ్యం మినప పప్పు నానపెడదాం పద " అంటూ సాయం చేసేదానిలాగా లేచింది వేణి. 

ఆదివారం మధ్యాహ్నం కాస్త నడుం వాల్చుదాం అనుకుంటే ఇలా వంటిల్లుకి బందీ అయిపోవాల్సి వస్తుంది అని మనసులో తిట్టుకుంటూ ..  ప్రిజ్ద్ లో నుండి బెల్లం తీసి బయటపడేసి కొబ్బరి తురిమే పనిలో పడింది  . సురేష్ షాప్ నుండి వచ్చేదాకా లక్ష్మితో  కబుర్లు చెప్పి తర్వాత లేచి వెళ్ళిపోయింది. భోజన సమయంలో నాన్ వెజ్ ఎక్కువ తినను ... తినను అంటూనే చేసిన వాటిలో సగభాగం తినేసింది. రాత్రికి పిల్లకి కూడా చారుమెతుకులే పెట్టాలి లేదా మళ్ళీ కూరలు చేసుకోవాలి అనుకుంది లక్ష్మి. భోజనం చేసాక ఇంటిముందున్న తోటపై పడింది వేణి కన్ను. ప్రొద్దున్నే పూజకి పూవులు దొరకడంలేదు అంటూ  విరగబూసిన చేమంతులని చొరవగా తుంచేసుకుంది. గులాబీలని, మర్నాడిచ్చే మందారు మొగ్గల్ని కూడా వదలకుండా కోసేసి వడిలో వేసింది.  మా కుండీలలో ఈ మొక్కలేదు . ఆ .. అంటులేదు అంటూ రకరకాలు  సేకరించింది. "ముంగిట ఆహ్లాదంగా ప్రశాంతంగా ఉంటుందని పూల మొక్కలని పెంచుకుంటే ... ఆ పూలన్నీ అలా తుంచేస్తావేమిటే"  కసురుకుంది . 


"ఇదిగో లక్ష్మి .. దేవుడి పూజకి పూలు కోసుకుంటుంటే వద్దంటున్నావ్ నీకు పాపం తగుల్తుంది జాగ్రత్త "అంటూ ..బెదిరించింది. పదిళ్ళకి సరిపోయే మునక్కాయల్ని కొట్టించుకుని సంచీలో పెట్టుకుంది బోసిపోయిన మొక్కలని చూసి మనసు బాధపడింది లక్ష్మి కి. సాయంత్రం  టీ  కి ముందు ఉల్లిపాయ పకోడీ, రాత్రి ఏడుగంటలప్పుడు వేడి వేడి పూర్ణాలు తిన్నన్ని తినేసి నేను ఒక్కదాన్నే తిన్నాననే  గిల్టీ ఫీలింగ్  కల్గుతుంది పిల్లలకి వారికి కూడా పెట్టవే అని బాక్స్ లోకి సర్దుకుంది . చీకటి పడింది నడిచేమి వెళతాను ఇటువైపు ఆటో లేవీ కూడా రావు బస్ స్టాప్ లో డ్రాప్ చేస్తారా అంటూ సురేష్ ని అడిగింది. అలాగేనంటూ బండి తీసాడు . అతని వెనుక ఎక్కి కూర్చుని చొరవగా భుజం మీద చెయ్యేసింది. గతుక్కుమంది లక్ష్మి మనసు. వేణీ  కుడి చేతికి ప్రతాప్ అన్నయ్య గిఫ్ట్ గా  అమెరికా నుండి  పంపిన ఖరీదైన రిస్ట్ వాచీ. 


సురేష్ ఇంటికి రాగానే "వేణీ చేతికి  ఆ వాచీ  ఎలా వెళ్ళింది? " అని అడిగింది. "ఆమె నన్ను అడిగింది నువ్వెలాగూ పట్టుకోవడం లేదుగా ఆమెకి  బాగా నచ్చిందందని  ఇచ్చేశాను" అన్నాడు. 


"అడిగిందని, నచ్చిందందని ఏది అడిగినా ఇచ్చేస్తారా మీరు !?  నా వస్తువు కదా  నన్నడగాల్సిన అవసరం ఉందని మీ ఇద్దరికీ అనిపించలేదా ? "  కోపంగా అడిగింది.  సురేష్ మౌనం వహించాడు. 


వేణీ  ఉద్యోగం చేసే అవసరం ఉన్నాకూడా  ఉద్యోగం చేయదు. అలా అని తన సరదాలు ఏమీ మానుకోదు. నగల దగ్గరనుండి పుస్తకాల వరకు చనువుగా అడిగి పుచ్చుకుని  తీసుకెళుతుంది.  లక్ష్మికి  అలా ఇష్టం ఉండదు. పిల్లలు కొంచెం పెద్దయ్యాక ఉద్యోగప్రయత్నం చేసింది. తను పనిచేసే ఆఫీస్ లోనే ఉద్యోగం రావడం వల్ల ఉద్యగం చేయడానికి తేలికగానే ఒప్పుకున్నాడు సురేష్.  ఇద్దరూ  ఉద్యోగం చేస్తుండబట్టి  ఆర్ధికంగా  వేణీ కన్నా మెరుగైన  పరిస్థితి లో ఉండి సొంత ఇల్లు,కారు అమర్చుకున్నారు. "నీకేం తక్కువ ? అందమైన భర్త, చక్కగా చదువుకునే పిల్లలు, సొంత ఇల్లు ,ఉద్యోగం అన్నీ ఉన్నాయి ' నాకే అన్ని అత్తెసరు దక్కాయి . దేనికైనా పెట్టి పుట్టి ఉండాలి" అంటుంది. యధాలాపంగా అంటూ ఉండే మాటల్లో  ఈర్ష్య ధ్వనిస్తూ ఉంటుందని లక్ష్మికి అర్ధమైంది.  


లక్ష్మికి పదే పదే సురేష్ భుజంపై చొరవగా చేయెసి కూర్చున్న వేణి, ఆమె చేతికి ఉన్న వాచీ కళ్ళల్లో మెదులుతున్నాయి. ఈ వేణి స్నేహానికి ముగింపు ఇచ్చేయాలి. జాగ్రత్త పడాలి  అనుకుంది బలంగా.  


అప్పుడప్పుడూ .. వేణి  సురేష్ కి రింగ్ ఇవ్వడం గమనించింది.   లక్ష్మి గమనించినప్పుడల్లా   మీ ఫ్రెండ్  ఎందుకో మిస్సుడ్ కాల్  చేసింది. బాలెన్స్ లేదేమో ..  నువ్వు ఫోన్ చేసి మాట్లాడు అని ఫోన్  తీసుకొచ్చి  ఇచ్చేవాడు. 

"ఆమెప్పుడూ అంతే ! చాలా పిసినారి. అంతగా అవసరమైతే తనే తర్వాత ఫోన్  చేస్తుంది లే ! "అని నిర్లక్ష్యంగా ఊరుకొనేది. 


సురేష్ రహస్యంగా వేణి తో మాట్లాడుతున్నది గమనిస్తూనే ఉంది లక్ష్మి.  ఆమె ఆకర్షణలో పడిపోయాడు. తనలో లేని అందం,  పరిశీలనా శక్తి , అవగాహన  ఆమెకి ఉన్నాయని చాలా సార్లు  మెచ్చుకున్నాడు కూడా ! పరాయి ఆడవాళ్ళ పట్ల భర్త చూపే ఆసక్తులు తక్కువేమీ కాదని తెలుసు లక్ష్మి కి.  తెలిసి తెలిసి మూడో మనిషిని తమ మధ్యకి రానివ్వదలచుకోలేదు. 


మరుసటి ఆదివారం ఉదయాన్నే వేణి కి కాల్ చేసింది లక్ష్మి. "ఇంట్లో ఉన్నావా ? సాయంత్రం మీ ఇంటి వైపు వస్తున్నాం " అని.  

"లేదు లక్ష్మి .. అందరం కలసి నిన్న సాయంత్రమే అమ్మ వాళ్ళింటికి వచ్చాం " 

"సరేలే .. ఇంకెప్పుడైనా వస్తాను" అని పెట్టేసింది. 

సాయంత్రం ఆరింటప్పుడు లక్ష్మి, సురేష్, పిల్లలిద్దరూ కలసి కళాక్షేత్రం కి వెళుతూ .. "వేణి వాళ్ళింటికి వెళదాం సురేష్ " అంది. 

"వాళ్ళు ఊళ్ళో లేరు కదా .. తెలిసి ఎందుకు వెళ్ళడం ? " పిచ్చా నీకు అన్నట్టు చూస్తూ అన్నాడు . 

"లేదు వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు.  వేణి కావాలనే అబద్దం చెప్పింది. కావాలంటే  మీకు నిరూపిస్తాను పదండి" అంది. ఒకవైపు పిల్లలు అవి గమనిసున్నారనే సిగ్గు కల్గింది లక్ష్మికి . 

భర్తని,పిల్లలని  కార్లోనే ఉండమని తనొక్కతే వేణి ఇంటికి వెళ్లి బెల్ కొట్టింది లక్ష్మి. తలుపు తీసిన వేణి ముఖం రంగులు మారిపోయింది. హడావిడిగా మర్యాదలు చేస్తూ ..ఇప్పుడే ఊరినుండి వచ్చాం . అంది.   


కళా క్షేత్రంలో జరిగే  "పాడుతా తీయగా " పాటల రికార్డింగ్ కార్యక్రమానికి  ఫ్రీ పాసులు వచ్చాయి. నా కొలీగ్  తెచ్చిచ్చారు, వాళ్ళమ్మాయి  పాటలు పాడేవాళ్ళలో ఉందని. నీకు అలాంటి కార్యక్రమాలంటే ఇష్టం కదా .. కళాక్షేత్రం మీ ఇంటికి దగ్గరే ఉంది, నేను  మీ ఇంటికి వచ్చినట్టూ ఉంటుంది. పిల్లలని, నిన్ను ఆ ప్రోగ్రాం చూడటానికి తీసుకెళ్ళినట్టూ  ఉంటుందనుకుని కాల్ చేసాను.  నువ్వేమో ఇంట్లో లేనని అబద్దం ఆడావు కదా 


"అబద్దమా ! నాకేం అవసరం అలా చెప్పడం , నిజంగా ఊరెళ్ళాము లక్ష్మీ ! " 


ప్రొద్దున్నే నీతో మాట్లాడాక  మా అమ్మతో  మాట్లాడాను . ప్రక్కనే మీ అమ్మ కూడా ఉంది.  నాతో  మాట్లాడింది కూడా ! మీరెళ్ళినట్లు ఏమీ చెప్పలేదు. పైగా పండక్కి  చీర కొనిపెట్టలేదని నువ్వు అలిగావని, ఫోన్ కూడా చేయడం లేదని బాధపడింది. ధాన్యం డబ్బులు వచ్చాక ఇస్తాను నువ్వెళ్ళి ఓ  రెండువేలు వేణి కి ఇచ్చి రామ్మా!  అని చెప్పింది. 

"..... "


ఇవిగో రెండు వేలు. నీకు ఇద్దామనే వచ్చాను తప్ప నీలా ఏదో ఒక ప్రయోజనం ఆశించి,వినోదం ఆశించి మీ ఇంటికి రాలేదు. స్నేహాలని, బంధాలని  మరీ అంత చులకన చేయకు వేణీ !  అది నీకు మంచిది కాదు, ఎవరికీ మంచిది కాదు. కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుండగా చప్పున బయటకి వచ్చేసింది లక్ష్మి.    

