6, ఏప్రిల్ 2015, సోమవారం

గంధపు చెక్క-సానరాయి





అమ్మాయికి  పెళ్ళి  చేసి అత్తవారింటికి  పంపించాను . రోబోటిక్స్ తో ఎం.ఎస్ చేయాలని ఉంది, తర్వాత ఉద్యోగం చేయాలి, దేశ దేశాలు తిరిగి రావాలన్న కూతురి కోరికల్ని అణగద్రొక్కి తల్లిగా నాకున్న అభద్రతాభావంవల్ల  త్వరగా పెళ్ళి చేసేసి నా  భాద్యత నెరవేర్చాననుకున్నాను. . గుండె బరువు తీరినట్లుంది కానీ ఇల్లంతా శూన్యంగా ఉంది . కొన్నాళ్ళ తర్వాత మనసు శూన్యంగా  మారింది . 

మనుషులయినా, వస్తువులైనా ఉనప్పుడు తెలియని విలువ లేనప్పుడు బాగా తెలుస్తుందట . అలాగే అమ్మాయిలేని విలువ బాగా తెలుస్తుంది. తనని బాగా మిస్ అవుతున్నాననిపిస్తుంది  తన గదిలో ఉన్న కంప్యూటర్ ముందు కూర్చున్నాను .ఫోన్ లో మాట్లాడుతూ  అమ్మాయి  చెప్పే సూచనలతో .. అన్నీ నేర్చుకోవడం మొదలెట్టాను. త్వరలోనే  పేస్ బుక్ అకౌంట్ ఓపెన్ చేయడం నుండి వీడియో కాల్స్ లో మాట్లాడటం వరకు అన్నీ నేర్చేసుకున్నాను   అదివరకు కంప్యూటర్ పట్ల అసహనం  ఎప్పుడూ పిల్లలు అక్కడే అతుక్కుపోతారని.   ఇప్పుడు నేనూ .. ఉదయాన్నే స్కూల్ కి వెళ్ళేముందు  వచ్చిన తర్వాత అర్ధరాత్రి వరకూ పేస్బుక్ కే అంకితం అయిపోయాను .  మా వారు తిడుతున్నా సరే ..లెక్కజేయకుండా.   

 ముఖ్యంగా దేశంలో ఇంకోమూలలో ఉన్న అమ్మాయితో రోజుకి నాలుగైదు సార్లు మాట్లాడుతున్నా . తన మాటలలో అసంతృప్తి వినబడుతూనే ఉంది . అల్లుడు మంచివాడే ! మంచి ఉద్యోగం, సంప్రదాయమైన కుటుంబం  కానీ  అబ్బాయికి ముప్పై ఏళ్ళకే బట్టతల. పెళ్లి చూపులప్పుడు అరగంటసేపు ప్రక్కనే కూర్చుని మాట్లాడాను . అప్పుడు బట్టతల ఉందని గమనించలేదు పెళ్ళి అయ్యాక అమ్మాయి  ఆరోపణ.. విగ్ పెట్టుకుని వస్తే కళ్ళు మూసుకుపోయాయా ...అని.
అసలే అమ్మాయికి ఆ వయస్సులో ఇష్టం లేని పెళ్లి .  పైగా అబ్బాయి బట్టతల. ఎవరో గట్టిగా కట్టేసి బందీని చేసినట్లు ఫీలింగ్. పైగా అమ్మాయి వస్త్రధారణ పట్ల హెయిర్ డ్రెస్సింగ్ పట్ల అల్లుడి అభ్యంతరాలు . ప్రతి తరంలోనూ పెళ్లి తర్వాత స్త్రీకి వచ్చే అనేకానేక  సమస్యలు. ఎందుకు అమ్మాయికి పెళ్ళి  చేయడంలో తొందరపడ్డానా .. అనిపిస్తుందికూడా .   వీటి గురించి ఆలోచిస్తున్నప్పుడు ... పేస్ బుక్ లో నా  ఫ్రెండ్స్ లిస్టు లో ఉన్న వారెవరో లైక్ చేసిన పోస్ట్ని చూసాను.  భలే ఆసక్తిగా అనిపించింది .అక్కడ ఇలా ఉంది    