   

(అనుపమ మహిళా మాస పత్రిక మార్చి 2016 సంచికలో ప్రచురితం )

19, డిసెంబర్ 2015, శనివారం

చెలిని చేరలేక (ఖ )



చెలిని చేరలేక(ఖ)




రాత్రి సమయం మూడున్నర అయింది . రాత్రంతా పడక మార్చుకుంటూనే  వున్నాను    మనసు బరువుగా వుంది, అస్థిమితంగా  వుంది. ఇంకా బాగా చెప్పాలంటే  లోపలంతా వుక్కగా వుంది.   ఎవరితో పంచుకోవాలో తెలియడంలేదు, సంతోషాన్ని యెవరికైనా పంచగలం.  బాధనెవరికి పంచగలం ?  ఆప్తులకి మినహా. అందుకే ప్రక్కనే వున్న  మన అన్న వారిని వదిలేసి దూరంగా వున్నాసరే వారినే  మన ఆప్తులుగా జత  చేసుకుంటాం  వాసంతి అంతే కదూ ! ఆమె  గురించిన ఆలోచనలే  నాకీ రాత్రి  నిద్రని దూరం  చేసాయి మరి కొన్ని రాత్రులు యిలాగే వుండబోతాయనుకుంటా !

ఇప్పుడు తనెలా వుందో  అనుకుంటూ మొబైల్ని చేతిలోకి తీసుకున్నాను. ‘whatsaap” లో టింగ్ మంటూ వచ్చిన  మెసేజ్. చాట్ ఓపెన్ చేయకుండానే  డిస్ ప్లే లో కనబడుతున్న సారాంశం.
 ” నేస్తం ! నువ్వు దూరంగా వున్నావనేమో  రాత్రి   నీ స్థానంలో దిండు వచ్చి   నన్ను వోదార్చింది” అని. మనసు మరింత బాధకి గురయింది. నిన్న నేను  విన్న విషయం మర్చిపోలేకపోతున్నాను. రాత్రి    యే౦ జరిగిందో !   అదృష్టవశాత్తూ ఆమె ఆత్మహత్యా ప్రయత్నం విఫలమైంది కాబట్టి  తేలికగా వున్నాను  లేకపోతే… ఆ  వూహే భయంకరంగా వుంది. అయితే నిన్నటి సంభాషణని   అప్రయత్నంగానైనా మళ్ళీ గుర్తు చేసుకోవాల్సి రావడం  బాధాకరం. ఇది నిత్య గాయాల జ్ఞాపకం కూడానూ .

వ్యధల జీవన  సముద్రంలో  మరి కొన్ని కన్నీటి చుక్కలు చేరుతున్నాయి. మరి కొన్ని ఆవిరవుతూ వున్నాయి. నిన్నటి నుండి యెడతెరిపి లేకుండా  ఆలోచిస్తూనే వున్నాను. ఎంత ఆలోచించినా పరిష్కారం దొరకినట్టే దొరికి మరికొన్ని ప్రశ్నలని ముందు నిలిపి సవాల్ చేస్తుంది.  ప్రశ్నతోనే ఆడదాని జీవితం ముగియాలన్నట్టు.  ఇంటి  పనులు చేసుకుంటూనే వాసంతికి   కొంత ఓదార్పు నివ్వాలనే  ఉద్దేశ్యంతో వొక ఉత్తరం వ్రాయాలనుకున్నాను. ఆలోచన రావడమే తరువాయి  క్షణంలో చేరుకునే ఈ – ఉత్తరం పెన్నిధిగా కనిపించింది నాకు. మెయిల్ బాక్స్ వోపెన్ చేసి వ్రాయడం మొదలెట్టాను.

వాసంతీ..
నాకవకాశం వుంటే   ఈ ఉత్తరానికి బదులు  ఉత్తర క్షణంలోనే నీ దగ్గరకి  చేరాలని నిన్ను హృదయానికి హత్తుకుని  నీ బాధని కొంతైనా పంచుకుని నిన్ను  సేదదీర్చాలని ఉంది. నీకు దైర్య వచనాలనివ్వాలని,  నీ భవిష్యత్ అగమ్యగోచరంగా మారకూడదని, నీ పిల్లల  భవిష్యత్ ని నాశనం చేసే నిర్ణయాలు తీసుకోవద్దని, నీ వ్యక్తిత్వాన్ని, ఆత్మ గౌరవాన్ని భర్త పాదాల దగ్గరే పెట్టి నిత్యం అగ్ని సీతలా నీ పవిత్రతని నిరూపించుకోమని   చెప్పడానికి యీ లేఖ వ్రాయడం లేదు .

వాసంతి .. నీకు కొన్ని గాయాల సంగతి చెపుతాను విను. గాయాల సంగతి గాయానికి తెలిసినంతగా మరెవరికి తెలియదు అందుకే నీకు తప్పక కొన్ని విషయాలు చెప్పాలనిపిస్తుంది . నేనే చెప్పే విషయాలన్నీ యెవ్వరూ యెరుగని అత్యంత రహస్య విషయాలు యివి . చెప్పుకోవడానికి కూడా సరైన మనిషి కావాలంటారు కదా ! ఆ మనిషి జాడ కనబడకేమో యెంతో  గోప్యంగా నాలో దాగిన విషయాలివి. నీకులాగానే  మరికొందరు నాతో  పంచుకున్న వారి వారి చేదు అనుభవాలు. కానీ వీరందరూ నీలా ఆత్మహత్యా ప్రయత్నం చేయలేదు  దైర్యంగా బ్రతికి చూపిస్తున్నారు . అందుకే వారి గురించి నీకు చెప్పాలనిపించింది.

ముందుగా ధరణి .. అనుభవం ఆమె మాటల్లో విన్న నేను యిప్పుడు చెపుతున్నా.  ఎంత బాధ వుందో  చదివి అర్ధం చేసుకో! ధరణి మాటల్లో..

నాకప్పుడు 16 ఏళ్ళు వయసు . నాకప్పుడు చాలా పెద్ద అవమానమే జరిగినట్టయ్యింది  అదేమిటో "చెప్పనా,   పెద్దమనిషయ్యానని  తాటాకులపై కూర్చున్న మూడేళ్లకి కూడా ఆడమగ తేడా తెలియకుండానే అందరితో ఆడి పాడే  మనసు . పెద్దవాళ్ళు యింకా నీకు మగపిల్లలతో ఆటలేంటే అంటే అసలు లెక్కపెట్టని నేను  మగ పిల్లలతో యె౦దుకు ఆడకూదదో తెలియని నాకు వాళ్ళ మాటలు కోపం తెప్పించేవి . వాళ్ళ కళ్ళ  ముందు వాళ్ళు చెప్పినట్టే విని  తర్వాత స్వేచ్ఛగా మసిలేదాన్ని .  ఒక రోజు  బట్టలు వుతికే  చాకలి లక్ష్మి అమ్మ యేదో మాట్లాడుకుంటూ నావైపు అనుమానంగా చూస్తున్నారు . తర్వాత అదేరోజు రాత్రి అమ్మ నాన్నతో  యేదో చెప్పింది తర్వాత వారిద్దరూ అనుమానంగా నావైపే చూస్తూ యేదో మాట్లాడుకుంటున్నారు. తెల్లారి లేవగానే అమ్మ గబా గబా ఇంటిపనులు ముగించుకుని నన్ను కూడా బయటకి వెళ్ళడానికి తయారమని చెప్పి తను తయారయింది . “ఎక్కడికమ్మా వెళుతున్నాం? “అని అడిగాను వుత్సాహంగా. అమ్మ మాట్లాడలేదు.   ప్రక్కన వున్న టవున్ లో యే చుట్టాలింటికో  తీసుకు వెళ్ళి  తర్వాత సినిమాకి తీసుకెళుతుందేమోనని త్వర త్వరగా తయారయ్యాను .

అమ్మ నన్ను తీసుకుని హాస్పిటల్కి వెళ్ళింది .అమ్మకి బాగొలేదేమో తోడూ తీసుకొచ్చింది అనుకుని అమ్మతో లోపలి వెళ్లాను    నన్ను బయటే కూర్చోబెట్టి లోపలి వెళ్లి డాక్టర్ తో మాట్లాడి వచ్చింది. తర్వాత నర్స్ వచ్చి నన్ను లోపలి తీసుకు వెళ్ళి లోపలి గదిలో బల్లపై పడుకోబెట్టింది.  “నన్నెందుకిలా  పడుకోబెడుతున్నారు నేను బాగానే వున్నాను కదా”  అంటూ విదిలించుకుని బయటకి రాబోయాను . డాక్టర్  వచ్చి నా భుజంపై చేయి వేసి మృదువుగా అడిగింది “నీకు మూడు నెలలుగా నెలసరి రావడం లేదని అమ్మ భయపడుతుంది, పరీక్ష చేసి చూడాలి అందుకే నువ్వు బల్లపై పడుకోవాలి ” అని చెప్పి బలవంతంగా పడుకోబెట్టి గ్లవుజ్ తొడుక్కున్న  చేయిని  లోపలికి పెట్టి  కెలికి చూస్తూ .. “నువ్వు యెప్పుడన్నా మగాళ్ళతో పడుకున్నావా ? అలా పడుకుంటే నెలసరి రావు,  కడుపు వస్తుంది. అది మీ అమ్మ భయం ” అని ఒక విధంగా నవ్వి చేతిని తీసి తొడుక్కున గ్లవ్స్ తీసి చేతులు కడుక్కుని నాప్కిన్ తో తుడుచుకుంటూ   కుర్చీలో కూర్చున్న అమ్మ దగ్గరికి వెళ్లి కంగారు పడకండి అలాంటిదేమీ లేదు వొకో సారి నెలసరిలు ఆలస్యంగా వస్తూ వుంటాయి ” అని  చెప్పింది . అమ్మ “అమ్మయ్య  మంచి మాట చెప్పారు, యేమైందోనని భయపడి  చచ్చాను ” అని తేలికగా వూపిరి పీల్చుకుంది. ఆనాటి పరీక్ష  అదొక పెద్ద అవమానంగా తోచింది నాకు . 15 ఏళ్ళ పిల్ల శారీరక సంబంధం యేర్పర్చుకుందేమో అని అనుమానపడే తల్లిదండ్రులు, కాలేజీకి పంపితే చెడు తిరుగుళ్ళు తిరుగుతారని ఆలోచించే వాళ్ళు అసలు శరీరాల కలయిక అంటే యేమిటి , తమకి తెలియకుండానే యేమిటో తెలుసుకోవాలన్న ఆసక్తి తో సెక్స్ లో పాల్గొనే వాళ్లకి,  వంచనకి గురయ్యే ఆడపిల్లలకి గుప్పిట మూసి రహస్యాన్ని దాచినందువల్ల  వచ్చే భద్రత కన్నా  అనర్ధమే యెక్కువ జరుగుతుందని అనిపించింది. నిజం చెప్పొద్దూ...   మూడు నెలలు నెలసరి రాకపోతే ఆదుర్దా పడి  అనుమానంగా చూసి , డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి పరీక్ష చేయించడం నా వరకు నాకొక పెద్ద అవమానంగా అనిపించింది.


మళ్ళీ అలాంటి అవమానమే యింకోటి  పదిహేడేళ్ళకే పెళ్ళయ్యి భర్తతో తొలిరాత్రి  నేనేదుర్కొన్న అనుభవం గరళం లాంటిదే!    భర్త  నాతో మాట్లాడిన మొదటి మాట, తొలి రాత్రి పానుపు పై కూర్చున్న నాపై  మొరటుగా చేయివేసి .. అనుభవం  ఉందా! అదే యాంగిల్స్ తెలుసా !? అని.   అవమానంతో మనసు రగిలిపోయింది. దంతాల రెండు వరుసలు గట్టిగా కరచుకున్నాయి. ఏ స్పందనా లేకుండా శరీరాన్ని అప్పగించే పని అప్పుడే మొదలయ్యింది. ప్రతి రాత్రి అతనికి నేనొక అవసరమే తప్ప అతని చేతల్లో, మాటల్లో యేనాడు ప్రేమ దృక్కులని నేనెరగనని చెప్పుకోవడం కూడా నాకు అవమానంగా తోస్తుంది.  భర్త ప్రేమకై పరితపించే బలహీనమైన మనసు కాకూదదనుకుని లేని కాఠిన్యాన్ని  అరువు తెచ్చుకుని కొట్టినట్లు మాట్లాడే దాన్ని.  అలా  అందరిలో  నేనొక పెడసరపు మనిషిననే ముద్ర పడింది    నేనెప్పుడైనా  మగవారితో మాట్లాడుతుంటే అతని చూపులు నా శరీరం చుట్టూ ప్రహరా కాస్తున్నట్లే ఉండేది.  ఎవరైనా బందువులోచ్చి ఇల్లంతా రద్దీగా ఉన్నప్పుడు కూడా అతని ఆకలి తీర్చాల్సిందే!  పడక  సుఖం  అందకపోతే ఆడముండలు యింకొకడిని తగులుకుంటారు  నా దగ్గర మొగతనానికి కొదవేలేదు, రా వచ్చి పడుకో అంటూ అసహ్యంగా ప్రవర్తించే వాడు  సిగ్గుతో చచ్చిపోయే క్షణాలని ( కాదు కాదు యుగాలనాలేమో కదా) యెలా మరచిపోగలను? రోజుకొక స్త్రీ ని అనుభవించాలనే కాంక్ష, పచ్చి త్రాగుబోతైన, అనుమాన పిశాసైన   భర్త  నీడ వేయి పడగల పాము నీడగా భయపడాల్సి రావడంకన్నా వేరొక దురదృష్టం ఉంటుందా చెప్పు . ఓ పదేళ్ళు భరించాక నాపై నాకే జాలేసింది యెదురు తిరిగాను . ఫలితం  నిర్దాక్షిణ్యంగా నడివీదిలోకి నెట్టబడ్డాను. తర్వాత జరిపిన ఒంటరి  పోరాటంలో నేను గెలిచాననుకుంటాను  కానీ అడుగడుగునా శారీరక పవిత్రత అనే అగ్ని పరీక్షని యెదుర్కుంటూనే వున్నాను ” అని ఆవేదన చెందే ధరణిలా లక్షల  మంది స్త్రీ మూర్తులున్నారని  నువ్వు తెలుసుకోవాలి.

మరొకరి సంగతి .ఈ మధ్య   నాకత్యంత సన్నిహితులురాలైన కుసుమ బాధ  విన్నప్పుడు  ఆమె ఆత్మహత్య చేసుకోకుండా బ్రతికి వుండటమే చాలా గొప్పనిపించింది తెలుసా !  ఆమె యెంత  ఆవేదనని మనసులో దాచుకుని నవ్వుతూ ఆ విషయాన్ని చెప్పిందో, ఇప్పుడు గుర్తుకు వచ్చినా కన్నీళ్ళు వస్తాయి మరి . అంత పచ్చిగా వుంటుంది  ఆమె గాయం .


కుసుమ మాటల్లో  ….  ఓ రెండేళ్ళ క్రిందట అనుకుంటా  వొళ్ళు యెరుగని జ్వరంతో మంచం మీద పడి వున్నప్పుడు అటుగా వచ్చిన  నా కొడుకు స్నేహితుడు  పలకరించిపోదామని వచ్చి  నా స్థితిని చూసి హాస్పిటల్ కి తీసుకువెళ్ళి తర్వాత నా ఫ్రెండ్ కి నా విషయం తెలిపి ఆమె వచ్చేదాకా నాతొ హాస్పిటల్ లో వుండి పది రోజులపాటు  నిస్వార్ధంగా సేవ చేసాడు.  నేను బాగా కోలుకున్నాక “నీ ఋణం  తీర్చుకోలేను, యెంతో  సేవ చేసావ్ బాబూ ” అంటే  “మీ అబ్బాయి నాకు స్నేహితుడే కాదు అన్నయ్య లాంటి వాడు. అన్నయ్య యిప్పుడిక్కడ లేకపోతే ఆ భాధ్యత నేను తీసుకోవద్డా  అమ్మా !”  అన్నాడు. నిజంగా అతనిలో నాకు నా కొడుకే కనబడతాడు.   అది మొదలు అప్పుడప్పుడు నాకేదన్నా సాయం కావాలంటే చేసిపెట్టటానికి వస్తూ వుంటాడు. అందుకు వోర్చుకోలేదు  యీ లోకం. నా కొడుకు స్నేహితుడికి నాకు అక్రమ సంబంధం అంట గట్టి నా వెనుక చెప్పుకుంటారట . ఈ విషయం నాకు తెలిసినప్పుడు బ్రతుకు మీదే రోత కల్గింది. రెండు రోజులు యేడ్చాను . తర్వాత గుండె నిబ్బరం చేసుకున్నాను . ఈ సమాజం ఆడదాన్ని వొంటరిగా బతకనీయదు. ఎవరో ఒకరి అండలో వుండాల్సిందే ! వాడు యెంత తలకి మాసిన వెధవైనా సరే ! .  ఒంటరిగా  బ్రతికే దైర్యం  వున్నఆడదానికి  అక్రమ సంబంధాలు అంట గట్టి వినోదంగా చూస్తూ వుంటుంది.  నలుగురు కలిసి నవ్వుకుంటూ మళ్ళీ వాళ్ళు విడిపోయాక యింకో నలుగురు కలిసి అక్కడ లేని వాళ్ళ గురించి మాట్లాడుకోవడం యిదంతా సర్వసాధారణం అయిపోయింది. నైతికత అనేది ఆడదానికే వుండాల్సిన ఆభరణమా ! గాయపడి, ఖేద పడి  వున్న ఈ శరీరానికి, మనసుకి యెప్పుడో ప్రిజుడిటీ  వచ్చేసింది .  ఎందుకురా బాబూ!  యె౦దుకమ్మా తల్లుల్లారా,  మళ్ళీ అలాంటి మాటలు మాట్టాడి మా  శరీరంపై  ప్రేమ పుట్టిస్తారు అని నవ్వుకుంటాను .. అని యెంత  బాధగా చెప్పిందో !  నేను కలలో కూడా ఆమె బాధ మరువలేను. ఇలాంటి అనుభవాలు మనందరివీ కాదా !


ఇంకో స్నేహితురాలు కృష్ణప్రియ గరళమైన అనుభవాలు యివి … ఆమె మాటలు యిలా వుంటాయి.
“అసలు మన బాధని గురించి పట్టించుకోని లోకాన్ని మనమెందుకు లక్ష్య పెట్టాలి . ఎవరి బాధలు యెవరి గాయాలు వారివి. ఎదుటివారికి యివన్నీ యెలా తెలుస్తాయి ? చెప్పినా  అర్ధం చేసుకునే సహృదయత వుందంటావా ? సునీతా విలియమ్స్ గురించి కొన్ని చెత్త నోళ్ళు  యిలా వాగుతుంటాయి “అంతరిక్షంలో  అంతమంది మగాళ్ళ మధ్య అన్నాళ్ళు  గడిపివచ్చింది  యేమి లేకుండానే వుందంటారా? ”  అని. ఆ మాటలు  విని మనిషి గా పుట్టినందుకు యెంత విరక్తి కల్గిందో నీకెలా చెప్పగలను. ఇక మన యింట్లో వాళ్ళు మనని అనుమానించడం  తక్కువేం కాదు మనం యెవరితో మాట్లాడినా ఆ సంబంధమేదో వున్నట్టు వూహించుకుంటారు,అనుమానంగా చూస్తారు . రహస్యంగా మనం మాట్లాడుకునే ఫోన్  సంభాషణలు వింటూ వుంటారు కూడా. అందుకు  నా  అత్తగారే ఉదాహరణ అంటూ కృష్ణ ప్రియ  చెప్పిన విషయాలు ఇవి .  భర్త రాజకీయ  నాయకుడి హత్య కేసులో  చిక్కుకుని ఆరేళ్ళు జైలు పాలైతే ఒంటరిగా యెoతో  పోరాటం చేసింది ఆమె ప్రతి అడుగుని, ప్రతి సంభాషణని  కుటుంబం అక్రమ సంబంధం దృష్టితోనే చూసింది. కుటుంబం అండదండలు కావాలని అత్త,మరిది,ఆడపడుచులతో   సన్నిహితంగా వుంటూనే వున్నాను. ఒకసారి  యే౦ జరిగిందో తెలుసా ?   “నా కూతురు  విదేశాలకి వున్నత చదువుకి వెళ్ళే సమయంలో  మా యింటికెదురుగా వున్న బిల్డర్ నుండి  తప్పనిసరై మాట సాయం తీసుకున్నాను . పాపం! అతను కూడా నిస్వార్ధంగా శ్రద్ద తీసుకుని మాట సాయం చేసాడు. అలా నా క్లిష్టమైన పని  సులభంగా జరిగిపోయింది. నా కూతురు  విదేశానికి పయనమై వెళ్ళేటప్పుడు నాకు మాట సాయం చేసినతను కూడా వాళ్ళ యింటి గేటు ముందు నిలబడి వున్నాడు . అతనికి కూడా వెళ్ళొస్తానని చెప్పి చేసిన సాయానికి థాంక్స్ చెప్పి రా …  అని నా కూతురికి  చెప్పాను.. నే చెప్పిన మాట విని నా కూతురు  అతని దగ్గరకి వెళ్లి వెళ్ళొస్తానని చెప్పి వచ్చింది .  అప్పటి నుండి మా అత్తగారికి నా పై యేవో అనుమానం. ఎప్పుడు  కలిసినా అతని గురించి ప్రస్తావన తీసుకు వస్తారు, అతని గురించి నేను యే౦ మాట్లాడతానో అని గమనిస్తూ ఉంటారు.    ఇంటికి వస్తే సరాసరి బెడ్ రూం లోకి వెళ్లి చెక్ చేస్తూ ఉంటుంది. నా బెడ్ మీద ఒక ప్రక్క  ప్రక్క నలిగి వుందా లేక రెండు వైపులా నలిగి వుందా అని పట్టి పట్టి చూడటం  నేను గమనించాను. ఒకసారి నా ఫ్రెండ్  వచ్చి రాత్రి వేళ  విడిది  చేసి వెళ్ళింది. ఇద్దరం కలసి పడుకుని యెన్నో ముచ్చట్లు చెప్పుకున్నాం,అలాగే నిద్ర పోయాం.   నాకసలే బద్ధకం ఎక్కువ  రోజూ ప్రక్కలు దులిపి  నీట్ గా దుప్పట్లు పరిచే అలవాటు లేనితనం కదా! అదే రోజు మా అత్తగారు వచ్చి చెకింగ్   ఒకవైపే నలిగి వుండాల్సిన ప్రక్క రెండవ వైపు నలిగి వుండటం చూసి యెవరు వచ్చారు?  అని అడిగింది అప్పుడుకి గాని  నాకర్ధమైంది ఆవిడ చెకింగ్ లకి అసలైన అర్ధం ” అని  చెప్పింది"కృష్ణప్రియ.


విని  నివ్వెరపోయాను. ఇలాంటి అనుమానాల మధ్య జీవిస్తున్న  స్త్రీల జీవితాల పట్ల  ప్రేమ వుప్పెనలా  ముంచుకొచ్చింది.  అసలు యీ లోకంలో ఆడ మగ మధ్య శారీరక సంబంధం వుంది   తీరాల్సిందే అన్నట్లు నిర్ణయించేస్తారు . మన  ప్రక్కన వుంది  తండ్రా ,బాబాయా ,అన్న, తమ్ముడా కొడుకా యీ వావి వరుసలేవీ అక్కర్లేదు. అలాగే వయసు తారతమ్యం కూడా పాటించాల్సిన  అవసరం లేదు . ఆడది మగవాడితో మాట్లాడితే రంకు , నవ్వితే రంకు , తోటి మనిషిగా సాయమందిస్తే కూడా రంకులంటగట్టేంతగా సమాజం యెదిగిపోయింది అనిపించింది నాకు.
మనిషికి మనిషికి మధ్య యే  విధమైన సంబంధం వుండకూడదు వుంటే  గింటే ఆ సంబంధం మాత్రమే వుండాలనే ఈ మనుషుల మనస్తత్వాలని చూస్తే జాలి కల్గుతుంది. మనిషికి మనిషికి మధ్య సహజంగా వుండాల్సిన మానవ సంబంధాల స్థానంలో,  ఒకరికొకరు యె౦తో కొంత సాయం చేసుకుని  ప్రేమాభిమానాలు పెంపొందించుకుని మనుగడ సాగించాల్సింది పోయి ప్రతి సంబంధాన్నీ  ఆర్ధిక సంబంధం గాను, శారీరక సంబంధంతో కొలిచే యీ సమాజంలో బతకడం యెంత  అవమానకరంగా వుంటుందో  తెలుసుకోవడానికి  నాకు తెలిసిన సంగతులు చెప్పడం కూడా  మంచిదే అనుకుంటున్నాను.  నీకవి  వుపకరిస్తాయని చెపుతున్నాను తప్ప నిన్ను యింకా  యింకా  ఆందోళనలోకి  నెట్టడానికి కాదని అర్ధం చేసుకుంటావనే నమ్మకంతో వ్రాస్తున్నాను.        


ఈ ఆడపుట్టుకే అవమానకరం . తాటిమట్ట లాంటి నోరున్న మనుషుల పాలబడి నెత్తుటి ముద్దై పోతుంది . ఎనెన్ని అవమానాలు, వినడానికి యెంత అసహ్యంగా వుంటాయో కదా ! ఈ మనుషుల్లో  సున్నితత్వం పోయి క్రూరత్వం చోటు చేసుకుంటుంది.  ఎన్నాళ్ళని ఓర్చుకోగలం?   కంటికి కనబడే ఈ శరీరం చుట్టూ, కనబడిని మనసు చుట్టూ యెన్ని కోట గోడలు కట్టుకోగలం? స్వేచ్చగా, గౌరవంగా మసిలే వీలు మనకి లేదా !? మనమూ  మనుషులమే కదా ! గొడ్డు బతుకూ, బండ బతుకూ అయినా బాగుండేదని అప్పుడప్పుడూ  యేడ్చుకుంటాను . ఏడ్చి  యేడ్చి కసిగా పైకి లేస్తాను .  అద్దం ముందుకు వెళ్లి యే సంకోచం  లేకుండా నన్ను చూసి నేనే నవ్వుకుంటాను.


నాలాగే నువ్వు బాధని దిగమింగుకో ! ముందు నీ కన్నీళ్ళని గట్టిగా తుడుచుకో, బలంగా గుండెల నిండా  వూపిరి తీసుకుని నెమ్మదిగా శ్వాసని  బయటకి వదులు. స్థిరంగా ఆలోచించు. ఈ శారీరక హింస, మానసిక హింస యెన్నాళ్ళు ? అని ప్రశ్నించుకో !  ఓర్చుకున్నన్నాళ్ళు కాపురం సవ్యంగా  సాగిపోతూ ఉంటుంది కనుక ఆ కాపురం విలువైనదిగా నీకు తప్పని సరైనదిగా  కావచ్చు అనిపిస్తుంది .  ఆ కాపురమే కావాలనుకుంటే నీ భర్తని యీ రోజూ  క్షమించేయి. క్షమించగల మనసుంటే జరిగిన దానిని పూర్తిగా మర్చిపో ! లేదా మర్చిపోలేకపోతే క్షమించకు.  భర్త తో కలిసుంటే  నిత్యం అతని అనుమానపు ధృక్కుల నుండి నిన్ను నీవు నిలబెట్టుకోవడం యెంత కష్టమో ,  లేక  భర్త తో విడిపోయి  నీ దారిన నువ్వు బ్రతుకుతూ వున్నాకూడా  నువ్వు యెదుర్కోవలసిన ప్రశ్న కూడా వొకటే అయిందనుకో  యేది మంచని  నీకనిపిస్తే ఆ   నిర్ణయం తీసుకునే శక్తి నీకే ఉండాలి. అందుకు నా సలహా కూడా అవసరం లేదని  నా అభిప్రాయం,


ఆకలి, దారిద్ర్యం, నిరక్షరాస్యత నిలువునా చుట్టేసిన పేదలని  ధనస్వామ్యం తన వుక్కుపాదాలతో  పాతాళానికి తొక్కేస్తుంటే బాగా చదువుకుని వుద్యోగం చేసుకుంటూ పిల్లలని జ్ఞానవంతులుగా సంస్కార వంతులుగా, ప్రేమ మూర్తులుగా తీర్చి దిద్దాల్సిన భాద్యత వున్న నీ భర్త లాంటి వాళ్ళు యింకా యింకా  సగభాగంపై చెలాయించే ఆధిపత్య భావజాలం,  భార్యపై నమ్మకం లేనితనం రోత పుట్టిస్తుంది.  అతనికి మానసిక చికిత్స అవసరమనిపిస్తుంది.  " బ్రతకాలంటే వేరొకరిని చంపాల్సిన పనిలేదు, చావాల్సిన పనిలేదు” అని అతనికి తెలియాలి.


నీకొక కథ  గుర్తుకు రావడం లేదా ? బాట లో  నడుస్తున్న  అతన్ని కుక్క తరుముతుంది భయంతో ఆతను పరుగు పెడుతున్నాడు. ఒకరి సలహా విని ఆగి రాయి పుచ్చుకుని వెనక్కి తిరిగాడు కుక్క వెంటపడటం ఆపింది.  సమాజం కూడా కుక్కలాంటిది.మొరుగుతూనే ఉంటుంది. నిబ్బరంగా నిలబడి యెదురుతిరిగితే తోక ముడుస్తుంది.


మన బతుకలని  మనని బ్రతకనివ్వని ఈ సమాజం వేసే  ఆ ప్రశ్న నీ శరీరపవిత్రత (?) కే సంబంధించిందే  అయి వుండటమన్న దురదృష్టకరమైన  స్థితి  యే ఆడజన్మకి   వద్దు . అది శాపమా ? పాపమా ? అన్నది అసలు ఆలోచించవద్దు . చందమామ చూడటానికి చాలా అందంగా ఉంటుంది అచ్చు స్త్రీ లాగా  అది ఇచ్చే వెన్నెల కూడా చల్లగా ఉంటుంది స్త్రీ యిచ్చే ఆహ్లాదం లాగానే . కానీ చందమామలో ఆ మచ్చ యేమిటో తెలుసా !?  అది మనపై పడుతున్న అవమానాల మచ్చ,  వ్యక్తిత్వం, ఆత్మగౌరం లేకుండా  బతికి వుండటం అన్నింటికన్నా అవమానమనిపిస్తుంది నాకు. నేటి తరం వాళ్ళు మనమనుభవించే అవమానాన్ని, బాధలని వొక్క రోజు కూడా భరించలేరు కూడా ! అయినా అమ్మ మాత్రం అన్ని భరించాలనే ఆలోచన చేస్తారు. పిల్లలు కూడా స్వార్ధపరులే కదా !

ఎవరి ఆలోచనలని బట్టి, మానసికస్థితిని బట్టి వారి ప్రవర్తన బహిర్గతమవుతుంది, అది తెలుసుకో చెలీ !   నీ దుఖాన్ని నేను తీర్చలేను. అలా అని నిన్ను నీ ఖర్మానికి వొదిలి వేయలేను.  నేను యే సలహా  చెప్పలేను. నా మనసంతా బాధగా, పచ్చిగా వుంది. మన ఈ దుఃఖాలు  మనవి మాత్రమే  కాదు  చెలీ !  సమూహాలవి.  ఈ సమూహాలు పెరిగి పెద్దవుతున్నాయి . ఓదార్చే వొడి లేక  భూమాత వొడిని వెతుక్కుంటున్నాయి.   ఆ వొడిని వెదుక్కునే అవసరం నీకు రానీయకు అని మాత్రం చెప్పదలచాను . ఎందుకంటే ఆర్ధిక స్వాతంత్ర్యం లేని స్త్రీలు ,  అన్నీ వున్నా కూడా  అణువణువునా నిరాశ నింపుకున్న స్త్రీలు ఆవేశంలో క్షణికంలో నిర్ణయాలు తీసుకుని  జీవితాన్ని అంతం చేసుకుంటారు, ఆ బాట వైపు  నీ చూపు పడనేకూడదు. తగిలిన గాయాలని  గేయం చేసుకుని పాడుతూ సాగిపోవాలి తప్ప గాయం తగులుతుందని శరీరమే లేకుండా చేసుకోవడం ద్రోహం కదా !

జీవితమెలా వున్నా జీవితాన్ని జీవించడమనే ఆనందాన్ని కోల్పోకూడదనే కవి మాటలని గుర్తుకు తెచ్చుకో!  నేనేమి కర్తవ్య బోధ చేయడంలేదు. నా స్నేహితుల గాధలు నా బాధలు  కూడా నీతో చెప్పుకున్నందుకు కొంత తెరిపిగా వుంది. ప్రశాంతంగానూ వుంది.  ఇక ముగిస్తున్నాను చెలీ.                                                                                                                
                                                      ప్రేమతో … నీ నెచ్చెలి “అమృత"

(విహంగ వెబ్ మాస పత్రికలో ప్రచురితం )