"ఆడవాళ్ళు జుట్టు విరబోసుకోవడం పై వ్యాఖ్యానాలు , జీన్స్ ధరించడం పై వ్యాఖ్యానాలు ఎక్కువైపోయాయి ". 
పురుషులు మాత్రం  సంప్రదాయబద్దంగా  కుట్టని వస్త్రాలు అంటే పంచ పై పంచె(కండువా మాత్రమే) మాత్రమే ధరిస్తున్నారా ?  జుట్టు పెంచుకుని ముడి వేసుకుంటున్నారా? అదీ సంప్రదాయ విరుద్దమేగా ! జుట్టు విరబోసుకోవడం అంటే అరిష్టమని .. ద్రౌపది అలా విరబోసుకుని తిరగడం అనేది కౌరవ వంశ నాశనం కోరుకుందని గుర్తు కాబట్టి .. ఆ పోలికజెప్పి జుట్టు విరబోసుకోవడం వలదు అంటున్నారు . అప్పుడు  ఆ రాజ్యాన దుష్టచతుష్టయమే ఉన్నారు . ఇప్పుడు ఇంటింటికి దుష్టులు ఉన్నారు కదా ! దానికి మీరేమంటారు ?మహిళల కేశాలంకరణ నుండి కాలిగోటి అలంకరణ  వరకు అన్నీ  అభ్యంతరకర వ్యాఖ్యానాలే ! అసలీ అలంకరణ వస్తువులని వ్యాపారం చేసింది ఎవరు ? వ్యాపారరంగంలో ఉన్న పురుషులు కాదూ ... !?   

  "సీట్ దొరకక  బస్ లలో నిలబడి నిలబడి ఉసూరు మంటూ ఇంటికొచ్చి ఈశూరుమంటూ వంటగదిలో గంటో..రెండు గంటలో నిలబడి వంట చేసి అందరికి తినిపించి తిని శుభ్రం చేసుకొని పడకపై చేరి కాళ్ళు నొప్పో నడుము నొప్పో...అంటే  ఏ బామో రాసి  కాళ్ళు నొక్కే వారెంత మంది ఉన్నారు? ఏ.. ఆమాత్రం సేవలు మీరు చేయలేరా !?  కాళ్ళు పట్టుకోవటం నామోషీ.. అనుకుంటారా?! అవసరం ఐతే కాళ్ళు, నడుము రెండూ పట్టుకునే సంగతి మర్చిపోయారా!మనకీ సేవలు చేయటం వచ్చని  నిరూపించుకోకపోతే ఎలా....?  " అని ఒకరోజు,

"మీ పిల్లలకు మీరెప్పుడైనా అన్నం తినిపించారా? లాల పోసారా.. లాలి పాడారా.. టాయిలెట్ నాప్కిన్స్ మార్చారా.. ఈ పనులన్నీ ఆడపనులనుకొని,  మీ అమ్మపైనో ... ఆమె అమ్మపైనో ... భారం వేసేసి చక్కగా రెడీ చేసి ఇస్తే ముద్దులాడటం కాదు, పిల్లలు  మీ రక్తం పంచుకు పుట్టిన వాళ్ళనీ వారిని  పెంచడంలో మీ బాధ్యతా ఉందని తెలుసుకోవాలి కదా ! అమ్మపైనే భారం మోపి క్రెడిట్ అంతా ఆమెకే ఇవటం ఎందుకూ? తెలివిగా తేలికగా ఆ పనులు మీరే చేసేసి ఆ క్రెడిట్ కొట్టేసే ఆలోచన మీకేప్పుడైనా.. వచ్చిందా? ఇప్పటికీ రాకపోతే వెంటనే... ట్రై చెయ్యండి."  అని  నవ్విస్తూ ఇంకొక రోజు 

 "ఆదివారం వచ్చేసిందా!? ముసుగు తన్నితొమ్మిదింటిదాకా పడుకోకుండా, స్పెషల్స్ ఏం చేస్తున్నావని శ్రీమతిని  అడగకుండా, నిద్ర మంచం మీది నుండే పని మొదలెట్టండి..బెడ్ షీట్స్ కర్టేన్స్ మార్చండి.. ఆ తర్వాత అల్మారాలు నీట్ గ సర్దండి . బూజు దులపండి ... టాయిలెట్స్ క్లీన్ చేయండి. ఛీ ... టాయిలెట్సా.. నేనా అని అసహ్యం గా మొహం పెట్టకండి. యాసిడ్, రకరకాల క్లీనర్స్ తో.. మన ఆలోచనల మురికిని శుభ్రం చేసుకోవాలండీ..." అని తర్వాతి రోజు.

"మీ బాధ్యతగా మీ భార్య తల్లి తండ్రుల్నిపలరించడానికి ఎప్పుడైనా వెళ్ళారా?   వెంటనే ..వెళ్లండీ.. ఆడపిల్లలకు అత్తమామలను చూసుకునే బాధ్యత ఉందని బోధించినట్లు మగవాళ్ళకి మాత్రం బాధ్యత అప్పగిన్చొద్దూ ... దేనికైనా సమ న్యాయం ఉండాలి, సమన్వయం కావాలి. ఇలా చేస్తే మగాళ్ళని తప్పు పట్టే అవకాశమే ఉంటుందంటారా.. జామాతా దశమ గ్రహం అనే అపవాదుని తప్పించకునేందుకు అదొక మంచి అవకాశం. అల్లుడు కొడుకు లాంటి వాడని బిరుదు కొట్టేయోచ్చు అని  ఓ శ్రేయాభిలాషి చెప్పినట్లుగా చెప్పే ...మాటలు . 

ఇలా ప్రతిరోజూ  చాలా విషయాలని  పాజిటివ్ థింకింగ్ తో  ఆ స్టేటస్ ని  అప్డేట్ చేస్తూ కనబడేవి. 

ఆడో మగో.. తెలియకుండా ఉండే "తేజ " పేరు ప్రొఫైల్ చిత్రం స్థానంలో.. ఓ ప్రకృతిచిత్రం ఉండేది.ఆ ఐడికి వేలమంది ఫాలోయర్స్ ఉండే వారు.   ఆసక్తి కరమైన ఆ స్టేటస్ ల  పట్ల  నేను అమితాసక్తి పెంచుకున్నాను. పదే పదే  నేను ఆ విషయాలనే  ముచ్చటించడం వల్ల  విని విని నా కూతురు, అల్లుడు  ఇద్దరూ  తేజ పేజ్ కి పాలోయర్స్ మారిపోయారు .   అలా ఓ సంవత్సరం గడిచిపొయింది .  మా అల్లుడి ఆలోచనల తీరులోనూ మార్పు వచ్చిందని అమ్మాయి కొంచెం సంతోషంతో చెపుతూ ఉండేది.  మా అమ్మాయి మనసులో కూడా అల్లుడి బట్టతల పట్ల విముఖత తరుగుతూ వచ్చింది. కొందరి ఆలోచనలు సమూలంగా మారడమంటే మాటలు కాదు . అందుకు "తేజ " వ్రాతలు  కారణమైనందుకు నాకు తేజపై కృతజ్ఞత పెరిగింది. వ్యక్తిగతంగా కలిసి థాంక్స్ చెప్పాలనిపించింది . 

ఎన్నోసార్లు  పర్సనల్ మెసేజ్ పెట్టగా పెట్టగా ఒకటి రెండు సార్లు మాత్రమే సమాధానం వచ్చింది.  నా వ్యక్తిగత వివరాలు చెపుతూ ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేయగా... ఫోన్ నంబర్ వచ్చింది.

ఒక రోజు అనుమతి తీసుకుని కలవడానికి వెళ్లాను. నాకు ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేసినపుడు మాత్రం పురుష స్వరమే సమాధానం ఇచ్చి అడ్రస్ చెప్పారు. నేను సంశయిస్తూనే... ఆ ఇంటికి వెళ్లాను. అందరిని సున్నితంగా ఒప్పించి, మెప్పించే వ్రాతలని  వ్రాసేది ఆ పురుషుడే అనుకుంటూ అతను యంగ్ అండ్ డైనమిక్ గ ఉంటాడని తలపోస్తూనే.. ఆ ఇంటికి చేరాను. కాలింగ్ బెల్ మోతకి తలుపు తీసినతను మాత్రం ఒక.. డెబ్బైఐదు, ఎనభయ్యేళ్లు మధ్య వయసున్న వృద్ధుడు.