14, నవంబర్ 2015, శనివారం

వెన్నెల పురుషుడు



ఉదయం తొమ్మిది గంటలైనా కాలేదు   సూరీడు మహా  వేడిమీద ఉన్నాడు. వంట గదిలో విజిల్ వేస్తూన్న   కుక్కర్ తో పోటీపడుతూ  కిటికి  ప్రక్కనే  పెరిగిన మామిడిచెట్టుపై  కోయిల కూస్తుంది .  తనూ స్వరం కలపబోయిన ఆమె తన అత్తమామలు ఉన్నారన్న సంగతి గుర్తుకొచ్చి వుత్సాహాన్ని గొంతులోనే అణిచేసుకుంటూ  "వసంతంలో కూయాల్సిన కోయిల  ఆషాడం  చివరిలో కూడా కూస్తుంది వానకారు కోయిల అంటే  యిదేనేమో ! " అనుకుంటూ వాయిస్ రికార్డర్ ఆన్ చేసి కిటికీ ప్రక్కనే పెట్టింది. అప్పటిదాకా  తెగ సందడి చేసిన కోయిల కూయడం మానేసింది. ఓపికగా వో అయిదు నిమిషాలు వేచిచూసాక మళ్ళీ కోయిల పాట మొదలెట్టింది  కానీ ఆ పాటెందుకో విషాదంగా అనిపించింది, అప్పటిదాకా వగరు చిగురులు తిని గొంతు మంటత్తిందేమో !  రికార్డ్ ని సేవ్ చేయకుండా వదిలేసింది అక్కడ నుండి తన గదిలోకి వచ్చింది వెన్నెల.
విశాలమైన కిటికీ దగ్గర నిలబడి బయటకి చూపు సారించింది ఆమె. చూపు  చిక్కుకుపోయిన చోట  లేలేత వేపకొమ్మల మధ్య పూచిన పూత. ఆనందంతో మొహం విప్పారింది   మళ్ళీ అంతలోనే  అరె ! యిప్పుడు  పూసింది యేమిటీ ? ఉగాదికి కదా పూయాల్సింది.  మొన్నటిదాకా  పండిన కాయలు రాలుతూనే వున్నాయి కదా !   తర్వాత అత్తయ్యని అడిగి తెలుసుకోవాలి అనుకుంటూ కనుచూపు మేరా చూసింది . ఇందాకటి కోయిల కాకుండా  మరో రాగిరంగు రెక్కల కోయిలొకటి  కొబ్బరాకుని చీల్చి యీనెని ముక్కున కరుచుకుని పోయి మామిడి కొమ్మలపై వుంచింది, బహుశా గూడు కడుతుంది కాబోలు. గుడ్లు పొదగని కోయిలకి మురిపెంగా పిల్లలని పెంచలేని కోయిలకీ  గూడెందుకో ! నిరాశగా అనుకుంది.   
మధ్యాహ్నం  యెప్పుడైందో  అత్తమామలు యెప్పుడు భోజనం చేసారో ప్రొద్దు పడమటికి  యెప్పుడు మారిందో  యేమి తెలియదు. జీవితంలో యేర్పడిన స్తబ్ధతని పూరించుకోవడానికి ఆమెకి  లభించిన వరం  తోటే  అన్నట్లు  బాహ్య ప్రపంచాన్ని మర్చిపోతుంది ఆమె.
  సాయంత్రం తోటంతా సందడిగా వుంది. ఎటు చూసినా  సీతాకోక చిలుకల  విన్యాసాలే !  చెట్లపై నివాసముండే రకరకాల పక్షులు అందులో యె౦తో చిన్నవి బుల్బుల్ పిట్టలు యెంత ముద్దుగా వున్నాయో ! క్షణం కుదురుగా ఉండవు వేప చెట్టు మీద నుండి సంపెంగ పూల చెట్టుపైకి సంపెంగ చెట్టుపై నుండి పారిజాతం చెట్టుపైకి చక్కెరలు కొడుతూనే ఉంటాయి. వాటి మధ్య వుడుతలు  కిచ కిచమని  శబ్దాలు చేస్తూ హడావిడిగా తిరుగుతూ జామకాయలు కొరుకుతూ కాసేపు, నేరుడు పళ్ళని తింటూ కాసేపు  జీవన మాధుర్యాన్ని అనుభవిస్తున్నాయి.   వేప చెట్టు కొమ్మకి పెద్ద తేనెపట్టు . ఎక్కడెక్కడో  తిరిగి సేకరించుకున్న మకరందాన్ని భద్రంగా దాచుకున్నాయి. ఏ స్వార్ధపు కళ్ళు దానిపై పడకపోవడం మూలంగా ఆనందంగా జుర్రుకుంటున్నాయి.ఎంతదృష్టమో ఈ తేనెటీగలకి. అవును యిన్ని వున్నాయి, రామ చిలుకలు లేవేంటి యీ తోటలో ? చిలుకలు వాలని చెట్టెక్కడైనా వుంటుందా ? అలాగే పావురాలు కూడా ! సృష్టిలో మానవుడికి తప్ప అన్ని ప్రాణకోటికి ఆనందాలున్నాయి. ఎటు తిరిగి  మానవుడు ప్రకృతిని తన స్వార్ధం కోసం నాశనం చెయ్యనంతవరకూ.  తోటకావలి వైపు  రోడ్డుకి ఆనుకుని  కార్లని బైక్ లని   డిస్ట్రిబ్యూట్  చేసే ఓ పెద్ద కంపెనీ వాళ్ళు  కార్  డ్రైవింగ్ స్కూల్  పెట్టారు  . అంతకు క్రితం ఈ స్థలంలో   సర్వీసింగ్ స్టేషన్ వుండేదట .  ఈ లోపలికి   అంతగా యెవరూ రాక పోవడం మూలంగా యీ మాత్రం ఆనవాలైనా మిగిలింది  అంటూ తనలో తనే గొణుక్కుంది.
రాత్రి యింటికొచ్చిన కొడుకుతో పిర్యాదుని వినిపిస్తుంది  ఆమె అత్తగారు  
"కంటికెదురుగా  కరంట్ బోర్డులకి  కందిరీగలు అన్ని గూళ్ళు పెట్టి రొదగా తిరుగుతున్నా పట్టించుకోదు, టాయిలెట్ కిటికీకి దోమతెరకి మధ్య ఉడుతలు గూడు కట్టి పిల్లలని పెంచుతున్నా పట్టించుకోదు . పెళ్లై అయిదేళ్ళు నిండింది కడుపున ఒక కాయైనా కాయలేదు. హాస్పటల్ కి వెళ్లి చూయించుకుని మందూ మాకు వాడదాం అని లేనే లేదు.  వంట పని అయిపోతే చాలు గదిలోకి వెళ్ళి తలుపులేసుకుంటుంది. ఎప్పుడూ పుస్తకాలు చదవడం పిచ్చిగీతలు గీయడం యిదేనా పని ? కొడుక్కి భోజనం వడ్డిస్తూ విసుక్కుంటుంది. 
కాసేపటి తర్వాత  లోపలికొచ్చిన శశిధర్   "ఎంత సేపూ ఆ మాను మాకుతో మాటలేనా ! కాస్త మనుషులతో కూడా మాట్లాడొద్దూ ! "
చురుక్కుమంటూ చూసింది
"అమ్మ  బాధపడుతుంది  కాసేపు బయటకొచ్చి కూర్చోని పెద్దవాళ్ళతో మాట్లాడుతూ  టీవి చూడొచ్చుకడా !"  అన్నాడు.
" వాళ్ళతోయేనా  నేను మాట్లాడటం ? మీరు నాతో మాట్లాడరా, నే చెప్పిన మాటలు  వినకూడదా ? అయినా నోట్ల కాయితాల చప్పుడుకి అలవాటు పడిన మీకు నాతో  యేమి మాటలుంటాయి లే ! " అందే కాని  కిటికీని వొదిలి యివతలకి రాలేదు .  ఒక్క క్షణం ఆలోచించినతను చిన్నగా ఆమె ప్రక్కకొచ్చి నిలుచున్నాడు  తనూ బయటకి చూసాడు . కటిక చీకటిలో తోటంతా నిశ్శబ్దంగా వుంది కొబ్బరాకుల మధ్య నుండి వేప కొమ్మల పైనుండి కనబడుతున్న ఆకాశంలో  వెలుగుతున్న నవమినాటి చంద్రుడు . అక్కడక్కడా కనబడుతున్న చుక్కలు.
" ఈ ఇల్లు చూసినప్పుడు నువ్వెంత  సంబరపడ్డావో నాకింకా గుర్తుంది. ఈ మహా నగరం నడిబొడ్డున  యిలాంటి తోట, తోట ప్రక్కనే యిల్లూ మూడంతస్తులు యెత్తున పెరిగిన చెట్లు కిటికిలో నుంచి కనబడే చందమామ కాస్త అద్దె యెక్కువైనా  నీ కోసం భరించాలనుకున్నాను కదా ! " గుర్తు చేసాడతను. తల వూపింది ఆమె . 
ఈ చక్కని చుక్కకి ఆ చంద్రుడితో కబుర్లు ఎందుకు ? ఎదురుగా ఈ చంద్రుడుండగా అంటూ ఆమె మెడ వొంపులో తమకంగా తలాన్చాడు. ఆ మాత్రం సామీప్యతకే ఆమె తనువూ  త్రుళ్ళింది మనసూ  వొరిగింది. చాలా కాలం తర్వాత ఆమెకి వశమయ్యాడతను. .  నువ్వే నా  నా వెన్నెల పురుషుడివి  అడిగింది లతలా  అతన్ని మరో మారు అల్లుకుంటూ .
 "నీకొక నిజం చెప్పాలి, విన్నాక నువ్వు బాధ పడకూడదు యెవరికీ చెప్పకూడదు ఆ రహస్యం మన మధ్యనే ఉండాలి "  ఆమె ముంగురులు సవరిస్తూ అన్నాడతను .
ఏమిటి అన్నట్లు కళ్ళతోనే ప్రశ్నించింది వెన్నెల  
 "మనకి ఐ మీన్  నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదు. అందరూ నీలో లోపం వుందేమోనని అనుమానపడుతుంటే  విని నువ్వెక్కడ బాధపడపడతావోనని  నేనే అన్ని  టెస్ట్ లు చేయించుకున్నాను. ఏ మాత్రం పిల్లలు పుట్టే అవకాశంలేదని డాక్టర్స్ చెప్పేశారు." చెప్పాల్సిన విషయం చెప్పేసి అతను  వూపిరి పీల్చుకున్నాడు . 
 ఆమెలో కల్గిన  ఆశాభంగం అతనికి కనబడనీయకుండా  అతన్ని అల్లుకున్న చేతులని వదలకుండా అలాగే ఉంచింది 
ఆమె మౌనం చూసి "పోనీ యింట్లో వాళ్లకి తెలియకుండా  "ఆర్టిఫిషియల్  ఇన్ సెమినేషన్  ద్వారా  ట్రై చేద్దామా ! నాకేం అభ్యంతరం లేదు" అన్నాడతను . ఆమె అడ్డంగా తల ఊపింది .  కళ్ళల్లో నీళ్ళు కనబడకుండా అతని గుండెల్లో తలదాచుకుంది. ఆమెనలాగే పొదివిపట్టుకున్నాడతను.
 తెల్లారిందో లేదో  అతని అమ్మ “ అబ్బాయ్  ! ఈ యింట్లో మేముండలేమురా ! ఇంటికి వెళ్లిపోతాము అంటూ ఖండితంగా చెప్పేసింది. “ఎందుకనమ్మా !? నీ కోడలు వల్ల యేమైనా కష్టంగా ఉందా ? బాగా చూసుకోవడం లేదా ?” కంగారుగా అడిగాడు .
మీ ఆవిడకి పలుకే బంగారం . ఓ మాట మంచి లేని యింట్లో  సౌకర్యాలెన్ని  అమర్చినా,  నవకాయ పిండి వంటలు వడ్డించినా వుండలేము రా ! ఇల్లన్నాక ఓ పిల్లా పీచు అన్నా ఉండొద్దా ! ఆమేమో  ఆ గదిలో, నువ్వేమో డబ్బు రంధిలో. ఎన్నాళ్ళు  గోడలతో, టీవితో  మాట్లాడుకుని బ్రతుకుతాము మీ నాన్నకి యిక్కడ తోచుబడి కావడం లేదంట, మేమిప్పుడే  వెళ్ళిపోతాం  అంది .
వెన్నెలతో యీ విషయం చెప్పినా పెద్దగా స్పందించదు . ఎప్పుడూ తన లోకం తనదే గానీ .. ఎవ్వరిని పట్టించుకోదే ! మనసులో విసుక్కున్నాడు. తల్లి తండ్రి  వూరెళ్ళి పోయాక అతను బయటకెళుతూ  
వంట చేసుకుని వేళకి తిను . ఎప్పుడు కిటికీ దగ్గరే నిలబడి వుండకుండా రెస్ట్ తీసుకో !  సాయంత్రం  పెందలాడే వచ్చేస్తాను  మూవీ కెళ్ళి  బయటెక్కడన్నా డిన్నర్ చేసి వద్దాం అని చెప్పి వెళ్ళాడు .
శశిధర్ కోసం యెదురు చూసి చూసి అలసిపోయి నిద్రపోయింది . అతనెప్పుడో వచ్చి పడుకున్నాడు . ఎన్నోసార్లు సారీ చెపుతూనే నిన్నటిలా కాదు ఈ రోజు త్వరగా వచ్చేస్తాను . నువ్వు నీ ఆలోచనల ధోరణిలో ఉండి  తలుపులు కూడా సరిగ్గా వేసుకోవు కదా ! పోన్లే, నేనే డోర్  లాక్ చేసుకుని వెళతాను అనేవాడు వుదారంగా .
అలా రోజులు, నెలలు గడచి పోతూనే వున్నాయి . వెన్నెలకి కిటికీయే ప్రపంచమూ అయిపపోయింది . కాంతి విహీనమైన కళ్ళు, శుష్కించిన దేహం, మౌనంగా యంత్రంలా మారిపోయింది . ఆమెని చూసి అతను  జాలి పడ్డాడు . ఆమెకి యేమివ్వాలో  అతనికి తెలుసు, యివ్వలేని నిస్సహాయత తెలుసు . పై పై మెరుగుల కోసం అప్రతిహతం అర్రులు చాస్తూ పరిగెత్తడమే తప్ప  నెమ్మళంగా జీవనసారాన్ని జుర్రుకోవడం చేతకానితనంతో సిగ్గుపడుతున్నాడు . ఎలాగోలా  నాలుగు రోజులు తీరిక చేసుకుని ఆమెకి ఇష్టమైన సాగర  సంగమ ప్రదేశానికి తీసుకు వెళ్ళేటప్పుడు కూడా ప్రయాణంలో చిన్న చిరునవ్వు కూడా  లేని ఆమె ముఖం చూస్తే మనసంతా యేదోలా అయిపొయింది . కానీ  ఆ నదీ సాగర సంగమం చూడగానే ఆమె ముఖం విప్పారింది.  "ఇక్కడికి నిన్ననే  నేను అతను వచ్చాం "అంది .
"నిన్నవచ్చావా,  యెవరితో ?" అడిగాడు అయోమయంగా .
"అదే అతనే నా వెన్నెల పురుషుడు"  అంది  ఆమాట  చెపుతున్నప్పుడు  ఆమె ముఖంలో ఏదో తెలియని వివశత్వం
"అవునా! అది నేనేగా ! "చిన్న నవ్వు అతని పెదాల పై .
"ఊహు నువ్వు కాదు. అతను అతనే ! "
"అతనెలా ఉంటాడు!? యెక్కడ ఉంటాడో తెలుసా ? "
 తెలుసు తోటలో వుంటాడు . గుర్తుకు తెచ్చుకున్నట్లు కాసేపాగి చెప్పింది .  అవును కొన్నాళ్ళ క్రితం  మన యింటెనుక తోటలోకి వొక పురుషుడొచ్చాడు. అతన్ని చూస్తుంటే  కవులందరూ మగవాళ్ళని సింహంతో యె౦దుకు పోల్చారో అని చిరాకు కల్గింది .  పొడుగు పొట్టి కాని ఎత్తు. క్రిందికి పైకి ఒకే మందంతో తెల్లని బట్టలతో  దర్జాగా ఉంటాడు  అతని  నడక చాలా ఠీవిగా  ఉండేది.  చందమామ లాంటి గుండ్రటి మొహం,విశాలమైన నొసలు, అందమైన కళ్ళు  ఆ కళ్ళని చూస్తే చాలు దీపాలు వెలుగుతున్నట్టు ఉండేవి. ఆ చూపులతో  మరి కొన్ని దీపాలు వెలిగించుకోవడం అంటే యేమిటో  నా కళ్ళు వెలుగుతుంటే అర్ధమయ్యింది.  అతను పెదవి విప్పి మాట్లాడే వాడే కాదు అతనిది దేహబాష . కళ్ళతోటే కథలు చెప్పేవాడు. నాకు చంద్రుడంటే వున్న యిష్టాన్ని  యెలా కనిపెట్టాడో !  వెన్నెల వాన  రెండు  కలసి కురుస్తున్నపుడు నన్ను జలకాలాటకి తీసుకు వెళ్ళేవాడు. అధర రుధిరంలో పట్టు తేనే రుచి చూపిన వాడు. వెన్నెల్లో కల్గిన  వేడిని మృగ చూర్ణ లేపనం పూసి  సాంత్వన చేకూర్చిన వాడు. నాకు యె౦తగానో నచ్చాడు .  మేమిద్దరం  భూత భవిష్యత్ కాలాన్ని మరిచి వర్తమానంలో  జీవించిన అమృత ఘడియ లవి "
"నువ్వేమైనా కథ చెపుతున్నావా ? లేక కవిత్వం వినిపిస్తున్నావా? నీ భాష అర్ధం కాక చచ్చిపోతున్నా! మామూలు మూడ్ లోకి వచ్చెయ్యి, వింటుంటే  చిరాగ్గా ఉంది " విసుక్కున్నాడతను   
  నేను నిజమే  చెపుతున్నా ! మేమిద్దరం  కలసి యెన్నో రాత్రులు నదీ విహారానికి వెళ్ళాం . చల్లని  రాత్రిలో  మంద్రంగా ప్రవహించే  నది పాయ ప్రక్కన రెల్లుపూల పొదల మధ్యలో యిసుక తిన్నెలపై  ఆ వెన్నెల పురుషుడి సాంగత్యం నాకు బాగా నచ్చింది  ! ఎన్నో సార్లు  గుజ్జనగూళ్ళు  కట్టుకుని ఆడుకున్నాం . జలకాలడుకున్నాం, పడవెక్కి ఆ తీరానికి యీతీరానికి చక్కర్లు కొట్టాము. లంక తోటల్లో పూసిన పూలతో దండలల్లుకుని  వొకరినొకరు అలంకరించుకున్నాం. ఆకుల గుసగుసల  వింటూ  హాయిగా నవ్వుకున్నాం. విరిసయ్యల పై వూసులాడుకున్నాం. ఒకొరికొకరు దేహాన్ని కానుకగా యిచ్చుకున్నాం . స్త్రీ పురుషుల మధ్య  అంత కన్నా విలువైన కానుకలేముంటాయి ?  మా యిరువురి దేహాలు  మాట్లాడుకున్నాయి పోట్లాడుకున్నాయి అలసిపోయాక వొకటినొకటి సేద దీర్చుకున్నాయి ఆ అనుభవం యెంత బావుందో!  ఎప్పుడూ  వండుకోవడం, తినడం, సంపాదించుకోవడం,  పడుకోవడం యింతేనా జీవితం !? కాస్త ఆత్మకి  అనుభూతి నైవేద్యం పెట్టోద్దూ ! 
  ఆమెసలు  సృహ లో వుండే మాట్లాడుతుందా ? వింటున్న అతనికి   యేదో తెలియని భయం కల్గింది . వెనుక తోటలోకి వచ్చే పురుషులతో యెవరితోనైనా పరిచయం పెంచుకుని తను బయటకెళ్ళ గానే  నచ్చినతనితో కలసి తిరిగి వస్తుందా ? అనుమానం వచ్చింది . మళ్ళీ అంతలోనే ఛ ఛా.. తనెప్పటకీ అలా చేయదు . అయినా తనేగా రోజూ మెయిన్ డోర్ లాక్ చేసుకుని వెళుతున్నాడు . మళ్ళీ అంతలోనే అనుమానం . డూప్లికేట్  కీ వుందేమో  అమ్మనడిగి తెలుసుకోవాలి  "అనేకమైన అనుమానాల మధ్య  "ఇక వెళ్ళిపోదాం రా " అంటూ ఆమెని  బలవంతంగా తీసుకోచ్చేసాడు .
ఇంటికొచ్చాక  సరాసరి గదిలోకి వెళ్లి ఆమె నించునే కిటికీ దగ్గరి వెళ్ళి పట్టి పట్టి పరీక్షించాడు . దోమ కూడా దూరే సందు లేదని నిర్ధారించుకున్నాక కొంచెం రిలీఫ్ గా ఫీలయ్యాడు . ఆమె మాములుగానే వంట చేసింది యిద్దరూ కలసి భోజనం చేసారు.  ఆమె చెప్పిన విషయాలు గుర్తు తెచ్చుకుంటుంటే కొన్ని నిజంగా జరిగినట్లు అనిపిస్తున్నాయి జరగనట్లు అనిపిస్తున్నాయి . నిద్ర రాక అతను అటునిటు మెదులుతూ వుంటే ఆమె హాయిగా నిద్రపోయింది . నిద్ర పోతున్న ఆమె ముఖం చూసి  పాపం పిచ్చిది .. పొద్దస్తమాను కథలు, కవిత్వం చదువుతూ వుంటుంది. అదే లోకంలో వుంటుంది , ఆమె మాటలు పట్టించుకోకూడదు అనుకుంటే కానీ అతనిని నిద్రా దేవి కరుణించలేదు .
 ఉదయాన్నే నిద్ర లేచిన అతనికి ఆమె  చూపులతో తోటంతా  వెదుకుతున్నట్లు కనబడింది .  ఏమిటీ యిక్కడే  నిలబడి ఉన్నావ్ ? టిఫిన్ రెడీ చేయలేదా ! అడిగాడు .
అతనొచ్చి రాత్రంతా నాకోసం వెతుక్కుని వుంటాడు. మళ్ళీ రాత్రి దాకా అతను  కనబడడేమో ... దిగులుగా మంచం మెక్కింది. అతనికి  వెంటనే యే౦ చేయాలో అర్ధమైంది .   
"డాక్టర్  నేను బాగానే వున్నాను కదా ! నాకు  యే వైద్యమూ వద్దు . నాకు నా వెన్నెల పురుషుడు కనిపిస్తే చాలు . అతన్ని వెతుక్కోవడానికి  వెళ్ళనీయకుండా  నన్ను యిలా  బందించివేస్తే ఎలా ?"    గిన్జుకుంటూ వొదిలితే  చాలు పారిపోయేటట్లు ఉంది
 చూడమ్మా వెన్నెలా నిన్ను అతని దగ్గరకే తీసుకు వెళతాను కానీ "అతనెక్కడ వుంటాడో  తెలుసా !? " డాక్టర్ ప్రశ్న
" తెలుసు, అతను నేను  రెక్కలున్న కారులో  యెవరికీ కనబడకుండా  అలా నదీ తీరం వెంబడి ప్రయాణం  చేసి చేసీ సముద్ర తీరానికి చేరుకున్నాం.  పున్నమి వెన్నెల్లో  అలలఘోషతో  పోటీ పడి  పాటలు పాడుకున్నాం  కెరటాలతో ఆడుకున్నాం .అలా యీ ప్రపంచంతో పని లేకుండా ఆడి  పాడి అలసి పోయే దాకా   ఆ వెన్నెల రాత్రుల్లో విహరించాం.  తిరుగు ప్రయాణమయ్యాం.  అలా పదునాలుగు రోజులపాటు  ప్రయాణం  చేస్తూ వుండగా వుండగా అలసి పోయానేమో,  సోలి అతనిపై  వాలిపోయానేమో!  ఒక పగలు వొక రాత్రి  నాకసలు  మెలుకువే  రాలేదు  కళ్ళు విప్పి చూస్తే  నా వెన్నెల పురుషుడు నా ప్రక్కన లేడు  యెటు  మాయమయ్యాడో యేమో !  ఎంత వెదికినా కనబడలేదు . నా వెన్నెల పురుషుడు నాక్కావాలి  కొసరి కొసరి వడ్డించే అతని తీపి ముద్దుల ఆహారం లేకుండా నేను యెలా జీవించేది ? జీవించిన క్షణాలని నేను యెలా మరిచేది ?  నేను చచ్చిపోతా, నన్ను  వొదిలేయండి, వొదిలేయండి గింజుకుంటుంది ఆమె .
డాక్టర్ ఆమెని  మరింత మాట్లాడించే ప్రయత్నం చేస్తూనే వున్నాడు. 
"డాక్టర్ గారు  నా కోడలి  సంగతి ఏమిటి ? ఆమె యె౦దుకలా మాట్లాడుతుంది ?  రెండు నెలల  నుండి మంచం పై అలా పడి  వుండటం పిచ్చి పిచ్చిగా  మాట్లాడటం చూస్తుంటే ఏ దెయ్యం పట్టిందోనని  భయమేస్తుందండీ ! ఇలా జరుగుతుందని తెలిస్తే వొంటరిగా వుండనిచ్చేదానిని కాదు." అత్తగారు కన్నీళ్ళతో   
"మీరేమి కంగారు పడకండి . ఆమెకి మంచి వైద్యం చేస్తున్నాం . మీతో కూడా కొన్ని విషయాలు మాట్లాడాలి. ట్రీట్మెంట్లో భాగంగానే లోపలి రండి అంటూ అత్తగారిని కన్సల్టింగ్ రూమ్ కి తీసుకుని వెళ్ళారు. మీరు శశిధర్ కి తల్లికదా ! “అవునండీ ! నా పేరు విమల ‘అని పరిచయం చేసుకుంది.
మీకొక విషయం చెప్పాలి విమల గారు . మీ కోడలు వొక రకమైన మానసిక వ్యాధితో బాధపడుతుంది. ఆమెకి మీ అబ్బాయి ద్వారా పిల్లలు కలిగే అవకాశమే లేదు. మీ అబ్బాయి కూడా భార్యతో చాలా తక్కువ సమయాలు గడుపుతూ ఆమెని నిర్లక్ష్యం చేస్తున్నాడు.  మీరేమో పెళ్ళైన యిన్ని సంవత్సరాలకి కూడా తల్లి కాలేదన్న నెపం వేస్తున్నారు. ఆమె అది తట్టుకోలేక మానసికంగా దెబ్బతింది. ఆమె మాములు మనిషి కావాలంటే మీ సహకారం చాలా అవసరం. అంటూ విషయం వివరించాడు డాక్టర్.
అయ్యో ! నాకవన్నీ యేమీ తెలియదు డాక్టర్ ! మా అబ్బాయి కూడా యీ విషయాన్ని నా వరకూ  రానివ్వలేదు. మా అబ్బాయికి పిల్లలు పుట్టే అవకాశంలేకుంటే వేరే మార్గాలు లేవా యేమిటీ !? ఇదేమైనా మా తరమప్పటి సమస్య కాదుగా ! స్త్రీకి ప్రసవ వేదన పడాలని  నట్టింట్లో శిశువు రోదన  వినాలని యె౦డదుకుండదు చెప్పండి ? మునుపటి తరాల మనుషుల్లా  నాకంత చాదస్తం లేదు లెండి. మా అబ్బాయికి లోపం వుందని  అసలు పిల్లలని వద్దనుకోలేను కూడా ! ఏవో మార్గాలుంటాయి కదా ! ఆ పద్దతుల్లో మా కోడలి కడుపున ఓ నలుసు పడేటట్లు చూడండి. మా అబ్బాయితో నేను మాట్లాడతాను. ఏది యేమైనా మా యింట్లో పసి పిల్లల బోసి నవ్వులు విరబూయాల్సిందే ! కోడలికి యివేమీ తెలియకుండా ట్రీట్మెంట్ యివ్వండి .. అందుకు హామీ నేను అంది విమల.
మీరు చాలా సహృదయంతో అర్ధం చేసుకున్నారమ్మా, యె౦తోమంది తమ పిల్లల్లో వున్న లోపాలని కప్పిపుచ్చి యెదుటివాళ్ళపై నిందలేసి విడాకుల వరకు వెళ్ళడం చూసాను. మీ నిర్ణయం చాలాబాగుంది. మీ కోడలికి నయమైపోయి త్వరలోనే  మీకొక అందమైన, ఆరోగ్యకరమైన బిడ్డని కూడా యిస్తుంది . కొన్నాళ్ళు మా పర్యవేక్షణలో వదిలేయండి చాలు. 
"అవునా డాక్టర్ గారు..  చాలా సంతోషకరమైన విషయం చెప్పారు. ఒక చిన్న మాటండీ మీరు యేమీ అభ్యంతర పెట్ట కూడదు. ఈ విషయాన్ని మా కోడలికి తెలియనీయవద్దు తెలిస్తే వొప్పుకోదేమో కూడా “ అనుమానం వ్యక్తం చేసింది. 
“శశిధర్ కూడా ఆ మాటే చెప్పాడమ్మా! వెన్నెల ఆరోగ్యంగా, ఆనందంగా వుండటమే కావాలి అందరికి. ఈ విషయాన్ని మాకొదిలేయండి చాలు “అన్నాడు డాక్టర్ .   
ఏ గాలి ధూళీ సోకిందో బిడ్డకి . ప్రక్కనే వున్న  తోటలో సమాధులు కూడా వున్నాయట. దర్గా దగ్గర కట్టిచ్చుకొచ్చిన యీ తాయెత్తుని  ఆమెకి  కట్టనీయండి"  అని బ్రతిమలాడింది .
 డాక్టర్ నవ్వి  యేమీ చెప్పకుండానే అక్కడి నుండి వెళ్లి పోయాడు 
కోడలి చేతికి  తాయెత్తు కడుతూ "అబ్బాయి ! ఈ పిల్లకి  బాగవుతుండంటావా ? తల్లి తండ్రి అయి మనమే చూసుకోవాలిప్పుడు "  కారే కన్నీటిని కొంగుతో తుడుచుకుంటూ.
"తప్పకుండా బాగవుతుందమ్మా " వొకింత విశ్వాసంతో చెప్పాడతను.  అంతే కాదు  తొమ్మిది  నెలలపాటు ఆమెని పసిపాపలా చూసుకున్నాడు మరో పసిపాపకి జన్మ నిచ్చేదాకా.
హాస్పిటల్ బెడ్ పై ఆమె నీరసంగా కనులు విప్పింది. ఆమె ప్రక్కనే వున్న శశిధర్   "ఇదిగో  నీ వెన్నెల పురుషుడు నీ వొడిలోకే వచ్చాడు చూడు" అంటూ  వుయ్యాలలో వున్న  బిడ్డని జాగ్రత్తగా తెచ్చి  ఆమె చేతుల్లో వుంచాడు.
ఆమె ముఖంలో సంతోషం. "అవును పురుషుడు పుత్రుడురూపంలో  పుడతాడట కదా వీడే నా వెన్నెల పురుషుడు " అంటూ బిడ్డని  గుండెలకి హత్తుకుంది .
 "హమ్మయ్య ! యిక యీ బిడ్డ ఆలనా పాలనలో జరిగినవన్నీ మర్చిపోతుంది" అనుకుంటూ విమల వూపిరి పీల్చుకుంది.
"అన్నట్టు నీకో విషయం చెప్పడం మరచాను వెన్నెలా !  మనం తోట ప్రక్కన వున్న యింటి నుండి  క్రొత్తింటికి  మారిపోయాం, ఇప్పుడు  ఆ యింటికే  వెళుతున్నాం " .
అక్కడా తోట ఉందా  ఆసక్తిగా అడిగిందామె. 
"పార్క్ కూడా వుంది. మన బాబుతో పాటు నువ్వూ  ఆడుకోవచ్చు" నవ్వుతూ చెప్పాడతను.   

( నవంబర్ మాలిక వెబ్ మాస పత్రికలో తరాలు -అంతరాలు శీర్షికన ప్రచురితం )

6, ఏప్రిల్ 2015, సోమవారం

గంధపు చెక్క-సానరాయి





అమ్మాయికి  పెళ్ళి  చేసి అత్తవారింటికి  పంపించాను . రోబోటిక్స్ తో ఎం.ఎస్ చేయాలని ఉంది, తర్వాత ఉద్యోగం చేయాలి, దేశ దేశాలు తిరిగి రావాలన్న కూతురి కోరికల్ని అణగద్రొక్కి తల్లిగా నాకున్న అభద్రతాభావంవల్ల  త్వరగా పెళ్ళి చేసేసి నా  భాద్యత నెరవేర్చాననుకున్నాను. . గుండె బరువు తీరినట్లుంది కానీ ఇల్లంతా శూన్యంగా ఉంది . కొన్నాళ్ళ తర్వాత మనసు శూన్యంగా  మారింది . 

మనుషులయినా, వస్తువులైనా ఉనప్పుడు తెలియని విలువ లేనప్పుడు బాగా తెలుస్తుందట . అలాగే అమ్మాయిలేని విలువ బాగా తెలుస్తుంది. తనని బాగా మిస్ అవుతున్నాననిపిస్తుంది  తన గదిలో ఉన్న కంప్యూటర్ ముందు కూర్చున్నాను .ఫోన్ లో మాట్లాడుతూ  అమ్మాయి  చెప్పే సూచనలతో .. అన్నీ నేర్చుకోవడం మొదలెట్టాను. త్వరలోనే  పేస్ బుక్ అకౌంట్ ఓపెన్ చేయడం నుండి వీడియో కాల్స్ లో మాట్లాడటం వరకు అన్నీ నేర్చేసుకున్నాను   అదివరకు కంప్యూటర్ పట్ల అసహనం  ఎప్పుడూ పిల్లలు అక్కడే అతుక్కుపోతారని.   ఇప్పుడు నేనూ .. ఉదయాన్నే స్కూల్ కి వెళ్ళేముందు  వచ్చిన తర్వాత అర్ధరాత్రి వరకూ పేస్బుక్ కే అంకితం అయిపోయాను .  మా వారు తిడుతున్నా సరే ..లెక్కజేయకుండా.   

 ముఖ్యంగా దేశంలో ఇంకోమూలలో ఉన్న అమ్మాయితో రోజుకి నాలుగైదు సార్లు మాట్లాడుతున్నా . తన మాటలలో అసంతృప్తి వినబడుతూనే ఉంది . అల్లుడు మంచివాడే ! మంచి ఉద్యోగం, సంప్రదాయమైన కుటుంబం  కానీ  అబ్బాయికి ముప్పై ఏళ్ళకే బట్టతల. పెళ్లి చూపులప్పుడు అరగంటసేపు ప్రక్కనే కూర్చుని మాట్లాడాను . అప్పుడు బట్టతల ఉందని గమనించలేదు పెళ్ళి అయ్యాక అమ్మాయి  ఆరోపణ.. విగ్ పెట్టుకుని వస్తే కళ్ళు మూసుకుపోయాయా ...అని.
అసలే అమ్మాయికి ఆ వయస్సులో ఇష్టం లేని పెళ్లి .  పైగా అబ్బాయి బట్టతల. ఎవరో గట్టిగా కట్టేసి బందీని చేసినట్లు ఫీలింగ్. పైగా అమ్మాయి వస్త్రధారణ పట్ల హెయిర్ డ్రెస్సింగ్ పట్ల అల్లుడి అభ్యంతరాలు . ప్రతి తరంలోనూ పెళ్లి తర్వాత స్త్రీకి వచ్చే అనేకానేక  సమస్యలు. ఎందుకు అమ్మాయికి పెళ్ళి  చేయడంలో తొందరపడ్డానా .. అనిపిస్తుందికూడా .   వీటి గురించి ఆలోచిస్తున్నప్పుడు ... పేస్ బుక్ లో నా  ఫ్రెండ్స్ లిస్టు లో ఉన్న వారెవరో లైక్ చేసిన పోస్ట్ని చూసాను.  భలే ఆసక్తిగా అనిపించింది .అక్కడ ఇలా ఉంది    

"ఆడవాళ్ళు జుట్టు విరబోసుకోవడం పై వ్యాఖ్యానాలు , జీన్స్ ధరించడం పై వ్యాఖ్యానాలు ఎక్కువైపోయాయి ". 
పురుషులు మాత్రం  సంప్రదాయబద్దంగా  కుట్టని వస్త్రాలు అంటే పంచ పై పంచె(కండువా మాత్రమే) మాత్రమే ధరిస్తున్నారా ?  జుట్టు పెంచుకుని ముడి వేసుకుంటున్నారా? అదీ సంప్రదాయ విరుద్దమేగా ! జుట్టు విరబోసుకోవడం అంటే అరిష్టమని .. ద్రౌపది అలా విరబోసుకుని తిరగడం అనేది కౌరవ వంశ నాశనం కోరుకుందని గుర్తు కాబట్టి .. ఆ పోలికజెప్పి జుట్టు విరబోసుకోవడం వలదు అంటున్నారు . అప్పుడు  ఆ రాజ్యాన దుష్టచతుష్టయమే ఉన్నారు . ఇప్పుడు ఇంటింటికి దుష్టులు ఉన్నారు కదా ! దానికి మీరేమంటారు ?మహిళల కేశాలంకరణ నుండి కాలిగోటి అలంకరణ  వరకు అన్నీ  అభ్యంతరకర వ్యాఖ్యానాలే ! అసలీ అలంకరణ వస్తువులని వ్యాపారం చేసింది ఎవరు ? వ్యాపారరంగంలో ఉన్న పురుషులు కాదూ ... !?   

  "సీట్ దొరకక  బస్ లలో నిలబడి నిలబడి ఉసూరు మంటూ ఇంటికొచ్చి ఈశూరుమంటూ వంటగదిలో గంటో..రెండు గంటలో నిలబడి వంట చేసి అందరికి తినిపించి తిని శుభ్రం చేసుకొని పడకపై చేరి కాళ్ళు నొప్పో నడుము నొప్పో...అంటే  ఏ బామో రాసి  కాళ్ళు నొక్కే వారెంత మంది ఉన్నారు? ఏ.. ఆమాత్రం సేవలు మీరు చేయలేరా !?  కాళ్ళు పట్టుకోవటం నామోషీ.. అనుకుంటారా?! అవసరం ఐతే కాళ్ళు, నడుము రెండూ పట్టుకునే సంగతి మర్చిపోయారా!మనకీ సేవలు చేయటం వచ్చని  నిరూపించుకోకపోతే ఎలా....?  " అని ఒకరోజు,

"మీ పిల్లలకు మీరెప్పుడైనా అన్నం తినిపించారా? లాల పోసారా.. లాలి పాడారా.. టాయిలెట్ నాప్కిన్స్ మార్చారా.. ఈ పనులన్నీ ఆడపనులనుకొని,  మీ అమ్మపైనో ... ఆమె అమ్మపైనో ... భారం వేసేసి చక్కగా రెడీ చేసి ఇస్తే ముద్దులాడటం కాదు, పిల్లలు  మీ రక్తం పంచుకు పుట్టిన వాళ్ళనీ వారిని  పెంచడంలో మీ బాధ్యతా ఉందని తెలుసుకోవాలి కదా ! అమ్మపైనే భారం మోపి క్రెడిట్ అంతా ఆమెకే ఇవటం ఎందుకూ? తెలివిగా తేలికగా ఆ పనులు మీరే చేసేసి ఆ క్రెడిట్ కొట్టేసే ఆలోచన మీకేప్పుడైనా.. వచ్చిందా? ఇప్పటికీ రాకపోతే వెంటనే... ట్రై చెయ్యండి."  అని  నవ్విస్తూ ఇంకొక రోజు 

 "ఆదివారం వచ్చేసిందా!? ముసుగు తన్నితొమ్మిదింటిదాకా పడుకోకుండా, స్పెషల్స్ ఏం చేస్తున్నావని శ్రీమతిని  అడగకుండా, నిద్ర మంచం మీది నుండే పని మొదలెట్టండి..బెడ్ షీట్స్ కర్టేన్స్ మార్చండి.. ఆ తర్వాత అల్మారాలు నీట్ గ సర్దండి . బూజు దులపండి ... టాయిలెట్స్ క్లీన్ చేయండి. ఛీ ... టాయిలెట్సా.. నేనా అని అసహ్యం గా మొహం పెట్టకండి. యాసిడ్, రకరకాల క్లీనర్స్ తో.. మన ఆలోచనల మురికిని శుభ్రం చేసుకోవాలండీ..." అని తర్వాతి రోజు.

"మీ బాధ్యతగా మీ భార్య తల్లి తండ్రుల్నిపలరించడానికి ఎప్పుడైనా వెళ్ళారా?   వెంటనే ..వెళ్లండీ.. ఆడపిల్లలకు అత్తమామలను చూసుకునే బాధ్యత ఉందని బోధించినట్లు మగవాళ్ళకి మాత్రం బాధ్యత అప్పగిన్చొద్దూ ... దేనికైనా సమ న్యాయం ఉండాలి, సమన్వయం కావాలి. ఇలా చేస్తే మగాళ్ళని తప్పు పట్టే అవకాశమే ఉంటుందంటారా.. జామాతా దశమ గ్రహం అనే అపవాదుని తప్పించకునేందుకు అదొక మంచి అవకాశం. అల్లుడు కొడుకు లాంటి వాడని బిరుదు కొట్టేయోచ్చు అని  ఓ శ్రేయాభిలాషి చెప్పినట్లుగా చెప్పే ...మాటలు . 

ఇలా ప్రతిరోజూ  చాలా విషయాలని  పాజిటివ్ థింకింగ్ తో  ఆ స్టేటస్ ని  అప్డేట్ చేస్తూ కనబడేవి. 

ఆడో మగో.. తెలియకుండా ఉండే "తేజ " పేరు ప్రొఫైల్ చిత్రం స్థానంలో.. ఓ ప్రకృతిచిత్రం ఉండేది.ఆ ఐడికి వేలమంది ఫాలోయర్స్ ఉండే వారు.   ఆసక్తి కరమైన ఆ స్టేటస్ ల  పట్ల  నేను అమితాసక్తి పెంచుకున్నాను. పదే పదే  నేను ఆ విషయాలనే  ముచ్చటించడం వల్ల  విని విని నా కూతురు, అల్లుడు  ఇద్దరూ  తేజ పేజ్ కి పాలోయర్స్ మారిపోయారు .   అలా ఓ సంవత్సరం గడిచిపొయింది .  మా అల్లుడి ఆలోచనల తీరులోనూ మార్పు వచ్చిందని అమ్మాయి కొంచెం సంతోషంతో చెపుతూ ఉండేది.  మా అమ్మాయి మనసులో కూడా అల్లుడి బట్టతల పట్ల విముఖత తరుగుతూ వచ్చింది. కొందరి ఆలోచనలు సమూలంగా మారడమంటే మాటలు కాదు . అందుకు "తేజ " వ్రాతలు  కారణమైనందుకు నాకు తేజపై కృతజ్ఞత పెరిగింది. వ్యక్తిగతంగా కలిసి థాంక్స్ చెప్పాలనిపించింది . 

ఎన్నోసార్లు  పర్సనల్ మెసేజ్ పెట్టగా పెట్టగా ఒకటి రెండు సార్లు మాత్రమే సమాధానం వచ్చింది.  నా వ్యక్తిగత వివరాలు చెపుతూ ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేయగా... ఫోన్ నంబర్ వచ్చింది.

ఒక రోజు అనుమతి తీసుకుని కలవడానికి వెళ్లాను. నాకు ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేసినపుడు మాత్రం పురుష స్వరమే సమాధానం ఇచ్చి అడ్రస్ చెప్పారు. నేను సంశయిస్తూనే... ఆ ఇంటికి వెళ్లాను. అందరిని సున్నితంగా ఒప్పించి, మెప్పించే వ్రాతలని  వ్రాసేది ఆ పురుషుడే అనుకుంటూ అతను యంగ్ అండ్ డైనమిక్ గ ఉంటాడని తలపోస్తూనే.. ఆ ఇంటికి చేరాను. కాలింగ్ బెల్ మోతకి తలుపు తీసినతను మాత్రం ఒక.. డెబ్బైఐదు, ఎనభయ్యేళ్లు మధ్య వయసున్న వృద్ధుడు.

"రామ్మా!  అంటూ .. నన్ను లోపలికి ఆప్యాయంగా ఆహ్వానించారు. 
"తేజ అంటే..." అని ఆగిపోయాను. 
"ఆ.. నేనేనమ్మా" అని అన్నారు. ఆశ్చర్యపోయాను. "మీరే రాసారా అవన్నీ..? "  అని అడిగాను  

నవ్వేసి ....."నావెంట లోపలికి రా " అంటూ మరొక గదిలోకి తీసుకుని వెళ్ళారు. ఆయన వెనుకే నడిచిన నేను ఆయన చూపిన  ఓ మంచం దగ్గర ఆగిపోయాను. ఆ మంచం పై ఓ వృద్ధురాలు పడుకొని ఉంది అప్పుడాయన ఇలా చెప్పారు " ఈమె నా భార్య దాదాపు పది సంవత్సరాలుగా పక్షవాతంతో బాధ పడుతోంది, నేను చిన్నప్పటినుండి ఏ పని పాట చేయకుండా పెరిగినవాడిని. ఉద్యోగం పురుష లక్షణంగా భావించి ఆఒక్కటి మాత్రమే చేసినవాడిని. ఒళ్ళు, మనసు కూడా అలసిపోయేలా చేసిచేసి అరిగిపోయిన్దావిడ. ఉన్న ఒక్క కూతురికి పెళ్లి చేసి అత్త వారింటికి పంపాము. చుట్టం చూపుగా తప్ప పట్టుమని పదిరోజులపాటు కూడా పుట్టింట్లో ఉండి కన్న తల్లికి సేవ చేయలేని పరిస్థితి ఆమెది.  అర్ధాంగి అన్న పదానికి అర్ధంగా నిలిచిన ఆమెకి సేవ చేయాలనే తలంపుతో అన్నీ నేనే అయ్యాను. అప్పుడుకాని నాకు తెలిసి రాలేదు ఇంటి పనులు, వంట పనులు చేస్తూ ఇల్లు చక్కబరుచుకుంటూ ఉద్యోగం కూడా చేయటమంటే మాటలు కాదని. ఇంకొక విషయం చెప్పనా?  అని... ఆగి ఆమె వంక చూసారు 
నేను వారిని ఆసక్తిగా గమనిస్తున్నాను . 

ఆమె ఆయన వంక చూస్తుంది .  అప్పుడు ఆయన ఇలా చెప్పారు " ఆమెకు మాట కూడా పడిపోయింది.ఫేస్బుక్ పేజీలో  షేర్ చేసిన విషయాలన్నీ నా ఆలోచనలు కాదు.. ఆమే చెప్తుంది. కనురెప్పల కదలికలతో తన భావాన్ని నాకు చెప్తుంది, ఆమె చెప్పిన విషయాన్ని యధాతధంగా అక్కడుంచుతాను అంతే !  అని చెపుతుంటే .. అదొక అద్భుత విషయం అనిపించి ఆమె ప్రక్కకి చేరాను .

 " భార్య అంటే బానిస కాదని, పనిభారంమోపి అరగతీయటం కాదని తెలుసుకున్ననేను చాలా సిగ్గు పడుతున్నాను. మగపని, ఆడపని అని తేడా లేకుండా పని భాగస్వామ్య విలువను అందరూ గుర్తించాలని ఆమె తాపత్రయం. ఆమె తాపత్రయాన్ని అర్ధం చేసుకుని నేను ఇలా అందరి ముందుకు విషయాన్ని చేరవేస్తున్నానంతే ! " అన్నాడు 

 ఆమె ఆయన వైపు చూసి కనురెప్పలు ఆడించింది. అప్పుడాయన నవ్వి "ఆమె ఏమంటుందో తెలుసా అమ్మాయికి మన గురించి గొప్పలు చెప్పటమేనా ..లేక కాసిని టీ ఐనా ఇస్తారా..అంటోంది "  
.
" థాంక్స్ అమ్మా! అని నేనంటే ఆవిడ కళ్ళతోనే నవ్వింది.

ఆయన వెనుకనే వెళ్ళి  టీ కాస్తున్నంతసేపూ.. త్రాగుతున్నంత సేపూ ఆమె గురించిన యెన్నో విషయాలు తెలుసుకున్ననాకు  అబ్బురంగా అనిపించిది.  వారిద్దరి మధ్య ఉన్న ప్రేమ, అవగాహన  ముందు... మనం అతిగా ఊహించుకుని భయపడే  చాలాచాలా విషయాలు స్వల్పం, అల్పం కూడాననిపించింది. ఈ విషయాలని వెంటనే అమ్మాయికి, అల్లుడికి చెప్పాలనిపించింది. 
ఆయన వద్ద సెలవు తీసుకొని వస్తూ ఇలా అనుకున్నాను 
" అరిగింది గంధపు చెక్కైనా.. కొద్దో గొప్పో  సువాసన అబ్బింది మాత్రం సాన రాయికి." అని .