"రామ్మా!  అంటూ .. నన్ను లోపలికి ఆప్యాయంగా ఆహ్వానించారు. 
"తేజ అంటే..." అని ఆగిపోయాను. 
"ఆ.. నేనేనమ్మా" అని అన్నారు. ఆశ్చర్యపోయాను. "మీరే రాసారా అవన్నీ..? "  అని అడిగాను  

నవ్వేసి ....."నావెంట లోపలికి రా " అంటూ మరొక గదిలోకి తీసుకుని వెళ్ళారు. ఆయన వెనుకే నడిచిన నేను ఆయన చూపిన  ఓ మంచం దగ్గర ఆగిపోయాను. ఆ మంచం పై ఓ వృద్ధురాలు పడుకొని ఉంది అప్పుడాయన ఇలా చెప్పారు " ఈమె నా భార్య దాదాపు పది సంవత్సరాలుగా పక్షవాతంతో బాధ పడుతోంది, నేను చిన్నప్పటినుండి ఏ పని పాట చేయకుండా పెరిగినవాడిని. ఉద్యోగం పురుష లక్షణంగా భావించి ఆఒక్కటి మాత్రమే చేసినవాడిని. ఒళ్ళు, మనసు కూడా అలసిపోయేలా చేసిచేసి అరిగిపోయిన్దావిడ. ఉన్న ఒక్క కూతురికి పెళ్లి చేసి అత్త వారింటికి పంపాము. చుట్టం చూపుగా తప్ప పట్టుమని పదిరోజులపాటు కూడా పుట్టింట్లో ఉండి కన్న తల్లికి సేవ చేయలేని పరిస్థితి ఆమెది.  అర్ధాంగి అన్న పదానికి అర్ధంగా నిలిచిన ఆమెకి సేవ చేయాలనే తలంపుతో అన్నీ నేనే అయ్యాను. అప్పుడుకాని నాకు తెలిసి రాలేదు ఇంటి పనులు, వంట పనులు చేస్తూ ఇల్లు చక్కబరుచుకుంటూ ఉద్యోగం కూడా చేయటమంటే మాటలు కాదని. ఇంకొక విషయం చెప్పనా?  అని... ఆగి ఆమె వంక చూసారు 
నేను వారిని ఆసక్తిగా గమనిస్తున్నాను . 

ఆమె ఆయన వంక చూస్తుంది .  అప్పుడు ఆయన ఇలా చెప్పారు " ఆమెకు మాట కూడా పడిపోయింది.ఫేస్బుక్ పేజీలో  షేర్ చేసిన విషయాలన్నీ నా ఆలోచనలు కాదు.. ఆమే చెప్తుంది. కనురెప్పల కదలికలతో తన భావాన్ని నాకు చెప్తుంది, ఆమె చెప్పిన విషయాన్ని యధాతధంగా అక్కడుంచుతాను అంతే !  అని చెపుతుంటే .. అదొక అద్భుత విషయం అనిపించి ఆమె ప్రక్కకి చేరాను .

 " భార్య అంటే బానిస కాదని, పనిభారంమోపి అరగతీయటం కాదని తెలుసుకున్ననేను చాలా సిగ్గు పడుతున్నాను. మగపని, ఆడపని అని తేడా లేకుండా పని భాగస్వామ్య విలువను అందరూ గుర్తించాలని ఆమె తాపత్రయం. ఆమె తాపత్రయాన్ని అర్ధం చేసుకుని నేను ఇలా అందరి ముందుకు విషయాన్ని చేరవేస్తున్నానంతే ! " అన్నాడు 

 ఆమె ఆయన వైపు చూసి కనురెప్పలు ఆడించింది. అప్పుడాయన నవ్వి "ఆమె ఏమంటుందో తెలుసా అమ్మాయికి మన గురించి గొప్పలు చెప్పటమేనా ..లేక కాసిని టీ ఐనా ఇస్తారా..అంటోంది "  
.
" థాంక్స్ అమ్మా! అని నేనంటే ఆవిడ కళ్ళతోనే నవ్వింది.

ఆయన వెనుకనే వెళ్ళి  టీ కాస్తున్నంతసేపూ.. త్రాగుతున్నంత సేపూ ఆమె గురించిన యెన్నో విషయాలు తెలుసుకున్ననాకు  అబ్బురంగా అనిపించిది.  వారిద్దరి మధ్య ఉన్న ప్రేమ, అవగాహన  ముందు... మనం అతిగా ఊహించుకుని భయపడే  చాలాచాలా విషయాలు స్వల్పం, అల్పం కూడాననిపించింది. ఈ విషయాలని వెంటనే అమ్మాయికి, అల్లుడికి చెప్పాలనిపించింది. 
ఆయన వద్ద సెలవు తీసుకొని వస్తూ ఇలా అనుకున్నాను 
" అరిగింది గంధపు చెక్కైనా.. కొద్దో గొప్పో  సువాసన అబ్బింది మాత్రం సాన రాయికి." అని .

కామెంట్‌లు లేవు: